పశ్చాత్తాపంలో ‘రామన్న’ | pmk Chief Ram Dass Intense remorse | Sakshi
Sakshi News home page

పశ్చాత్తాపంలో ‘రామన్న’

Published Wed, Jul 16 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

పశ్చాత్తాపంలో ‘రామన్న’

పశ్చాత్తాపంలో ‘రామన్న’

  ప్రతి ఎన్నికల్లోనూ కూటములు మార్చడంలో స్వయం కృతాపరాధంపై పీఎంకే అధినేత రాందాసు తీవ్ర పశ్చాత్తాపం చెందుతున్నారు. పార్టీ సిల్వర్  జూబ్లీకి సమయం దగ్గర పడుతుండడంతో తన మదిలోని వేదనను కార్యకర్తల ముందు వెళ్లగక్కారు. చేసిన తప్పులు పునరావృతం కానివ్వనని హామీ ఇస్తూ, సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
 సాక్షి, చెన్నై : వన్నియర్ సామాజిక వర్గం సంక్షేమం లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ పీఎంకే. తొలుత వన్నియర్ సంఘం గా ఉన్నా, 1989 జూలై 16న పాటాలి మక్కల్ కట్చిగా ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను పీఎంకే ఎదుర్కొంది. కేంద్రంలోనూ తన సత్తా చాటుకుని మంత్రి పదవులను సైతం గతంలో దక్కించుకుంది. ఇక రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు లక్ష్యంగా అలుపెరగని ఉద్యమాన్ని సాగిస్తున్న పార్టీ పిఎంకే. అయితే, ప్రతి ఎన్నికల్లోనూ కూటములను మారుస్తూ వచ్చిన పీఎంకేకు ప్రస్తుతం గడ్డు కాలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఇతర పార్టీల తీర్థాన్ని పుచ్చుకోగా, వేల్ మురుగన్ వంటి నేతలు కొత్త పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో నమోదైన హత్యాయత్నం కేసు, ధర్మపురి ప్రేమ కుల చిచ్చు,  మరక్కానం అల్లర్లు ఆ పార్టీని వెంటాడుతూ వస్తున్నాయి.
 
 ఆ పార్టీ జిల్లా స్థాయి శ్రేణులు గూం డా చట్టం కింద కటకటాల్లో కాలం గడపాల్సిన పరిస్థితి. ఇక సీనియర్ నేత కాడు వెట్టి గురు జాతీయ భద్రతా చట్టం కింద నెలల తరబడి కటకటాలకే పరిమితమై, ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఇలా అనేక అవాంతరాల్ని ఎదుర్కొంటున్న పీఎంకే అసెంబ్లీలో రెండంకెల సభ్యుల నుంచి సింగిల్ డిజిట్‌కు దిగజారింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి అడుగులు వేసినా, ఎన్నికల అనంతరం ఒప్పందాలు బెడిసి కొట్టడంతో డీలా పడాల్సిన పరిస్థితి. ధర్మపురిలో తనయుడు అన్భుమణి మాత్రం నెగ్గినా, ఇత ర నియోజకవర్గాల్లో ఎక్కడ కేడర్ దూరమవుతుందోనన్న బెంగ రాందాసును వెంటాడుతోంది. పార్టీ గత ఏడాది సిల్వర్ జూబ్లీలో అడుగు పెట్టినా, చడీ చప్పుడు చేయకుండా  ఉన్న రామన్న ముగింపు వేడుకలను అయినా, జరుపుకుందామంటూ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.  
 
 పశ్చాత్తాపం  
 మంగళవారం పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఉద్దేశించి, సిల్వర్ జూబ్లీ వేడుకలకు పిలుపు నిస్తూ ప్రకటనను రాందాసు విడుదల చేశారు. అందులో పార్టీ ప్రస్తానం గురించి వివరించారు. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను గుర్తు చేస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేశా రు.  పీఎంకే ప్రస్తుతం ఇబ్బంది పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ కూటములను మార్చి చేసిన తప్పుకుగాను, ప్రస్తుతం ఈ పరిస్థితి అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, పార్టీ శ్రేణుల్ని ఆకర్షించే యత్నం చేశారు. ఇక మీదట ఇలాంటివి పునరావృతం కావని పార్టీ కేడర్‌కు హామీ ఇచ్చారు. 2016లో పీఎంకే రాజ్యం తప్పనిసరి అని, ఆ విజయోత్సవ వేడుకల్ని ముందుగానే పార్టీ సిల్వర్ జూబ్లీలో జరుపుకుందామని పిలుపునిచ్చారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్ని  ఘనంగా జరుపుకునేందుకు సిద్ధం కావాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement