ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచంలో భారతదేశం తనదైన ముద్ర వేసినా ఆవిష్కరణలు లేకపోవడంతో దేశీయంగా అంతర్జాతీయస్థాయి ఉత్పత్తులు రావడం లేదని మంత్రి కేటీ రామారావు అన్నారు. దేశంలో ఆవిష్కరణల వాతావరణాన్ని బలోపేతం చేసేందుకు తమవంతుగా జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వాము లు కావాలని విద్యార్థులను ఆహ్వానించారు.
హైదరా బాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా టాక్ సిరీస్‌ను ప్రారంభించిన కేటీఆర్ టెక్నాలజీ అభివృద్ధి–ఆర్థిక ప్రగతితో పాటు హైదరాబాద్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రసంగించారు. అనంతరం విద్యా ర్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. ‘సాంకేతిక ఆధా రిత ఆవిష్కరణలపై పనిచేస్తున్న విద్యార్థులు, యువత దేశ భౌగోళిక ఆర్థిక సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగినపుడే విజయం సాధిస్తారు.
నేటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న పేదదేశంగా ఉందని గణాంకాలు చెప్తున్నాయి. భారత్‌కు వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను చూపా ల్సిన అవసరముంది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువు తున్న విద్యార్థులు ప్రపంచస్థాయి ఆవిష్కరణల కోసం సృజనాత్మకంగా ఆలోచించాలి. పరిశోధన, అభివృద్ధి రంగాలపై దేశంలో ఖర్చు పెంచాల్సిన అవసరముంది. ట్రిపుల్ ఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు తమ పరిశోధనలు, ఆలోచనలను మరింత పదును పెట్టాలి. పరిశోధన–అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా పాఠ్య ప్రణాళికలు, విద్యా బోధన మార్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధ్యం’ అని కేటీఆర్ సూచించారు.
వచ్చే ఐదేళ్లలో వంద బిలియన్ డాలర్లకు లైఫ్‌సైన్సెస్
‘హైదరాబాద్‌లో ఉన్న లైఫ్ సైన్సెస్ వాతావరణం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకొని ఉంది. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2028 నాటికి 100 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. భారతీయ యువత అన్ని రంగాల్లో వినూత్న ఆవిష్కరణల దిశగా పని చేయాలి. స్టార్టప్‌లు ఏర్పాటు చేసే యువత వాటిపై పెట్టుబడిదారులకు ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
తమ ఉత్పత్తుల గురించి వివరించగలిగితే భారతీయ స్టార్టప్‌లలో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.’ అని కేటీఆర్ వివరించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, సస్టైనబిలిటీ, స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లో పలు స్టార్ట్ అప్స్ రూపొందించిన ప్రయోగాలు, ఉత్పత్తులను కేటీఆర్ పరిశీలించారు. సమావేశంలో ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, సభ్యులు జయేష్ రంజన్, అజిత్ రంగనేకర్, శ్రీని రాజు, చంద్రశేఖర్, ప్రొఫెసర్ లింగాద్రి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment