పాతికేళ్ల బ్రౌన్‌ కేంద్రం | CP Brown Silver Jubilee Special In Sakshi Sayityam | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల బ్రౌన్‌ కేంద్రం

Published Mon, Nov 23 2020 12:56 AM | Last Updated on Mon, Nov 23 2020 12:57 AM

CP Brown Silver Jubilee Special In Sakshi Sayityam

సి.పి.బ్రౌన్‌ (1798–1884) సుమారు 1827లో కడపలోని ఎర్రముక్కలపల్లెలో 15 ఎకరాల తోటను, ఓ పెద్ద బంగళాను వెయ్యి వరహాలకు (3500 రూపాయలకు) కొని రెండేళ్లపాటు ఆ భవనంలోనే వుండి సంస్కృతాంధ్ర పండితుల్ని సమకూర్చుకుని, తెలుగు కావ్య సముద్ధరణకు కంకణబద్దులయ్యారు. ఆ జిల్లావాడే అయిన అయోధ్యాపురం కృష్ణారెడ్డి(1800–44) ఆజమాయిషీలో ఆ పండిత కూటమి, కార్యాలయం ‘బ్రౌన్‌ కాలీజా’గా పేరు మోసింది. పరిశోధక సాహసి బంగోరె(బండి గోపాలరెడ్డి) మాటల్లో చెప్పాలంటే, సి.పి.బ్రౌన్‌ ‘‘నిలవనీడ లేకుండా పోయిన తెలుగు కావ్యసరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో వొక సాహిత్య పర్ణశాల యేర్పరచి, ఆ వాగ్దేవి నిండు ముత్తయిదువులాగా నడయాడేలా’’ చేశారు.

20 సెంట్ల ప్రదేశంలో ఎర్రముక్కలపల్లెలో స్థాపించబడి, రెండు మూడు దశాబ్దాలపాటు సరస్వతీ నిలయంగా విరాజిల్లిన బ్రౌన్‌ కాలేజీ నేడు సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఆశ్రయంలో వెలుగు జిలుగులు నింపుతోంది. బ్రౌనుకు నమ్మకస్తుడైన చెలికాడైన అయోధ్యాపురం కృష్ణారెడ్డి అకాలమరణం తర్వాత ‘బ్రౌన్‌ కాలీజా’ గతి ఏమైందో, 1855లో బ్రౌన్‌ స్వదేశానికి వెళ్లేదాకా వుండిందో లేదో ఆ పెరుమాళ్లకే  ఎరుక!

బ్రౌన్‌ దొర బంగళా, తోట ప్రాంతాన్ని కడప కోర్టువారు వేలం వేయగా కడపలో పేరు మోసిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సి.ఆర్‌.కృష్ణస్వామి రెండు వేల రూపాయలకు కొన్నారు. అప్పటికే శిథిలమై ఉండిన ఆ బంగళా కాలక్రమంలో మరింత శిథిలం కాగా, 1987లో సి.ఆర్‌.కృష్ణస్వామి సుపుత్రులు సి.కె.సంపత్‌కుమార్, కడప కలెక్టర్‌ జంధ్యాల హరినారాయణ నేతృత్వంలో, జానమద్ది హనుమచ్ఛాస్త్రి సారథ్యంలో ఏర్పడిన సి.పి.బ్రౌన్‌ మెమోరియల్‌ ట్రస్టుకు ధారాదత్తం చేశారు. హరినారాయణ గ్రామీణ క్రాంతి పథకం కింద మూడున్నర లక్షల మ్యాచింగ్‌ నిధి విడుదల చేసి, 1987 జనవరి 22వ తేదీన సి.పి.బ్రౌన్‌ స్మారక భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయగా సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు సభాధ్యక్షులుగా ఆశీర్వదించారు.

‘ఇంటికొక పువ్వయితే, దేవుడికో దండం’ అని పెద్దల మాట. మధ్యప్రదేశ్‌ బస్తర్‌లోని ఓ తెలుగుబిడ్డ డి.వి.ప్రసాద్‌ లాంటి సామాన్యుడు 10 రూపాయలు పంపగా, ఎంతోమంది వదాన్యులు వేలాది రూపాయలు సంతోషంగా గుమ్మరించారు. కడప కలెక్టర్లు పలు తడవలుగా నిధులు ఇచ్చారు. 1995 నవంబర్‌ 29న అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సి.పి.బ్రౌన్‌ స్మారక గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు.

గ్రంథాలయమేమో ప్రారంభమయింది. మరి పుస్తకాలో? పోతేపల్లి వెంకన్న శ్రేష్ఠి 2500, బిరుదురాజు రామరాజు 2800, కోడూరి పుల్లారెడ్డి, ఇంకా ఎందరో మహానుభావులు ఎంతో విలువైన తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, కన్నడ పుస్తకాల్ని కానుకగా ఇచ్చారు.

1998 నవంబర్‌ 14, 15 తేదీల్లో బ్రౌన్‌ ద్విశత జయంతి మహోత్సవం జరిగింది. సి.నారాయణరెడ్డి ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2003లో రాజ్యసభ సభ్యుడిగా పది లక్షలు మంజూరు చేశారు. గ్రంథాలయ సమితి వారు రెండవ అంతస్థు భవనానికి సినారె పరిశోధన కేంద్రం అని నామకరణం చేసి ఆయన ఔదార్యానికి కృతజ్ఞతలు ప్రకటించుకొన్నారు.

అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి 2005 జనవరి 27న గ్రంథాలయాన్ని సందర్శించి, నిర్వహణకు 15 లక్షల గ్రాంటు మంజూరు చేయడమే కాకుండా, దాన్ని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించేలా ఆజ్ఞ జారీ చేశారు. అదే సంవత్సరం అక్టోబర్‌ 1 నుంచి గ్రంథాలయం పరిశోధనా కేంద్రంగా రూపొందింది. 2006 నవంబర్‌ 1 నుంచి యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా మారింది.

సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలోని గ్రంథాలయంలో మెకంజీ కైఫియత్తుల 42 సంపుటాల జిరాక్స్‌ ప్రతులు, బ్రౌన్‌ లేఖల 17 సంపుటాల నకళ్లు ఉన్నాయి. 66 వేలకు పైగా వివిధ భాషల పుస్తకాలు ఉన్నాయి. మూడువేల పత్రికల ప్రత్యేక సంచికలు, తెలుగు ఎంఫిల్, పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ కేంద్రం తరఫున మెకంజీ కడప జిల్లా కైఫియత్తుల 7 సంపుటాల్ని, బ్రౌన్‌పై రెండు వ్యాస సంకలనాల్ని, నన్నెచోడుడు, నాచన సోమన, అన్నమాచార్యులు, అల్లసాని పెద్దన మొదలైన రాయలసీమ ప్రాచీన కవులపై వ్యాససంకలనాల్ని ప్రచురించారు. నెలనెలా సాహిత్య ప్రసంగాల్ని ఏర్పాటు చేసి, వాటిని కాలక్రమంలో ముద్రిస్తూవున్నారు. మూల మల్లికార్జునరెడ్డి సారథ్యంలో రజత జయంతి సందర్భంలో కడపజిల్లా సర్వస్వం, రజత జయంతి ప్రత్యేక సంచిక, తాళ్లపాక తిమ్మక్క వ్యాససంకలనం వగైరా విడుదల కానున్నాయి. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం పరిశోధకుల పాలిట కల్పవృక్షమై వర్ధిల్లుగాక!
- ఘట్టమరాజు
9964082076

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement