sakshi sahityam
-
పాతికేళ్ల బ్రౌన్ కేంద్రం
సి.పి.బ్రౌన్ (1798–1884) సుమారు 1827లో కడపలోని ఎర్రముక్కలపల్లెలో 15 ఎకరాల తోటను, ఓ పెద్ద బంగళాను వెయ్యి వరహాలకు (3500 రూపాయలకు) కొని రెండేళ్లపాటు ఆ భవనంలోనే వుండి సంస్కృతాంధ్ర పండితుల్ని సమకూర్చుకుని, తెలుగు కావ్య సముద్ధరణకు కంకణబద్దులయ్యారు. ఆ జిల్లావాడే అయిన అయోధ్యాపురం కృష్ణారెడ్డి(1800–44) ఆజమాయిషీలో ఆ పండిత కూటమి, కార్యాలయం ‘బ్రౌన్ కాలీజా’గా పేరు మోసింది. పరిశోధక సాహసి బంగోరె(బండి గోపాలరెడ్డి) మాటల్లో చెప్పాలంటే, సి.పి.బ్రౌన్ ‘‘నిలవనీడ లేకుండా పోయిన తెలుగు కావ్యసరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో వొక సాహిత్య పర్ణశాల యేర్పరచి, ఆ వాగ్దేవి నిండు ముత్తయిదువులాగా నడయాడేలా’’ చేశారు. 20 సెంట్ల ప్రదేశంలో ఎర్రముక్కలపల్లెలో స్థాపించబడి, రెండు మూడు దశాబ్దాలపాటు సరస్వతీ నిలయంగా విరాజిల్లిన బ్రౌన్ కాలేజీ నేడు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఆశ్రయంలో వెలుగు జిలుగులు నింపుతోంది. బ్రౌనుకు నమ్మకస్తుడైన చెలికాడైన అయోధ్యాపురం కృష్ణారెడ్డి అకాలమరణం తర్వాత ‘బ్రౌన్ కాలీజా’ గతి ఏమైందో, 1855లో బ్రౌన్ స్వదేశానికి వెళ్లేదాకా వుండిందో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక! బ్రౌన్ దొర బంగళా, తోట ప్రాంతాన్ని కడప కోర్టువారు వేలం వేయగా కడపలో పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్ సి.ఆర్.కృష్ణస్వామి రెండు వేల రూపాయలకు కొన్నారు. అప్పటికే శిథిలమై ఉండిన ఆ బంగళా కాలక్రమంలో మరింత శిథిలం కాగా, 1987లో సి.ఆర్.కృష్ణస్వామి సుపుత్రులు సి.కె.సంపత్‌కుమార్, కడప కలెక్టర్ జంధ్యాల హరినారాయణ నేతృత్వంలో, జానమద్ది హనుమచ్ఛాస్త్రి సారథ్యంలో ఏర్పడిన సి.పి.బ్రౌన్ మెమోరియల్ ట్రస్టుకు ధారాదత్తం చేశారు. హరినారాయణ గ్రామీణ క్రాంతి పథకం కింద మూడున్నర లక్షల మ్యాచింగ్ నిధి విడుదల చేసి, 1987 జనవరి 22వ తేదీన సి.పి.బ్రౌన్ స్మారక భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయగా సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు సభాధ్యక్షులుగా ఆశీర్వదించారు. ‘ఇంటికొక పువ్వయితే, దేవుడికో దండం’ అని పెద్దల మాట. మధ్యప్రదేశ్ బస్తర్‌లోని ఓ తెలుగుబిడ్డ డి.వి.ప్రసాద్ లాంటి సామాన్యుడు 10 రూపాయలు పంపగా, ఎంతోమంది వదాన్యులు వేలాది రూపాయలు సంతోషంగా గుమ్మరించారు. కడప కలెక్టర్లు పలు తడవలుగా నిధులు ఇచ్చారు. 1995 నవంబర్ 29న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. గ్రంథాలయమేమో ప్రారంభమయింది. మరి పుస్తకాలో? పోతేపల్లి వెంకన్న శ్రేష్ఠి 2500, బిరుదురాజు రామరాజు 2800, కోడూరి పుల్లారెడ్డి, ఇంకా ఎందరో మహానుభావులు ఎంతో విలువైన తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, కన్నడ పుస్తకాల్ని కానుకగా ఇచ్చారు. 1998 నవంబర్ 14, 15 తేదీల్లో బ్రౌన్ ద్విశత జయంతి మహోత్సవం జరిగింది. సి.నారాయణరెడ్డి ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2003లో రాజ్యసభ సభ్యుడిగా పది లక్షలు మంజూరు చేశారు. గ్రంథాలయ సమితి వారు రెండవ అంతస్థు భవనానికి సినారె పరిశోధన కేంద్రం అని నామకరణం చేసి ఆయన ఔదార్యానికి కృతజ్ఞతలు ప్రకటించుకొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి 2005 జనవరి 27న గ్రంథాలయాన్ని సందర్శించి, నిర్వహణకు 15 లక్షల గ్రాంటు మంజూరు చేయడమే కాకుండా, దాన్ని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించేలా ఆజ్ఞ జారీ చేశారు. అదే సంవత్సరం అక్టోబర్ 1 నుంచి గ్రంథాలయం పరిశోధనా కేంద్రంగా రూపొందింది. 2006 నవంబర్ 1 నుంచి యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా మారింది. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలోని గ్రంథాలయంలో మెకంజీ కైఫియత్తుల 42 సంపుటాల జిరాక్స్ ప్రతులు, బ్రౌన్ లేఖల 17 సంపుటాల నకళ్లు ఉన్నాయి. 66 వేలకు పైగా వివిధ భాషల పుస్తకాలు ఉన్నాయి. మూడువేల పత్రికల ప్రత్యేక సంచికలు, తెలుగు ఎంఫిల్, పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ కేంద్రం తరఫున మెకంజీ కడప జిల్లా కైఫియత్తుల 7 సంపుటాల్ని, బ్రౌన్పై రెండు వ్యాస సంకలనాల్ని, నన్నెచోడుడు, నాచన సోమన, అన్నమాచార్యులు, అల్లసాని పెద్దన మొదలైన రాయలసీమ ప్రాచీన కవులపై వ్యాససంకలనాల్ని ప్రచురించారు. నెలనెలా సాహిత్య ప్రసంగాల్ని ఏర్పాటు చేసి, వాటిని కాలక్రమంలో ముద్రిస్తూవున్నారు. మూల మల్లికార్జునరెడ్డి సారథ్యంలో రజత జయంతి సందర్భంలో కడపజిల్లా సర్వస్వం, రజత జయంతి ప్రత్యేక సంచిక, తాళ్లపాక తిమ్మక్క వ్యాససంకలనం వగైరా విడుదల కానున్నాయి. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం పరిశోధకుల పాలిట కల్పవృక్షమై వర్ధిల్లుగాక! - ఘట్టమరాజు 9964082076 -
కవిత బాలేకపోతే...
లక్నోలో 1938లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రికకు 1946 నుంచీ సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగువాడైన పాత్రికేయ శిరోమణి మానికొండ చలపతిరావు సంపాదకుడిగా వ్యవహరించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి పాత్రికేయ విలువలకు పట్టం కట్టేవారు. ఒకసారి ఏమైందంటే నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఓ ఆంగ్ల కవితను రాసి, ప్రచురించాలని ఎడిటర్ మానికొండ(ఎం.సి.)ను కోరింది. అందుకు ఆయన, ‘‘అమ్మా! నువ్వు ఉత్సాహంగా ఈ కవితను రాశావు. సంతోషమే. అయితే మరికొన్నాళ్లు సాధన చేయాల్సిన అవసరం ఉంది’’ అని జవాబిచ్చారు. పత్రికా ప్రమాణాల దృష్ట్యా కవితను ప్రచురించలేనని సున్నితంగా చిరునవ్వుతో చెప్పారు. ఇందిర కూడా నిరాశ చెందకుండా ఎడిటర్ క్యాబిన్ నుంచి నిష్క్రమించారు. - వాండ్రంగి కొండలరావు -
కనిపించని గుంతలు
నవల : ది హోల్ రచయిత్రి : హిరోకో ఓయమడా జపనీస్ నుంచి ఆంగ్లానువాదం : డేవిడ్ బాయ్డ్ ప్రచురణ : న్యూ డైరెక్షన్స్: 2020 చుట్టూ ఉండే సాధారణ వస్తువులు సైతం ప్రతీకలుగా, ఫాంటసీ కలగలసిన అద్భుతాలుగా, మళ్లీ అవే అధివాస్తవికంగా రూపం మార్చుకుంటూ– అలాంటి రూపాంతరాలు ప్రత్యేకించి కొట్టొచ్చినట్టు కనబడకుండా సాగుతూ అబ్బురపరుస్తుంది ఈ నవలిక. 2013లో జపాన్‌లోని అకుతాగవా ప్రైజ్ సంపాదించుకున్న రచయిత్రి హిరోకో ఓయమడా రాసిన ‘ది హోల్’ నవల ఆంగ్లానువాదం ఈ సంవత్సరమే విడుదలయింది. నవలలో జరుగుతున్నవి మామూలు విషయాలుగా జమకట్టి ఉపేక్షించే అవకాశాన్ని ఈ రచన ఎక్కడా ఇవ్వదు– అలా వదిలేస్తున్నామేమో అన్న ఉలికిపాటుని తప్ప. ముప్పై ఏళ్ల ఆసా తన టెంపరరీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, భర్త బదిలీ కారణంగా అతనితో వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నది బొటాబొటీ సంపాదనే అయినప్పటికీ, దాన్ని వదిలిపెట్టాలంటే కొంత సందేహం. కాకపోతే, వెళ్తున్నది భర్త సొంతవూరికి కాబట్టీ, అక్కడ వాళ్లకి రెండు ఇళ్లున్నాయి కాబట్టీ, వీళ్లు ఒక ఇంట్లో అద్దె ఇవ్వకుండా ఉండవచ్చని అత్తగారు చెబుతుంది. అక్కడికి చేరుకున్నాక గృహిణిగా ఆసా జీవితం ప్రారంభమౌతుంది. అత్తగారు కూడా ఉద్యోగినే. తన పనుల్లో బిజీగా ఉండే మామగారు కనిపించడం కూడా అరుదే. మానసిక స్థిమితం లేని తాతగారు ఉన్నా, ఆయనకున్న చెముడు వల్ల ఆయనతో సంభాషించే వీలూ లేదు. ఒంటరితనం, వేసవి వేడి తాలూకు ఉక్కపోత, చుట్టుపక్కల భరించలేని కీచురాళ్ల రొద (‘‘అసలేదో కీచురాయి నా ఒంట్లోనే ఉన్నట్టుంది’’), ఏమీ తోచని ఖాళీ ఆమె జీవితాన్ని ఆక్రమించుకుంటాయి. ఎక్కడికి వెళ్లాలన్నా దూరాలు, సొంత కారు లేదు. జీవితం రసహీనంగా సాగుతున్న తరుణంలో ఒకరోజున అత్తగారు చెప్పిన పనిమీద స్టోర్‌కి వెళ్లిన ఆసా, ఒక వింతజంతువుని రోడ్డుమీద చూసి, ఆసక్తితో దాన్ని అనుసరిస్తూ వెళ్లి, ఒక గోతిలో పడుతుంది (‘‘ఇదేదో సరీగ్గా నా సైజుకి తవ్విన గొయ్యిలాగుంది!’’). ఆ ప్రాంతంలోనే ఉండే ఒక మహిళ సాయంతో దాన్నుంచి బయటపడుతుంది. ఈ సంఘటన దగ్గర మలుపు తిరిగే కథ ఆసా పరంగా కల్పన, వాస్తవికత, అధివాస్తవికతల మధ్య సాగుతూ ఉంటుంది. తన పరిశోధనల్లో ఇంటి వెనకాల నివాసం ఉంటున్న భర్త సోదరుడి గురించిన సమాచారం; స్టోర్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఆడుకుంటూ కనిపించిన పిల్లలు; స్టోర్స్‌కి వెళ్లే దారికి సమాంతరంగా ఉన్న నది ఒడ్డున ఆడుకుంటున్న పిల్లలు; రోడ్డుకీ, నదికీ మధ్య ఉన్న వాలులో పెరిగిన రెల్లు మాటున దాగివున్న గుంతలు; అత్తగారి ఇంట్లో ఉన్న ఫొటోలో భర్త నానమ్మ పోలికల్లో అత్తగారు ఉండటం – ఇవన్నీ కొన్ని నిజాలుగా, కొన్ని ఊహలుగా, మరికొన్ని భ్రాంతులుగా ఆవిష్కారం అవుతున్నా– అంతర్లీనంగా ఉన్నది మాత్రం కరిగిపోతున్న అస్తిత్వం పట్ల ఆసాలో కలుగుతున్న సంచలనం. ‘‘ఇక్కడ ప్రతి సంవత్సరపు ప్రతి రుతువులోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందా? ఇలాంటి వేడి, ఉక్కపోతే ఉంటుందా?’’అన్న మీమాంసకి లోనయిన ఆసా, తాతగారి మరణానంతరం అంతకుముందు వెళ్లిన స్టోర్స్‌లోనే చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంటుంది. కానీ నిజానికి అక్కడ ఆమె అంతకుముందు చూసిన పిల్లలు ఎవరూ లేరు. అడపాదడపా వచ్చేది కేవలం ముసలివాళ్లేనని ఆ స్టోర్స్ మేనేజర్ అంటుంది. ‘‘మనకి కావాల్సింది మాత్రమే మనం చూస్తాం’’ అని నవలలో ఒక పాత్ర చెప్పినట్టు, తన జీవితంలో లోపించిన దానిని మాత్రమే ఆసా ఊహించుకుంటూ ఉంది. పేరు తెలియని ఏదో జంతువు (సమాజం) చూపించిన మార్గాన్ని అనుసరిస్తే, చివరికి ఆసా పడింది సంసారకూపంలో. అస్థిమితానికి గురిచేస్తున్న వేసవితాపం తనలోని ఉక్కపోత. సమాజ ధిక్కరణ చేస్తే జరిగే ఫలితానికి ఉదాహరణ వెలివేయబడ్డ భర్త సోదరుడు. చిన్నపిల్లలు నెరవేరని కోరికలు. దూరంగా నది దగ్గర కోలాహలం అవతలివాళ్లు ఆనందోత్సాహాలతో ఉన్నారనుకునే ఇవతలివాళ్ల భ్రాంతి. వీటన్నింటినీ అంతర్గతంగా ఓ స్వరం (కీచురాళ్లు) మనకి వినిపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే రచన ఇది! - ఎ.వి.రమణమూర్తి -
కవిత్వం అదృశ్యమైంది
దేవిప్రియ(15 ఆగస్టు 1949 – 21 నవంబర్ 2020) కవిత్వం ధారాళంగా రావాలంటాడేమిటీ? అప్రయత్నంగా అసంకల్పితంగా రాకపోతే ప్రక్కన పడేస్తాడట కదా. ఏ రెండు కవితలూ ఒక్కలా రాయని కవి మళ్లీ ఎందుకొస్తాడు? ఈయన పరచిన కవిత్వమంతా ఈయన స్వప్నాలంట. నడుస్తున్నప్పుడు తన కలల మీద ఆలోచనల మీద నడుస్తున్నామని కనికరంతో గుర్తుంచుకోమంటున్నాడు. అమ్మచెట్టు, నీటిపుట్ట, గాలిరంగు, దేవిప్రియ ఏమిటీ మాటలు? ఇంతకుముందు లేవేం? పుట్టకముందు లేనిమాట నిజమే. పెట్టి పుట్టిన తర్వాత కూడా పుట్టనట్టుంటాయేం. ఎప్పటికప్పుడు ఆ క్షణానే పుట్టినట్టుంటాయేం. వెన్వెంటనే అదృశ్యమైపోతాయేం. కవిత్వమా అది? రుచి గల పదార్థం అంటే మళ్లీ నోట్లో పెట్టుకునే లోగా నాలుక మీద ఆ రుచి మిగలకపోవడమట కదా! కవిత్వం కూడా అంతేనా? అందుకేనా కవి అదృశ్యమయ్యాడు! మళ్లీ వస్తాడా? రాడు రాడు. సృజన రెండు సార్లు జరగదు. ఏ రెండు కవితలూ ఒక్కలా రాయని కవి మళ్లీ ఎందుకొస్తాడు? వెళ్లిపోయాడు. నీటిపుట్టో గాలిరంగో తీస్తామా? అంత ప్రేమగా ఇచ్చినందుకు ఒక్కసారీ చదవలేదని బెంగ పడతాం. దుఃఖం కలుగుతుంది. చదువుతుంటే ఒక్కో కవిత ఒక్కో రంగులో ఉంటుంది. అన్నీ శుభ్రమైన దుస్తుల్లో ఉంటాయి. ఎంత పేదరాలైనా బిచ్చగాడైనా సరే కొత్త బట్టలు కట్టుకోవలసిందే. ముచ్చటపడో మూడ్‌లోకి వెళ్లో కవిత్వానుభవాన్ని వివరించుదామని ఫోన్ చేస్తే అది రెండో సారో మూడో సారో అని తేలుతుంది. అంతకుముందు ఏం పంచుకున్నామో తెలీదు. కొత్త అనుభూతి నెమ్మదిగా తడుముతుంది. మళ్లీ తడుపుతుంది. అది ఏటిని నిట్టనిలువునా నిలబెడుతుంది. ఏనుగుని తొండం మీద నడిపిస్తుంది. ఎవరూ చేయలేనిది ఇంకొకటి కూడా చేస్తుంది. గాలికి రంగులేస్తుంది. కందం రాసినవాడే కవి కదా. అందంగా మధురస నిష్యందంగా పఠితృహృదయ సంస్పందంగా ఒక వంద రచించినందుకే మహాకవిని ఆకాశానికెత్తేశాం కదా, అంతకు శతాబ్దాల ముందు ధారాళమైన నీతులు నోరూరగ చవులుపుట్ట నుడివినందుకు శతకకారుణ్ణి బట్టీయం పెడుతున్నాం కదా, మరి కరువొచ్చిన కాలంలో అరవై నిండాయి నాకు అతి తేలికగా చొరబడి గడచిన యేళ్లలో ఇరవైగా మారగలన ఇన్షా అల్లాహ్ అని సరళంగా అలవోకగా రాసినందుకు కొన్ని అయినా మననం చెయ్యకపోతే ఎట్లా? కవిత్వం ధారాళంగా రావాలంటాడేమిటీ? అప్రయత్నంగా అసంకల్పితంగా రాకపోతే ప్రక్కన పడేస్తాడట కదా. కవిత్వాన్ని చెక్కిన దాఖలా ఒక్కటీ లేదంటలే ! It's not something that can be chiseled and sharpened later అంటాడా? సరే సరే! కవిత్వం బాసింపట్టు వేసుక్కూచుని ఒకటికి పదిసార్లు వెనుకా ముందూ చూసుకుంటూ ఒక ప్రారంభం ఒక ముగింపూ పెట్టుకుని ఒక ప్రణాళిక ప్రకారం మన కవిత్వం రాస్తే దాన్ని పట్టుకుని పది మంది కవులు తయారవ్వాలనుకుంటున్నాం కానీ, ఇదేమిటీ, ఈయన పద్ధతి చూస్తే వంద మంది కవిత్వం రాయడం మానేసేటట్టున్నారే! ఎట్లబ్బా? అవునూ, ఈయనది మన గుంటూరేగా, మరి డబ్ల్యూ.బి.ఈట్స్‌తో పోల్చుకుంటున్నాడు చూడండి. సదరు ఈట్స్ లాగా ఈయన పరచిన కవిత్వమంతా ఈయన స్వప్నాలంట. నడుస్తున్నప్పుడు తన కలల మీద ఆలోచనల మీద నడుస్తున్నామని కనికరంతో గుర్తుంచుకోమంటున్నాడు. ఈయనతో మహాకష్టం వచ్చిపడింది. మనం కవిత్వం మీద మన పాదముద్రలు బలంగా పడాలనుకుంటున్నాం కదా? కుదరదా? తను కవి, రచయిత, జర్నలిస్టుల్లో ఎవరో తేల్చమని మనల్నే అడుగుతున్నాడు. తన రాజకీయం ఏమిటో గుర్తుతెచ్చుకోమంటున్నాడు. మన కాలపు మహా వాగ్గేయకారుణ్ణి ప్రజా యుద్ధనౌక అన్నదెవరో, మాభూమి, రంగుల కల చిత్రాల వెనుక కలం బలం ఎవరిదో, ప్రాసక్రీడల రన్నింగ్ కామెంటేటర్ ఎవరో, అధ్యక్షా మన్నించమన్నదెవరో, మన పూర్ణమ్మను ఇంగ్లిషులోకి తీసుకెళ్లిందెవరో చూడమంటున్నాడు. తనను తాను పరిచయం చేసుకోలేననీ తన రచనలే తనను పరిచయం చెయ్యాలనీ అంటున్నాడు. అవన్నీ చూసి ఇంత వైవిధ్యం చూపిన కవి తెలుగులో ఇతను కాక ఇంకొక్కడే ఉన్నాడని చాలా మంది అంటున్నారు. ఆయనతో అనంతమైన ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవలని ఈయనే రాయించాడంటున్నారు. మనమెందుకు కాదంటాం? 1987 లోనా? యానాంలో కవిమిత్రుడి పెళ్లి. కవిసమ్మేళనం. పథేర్ పాంచాలి చూసి, ప్రేమ్‌చంద్ గోదాన్ చదివిన దుఃఖంంలో రాసిన ‘ఊరు పొమ్మంటుంది’ కవితను చదివి వేదిక దిగివస్తుంటే పలకరించి ‘కరెంటు తీగల మీద వరుసగా కూర్చున్న పిట్టలు – బట్టలారేయడానికి తగిలించిన క్లిప్పుల్లా ఉన్నాయ’నే వ్యక్తీకరణ ‘అర్బన్ ఎక్స్ప్రెషన్ కదా! గ్రామీణ వాతావరణంలో ఎట్లా ఇముడుతుందీ?’ అని ప్రశ్నించినప్పటినుంచి కదా కవిత్వావరణలోకి తెలివితేటలు ప్రవేశించ కూడదనీ, అనుభవిస్తేనే కవిత్వాన్ని పలవరించాలనీ తెలుసుకున్నదీ, మసులుకున్నదీ! ఇద్దరూ కలిసి ఒంటరిగా సాగిన సహచరి మరణం ఆమె లేని ప్రపంచం నిండా ఆమెనే నింపేసింది. కవి బాధ ప్రపంచానికి బాధ అయిన మరో సందర్భం అది. అది తెరలుగా పొరలుగా కమ్ముకుని ఒక పత్రికలో కవిత్వమై వచ్చింది. అది చదివి జీట, yౌuట ఞ్ఛౌఝ జ్చిటఛీజీట్చpp్ఛ్చట్ఛఛీ అని కదా అన్నాను. వివరించమన్నప్పుడు కవి తన అనుభవాన్ని లేదా అనుభూతిని ఇతరులచేత అనుభవింప చెయ్యడానికి కవిత్వం రాస్తాడు. అందుకు భాష, వ్యక్తీకరణ మీడియంగా ఉపయోగపడతాయి. ఎంత బాగా తన స్థితిని మాటల ద్వారా బట్వాడా చెయ్యగలడో ఉద్దేశ్యం అంత నెరవేరినట్టవుతుంది. అది నూటికి నూరు పాళ్లూ ్టట్చnటఝజ్టీ అయినప్పుడు ఆ కవిత అవసరం తీరిపోయి అదృశ్యమైపోతుంది’ అని వివరించి నపుడు ‘ఇది ఎక్కడైనా రాయకూడదా?’ అని కదా అన్నారు. రాశానా? నిజానికి ఆమె వెళ్లిపోయినప్పుడే మనకు తెలియకుండా ఆయన కూడా వెళ్లిపోయాడు.ఇప్పుడు తెలిసి వెళ్లిపోయాడు. -
ప్రశాంత సుందరి
ఆర్.శాంతసుందరి(8 ఏప్రిల్ 1947 – 11 నవంబర్ 2020) చాన్నాళ్ల క్రిందట కేవలం వరూధిని గారిని, శాంతసుందరి గారిని మొదటిసారి కలవడానికే తెనాలిలో ఒక సమావేశానికి వెళ్ళాను. అప్పటికే ఆవిడ కేవలం కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి కాదు. మంచి అనువాదకురాలు. నిజం చెప్పొద్దూ, నేను నాకెంతో ఇష్టమైన కుటుంబరావు గారి భార్యనీ, కూతురునీ కలవాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను. ఆ విషయం వాళ్ళిద్దరితో అన్నాను. మిమ్మల్ని చూస్తే కుటుంబరావు గారిని చూసినట్లే వుంది అన్నాను కూడా. శాంత నవ్వేశారు. ఆవిడ అలా ఎప్పుడూ నవ్వుతూ వుంటారని తరువాత అర్థమైంది. ఆవిడ ప్రశాంతసుందరి. హాస్యప్రియ. సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యత, ప్రేమల కలబోత. ఈ విషయాలన్నీ ఆవిడతో నా పదిహేనేళ్ల స్నేహంలో అర్థమయ్యాయి. ఆ తెనాలి సభ పరిచయం స్నేహం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. నా స్నేహం కుటుంబరావు అమ్మాయితో కాదు శాంతతోనే. ఆవిడకి తన మాతృభాష అయిన తెలుగులో వున్నంత అభినివేశం, అభిమానం హిందీ పట్ల కూడా వున్నాయి. అందుకే అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ అలవోకగా అనువాదాలు చేశారు. వృద్ధురాలైన తల్లిని చూసుకుంటూ, ఇంటిని నిర్వహించుకుంటూ, స్నేహాలు కాపాడుకుంటూ, అనుకున్న సమయానికి పబ్లిషర్స్‌కి అనువాదం అందిస్తూ ఒక్క నిమిషం కాలం వృ«థా కాకుండా జీవించిన ఆవిడ ఇలా అర్ధంతరంగా వెళ్ళిపోవడం ఆమెను ఇష్టపడే వారికి కష్టమే. ఆమె ప్రయాణంలో ఆమె సహచరుడు గణేశ్వరరావు గారి సహకారం గొప్పది. వాళ్ళది స్నేహమయ సహజీవనం. ఆమె జబ్బుపడిన ఈ కొద్ది కాలంలో వాళ్ళ అమ్మాయి వచ్చేవరకూ ఆయన ఒక్కరే కాచుకున్నారు. ఆమె భౌతిక నిష్క్రమణను ఆయన ఎలా తట్టుకుంటారా అని బెంగ. శాంత తెలుగు నుంచి హిందీకి చేసిన ‘కాలుతున్న పూలతోట’ (సలీం రచన)కు కేంద్ర మానవ హక్కుల సంఘం ప్రథమ బహుమతి ఇచ్చింది. అలాగే భారతీయ అనువాద్ పరిషత్ ‘డాక్టర్ గార్గీ గుప్త ద్వివాగీశ్ పురస్కార్’తో సత్కరించింది. ‘ఇంట్లో ప్రేమచంద్’ హిందీ నుంచి చేసిన తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనువాద పురస్కారం కూడా అందుకున్నారు. ‘బేబీ హాల్దార్’ హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. తెలుగు రచయిత్రుల కథల సంకలనం, కవితల సంకలనం కూడా హిందీలోకి తెచ్చారు. అనేక మంది కవుల కవిత్వాన్ని, ముఖ్యంగా శివారెడ్డి, పాపినేని శివశంకర్, ఎన్.గోపి కవిత్వం హిందీలోకి అనువదించారు. ఆమె అనువాదాలు అందరికీ అర్థమయ్యేలాగా అలతి పదాలతో చదవచక్కగా వుంటాయని అంతా ఒప్పుకుంటారు. శాంత తమిళం నుంచి వైరముత్తు కవితలు కూడా తెలుగు చేశారు. ఏదైనా రచన తనకు నచ్చితేనూ, ఆలోచనా విధానం పాఠకులకు ఎంతో కొంత ప్రయోజనం వుంటేనే అనువాదం చేస్తానని చెప్పారు. శాంత సుందరి ఇంగ్లిష్ నుంచి చాలా అనువాదాలు చేశారు. అవన్నీ బహుళ జనాదరణ పొందిన పుస్తకాలు. ఎక్కువమంది చదివిన ‘హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్’ లాంటి డేల్ కార్నిగీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’ లాంటి చేతన్ భగత్ నవలలు, పలువురి ప్రశంసలు పొందిన ఆనంద్ నీలకంఠన్ ‘అసురుడు’, ‘అజేయుడు’ వంటి పుస్తకాలే కాక ప్రపంచ ప్రశంస పొందిన ‘సేపియ’(యువల్ నోవా హరారీ) కూడా తెలుగు పాఠకులకు కానుక చేశారు. ఆ పుస్తకం సీక్వెల్‌ను అనువాదం చేస్తూవుండగా కేన్సర్ వ్యాధికి ఆమె మెదడు మీద అసూయ కలిగింది. ‘ఇక చాల్లే కలం ముయ్’ అని కసిరేసింది. అసూయ పుట్టదా మరి! హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి, ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి మొత్తం 75 పుస్తకాలు అనువాదం చేస్తే! భర్త గణేశ్వరరావు సహకారం గురించి చెబుతూ, ఆయన తన ఎడిటర్, క్రిటిక్ కూడా అనీ, మార్పు, చేర్పులపై చర్చించుకునే వాళ్ళమనీ, ఆయన సలహా సహకారం లేనిదే నేను ఇంత చేయగలిగే దాన్ని కాను అంటారు చాలా నిజాయితీగా. ఆమె ముక్కుసూటి మనిషి. తనకు నచ్చనిది మొహమాటానికి అసలు ఒప్పుకోరు.ఎంత మృదువుగా వుంటారో అంత పట్టుదలగా కూడా వుంటారు. శత వర్షాలకు చేరువగా వస్తున్న వరూధిని గారు, దశాబ్దాల సహజీవనం తరువాత ఈ ఎడబాటును తట్టుకోవలసిన గణేశ్వరరావు గారు కంటి ముందు మెదులుతూ వుంటే ఇంత హఠాత్తుగా నిష్క్రమించడం ఏం బాగుంది శాంత గారూ? -పి.సత్యవతి 9848142742 -
అయినా పేషెంటునే!
పత్రికా సంపాదకులు నార్ల వేంకటేశ్వరరావు గంభీర స్వభావులన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ సంభాషణా చతురులనీ, హాస్య కుశలురనీ తెలిసినవాళ్లు కొద్దిమందే. నార్ల వారి ఉత్తరాల్లో ఆయన హాస్య చమత్కారాలు మబ్బుల చాటున మెరుపుతీగల్లాగా మెరిసిపోతుంటాయి. 1981లో ఆయన సీతజోస్యం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. నేను ఆ పుస్తకం గురించి వ్యాసం రాస్తున్నాననీ, వారి జీవిత రచనా విశేషాలు తెలపమని ప్రార్థిస్తూ వారికి ఓ ఉత్తరం రాశాను. మరుటపాలో ఓ చిన్న ఇంగ్లిష్ పుస్తకంతో పాటు ఓ టైపు చేయబడ్డ ఉత్తరం వచ్చింది. నార్ల ఇలా రాశారు: ‘‘నాకు ఐదుమంది కొడుకులు. ఐదుగురూ డాక్టర్లే. ఐదుమంది కోడళ్లు కూడాడాక్టర్లే. వీళ్లంతా విదేశాల్లో స్థిరపడ్డారు. నా ముగ్గురు కుమార్తెలూ, అల్లుళ్లూ డాక్టర్లే. ఒక్క కూతురూ, అల్లుడు మాత్రమే ఇక్కడ వున్నారు. మరి నాకేమో రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మా కుటుంబంలో నా భార్య తప్ప మిగతావారంతా డాక్టర్లే. ఆమెకు కూడా ఏ విశ్వవిద్యాలయమైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే బావుంటుంది. అప్పుడు మా ఇంట్లో అందరూ డాక్టర్లే అవుతారు. కాని ఇంతమంది డాక్టర్లున్నా నేనెప్పుడూ పేషెంటునే. తల నుంచి కాలు దాకా నేనో రోగాల పుట్ట.’’ నార్ల వారి అరుదైన చమత్కార మాటలివి. -పినాకిని -
మసిబారిన పసితనం
నవల : షగ్గీ బెయిన్ రచన : డగ్లాస్ స్టువర్ట్ ప్రచురణ : గ్రోవ్; 2020 డగ్లాస్ స్టువర్ట్ రాసిన తొలినవల ‘షగ్గీ బెయిన్’ బుకర్ ప్రైజ్‌కి షార్ట్‌లిస్ట్ కావడం వెనకాల తొమ్మిది వందల పేజీల మొదటి డ్రాఫ్ట్మీద పన్నెండేళ్లపాటు కృషి చేసిన శ్రమ ఉంది. కొంతవరకూ ఆటోబయోగ్రఫికల్ నవల కూడా కావడంతో నవలలోని వేదన– బరువునీ, వాస్తవికతనీ, మనసుని కదిలించగల శక్తినీ సంతరించుకుంది. యు.కె.లోని స్కాట్లాండ్ నేపథ్యంలో గత శతాబ్దపు ఎనభ య్యవ దశకంలో సాగే నవలలో కొన్ని చారిత్రకాంశాలు కూడా కలగలిసిపోయి ఉన్నాయి. మార్గరెట్ థాచర్ అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల పరిశ్రమలు దెబ్బతిని కార్మికులు ఉపాధి కోల్పోయి పేదరికంలోకి కూరుకుపోవడం, నిరుద్యోగులై వారిలో చాలామంది వ్యసనాలకి బానిసలైపోవడం, కొంతమంది ఆడవాళ్లు కూడా మద్యానికి బానిసలైపోయి కుటుంబాలు వీధిన పడటం నవలలో సమాంతరంగా కనిపించే అంశాలు. 1981లో కథ ప్రారంభమయ్యేనాటికి ఆగ్నెస్‌కి మూడు పదుల పైన వయసు, ఎలిజబెత్ టేలర్‌కి ఉన్నంత అందచందాలు ఉన్నాయి. మొదటి వివాహంలోని యాంత్రికతని భరించలేక, ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న షగ్తో వచ్చేసి, తల్లిదండ్రుల ఇంట్లో కాపురం పెట్టిన ఆగ్నెస్‌కి ద్వితీయ వివాహంలో ఐదేళ్ల షగ్గీ బెయిన్తో బాటు, మొదటి వివాహంలో పుట్టిన కొడుకు లీక్, కూతురు కేథరిన్ సంతానం. స్వతహాగా అందగాడైన భర్త పలు అక్రమ సంబంధాలని పెట్టుకోవడం, చివరికి తన స్నేహితురాళ్లతోనే బాహాటంగా తిరుగుతూండటం వాళ్ల సంసారం బీటలు వారడానికీ, ఆగ్నెస్ తాగుడుకి బానిస కావడానికీ కారణమవుతుంది. ఈ స్థితిని చక్కదిద్దడానికా అన్నట్టు, షగ్ తన సంసారాన్ని ఊరికి దూరంగా ఉన్న బొగ్గు గనుల కాలనీకి మారుస్తాడు. ఈ స్వతంత్ర జీవనంవల్ల తన కాపురం మెరుగవుతుందనుకున్న ఆగ్నెస్ ఆశపడుతుంటే, షగ్కి ఉన్న ఆలోచనలు మాత్రం వేరు. అదే రోజున తన సామానుతో షగ్ బయటికి వెళ్లిపోతాడు. మూతపడిన బొగ్గుగనికి అనుబంధంగా ఉన్న ఆ కాలనీలో పేదరికం, వ్యసనాలు రాజ్యమేలుతుంటాయి. ప్రభుత్వం ఇచ్చే బొటాబొటీ భృతితోనే సంసారాన్ని నడపాల్సిన పరిస్థితుల్లో సైతం ఆగ్నెస్ తన బలహీనతలోకి మరింత కూరుకుపోతుంటుంది. అవకాశం కోసం పొంచివుండే ‘అంకుల్స్’ మద్యం ఎరతో ఆగ్నెస్ని వాడుకుంటూంటారు. యుక్తవయసొచ్చిన కూతురు కేథరిన్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని పెళ్లిచేసుకుని ఆఫ్రికాకి వెళ్లిపోతుంది. ఆర్ట్ క్లాసులకి వెళుతుండే కొడుకు లీక్ ఇంటి పరిస్థితులని భరించలేక సాధ్యమైనంతవరకూ ఇంటికి దూరంగా ఉంటూంటాడు. తల్లి సంరక్షణ కోసం వయసుకి మించిన బాధ్యతని తలకెత్తుకోవాల్సి వచ్చిన షగ్గీ బెయిన్‌కి ఇంకో వ్యక్తిగత సమస్య కూడా ఎదురవుతుంది: తనలో శారీరకంగా వస్తున్న స్త్రీ లక్షణాల వల్ల కలుగుతున్న గందరగోళం, ఎదురవుతున్న అవహేళనలు. నలభై యేళ్ల క్రితం సమాజంలో ఇలాంటి సమస్య పట్ల ఎలాంటి చిన్నచూపు ఉండేదో ఊహించవచ్చు. మధ్యలో తాగుడు వదిలేయాలని ప్రయత్నించి, ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్న ఆగ్నెస్ స్థిరచిత్తంతో సంవత్సరం పాటు ఉండగలుగుతుంది కానీ, అప్పుడు పరిచయమైన యూజీన్ అనే వ్యక్తి వల్ల మళ్లీ అదే బిలంలోకి జారిపోతుంది. కాలం గడుస్తున్నా వ్యసనం నుంచి బయటపడలేని ఆగ్నెస్, తనున్న లైంగికతా చట్రాన్ని దాటుకోలేని షగ్గీ– ఇద్దరూ భౌతికమైన సమస్యలతో బాధపడుతున్నవారే; ఇద్దరూ ఆ సమస్యలు çసృష్టిస్తున్న మానసిక వైకల్యాలకి లోనవుతున్నవారే; ఇద్దరూ వాటి నుంచి బయటపడి సమాజం శాసించే ‘నార్మాలిటీ’ అందుకుందామని ప్రయత్నిస్తున్నవారే. కానీ, గమ్యాన్ని చేరుకోవడమే ఇద్దరికీ కష్టంగా ఉంది. ఆ దూరాన్ని దాటడానికి ఇద్దరూ చేసిన ప్రయాణం, నిలుపుకున్న పరస్పర ప్రేమాభిమానాల మీదుగా మిగతా కథ నడిచి, ఊహించగలిగిందే అయినా మలుపు దగ్గర ఆగిపోతుంది. నవలలో విరివిగా కనిపించే స్కాటిష్ మాండలీకం ఎక్కడా ఇబ్బంది కలిగించదు కానీ, ఒకే తరహా సన్నివేశాలు పునరావృతమవడం వల్ల నవల ప్రభావం స్వల్పంగా పలచబడినట్టనిపిస్తుంది. స్వీయచరిత్రాంశాలు ఉన్న కారణంగా బహుశా అది అనివార్యం కావొచ్చేమో కానీ, నిడివి విషయంలో(448 పేజీలు) మరింత జాగ్రత్త వహించి కుదించివుంటే, పఠనానుభూతి మరింత గాఢంగా ఉండేది! - ఎ.వి.రమణమూర్తి -
వచన రచన విశిష్టత
ఇప్పటి వచన శైలి తరచుగ నీరసముగను నిష్ప్రౌఢముగ నున్నది కాని మిగుల సంతుష్టికరముగ నుండలేదు. ఇంకను బలిష్టమై, ధారాళమై, పౌరుషయుక్తమై, ప్రాణదురంధరమైన శైలి బయలుదేరలేదు. క్రమ క్రమముగ బయలుదేరగలదు. పది పద్యములు సులభముగ వ్రాయవచ్చునుగాని యొక పంక్తి వచనము సుష్టుగ వ్రాయుట కష్టము. పూర్వము సంస్కృతముననేమి యిప్పుడైన నాంధ్రముననేమి వచన ప్రబంధములు మిక్కిలి తక్కువగ నున్నవి. వచనమును వ్రాయువాడు వట్టి తెలివితక్కువవాడని సాధారణ జనాభిప్రాయమై యున్నది. కవితామణి కోటీరమును ధరించుట కర్హుడు కానివాడే యీ కట్టెలమోపు మోయదగిన వాడని జనుల నమ్మకము. ఆడుది తాను మిగుల రూపవతి యని లోకులనుకొనుట కెంత యాత్రపడునో, పురుషుడు తాను మిగుల బుద్ధిమంతుడని జనులనుకొనుట కంత కంటె నెక్కువ యాత్రపడును. అగరు నూనెల మెఱుగులు, నద్దము నెదుటి తిరుగులు, నాభరణముల హొరంగులు, మొగము పొడుముల తెఱగులు, కన్ను త్రిప్పుల వెరగులు మొదలగు సౌందర్య కళా సంపాదన సామగ్రి యాడుది యెంత యాచరించిన నంత యామెకే నష్టము. ఆపత్కాలములో నసురక్షణముకై పనికిరాదగు ధన మాస్యాళీక శోభకై సబ్బుబిళ్లల క్రింద నరిగి నురుగై కరగిపోవును. పోనిండు. అందువలన నితరుల కేమి నష్టము. వంగని ముంగురుల వంచుటకై కాగిదములనో, కారులనో యుపయోగించి పడరాని పాటుల నామె పడనిండు. ముంగురులు వంగకున్నను నలుగురి నవ్వులాటచే నామె తలయే వంగనిండు. అందువలన నితరుల కేమినష్టము! కాని బుద్ధిమంతుడని యనిపించు కొనదలచిన పురుషుడు వాజ్మయమున జేయు ప్రయత్నమట్టిది కాదు. బాహ్య ప్రపంచ జ్ఞానము లేక యాంతర ప్రపంచ జ్ఞానమంతకంటె లేక కవిత్వ మనగనేమో మొదలే యెఱుగక యతి ప్రాస బద్ధమైనదే కవిత్వమని నిశ్చయ పఱచుకొని పామర జనులనెట్లో యొకట్లు రంజింప జేయుటయే ప్రధానోద్దేశముగ జేసికొని యే పాడు ప్రబంధమో యే పాటల నాటకమో ప్రపంచమున నాతడు మెల్లగ జారవిడుచుట తోడనే – ఇంక భాషకు గల్గు ముప్పెంతో జెప్పదరమా? దేశమునకు గల్గు నపకీర్తి యెంతయో నిర్వచింప దరమా? జాతికి గల్గు నగుబాటెంతో చెప్ప వశమా? వాఙ్మయమున కింతకంటె పాషాణ ప్రయోగము మరియేది యుండగలదు! అతడు కవి శిఖామణియని యంతకుదగిన విమర్శకులు కొందఱాతనిని స్తుతుల జేయుచు నాతని యష్టావక్ర శిశువు నభినందింపగనే జనులంద ఱాతని దారినే యవలంబింతురు. ఆతనికంటె లఘుతరముగ బ్రకృతిని బహిరంగముగ దల బగులగొట్టి చంపుదురు. ఇక నెక్కడ జూచిన గవితాగళ బంధములే. ప్రపంచ జ్ఞాన జలద జంఝా మారుతములే. ప్రకృతి కాంతా శిరఃకృతకములే! ఇట్టి గ్రంథములు శీఘ్రముగ నశించిపోక నిలుచునా? నశించును – అట్లే నశింపకుండు నెడల నర ప్రకృతి యట్టె వానర ప్రకృతి లోనికి దిగిపోయి యదియట్టె చతుష్పాత కృతిలోనికి జారిపోయి యదియట్టె యవయవ శూన్య పిండ ప్రకృతి లోనికి గరిగిపోయి జగత్తు వికాస శూన్యమగు ప్రప్రథమావస్థలోనికి వచ్చియుండదా? అట్టి యుపద్రవ మేల సిద్ధింపగలదు. అందుచే నట్టి గ్రంథములు నశించును. కాని చేయదగినంత యపకృతి చేసిన పిదప గదా? ఎల్లకాల మేకీడైన నుట్టి గట్టుకొని యూగులాడునా? కవులు కానివారు కవితను జెప్పినందువలన గలుగు పుట్టిమునుక యిది! కవితా కాలము గడచిపోయినది. ఇప్పుడైన నట్టి యున్మాదము గలవాడు లక్షకుగోటి కెవ్వడైన నుండిన నతడు కవితాగానము చేయవచ్చును. అంతేకాని కవిత్వమున ఘనత యున్నదని యాసించి యందుకై ప్రయత్నించు జనుల సందర్భ గ్రంథముల çసృజించి యకాలపు వెఱులై ప్రకృతి కాపత్తు తెచ్చి పెట్టుట న్యాయమా! మనుజుడగు వాడు తన యభిప్రాయములకు గర్త కర్మ క్రియలు గల సందర్భములగు సహేతుకములగు వాక్యములతో వెల్లడించుట యుచితము. అది యత్యావశ్యకము గూడను. అందుచేత వచన రచన యెక్కువ యుపయోగకారి కాదా? ప్రపంచ మందున్న మహానాగరక దేశము లందెల్లడ వచన గ్రంథములే హద్దు లేకుండ వృద్ధి యగుచున్నవి. కవితాభివృద్ధికి ననాగరకత కెట్టి సంబంధమో గద్యాభివృద్ధికి నాగరకత కట్టి సంబంధము. కావున గాలానుసరణముగ గద్య గ్రంథములే మిక్కిలి యభివృద్ధి నొందవలసినది. అట్లు వానిసంఖ్య యభివృద్ధి నొందుచున్నదా? లేదని చెప్పుటకు లజ్జ పడక తప్పదు. ఎందుచేత? వచన గ్రంథకర్త వట్టి శుంఠయను వెఱి< లోకము నావరించి యున్నది. వచన రచన వలనే కాని భాష యభివృద్ధి నొందదు. దేశమున్నత దశకు రాదు. మనుజులు జ్ఞానయుక్తులు కారు. శాస్త్రములు వ్యాపింపవు. సత్యము ప్రబలదు. అట్టి వచన రచనను మనవారడుగు దొక్కినారు. దాని ననుసరించిన వానిని దీసివేత మనుజుని క్రింద బరిగణించుచున్నారు. కుక్కమూతి పిందె పండితునిగ భావించి త్రుంచివైచు చున్నారు. అట్లు త్రుంపకున్న దల్లిచెట్టు నశించునని యాందోళన పడుచున్నారు. వెలుగుచున్న దీపము నార్పుచున్నారు. వెనుకకు నడుచుచున్నారు. ఇట్లున్నను గాల మాహాత్మ్యముచే కొన్ని వచన గ్రంథములు బయలుదేరక పోలేదు. అవి చాల భాగము నవలలై యున్నవి. వానిలో నితర భాషల నుండి యాంగ్రీకృతములైనవి కొన్ని యున్నవి. ఇప్పటి వచన శైలి తరచుగ నీరసముగను నిష్ప్రౌఢముగ నున్నది కాని మిగుల సంతుష్టికరముగ నుండలేదు. ఇంకను బలిష్టమై, ధారాళమై, పౌరుషయుక్తమై, ప్రాణధురంధరమైన శైలి బయలుదేరలేదు. క్రమ క్రమముగ బయలుదేరగలదు. పది పద్యములు సులభముగ వ్రాయవచ్చునుగాని యొక పంక్తి వచనము సుష్టుగ వ్రాయుట కష్టము. సందర్భ శుద్ధియు, హేతు కల్పనమును, కార్యకారణ సంబంధ జ్ఞానమును గలవాడే కాని యుత్తమ వచన గ్రంథమును వ్రాయజాలడు. అట్టి శక్తులను వన్నెబెట్టి యభివృద్ధి పరచుట యందు గణితము కంటే గద్య రచనయే యెక్కువ శక్తి కలదియై యున్నది. ఉత్తమ వచన గ్రంథము లింక విరివిగ బయలుదేరుట యావశ్యకమై యున్నది. అట్టిలోపమును దీర్చుటకు బుద్ధిమంతులు ప్రయత్నింతురు గాక. పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘వచన రచన’ ఇది. అరసున్నాలు తీయడం మినహా య«థాతథ ప్రచురణ. ‘కవిశేఖర’ పానుగంటి (11 ఫిబ్రవరి 1865 – 1 జనవరి 1940) తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో జన్మించారు. బి.ఎ. చదివారు. ‘ఏ ఉద్యోగంలో ప్రవేశించినా తనని పోషించే ప్రభువుకంటే తను చాలా ఎక్కువవాడనని అనుకోవడమే కాకుండా యజమానికి కూడా ఆ భావం కలిగేటట్లు చేసేవారు.’ అందువల్ల ఎన్నోచోట్ల దివానుగా పనిచేశారు, మానేశారు. యువకుడిగా ఆయన్ని షేక్స్పియర్ ప్రభావితం చేశారు. ఆయనన్ని నాటకాలు రాయాలనుకొని 30 నాటకాలు రాశారు. రామాయణాన్ని పాదుకా పట్టాభిషేకము, విజయ రాఘవము, వనవాస రాఘవము, కల్యాణ రాఘవము పేర్లతో నాలుగు నాటకాలుగా రాశారు. రాధాకృష్ణ, కంఠాభరణం, మణిమాల, విప్రనారాయణ చరిత్రము ఆయన ఇతర నాటకాలు. కథావల్లరి, కథాలహరి, హాస్యవల్లరి, విమర్శాదర్శవిమర్శాదర్శము, ప్రకీర్ణోపన్యాసములు ఇతర రచనలు. తెలుగులో పుష్టి కలిగిన వచనం రాసిన కొద్దిమంది రచయితల్లో పానుగంటి ఒకరు. ఆయన ‘సాక్షి వ్యాసాలు’ తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. అందులోని తొలి వ్యాసం 1913లో అచ్చయింది. అయితే, ‘నా కీర్తిని ఎప్పటికైననూ నిలుపునది నా నాటకములే. ఎడమ చేతితో వ్రాసి పాఱవైచిన సాక్షి వ్యాసములు కావు’ అని పానుగంటి అనడం గమనార్హం. -
ఒక చిదంబర రహస్యం నందనార్
వర్తమానాన్నే కాదు గతాన్ని కూడా చూపించగలిగే అద్దం సాహిత్యం. చూశాక అనుభవాల విభిన్న దృక్పథంతో వాటిని మళ్లీ మళ్లీ దర్శిస్తుంటాం, మరొక అర్థ నిర్ణయమేదో చేయబోతాం. తమిళ శైవ సాహిత్యంలో అలా చూడబడ్దవాడు నందనార్. క్రీ.శ. 660 నుండి 840 మధ్యవాడు. అరవై ముగ్గురు నాయనార్లలో 18వ నాయనార్. నాయనార్లలో ఒకే ఒక్క దళితుడు నందనార్. అసలు పేరు ఎవరికీ తెలియదు. అణకువ, సహనం, నిజాయితీ, పవిత్రత మూర్తీభవించిన పరమ శివభక్తుడు. శివ దర్శనం తప్పకుండా చేసుకుంటానన్న ‘రేపు’ మీద నమ్మకం, అతన్ని చివరి వరకూ నడిపించింది. నందనార్, తంజావూరు జిల్లాలోని, కొల్లిదం నదీతీరాన ఉన్న ఆదనూరులో జన్మించాడు. డోలు, ఢంకా, మృదంగం లాంటి సంగీత వాయిద్యాలకు పనికొచ్చే, పశువుల చర్మాన్ని సమకూర్చి ఆ వాయిద్యాలను తయారుచేసే వారిని పరయర్లు అంటారు. భిన్నమైన వ్యక్తిత్వం కలవాడైనా, తన కులస్థుల్లో కలిసిపోయేవాడు. పహారా కాయడం, దండోరా వేయడం, చచ్చిన పశువుల్ని పారేయడం మొదలైనవన్నీ చేసేవాడు. ఆ కులంవారు ఆరాధించే కాళి, కాట్టేరి, ముణియాణ్డి, కురుప్పన్, చాముండి లాంటి దేవతలున్నా, బాల్యం నుండీ శివుడే అతనికి ఆరాధ్య దైవం. ఏ కాస్త సమయం దొరికినా శివాలయం ముందు ఏకాంతంగా నిలుచొని, శివగానం చేసుకుంటూ నర్తించేవాడు. ఒక అగ్రకుల భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేసేవాడు. ఒక రోజు తానున్న తిరుపుంగూరులోని ఇంటికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న శివలోకనాథార్ కోవెలలోని శివుని చూద్దామని వెళ్లాడు. దళితుడు కావడాన మందిరంలోనికి ప్రవేశం లభించలేదు. బయటనుండైనా శివుని చూద్దామన్న కోరిక తీరనివ్వకుండా, పెద్ద నంది విగ్రహం అడ్డుగా ఉంది. అతని ఆరాటం చూసి ఈశ్వరానుగ్రహంతో అది పక్కవాటుగా జరగడంతో, శివుని దర్శనమయింది. అలా పక్కకు జరిగినట్టుగానే ఇప్పటికీ ఆ నంది విగ్రహం ఉండటం విశేషం. ఆ ఆనందంలో గుడి ప్రాంతమంతా తిరుగుతుంటే, ఆ పరిసరాల్లో కూలిపోయే దశలో ఉన్న పాడుపడ్డ గుడిచెరువు కనిపించింది. దానిని పునర్నిర్మించాలన్న తలంపుతో ఒక్కడే పునరుద్ధరణ పనులు మొదలుపెట్టాడు. నందనార్ సేవకు మెచ్చి ప్రభువు వినాయకుని పంపి, ఆ పని జయప్రదంగా పూర్తి చేయించాడని అనుకుంటారు. ఆదనూరుకు తిరిగొచ్చి, ఎన్ని శివాలయాలు దర్శిస్తూ ఉన్నా, దక్షిణ కాశీగా పిలవబడే చిదంబరంలోని తిల్లయి నటరాజభంగిమలోని శివుడ్ని చూడాలన్న కోరిక ఎక్కువ కావడం మొదలయింది. దళితుడుగా అది సాధ్యం కాదని తెలిసినా, ‘నాలై పోవెన్ (రేపు వెళతాను)’ అని తోటివారికి చెప్పుకుంటూ రోజులు గడిపేవాడు. అందుకని అతని పేరు ‘తిరు నాలై పోవార్ (రేపు వెళ్లే వాడు)’ అని పిలిచేవారు. అక్కడకు పోయేందుకు భూస్వామిని అనుమతి అడుగుతూనే ఉండేవాడు. భూస్వామి ఏదో ఒక నెపంతో అనుమతి నిరాకరిస్తూ పోయేవాడు. ప్రతీ రోజు అలా చేయలేక, రాత్రికి రాత్రి 250 ఎకరాల పొలంలో నారు నాటగలుగుతే ఒప్పుకుంటానని ఒకరోజు వాగ్దానం చేశాడు. మర్నాటికి 250 ఎకరాల పొలం నాటబడి ఉంది. చివరకు నందనార్ చిదంబరం పొలిమేరల్లోకి వెళ్లగలిగాడు గాని, ప్రవేశం లభించలేదు. దళితుడుగా జన్మించడమే నేరం కావడం అతన్ని మానసికంగా వేధించింది. గుండెలు బాదుకుంటూ రోదిస్తూ గుడి బయట రాత్రులూ పగలూ గడిపాడు. ప్రభువు కలిగించిన ఏర్పాటుగా గుడిలోకి ప్రవేశం కల్పించగలిగాయి. కానీ అగ్ని సంస్కారం పేర శుద్ధి చేసుకునే అగ్నిగుండం గుండా లోనికి పోవడానికి అనుమతిచ్చారు. ఆ మంటల్లో నుండి ఒక పవిత్ర పూజారిలా బయటపడ్డ నందనార్, గర్భగుడిలోని స్వామి సన్నిధికి చేరిన వెంటనే అంతర్ధానమై పోయాడని పెరియ పురాణం చెబుతుంది. లోనికి పోకుండానే ఆ మంటల్లో అతను ఆహుతి అయిపోయి ఉంటాడని మరో కథనం. చిదంబరం నటరాజ మందిరం స్థల పురాణంలో నందనార్ ప్రస్తావన ప్రముఖంగా ఉంది. ప్రముఖ కవి సుందరార్ ప్రస్తావించిన శైవ మునుల జాబితాలో నందనార్ పేరు కూడా ఉంది. రాతలో అతనివి ఏవీ లేవు, అయినా గొప్ప శివ భక్తుడుగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. నందనార్‌ని ప్రశంసించిన వారిలో నారాయణ గురు, మహాత్మా గాంధీ, స్వామీ శివానంద, అంబేద్కర్ లాంటి వారు ఎందరో ఉన్నారు. 1910లో స్వామి సహజానంద చిదంబరంలోనే నందనార్ మఠాన్ని అతని గుర్తుగా స్థాపించారు. చోళ రాజుల తోడ్పాటు నాయనార్లకు పుష్కలంగా లభించింది. వారి పాలనలోనే దేవాలయాల కట్టడాలు ఎక్కువగా మొదలయాయి. రెండవ కులోత్తుంగ చోళుని దగ్గర మంత్రిగా పనిచేసిన 12వ శతాబ్దపు శెక్కిళార్ ముని అరవైముగ్గురు నాయనార్ల జీవిత చరిత్రలను మూడువందల సంవత్సరాల తరువాత సేకరించి, పెరియ పురాణం పేరన నమోదు చేశాడు. తమిళుల ముఖ్య గ్రంథమైన తేవారంలో, పన్నెండవ సంకలనంగా దానిని చేర్చాక అదే సంపూర్ణ తమిళ శైవ సిద్ధాంతంగా, తిరుముఱై పేర రూపుదిద్దుకుంది. పెరియ పురాణంలో నందనార్ చరిత్ర కూడా ఉంది. అయితే సంగీత సరస్వతి త్యాగరాజు సన్నిహితుడు, స్వాతంత్య్ర యోధుడు, 19వ శతాబ్దపు గోపాలకృష్ణ భారతియార్ 1861లో రాసి ప్రచురించిన ‘నందనార్ చరిత్రం’ మూలంగా తమిళ జనసమూహానికి నందనార్ మరోకోణం పరిచయమైంది. భారతియార్ కూడా తంజావూరు జిల్లా వాడే కావడం, అతడి కథనం పెరియ పురాణంలోని కథకు భిన్నంగా ఉండటంతో, ఆ జిల్లా వాసుల, అగ్రకులాల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. యజమాని దురాగతాల్ని సహించలేని, బానిస కార్మికుడుగా నందనార్‌ని అతను చూపించాడు. అయినా శివభక్తిలో ఏవిధమైన లోటూ నందనార్ రానియ్యలేదని, ఒక ఆసక్తికరమైన హరికథా కాలక్షేపంలా నందనార్ కథని తీర్చిదిద్దటంతో, దానిపట్ల విమర్శలకు దీటుగా ప్రశంసలతో తమిళ ప్రజలు దానిని ఆదరించారు. హరికథ రూపంలో ఉండటాన ఉండటాన హరికథ భాగవతార్లందరూ దానిని బాగా వ్యాప్తిలోకి తెచ్చారు. 1917లో ‘నందన్’ పేరు మీద గోపాలసామి, ఆరావముద అయ్యంగార్లు రాసిన నవల కూడా వచ్చింది. అదికూడా శెక్కిళార్ కథనానికి భిన్నంగానే వచ్చింది. శ్రీలంకలో కూడా అణగారిన వర్గాలకు దేవాలయంలోకి ప్రవేశం లేదు. అక్కడి అభ్యుదయ రచయిత మురుగయ్యన్ 1969లో రాసిన సంగీత పద్య నాటకం ‘గోపురం ప్రవేశద్వారం’లో నందనార్ కథని మరో రూపంలో చూపించాడు. తంజావూరు జిల్లాలోని కీలవేణ్మణి గ్రామంలో, హరిజన కూలీలు న్యాయమైన వారి జీతాలు అడిగినందుకు ప్రతిగా, భూస్వామి 25 డిసంబర్ 1968న, 44 మంది హరిజనుల్ని సజీవ దహనం చేసిన ఘటనతో ఉత్తేజితమై 1978లో ఇందిరా పార్థసారథి ‘నందన్ కథ’ ఆధునిక నాటకం తన స్వీయ గూఢార్థాలతో మరీ భిన్నంగా రాసి మెప్పించాడు. నందనార్ శివునితో ఐక్యమయి పోవడం అన్నది నిజానికి తెలివిగా అమలుపరిచిన ఒక పన్నాగం అని, సృజనాత్మక రచయితగా అతను ఊహించి రాసిన మొదటి సంచలనాత్మక కథనం అది. 1982లో తిరునల్వేలి జిల్లా మీనాక్షీపురం హరిజన కాలనీలోని వారిని ఇతర మతంలోకి చేర్పించిన సందర్భంలో మతకలహాలు చెలరేగాయి. ఆ సందర్భంగా కూడా జయప్రకాశం ‘విల్లు పాట’ పేరుమీద ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాడు. పరిశోధించబడ్డ నందనార్ కథగా అది 1984లో ప్రచురించబడింది. సమకాలీన సామాజిక సమస్యలా ఉండి, అది జనరంజకమైన జానపద వినోద కార్యక్రమంలా అందరూ స్వీకరించారు. తమిళ కథా ప్రపంచంలో ప్రముఖుడు పుదిమిపిత్తన్, ‘కొత్త నమందన్’ పేరున 1948కి ముందే కథ రాశారు. ఒకప్పటి గొప్ప చలనచిత్ర హాస్యనటుడు కలైవాణర్గా అందరికీ తెలిసిన ఎన్.ఎస్.క్రిష్ణణ్ కూడా ఒక నవల నందనార్ ఇతివృత్తంతో రాశాడు. ఆ నవల రాకముందే 1933 నుండి పది సంవత్సరాలలోపే, వివిధ నటులతో, వేరువేరు సంఘటనలతో మూడు చలన చిత్రాలు 1933, 1935, 1942లలో నందనార్ కథ నేపథ్యంతో వచ్చాయి. పన్నెండువందల సంవత్సరాల క్రితపు నందనార్ జీవితం మరణం విషయంలో ఏదో చిదంబర రహస్యం దాగి ఉందన్న ఆసక్తిని, అప్పటికీ ఇప్పటికీ మారని పరిస్థితులు పెంపొందిస్తూనే ఉన్నాయి. ఆ కారణంగా 8వ శతాబ్దం నుండీ ఇప్పటివరకూ అనేక విధాలుగా కవులు, రచయితలు, సంగీతకారులు, నాటకకర్తలు వారిదైన దృష్టికోణాలతో, నందనార్‌ని తిరిగి తిరిగి సృష్టిస్తూనే ఉన్నారు. అంతకుముందరి కథనంలో ఎదో సందేహాన్ని తీర్చేందుకు చేసే ప్రయత్నాలే నందనార్‌ని చిత్రించడంలో ఎక్కువ. అందరి ముఖ్యమైన సందేహాలు ఇవి – 1. నందనార్ ఎదురుతిరిగే వ్యక్తి కాడా? 2.శివలోకనాథార్ గుడి చెరువుని తానే తిరిగి పునర్నిర్మించాడా లేక అది అతనికి శిక్షగా చేయించిన పనా? 3. అగ్నిగుండంలోకి ప్రవేశించాలని అతనిని ఒప్పించారా లేక ఒత్తిడి చేసి తీసుకు వెళ్లారా? 4.అగ్నిగుండం నుండి బయటపడి అంతర్ధానమయాడా లేక అగ్నిగుండంలో మరణించాడా? వర్తమానంలో గతం ఉంది. ఆ నేపథ్యం వర్తమానాన్ని మరింత బాగా అర్థం చేసుకొందుకు పనికొస్తుంది. జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుందుకు, గతాన్ని చరిత్ర కాగడా ప్రకాశింపజేసి చూపిస్తుంది. - ముకుంద రామారావు -
గతానుగతికం
ముప్పై మూడేళ్ల కిమ్ జియాంగ్ ఓరోజు పొద్దున్నే లేచాక, వాళ్ల అమ్మలాగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఇది కాస్త తగ్గిందనుకున్నాక, కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన చిన్నప్పటి స్కూల్ స్నేహితురాల్లాగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. జియాంగ్కి తన శరీరంలో తను ఇమడలేని ఉక్కపోత ఎక్కువై, రూపాంతరావసరం ముందుకొస్తోందనేది డాక్టర్ చెప్పిన కారణం. కానీ ఇదిలా జరగడానికి స్త్రీగా జియాంగ్కి ముప్పై మూడేళ్ల గతం, అది సృష్టించిన కారణాలున్నాయి. దక్షిణ కొరియాలో సాధారణమైన కుటుంబంలో రెండో అమ్మాయిగా పుట్టిన జియాంగ్కి చిన్ననాటినుంచే లింగవివక్ష అంటే ఏమిటో తెలుసు. ఇంట్లో తల్లిదండ్రులు తమ్ముడిని చూసుకునే పద్ధతిలోనూ, స్కూల్లో మగపిల్లలు వేధించే విధానాల్లోనూ, వాటిని టీచర్లు చూసీచూడకుండా ఊరుకోవడాల్లోనూ, జీవితాలతో రాజీపడి చదువులు మానేసి తమ్ముడిని చదివించడం కోసం అక్కాచెల్లెళ్లు అనారోగ్యకరమైన పరిస్థితుల్లో కార్మికులుగా పనిచేయటంలోనూ– లోకవ్యవహారాల పట్ల అవగాహన కలుగుతూ వచ్చింది. వ్యవస్థీకృతమైన వివక్షనీ, పురుషాధిపత్యాలనీ అంగీకరించడం స్త్రీల జీవితాలలోకి అసంకల్పితంగానే ప్రవేశిస్తూ వచ్చింది. కుటుంబ పరిస్థితులు కాస్త మెరుగయ్యాక, కాలేజీ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాల్లోకి అడుగుపెడదామన్నా అదే వివక్ష (‘‘ఆడవాళ్లని ప్రత్యేకంగా చూడనక్కర్లేదు. సమానంగా చూస్తే చాలు’’). అభ్యర్థుల ఎంపిక, వేతనాలు(కొరియాలో మగవాళ్లకిచ్చే జీతాల్లో కేవలం అరవైమూడు శాతం మాత్రమే ఆడవాళ్లకిస్తారు) పదోన్నతులలోనూ అదే వివక్ష. మాటర్నిటీ సెలవుల మీద వెళ్తారనీ, చాలామంది తర్వాత ఉద్యోగాలు మానేస్తారనీ వీళ్లని ఉద్యోగాల్లో ప్రమోషన్లకి కూడా పరిశీలించరు (‘‘ఆడవాళ్లు ఉద్యోగాల్లో ఎందుకుండరూ అంటే, ఉండటం అసాధ్యమయ్యేలా మీరు చేస్తారు కాబట్టి.’’). ఉద్యోగం చేస్తున్నప్పుడే పెళ్లిచేసుకున్న జియాంగ్ కొన్నేళ్లకి అమ్మాయిని ప్రసవించాక, చివరికి అదే జరిగింది. అత్తామామలో, అమ్మానాన్నలో సహాయం అందించగల పరిస్థితులు లేనందువల్ల జియాంగ్ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది.‘‘ఎప్పుడో ఏదో పొందటం కోసం ఇప్పుడున్నదాన్ని ఎందుకు త్యాగం చేయాలి?’’అన్నది జియాంగ్ అంతర్వాణి అయినప్పటికీ, మరో ప్రత్యామ్నాయం లేదు. పిల్లని చూసుకోవడం, ఇంటి బాగోగులూ వంటావార్పులతోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. పిల్లని డేకేర్‌కి పంపించినప్పటికీ, సగటున మిగిలే ఖాళీ సమయం రోజుకి మూడు గంటలు! భర్త అర్థం చేసుకోగలడన్నది ఒక్కటే జియాంగ్కి ఊరట. కానీ, దానివల్ల ప్రత్యేకించి ఏ ప్రయోజనమూ లేదు– ఎందుకంటే, అతనికి ఏపనీ చేయడం రాదు. కాన్సర్లకీ, గుండెలకీ అధునాతనమైన పద్ధతుల్లో వైద్యమందించే ఈరోజుల్లో నెలసరి సమయాల కడుపునొప్పులకి మందు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే, ‘‘మందులతో కలుషితం కాని గర్భాశయాలు కావాలి వీళ్లకి– పచ్చటి అరణ్యాలలోని స్వచ్ఛమైన పచ్చికబయళ్లలాగా,’’ అంటుందొక పాత్ర. చిన్న తలనొప్పి వస్తేనే వెంటనే మాత్రలు వేసుకునేవాళ్లు, ఆడవాళ్లు మాత్రం ప్రసూతి వేదనలన్నీ మాతృత్వమనే అపురూపమైన హోదాని పొందడం కోసం ఆనందంగా భరించాలని సలహాలిస్తుంటారు. స్తీల సమస్యల పట్ల జియాంగ్ పడుతున్న వేదనగా సాగే కిమ్ జియాంగ్, బార్న్ 1982 నవల ఫెమినిస్ట్ సిద్ధాంత చర్చలతో విసిగించదు. కథకి ఎంచుకున్న అంశాలూ, సంఘటనలూ (ప్లాట్) దానికి ఒక కారణమైతే, క్లినికల్ స్టయిల్లో ఉద్వేగరహితంగా కథనం చేసిన తీరు మరో కారణం. రచయిత్రి చో నామ్ జూ 2016లో రాసిన ఈ తొలి నవల పదిలక్షల కాపీలకి పైగా అమ్ముడుపోయి సృష్టించిన సంచలనం అంతాయింతా కాదు. ఫెమినిస్ట్ భావజాలాలపట్ల సానుభూతితో ఈ నవలని సమర్థిస్తున్నవారిని ట్రోల్ చేసినవారి సంఖ్య అధికంగా ఉందంటే, ఆర్థిక ప్రగతిలో చాలా ముందున్న దక్షిణ కొరియా భావజాలాల విషయంలో మాత్రం ఎక్కడో పాతరోజుల్లోనే ఉండిపోయిందన్నది విదితమౌతుంది. గత సంవత్సరం ఈ నవల ఆధారంగా కొరియన్ సినిమా రాగా, నవలకి జేమీ చాంగ్ చేసిన ఇంగ్లీష్ అనువాదం ఈ సంవత్సరమే విడుదలయింది. ఇది కేవలం దక్షిణ కొరియాకి మాత్రమే పరిమితమైన కథ కాదు. మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల కుటుంబాల్లో ఈ కథలు కనిపిస్తూనే ఉంటాయి. స్త్రీలకి సమానావకాశాలు కల్పించడానికి పురుషాధిక్యపు భావజాలాల ప్రపంచం ప్రత్యేక దృష్టిని సారించకపోతే సార్వజనీనమైన ఇలాంటి కథలు సార్వకాలికం అయ్యే ప్రమాదం ఉంది. - ఎ.వి.రమణమూర్తి నవల : కిమ్ జియాంగ్, బర్న్ 1982 రచన : చో నామ్ జూ మూలం ప్రచురణ : 2016 కొరియన్ నుంచి ఇంగ్లిష్ అనువాదం : జేమీ చాంగ్ ప్రచురణ: లివ్రైట్ ; 2020 -
కబుర్లే మానవాసక్తి
మానవజాతి పరిణామ క్రమ చరిత్రను చెప్పే పుస్తకం ‘సేపియన్స్’. 2011లో హీబ్రూలో వెలువడి 2014 లో ఇంగ్లిషులోకి అనువాదమైన ఈ పుస్తక రచయిత ఇజ్రాయిల్‌కు చెందిన యువల్ నోఆ హరారీ. దీన్ని తెలుగులోకి ఆర్.శాంతసుందరి అనువదించారు. డెబ్బై వేల ఏళ్ల క్రితం ఆధునిక సేపియన్లు (‘తెలివైన’ మనుషులు) కొత్తగా భాషా నైపుణ్యం సాధించారనీ, ఇది గంటలకొద్దీ సన్నిహితులతో ఉబుసుపోని కబుర్లు చెప్పుకునేందుకు దోహదం చేసిందనీ, ఈ సాన్నిహిత్యం కోసమే మనుషులు పరిమిత సమూహాలుగా బతికారనీ అంటారు. సమూహంలోని మనుషుల సంఖ్య పెరిగితే సాన్నిహిత్యం తగ్గిపోతుంది. ‘‘ఈ కబుర్లు చెప్పుకోవటం అనే సిద్ధాంతం హాస్యంగా అనిపించవచ్చు, కానీ ఎన్నో అధ్యయనాలు దీన్ని సమర్థిస్తున్నాయి. ఈనాటికీ ఎక్కువశాతం మానవ వ్యక్తీకరణ ఈమెయిల్ ద్వారా అయినా, ఫోన్ ద్వారా అయినా లేక వార్తాపత్రికల్లో కాలమ్‌ల ద్వారా అయినా– అది పోచికోలు కబుర్లే. అది మనకి ఎంత సహజంగా అలవడిందంటే అసలు భాష పుట్టిందే ఇందుకా అనిపిస్తుంది. చరిత్ర పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు భోజన సమయంలో కలుసుకున్నప్పుడు మొదటి ప్రపంచయుద్ధం గురించి మాట్లాడుకుంటారనీ, అణు శాస్త్రవేత్తలు సమావేశాలకి హాజరైనప్పుడు విరామ సమయంలో కాఫీ తాగుతూ క్వార్క్(ఉపకణం)ల గురించి మాట్లాడుకుంటారనీ అనుకుంటున్నారా? ఎప్పుడైనా అలా జరగవచ్చు. కానీ సాధారణంగా వాళ్లు వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న మొగుణ్ణి పట్టుకున్న మరో ప్రొఫెసర్ గురించో, శాఖాధిపతికీ, డీన్కీ మధ్య జరుగుతున్న గొడవ గురించో, లేక ప్రయోగాలు చేసేందుకు ఇచ్చిన డబ్బుతో ఖరీదైన కారు కొనుక్కున్న తమ తోటి ఉద్యోగి గురించో పోచికోలు కబుర్లు చెప్పుకుంటారు. ఈ కబుర్లు సామాన్యంగా ఎవరో చేసిన తప్పులూ, నేరాల గురించే సాగుతాయి.’’ -
నార్లవారి ఉత్తరాలు
సాహిత్యవేత్తల జీవితంలోని వెలుగు నీడలు, నిర్వేద నిశ్శబ్దాలు ఏ విధంగా వాళ్ల రచనల్ని, వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేశాయో అవగతం చేసుకోవాలంటే వాళ్ల లేఖలు దోహదం చేస్తాయి. ప్రముఖ పత్రికా సంపాదకులు, చింతనాశీలి నార్ల వేంకటేశ్వరరావు హితులకు, సన్నిహితులకు, సామాన్య పాఠకులకు ఎన్నెన్ని లేఖలు రాసివుంటారో ఎవరి కెరుక? ఆయన కర్ణాటకలో వుండే ఓ కన్నడ రచయితకు, ప్రబుద్ధ పాఠకుడికి రాసిన వుత్తరాల సంకలనం ‘నార్లవారి ఉత్తరాలు’. ఇది 1986లో వెలువడింది. ఈ లేఖల్ని సంకలనం చేసి, ప్రచురించిన వ్యక్తి హరిహరప్రియగా కన్నడ సాహిత్య క్షేత్రంలో పేరుమోసిన సాతవల్లి వేంకట విశ్వనాథ. 1973 మార్చి 23న రాసిన మొట్టమొదటి లేఖ, 1984 ఫిబ్రవరి 21న రాసిన చిట్టచివరి ఉత్తరం– 11 ఏళ్ల అవధిలో రాసిన మొత్తం 57 జాబులు ఇందులో సంకలింపబడ్డాయి. వీటిల్లో ఒకటి హరిహరప్రియ తండ్రి సాతవల్లి శంకర రామశాస్త్రికి రాసింది. అన్నీ ఇంగ్లిషులో రాసిన ఉత్తరాలు. సర్వదా అపరిచితుడైన హరిహరప్రియ అడిగిన వెంటనే వి.ఆర్.నార్ల ‘మాటామంతీ’, ‘పిచ్చాపాటీ’ సంకలనాల్నుంచి కొన్ని వ్యాసాల్ని కన్నడీకరించేందుకు ఎలాంటి షరతులూ విధించకుండా అనుమతిచ్చారు– తన మొదటి ఉత్తరంలోనే. హైదరాబాద్‌కు రావడం తటస్థిస్తే తమ ఇంటికి వచ్చి భోజనం చేసి, కొన్ని గంటలు ఆషామాషీ గడిపితే మీ గురించి తెలుసుకొనే అవకాశం కలుగుతుందని ఎలాంటి భేషజాలు లేకుండా ఆత్మీయత ప్రదర్శించారు రెండో జాబులో. హరిహరప్రియ నార్లవారి అనుమతిపై జాబాలి నాటకాన్ని కన్నడంలోకి అనువదించేటప్పుడు దాన్లోని చివరి పంక్తుల్ని తిరగరాస్తే బాగుంటుందని సూచిస్తే, ఆయన సంతోషంగా మార్పు చేస్తూ, అనువాదకునికి కృతజ్ఞతలు చెప్పారు. నార్లవారి వ్యక్తిత్వంలో మాటలు పెళుసుతనం వ్యక్తమైనా, మనస్సులోని మెత్తదనం ఆయన ఈ లేఖలో కనిపిస్తుంది. గురుగంభీరులుగా భావింపబడే నార్లలో సౌజన్యం, సంస్కారం, సహృదయత ఈ లేఖల ద్వారా తెలుసుకోగలుగుతాం. జాబాలి కన్నడ అనువాదం ఆవిష్కరణ సభలో ఒకరు ఘాటుగా విమర్శించినప్పుడు హరిహరప్రియకు తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేస్తారు: ‘‘ఒక రచన గురించి ఎవరైనా భిన్నాభిప్రాయం ప్రకటిస్తే, ఖండిస్తే దాన్ని స్వాగతించాలి. కాని ఒక రచన పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మాత్రం సహించకూడదు’’ (లేఖ–25). అయితే ఇదే నార్ల సమయమూ, సందర్భమూ గమనించి విమర్శకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలంటారు. తన ‘సీత జోస్యం’ నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ప్రకటించినప్పుడు అకాడమీ ద్వైమాస పత్రిక ‘ఇండియన్ లిటరేచర్’లో ఆ పత్రిక సంహాయ సంపాదకుడు డి.ఎస్.రావు (ఈయనా తెలుగువారే) కటువుగా విమర్శించడంతో నార్ల ఆ బహుమతి తీసుకోనని మొరాయించారు. అకాడమీయే పురస్కరించి, తన పత్రికలోనే విమర్శించడం సబబు కాదన్నారు. విమర్శను వ్యతిరేకించ లేదు, విమర్శించిన సందర్భాన్ని వ్యతిరేకించారు. నార్ల రోగాల పుట్ట. తన ఉత్తరాల్లో పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. శారీరక క్లేశానికి తోడు దేశ రాజకీయ పరిస్థితులు, తన పూర్వ సహోద్యోగులు, వర్తమాన శత్రువుల వల్ల మానసిక అశాంతికి దూరమై వున్నానని 1981లో రాశారు. ‘‘ఇది(‘ఖద్దరు సంస్కృతి’) అసత్యం, మోసం, నీచత్వం, డబ్బు, అధికారం కోసం ప్రాకులాడే తత్వం, అన్ని విధాల నైతిక పతనానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.’’ 1984 ఫిబ్రవరి 21 నాటి చివరి లేఖలో ‘‘నాకిప్పుడు 76 ఏళ్లు. నేను మరెంత కాలమో జీవించను. నేను మరణించిన తర్వాత నా ఉత్తరాల్ని మీరేమైనా చేసుకోవచ్చు’’ అని రాశారు. సూటిగా, వాడిగా రాసే, మాట్లాడే ఆ మనిషి సరిగ్గా ఏడాది తర్వాత 1985 మార్చ్ 13న హైదరాబాద్‌లో చివరి శ్వాస వదిలారు. - ఘట్టమరాజు -
సాహిత్య సంచారం
బార్సిలోనాకి చెందిన అరవై యేళ్ల మాక్ నిర్మాణ వ్యాపారం కుప్పకూలిపోయింది. కొడుకులు వాళ్ల వాళ్ల జీవితాల్లో స్థిరపడి ఉన్నారు; భార్య ఫర్నిచర్ వ్యాపారంలో బిజీగా ఉంది. ఖాళీ సమయాన్ని ఎలా వెచ్చించాలా అని ఆలోచించిన మాక్ ఒక పుస్తకం రాయాలనుకుంటాడు. తన మరణానంతరం బయటపడి, అసంపూర్ణ రచనలా అనిపించే సంపూర్ణమైన రచన ఒకటి చేసిపెట్టుకోవాలని అతని ఉద్దేశం. అప్పటివరకూ చదువరిగానే తప్ప రచనానుభవం లేని మాక్కి సాహిత్యం పట్ల అభిప్రాయాలైతే ఉన్నాయి. సాహిత్యం మళ్లీ మళ్లీ పునరావృతమయ్యే ఒకే విశేషమనీ, సమస్యకి కారణాలు అన్వేషించే ప్రయాణాలే వివిధ రచనలుగా వెలువడుతున్నాయనేది అతని సిద్ధాంతం. రిపిటిషన్ అనేది సాహిత్యపు మౌలిక సూత్రం అన్నది అతని స్థిరాభిప్రాయం. ఈ ప్రయత్నాల్లో అతనుండగా, పొరుగున ఉండే సాంచెజ్ అనే ప్రముఖ రచయితని కలవడం తటస్థిస్తుంది. ఈ రచయిత తొలినాళ్లల్లో వ్యసనాలకి బానిసగా ఉన్నప్పుడు ‘వాల్టర్స్ ప్రాబ్లమ్’ అనే పది గొలుసు కథలున్న నవల రాసాడు. వాల్టర్ అనే వెంట్రిలాక్విస్ట్ కోల్పోయిన తన గొంతుని తిరిగిపొందడం, వివిధ రచయితల గొంతుల్లో ఆత్మకథని వినిపించడం నవల సారాంశం. సాంచెజ్ చేసింది మంచి ప్రయత్నమే కానీ, అప్పటికి అతనున్న మైకపు స్థితుల్లో ఒక్కోకథలో అర్థంలేని కొన్ని పేరాలు రాసుకుంటూ పోయాడు. ఇప్పుడా పుస్తకం కాపీలు ఎక్కడా దొరక్కపోవడం అతనికి కొంత ఊరట. మాక్ ఈ పుస్తకాన్ని కొన్నేళ్ల క్రితం సగం చదివి పక్కన పడేసాడు. సాహిత్యం ఎలానూ పునరావృతమయ్యేదే కాబట్టి దీన్నే తిరగరాసేస్తే సరిపోతుంది కదా అనుకుంటాడు. ఇప్పుడా పుస్తకాన్ని మాక్ మళ్లీ చదువుతుంటే, రచయిత సొంతగొంతుని సాధించడం కోసం చేసే ప్రతీకాత్మక ప్రయత్నంగా కథ అర్థమవుతూ పాత్రలు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. ఎంత సుపరిచితంగా అంటే– పుస్తకం మధ్యలో అతని భార్య పేరు శీర్షికగా ఒక కథ ఉంది! మాక్ కేవలం చదువరి అని మాత్రమే చెబితే చాలా తక్కువ చెప్పినట్టు. అతను చేసిన సాహిత్య శోధన అంతాయింతా కాదు. పుస్తకాలలోని వాక్యాలనీ, ఎపిగ్రాఫ్లనీ ఉదహరించగలిగినంత అపారమైన సాహిత్య పరిచయం ఉంది. ఈ పాండిత్యం నేపథ్యంగా తను సృష్టించబోతున్న నవలావరణంలోకి పూర్తిగా కూరుకుపోతున్న సమయంలోనే భార్య, సాంచెజ్ల మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానం కలిగాక అప్పటివరకూ సాహిత్య శిఖరాలని అందుకోవలని ప్రయత్నిస్తున్న మాక్, భ్రాంతుల లోతుల్లోకి జారిపోవడం ప్రారంభిస్తాడు. హెమింగ్వే అన్నట్టుగా ‘‘నో, ఐ కాన్ట్. ఐ యామ్ డన్ విత్ ఇట్,’’ లాంటి ఆత్మహత్యని ప్రేరేపించే వాక్యాలు మనసులో మెదులుతుంటాయి. కథకుడిగా మాక్ చెప్పినవన్నీ పూర్తి సత్యాలు కావనీ, కొన్ని అబద్ధాలూ ఉన్నాయనీ నెమ్మదిగా విశదమవుతూంటుంది. సాహిత్య నిర్మాణ యత్నంలో తనకు తానే సమస్య అయిపోయిన మాక్ రాసిన డైరీయే‘మాక్స్ ప్రాబ్లమ్’ నవల. ఇది కేవలం కథకోసం ఒకటిరెండు రోజుల్లో చదవాల్సిన నవల కాదు. రచయిత బెర్నార్డ్ మాలాముడ్ని మాక్ ఉదహరించినట్టుగా– ఠీజ్చ్టి’టn్ఛ్ఠ్ట జీటn’్ట ్టజ్ఛి ఞౌజీn్ట. ఈ నవల ఒక అరుదైన సాహిత్య పరామర్శ, ప్రశంసాత్మక విమర్శ. ఎన్నో కథల గురించీ, పుస్తకాల గురించీ, రచయితల గురించీ, ప్రహసనాల గురించీ, సినిమాల గురించీ మాక్ వివరణలు, వాటిల్లోనుంచి కొటేషన్లూ ఈ రెండువందల పేజీల నవలలో విస్తృతంగా పరుచుకునుంటాయి. ఉదహరించిన రచనలతోబాటుగా ఈ నవలని చదవగలిగితే అది మరోస్థాయి పఠనానుభవం. పాఠకుడికి కొత్తదారుల్ని చూపించి ప్రోత్సహించే ఈ మెటాఫిక్షనల్ నవల హాస్యంతోపాటుగా మెటాఫిజికల్ ఆలోచనలనీ అందిస్తుంది. ఎన్‌రికె విలా–మాతాస్ స్పెయిన్‌కి చెందిన ప్రముఖ రచయిత. నవలలో సాంచెజ్ రాసినట్టుగా చెప్పిన ‘వాల్టర్స్ ప్రాబ్లమ్’ నిజానికి ఈ రచయితే 1988లో రాసిన నవల. ఈ ఆధార నవల ఇంగ్లిష్‌లోకి అనువాదం అయితే కనక– హెమింగ్వే, బోర్హెస్, రేమండ్ కార్వర్, జాన్ చీవర్, జీన్ రీస్ లాంటి ప్రముఖ రచయితల గొంతులని విలా–మాతాస్ అనుకరించిన పద్ధతి తెలుసుకునే వీలుంటుంది. మార్గరెట్ జల్ కోస్టా, సోఫీ హ్యూస్ ద్వయం చేసిన ‘మాక్స్ ప్రాబ్లమ్’ ఇంగ్లిష్ అనువాదం సాఫీగానూ, ఫిలసాఫికల్గానూ సాగిపోతుంది. - ఎ.వి. రమణమూర్తి నవల : మాక్స్ ప్రాబ్లెమ్ (లేదా) మాక్ అండ్ హిజ్ ప్రాబ్లెమ్ రచయిత : ఎన్‌రికె విలా–మాతాస్ స్పానిష్‌లో ప్రచురణ: 2017 ఇంగ్లిష్ : మార్గరెట్ జల్ కోస్టా, సోఫీ హ్యూస్ ప్రచురణ : న్యూ డైరెక్షన్స్, 2019 -
ప్రజల మనిషికి బహువచనమే లోపలి మనిషి
ఏ సాహిత్య ప్రక్రియ అయినా శూన్యం నుంచి రాదు. అది చరిత్ర నుంచి ప్రేరణ పొందుతూనే, వర్తమానంతో ప్రభావితమవుతూ ఉంటుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ పీవీ నరసింహారావు ‘లోపలి మనిషి’ నవల (ఆంగ్లంలో ‘ది ఇన్సైడర్’, తెలుగు ‘లోపలి మనిషి’, అనువాదం: కల్లూరి భాస్కరం). గాఢమైన జీవితానుభవం, ఇతివృత్తంగా స్వీకరించిన చారిత్రక ఘటనల నుంచి ఉన్మీలనమైన తాత్త్విక కాంతిధార వెంటాడుతూ ఉంటే పీవీ ఈ నవల రాసి సాంత్వన పొందారనిపిస్తుంది. రాజకీయ సంస్థ పరిధిలో ఆయన లోపలి మనిషి. రాజకీయ వంచనతో, విలువల శైథిల్యంతో జాతి కన్న కల భగ్నమైపోతుంటే నిరసన గళం విప్పిన ప్రజల మనిషి కూడా. శతాబ్దాల పరాయి పాలన నుంచి విముక్తం కావడానికి ఎన్నో స్రవంతులనూ, పంథాలనూ కలుపుకుని పోరాడి గెలిచిన ఒక పురాతన జాతి తొలి అడుగులే తడబడుతుంటే, సంకెళ్లు తెగిపడ్డాయన్న స్పృహ లుప్తమై, కొత్త చరిత్ర నిర్మాణం వైపు కాకుండా, మళ్లీ బానిసత్వ చిహ్నాలను ముద్రించుకోవడానికి తహతహలాడుతూ ఉంటే సహించలేని లోపలి మనిషి, వాటి గురించి ప్రజల మనిషి చేత పలికించడమే ఈ నవల విశిష్ట శైలి. స్వేచ్ఛాభారతంలోనూ దగా పడుతున్న ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకున్న లోపలి మనిషి, ప్రజల మనిషికి బహువచనంలా వినిపిస్తాడు. లోపలి మనిషి పీవీ. ప్రజల మనిషి ఆనంద్, ఈ నవలానాయకుడు. ఆగస్ట్ 15, 1947 అనే ఆ ఒక్క తేదీతో సమాన చారిత్రక ప్రాధాన్యమున్న తేదీగా మరొకదానికి పట్టం కట్టడం అసాధ్యం. అదే, అఫ్రోజాబాద్ సంస్థానమైతే ‘1948’ కాలచక్రంలోని ఒకానొక సంవత్సరం కాదు, కొత్త ఉషోదయం. ఈ ఉషస్సుకు ముందుటి అంధకారంలోనే ‘లోపలి మనిషి’ ప్రస్థానం ఆరంభమవుతుంది. భారతదేశమంతటా గాంధీజీ అహింసా సిద్ధాంతంతో భారత జాతీయ కాంగ్రెస్ పరాయి పాలన పునాదులు కదిలిస్తున్నది. అఫ్రోజాబాద్ సముద్రంలో దీవిలా మిగిలింది (562 స్వదేశీ సంస్థానాలలో ఒకటైన హైదరాబాద్‌కు రచయిత పెట్టిన పేరు). అక్కడ నవాబు ప్రపంచ కోటీశ్వరుడు. కానీ ఒంటి నిండా గుడ్డ ఉన్న పౌరులు అతి తక్కువ. వార్తాపత్రిక, రేడియో నిషిద్ధం. అయినా కాంగ్రెస్ ఉద్యమ ప్రభావమే కాదు, ఆయుధాన్ని నమ్మిన తీవ్ర జాతీయోద్యమ సెగ సైతం సంస్థానంలోకి ప్రవేశించింది. హఫీజ్ అనే విప్లవకారుడు అందించిన విప్లవ సాహిత్యం, భగత్‌సింగ్ తండ్రికి రాసిన చరిత్రాత్మక లేఖ ఆనంద్‌ను అప్పటికే నిజాం మీద ఆరంభమైన సాయుధపోరు వైపు అడుగులు వేయించాయి. స్వతంత్ర భారతంలో తొలిపొద్దు సందేశం– దేశానికి స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయనే. ఆపై గాంధీజీ హత్య. తరువాత గొడ్డలి పిడి తత్త్వాన్ని గుర్తు చేస్తూ కశ్మీర్ కోసం పాకిస్తాన్ మొదటి దాడి. నలభై ఆరుశాతం భూభాగంలో విస్తరించి ఉన్న సంస్థానాల విలీనంతో విశాల భారత ఆవిష్కరణ... వరుసగా జరిగాయి. తరువాత– తొలి సార్వత్రిక ఎన్నికలు. ‘టికెట్లు కోరుకునేవారిలో చాలామందిని ఆకర్షించేది అధికారమే కానీ, మరొకటి కాదని సాధారణ పరిశీలకులకు సైతం తెలిసిన వాస్తవం’(పే 98) అనతికాలంలోనే ఆవిర్భవించింది. పాతికేళ్ల స్వతంత్ర భారత ఉత్థానపతనాల మీద వ్యాఖ్య ఈ నవల. అందులో ఎన్నికలకి ఇచ్చిన స్థానం చాలా పెద్దది. ఎన్నికలలో రచయిత మహా పతనమే చూశారు. దేని పతనం? ప్రజాస్వామ్య పతనం. ‘దేశ పరిపాలన విషయంలో ప్రజాభిమతాన్ని ప్రతిబింబించడమనే వాస్తవిక ప్రయోజనాన్ని క్రమంగా ఎన్నికలు కోల్పోతూ వస్తున్నాయ’ (పే. 324)ని నిర్ధారణకొస్తాడతడు. దేశంలో సగం ఉన్న మహిళ ఎన్నికలలో పోటీ చేయాలంటే, మొదట జాతీయ కాంగ్రెస్ శల్యపరీక్షలో, ‘నా పడకగదిలోంచి ఆమె నడవనప్పుడు ఎన్నికల్లో కూడా ముందుకు సాగలేదు’ (పే. 221) అని చెప్పే పరిశీలకుల దగ్గర ఎలా నెగ్గాలి? లాల్‌బహదూర్ శాస్త్రి వంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు కలగచేసుకోవడంతో పరిశీలకుడు అప్పటికి (ఆనంద్ సన్నిహితురాలు అరుణ టికెట్టు రగడ) ఓడిపోయాడు. ప్రథమ ప్రధాని నెహ్రూ గురించీ, వ్యక్తిత్వం గురించీ ఇంతటి సమదృష్టితో పరిశీలించిన రచన మరొకటి ఉండదేమో! నెహ్రూ అంటే ఒక మహావృక్షం. అలీనవాదం, మిశ్రమ ఆర్థికత, సోషలిజం, ప్రభుత్వ రంగం, పంచవర్ష ప్రణాళికలు, నిరాయుధీకరణ, అకాడమీల స్థాపన, ఫెడరలిజం, సెక్యులరిజం – ఆ మహావృక్షం శాఖలే. అయినా, ‘నెహ్రూ అనే దేవత లక్షల మంది దెయ్యాలున్న పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడన్నదే’ (పే 284) ఆనాటి అభిప్రాయం. నెహ్రూ ఆదర్శాలకీ, సమకాలిక సమాజానికీ మధ్య ఇంత దూరం! ‘ఎంతో తలపండిన రాజకీయవాదులు కూడా అలీన విధానాన్ని తేలికగా జీర్ణించుకోలేకపోయారు’ (పే 343). సోషలిజం నెహ్రూ స్వప్నం. కానీ అది వేదికలకీ, ఉపన్యాసాలకీ పరిమితం కావాలన్నదే కాంగ్రెస్ పెద్దల అభిమతం. లౌకికవాదం విషయంలో నెహ్రూ ఏకాకి. ‘భారతదేశంలో జాతీయవాది అనదగిన ఏకైక ముస్లిం ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ’ (పే 400) అని ఆయన వ్యతిరేకులు ఎత్తి పొడిచేవారు. 1962 నాటి చైనా యుద్ధంలో భారత్ ఓటమి దరిమిలా ఆయన తన ఈ పాత ప్రపంచం నుంచి తనను తానే బలవంతంగా బయటకు తెచ్చుకున్నారు. ఇక్కడ ఆనంద్ ఆరోపణ ఏమిటి? ‘నెహ్రూ మహాత్మా గాంధీని, ఆయన ఆదర్శాలను ముందుకు సాగించినట్టు నెహ్రూను, నెహ్రూ ఆదర్శాలను సాగించేవారు ఒక్కరూ లేరు’ (పే 386). ఆఖరికి నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కూడా అందుకు మినహాయింపు కాదన్నదే అతడి నిశ్చితాభిప్రాయం. ఇందిర పాత్ర చిత్రణ దగ్గర పీవీలోని స్వరాజ్య సమరయోధుడు, స్వతంత్ర భారత రాజకీయాల ప్రత్యక్ష సాక్షి మరింత కఠినంగా మారిపోవడం గమనిస్తాం. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక, అందులో ఇందిర పాత్ర (పార్టీ సమావేశంలో నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, లోపాయికారిగా ఉపరాష్ట్రపతి వివి గిరిని అభ్యర్థిగా నిలిపి గెలిపించారు, దానికి అంతరాత్మ ప్రబోధం అని పేరు పెట్టారు) భారతీయులు రెండుగా చీలిపోయారన్న అపోహకు బీజం వేశాయని (ప్రపంచం దృష్టిలో, ముఖ్యంగా పాక్ దృష్టిలో) ఆనంద్ అభిప్రాయపడతాడు. ఆమె హయాంలో సాగిన అసమ్మతి రాజకీయాలు, ముఖ్యమంత్రుల మార్పు దేశ ప్రతిష్టకే భంగకరమని ఆనంద్ బాధ. ‘ఎంతో గొప్పవాడైన తన తండ్రిని కూడా జనం మరచిపోయేంత ఘనకీర్తిని సంపాదించాలన్న తపనతో ఆమె వేగిపోతోంది’ (పే 454) అనుకుంటాడు లోపలి మనిషి. తన తరువాత ఈ వైభవం కొడుకు సంజయ్‌కి సంక్రమించాలన్న తపననూ ఆమెలో గమనిస్తాడు. భూమి సమస్య; ప్రాధాన్యం, రాష్ట్రాల పునర్విభజన,రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, భారత జాతీయ కాంగ్రెస్‌కు కాంగ్రెస్ (ఐ) అనే ‘తోక’, పత్రికారంగం పతనం, నక్సల్బరీ, పాక్, చైనా సంబంధాలు, కామరాజ్ పథకం, హిందూ ముస్లిం సమస్య .... ఇలా నవలలో ఆనంద్ చేత లోపలి మనిషి మాట్లాడించిన చారిత్రకాంశాల జాబితా విస్తారమైనది. ఆ జాబితా స్వతంత్ర భారతదేశ చరిత్ర పుటలలోని ప్రతి అధ్యాయపు ఛాయే. చరిత్రకు ఛాయ సాహిత్యమే. ‘లోపలి మనిషి’ నవలాకారుడు సాహిత్యం లోతులు తెలిసినవారు. బహుభాషా పండితుడు. అందుకే పత్రికారంగం, భాషా వివాదాలు ఆయన దృష్టిపథం నుంచి తప్పించుకోలేదు. స్కూప్, స్పెషల్ కరస్పాండెంట్లు, కొసన ప్రశ్నార్థకం ఉన్న శీర్షికలతో వెలువడే వార్తలు, అవి సృష్టించే కృతక వాతావరణం వంటి అంశాలను పీవీ చిత్రించారు. నెహ్రూ వారసులెవరు అంటూ డజన్ల కొద్దీ పుస్తకాలు వెలువడుతుంటే, కొన్ని ప్రమాదకర సమస్యలు దేశంలో ఉద్యమ రూపంలో వీధులకెక్కాయి. అవి ప్రాంతీయమైనవి, భాషాపరమైనవి, మతపరమైనవి. నిజానికి అంతా రాజకీయమే. అస్సాం సాహిత్య సభ 1959లో వారి భాషను అధికార భాషగా ప్రకటించాలని కోరింది. అక్కడ బెంగాలీ మాట్లాడేవారు ఉన్నారు. ఇది హింసాత్మకమైంది. ఇంతకంటే దారుణం– తమిళనాడు హిందీ వ్యతిరేకాందోళన. ‘తమిళతల్లి’ కోసం ఆత్మాహుతులు జరిగిపోతున్న కాలం. ఒక మంత్రి ఇంట జరిగిన పెళ్లిలో ఉత్తర భారత నర్తకుడు బిర్జూ మహరాజ్ కార్యక్రమం ఏర్పాటయిందని తెలిసి తెలుగుప్రాంతం నుంచి వెళ్లిన ఆనంద్ తదితర నేతలు కంగుతిన్నారు. ఈ హిందీ వ్యతిరేకోద్యమ ఘట్టానికి కొసమెరుపు– ఎంపీ అయిన ఓ హిందీ వ్యతిరేకోద్యమ నేత ఆనంద్‌కు పరిచయం. ఒక విమానాశ్రయంలో ఇద్దరూ తారసపడ్డారు. తమిళ ఎంపీ వెంట కొడుకు ఉన్నాడు. వారి మధ్య సంభాషణ ఇది. ‘మీకు తెలుసో లేదో, మావాడు ఢిల్లీలో చదువుతున్నాడు. హిందీలో వీడిక్లాసులో ఎప్పుడూ వీడే ఫస్టు’ అన్నాడు ఎంపీ. ‘మీకు హిందీ రాదు. పైగా ఆ భాషకు వ్యతిరేకం. ఎప్పుడూ ఆందోళన చేస్తూనే ఉంటారు’ విస్మయంతో అడిగాడు ఆనంద్. ఇందుకు మరింత విస్మయం కలిగించే జవాబు, ‘చూడండి, అవి రాజకీయాలు...’ (పే. 321). సమాఖ్య వ్యవస్థలో కేంద్రం బలహీనంగా ఉందన్న అభిప్రాయం బలపడినప్పుడూ, తమను పట్టించుకునే వెసులుబాటు ఢిల్లీకి లేదు కాబోలునని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు నిరాశ పడినప్పుడు నక్సలిజం వంటి సమస్యలు అనివార్యమనే పీవీ చెబుతారు. ‘భూస్వామ్య వ్యవస్థ వైఫల్యాలను మీ పార్టీ (కాంగ్రెస్) వాడుకుంటే, ఇప్పుడు నక్సలైట్లు మీ విధానంలోని వైఫల్యాలను వాడుకుంటున్నారు. అవి మరింత కొట్టొచ్చినట్టు కనిపించే వైఫల్యాలు’ అని బలరాం అనే పాత్ర (భూస్వామి) వ్యక్తం చేసిన అభిప్రాయంలో ప్రతిబింబించేది ఇదే. భూమి సమస్యకు కొనసాగింపుగానే పీవీ నక్సల్ సమస్యను చూశారు. అయినా ఆయన దృష్టిలో భారతీయతకు ఆకృతిని ఇచ్చినదే భూమి. సోషలిజం కాంగ్రెస్ పార్టీ నినాదం. కానీ భూసంస్కరణలు తేవడానికి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆనంద్ చేసిన ప్రయత్నం భంగపడింది. చివరికి అది అతడి పదవిని బలిగొన్నది(వాస్తవంలో ఇందుకు బలిపశువైనవారు పీవీయే). ఇదే ఈ నవలకు ముగింపు. ‘లోపలి మనిషి’ పీవీ ఆత్మకథాత్మక నవలగా చెబుతున్నారు. కానీ ఇది నాటి ఎందరో విజ్ఞుల ఆత్మావలోకనం. దానికి అక్షరరూపం ఇచ్చినవారు దాదాపు పీవీ ఒక్కరే. ఎంతటి చరిత్రపురుషులనైనా దేవుళ్లుగా ప్రతిష్టించవద్దంటుందీ నవల. చరిత్రను మింగే స్థాయిలో చరిత్ర పురుషులను ఆరాధించకూడదని ఘోషిస్తుంది. - డా‘‘ గోపరాజు నారాయణరావు -
గన్‌పౌడర్ భోజనం
రచయిత, విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్‌లో కొంతకాలం ఉండి చదువుకున్నారు. ఆ సంస్థను ఆయన హైదరాబాద్ మధ్యలో లండన్ అనేవారు. ఆయనకు అక్కడి తిండి తీరు నచ్చలేదు. ఒకనాడు వంటవాళ్లను అడిగి మిరప్పొడి, ఉప్పు తెప్పించుకుని అందులో నూనె కలుపుకుని దానితో అన్నం తింటున్నారు. ఒక మహిళ అది గమనించి, ఏమిటి తింటున్నావు అని అడిగింది. ఈయన గర్వంగా గన్ పౌడర్ అన్నారట. అది తిని ఎట్లా బతుకుతావు అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అది లేకుంటే నేను బతకలేను అని ఈయన జవాబు! అక్కడి వాతావరణం నుంచి బయటపడాలని ఆయన పక్కనే ఉన్న మా ఉస్మానియా బి హాస్టల్‌కు వచ్చేవారు. ఒక సారి భోజనానికి కూడా ఉండిపోయారు. ఆ సంగతి విన్న ఆ మహిళ ఈజ్ ఇట్ నాట్ నాయిసీ దేర్ (అక్కడంతా గోలగా లేదా) అని అడిగింది. నో, ఇట్ ఈజ్ వెరీ లైవ్ లీ (లేదు, అక్కడ చాలా జీవవంతంగా అంది) అని జవాబిచ్చారు. ఈ సంగతులు ఆయనే మాతో చెప్పారు. గోపాలం కె. బి. -
విలువైన వ్యాస పెన్నిధి
కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రాయలసీమకు చెందిన ప్రాచీన తెలుగు కవుల్ని నేటితరం వారికి పరిచయం చేయాలని ఓ ప్రణాళిక వేసుకుంది. కుమార సంభవం కావ్యకర్త ‘నన్నెచోడుడు’ ఈ ప్రణాళిక ఫలమే. మూల మల్లికార్జున రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో ఏడు వ్యాసాలున్నాయి. మహాపండితుడు నడకుదుటి వీరరాజు పంతులు రాసిన ‘కవిరాజ శిఖామణి కావ్య విశేషములు’ ఈ సంకలనంలోని మొదటి వ్యాసం. కావ్యావతారికలో ఇష్టదేవతా ప్రార్థన, గురుస్తుతి, పూర్వకవి ప్రశంస, కుకవి నింద మొదలైన విషయాల్ని ప్రస్తావించి నన్నెచోడుడు తర్వాతి కవులకు మార్గదర్శి అయ్యారని వీరరాజు పంతులు అన్నారు. కుమార సంభవంలోని కొన్ని పదాల్ని కందుకూరి వీరేశలింగం అన్యదేశ్యాలుగా భావించటం పొరపాటనీ, అవి మూలద్రావిడ భాషా పదాలే అనీ నిరూపించారు. ఆయన వాడిన ‘అప్రతీత పదములు’ అన్నమాట సరికాదనీ, అవి ఆ కవి కాలంలో వ్యవహారంలో వుండి, తర్వాతి కాలంలో కనుమరుగయ్యాయనీ చెప్పారు. ఆయన చర్చించిన ‘శబ్ద పరికర సంపత్తి’ భాగం భాషాశాస్త్రరీత్యా ఎంతో విలువైనది. 1926 నాటి ఈ అమూల్య వ్యాసం ఈ గ్రంథానికి పెన్నిధి. నన్నయ్యకు నన్నోచోడుడు నూరేండ్ల తర్వాతివాడని సోపపత్తికంగా నిరూపించారు వేటూరి ఆనందమూర్తి. చిలుకూరి పాపయ్య శాస్త్రి తమ ‘నన్నెచోడుని వర్ణనా నైపుణ్యము’లో సంస్కృత కవుల వర్ణనల్లో రసదృష్టి ప్రధానమైతే, తెలుగు కవుల వర్ణనల్లో ఆలంకారికత, చాతుర్యం, వైదగ్ధ్యం ప్రాముఖ్యాన్ని వహిస్తాయని చెప్పారు. నన్నెచోడుని కావ్యం అనల్ప కల్పనాశక్తి, అపూర్వ వర్ణనాయుక్తులు సుందర సంగమమనీ; మనస్తత్వ నిరూపణలో తిక్కన, సూరనలకు నన్నెచోడుడు మార్గదర్శకుడనీ అన్నారు సి.నారాయణ రెడ్డి. నన్నెచోడుని వర్ణనల్లోని వన్నెచిన్నెల్ని తమ వ్యాసంలో చక్కగా ప్రదర్శించారు వి.రాజేశ్వరి. రతీమన్మధుల సంవాదంలోని మనస్తత్వ చిత్రణలోని సూక్ష్మతల్ని నిరూపించారు. నన్నెచోడుని అష్టాదశ వర్ణనల్లోని ప్రగల్భతను ప్రస్తుతించారు ఆరుద్ర. కవి గడుసుదనాన్నీ, గమ్మత్తుల్నీ సోదాహరణంగా పేర్కొన్నారు. కుమారసంభవాన్ని తొలిసారిగా (మొదటి సంపుటం 1908, రెండవ సంపుటం 1914) ప్రచురించిన మానవల్లి రామకృష్ణ కవి వ్యాసం, కుమారసంభవం గురించి పరిశోధన చేసిన వేదం వెంకట్రాయశాస్త్రి, అమరేశం రాజేశ్వరశర్మ, తిమ్మావఝల కోదండరామయ్య గార్ల వ్యాసాలు సంకలింపబడివుంటే ఈ గ్రంథం సమగ్రతతో శోభిల్లివుండేది. ఘట్టమరాజు నన్నెచోడుడు (విమర్శ వ్యాసాలు) పేజీలు: 152; వెల: 100 ప్రధాన సంపాదకుడు: ఆచార్య కె.చంద్రయ్య ప్రతులకు: సభ్య కార్యదర్శి మరియు రిజిస్ట్రార్, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం, 1–1254, యర్రముక్క పల్లె, కడప–516004. ఫోన్: 08562–255517 -
మెక్సికో స్త్రీల ఆర్తధ్వనులు
మెక్సికోలోని లామటోసా అనే చిన్న ఊర్లోని ఓ పంటకాలువ. దాని ఒడ్డున జీర్ణావస్థలో నీళ్లల్లో తేలుతూ ఉన్న మంత్రగత్తె శవాన్ని చూశారు అయిదుగురు పిల్లలు. మంత్రగత్తెని ఎవరు, ఎందుకు చంపారు? చేతబడులు చేస్తుందనీ మంత్రతంత్రాలను ప్రయోగిస్తుందనీ నమ్మే లామటోసా ఊరి ప్రజలకి మంత్రగత్తె అంటే భయమే కాదు, కొద్దిపాటి అసహ్యం కూడా. ఆ ఊరి స్త్రీలు మాత్రం తమ మానసిక, శారీరక సమస్యలను మూలికలూ మంత్రాలతో నయం చేసుకోవటానికి ఎవరికంటా పడకుండా రహస్యంగా ఆమె దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఎంతోమంది గల్లంతైపోయిన ఒక తుఫాను రాత్రి అనంతరం ఆ మంత్రగత్తె చనిపోయిందనుకుని, ఆమె కూతుర్నే మంత్రగత్తె అనడం మొదలుపెడతారు ఊరి జనం. వాళ్ల ఇంట్లో ఒక మూసేసిన గది ఉందనీ, అందులో బంగారు నాణాలున్నాయనీ ప్రజల అనుమానం. లూయిస్మీ, యేసేనియా అదే ఊరిలో తమ అమ్మమ్మ దగ్గర పెరుగుతుంటారు. చిన్నతనంలోనే మద్యం, డ్రగ్స్ లాంటి దురలవాట్లకు బానిసైన లూయిస్మీ బాధ్యతారాహిత్యం గురించి తెలిసిన యేసేనియాకి, మంత్రగత్తెని అతనే చంపాడేమో అన్న అనుమానం వస్తుంది. జరిగిన కథేమిటంటే– పెంపుడు తండ్రి వల్ల గర్భవతై ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పదమూడేళ్ల నోర్మా గతం గురించి తెలియని లూయిస్మీ ఆమెని భార్యగా స్వీకరిస్తాడు. అత్తగారి సలహా మేరకు అబార్షన్‌కి ఒప్పుకున్న నోర్మా, మంత్రగత్తె ఇచ్చిన పసర్లు మింగి ఆరోగ్యం విషమించి ఆస్పత్రి పాలౌతుంది. లూయిస్మీ ఉగ్రుడైపోయి తన స్నేహితుడితో కలిసి మంత్రగత్తె ఇంటిని దోచేద్దామని వెళ్లగా, అక్కడ డబ్బేమీ దొరకకపోగా ఊహించని పరిస్థితులలో స్నేహితులిద్దరూ మంత్రగత్తెని చంపి శవాన్ని కాలవలో పడేసి పారిపోతారు. మంత్రగత్తె చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఊరిజనం నిధి కోసం ఆ ఇంటిమీద పడతారు. అందరికంటే ముందుగానే ఆ డబ్బుకోసం అక్కడికి చేరుకున్న పోలీసులు మూసేసిన గదిని హడావుడిగా పగలగొట్టినప్పుడు తెలిసిన కొత్త నిజాలేమిటి? చివరికి మిగిలిందేమిటి? అది నవల ముగింపు. హరికేన్ సీజన్ – తుఫానులాగా కమ్మేసే ఈ నవల ప్రపంచ పాఠకులనుంచి ప్రత్యేకమైన ప్రశంసలను పొందుతోంది. ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయిత్రి ఫెర్నాండా మెల్చోర్ రాసిన స్పానిష్ నవలల్లో ఇంగ్లీషులోకి తొలిసారిగా అనువదింపబడి, బుకర్ ఇంటర్నేషనల్ అవార్డ్‌కి షార్ట్‌లిస్ట్ అయిన ఈ నవలని సోఫీ హ్యూస్ అనువదించారు. థర్డ్ పర్సన్ నెరేషన్‌తో కథనం పాత్రలు, కాలాల మీదుగా సాగుతూ మంత్రగత్తె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫుల్‌స్టాపులు లేని పొడుగైన వాక్యాలు జ్వరప్రకంపనాలుగా సాగుతూ పాత్రల జీవితాల్లోకి చదువరిని లాగేస్తాయి. చాప్టరంత పేరాగ్రాఫు ఒక్కోసారి పేజీల కొద్దీ సాగిపోయినా కథనంలో వేగం తగ్గదు; విసుగు పుట్టించదు. పేదరికంతో పాటు డ్రగ్స్, మద్యం, విశృంఖల శృంగారం, హోమోసెక్సువాలిటీ గురించి నవలలో వినిపించే పచ్చిదనం నగిషీలు చెక్కని వాస్తవం. స్పానిష్ భాషలో లావాలా ఎగజిమ్మిన క్రోధం, అశ్లీలత, హింస, తిట్లని ధ్వనింప చేయటానికి ఇంగ్లీష్ భాషలోని వివిధ మాండలికాలతో ఎంతో శ్రమించాల్సి వచ్చిందని అంటారు అనువాదకురాలు. జీవితాలలో ఉన్న హింసలకీ విషాదాలకీ అతీతంగా పాత్రలు చూపించే ప్రేమ కరుణ నవలకి విడిగా కనిపించని చోదకశక్తి. శవాలను ఖననం చేసేటప్పుడు వాటితో ప్రేమగా మాట్లాడటం తన బాధ్యత అనుకునే కాపరి, శవాలను పూడుస్తూ మాట్లాడే ముగింపు వాక్యాలు, ‘‘ఈ చీకట్లు ఇలా ఉండిపోవు. దూరంగా నక్షత్రంలా కనబడుతున్న వెలుగును చూశావా? ఆ వెలుగు దగ్గరకే నువ్వు వెళ్తోంది. వెతల కలుగులోంచి ఆ వెలుగులోకి వెళ్లే దారి ఇదే!’’ అనటం ముగిసిన ఆ జీవితాలకి ఆఖరి ఓదార్పు. మెక్సికోలో కనిపించే పేదరికం, లింగవివక్ష, ఫెమీసైడ్ (స్త్రీలు కాబట్టి చంపేయడం), మాఫియా, డ్రగ్స్, వ్యభిచారం, నిరక్షరాస్యతలతో మగ్గిపోతూ మార్పుకోసం ఎదురుచూసే జీవితాల్లోకి వెలుగు వచ్చేదెప్పుడనీ, వారు శ్వాసించే హింసకు నిజమైన అంతమెప్పుడనీ ఉగ్రస్వరంతో వేసిన ప్రశ్నే ఈ నవల. పద్మప్రియ నవల: హరికేన్ సీజన్ రచయిత్రి: ఫెర్నాండా మెల్చోర్ స్పానిష్ నుంచి ఇంగ్లిష్: సోఫీ హ్యూస్ మూల నవల ప్రచురణ: 2017 -
రెండు వేల ఏళ్ల లంచావతారం
ఒక పరీక్షార్థం వచ్చే పరీక్షకునికి కానీ, అవతలి పార్టీవారి పక్షాన వచ్చే దూతకు కానీ లంచం ఇచ్చి తమ వైపు తిప్పుకునే అలవాటు కనీసం 13వ శతాబ్దం నాటికే ఉందని దీన్ని బట్టి నిక్కచ్చిగా తెలుస్తూ ఉంది. ఇక లంచం ఇచ్చే పద్ధతి నన్నయ నాటికి అంటే 11 వ శతాబ్దికి కూడా ఉందని చెప్పవచ్చు. ఇదే విషయం సంస్కృత భారతంలో కూడా వర్ణితమైన కారణంగా కనీసం రెండు వేల సంవత్సరాల నాడే ఈ పద్ధతి ఉందని చెప్పవచ్చు. మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాపసింగ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన మొదటి ప్రసంగంలోనే ‘‘లంచం అనేది భారత దేశంలో ఒక జీవన విధానం అయింది’’ అని చెప్పాడు. లంచం అనే పదానికి చాలా పర్యాయ పదాలు పుట్టాయి. ‘టేబుల్ కింద చేయి’, ‘చేయి తడపడం’, ‘గీతం’, ‘పై సంపాదన’, ఇలా చాలా వ్యక్తీకరణలలో మన భాషలో ఇది నిలబడింది. ‘లంచం లేనిదే మంచం ఎక్కడట’ అనే సామెత కూడా వచ్చింది. ఈ లంచం అనే పదం తెలుగు భాషలోనికి ఎప్పుడు చేరింది అని పరిశీలించివచ్చు. లంచం ఇవ్వడం అనే ఘట్టం ఆదికావ్యం మహాభారతంలోనే కనిపిస్తుంది. నన్నయ ఆది పర్వంలో అస్తీకుడి కథలో ఇది కనిపిస్తుంది. వారం రోజులలో తక్షకుడు అనే సర్పం కరవడం వల్ల నువ్వు మరణిస్తావని పరీక్షిత్తును శృంగి శపిస్తాడు. పరీక్షిన్మహారాజు పెద్ద ఒంటి స్తంభం మేడ కట్టుకొని దాని చుట్టూ కింద మంట పెట్టించి ఏ పామూ పైకి రాకుండా రాజవైద్యులను పెట్టుకొని ఉన్నాడు. కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఎంతటి విషాన్నైనా హరించి చనిపోయిన వారిని కూడా బతికిస్తాడని చెప్పగా ఆయనను కూడా పిలిపించమని భూరి దక్షిణలు ఇస్తామని పిలిపిస్తారు. రాజును బతికిస్తే ధనంతో పాటు ఇతర బహుమతులు వస్తాయని హస్తినాపురానికి బయలుదేరాడు కాశ్యపుడు. తక్షకుడు అడవి మార్గంలో వస్తూ కాశ్యపుని మార్గమధ్యంలోనే ఆపుతాడు. ‘నేను రాజును అతనికి ఉన్న శాపం ప్రకారం చంపబోతున్నాను. నేను ఏ ప్రాణినైనా చంపగలిగిన శక్తి ఉన్నవాడిని. నువ్వు రాజును ఎలా తిరిగి బ్రతికించగలవు?’ అని అడుగుతాడు. ‘నాకూ అంతటి శక్తి ఉంది. నేను ఏ విష ప్రభావాన్నయినా విరగ దీసి, తిరిగి బతికించగలను’ అని చెబుతాడు కాశ్యపుడు. ‘అయితే ఈ వృక్షాన్ని నేను కాటువేసి చంపుతాను, తిరిగి దీన్ని బతికించు, దానితో నీ శక్తి తెలుస్తుంది’ అంటాడు తక్షకుడు. అని ఒక పెద్ద వటవృక్షాన్ని కాటు వేస్తాడు. అది క్షణాలలో భస్మీపటలం అవుతుంది. వెంటనే కాశ్యపుడు ఒక మంత్రాన్ని పఠించి, తిరిగి దాన్ని బతికిస్తాడు. చెట్టు తిరిగి ఫల పుష్పాలతో ఎప్పటిలాగా బతికింది. తక్షకుడు ఆశ్చర్యపోయాడు. ఇతను రాజును తిరిగి బతికించగలడు అనే నమ్మకం వచ్చి, రాజు ఇచ్చే ధనాన్ని నేనే ఇస్తాను; నీవు వెనక్కు వెళ్ళి పో అంటాడు. దానికి కాశ్యపుడు అంగీకరించడు. రాజు ఇచ్చే ధనంకన్నా రెట్టింపు ఇస్తానని చెప్పి, తిరిగి ఇంటికి పోయటట్లు చేస్తాడు తక్షకుడు. తెలుగు సాహిత్యంలో లంచం ఇచ్చి పని చేయించుకున్న ఘట్టం మొదటి సారిగా వర్ణించబడింది ఇదే. ఇక్కడ లంచం అనే పదం వాడలేదు కాని ఈ విషయాన్ని స్పష్టంగా వర్ణించాడు నన్నయ. అయితే ఇది 11వ శతాబ్దంలోనే ఉంది అని అనుకోనక్కరలేదు. ఇదే కథ వ్యాసుని సంస్కృత మహాభారతంలో కూడా ఇదే విధంగా ఉంది(ఆది పర్వం 43వ అధ్యాయం). సూక్తాంకర్ సంశోధించిన వ్యాసభారతం భండార్కర్ ప్రతిలో ఈ వర్ణన యథాతథంగా ఉంది. కాశ్యపుడు తన పనికోసం బయలు దేరితే తక్షకుడు తన పని కావడానికి అవరోధంగా ఉన్న కాశ్యపుని తప్పించడానికి లంచం ఇచ్చాడని స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. అయితే తెలుగు భారతంలో కానీ, సంస్కృత భారతంలో కానీ దీన్ని ధనం అన్నారే కాని లంచం అనలేదు. కాని ఇక్కడ జరిగింది లంచమే. (కాశ్యప ఉవాచ: ధనార్థీ యాంయహం తత్ర తన్మే దేహి భుజంగమ! తతోహం వినివర్తిష్యే స్వాపతేయం ప్రగృహ్య వై!!) ఇదే తెలుగు మహాభారతంలో లంచం అనే పదాన్ని స్పష్టంగా వర్ణించిన ఘట్టం తిక్కన రచన అయిన ఉద్యోగపర్వంలో ఉంది. అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత పాండవులు ఒక దూతని కౌరవుల దగ్గరికి పంపుతారు. ధృతరాష్ట్రుడు సమాధానం అతనికి చెప్పకుండా తాము కూడా ఒక దూతని పంపించి మా అభిప్రాయం చెబుతాము అని అంటాడు. తర్వాత సంజయ రాయబారం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు రాజ్యం ఇస్తామని చెప్పకుండా మీరు అక్కడే ఉపప్లావ్యంలో సుఖంగా ఉండండి అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు పాండవ దూతగా వస్తున్నాడు అని తెలిసిన తర్వాత విదురుడు «ధృతరాష్ట్రుని కడకు వచ్చి మంతనాలు చేస్తాడు. స్వాగత ఏర్పాట్లు ఏం చేయాలో మంత్రి అయిన విదురునికి చెబుతూ– కం‘‘ వివిధ మణిమయ రథంబులు, జవనాశ్వంబులును, భద్రసామజములు ర త్న విభూషణములు దాసీ నివహంబులు జాల గృష్ణునికి నేనిత్తున్ (ఉద్యో. 3–157 పద్యం) ఇవన్నీ ఇద్దాము అంటాడు ధృతరాష్ట్రుడు. ఇంకా చాలా ఇవ్వాలి, పెద్ద ఉత్సవం చేయాలి అని నాలుగు పద్యాలలో వచనంలో కూడా చెబుతాడు. ఇదంతా విని విదురుడు, మహారాజా ఇప్పుడు కూడా మీరు సరిగ్గా ఆలోచించడం లేదు; వచ్చే దూతను ప్రీతుని చేయడానికి ఈ పనులు అన్నీ చేయడం ఎందుకు? దీని బదులు పాండవులకు కనీసం ఐదూళ్ళు ఇస్తే సరిపోతుంది కదా అని అంటాడు (పద్యం 158). తర్వాత ఒక పద్యంలో విదురుడు చెప్పిన మాటలని తిక్కన సూటిగా వర్ణిస్తూ దూతకి లంచం ఇస్తావా అని అంటాడు. ఉ‘‘ నీతలపేను గంటి నొక నేర్పున శౌరికి లంచ మిచ్చి సం ప్రీతుని జేసి కార్యగతి భేదము సేయగ జూచె దింత బే లైతి గదే సుమేరు సదృశార్థము జూచియు బార్థు బాయునే యాతడు క్రీడిభక్తియును నచ్యుతు పెంపును నీవెఱుంగవే. అతనికి అర్జునుడు అతి ప్రేమాస్పదుడైనవాడు కాబట్టి అచ్యుతుడు అతడు, నీ ఆలోచనలు మానుకో అని చెబుతాడు విదురుడు. ఒక పరీక్షార్థం వచ్చే పరీక్షకునికి కానీ, అవతలి పార్టీవారి పక్షాన వచ్చే దూతకు కానీ లంచం ఇచ్చి తమ వైపు తిప్పుకునే అలవాటు కనీసం 13వ శతాబ్దం నాటికే ఉందని దీన్ని బట్టి నిక్కచ్చిగా తెలుస్తూ ఉంది. ఇక లంచం ఇచ్చే పద్ధతి నన్నయ నాటికి అంటే 11 వ శతాబ్దికి కూడా ఉందని చెప్పవచ్చు. ఇదే విషయం సంస్కృత భారతంలో కూడా వర్ణితమైన కారణంగా కనీసం రెండు వేల సంవత్సరాల నాడే ఈ పద్ధతి ఉందని చెప్పవచ్చు. పైన చెప్పిన ఉద్యోగ పర్వ ఘట్టం వ్యాస భారతంలో కూడా ఇదే పద్ధతిలో వర్ణితం అయింది. లంచం అనే మాటకు ‘ఉత్కోచ’ అనే పదమే సాహిత్యంలో వాడారు. మోనియర్ విలియమ్స్ సంస్కృత–ఇంగ్లీషు నిఘంటువులో ‘ఉత్కోచ’ అంటే bటజీb్ఛ అనే అర్థాన్నే ఇచ్చింది. ధనం ఇచ్చి ఏమి ఇచ్చినా కృష్ణుని పొందలేవు, అర్జునునితో ఆయన బంధాన్ని విడదీయలేవు అని ధృతరాష్ట్రునికి చెప్పి ఐదు గ్రామాలనైనా ఇవ్వు అని అంటాడు. (ఉద్యోగపర్వం: 87–10, 11). లంచం అనే మాట ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఇంకా చాలా చోట్ల వినియుక్తమైంది. శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో ఈ మాటని వాడాడు. శా‘‘ కాంచీకంకణ తారహర ఘటికా గ్రైవేయ భూషావళుల్ లంచంబిత్తురు దూతికా తతికి లీల బెండపూడన్ననిన్ బంచాస్తోప్రము తారతార కవయం ప్రార్థించి లోలపలన్ పంచారామములందు బల్వెల పురిం ఫ్రౌఢేందు బింబాననల్ (ఆ. 1–77) అని శార్దూల పద్యంలో వర్ణిస్తాడు. ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే లంచం అనే మాట ప్రాస స్థానంలో ఉంది. పదిహేనో శతాబ్దంలో లంచం అనే మాటకు సంబంధించిన ఉనికికి ఇది తిరుగలేని సాక్ష్యం. శ్రీనాథుడు 15వ శతాబ్దం వాడు. భాగవతంలో కూడా లంచం అనే మాట ఉంది. పంచమ స్కందంలో శుకయోగి పరీక్షిత్తుకు నరక లోకాన్ని వర్ణించి చెప్పే ఘట్టంలో వివిధ శిక్షలను గురించి వర్ణిస్తూ చాలా పద్యాలు రాస్తూ ఒక సీసపద్యంలో– ‘‘లంచంబు గొని సాక్షి వంచించి యనృతంబు బలికెడు పాపాత్ము బట్టి కట్టి యంత మానక వీచియను నరకమందు శతయోజనోన్నత శైల శిఖరమున దలక్రిందుగా నునిచి యదోముఖంబుగ బడదొబ్బిన...’’ (పంచమ స్కందం –154) అని స్పష్టంగా వర్ణించాడు పోతన మహాకవి. దొబ్బిన అనే మాట కూడా వాడాడు. అంతే కాదు, లంచం తిని దొంగ సాక్ష్యం చెప్పే విషయం కూడా ఇక్కడ రికార్డు అయింది. పోతనామాత్యుడు కూడా 15వ శతాబ్ది వాడు. శ్రీనాథునికి సమకాలికుడు. ఓరుగల్లు ప్రాంతంలో కాకతీయుల పాలనలో కూడా లంచం తీసుకొని దొంగ సాక్ష్యాలు చెప్పే స్థితి ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక కుచేలోపాఖ్యానంలో కూడా కృష్ణుని భవనానికి పోయినప్పుడు అక్కడ ద్వారాల దగ్గర ఉండే కాపలా వారికి ఒకటో రెండే పణాలు ఇవ్వాలన్నా కూడా లేవే అని కుచేలుడు అనుకుంటాడని పోతన వర్ణించాడు. (దశమ. 972). ఇక్కడ ద్వారపాలకులకు ఇచ్చేదాన్ని పరిదానం అని అన్నాడు. ‘లంచపంచములు’ అనే జంటపదాల్ని కూడా కావ్యాలలో వాడారు. కువలయాశ్వ చరిత్రలో, పరమయోగి విలాసం అనే ద్విపద కావ్యంలోనూ లంచపంచములు అనే ప్రయోగాలున్నాయి. ఈ తర్వాతి కాలంలో కూడా లంచం అనేమాట ప్రయోగం అయింది. దశకుమార చరిత్ర (దుగ్గన), కేయూరబాహు చరిత్ర (మంచెన) లలో లంచమువెట్టు అనే ప్రయోగం ఉంది. ఈ సాహిత్య గ్రంథాలలోని సాక్ష్యాలను బట్టి నాటి సామాజిక జీవనం ఎలా ఉండేది అనే విషయం కూడా మనకు బాగా అవగతం అవుతూ ఉంది. పురాణపాత్రలే లంచం ఇవ్వడం తీసుకోవడం ఇవ్వజూపి పనులు చేయించుకునే తీరు గమనించాలి. మధ్యయుగాలలో లంచంతో దొంగ సాక్ష్యాలు చెప్పించే విషయం కూడా గమనించాలి. ఆ కాలం నుండీ నేటి దాకా దీని విశ్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి దీని చరిత్రను తెలుసుకోవడానికి ఈ సాహిత్య ఆకరాలు పనికి వస్తాయి. ప్రొ‘‘ పులికొండ సుబ్బాచారి -
నిలబడే ఇవ్వాలి
ఒకసారి మార్క్ ట్వేన్ ఉపన్యాసాలు ఇస్తూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అట్లా ఒక కొత్త ఊరికి వెళ్ళాడు. అక్కడ గడ్డం గీయించుకోవడానికి మంగలి షాపులోకి వెళ్ళాడు. మాటల సందర్భంలో తాను ఆ ఊరికి రావడం మొదటిసారి అని కూడా చెప్పాడు. మంచి దినాన వచ్చావు, ఇవాళ మార్క్ ట్వేన్ ఉపన్యాసం ఉంది. వెళ్లాలి అనుకుంటున్నావా? అని అడిగాడు, మంగలి. వెళ్లక తప్పదు, అన్నాడు మనవాడు. మరి టికెట్ కొన్నావా? అని అడిగాడు, అతను. లేదు, అన్నాడు ట్వేన్. అయితే ఉపన్యాసం సాంతం నిలబడి ఉండక తప్పదు, హెచ్చరించాడు అతను. మామూలుగా అంతే. ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చినా నేను నిలబడే ఉంటాను, జవాబిచ్చాడు ట్వేన్. -డా.కె.బి.గోపాలం -
ఆట ఆడించేది ఎవరు?
ఇరవైకి పైగా నవలలు రాసిన బ్రిటిష్ రచయిత్రి సారా పిన్‌బరో తాజా సైకలాజికల్ థ్రిల్లర్ ‘డెడ్ టు హర్’ ఫిబ్రవరిలో విలియమ్ మారో ప్రచురణ సంస్థ ద్వారా విడుదలయింది. మూడేళ్ల క్రితం ఆమె రాసిన ‘బిహైండ్ హర్ ఐస్’ స్థాయికి తగ్గకుండా, కేవలం థ్రిల్లర్ నవలకి ఉండే సాధారణాంశాలే కాకుండా ఆర్థిక స్థితిగతుల్నీ, మానవ బలహీనతల్నీ, ప్రేమకి సంబంధించిన వివిధ వర్ణాలనీ ఈ నవలలో పొందుపరచడం విశేషం. మనం ఆడే ఆటల్ని ఆడించే మహాశక్తి నిజానికి ఇంకేదో ఉంటుందని అందరూ అంటారు కానీ, ఈ నవలలో ఆ మహాశక్తి రూపం కొంత భిన్నంగా ఉంటుంది; ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది. కథలోకి వెళ్తే– చాలా ఏళ్ల క్రితం కొడుకునీ, ఈ మధ్యనే భార్యనీ కోల్పోయిన దాదాపు డెబ్భై ఏళ్ల విలియమ్ అనే సంపన్నుడి సంస్థలో జేసన్ భాగస్వామి. జేసన్ భార్యనుంచి అతని దృష్టి మరల్చి, అతన్ని విడాకులకి ప్రోత్సహించి, మర్సీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ల కాపురం బానే సాగుతున్న సమయంలో, వ్యాపార లావాదేవీల నుంచి బ్రేక్ కావాలని విలియమ్ ఒక సంవత్సరం పాటు యూరప్ అంతా తిరిగివస్తానని వెళ్లి, ఆరునెలల్లోనే ఇంగ్లండ్‌లో కెయీషా అనే ఇరవై రెండేళ్ల మెరుపుతీగని పెళ్లిచేసుకుని తిరిగివస్తాడు. అప్పటివరకూ కమ్యూనిటీలో అందమైన పిన్నవయస్కురాలి హోదాని అనుభవిస్తున్న ముప్పై అయిదేళ్ల మర్సీలో ఒక చిన్న అసూయ మొదలవుతుంది. దీనికి తోడు, జేసన్ చూపులు కెయీషాని పరిశీలించే పద్ధతి అనుమానాన్ని పుట్టిస్తుంది; జేసన్ అర్ధరాత్రి లేచి మాట్లాడే కాల్స్, పంపే మెసేజెస్ ఆ పెనుభూతాన్ని స్థిరపరుస్తాయి. మర్సీ, కెయీషా– ఇద్దరూ రెండో భార్యలే. ఇద్దరూ బీద నేపథ్యం గలవారే. ఇద్దరూ స్టేటస్ కోసం ఈ పెళ్లిళ్లు చేసుకున్నవారే. కానీ, అన్ని విషయాల్లోనూ కెయీషాదే పైచేయిగా ఉందిప్పుడు. విలియమ్ కంపెనీని తను కొనేసే ఉద్దేశంతో ఉన్న జేసన్, కెయీషాతో భార్యని స్నేహంగా ఉండమంటాడు. పుండు మీద కారం చల్లినట్టవుతుంది మర్సీకి. చివరికి మర్సీకి కెయీషా స్నేహితురాలు అవుతుంది. కానీ, విచిత్రమైన పరిస్థితుల్లోకి ఆ స్నేహం విస్తరిస్తుంది. ‘‘ఇతరులు మనగురించి ఇలా అనుకుంటారేమో అని మనం భయపడుతూ ఉండేది నిజంగా మనం మనగురించి అలా అనుకునేదే!’’ అని కెయీషా మర్సీకి ఆలంబన అవుతుంది. ఆ స్నేహపు సన్నిహితత్వంలో మరిన్ని విషయాలు తెలుస్తాయి. విలియమ్ తొందరగా చచ్చిపోతే బాగుండునని కెయీషా ఎదురుచూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడినుంచి కథ ఊహించినదానికి విరుద్ధంగా విచిత్రమైన మలుపులు తిరుగుతూ, మంత్రతంత్రాలూ, వూడూలు లాంటి పక్కదోవ పట్టించే విషయాలతో సాగుతూ, ఊహించని ఘట్టాలకి చేరుతూ ఉంటుంది. ముళ్లు బిగుసుకుపోయిన పరిస్థితుల్లో మర్సీ చాలా పరిశోధన చేసి చాలా ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకుంటుంది. ఈ ఆట రహస్యం మొత్తం తన గుప్పిట్లో ఉందనుకుంటున్న సమయంలో, ఆ ఆటలో తన పాత్ర ఏమిటో తెలుసుకునే పరిస్థితి వస్తుంది! ముందే చెప్పినట్టు, ఈ నవల కేవలం థ్రిల్స్‌కి మాత్రమే పరిమితం కాకుండా, చేరుకున్న ప్రతి దశా ఎన్ని ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుందో చూపిస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన స్నేహం ఎలా ఉంటుందో ఒకవైపూ, డబ్బాశ అంటుకున్న స్నేహం ఎలా ఉంటుందో మరో వైపూ చూపిస్తుంది. ప్రేమల్లో రకాలనీ, గాఢతల్నీ, పలచబారటాల్నీ చూపిస్తుంది. నవల మొదటి సగం కొంచెం నిదానంగా సాగినట్టు అనిపించినా, చకచకా నడిచే రెండో భాగానికి అది సరైన పునాదులు వేస్తుంది. అన్నీ మన అధీనంలో ఉన్నాయని ధీమాగా ఉండేవాళ్లు నిజానికి ఎలా పరాధీనంగా ఉండివుండే అవకాశం ఉందో చూపించిన తీరు మాత్రం నవల చదివి ఆశ్చర్యపడాల్సిన విషయం! (నవల: డెడ్ టు హర్, రచయిత్రి: సారా పిన్‌బరో, విడుదల: 2020 ఫిబ్రవరి) -ఎ.వి. రమణమూర్తి -
కలం చెప్పిన వైరస్ కథలు
రవి గాంచనిది కవి గాంచును అంటారు. ఇవాళ ప్రభుత్వాలు ఊహించనది, ఒకప్పుడు రచయితలు ఊహించారు. సాహిత్యంలో సైన్సు ఫిక్షన్ ఒక భాగం. కొందరు రచయితలు తమ కాలం కంటే ముందుకెళ్లి మానవాళికి రాబోయే ప్రమాదాలను తమ రచనల్లో ఆవిష్కరించారు. ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘వైరస్’ల ప్రమాదఘంటికలు మోగించిన పుస్తకాలను కొన్నింటిని పరిశీలిద్దాం. గతంలో మానవాళి మీద చాలా వైరస్‌లే వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వైరస్ ప్రపంచాన్నే లాక్డౌన్ చేయించింది. దీని వ్యాప్తి తెలియకుండానే, అప్రయత్నంగానే జరుగుతుండటం ఒక కారణం. దీనికి ఇంకా మందు కనిపెట్టలేకపోవడం మరో కారణం. ఈ వ్యాధి సోకినవారు, సోకినవారి ద్వారా మరొకరికి సోకే సమయాలు కనిపెట్టలేకపోవడం ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం. రచయితలు మనుషులకు వచ్చే సమస్యలను తమ కథాంశాలుగా చేసుకున్నట్టే ఈ ‘వైరస్’లను కూడా తమ కథాంశాలు చేసుకున్నారు. వాటి కథాకమామీషు ఒకసారి చూద్దాం. నాన్ ఫిక్షన్ ►వైరస్ చరిత్ర, శాస్త్ర సమాచారం, ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న మొదటి పుస్తకం ‘అండ్ ద బ్యాండ్ ప్లెయిడ్ ఆన్’. రచయిత రాండీ షిల్ట్స్. 1987లో మొదటిసారిగా ఎయిడ్స్ విజృంభణ మొదలైనప్పుడు, దానిని ప్రజలింకా జోక్ స్థాయిలో చూస్తున్నప్పుడు అమెరికా జర్నలిస్ట్ రాండీ ఆ వైరస్ గురించి ఈ పుస్తకంలో రాశాడు. ఇలాంటి వైరస్లు ప్రబలినప్పుడు ప్రభుత్వాలు వాటిని ఎలా నిరోధించలేకపోతాయో చెప్పాడు. ►1854లో లండన్ జనాభాను బలి తీసుకున్న కలరా గురించి రచయిత స్టీవెన్ జాన్సన్ రాసిన పుస్తకం ‘ద ఘోస్ట్ మాప్’. కలరా మహమ్మారి తర్వాత సైన్స్ పరిశోధనల్లోనూ, నగర నగర నిర్మాణ శాస్త్రంలోనూ పెనుమార్పులు వచ్చాయి. ►ఎబోలా గురించి తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ అది. దీని గురించి రచయిత రిచర్డ్ ప్రెస్టన్ ‘ద హాట్ జోన్’ అనే పుస్తకం రాశాడు. ఎబోలా వైరస్ పుట్టుక, వ్యాప్తిని హారర్ నవలలోలాగా వర్ణించాడు రచయిత. ఆఫ్రికా వర్షారణ్యాలలో ఆవిర్భవించి అనతికాలంలోనే దేశదేశాలకూ పాకిన వ్యాధి అది. ఎబోలా ఒక పీడకల. పునరావృతం కాదని చెప్పలేం. ►1918 నాటి ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి గురించి రచయిత్రి జినా కోలటా రాసిన పుస్తకం ‘ఫ్లూ’. ఈ ఫ్లూనే స్పానిష్ ఫ్లూ అని అంటారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వాళ్ల కన్నా రెట్టింపు జనాభాను ఈ ఫ్లూ కబళించింది. ఒక్క అమెరికాలోనే అయిదు లక్షల మంది మరణించారు. ఇది ప్రపంచాన్ని మరోసారి చుట్టి వస్తుందేమోనని శాస్త్రజ్ఞులు భయపడుతూనే ఉన్నారు అంటుంది అమెరికా పాత్రికేయురాలు కోలటా. ►గత అయిదు లక్షల ఏళ్లుగా మానవజాతిని శాసించిన మలేరియా గురించిన కథనం ‘ద ఫీవర్’. 2010లో వచ్చిన ఈ పుస్తకం పూర్తి పేరు ‘ద ఫీవర్: హౌ మలేరియా హాజ్ రూల్డ్ మేన్‌కైండ్ ఫర్ 5,00,000 ఇయర్స్’. రచయిత్రి సోనియా షా. మన జీవన విధాతగా దోమ ఎలా మారిందో ఈ పుస్తకం చెబుతుంది. సోనియా, భారతీయ మూలాలున్న అమెరికా పాత్రికేయురాలు. ►అమెరికా చరిత్రకారిణి బార్బరా టక్మాన్ ‘ప్లేగ్’ గురించి రాసిన 1978నాటి ‘ఎ డిస్టంట్ మిరర్: ద కలమిటిస్ ఫోర్టీన్త్ సెంచరీ’ ఫ్రతిష్టాత్మక పురస్కారం పొందిన శాస్త్ర గ్రంథం. 14వ శతాబ్దంలో యుద్ధం, మతోన్మాదం వంటి భౌతిక పరిస్థితులు ప్లేగు వ్యాపించడానికి ఎలా కారణమయ్యాయో ఈ పుస్తకం చెబుతంది. ►ఆటలమ్మ (స్మాల్‌పాక్స్) కూడా ఒక మహమ్మరి. 18వ శతాబ్దపు ఉత్తరార్థంలో ఉత్తర అమెరికాను గడగడలాడించిన ఆ వ్యాధి ఆ దేశ చరిత్రనే మార్చివేసింది. ఆటలమ్మ గురించి ఆ రోజుల్లో ఎన్నెన్ని కథలు ప్రచారంలో ఉండేవో. ఎలిజబెత్ ఎఫెన్ రాసిన ‘పాక్స్ అమెరికానా’ అద్భుతమైన కథనంతో పాఠకులను కట్టిపడేస్తుంది. ఫిక్షన్ కొందరికి నాన్ఫిక్షన్ ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న ‘తప్పనిసరి తీరిక సమయం’ లో కథల లోకంలో విహరిద్దామనుకుంటే ‘వైరస్’ కథాంశంగా గల కొన్ని నవలలనైనా చదవండి. ►ఈ జాబితాలో మొదట చెప్పుకోవలసింది హోసె సారమాగో (నోబెల్ బహుమతి పొందిన పోర్చుగీస్ రచయిత) రాసిన 1995 నాటి నవల ‘బ్లైండ్నెస్’. కథాకాలం 1990. ఒక వ్యక్తి టాక్సీలోంచి దిగబోతూ అకస్మాత్తుగా అంధుడైపోతాడు. ఆ తర్వాత టాక్సీ డ్రైవర్ కూడా అంధుడైపోతాడు. క్రమంగా అందరూ అంధులుగా మారిపోతుంటారు. ఇక్కడ అంధత్వం ఒక వైరస్ కావచ్చు, ఒక ప్రతీక కూడా కావచ్చు. ►ఫ్రెంచ్ రచయిత ఆల్బర్ట్ కామూ రాసిన ‘ద ప్లేగ్’ చాలామంది చదివే ఉంటారు. ఇరవయ్యవ శతాబ్దంలో మహమ్మారుల గురించి వచ్చిన అన్ని నవలలకూ ‘బైబిల్’ లాంటిదిది. అల్జీరియాలోని ఓరాన్‌లో వచ్చిన ప్లేగు గురించే రాసినప్పటికీ ‘ప్రజలలో ఫాసిస్టు భావజాలం దాగివున్నంత కాలం దీన్నెవరూ ఆపలేరు’ అంటాడు కామూ. ఈజిప్షియన్లు, గ్రీకులు, ఫిన్నిష్‌లు, హిందువులు– అందరూ మహమ్మారుల కోసం దేవతలను సృష్టించుకున్నారు. ‘పాండోరా’ తన వద్ద ఉన్న పెట్టె తెరిస్తే అందులో నుంచి బయటికొచ్చి మహమ్మారులు లోకమంతా వ్యాపించాయని కథ ఉంది కదా. ► 14వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ రచయిత బొకాషియో రచించిన ‘ద డెకామెరాన్’ చాలా ప్రసిద్ధ నవల. ‘బ్లాక్‌డెత్’ అనబడే ప్లేగు నేపథ్యంలో పాత్రలు చెప్పుకునే జ్ఞాపకాలే ఈ నవల. వ్యంగ్యం హాస్యం కూడా ఉంటాయి గాని శృంగారానికే యివి ప్రసిద్ధి. అదే శతాబ్దానికి చెందిన ఇంగ్లిష్ కవి జాఫ్రీ ఛాసర్ రాసిన ‘ద కాంటర్బరీ టేల్స్’ నేపథ్యం కూడా ప్లేగే. ఈ కథల ద్వారా పాత్రలు ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటాయి. ►‘రాబిన్సన్ క్రూసో’ రచయిత డేనియల్ డెఫో 1722లో ‘ఎ జర్నల్ ఆఫ్ ద ప్లేగ్ ఇయర్’ ప్రచురించాడు. 1995లో లండన్‌లో వేలాదిమందిని బలిగొన్న బుబోనిక్ (ఈగల ద్వారా వ్యాపించే) ప్లేగ్‌ను అత్యంత వాస్తవికంగా చిత్రించిన కథనం యిది. ►ఇక 1985లో నోబెల్ గ్రహీత గేబ్రియల్ గార్షియా మార్కెజ్ ప్రచురించిన ‘లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా’ చాలా ప్రసిద్ధం. ఇది ఒక ప్రేమకథ. స్పానిష్‌లో ‘కలరా’ అన్న పదానికి ‘కోపం’ అనే అర్థం కూడా ఉంది. మహమ్మారులను కట్టడి చెయ్యడానికి డాక్టర్లున్నారు. మన లోపలి కోపం, ద్వేషాగ్నులను ప్రేమ మాత్రమే ఆపగలదు అంటాడు మార్కెజ్. ►2006లో వచ్చిన నవల ‘ద రోడ్’. రచయిత కార్మాక్ మెకార్తీ. మానవజాతి చివరిదశలో సమాజం, నాగరికత, వ్యక్తి సంబంధాలు ఎలా పతనమవుతాయో అత్యంత భయానకంగా చిత్రిస్తుంది. ఈ నవల ధైర్యం ఉన్న గుండెలకే. ఈ అమెరికన్ రచయిత దీనికిగానూ పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ నవల 2009లో ఇదేపేరుతో సినిమాగా వచ్చింది. పుస్తక పఠనం మానసిక స్థయిర్యాన్ని పెంచుతుంది. అవగాహనను కల్పిస్తుంది. కనుక ఈ పుస్తకాలు చదవుదాం. లేదా నచ్చిన పుస్తకాలు చదువుదాం. -ముక్తవరం పార్థసారథి -
బహుమతులు
ఆంధ్రా షేక్స్పియర్గా, అభినవ కాళిదాసుగా ఎనలేని గుర్తింపు పొందిన సాక్షి వ్యాసాల రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావు చక్కటి హాస్యప్రియులు. ఆయన జీవిత చరమాంకంలో జరిగిన ఉదంతం ఇది. ఆ సమయంలో వృద్ధాప్య సమస్యలు ఆయన్ని వెంటాడుతున్నాయి. అలాంటి రోజుల్లో– ఓ సాహిత్య సమాజం వారు పానుగంటి వారికి భారీఎత్తున సత్కారం చేశారు. సభకు అధ్యక్షత వహించిన ఆ సమాజ నిర్వాహకుడు, చంద్రునికో నూలుపోగులా పానుగంటి వారికి బహుమతులు అందజేస్తున్నామని ఉత్సాహంతో ప్రకటించారు. దానికి పానుగంటి స్పందిస్తూ, ‘ఉన్న ఒక్క మతి పోయింది. దానికే ఇబ్బంది పడుతుంటే నాకు బహుమతులేల?’ అనేసరికి సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది. - వాండ్రంగి కొండలరావు -
అరబిక్ సాహిత్యంలో ధ్రువతార
నాగీబ్ మహఫూజ్ (1911–2006) ఈజిప్ట్ దేశానికి చెందిన రచయిత. 22 సంవత్సరాల వయసులోనే రాయడం మొదలుపెట్టాడు. మొదట్లో దేశభక్తితో కైరో గురించి మూడు చారిత్రక నవలలు రాశాడు. నిజానికి భాషా సాహిత్యం చదువుకోవాలి అనుకున్న మహఫూజ్ పెద్దల బలవంతం వల్ల సామాజిక శాస్త్రం చదవవలసి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాడు. గుమస్తాగా చేరిన అతను చివరకు తమ దేశపు సాంస్కృతిక శాఖకు సలహాదారుగా రిటైర్ అయ్యాడు. 70 ఏళ్ల రచనా వ్యాసంగంలో 34 నవలలు రాశాడు. 350 దాకా కథలు రాశాడు. చాలా సినిమాలకు స్క్రిప్టు రాశాడు. ఈజిప్టులోనూ, మొత్తం అరబ్బు ప్రపంచంలోనూ ఈయన రచనలు ఆధునిక క్లాసిక్స్‌గా గుర్తింపబడ్డాయి. ఆయన రచనల ఆధారంగానే ప్రస్తుత కాలపు అరబిక్ సాహిత్యం నిలబడిందని చెప్పవచ్చు. 1988లో మహఫూజ్ కు నోబెల్ బహుమతి ఇచ్చారు. ‘అరబిక్ సాహిత్యంలో నవల అన్నది 20వ శతాబ్దంలోనే మొదలైంది. అంటే ఇంచుమించు నాగిబ్ మహఫూజ్తోనే మొదలయింది అనవచ్చు. అంతకుముందు ఒకరిద్దరు మాత్రమే రచయితలు ఉన్నారు. మహఫూజ్ ఈ రచనా ధోరణిని ప్రామాణికంగా మార్చాడు’ అని ఈ సందర్భంగా స్వీడిష్ అకాడమీ వ్యాఖ్యానించింది. మొదట్లో చారిత్రక, పౌరాణిక నవలలు రాసిన మహఫూజ్ సమాజాన్ని బాగా పరిశీలించడం నేర్చుకున్నాడు. త్వరలోనే తన రచనా పద్ధతి మార్చుకున్నాడు. నవలలు, కథలు అన్నింటిలోనూ తన చుట్టూ కనిపించే మనుషులు, మనస్తత్వాలు, ప్రదేశాలు మొదలైన వాటి గురించి సూటిగా రాయడం మొదలు పెట్టాడు. ఆయన నవలలు చదువుతుంటే ఒక విచిత్రమైన పరిచిత ధోరణి కనపడుతుంది. మధ్య తరగతి మనుషులు, వాళ్ల మామూలు వాతావరణం కూడా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఖాన్ అల్ ఖలీలీ, మిదాఖ్ అలీ లాంటి నవలలు అన్నీ ఈ ధోరణిలోనే సాగుతాయి. సన్నివేశాలలో మనం ఉన్నామన్న భావన కలుగుతుంది. మామూలు మనుషుల సాయంతో అతను ప్రపంచం మొత్తం గురించి చెపుతాడు. సంప్రదాయంలో పాతుకుపోయిన అరబ్ సమాజానికి, ముఖ్యంగా రచయితలకు సమకాలీన సమాజం మీద ప్రగతి మార్గంలో చర్చించడం, పాలకులకు ధిక్కార స్వరం వినిపించడం నేర్పిన రచయిత మహఫూజ్. సల్మాన్ రష్దీ విషయంగా ఇతను అనుసరించిన ధోరణి అప్పటికే అతని రచనలతో విసిగిన ఛాందసవాదులకు నచ్చలేదు. మహఫూజ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. దేశంలోని పరిస్థితులను విమర్శిస్తూ వ్యాసాలు మాత్రమే కాక, అదే అంశంతో కథలు, నవలలు కూడా రాశాడు. చివరికి ఇతడిని రాజకీయాల గురించి రాస్తాడు, అనే దాకా పరిస్థితి వచ్చింది. మహఫూజ్ సుమారు 94 సంవత్సరాలు బతికాడు. మరణానంతరం కూడా ఆయన రచనలు అయిదు అచ్చయ్యాయి. వాటిలో ద క్వార్టర్ అన్నది మరీ ప్రత్యేకమైన రచన. అది 18 చిన్న కథానికల సంకలనం. 1994లో అచ్చు కావాలి అని మహఫూజ్ దాన్ని దాచుకున్నాడు. కానీ ఆ పని జరగలేదు. అరబ్ భాషలోనే ఆ రచన అతని మరణం తరువాత అచ్చయింది. - డాక్టర్ కె.బి.గోపాలం -
జీవిత చిత్రంలో ఖాళీలు
నవల : ఇన్‌డెలికసీ రచన : అమీనా కెయిన్ ‘‘మళ్లీ ఒంటరితనం– వింతగా ఉందిప్పుడు. నా మధ్యాహ్నాలన్నీ నాక్కావలసిన దానికంటే ఎక్కువ విస్తారంగా ఉన్నాయి. నాతో నాకు కావలసినంత ఏకాంత సమయం, తోడుగా ఉన్న రచనాన్వేషణలో నాలో నన్ను కనుక్కుంటూ నేను...’’ మనిషి తన చేతనతో మమేకమవడానికీ, తన అస్తిత్వాన్ని గుర్తెరగడానికీ చేసే ప్రయత్నాన్నీ, ప్రయాణాన్నీ ఒక కవితాత్మక కథగా చెప్పగలగటం అమెరికన్ రచయిత్రి అమీనా కెయిన్ రాసిన తొలి నవల ‘ఇన్‌డెలికసీ’లో సాధించడం చూస్తాం. గత నెలలోఎఫ్.ఎస్.జి. ద్వారా ప్రచురింపబడిందీ పుస్తకం. ఒక మ్యూజియమ్‌లోని ఆర్ట్ గాలరీలో పెయింటింగ్స్, గదులూ శుభ్రం చేసే చిరుద్యోగి విటోరియా. గతకాలాల ఇరుకుదనాన్ని పట్టించుకోకుండా, ఉన్నంతలో ఒంటరిగా ధైర్యంగా హాయిగా బ్రతుకుతున్న వ్యక్తి. ఉద్యోగమూ, సంపాదనా తృప్తినివ్వకపోయినా జీవితంలోని స్వేచ్ఛని ఆస్వాదిస్తూ ఉంటుంది. రచయిత్రి కావాలన్న కోరికకు డబ్బూ సమయమూ రెండూ కరువైనా, ప్రతిరోజూ చూసినవాటి గురించి రాసుకుంటూ ఏనాటికైనా ఒక పుస్తకం ప్రచురించాలన్న ఆశతో ఉంటుంది. ఇంతలో, ఆర్ట్ గాలరీ చూడటానికి వచ్చిన ఒక సంపన్నుడు విటోరియాని పెళ్లిచేసుకుంటాడు. వివాహమైన తరవాత విటోరియాకి ప్రేమగా చూసుకునే భర్తతో పాటు తనకంటూ గదీ, రాసుకోవటానికి సమయం, స్వేచ్ఛ దొరుకుతాయి. ఈత కొట్టడం, బాలెరీనాలు చూడటం నేర్చుకోవటం వగైరాలు చేస్తూంటుందామె. కళల పట్ల ఆసక్తీ, తనకేం కావాలో తెలుసుకోవాలన్న తపనా, చూసిన విషయాల గురించి రాసే అలవాటూ ఆమెని వదిలిపెట్టవు. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఏదో అసంతృప్తికి లోనవుతుంటుంది. రచయిత్రులంటేనే చిన్నచూపు ఉన్న భర్తకు తన రాతలపట్ల కూడా గౌరవం లేదని ఆమెకు తెలుసు. దీనికితోడు ఇంటి మెయిడ్ అయిన సొలాంజ్తో ఆమెకు సఖ్యత ఏర్పడదు. తనకున్న తపనకు ఇంటి బాధ్యతలు, భర్త స్నేహితులూ, వాళ్లతో పార్టీలూ అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆమెకు. ఇవన్నీ అర్థం చేసుకోని భర్త వల్ల విటోరియా ఒంటరితనానికి గురై, సంసార జీవితానికి కూడా దూరంగా ఉంటూ, భర్తనుంచి విడిపోవాలని అనుకుంటుంది. విడిపోయినా, మళ్లీ ఉద్యోగం చేసే అవసరం లేకుండా ఉంటే బావుండునని అనుకుంటున్నప్పుడే, భర్తకూ సొలాంజ్కూ మధ్య ఉన్న సంబంధం బయటపడుతుంది. వారి బంధానికి పరోక్షంగా కారణం తనే అయినా, భర్తనుంచి విడిపోవడానికే సుముఖత చూపిస్తుంది. మళ్లీ ఒంటరి జీవితం– కానీ, ఈసారి చాలినంత డబ్బు, రాసుకునే తీరికా, ఇతర బాధ్యతలేమీ లేని జీవితం మొదలవడంతో కథ ముగుస్తుంది. విటోరియా ఉద్యోగస్తురాలైనప్పుడూ, వివాహమైనప్పుడూ, భర్తనుంచి విడిపోయిన తరువాతా– ఎప్పూడూ తనదైన పద్ధతిలోనే స్వేచ్ఛామార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది. పెయింటింగ్స్ పరిశీలించటం, వాటిలో తన ఆలోచనలనూ ఆశలనూ వెతుక్కోవడం విటోరియాకి ఇష్టమైన వ్యాపకం. ‘‘నేను మ్యూజియంలో పనిచేస్తున్నప్పుడు ఒకోసారి కిటికీలోంచి బయటకి చూస్తూ నిలబడిపోయేదాన్ని. కిటికీ అద్దాల్లో నా వెనక ఉన్న పెయింటింగ్స్ ప్రతిఫలించేవి– నాతో సహా. వాటితోపాటు నన్నలా చూసుకోవటం ప్రత్యేకంగా అనిపించేది. ఇంకోలా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నట్టు, నన్ను నేను సరికొత్తగా చూసుకుంటున్నట్టు,’’ అంటుంది విటోరియా. పెయింటింగ్స్‌లో చిత్రంతో బాటు పక్కనే ఉన్న ఖాళీలూ, ఆ ఖాళీలను నింపిన వర్ణాలు కూడా ఏదో చెప్తున్నట్టే తోచేదామెకు. విటోరియా జీవిత చిత్రంలో పెయింటింగ్స్ ఒక వర్ణంలా కలిసిపోతే, రచనా జీవితంలోని పదాలు అంతరంగపుటావిష్కరణలు. తనలో ఉన్న అసంపూర్ణతల గురించి విటోరియాకి స్పృహ లేకపోలేదు. ఏకపక్షపు నిర్ణయాలతో భర్తని దూరం చేసుకోవడం, వివాహం అక్కర్లేకపోయినా దాన్నుంచి వచ్చే భరణాన్ని మాత్రం ఆశించడం లాంటివి విటోరియాని మరీ ఎక్కువగా ఆదర్శవంతం చేయకుండా, సగటు వ్యక్తి స్థాయిలో నిలిపే వాస్తవ ప్రయత్నం చేస్తుంది నవల. సౌజన్యం కొంతమేరకు కొరవడిన పాత్రతో నవలకి ‘ఇన్‌డెలికసీ’ అన్న పేరూ, వ్యక్తిత్వపు ఛాయల సమతూకం సాధించిందన్న పేరుకి నవలా ఒకదానికొకటి సరిపోయాయి! - పద్మప్రియ -
ఇదేమీ ప్రపంచానికి అంతం కాదు
ప్రతి చర్యా, ఏమాత్రం ప్రత్యేకత లేనిది కూడా ఒక కొత్త విలువను సంతరించుకుంది. నాకు తెలుసు, ఈ త్యాగం అవసరమేననీ, వివిధ స్థాయిల్లో ఇది మంచికే దారితీస్తుందనీ. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి అంతా దాటిపోయాక, మనం ప్రాథమికంగా దుర్బలులమనీ మన చర్యలకు పర్యవసానాలుంటాయనీ మనం మరచిపోనప్పుడు మాత్రమే. ‘‘మీకు వీలైతే ఇంట్లోనే ఉండండి’’ వాళ్ళు మొదట్లో చెప్పిందిదే. నేను ఉండగలిగాను. ఇంటినుండే ఒక చిన్న ప్రచురణ సంస్థని నడుపుతున్నాను కాబట్టి ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతాను. నేనేం భయపడలేదు. నేనిది చేయగలనని నాకు నేనే చెప్పుకున్నాను. ఇది దేన్నీ మార్చదు. తర్వాత ఆ సలహా ఒక ఆజ్ఞ అయింది. ‘ఇంట్లోనే ఉండండి!’ అని వాళ్ళు చెప్పారు. మొత్తం మారిపోయింది. ఇంటిబయటేదో జంతువు వేటకోసం తిరుగుతున్నట్లుగా మేం జీవిస్తున్నాం. ఎప్పుడది వేటలో అలసిపోయి వెనుతిరిగిపోతుందో ఎవరికీ తెలియదు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే మా ప్రియమైన ఫ్లోరెన్స్ నగర వీధులు ఇప్పుడు పూర్తి ఖాళీగా ఉన్నాయి. ఈ హఠాత్ నిశ్శబ్దానికి ఖంగుతిన్న పావురాలు, గువ్వపిట్టలు, కారునల్లని కాకులు, నమ్మలేనట్టుగా ఒకదాన్నొకటి చూసుకుంటున్నాయి. వసంతకాలం వస్తోంది కాని, దాన్ని ఆస్వాదించే స్థితిలో లేమని మాకు తెలుసు. పార్కులో నడవడమో స్నేహితులింటికి వెళ్ళిరావడమో వంటి ఇంతకుముందు పెద్దగా విలువనివ్వని పనులన్నీ ఇప్పుడు మాకందుబాటులో లేనంతటి విలాసవంతమైనవిగా తోస్తున్నాయి. నిజానికిది సమావేశాలను స్వాగతించే సమయం; కానీ మనం ఒకరికొకరు దూరంగా ఉండాలనీ, దగ్గరగా వచ్చేవారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలనీ చెప్తున్నారు. ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో, మనం మళ్ళీ సురక్షితంగా ఉన్నామని భావించేందుకూ, చెంప మీద ముద్దుపెట్టుకొని ఒకరినొకరం పలకరించుకోవడానికీ ఎంత సమయం పడుతుందో? ఇంట్లో ఉండటం విసుగు పుట్టిస్తోందంటూ మనం గులుగుతున్నప్పుడు నిరాశ్రయులైన జనమంతా ఎక్కడికి వెళ్ళుంటారు? రోజురోజుకీ ఎంతగా మరింతగా బిగిసిపోతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ కనీసం మాకు ఇల్లంటూ ఒకటుంది. ఆ వారానికవసరమైన ఆహార పదార్థాల్ని పక్కకు తీస్తూ నాతో నేనే చెప్పుకున్నాను: సూపర్ మార్కెట్ల వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎంత తక్కువ సమయం గడిపితే అంతమంచిదని, ఎట్టి పరిస్థితులలోనూ కుటుంబం నించి ఒక్క సమయంలో ఒక్క సభ్యుడు మాత్రమే ఆహార పదార్థాలను కొనేందుకు అనుమతించబడాలని, అలా వెళ్ళేవారు తాము బయటకు వచ్చిన కారణాన్ని తెలిపే పత్రాన్ని తప్పకుండా తమతో తీసుకెళ్లాలనీ, ఆ కారణం తప్పుగా తేలితే వారిపై చర్యలు తప్పవనీ. మేమేమీ యుద్ధకాలంలో జీవించడంలేదు, మాకు అవసరమైనవన్నీ– ఆహారం, ఆటవిడుపులు, పుస్తకాలు, సంగీతం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కమ్యూనికేట్ చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం– ఉన్నాయి. కానీ గత కొన్ని రోజులుగా నేను చెవుల్లో ఏదో బయ్యిమంటున్న శబ్దంతో మేల్కొంటున్నాను. నిద్రలేస్తాను, కాఫీ తాగుతాను, కంప్యూటర్ వద్ద కూర్చుంటాను, నా భర్తతో పిచ్చాపాటీ మాట్లాడతాను, లంచ్ తయారు చేస్తాను, ఇంకాస్త ఎక్కువ పని చేస్తాను, రాత్రి భోజనం ముగిస్తాను– ఇన్ని వేళల్లోనూ ఆ బయ్యిమనే శబ్దం అలాగే ఉంటుంది– నేనింకా చూడగలిగిన తాకగలిగిన వాటిని నా నుంచి వేరుచేసే ఒక సన్నని తెరలాగా. నాకోసమని నిర్దేశించిన ఒక నిర్దిష్ట ప్రణాళికను అమలు చేస్తున్న మరమనిషిని నేను. నా మనస్సు ఒక క్రొత్త, చలనం లేని శరీరంతో – మాకిప్పుడు ఇంట్లోంచి బయటకొచ్చి ఇంటికి మరీ దూరంపోకుండా ఒంటరిగా నడిచేందుకు అనుమతి ఉంది – తాను ఒకప్పుడు చేసిన పనులేవీ ఇప్పుడు చేయలేని స్థితిలోవున్న ఒక శరీరంతో– సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఒంటరితనం, నాలో నేననుకున్నాను. రేపటి గురించిన అనిశ్చితి. ఆక్సిజన్ లేకపోవడం. వాస్తవమేమిటంటే, ఈ శ్మశాన నిశ్శబ్దంలో –నగర ధ్వనులు సద్దుమణిగిపోయాయి, శాన్తా క్రోచె కొట్టే గంటలు మాత్రమే నా రోజులను వినిపిస్తాయి – ఇప్పుడు మనం మన ఆలోచనల పూర్తి బరువును అనుభూతి చెందుతున్నాము. ‘నాకింక వేరే మార్గం లేదు, నేను నిన్ను ఆపవలసి వచ్చింది’ అని చెప్తోన్న ఒక స్వరం నా వెనుకనేవుంది. ఇదీ దాటిపోతుంది, కానీ దీన్ని మర్చిపోవద్దు. అందువల్లనే నేను అనారోగ్యం వల్లనో, ఆర్థిక సంక్షోభం వల్లనో, నిర్దేశిత సూచనలను కోల్పోవడం ద్వారా కలిగే భయంవల్లనో మరణించను. ఆ స్వరం నిజమే చెప్తుందని నాకు తెలుసు, ఈ త్యాగం అవసరమేననీ, వివిధ స్థాయిల్లో ఇది మంచికే దారితీస్తుందనీ. అదెలాగంటే, ఇప్పుడున్న పరిస్థితి అంతా దాటిపోయాక, మనం ప్రాథమికంగా దుర్బలులమనీ మన చర్యలకు పర్యవసానాలుంటాయనీ మనం మరచిపోనప్పుడు మాత్రమే. బహుశా నేను అదృష్టవంతురాలినవడం వల్లనే నేనిలా మాట్లాడుతున్నాను: మొదటి సంగతి, నాకో ఇల్లుంది. రోజంతా నా డెస్క్ ముందు కూర్చొని ప్రచురించాల్సిన కథలను అధ్యయనం చేస్తాను. ఇది నా పని. కథలు. ఇప్పటికే నేను వాటిని చదివే విధానానికి ఈ వైరస్ సోకింది. రాబోయే సంవత్సరంలో, నా పాఠకులు ఈ అఘాతాన్నుండి కోలుకొని ముందుకు సాగిపోవడం అవసరమయినప్పుడు, ఏ కథలు ప్రచురించాలో అది నాకు చెప్పింది. శుభ్రమైన లినెన్ వస్త్రాన్ని అసాధరణమైన జాగ్రత్తతో శ్రద్ధగా మడతపెడుతూ – ఇదేమీ ప్రపంచానికి అంతం కాదు– అనుకున్నాను. ఎందుకంటే ఇది మరొక ఊహించని పరిణామం: ప్రతి చర్యా, ఏమాత్రం ప్రత్యేకత లేనిది కూడా ఒక కొత్త విలువను సంతరించుకుంది. నేను పిల్లికి ఇచ్చే ప్రతి కౌగిలింతనీ నాకు నేను ఇచ్చుకుంటాను. ప్రతి శుభరాత్రి సందేశాన్నీ కూడా ఇప్పటికే మనం జీవిస్తున్న పీడకలల రాత్రిలాంటిది కాకూడదనే హృదయపూర్వకమైన ఆశతోనే చెప్పుకుంటాను. తెల్లవారుఝామున కొన్నిసార్లు నా కళ్ళింకా మూసుకునీ, శరీరం విశ్రాంతిగా, మనసు అప్పటికే అలసిపోయీ ఉన్నప్పుడు, వైరస్ మనకు నేర్పిస్తున్న ఈ కొత్త నెమ్మదితనం బాగుందనీ, సహనానికి సంబంధించిన ఈ పాఠం కూడా ఆరోగ్యకరంగా ఉందనీ అనుకుంటాను. అంతకుముందున్న – మన ఊపిరి తీసేసి, మనల్ని ఎన్నడూ దేన్నీ ఆస్వాదించనివ్వని – ఆ వెర్రి బలం – ఆ శక్తంతా ఇప్పుడు సోషల్ మీడియాలోకి ప్రవహించి, మనల్ని మాటలు కలబోసుకునేలా, ఒకరినొకరు హెచ్చరించుకునేలా, సంఘీభావాన్ని తెలుపుకునేలాంటి శక్తిగా రూపాంతరం చెందింది. మనం ఒకరిలోనొకరిగా చుట్టుకుపోయాం. ఈ నిశ్శబ్దం కేవలం ఒక అద్దంలా మారకుండా ఆపేందుకు మనం శబ్దాలు చేద్దాం. వైరస్ మనల్ని ఒంటరులం కావాలని కోరుకునివుంటే, అందుకో కారణం ఉంది. మన జీవనశైలిని ఎలా మారాల్సివుందో ప్రతిబింబించేలా మనం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటూ, నిశ్శబ్దాన్ని హత్తుకోగూడదూ? ఇంట్లోనే ఉండండి, పుస్తకం చదవండి! ప్రతిఒక్కరూ ఇలా ఎలుగెత్తి చెప్తారు. కానీ, తమ స్వంత గుర్తింపునూ అభిరుచులనూ వేరెవరిపైననో రుద్దడానికి చేసే మరో ప్రయత్నంలా అనిపిస్తూండే ఈ సూచనల అరుపుల మధ్యనుంచి నాకు ఏ పుస్తకం అవసరమో తెలుసుకోవడం ఎలా? నేను చేసే పనిని పరిగణనలోకి తీసుకుని ఒక నిబిడాశ్చర్యంతో ఇలా చెప్తున్నాను, ఈసారి కేవలం పుస్తకాలు సరిపోవు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం కంపించిపోతూన్నప్పుడు చదవడంపై దృష్టి పెట్టడం అంత సులభం కాదు. బహుశా మార్పుకు మనం పూర్తిగా అలవాటుపడిన తర్వాత తిరిగి మనకు అవసరమైన ప్రశాంతతను కనుక్కోగలుగుతాము. కాని ఇదింకా ప్రారంభమే. మనకు ఉపశమనం కలిగించేందుకు సంగీతమే ఇప్పటి అవసరం. అహంభావం ఇంకా పుష్కలంగానే ఉంది, కానీ ఇక్కడ కూడా మనకు నేర్పేందుకు వైరస్‌కు ఒక పాఠం ఉంది. తగిన కారణం లేకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళేవారెవరైనా ఇప్పుడు తమ పొరుగువారిని కేవలం దగ్గుతోనే చంపేసే ప్రమాదం ఉంది. కొంతమంది భయపడతారు, స్పృహలోకి వస్తారు– లేదా శిక్ష పడుతుందని భయపడతారు. ఇంకొందరిలో మాత్రం చలనముండదు. అయితే మనిషి ఎప్పుడూ మనిషే. అదంతా మరో కథ. నేను నా తల్లిదండ్రులను చూసి ఇప్పటికి నెలలు గడిచాయి. వారు ఇప్పటికీ నేను పుట్టిపెరిగిన మార్షెలోని పెసారో నగరంలోనే నివసిస్తున్నారు. అంటువ్యాధి అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో అదీ ఒకటి. కాని మనం ఒక్క రోజులో ఇప్పుడు మాట్లాడుతున్నన్ని సార్లు ఇంతకుముందెన్నడూ మాట్లాడి ఎరుగం. వారికి 70 సంవత్సరాల వయసు. ఇలాంటివి అనుభవంలోకి వస్తాయని వారెన్నడూ ఊహించలేదు. ‘నేనేం భయపడటంలేదు,’ అంది మా అమ్మ రాత్రి నాతో. ‘నేను చలించని తేనెటీగలా ఉన్నాను, కాని నేను భయపడను.’ చలించని తేనెటీగ! అయితే అదన్నమాట నా తలలో ఉన్న బయ్యిమనే శబ్దం. నేనింకా పాత నేనుగానే ఉన్నాను, పరిస్థితులకు అనుగుణంగా గట్టిపడకుండా. కానీ అలా ఉండే ప్రయత్నంచేస్తే ఎలా ఉంటుంది? -
సాధనమున చరిత్ర సమకూరు రచనలోన..
తెలుగువాడి చరిత్ర ఆశ్చర్యాల పుట్ట. ఆ చరిత్ర మనకెందుకు అందుబాటులో లేకుండా పోయిందనేది కూడా ఆశ్చర్యమే. మద్రాసుకు, కర్ణాటకకు, ఒరిస్సాకు, మహారాష్ట్రకు, ఇంకా అనేకులకు మన ప్రదేశాలను, వీరులను, కళలను, చివరకు చరిత్రను కూడా ధారాదత్తం చేశాము. మన చరిత్ర మనకు తెలియకపోవడం వల్ల, మన జాతి పట్ల మనకే గర్వం కలగడం లేదు. జాతిని వెలుగులోకి తీసుకు రావాలంటే చరిత్ర మీద దృష్టి పెట్టాలి. ఈ అవగాహన కోసమే ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడ దగ్గరలోని ఒక ఆహ్లాదకరమైన స్థలి వేదికగా ‘కాలయంత్రం – 2020’ చారిత్రక కథారచన కార్యశాల జరిగింది. సాయి పాపినేని ఏర్పాటు చేయగా, కార్పొరేట్ వర్క్ షాప్ స్థాయిలో జరిగిన ఈ కాలయంత్రంలో– 35 మంది తెలుగు రచయితలు ఒక దగ్గర కూడితే చిందే సాహిత్యపు సందడి ఒక ఎత్తయితే, సాహితీ సృజనలో చెయ్యి తిరిగినవారితో పాటు ఇప్పుడిప్పుడే కలం పట్టిన వారు కూడా అపురూపమైన చారిత్రక క్షణాలను శ్రద్ధగా నోట్సుల్లో ఒడిసిపట్టుకుంటూ కనపడటం మరో ఎత్తు. ఈ రెండు రోజుల్లో అనేకానేక అంశాలు చర్చకు వచ్చాయి. వెయ్యేళ్ళు నిండిన తెలుగు సాహిత్యంలో రావల్సినంత చరిత్ర ప్రాధాన్యతతో కథలు రాలేదనే నిజాన్ని అందరూ అంగీకరించారు. చరిత్రను పాఠ్యపుస్తకం లాగానో, పరిశోధక వ్యాసంలాగానో కాక కథలాగా చెబితే చదువుతారని తాజాగా ‘శప్తభూమి’ నవల నిరూపించింది. సాహిత్యంలోంచి వాస్తవాన్ని వడగట్టాలంటే సాహిత్యేతరాలైన చారిత్రక ఆధారాలు కూడా పరిశీలించాలి. శాసనాలు, నాణేలు, పురావస్తు అవశేషాలు, హస్తకళలు, ఆచార వ్యవహారాలు, పాటలు, గాథలు, నదులు, చెరువులు, పట్టణాలు, ఆలయాలు, ఊరిపేర్లు, ఇంటిపేర్లు, రహదార్లు, భవనాలు– ఇలా ప్రాచీన సంప్రదాయాలతో సంబంధమున్న ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూసి ఒకదానికొకటి అనుసంధానం చేసి తప్పో ఒప్పో తేల్చుకోవాల్సిన పని చరిత్రను రచించే, సాహిత్యంగా మలచే ప్రతి రచయితా చేసి తీరవలసిందే. అయితే, ఈ ప్రయత్నంలో అనేక సందేహాలు ఎదురవుతాయి. ఏది చరిత్ర? ఏది అభూత కల్పన? ఈ రాజు ఇలా చేసి ఉంటాడా? సంభావ్యత ఎంత? ఈ కార్యశాలలో ప్రసంగించిన నిపుణులు వీటికి జవాబులిస్తూ రచయితలకు తోడుంటామని మాటిచ్చారు. ఆంధ్ర ప్రాంతంలోనే దొరికిన ఐదు లక్షల సంవత్సరాల కిందటి ఆదిమ మానవుని అవశేషాలు, కళింగాంధ్రులు, రేనాటి చోళులు, జంబూద్వీప వృత్తం, జాతక కథలు, నాగులవంచలో డచ్ చరిత్ర, యానాం చరిత్ర, భారతీయ, అంతర్జాతీయ భాషలలో వచ్చిన చారిత్రక మహా/ సూక్ష్మ కథనాలు, శ్రీలంక నుంచి ఫిలిప్పీన్స్ దాకా విస్తరించిన ఆంధ్ర సామ్రాజ్యం, ఇండోనేషియాలో ఇప్పటికీ కనిపించే మన ఆవకాయ జాడీలు, 110 ఏళ్ళు దాటినా ఇంకా జవాబు దొరకని గురజాడ ‘దేవుళ్ళారా మీ పేరేమిటి’, ఆంధ్రతీరపు నౌకానిర్మాణ పరిశ్రమ, జైనుల దేవతలు గ్రామదేవతలవడం, వజ్రాలకోసం మట్టిలో వెతుకులాటలు, సిరిమాను ఆచారం, బుద్ధుడు ముందా రాముడు ముందా, భువనవిజయం అసాధ్యమా, నానక్ కబీర్లు కలుసుకుంటే, అశోకుడి ఎర్రగుడి శాసనాలు, మామిడిచెట్ల కింద నాణేల ప్రదర్శన – ఇలాంటి మిక్కిలి ఆసక్తికరమైన చర్చలు, విశ్లేషణలు, గమ్మత్తులు, నమ్మలేని నిజాలు, పురాస్పర్శలు – తెలుగువాడి చరిత్రను అందరికీ తెలియచెప్పాలనే సమష్టి బాధ్యతను గుర్తెరిగేలా చేశాయి. కార్యశాలలో భాగంగా రెండో రోజు కొండవీడు పర్యటన ఏర్పాటైంది. రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాలలో కర్పూర వసంతరాయల కుడ్యచిత్రాలు, కొండవీడు కోట నమూనా వగైరాలున్నాయి. ఈనాడు శిథిలాలుగా కనిపిస్తున్న కొండవీడు 14వ శతాబ్దిలో ప్రోలయ వేమారెడ్డిచే నిర్మితమై పదివేలమంది నివసించిన ఒక పూర్తి నగరం. దీని పునరుద్ధరణలో భాగంగా మెలికలు తిరిగే కొండదారి తాజాగా ఏర్పడింది. కొండలపై దారంతా రాసి ఉన్న వేమన పద్యాలు ఆ కాలానికి తీసుకువెళతాయి. తెలుగువారి వారసత్వ సంపదలో భాగమైన అనేక చారిత్రక అంశాలతో కూడుకున్న ‘కాలయంత్రం’ చరిత్ర పట్ల చైతన్యం రగిలించింది. - మోహిత -
తెరిచిన తలుపులు
నవల : అండ్ ద బ్రైడ్ క్లోజ్డ్ ద డోర్ హీబ్రూ మూలం : రానిత్ మెటలోన్ ఇంగ్లిష్ అనువాదం : జెస్సికా కోహెన్ పెళ్లికూతురు మార్జీ గదిలోకి వెళ్లి తలుపు బిగించేసుకుని, అయిదు గంటల తరవాత ‘ఈ పెళ్లి చేసుకోను. చేసుకోను. చేసుకోను’ అని తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. అంతవరకూ ఆమె మాట కోసం ఆత్రంగా ఎదురుచూసిన వాళ్లందరూ, ఆమె చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుందేమో అన్న భయంతో ఒకరిని ఒకరు చూసుకోవడం కూడా మానేస్తారు. పచ్చగా ఉన్న పెళ్లింట్లో అసలు పెళ్లి జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇజ్రాయెల్ రచయిత్రి రానిత్ మెటలోన్ (1959–2017) రాసిన ‘అండ్ ద బ్రైడ్ క్లోజ్డ్ ద డోర్’ ఈ సంక్షోభంతో ప్రారంభమవుతుంది. ఇజ్రాయెల్ సాహితీ ప్రపంచంలో ప్రముఖమైన ‘బ్రెన్నెర్ అవార్డ్’ పొందిన ఈ హీబ్రూ నవలకి జెస్సికా కోహెన్ చేసిన ఇంగ్లిష్ అనువాదాన్ని న్యూ వెసెల్ ప్రెస్ 2019లో ప్రచురించింది. ఒక్కరోజు కథ ఇది. మార్జీ, మాటి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ సాయంత్రమే పెళ్లి. మార్జీతో మాట్లాడటానికి ఎవరు ప్రయత్నించినా, మౌనమే సమాధానం. కేంద్రబిందువు మార్జీ అయినప్పటికీ, కథను నడిపేది మిగతా పాత్రలే. హాస్యం, స్త్రీవాదం, ఇజ్రాయెల్‌లో పెళ్లిళ్లు, సామాజిక ఆర్థిక పరిస్థితులు, పాలెస్తీనియన్లు, వలస వచ్చిన యూదుల ఇబ్బందులు– ఇవన్నీ చదువరి గమనంలోకి వచ్చేలా నవలలో ప్రవేశపెట్టబడతాయి. తన అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పే అమ్మాయిలా, తనకు తనే బలం అని నమ్మిన వ్యక్తిలా మార్జీ వ్యక్తిత్వం ఆవిçష్కృతమౌతుంది. ఈ సంక్షోభం మొత్తంలో మార్జీ కేవలం ఒక్క కాగితాన్ని మాత్రం తలుపు కిందనుంచి బయటకు పంపుతుంది. ‘నీ అడుగులు బరువెక్కాయి, గమ్యాన్ని చేరగలవా? అని దారిలో రాళ్లు నన్ను ప్రశ్నించాయి,’ అని మొదలయ్యే కవిత, కట్టుబాట్లను ఛేదించటానికి ఆమె లోనవుతున్న అంతర్గత సంఘర్షణకి ప్రతిరూపంగా ఉంటుంది. కథ పరిధికి లోబడి డీటెయిలింగ్ చేసిన విధానం అనుపమానం. పెళ్లింటి వాతావరణంలోని వస్తువులూ, సెంటు పరిమళాలూ, వంటింటి వాసనలూ, మేకప్పులూ, అలంకరణలూ, కేటరర్సూ, ఫొటోగ్రాఫర్లూ, ఫోన్లూ ఓవైపు; పెళ్లికూతుర్ని ఒప్పించటమెలా, అతిథులకేం చెప్పాలీ, ఇంతవరకూ అయిన ఖర్చు ఎవరు భరించాలీ లాంటి మీమాంసలు మరోవైపు. వర్ణనలు, పోలికలు చాలావరకు స్త్రీ పరంగా ఉండటం కొత్త అందం. ఆలోచనలను స్పష్టంగా చెప్పలేని పెళ్లికొడుకు మాటీ, తనకి నచ్చని చెప్పులు మార్జీ కొన్నప్పుడు వద్దనికూడా చెప్పలేడు. అతనికీ మార్జీకి మధ్య ఏదో కనపడని గోడ ఉండేది. అసలు, మార్జీతో ఉన్న అనుబంధంలో అతనిలో అతనికే ఏదో అడ్డుగా ఉండేది. మార్జీ తీసుకున్న ఈ నిర్ణయం మాటీకి కూడా కొంతమేరకు ఉపశమనాన్ని కలిగించి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల స్థైర్యాన్ని అతనికీ ఇస్తుంది. మార్జీ పరంగా ఆలోచించగలిగిన అమ్మమ్మ మరో ముఖ్యమైన పాత్ర. ఆ రోజు ఆవిడ పాడిన ‘నేను నా మనసులో ఉన్నది చెప్పటానికి భయపడతాను, నీ హృదయం ఎక్కడ గాయపడుతుందోనని’ అన్న పాట మంద్రంగా సాగుతూ ఆవిడ గదిని దాటి, చుట్టూపరుచుకున్న నిశీథిలోని వేలవేల గొంతుకలతో కలిసి తెరలుతెరలుగా విశ్వమంతా వ్యాపించి, తరతరాలుగా స్త్రీలు మోస్తున్న భారాన్ని పెళ్లగిస్తున్నట్టుగా సాగుతుంది. ఈ పాట ప్రభావమా అన్నట్టు, పెళ్లికూతురి గది తలుపు తెరుచుకుంటూ ఉంటుంది నెమ్మదిగా! మార్జీ పెళ్లిని నిరాకరించడానికి కారణాలు కథ చివర్లో కూడా స్పష్టం కావు. కానీ స్త్రీ నిర్ణయాన్ని గౌరవించడం అనేది ముఖ్య విషయమనీ, కారణాలు తదనంతర విషయాలనీ నవల అన్యాపదేశంగా సూచిస్తుంది. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో స్త్రీకి ఎక్కడైనా ఈ స్థాయిలో స్వాతంత్య్రం ఉందా అన్నది పక్కనపెడితే, ఉండటం మాత్రం అభిలషణీయం! - పద్మప్రియ -
ప్రతిధ్వనించే పుస్తకం
అసలు జీవితానికి అర్థమేమై వుంటుంది?ఈ చింతనే ప్రధానంగా సాగుతుంది ‘చివరికి మిగిలేది’. వ్యక్తిగతమైన విముక్తి ప్రధాన ప్రేరణగా దీన్ని రాసినట్టు బుచ్చిబాబు చెప్పుకున్నారు. తెలుగులో వచ్చిన గొప్ప మనో వైజ్ఞానిక నవలగా ఇది ఆయనకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. ప్రధానంగా కథకుడైన బుచ్చిబాబు రాసిన ఏకైక నవల ఇది. తొలుత ధారావాహికగా వచ్చి 1952లో పుస్తకరూపం దాల్చింది. శీలపు మరకను కలిగివున్న తల్లి గత చరిత్ర దయానిధిని జీవితాంతం వేదనకు గురిచేస్తుంది. తల్లి చేసిన తప్పేమిటో స్పష్టంగా తెలియదు, లేదా రచయితే తెలియనివ్వడు. అంతర్ముఖుడైన దయానిధిలాగే నవలంతా ఒక గుప్తమైన మార్మికత పరుచుకుని ఉంటుంది. అయినప్పటికీ తనకు ఎదురయ్యే దేన్ని కూడా తరచి చూడకుండా దయానిధి ఉండడు. కళ, సౌందర్యం, ప్రకృతి, సమాజం, స్త్రీ, రాజకీయం, అమలిన శృంగారం అన్నింటినీ స్పృశిస్తాడు. దయానిధి తన సుదీర్ఘ జీవిత ప్రయాణంలో అమృతం, కోమలి, ఇందిర, సుశీల, నాగమణి లాంటి స్త్రీల సామీప్యానికి వెళ్తాడు; వెళ్లలేకపోతాడు. వజ్రం రూపంలో సంపద వస్తుందీ పోతుందీ. మనుషుల ద్వేషాన్నీ, దానికి గల కారణాన్నీ అర్థం చేసుకుంటాడు. తనకేం కావాలో తెలియనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు. మనిషికి కావాల్సింది మతాలు, దేవుళ్లు, మొక్కుబళ్లు, రాజకీయాలు కావు; మానవుడికి కావాల్సినది దయ, అని తేల్చుకుంటాడు. అమృతం, కోమలి పాత్రలు గుర్తుండిపోతాయి. కథనం తాబేలు నడకలా సాగుతుంది. ఏమీ ప్రత్యేకించి పరుగులు పెడుతూ జరగదు. ప్రతి వాక్యాన్నీ, ప్రతి గమనింపునీ కవితాత్మకంగా మలవాలన్న శైలి బుచ్చిబాబు బలమూ, బలహీనతా రెండూ. జీవితం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటావు, జీవించవు అన్న స్నేహితుడి వాక్యం దయానిధికి పూర్తిగా వర్తిస్తుంది. జీవితంలో మునిగిపోవడానికి మించిన వేరే పరమార్థం జీవితానికి ఏమీలేదు. అలాగని దీని గురించి జిజ్ఞాసువులు మీమాంస పడకుండా ఉండటమూ కష్టమే. జీవితానికి అర్థమేమిటన్నదానికి ప్రత్యేకించి సమాధానం ఏమీ లేదు. ఆ సమాధానాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమూ, అందులో భాగంగా కలిగే కొన్ని అనుభవాలూ, అవి కాగలిగే జ్ఞాపకాలూ, తనతో తాను మనిషి సమాధాన పడటమూ మాత్రమే చివరికి మిగిలేవి. -
చాల్స్ డికెన్స్
గ్రేట్ రైటర్ ఇంగ్లండ్‌లో జన్మించాడు చాల్స్ డికెన్స్ (1812–1870). తల్లిదండ్రులకున్న ఎనిమిది మంది సంతానంలో రెండోవాడు. తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడు. ఆయన జైలుపాలవడంతో చిన్నతనంలోనే డికెన్స్ చదువుకు దూరమయ్యాడు. అయినా చదువు మీద అనురక్తి పోగొట్టుకోలేదు. బయట బాగా తిరిగేవాడు. ఇంట్లోని బొమ్మల పుస్తకాలు బాగా చదివేవాడు. ప్రత్యేకించి అరేబియన్ నైట్స్ ఆయన్ను బాగా ప్రభావితం చేసింది. ప్రత్యేకంగా పాఠశాల విద్యను అభ్యసించకపోయినప్పటికీ సహజ పండితుడిలాగా చదువుకున్నాడు. 15 నవలలు, 5 నవలికలు, వందలకొలదీ కథలు, వ్యాసాలు రాశాడు. ఒక వారపత్రికకు 20 ఏళ్లపాటు సంపాదకత్వం వహించాడు. విక్టోరియన్ ఇరా(విక్టోరియా రాణి శకం)లో పుట్టిన గొప్ప నవలాకారుడిగా కీర్తి ప్రతిష్ఠలు గడించాడు. బాల్య జ్ఞాపకాలను అత్యంత స్పష్టంగా కాగితం మీద నెమరేసుకున్న డికెన్స్ మరిచిపోలేని పాత్రల్ని సృష్టించాడు. ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, డేవిడ్ కాపర్ఫీల్డ్, ఆలివర్ ట్విస్ట్, ఎ క్రిస్మస్ కరోల్, హార్డ్ టైమ్స్, ద సిగ్నల్–మాన్ లాంటివి ఆయన ప్రసిద్ధ రచనల్లో కొన్ని. -
మరణించే హక్కు గురించి మాట్లాడే నవల
తన అంతర్జాతీయ కచేరీ పర్యటనకి మూడు వారాల ముందు, ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో, హాస్పిటల్లో చేరిన ఎలిఫ్రిడీ (ఎల్ఫ్)తో నవల ప్రారంభం అవుతుంది. ఆమె ప్రపంచ ప్రసిద్ధి పొందిన పియానిస్ట్. డబ్బున్నది. ప్రేమించే భర్త్ నిక్ ఉంటాడు. కానీ, మానసిక వ్యధతో బాధపడుతూ, మరణించాలన్న ప్రగాఢమైన కోరిక ఉన్న స్త్రీ. చనిపోయేందుకు– కడుపు మాడ్చుకోవడం, నిద్ర మాత్రలు మింగడం, మణికట్టు కోసుకోవడం, బ్లీచ్ తాగడం వంటి ప్రయత్నాల్లో వేటినీ వదలదు. ‘ఎల్ఫ్ చనిపోవాలనుకుంది కానీ తను బతకాలన్నది నాకోరిక. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకునే శత్రువులం’ అన్న చెల్లెలు యోలాండా (యోలీ) జీవితం ఆటుపోట్లకి గురైనది. కథనం ఆమె స్వరంతోనే వినిపిస్తుంది. అక్కను చుట్టుముట్టిన చీకటి గురించి తెలిసిన యోలీని, కారుణ్య మరణం చట్టబద్ధం అయిన స్విస్ క్లినిక్‌కి తనను తీసుకెళ్ళమని ఎల్ఫ్ అడుగుతుంది. తను వొప్పుకున్నా లేకపోయినా కూడా, ఎల్ఫ్ ఆత్మహత్యా ప్రయత్నం ఎప్పుడో అప్పుడు నెరవేరుతుందని గ్రహించిన యోలీ – అక్కకి సహాయపడ్డానికే నిశ్చయించుకుంటుంది. కానీ, బాంక్ ఆమెకి లోన్ ఇవ్వదు. ఎల్ఫ్కూ, నిక్కూ ఉమ్మడి ఖాతా ఉండటం వల్ల ఆ ప్రయాణాన్నిభర్తనుంచి దాయడం ఎల్ఫ్కు కుదరదు. తన పుట్టినరోజు జరుపుకోడానికి ఎల్ఫ్ హాస్పిటల్ నర్సుల అనుమతి తీసుకుని బయటకెళ్ళి, నిక్‌తో పాటు విందు భోజనం చేసి, పుస్తకాలు తెమ్మని అతన్ని లైబ్రరీకి పంపుతుంది. ఎదురుగా వస్తున్న రైలు కింద తల పెట్టేసి, ఆత్మహత్య చేసుకోవడంలో కృతకృత్యురాలవుతుంది. తన జీవిత బీమా డబ్బుని యోలీకి వదిలిపెడుతుంది. ఎల్ఫ్ తండ్రి కూడా ఇదే విధానంలో, 12 సంవత్సరాల కిందట తన మరణాన్ని ఎంచుకుంటాడు. అక్కచెల్లెళ్ళ పల్లెటూరి బాల్య జ్ఞాపకాలని రచయిత్రి స్పష్టంగా, శక్తిమంతంగా వర్ణిస్తారు. కథనం– సానుభూతికీ, పరిహాసానికీ మధ్య ఊగిసలాడుతుంది. మితిమీరిన విషాదం కనిపించక, పదునైన చమత్కారం కనబడుతుంది. కొన్ని చోట్ల నవ్విస్తుంది కూడా. అందుకే నవల విషాదకథల జోన్రాలోకి మాత్రం రాదు. కథాంశం తక్కువా, అస్పష్టమైన కవిత్వం ఎక్కువా ఉన్న ఈ నవల నిజాయితీగా అనిపిస్తుంది. కెనడియన్ రచయిత్రి మిరియమ్ తియస్ దీన్లో కొటేషన్ మార్క్స్ ఉపయోగించరు. అందువల్ల, ఏ పాత్ర మాట్లాడుతోందో, అది పలికిన మాటో, ఆలోచనో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నవల ఆఖరున రచయిత్రి డి.హెచ్.లారెన్స్‌ను ఉటంకిస్తారు: ‘ఎన్ని ఆకాశాలు మీద పడ్డా సరే, మనం బతకక తప్పదు.’ ‘జీవితంతో అలిసిపోవడం వల్ల మరణాన్ని ఎంచుకోవడం సహేతుకమైనదేనా! మనం ప్రేమించే వారిపట్ల మనకే బాధ్యత ఉండదా?’ అన్న ఎన్నో ప్రశ్నలని పుస్తకం సంధిస్తుంది. చనిపోయే ఎంపికా, ఆత్మహత్యకు సంబంధించిన అవమానం ఎదురుకోవడం అన్న అంశాలు నవల నేపథ్యానికి ఆయువుపట్టు. బ్రిటనీ మేనార్డ్ మొదలుపెట్టిన ‘మరణించే హక్కు’ ఉద్యమం ఊపందుకున్న తరువాత, ఈ పుస్తకం 2014లో విడుదల అయింది. ఇది రచయిత్రి ఆరవ నవల. తియస్ పుస్తకాలు ఎక్కువగా మానసిక వ్యాధులకి సంబంధించినవే. ఈ స్వీయ చరిత్ర 2014లో ‘రోజర్స్ ట్రస్ట్ ఫిక్షన్’ బహుమతి పొంది,‘స్కాటియా బాంక్గిలర్’బహుమతికి షార్ట్ లిస్ట్ అయింది. తదుపరి రెండేళ్ళలో మరెన్నో బహుమతులు కూడా గెలుచుకుంది. ఆడియో పుస్తకం కూడా ఉంది. కృష్ణ వేణి -
చూస్తుండగానే కాలం చేసింది
కష్టాలదేముంది నాయనా, చూసేలోపలే రోజులెలాగో గడిచిపోతాయంటాడు తండ్రి. తను అన్న మాటల పరమార్థం ఆయనే గ్రహించలేదు. పన్నెండేళ్ల కొడుకు కాలం చేశాడు. రైతు హంబో యింట్లో ఆనాడు భేదాభిప్రాయం వచ్చింది. పన్నెండేళ్ల కొడుకు గిఖోర్‌ను పట్నంలో పనిలో పెడితే ప్రపంచంలో యెలాగో నెట్టుకొస్తాడని హంబో ఆలోచన. కానీ ముక్కుపచ్చలారని బిడ్డని నీతీ న్యాయం లేని ప్రపంచంలో తోసెయ్యడానికి అతని భార్య ఒప్పుకోలేదు. కానీ హంబో ఆమెను లెక్కచేయలేదు. ఒక విచారకరమైన ఉదయాన గిఖోర్ వాళ్లమ్మ, చెల్లెలు జాన్నీ, చిన్ని గల్లో వాడిని పల్లె పొలిమేర దాకా వచ్చి సాగనంపారు. వెనక్కి చూస్తూ, తండ్రి పక్కన పరుగెత్తినట్టుగా గిఖోర్ నడుస్తున్నాడు. కాసేపటికి కొండ వెనక్కి నక్కింది వాళ్ల ఊరు. ఆ రాత్రి వాళ్లు ఓ ఊళ్లో హంబో పాత స్నేహితుడుంటే అక్కడ దిగారు. గ్లాసులు గలగల్లాడిస్తూ కడిగి, ఒక చిన్నమ్మాయి టీ తయారుచేసింది. ఆమె అందమైన ఎర్రని దుస్తులు వేసుకుంది. పట్నంలో డబ్బు సంపాదించాక అటువంటి దుస్తులు జాన్నీకి కొనిపెట్టాలని గిఖోర్ లెక్కవేశాడు. మరునాడు తండ్రీ కొడుకూ తిఫ్లీస్ పట్టణం చేరుకున్నారు. కొట్ల నిండా పండ్ల గుట్టలు. స్కూలుకు వెళ్లి వచ్చే పిల్లల గుంపులు. కూరగాయల బరువుతో గాడిదలు. నెత్తిమీద సరుకులు పెట్టుకుని అమ్ముకునేవాళ్లు. హడావుడి, గోల. ∙∙ ఒక షాహుకారు కొట్లో గిఖోర్ పనికి కుదిరాడు. యజమాని పేరు బజాజ్ అర్తేం. ఇల్లు శుభ్రంగా ఉంచడం, గిన్నెలు కడగడం, జోళ్లు శుభ్రం చెయ్యడం, కొట్టుకు భోజనం తీసుకెళ్లడం మొదలైన పనులు గిఖోర్ సంవత్సరంపాటు చెయ్యాలి. ఆ తరువాత పిల్లాడికి కొట్టులో పని నేర్పుతాడు. ‘‘అయిదారేళ్ల దాకా జీతం మాత్రం ఏమీ యివ్వను’’ అన్నాడు. ‘‘నిజం చెప్పాలంటే, పని నేర్పుతున్నందుకు నువ్వే నాకు ఎదురివ్వాలి’’ అన్నాడు నవ్వుతూ. ఇద్దరికీ టీ, ఫలహారం పెట్టించాడు. కొడుక్కు ఆ రాత్రి హంబో ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. ‘అక్కడా, ఇక్కడా తిరక్కు. నీ చేతికేదైనా డబ్బు వస్తే అనవసరంగా పాడు చెయ్యకు. ఇంటి దగ్గర లక్ష అవసరాలున్నాయి. రాత్రిపూట బాగా కప్పుకో, లేకపోతే జలుబు చేస్తుంది. వాళ్ల భోజనాల్లో మిగిలిన తిండి నీకు పెడతారు, నువ్వేమీ అనుకోకూడదు. చాకిరీ చేసుకునేవాళ్ల బతుకే అంత. రోజులెలాగో తెలియకుండానే గడిచిపోతాయి’. అప్పటికే హంబోను ఆనుకుని గిఖోర్ నిద్రపోయాడు. తెల్లారి హంబో కొడుకును వదిలేసి తమ ఊరికి తిరిగి వెళ్లిపోయాడు. గిఖోర్ వాలకం అర్తేం భార్య నత్తోకు ఏమీ నచ్చలేదు. బొత్తిగా కొండల్లోంచి వచ్చిన అడవి వాడిలా కనిపించాడామెకు. శనిగాడని తిట్టుకుంటూ కూర్చుంది. కానీ ఖర్చు లేకుండా కొన్ని సంవత్సరాలు పనిచేసే నౌకరు దొరికాడని అర్తేం సంతోషించాడు. ∙∙ గిఖోర్ వంటింట్లో కూర్చునివున్నాడు. ఇంతలో నత్తో లోపలికి వచ్చింది. గిఖోర్ తను కూర్చున్న చోటు నుంచి లేవలేదు. ఆవిడ ఏదో అంది, గిఖోర్‌కు అర్థం కాలేదు. ‘‘ఒరేయ్ అడవి మృగమా! నీకే చెప్తున్నాను’’ అంది ఆమె. గిఖోర్‌కు వణుకు పుట్టింది. ఏమిటి చెప్పేరని తిరిగి అడగటానికి ధైర్యం చాలలేదు. నత్తో మండిపడుతూ బయటికి వెళ్లిపోయింది. అప్పుడు అర్తేం తల్లి లోపలికి వచ్చింది. ఆమెది కొంచెం మెత్తని స్వభావం. ‘‘యజమానురాలు లోపలికి వస్తే లేచి నిలబడవేంరా? ఏదైనా అడిగితే సమాధానం చెప్పాలి’ అని సుద్దులు చెప్పింది. ఏమేం పనులు ఎలా చెయ్యాలో చెప్పింది. అన్ని పనులూ గిఖోర్ చేసేవాడు. ఆకలికి మాత్రం ఆగలేకపోయేవాడు. ఇంటిదగ్గర ఆకలేస్తే తనంతట తాను రొట్టో, జున్నుముక్కో తినేవాడు. ఇక్కడ సంగతి వేరు. ఎంత కడుపులో కాలుతున్నా అందరి భోజనాలన్నీ అయ్యేదాకా ఉండి, అప్పుడు తను మొదలెట్టాలి. వాడి కడుపులో ఆకలి దహించుకుపోయేదాకా ఆ భోజనాల సమయం రాదు. అట్లా పదిసార్లు చూశాక, వంటింట్లో ఏమైనా దొరుకుతుందేమో అని వెతికేవాడు. ఓ ఎండిపోయిన రొట్టెముక్క, సగం గీరిన ఎముక ముక్క, ఏదో ఒకటి నోట్లో పెట్టుకునేవాడు. ∙∙ వీధిలో ఎవరో గంట కొట్టారు. గంట వినబడగానే ఎవరో, ఎందుకు కొట్టారో చూడాలని గిఖోర్‌కు చెప్పారు. బాల్కనీలోంచి చూశాడు. ఒక పెద్దమనిషి, కొంతమంది స్త్రీలు. ‘‘ఇదుగో ఏయ్, ఎవరు?’’ అని కేక వేశాడు గిఖోర్. ‘‘మీ యజమానురాలు యింట్లో లేరా?’’ అని పెద్దమనిషి అడిగాడు. నత్తో ఆ మాటలు విని, బయటికి వచ్చి, ‘‘ఓరి పీనుగా, వెళ్లి తలుపు తియ్యి, పరుగెత్తు’’ అంది. అతిథులు లోపలికి వచ్చారు. గిఖోర్‌ను తొందరగా బజారుకు పంపింది. అతిథులతో నత్తో అరగంట సేపు కబుర్లు చెప్పింది. ఇంతలో గిఖోర్ చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. ‘‘పళ్లు పట్టుకువచ్చానమ్మగారూ!’’ ‘‘సరేలే, అలా వుండనీ’’ అంది నత్తో. ‘‘అయ్యగారు చెర్రీపళ్లు చాలా ఖరీదు. అవి పట్టుకెళ్లకపోయినా ఫర్వాలేదులే అన్నారండి.’’ అతిథులకు నవ్వొచ్చింది. నత్తో సిగ్గుపడింది. ‘‘ఆయన ఏమన్నారో, యీ బుర్ర తక్కువ వెధవ ఏం వినిపించుకున్నాడో!’’ అని సర్దిచెప్పుకుంది. ‘‘నే నబద్ధం చెపితే ఒట్టండి’’ అన్నాడు గిఖోర్. స్నేహితులు వెళ్లిపోయాక, పళ్లు బల్లమీంచి తీసేస్తూ భర్తనీ గిఖోర్నీ కలిపి తిట్టింది నత్తో. ‘అందరిమధ్యా నా తల వంచుకునేలా చేశాడు’ అంటూ వచ్చాక భర్తకు ఫిర్యాదు చేసింది. అర్తేం రమ్మని అరిచాడు. బిక్కుబిక్కుమంటూ వచ్చాడు గిఖోర్. బజాజ్ ముఖం చూసి వాడి పైప్రాణం పైకిపోయింది. ‘మట్టిబుర్రా, చచ్చువెధవా’ అంటూ చెంప ఛెడేలుమంది. తలవెళ్లి గోడకు కొట్టుకుంది. కళ్లు తిరిగి నేలమీద పడ్డాడు. ముసలమ్మ గిఖోర్‌ను లాగడానికి ప్రయత్నించింది. అప్పటికే చెట్టుకింద పడ్డ ఆకులా వణికిపోతూ, ‘అమ్మా, అమ్మా’ అని మూలుగుతున్నాడు. ∙∙ గిఖోర్ ఇంటిపనులకు పనికిరాడని నిశ్చయించి, షాపులోకి తీసుకువెళ్లారు. షాపు శుభ్రం చేయడం, బట్టలు తానులుగా చుట్టడం, కొనుక్కునేవాళ్లకు సరుకు అందించడం, ఏమీ లేనప్పుడు కొట్టులోకి కొత్తవాళ్లు వచ్చేలాగా పిలిచి ఆకర్షించడం– ఇదీ వాడి పని. ఒకనాడు ఇంటినుండి కొట్టుకు భోజనం తెస్తూ, మధ్యలో ఒక ఫార్శీమనిషి కోతిని ఆడిస్తూ పాడుతుంటే అక్కడే నిలిచిపోయాడు. ఆలస్యమైనందుకు, ‘క్లబ్బుకు వెళ్లావా? గవర్నరుగారితో పనిమీద వెళ్లావా?’ అంటూ మళ్లీ దెబ్బలు పడ్డాయి. బుగ్గనిండా ఎర్రని నెత్తురు చారలు. ఇంటికి వచ్చాక వాడికి అన్నం పెట్టవద్దని అర్తేం ఆజ్ఞాపించాడు. వాడికి ఆకలంటే అర్థం తెలియాలిట. ఆ రోజంతా వాడేమీ తినలేదు. ఒళ్లంతా దెబ్బలతో కదుము కట్టింది. కళ్లు వాచేలా ఏడ్చాడు. వాడి మనసు ఇంటిమీదకు పోయింది. ‘రోజులెలాగో తెలియకుండానే గడిచిపోతాయి’ అని తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. ∙∙ చలికాలం వచ్చింది. మంచు తుపానుతో ఝమ్ అని మోగిపోతోంది. అనాథ పిల్లల్ని కబళించడం కోసం మూలమూలలూ గాలిస్తోంది. వలగుడ్డలాంటి చొక్కా వేసుకుని, కొట్టుగుమ్మంలో నిలుచుని, ‘అయ్యా రండి’ అని పిలుస్తున్న గిఖోర్ తుఫానుకు దొరికాడు. చలి వాడి ఎముకల్లోంచి కత్తిలా లోపలికి దూరింది. నీరసంగా వున్న వాడి ప్రాణానికిది చాలు. మంచానపడ్డాడు. హంబోని రమ్మని అర్తేం కబురు పంపాడు. గిఖోర్‌ను పట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ బోలెడుమంది రోగులు వరుసగా పడివున్నారు. ఎవరి కళ్లల్లోనూ జీవం లేదు. గిఖోర్‌ను హంబో అక్కడే చూశాడు. అంత జ్వరంలో తండ్రిని వాడు గుర్తించలేదు. ‘అమ్మా, నాన్నా, జాన్నీ’ అంటూ సంధిలో నవ్వుతున్నాడు. రెండ్రోజుల తర్వాత హంబో గ్రామానికి బయల్దేరాడు. గిఖోర్‌ను పాతిపెట్టడం అయిపోయింది. హంబో చంక కింద గిఖోర్ బట్టలు పెట్టుకుని తల్లి చూసుకుని ఏడవడానికి తీసుకు వెడుతున్నాడు. వాడి జేబులో మెరుస్తున్న బొత్తాలూ, రంగు రంగు కాగితం ముక్కలూ, పిన్ను సూదులూ, బట్టల తాన్ల పీలికలూ ఉన్నాయి. ఇవన్నీ జాన్నీ కోసం పోగుచేశాడు. హొవనేస్ తుమన్యాన్ హొవనేస్ తుమన్యాన్(1869–1923) కథ ‘గిఖోర్’ సారాంశం ఇది. దీన్ని చిరంజీవినీ కుమారి అనువదించారు. అర్మేనియా జాతీయ కవిగా తుమన్యాన్ను కీర్తిస్తారు. ప్రతి కవీ తన జాతి జనుల ఆత్మగా ఉండాలంటాడాయన. -
నాగరిక కాటు
ఏలూరులో చూసుకోవాల్సిన పని అయిపోయింది. ప్లీడరు గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక కారు స్టార్టు చేశాడు రామచంద్రం. రాత్రి పది దాటింది. సరిగ్గా తొక్కితే గంటన్నరలో తణుకులో ఉండొచ్చు. కలెక్టరు గారింట్లో పెళ్లి సరీగా ఉదయం ఏడు గంటలకి. నాగభూషణం మీదా, రామచంద్రం మీదా భరోసా వేసుకుని కూర్చున్నారు కలెక్టరు గారు. కలెక్టరు గారింట్లో శుభకార్యమంటే వేరే చెప్పాలా! రామచంద్రం పెద్ద టెన్నీస్ చాంపియన్. కాలవ ఒడ్డున పెద్ద మేడవుంది. నాగభూషణం కలప వ్యాపారం నడుపుతున్నాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరే. భూషణం అల్లుడు అవధాని కూడా వాళ్లెంబడి వున్నాడు. ఇంకా కుర్రాడు. ఆరుమైళ్లు వచ్చేప్పటికి కారు ఆగిపోయింది. రామచంద్రం దిగి బానెట్ తీసి చూశాడు. ‘వెధవ కారులా ఉంది. నడచి వెనక్కి పోదాం పద’ అన్నాడు నాగభూషణం. ‘అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగానీ యీ కారుని తిడితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు రామచంద్రం. కారు కిందా మీదా ఏవో పరీక్ష చేశాడు. చివరికి ఆల్రైట్ అంటూ కారులో కూర్చున్నాడు. ఎర్రని పొడుగాటి రోడ్డు మీద కారు వెళుతూంటే చల్లని గాలి మొహానికి కొడుతోంది. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాల లాగా నక్షత్రాలు మెరుస్తున్నాయి. మళ్లీ కారు సడెన్‌గా ఆగిపోయింది. రామచంద్రం విసుగ్గా దిగాడు. బానెట్ తీసి పరీక్షించాడు. ‘సరిగ్గా కనపడడం లేదు యీ గుడ్డి వెన్నెలలో’ అన్నాడు. అంతవరకూ వెన్నెల ఉన్నట్టు అవధానికి అనిపించలేదు. ఆకాశం కేసి చూశాడు. జేగురు రంగుగా ఉన్న చంద్రుడి మీద పల్చని మబ్బులు తారాడుతున్నాయి. దారి వెంట వెళ్తున్న ఆసామీలు గీసిన అగ్గిపుల్లల వెలుగులో ఏదో మరమ్మత్తు చేశాడు రామచంద్రం. బయలుదేరుతుండగా, ఆసాములు ‘జాగ్రత్త బాబూ. అడవిలో ఏదో చిరుతపులి’ ఉందన్న కబురును చెవిన వేశారు. దాన్ని కొట్టేస్తూ, ఏక్సిలేటర్ మీద కాలు నొక్కాడు రామచంద్రం. కారు రయ్యిమని దూసుకుపోయింది. ‘అడవి వచ్చేసింది. ఇది దాటితే యింక పదిహేను మైళ్లు తణుకు’ అన్నాడు రామచంద్రం. నాగభూషణం వెనక్కి జేర్లబడి నిద్దరోతున్నాడు. అవధాని దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తున్నాడు. అంతా కటిక చీకటి. ఇంజన్లో ఏదో ఠప్‌మని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఒక గంతు వేసి ఆగిపోయింది. రామచంద్రం దిగి పనిముట్లు టిక్‌టిక్‌మనిపించాడు. ‘వద్దురా యీ కార్లో ప్రయాణం అంటే విన్నావు కాదు’ అన్నాడు భూషణం. ‘అబ్బ చంపకు, వెధవ గోలా నువ్వూ’ రామచంద్రం సహనం కోల్పోయాడు. ‘ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్రవుంటే చూడాలి. కారును పైకి ఎత్తి పట్టుకోవాలి’ అంటూ రోడ్డు వారకు పోయి కర్ర కోసం వెదుకుతున్నాడు. రోడ్డు వారనే చింతచెట్లూ రావిచెట్లూ ఉన్నాయి. ఒక పెద్ద మర్రిచెట్టు ఊడలతో భయంకరంగా వుంది. చెట్టుచెట్టుకీ మధ్య యీత ముళ్ల పొదలు, బ్రహ్మచెముడు డొంకలు, రకరకాల తీగలూ అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి. హఠాత్తుగా ‘భూషణం పాము పాము’ అన్న కేక నిశ్శబ్దాన్ని చీలుస్తూ వినపడింది. ‘రామచంద్రం’ అంటూ భూషణం పరుగెత్తుకెళ్లాడు. పెద్ద పాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెలలో మెరుస్తూ వెళ్లిపోయింది. అవధాని ప్రాణాలు బిగుసుకుపోయాయి. రామచంద్రం వణికిపోతున్నాడు. రెండు చేతులతోనూ పొదివి పట్టుకుని రామచంద్రాన్ని తీసుకువచ్చాడు భూషణం. అవధాని కారు తలుపు తీశాడు. వెనుక సీటులో పడుకోబెట్టారు. కండువా తీసి కాలిమీద గట్టిగా బిగించి కట్టారు. రామచంద్రం కళ్లల్లో విపరీతమైన భయం సుళ్లు తిరిగింది. పెదవుల చివరి నుండి నురగ కక్కుతున్నాడు. ‘మనకెంత గతి పట్టిందిరా’ ఏడుస్తున్నాడు భూషణం. ఇంతలో ఏదో మువ్వల చప్పుడు. ఒక ముసలివాడు రోడ్డు మీద నున్న పొదలను తప్పించుకుని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన ఒళ్లు. భూషణం తడబడుతూ అన్నాడు: ‘ఎ ఎ ఎవరది?’ ‘సిద్దయ్యని బాబూ పాములవాణ్ణి’ అన్నాడు ముసలాయన. ‘పాములవాడివా?’ దైవసంకల్పం వుంటే కానీ యీ అడవిలో యిటువంటి వేళ ఒక మనిషి, అందులో పాములవాడు కనిపించడు. భూషణం కారులోంచి దూకి సిద్దయ్య రెండు చేతులూ పట్టుకున్నాడు. రామచంద్రాన్ని సిద్దయ్య పరీక్షగా చూశాడు. ‘ఇంకా బతికే వున్నారు బాబయ్యా’ అన్నాడు బాధతో తోక తెగిన బల్లిలా గిజగిజలాడుతూన్న ప్రాణిని చూసి. ‘మంత్రం వేసి బతికించావా సగం ఆస్తి నీకు రాయిస్తాను’ అన్నాడు భూషణం. ‘అదృష్టం వుంటే బతకొచ్చును బాబయ్యా, అక్కడ పాకలోకి తీసుకురండి. వేరు ముక్కతో మంత్రం వెయ్యాలి’. రామచంద్రాన్ని గుడిసెలోకి మోసుకెళ్లారు. నులకమంచంలో పడుకున్న యువతిని ‘సూరీడు లే లే’ అంటూ ముసలాయన తట్టి లేపాడు. దానిమీద రామచంద్రాన్ని పడుకోబెట్టారు. సిద్దయ్య రెండు మూడు సంచీలలో చెయ్యి పెట్టి వెదికాడు. పూసలూ పెంకులూ వేర్ల ముక్కలూ రాళ్లూ ఏవేవో ఉన్నాయి. కావాల్సిన వేరు ముక్కలేదు. దూరంగా వెలగచెట్టు అవతల పొదల కాడ ఆ వేరుగల మొక్కలున్నాయి. అక్కడ పాముపుట్టలూ ముళ్లపొదలూ జాస్తి. ముసలాయనకు చీకటిపడితే చూపు సరీగా ఆనదు. భూషణం పర్సులోంచి డబ్బు తీయబోయాడు. ‘నీ డబ్బుకి ఆశపడ్డానా మంత్రం పనిచెయ్యదు’ కఠినంగా అన్నాడు సిద్దయ్య. ‘ఈ అయ్యకి పెదవులు నల్లపడి పోతున్నాయి’ అంది సూరీడు. భూషణం అదిరిపడ్డాడు. ఇంతకుముందు రేగిన ఆశ గప్పున ఆరిపోయినట్టయింది. ‘పోనీ నేను వెళ్లి తీసుకురానా’ అంటూ సూరీడు పరుగెత్తింది. రామచంద్రం చివరి ఘడియల్లో ఉన్నాడు. ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది. ఇంతలో సూరీడు తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. చేతిలో అయిదారు మొక్కలున్నాయి. సిద్దయ్య సంజ్ఞతో గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అరిపాదాల్ని ఒళ్లో పెట్టుకుని రాసింది. అరగంట తర్వాత, రామచంద్రం మొహంలో చావునీడలు తప్పుకున్నాయి. శ్వాస యథాస్థితికి వస్తోంది. ‘ఇదంతా నీ చలవ సూరీడు’ అంటూ ఆమె కాళ్లమీద పడ్డాడు భూషణం. ‘తప్పండి బాబూ’ అంటూ సూరీడు సిగ్గు పడింది. ఆమె నవలావణ్యంతో ఆకర్షణీయంగా వుంది. అప్పుడు సమయం మూడు గంటలవుతోంది. అందరూ నడుం వాల్చారు. సుమారు వో గంటకు భూషణం లేచి సూరీడు వొంటి మీద చెయ్యి వేసి లేపాడు. జేబులోంచి డబ్బు ఇస్తూ, ‘నా మనసు తీర్చు’ అన్నాడు. ‘అందుకు డబ్బెందుకు బాబూ’ అంది సూరీడు. మరి? ‘నేనలాంటిదాన్ని కాను. పోయి పడుకో అయ్యా’ అంటూ మరోవైపు తిరిగి పడుకుంది. అవధాని నవ్వాపుకున్నాడు. తెల్లారి అంతా నిద్రలేచారు. ఆరు గంటల బస్సు వచ్చే వేళయింది. కలెక్టర్ గారింట్లో పెళ్లికి సమయానికి వెళ్లొచ్చు! రోడ్డు వైపు నడుస్తున్నారు. రామచంద్రం ఉత్సాహంగా ఉన్నాడు. మళ్లీ శ్రీమంతుడూ టెన్నీస్ చాంపియనూ అయిపోయాడు. ‘ఎపుడైనా మా ఊరు వస్తే కనిపించు సిద్దయ్యా’ అన్నాడు కృతజ్ఞతగా. ‘చిత్తం’ అని ముసలాయనా, సూరీడూ వెనక్కి వెళ్లిపోయారు. కారు తడిసిపోయింది మంచులో. తణుకు వెళ్లగానే దీన్ని తీసుకువచ్చే ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇంతలో ‘బాబయ్యా’ అని కీచుగా కేక వినపడింది. సూరీడు పరుగెత్తుకొస్తోంది. ‘బాబూ, మా అయ్యని పాము కరిచింది. ఒక్కసారి రండి బాబూ’. అరెరెరె! ‘సగం దూరం వెళ్లగానే వేరు ముక్క కోసం పొదలో చెయ్యిపెట్టి మొక్క పీకబోయాడు. బుస్సున లేచి కాటు వేసింది బాబూ తాచుపాము’. అయ్యో! ఈ బస్సు దాటితే ఎలాగ? ‘మీరుంటే ధైర్యం బాబూ’ సూరీడు ఏడుస్తోంది. ‘కలెక్టర్ గారింట్లో పని అంతా నేను చూసుకుంటానని మాట ఇచ్చానే’ రామచంద్రానికి సమస్య వచ్చి పడింది. అదిగో బస్సు వచ్చేస్తోంది. అవధాని నిశ్చేష్టుడై చూస్తున్నాడు. బస్సు ఆగింది. రామచంద్రం గబుక్కున రెండు పదిరూపాయల నోట్లు సూరీడు చేతిలో పెట్టి బస్సు ఎక్కేశాడు. అవధానిని బస్సులోకి తోసి, భూషణం కూడా ఎక్కాడు. బస్సు బర్రున సాగింది. సూరీడు గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది. పది రూపాయల నోట్లు గాలిలో పల్టీలు కొట్టుతున్నాయి. బాలగంగాధర తిలక్ (1921–66) ‘నల్లజర్ల రోడ్డు’ కథ సారాంశం ఇది. ఈ కథ ఆంధ్రపత్రిక ప్లవ సంవత్సరాది సంచిక (1961)లో ప్రచురితం. కథకుడు కూడా అయిన తిలక్ కవిగా మరింత ప్రసిద్ధుడు. ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. ‘అమృతం కురిసిన రాత్రి’ ఆయన కవితల సంకలనం. బాలగంగాధర తిలక్ -
హిప్పీ సంస్కృతిలోని అమ్మాయి కథ
ఎమ్మా క్లెయిన్ మొదటి పుస్తకం, ‘ద గర్ల్స్’ అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో 1969 సంవత్సరపు వేసవి నేపథ్యంతో రాసినది. మధ్యవయస్కురాలైన ఈవీ తన టీనేజిలో చేసిన తప్పులని తలచుకోవడంతో నవల ప్రారంభం అవుతుంది. ఈవీ బోయ్ద్ ధనిక కుటుంబపు 14 ఏళ్ళమ్మాయి. స్నేహితులెక్కువ ఉండరు. తల్లిదండ్రులకి విడాకులవుతాయి. పార్క్‌లో విచ్చలివిడిగా తిరుగుతున్న కొందరు యువతులని చూసి ఆకర్షితురాలవుతుంది. ప్రత్యేకంగా, సూసన్ అన్న అమ్మాయి పట్ల. తాముంటున్న రాంచ్కి చెత్తబుట్టల్లోంచి తిండి పట్టు్టకెళ్ళడానికి వచ్చే ఆ యువతులు మరోరోజు ఈవీని తమ నాయకుడి వద్దకి, కొండల్లో ఉన్న రాంచ్కి తీసుకెళ్తారు. అతడు రసెల్ హేడ్రిక్. అతని పాత్ర ఛార్ల్స్ మాన్సన్ మీద మలచబడినది. హిప్పీ సంస్కృతి పాటిస్తారక్కడ. ఫ్రీ సెక్స్, ఎల్ఎస్డీ వినియోగం సాగుతుంటాయి. ‘కొండకొమ్ము నుంచి రాలే చెత్తలాగే తన రోజులూ గడుస్తున్నా’యని అనుకున్న ఈవీ, తనూ వారిలో భాగం అవడానికి ప్రయత్నిస్తుంది. ఆ ‘కల్ట్’కి చెందిన అమ్మాయిలు చిల్లర దొంగతనాలు చేస్తుంటారు. రసెల్–డబ్బూ పరపతీ ఉన్న యువతుల కోసమే వెతుకుతుంటాడు. నిజ జీవితపు మాన్సన్ లాగానే, తన పక్కలోకి వచ్చే అమ్మాయిలనే సమకూర్చుకుంటాడు. మర్నాడే, ఈవీ తన కొత్త స్నేహితుల కోసం తనింట్లోంచి దొంగిలిస్తుంది. రసెల్‌కి రాక్ స్టార్ అవ్వాలన్న ఆశ. మొదట్లో ఆ గుంపు పట్ల మెచ్చుకోలుండే ఈవీ– రసెల్‌కి ఉన్న మానసిక రుగ్మతనీ, యువతుల మన:స్థితులనీ అర్థం చేసుకుంటుంది. ఆఖరిసారి ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు, రసెల్ గుంపు తినడానికి తిండి కూడా లేక, మత్తు పదార్థాల సేవనలో ములిగుంటారని చూస్తుంది. తెలివి తెచ్చుకుని, ఇవన్నీ వదిలి బోర్డింగ్ స్కూల్లో చేరుతుంది. నవల– ఛార్ల్స్ మేన్సన్, అతని అనుచరులూ 1969లో చేసిన భీకరమైన హత్యల వల్ల స్ఫూర్తి పొందినదే కానీ కేంద్రీకరణ ఉన్నది మాత్రం ఈవీ మీదే. దీన్లో లైంగిక వివరాలూ చాలానే ఉంటాయి. మధ్య వయస్కురాలైన ఈవీ ప్రస్తుత జీవితం గురించీ, తను రాంచ్కి వెళ్ళినప్పటి గతకాలం గురించీ మార్చి మార్చి రాస్తారు రచయిత్రి. నవల్లో ఆడంబరం కనబడదు. నింపాదితనం ఉంది. అప్రతిష్ఠాకరమైన మాన్సన్ హత్యల గురించి సూచనప్రాయంగా చెప్తారు. ప్రతీ పేజీలోనూ గమనార్హమైన పదబంధమో, రూపకమో, ఉపమానమో ఉంటాయి. నవల కవిత్వ ధోరణిలో ఉంటుంది. ప్రధాన పాత్రలని కథకురాలు బయట ఉండి చూస్తూనే, వాటికి చిన్న చిన్న సంఘటనల ద్వారా ప్రాణం పోస్తారు. ఇక్కడ కథాంశం అప్రధానమైనది. ‘మాన్సన్ యువతులు నన్ను ఆకట్టుకున్నారు. రాత్రంతా మేలుకుని– వారి గురించిన పుస్తకాలూ, యూట్యూబ్ వీడియోలూ చూస్తుండేదాన్ని’ అంటారు రచయిత్రి. మాన్సన్ ఫ్యామిలీ గురించి వచ్చిన అనేకమైన పుస్తకాల్లోకల్లా, ఇదే ఎక్కువ గుర్తింపు పొందినది. 2016లో విడుదల అయిన ఈ నవల 12 వారాలు, న్యూయోర్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ లిస్టులో ఉన్నది. ‘సెంటర్ ఫర్ ఫిక్షన్ నోవెల్’ ప్రైజ్‌కి షార్ట్ లిస్ట్ అయింది. ‘జోన్ లెనార్డ్’అవార్డ్’కి షార్ట్ లిస్ట్ అయింది. లాస్ ఏంజెలెస్ టైమ్స్ బుక్ ప్రైజ్‌కి ఫైనలిస్టు అయింది. 2017లో గ్రాంటా, ‘బెస్ట్ యంగ్ అమెరికన్ నావెలిస్ట్’గా క్లెయిన్ని ఎంచుకుంది. ఈ నవల ఆడియో పుస్తకం కూడా ఉంది. - కృష్ణ వేణి -
ఎర్నెస్ట్ హెమింగ్వే
రచయిత కాకమునుపు పాత్రికేయుడిగా పనిచేశారు ఎర్నెస్ట్ హెమింగ్వే (1899–1961). నేపథ్యానికి మరీ ఎక్కువ పదాలు వృథా చేయకుండా, తక్కువ మాటల్లో ఉపరితల సారాన్ని చేరవేయగల ప్రజ్ఞ అలా అబ్బింది. అదే ‘ఐస్‌బెర్గ్ థియరీ’(మంచుకొండ సిద్ధాంతం) శైలిగా ఇరవయ్యో శతాబ్దపు కాల్పనిక సాహిత్యం మీద అత్యంత ప్రభావం చూపింది. ఆయన, ‘ద సన్ ఆల్సో రైజెస్’, ‘ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్’, ‘ఫర్ హూమ్ ద బెల్ టోల్స్’ లాంటి నవలలు అమెరికా సాహిత్యంలో క్లాసిక్స్‌గా నిలిచాయి. సముద్రం మీద ఒక పెద్ద చేపతో చేసిన ముసలి జాలరి పోరాటగాథను ‘ది ఓల్డ్‌మాన్ అండ్ ద సీ’గా మలిచారు. ఇది ఆయనకు విశేషమైన పేరు తెచ్చిపెట్టింది. దీనికి వచ్చిన కీర్తి ఆయన పాత రచనల మీద వెలుగు ప్రసరించేట్టు చేసింది. ఈ నవలిక కేశవరెడ్డి సుప్రసిద్ధ తెలుగు నవల ‘అతడు అడవిని జయించాడు’కు స్ఫూర్తిగా నిలిచింది. 1954లో హెమింగ్వేను నోబెల్ సాహిత్య పురస్కారం వరించడానికి ఇదే ప్రధాన కారణమైంది. మొత్తం పది నవలలూ, పది కథా సంకలనాలూ, ఐదు నాన్ఫిక్షన్ రచనలూ రాసిన హెమింగ్వే జీవితాన్ని గాఢమైన యుద్ధానుభవాలూ, దాదాపుగా మృత్యువు ఒడికి చేర్చిన విమాన ప్రమాదాలూ ప్రభావితం చేశాయి. -
పెద్దన్న తెలియాలి.. సోమన్న మరుగునపడొద్దు
కవిత్రయం తెలియకుండా, అల్లసాని పెద్దన తెలియకుండా తెలంగాణవాళ్లు ఉండాలని తాను అనుకోవడం లేదనీ; అలాగని పాల్కురికి సోమన్న మరుగునపడకూడదనీ దేశపతి శ్రీనివాస్ అంటున్నారు. డిసెంబర్ 15–19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మహాసభల కోర్ కమిటీ సభ్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా ఉన్న దేశపతితో సాక్షి సాహిత్యం ప్రతినిధి జరిపిన ప్రత్యేక సంభాషణ: ఎడ్మినిస్ట్రేషన్ మీలోని సృజనకారుడిని ఇబ్బంది పెట్టడం లేదా? ఇబ్బంది పెడుతోంది. హద్దులు ఏర్పడతాయి; మనదైన స్పేస్ తగ్గిపోతుంది. సృజనకు అవసరమైన ఉత్ప్రేరణ తగ్గిపోతుంది. అయినా ఏదో ఒక మేరకు సాహిత్యకారులతో సంభాషణలో ఉండటం వల్ల నా సృజనను సజీవంగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఏ క్రియేటివ్ ప్రాసెస్ నడుస్తోంది మీలో ఇప్పుడు? తెలంగాణ సాహిత్య మూర్తులు జగజ్జేయమానంగా వెలుగొందాలంటే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాక, తెలంగాణ సాహిత్య వైభవం సాక్షాత్కరించేలా పాటలు రాయడం మొదలుపెట్టాను. ఉదాహరణకు(పాడి వినిపించారు), ‘మన తెలంగాణము తెలుగు మాగాణము/ పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము/ చరితకు తొలి తెలుగందము జినవల్లభు కందము/ పంపకవిలో ప్రతిఫలించె తెలుగన్నడ బంధము/ నన్నయ కన్నా మున్నే ఉన్నదిచట ఛందము/ మల్లియరేచన చల్లిన మరుమల్లెల గంధము’. మనకు రాజకీయ నాయకుల హోర్డింగులు పెట్టడమే తెలుసు. కానీ సాహిత్యమూర్తులను హైదరాబాద్ అంతటా హోర్డింగుల్లో నిలిపితే వారి ప్రశస్తీ, భాష కోసం వారు చేసిన కృషీ ఫోకస్ అవుతాయి. వారి కోసం రాస్తున్న పంక్తులే ఒక సృజనకారుడిగా నా లోపల ఇప్పుడు సుడులు తిరుగుతున్నాయి. ఎవరెవరి పేర్లతో తోరణాలు నిలపాలన్న ఎంపిక పూర్తయ్యిందా? హాలుడి నుంచి ఆధునిక వైతాళికుల వరకు ఇప్పటికి 63 మంది తోరణాలు డిజైన్ చేయడం పూర్తయ్యింది. ఇంకా ఈ సంఖ్య వంద వరకు పెరిగే అవకాశం ఉంది. పంక్తులు, పాటలు రాయడానికి వాళ్లను ఎంతమేరకు మీలోపలికి తీసుకున్నారు? ఒక కవిని ఆయన భాషలోనే, ఆయన హృదయంతోనే, ఆయన దృక్పథంతోనే, ఆయన భావుకతతోనే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. ఉదాహరణకు రామదాసును తలుచుకోగానే భద్రాద్రి ఆలయం, కీర్తనలు స్ఫురణకొస్తాయి. కానీ ఆయన తెలుగులో భజనగీత సృజనకు ఆద్యుడు. త్యాగరాజుకు కూడా ప్రేరణగా నిలిచినవాడు. అందుకే, ‘తేనెలొలుకు తెలుగులోన/ భజనగీత సృజనమునకు/ ఆద్యుడైన రామదాసు/ భక్త శ్రేష్ఠుడు... రాగరాజు త్యాగరాజు/ వినయమొప్ప వినుతించిన/ విబుధవరుడు రామదాసు/ వందనీయుడు’ అన్నాను. కోర్ కమిటీ సభ్యుడిగా ఈ మహాసభలు ఏం సాధించగలవని మీరు భావిస్తున్నారు? ఒకటి: ఇన్నాళ్లూ తెలంగాణ భాష మీద దాడి జరిగింది. ఉపేక్ష భావం, చిన్నచూపు ఉండినాయి. ఏ భాషైనా గానీ అక్కడి భౌతిక చారిత్రక రాజకీయ ఆర్థిక పరిస్థితుల వల్ల రూపొందుతుంది. భాష అనేది జ్ఞాపకాల నిధి. అది ఇద్దరు వ్యక్తులు కేవలం భావాలు పంచుకొనే సాధనం మాత్రమే కాదు. భాషలో అక్కడి మట్టి వాసన, వారి స్మృతులు, సాంస్కృతిక వాతావరణం అన్నీ ఉంటాయి. తెలంగాణ ప్రజల్లో తమ భాష పట్ల ఒక ఔన్నత్య భావన ఈ మహాసభలు ఏర్పరచగలవు. రెండు: తెలుగు భాషలో ఏమాత్రం అభినివేశం లేని పిల్లల తరం రావడం ఇప్పటి విషాదం. వీరికి మాతృభాష పట్ల ఒక విశాల దృష్టి ఏర్పడుతుంది. తెలుగుకు చరిత్ర, విస్తృతి, వైశిష్ట్యం ఉన్నాయి; కవులకూ భాషావేత్తలకూ సమాజంలో గౌరవం ఉంది, అని వారికి తెలుస్తుంది. మూడు: ఆధునిక అవసరాలకు తెలుగును ఎలా విస్తరించాలో చేయాల్సిన ఆలోచనకు ఈ సభలు ఒక ప్రేరణ ఇవ్వొచ్చు. ఐదు నుంచి పదేళ్ల తర్వాత తెలుగు భవిష్యత్ చిత్రం ఎలా వుండబోతోందని మీ ఊహ? ఛానళ్ల తరం, ఐటీ తరం, అమెరికా తల్లిదండ్రుల తరం, నలబై అంటే ఇంగ్లీషులో ఎంత అనే తరం వచ్చాయి. వీరికి తెలుగులోని మౌలికాంశాలు తెలియదు. అయినప్పటికీ ఒక భాషగా తెలుగు అంతరించిపోతుంది, ఉండకుండా పోతుంది అనైతే నేను అనుకోవడం లేదు. గ్రామాల్లో ఏ నాట్లు వేసే స్త్రీ, ఏ కలుపుతీసే స్త్రీ ముందర నిలబడి దోసిలి పట్టినా భాషా భిక్ష పెడుతుంది. అయితే, కోర్టులో సాక్షి తెలుగులో చెబితే దాన్ని ఇంగ్లీషులో అనువాదం చేసి నమోదు చేస్తారు. అలా వుండకూడదు. పరిపాలనకూ, వ్యవహారానికీ మొత్తంగా తెలుగును ఉపయోగించే రోజులు రావాలి. అదేదో సెంటిమెంటుగా కాదు, ప్రజల అవసరం కోసం తెలుగును ఉపయోగించాలి. దానికోసం నా స్థాయిలో నేను కృషి చేస్తాను. కేసీఆర్‌ను దగ్గరినుంచి చూసినవాడిగా– తెలుగుకు తనను తాను ఒక ఛాంపియన్‌గా నిలబెట్టుకోవాలన్న తాపత్రయం ఏమైనా ఆయనలో కనబడిందా? లేదు. ఆయన పద్యాన్ని ప్రేమించినవారు. రాజకీయ ఉపన్యాసాలకు కూడా సాహిత్య పరిమళం అద్దినవారు. ఎన్నో సభల్లో– ‘ఆరంభించరు నీచమానవులు’ అంటూ భర్తృహరి సుభాషితం చెప్పారు. మొన్న (ఉప రాష్ట్రపతి) వెంకయ్యనాయుడు అభినందన సభలో కూడా ‘చదువది ఎంత కలిగిన’ పద్యం చెప్పారు. తెలంగాణలో ప్రకాశితమైన ఉద్యమ సాహిత్యం, జానపద సాహిత్యం గుర్తింపునొందాయి. కానీ శిష్ట సాహిత్యం, ఇతర సాహిత్య ప్రక్రియల మీద ఇంకా చర్చ జరగవలసేవుంది. తెలంగాణ భాషను తెలుగు భాషాభిమానులందరూ ప్రేమించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయనంటే సద్భావన, ప్రశంసే ఉన్నాయి. కాబట్టి కొత్త కీర్తి కోసం అయితే ఈ మహాసభల్ని ఆయన తలపెట్టలేదు. తెలంగాణలో జరుగుతున్న మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ వైతాళికుల తోరణాలు నిలబెట్టడాన్ని ఎలా చూస్తున్నారు? ఇంతకాలం ఏం జరిగిందంటే– తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్యం విస్మరణకు గురైంది. తెలుగు సాహిత్య సంపూర్ణ దర్శనం జరగాలంటే ఈ నేల మీద జరిగిన కృషి కూడా అందులో చేరాలి. కవిత్రయం తెలియకుండా, అల్లసాని పెద్దన తెలియకుండా తెలంగాణవాళ్లు ఉండాలని నేను అనుకోవడం లేదు. అలాగని పాల్కురికి సోమన్న మరుగునపడకూడదు. పద్యానికి జాషువా అద్దిన మానవతా పరిమళాన్ని ఎలా విస్మరించగలం! ఆ తప్పు ఇప్పుడు మనం చేయకూడదు. అందుకే, తెలుగు సాహిత్యంలో మైలురాళ్లు అనదగిన ఆంధ్ర వైతాళికులకూ తోరణాలు కడుతున్నాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో తెలుగు అంటేనే ఒక కానిమాటగా చూసిన ధోరణి ఉండింది. ఇప్పుడు అదే తెలుగు సభల్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడాన్ని ఎలా చూడాలి? ఉద్యమకాలంలో కొన్ని అతివ్యాప్తులుంటాయి. తెలుగంటే వాళ్లది, తెలంగాణ భాష అంటే మనది అనే ఒక వాదన ఉండింది. తెలుగు తల్లి అనే భావన గతంలో ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంతో ముడిపడినదిగా చూపబడింది. నిజానికి అది భాషా స్వరూపం. అందుకే రాష్ట్రం విడిపోయాక భౌతిక వాస్తవం పలుచనబడి, తెలుగు తల్లి అనే భావన తటస్థత పొందింది. ఆ ప్రతీకతో ఇప్పుడు తెలంగాణకు నిమిత్తం లేదు. తెలంగాణలో అందమైన తెలుగు మాట్లాడుతారు. తెలుగు భాషా సాహిత్యాలకు ఇది పుట్టినిల్లు. బీజప్రాయం నుంచి శాఖోపశాఖలుగా తెలుగు విస్తరించిన నేల ఇది. తెలంగాణ నుడికారం, సామెతలు, శబ్దజాలం వీటన్నింటికీ పట్టంకట్టాల్సిన సమయం వచ్చింది. -
తీతువగొంతును తియ్యగజేసింది
వాగ్గేయకారునిగా గోరటి వెంకన్న విశిష్టతకు ప్రధాన కారణాలలో వస్తు వైవిధ్యం ఒకటి. వస్తువు దృష్ట్యా వెంకన్న గేయాలను– విప్లవోద్యమ గేయాలు, దళిత చైతన్య గేయాలు, ప్రపంచీకరణ నిరసన గేయాలు, స్మృతి గేయాలు, వర్ణనాత్మక గేయాలు... మొదలైన విధంగా విభజించుకోవచ్చు. సంత, వాన, కొంగ, నల్లతుమ్మ, సంచారం, జలచక్రం, వేకువహాయి, రాత్రి, వెన్నెల, అడవి మొదలైన గేయాలు వర్ణనాత్మకమైనవి. ‘వర్ణనాత్మకమైనవి’ అంటే ‘ఏకవస్తు వర్ణన’ ప్రధానమైనవని ఇక్కడ నా ఉద్దేశం. ‘వాన’ పాటలో వర్షరుతు ఆరంభంలోని అందమైన పల్లె దృశ్యాలు ప్రత్యక్షంగా, శ్రమజీవుల ఆనందం పరోక్షంగా వర్ణింపబడినాయి. ఈ పాటకు ప్రాణి లక్షణారోహణ సౌందర్యాన్ని సమకూర్చింది. ‘‘గద్దగూటిలోని గడ్డిని తడిపింది గువ్వగూటి గులకరాళ్లను జరిపింది తీతువగొంతును తియ్యగజేసింది పరికిపిట్ట ముక్కు పాసిని కడిగింది ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది ముల్లుగర్ర వొల్లు సల్లగ జేసింది’’ – ఉత్ప్రేక్షా వాచకాలు లేకుండా, నిర్ధారణ వాక్యాలలోనే వర్ణన ఆసాంతం సాగింది. కాని, ఇవన్నీ అందమైన ఉత్ప్రేక్షలే. ‘ముల్లుగర్ర వొల్లు సల్లగ జెయ్యడం’, ‘ఎగిరె దట్టీలకు వెండి మెరుపులద్దడం’ లాంటి వాక్యాలు వెంకన్న పరిశీలనాసక్తినీ, పరిశీలనాశక్తినీ పట్టిస్తాయి. వెంకన్న చాలా పాటలలో ఎక్కడో ఒకచోట ఆ«ధ్యాత్మిక అంశాల ప్రస్తావనలు ఉంటాయి. ఈ పాటలోని ‘తులశమ్మ దీపం’, ‘సాధుల సమాధులు’, ‘సూఫీ దర్గా’ల ప్రస్తావనలు అలాంటివే. ‘తాను రాకముందె తూనీగలను లేపి, తన పాటకే తాను దరువేసి ఆడింది’– తూనీగలు ఎగిరి తిరుగుతూ ఉండటం, వర్షాగమన సంకేతమన్న భావనను తెలుపుతుంది. గానం చేస్తూ, తన గానానికి తానే వాద్య సహకారాన్ని సమకూర్చుకొంటూ నాట్యం చేస్తున్న నర్తకిగా వర్షాన్ని వర్ణించడం విశేషం. సుందరమైన దృశ్యభావచిత్రాల ద్వారా, అంతటా పేరుకున్న ధూళీ, మలినాలూ, వర్షం వల్ల తొలగిపోయి ఒక వినిర్మల కాంతిని సమకూర్చుకోవడమూ, మనుషులతోపాటు సర్వప్రాణులూ ఆనందంలో తేలియాడడమూ సూచింపబడినాయి. వర్షం చేసే వివిధానేక ప్రక్షాళన క్రియలను అందమైన ఊహలతో జోడించి ‘లఘు చలనచిత్రాలు’గా తీర్చిదిద్దడం ఈ గీతంలోని ప్రత్యేకత. (పెన్నా శివరామకృష్ణ ‘గోరటి వెంకన్న కవితాపరామర్శ’ పుస్తకంలోంచి...) గోరటి వెంకన్న కవితాపరామర్శ రచన: పెన్నా శివరామకృష్ణ పేజీలు: 128; వెల: 80 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు. రచయిత ఫోన్: 9440437200 -
సమకాలీన కొంకణి కథలు
తమ అస్తిత్వం మొత్తాన్నీ కంపెనీ పేరుతో ముడివేసుకుని తమను తాము దానికి సమర్పించుకునే ఉద్యోగులుంటారు. అదే వారి జీవితానికి కేంద్రం. కానీ ఎన్నాళ్లు? విరమణ అనేది ఒకటి ఉంటుంది... ‘వయసు మీరటం వల్ల ఎవరికీ అవసరం లేనట్టు’ అనిపించే బాధ! వయసును అంగీకరించడానికి సిద్ధంగా ఉండని మనసు. ఈ స్థితిని సున్నితంగా చెప్పే కథ ‘ఋతుసంక్రమణం’. మూడేళ్ల తర్వాత పుట్టింటికి వస్తున్న కొడుకు కోసం అతడికి నచ్చే రొయ్యలు, పీతలతో వంట ఏర్పాట్లు చేయిస్తుంది తల్లి. ఆమెకు కళ్లకు మసకలు. చెవులు అంతంత మాత్రం. కొడుకు వచ్చాడు. పూటైనా ఉండకుండా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఇంకెవరినో కలవాలని హడావుడిగా వెళ్లిపోయాడు. ‘నువ్వు ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? మందులు వేసుకుంటున్నావా?’– ఏమైనా అడిగాడా? అడిగినా వినపళ్లేదా? లోపల ఎక్కడో గుచ్చే కథ ‘రెండు ధృవాలు’. గోకులదాసు ప్రభు ప్రసిద్ధ కొంకణి కథకుడు. మలయాళ భాషా సాహిత్యాలను అధ్యయనం చేసినవారు. మలయాళ సాహిత్యాన్ని కొంకణిలోకి అనువదించినవారు. ప్రభు కథల సంపుటిని రంగనాథ రామచంద్రరావు తెలుగులోకి తెచ్చారు. ఇందులో 12 కథలున్నాయి. సాధారణ ఇతివృత్తాలనే హృద్యంగా చెప్పడం ప్రభు శైలిగా తోస్తుంది. - సాహిత్యం డెస్క్ ఋతుసంక్రమణం; కొంకణి మూలం: గోకులదాస ప్రభు; తెలుగు: రంగనాథ రామచంద్రరావు; పేజీలు: 116; వెల: 80; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, జి.ఎస్.ఐ. పోస్టు, బండ్లగూడ(నాగోల్), హైదరాబాద్–68. ఫోన్: 24224453 -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
శేషప్రశ్న(శరత్చంద్ర ఛటర్జీ) శరత్ బెంగాలీ నవలకు బొల్లిముంత శివరామకృష్ణ తెలుగు అనువాదం శేషప్రశ్న. తుప్పుపట్టిన సంప్రదాయ ధోరణులను, వ్యక్తి హితానికి ఉపయోగపడని విధానాలను కమల ఖండించే పద్ధతి గొప్పగా ఉంటుంది. సంఘసేవలో చురుకుగా పాల్గొంటూ కమల మన్ననలు కూడా చూరగొన్న రాజేంద్ర ఆలయం తగలబడి పోతున్నప్పుడు అందులో విగ్రహాన్ని కాపాడాలని ప్రయత్నించి తాను ఆహుతైపోతాడు. అక్కడున్న వారందరూ రాజేంద్ర త్యాగాన్ని కీర్తిస్తుంటే కమల మాత్రం మౌనంగా ఉండిపోతుంది. చివరికి అంటుంది: ‘అజ్ఞానం ఎప్పుడూ బలి కోరుతుంది’. ఎప్పటిలాగే ఆమె ఆలోచనాతీరు అందరికీ శేషప్రశ్నే అవుతుంది. జీవితాదర్శం (చలం) జీవితాదర్శం, శాంతి. దానికి అడ్డుగా ఉండే ఏ ఐశ్వర్యం గానీ, శృంగారం గానీ, మరేదైనా గానీ జీవితానికి చాలా విరోధం, అంటాడిందులో చలం. లాలస పాత్ర కడు రమణీయంగా వర్ణించబడింది. ఇందులోని మరో గొప్ప పాత్ర, దేశికాచారి. విడువలేని బంధం వద్దంటాడు. స్వేచ్ఛలో ఉన్న శాంతి, ప్రశాంతి మరెందులోనూ ఉండదనీ, దానికోసం ప్రయత్నిస్తూ సాగిపోవడమే జీవితమనీ ఈ నవల బోధిస్తుంది. పాకుడురాళ్లు (రావూరి భరద్వాజ) ఒక సాధారణ యువతి గొప్ప సినీనటిగా ఎదిగిన క్రమంలో ఆమె జీవనయానంలోని స్థితిగతులు అత్యంత కరుణ రసాత్మకంగా చిత్రీకరించబడ్డ గ్రంథరాజం ఇది. జ్ఞానపీఠ అవార్డుకు నోచుకొని తెలుగు బావుటాను ఎగురవేసిన ఈ నవలలోని మంజరి పాత్ర ఉత్థాన పతనాలను చదువుతుంటే జీవితం పట్ల ఒక చిత్రమైన సానుభూతితో కూడిన అవగాహన ఏర్పడుతుంది. హర్ష విషాదాల నడుమ సాగిపోయే జీవన చిత్రం– చివరికి మిగిలేదేమీ లేదనే సత్యంతో పాటు పాఠకులను ఒక ద్వంద్వాతీత స్థితికి తీసుకువెడుతుంది. ‘ప్రేమించకబడకపోవడం కంటే దుఃఖం, దారిద్య్రం ఏముంది?’ అని మంజరి ప్రశ్నిస్తున్నట్లనిపిస్తుంది. ఒక యోగి ఆత్మకథ (పరమహంస యోగానంద) ‘మనసుకు, ఆత్మకు ఉన్న కిటికీలను తెరిచే పుస్తకం’గా కీర్తింపబడిన ఈ పరమహంస యోగానంద ఆత్మకథ జిజ్ఞాసువులందరూ చదవాల్సిన ఆధ్యాత్మిక పరిమళాల గ్రంథం. చదవినకొద్దీ వశపరుచుకునే మహత్తర పుస్తకం. ఈ అసాధారణమైన కథ మనలో నిద్రాణమైవున్న జ్ఞానతృష్ణను మేలుకొల్పుతుంది. మోరీతో మంగళవారాలు (మిచ్ ఆల్బం) మిచ్ ఆల్బం ఆంగ్లరచన ట్యూజ్‌డేస్ విత్ మోరీకి ఇది తెలుగు అనువాదం. అనువాదకులు డాక్టర్ పద్మిని, ప్రొఫెసర్ నరసింహారావు. జీవించడం తెలియాలంటే మరణించడం ఎలాగో తెలియాలని తెలుసుకున్న మానవతావాది మోరీ. ఈ అద్భుత గురువుకు ఆత్మీయ విద్యార్థి మిచ్ ఆల్బం. గురువుతో అర్థవంతంగా పంచుకున్న మంగళవారాల గాథలను మిచ్ కరుణరసాత్మకంగా చిత్రించిన తీరు అమోఘం! ‘జీవితానికి అర్థం తెలుసుకోవడానికి మార్గం, ఇతరుల్ని ప్రేమించడానికి అంకితమవడం’ అనే వినూత్న సందేశాన్నిచ్చిన ఈ పుస్తకం మళ్లీ మళ్లీ చదివింపజేస్తుంది. - అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి 9989792549 -
ఎన్ని తీర్లుగ మాట్లాడినా తెలుగు తెలుగే
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ స్థానాన్ని సుస్థిరం చేయడం, ఇప్పటి తరాన్ని తెలుగు భాష పట్ల ఆకర్షితులను చేయడమనే రెండు ప్రధాన లక్ష్యాలు ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా నెరవేరగలవని మహాసభల కోర్ కమిటీ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి చెబుతున్నారు. డిసెంబర్ 15–19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఉత్సవం నేపథ్యంలో సిధారెడ్డితో సాక్షి సాహిత్యం ప్రతినిధి జరిపిన ప్రత్యేక సంభాషణ: ఇప్పటికిప్పుడు మీ మనసుకు ఎలావుంది? కొంత ఇబ్బందిగానేవుంది. చేయబోయే పనిలో సాహిత్య ప్రధానమైనదానికంటే నిర్వహణ ప్రధానమైనది ఎక్కువ. ఇలాంటిది నాకు కొత్త. పైగా ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపిన అనుభవం లేదు. అందుకే నా కవిహృదయానికి కొంచెం ఇబ్బందిగానేవుంది. మరి దీన్ని ఎలా అధిగమిస్తున్నారు? మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం నడిపిన అనుభవం ఉన్నది కాబట్టి, సభలు నిర్వహించడం నాకు మరీ దూరమైన పనేమీ కాదు. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారు. కోర్ కమిటీలోని దేశపతి (శ్రీనివాస్)గానీ, రమణాచారిగానీ, మిగతా సభ్యులుగానీ అందరూ పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి మహాసభలను విజయవంతం చేయగలమనే నమ్మకం ఉంది. 1975లో మొదటి ప్రపంచ మహాసభలు హైదరాబాద్‌లో జరిగిన నలభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. వీటిని వాటికి కొనసాగింపుగా చూడాలా? వాటికి కొనసాగింపు అనవలసిన అవసరం లేదు. ఇవి తెలంగాణలో జరుగుతున్న తొలి మహాసభలుగానే చూడాలి. ఎందుకంటే ఆ మహాసభలను జరపడంలో అంతర్లీనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడం అనే ప్రత్యేకమైన మోటిఫ్ ఉంది. 1969, 70ల నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972,73 నాటి జై ఆంధ్ర ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడు ప్రాంతీయ భేదాలు సమసిపోవాలనే ఉద్దేశంతో వాటి నిర్వహణ జరిగింది. అది తప్పా ఒప్పా అన్న చర్చలోకి ఇప్పుడు వెళ్లడం లేదు. ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ లాంటి సినిమా పాటలు కూడా దాన్ని ప్రతిబింబిస్తూనే వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే పాట రాసిన సినారెను ‘ఇప్పుడు మీ అభిప్రాయం ఏమైనా మారిందా సార్?’ అని నేను అడిగాను: ‘తెలుగు జాతి మనది రెండుగ వెలుగు జాతి మనది’ అన్నారు. తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి తెలంగాణ వైపు నుంచి కూడా గణించదగిన కృషి జరిగింది; తెలుగుకు తొలి ప్రాతిపదిక, భూమిక తెలంగాణ నుంచి వచ్చాయన్న విషయాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో నమోదు చేయడమనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన మహాసభలివి. ప్రాతిపదిక, భూమిక గురించి మరింత చెప్పండి... కరీంనగర్ జిల్లా రామగిరి ఖిల్లాలో నారన, గోపన అనే గోపరాజుల నాణేలు దొరికాయి. వీళ్లు క్రీ.పూ.600–400 కాలానికి చెందినవారని నాణేల పరిశోధకుడు ఠాకూర్ రాజారామ్‌సింగ్ నిర్ధారించారు. నారన, గోపనల్లోని అన అన్నది తెలుగు అన్నే. ఇప్పటికీ చూడండి– తిక్కన, పోతన, వేమన పేర్లు మనకున్నాయి. దీనివల్ల మన తెలుగు ఉనికి సుమారు 2,500 ఏళ్ల ముందుకు పోయింది. అలాగే శాతవాహనులు క్రీ.పూ.200– క్రీ.శ.200 కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇందులో హాలుడు క్రీ.శ.2వ శతాబ్దం వాడు. ఆయన ప్రాకృతంలో సంకలనం చేసిన గాథాసప్తశతిలో అత్త లాంటి తెలుగు మాటలున్నాయని తిరుమల రామచంద్ర నిరూపించారు. అగ్గి అనే తెలుగు మాటకు దీర్ఘమిచ్చి అగ్గీ అంటే అది ప్రాకృతం అయినట్టుగా కూడా మనకు ఆధారాలున్నాయి. ఒకవేళ భాష అంతా సాహిత్యం కాదు అనుకున్నా కూడా, క్రీ.శ.947 నాటి జినవల్లభుడు వేయించిన కురిక్యాల శాసనంలో పంపన రాసిన మూడు తెలుగు కందపద్యాలు దొరికాయి. పంపన తెలుగులో జినేంద్ర పురాణం రాశాడు. కన్నడంలో విక్రమార్జున విజయం రాశాడు. దాన్నే పంపభారతం అనీ అంటారు. ఇది 11వ శతాబ్దానికి చెందిన నన్నయ కంటే 150–200 ఏళ్ల ముందు సంగతి! వీటిన్నింటివల్ల కూడా తెలంగాణలో తెలుగు ఉనికి బలంగా ఉన్నదని నిరూపితమవుతోంది. అంతెందుకు, తెలుంగు గణం తెలుంగణం అయ్యి, తెలంగాణం అయ్యిందని ఒక అభిప్రాయం. తెలుంగు ఆణెము(ప్రాంతం) తెలంగాణ అని మరో అభిప్రాయం. మహాసభల్లో ఎంతమంది పాల్గొంటారని అంచనా? సుమారు 30 దేశాల నుంచి 500 మంది విదేశీ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ సహా 15 రాష్ట్రాల నుంచి 1,500 మంది తెలుగు సాహిత్యాభిమానులు, తెలంగాణ తో కలుపుకొని మొత్తంగా 6000–8000 మంది ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ సాహిత్యవేత్తలతో ఎలా వ్యవహరిస్తున్నారు? వాళ్ల స్పందన? వాళ్లు కూడా పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ శషభిషలు లేకుండా భాషాసాహిత్య ప్రేమికులందరూ పాల్గొనబోతున్నారు. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయితలందరూ పాల్గొనేలా చూస్తున్నాం. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంఘాల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నాం. కొంతమంది తెలంగాణ వాళ్ల నుంచే ‘వాళ్లను పిలుసుడు ఏంది’ అన్న వ్యతిరేకత వస్తోంది. కానీ అక్కడి ప్రముఖులందరినీ పాల్గొనేలా చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ప్రతినిధులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాళ్లు దిగగానే ఒక కిట్ ఇస్తాం. అందులో వాళ్ల పాస్, ప్రోగ్రామ్ షెడ్యూల్, ఫుడ్ కూపన్స్ ఉంటాయి. వచ్చినవారందరికీ భోజనం ఏర్పాటు వేదిక దగ్గరే ఉంటుంది. వాళ్లు రావడానికి, బసకు వెళ్లడానికీ రవాణా సౌకర్యం ఉంటుంది. మొబైల్ టాయ్లెట్లు కూడా ఉంటాయి. ఇందులో మూడు రకాలవాళ్లున్నారు: ఇన్వైటెడ్ గెస్ట్స్. వీళ్లు రచయితలు, కళాకారులు. ఇన్వైటెడ్ డెలిగేట్స్. వీళ్లు సంఘాల ప్రతినిధులు. రిజిస్టర్డ్ డెలిగేట్స్. వీళ్లు స్వచ్ఛందంగా పాల్గొనేవాళ్లు. వారి వారి స్థాయిని బట్టి, కోరుకున్నదాన్ని బట్టి ఏర్పాట్లు ఉంటాయి. సామాన్యులు ఎంతమేరకు పాల్గొనవచ్చు? అసలు పాల్గొనవచ్చా? నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. భోజనానికిగానీ సౌకర్యానికిగానీ బాగుంటుంది. లేకపోయినా గ్యాలెరీల్లో ఉండి వారు అన్ని చర్చలనూ వినొచ్చు, అన్ని ప్రదర్శనలనూ చూడొచ్చు. భోజనం కూడా వేదిక బయట సబ్సిడీకి అందించేలా వ్యాపారస్థులను ఒప్పిస్తున్నాం. సభల సందర్భంగా జరుగుతున్న ప్రచురణలు? మరుగునపడిన తెలంగాణ వైతాళికుల మీద తెలుగు అకాడమీ 70 మోనోగ్రాఫ్‌లు ప్రచురిస్తోంది. భాష, సాహిత్యాలకు సంబంధించి సాహిత్య అకాడమీ 10 పుస్తకాలు వెలువరిస్తోంది. సాంస్కృతిక శాఖ 8 పుస్తకాలు తెస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తోంది. తెలంగాణ, పాలపిట్టలు కూడా ప్రత్యేక సంచికలకు సిద్ధమవుతున్నాయి. హెల్ప్‌లైన్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఈ సాహిత్య అకాడెమీ నంబర్లను సందేహాలున్నవారు సంప్రదించవచ్చు. 040–29703142/52. దానికంటే ముఖ్యంగా బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో కియోస్క్ మిషన్లు ఉంటాయి. ప్రధాన కూడళ్లలో డిజిటల్ డిస్ప్లేలు ఉంటాయి. వాటిల్లో జరగబోయే కార్యక్రమాల సమాచారం వస్తుంది. దానికి అనుగుణంగా పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మహాసభల ఎనిమిది ఆశయాల్లో ఒకటి: ‘ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గదర్శనం చేస్తాయి. అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడతాయి’. ఒకవైపు ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నప్పుడు నిర్మాణాత్మకంగా ఈ సమస్యను ఎట్లా చూడాలి? ప్రభుత్వం ప్రజానుకూలమైన పాలన చేయాలి. సాధారణ ప్రజానీకం, శ్రామిక వర్గ సంతానం కూడా ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం బడుల్లో చదివిస్తున్నారు. అప్పుడు ప్రభుత్వ విద్యాసంస్థల్ని కాపాడుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. అందరూ ఇంగ్లిష్ మీడియం వైపు ఎందుకు మళ్లుతున్నారు? ఇంగ్లిష్ వస్తే ఉద్యోగాలు వస్తాయని బలంగా ముద్రపడింది. ఎవరికీ ప్రత్యేకంగా భాష మీద ప్రేమ వుండదు. జీవితం మీద ప్రేమ వుంటుంది. ఆ జీవితాన్ని నిలుపుకోవాలంటే ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం కోసం ఇంగ్లిష్. వాళ్లకు ఇంగ్లిష్ మీద ప్రేమ లేదు, తెలుగు మీద ప్రేమ లేదు. ఐఐటీ పెద్ద చదువు, ఎంఏ తెలుగు పనికిరానిదైంది. ఐఐటీలో పెద్ద శాలరీ వస్తుంది. శాలరీ ఎక్కువున్నవాళ్లు ఎక్కువ గౌరవం పొందుతారు. ఇదంతా కూడా ఉద్యోగ కల్పన మీద ఆధారపడిన అంశం. అందుకే ప్రభుత్వం సాధారణ ప్రజానీకంతో వ్యవహరించే ఉద్యోగులందరికీ తెలుగు రావాలనే నిబంధన పెడుతోంది. అప్పుడే కదా వాళ్ల సమస్యలు బాగా అర్థం చేసుకో గలుగుతారు. రెండోది: తెలుగు పండిత్‌ల కోసం పదివేలకు పైగా ఉద్యోగాల కల్పన చేయబోతోంది. అలాగే, భాష అనేది ఉద్యోగానికి సంబంధించినదే కాదు. భాషతో వ్యక్తిత్వ నిర్మాణం జరగుతుంది. కాబట్టి, తెలుగును రక్షించాలంటే భాషకు సంబంధించిన చైతన్యం కూడా ప్రచారం కావాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తెలుగు వేరే, మిగతా తెలుగు వేరే అన్న వాదనలు, చర్చలు జరిగాయి. ఒకవిధంగా తెలంగాణ తెలుగు వేరే అనే నమ్మించడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక అవమానం నుంచి, తృణీకరణలోంచి, మీది తెలుగు కాదు అన్న విపరీతవాదనలోంచి ఉప్పొంగినది తెలంగాణ ఉద్యమం. అలాంటి స్థితిలో ఇంకొక చివరిదాకా వెళ్లి మా భాష వేరే అని మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. అదొక భావోద్వేగపూరిత ప్రకటన. ఇప్పడు తెలంగాణ ఏర్పడ్డాక ఎవరూ భాషమీద ఆధిపత్యం చేయడానికి కుదరదు. ఆ ఉద్వేగ దశను దాటిపోయినం కాబట్టి, తెలంగాణలో తెలుగు ముద్రను బలంగా వినిపించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని తీర్లుగ మాట్లాడినా తెలుగు తెలుగే. తమిళనాడు, మహారాష్ట్ర, కోస్తా, రాయలసీమ అంతటావున్నది తెలుగే. ఇవన్నీ సమన్వయం జరిగితేనే అసలు తెలుగు బయటికి వస్తుంది. ఊదు గాలది పేరు లెవ్వది అని ఒక సామెత. పనిగాదు, అని అర్థం. దీన్ని వ్యాప్తిలోకి తీసుకుపోతే అందరూ వాడుకోగలుగుతారు కదా! తెలంగాణ పదాలు, నుడికారాలు, జాతీయాలు, సామెతలను సముచిత స్థానంలో నిలబెడితే తెలుగు భాష మరింత వికసిస్తుంది. నలభై ఏళ్ల తర్వాత.. 2500 ఏళ్ల ‘తెలుగు వెన్నెల సోన మన తెలంగాణ’ అంటూ హైదరాబాద్ వేదికగా 2017 ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 15–19 వరకు జరగనున్నాయి. 1975లో మొదటి ప్రపంచ మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. తర్వాత 1981లో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోనూ, 1990లో మారిషస్‌లోనూ జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో తిరుపతిలో జరిగిన తర్వాత మళ్లీ నలభై ఏళ్లకు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ప్రస్తుత మహాసభలు ప్రకటించుకున్న ఎనిమిది ఆశయాలు: ⇒ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ జాతి ఖ్యాతి ప్రపంచానికి విదితమౌతుంది. ⇒తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సాహిత్యమూర్తుల కృషికి తగిన గౌరవం లభిస్తుంది. వారి మహత్తర సేవలను ఈ సభలు ప్రపంచానికి చాటుతాయి. ⇒తెలంగాణ కళా వైభవం సభలలో సాక్షాత్కరిస్తుంది. ⇒వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగు భాషాభిమానులందరి మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటాయి. ప్రత్యేక ప్రచురణలు తెలంగాణ దృక్పథంతో నూతన అధ్యాయానికి తెరతీస్తాయి. ⇒సదస్సులు నూతన రీతులకు నాంది పలుకుతాయి. ⇒ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గదర్శనం చేస్తాయి. అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడతాయి. ⇒కొత్త తరానికి సాహిత్య స్ఫూర్తిని అందిస్తాయి. ⇒తెలంగాణ ప్రజలలో సాహిత్య సాంస్కృతిక ఉత్తేజం వెల్లివిరుస్తుంది. ఎల్బీ ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం తెలుగు మహాసభల ప్రధాన వేదిక. ఇన్డోర్, ఔట్‌డోర్ స్టేడియాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. రవీంద్రభారతిలో మూడు వేదికలు. ఇంకా తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఉంటాయి. అదనంగా లలితకళా తోరణమా? పీపుల్స్ ప్లాజా? అన్నది ఇంకా నిర్ణయం జరగాల్సివుంది. లైవ్ ప్రదర్శనలకు పీపుల్స్ ప్లాజా అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. -
సృష్టియొక్క నాటకరంగంలో నీవు ఒక పాత్రవు, నేను ఒక పాత్రను
పొట్లపల్లి రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పాలపిట్ట ప్రత్యేక సంచిక వెలువరించింది. ఇందులో పొట్లపల్లి సాహిత్యాన్నీ, వ్యక్తిత్వాన్నీ తెలియబరిచే 22 వ్యాసాలున్నాయి. ‘పేరు తెచ్చుకోవాలనుకునే రచయితకు ఒక పథకం వుంటుంది. తన మనసు చెప్పినట్లు రాసుకుంటూ పోయిన రామారావుకు అట్లాంటి పథకం ఏదీలేదు. కనుక అన్ని ప్రక్రియలను, ఏ ప్రక్రియలోకి చేర్చాలో తెలియని పద్ధతి రచనలు కూడా రాసుకుంటూ పోయారు’ అని పొట్లపల్లి ఏ విధంగా ప్రత్యేకమైన రచయితో విశ్లేషించారు అమ్మంగి వేణుగోపాల్. రామారావు కాంగ్రెస్ స్వాతంత్య్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. జైలుక్కూడా వెళ్లారు. కానీ ఆ ప్రచారానికి ప్రాముఖ్యత ఇవ్వని మనిషని టి.శ్రీరంగస్వామి అంటారు. పొట్లపల్లి రాసిన సర్ బరాహి, పగ, పాదధూళి, న్యాయం నాలుగు నాటికల్లోనూ ‘వస్తువైవిధ్యం, చెప్పడంలో డొంకతిరుగుడులేని సూటిదనం ప్రస్ఫుటంగా కనిపిస్తా’యని తాటికొండల నరసింహారావు వివరించారు. ‘నా జీవన సహచరీ! ఈ సృష్టి ఏనాడు ఏర్పడ్డదో ఆనాడే నీవు నేను ఈ భూమిపై జన్మించాము. స్త్రీ ధర్మం నిర్వహిస్తూవున్నా నీవు స్త్రీవి కావు పురుషధర్మం నిర్వహిస్తూవున్నా నేను పురుషుడినీ కాను. సృష్టియొక్క నాటకరంగంలో నీవు ఒక పాత్రవు, నేను ఒక పాత్రను’... ఇలా స్ట్రే రైటింగ్స్, మ్యూజింగ్స్లా కనబడే ‘చుక్కలు’– ‘పసుపురాసిన గడపకు కుంకుమబొట్ల నద్దినట్లు భావార్థ శబలతతో, తాత్విక గాఢతతో శోభాయమానంగా’ ప్రజ్వలిస్తాయని థింసా విశ్లేషించారు. ఉర్దూ కవిత్వం తనను వయసు పైబడ్డాక వరించిందని చమత్కరించిన పొట్లపల్లి ‘జవానీ గుజర్ గయీ మేరీ సరాఫా బుఢాపా ఆగయా హై’ని ఉదాహరించారు నాగిళ్ల రామశాస్త్రి. ‘పట్టు పాగపై మరియొక పట్టు పాగ చుట్టినట్టుగా నీ పేరు తట్టునోయి’ అని తన పేరును గురించి చెప్పిన పద్యాన్ని గుర్తుచేసుకున్నారు దేవరాజు మహారాజు. వర్కింగ్ ఎడిటర్: కె.పి.అశోక్ కుమార్; పేజీలు: 82(ఏ4 సైజ్); వెల: 30; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, ఫ్లాట్ నం. 2, బ్లాక్ –6, ఏపీహెచ్, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్–44. ఫోన్: 040–27678430 -
విరిగి పెరిగితి పెరిగి విరిగితి కష్ట సుఖముల పారమెరిగితి
తన 53వ ఏటే కన్నుమూశారు గురజాడ అప్పారావు(21 సెప్టెంబర్ 1862 – 30 నవంబర్ 1915). ఆ స్వల్ప జీవితకాలంలోనే తెలుగు సాహిత్యానికి దీపధారిగా నిలిచారు. కన్యాశుల్కం నాటకంలో వాడుక భాషకు పట్టం కట్టారు. దిద్దుబాటు ద్వారా ఆధునిక కథాప్రక్రియకు కీలకమలుపుగా నిలిచారు. ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’; ‘విరిగి పెరిగితి పెరిగి విరిగితి/ కష్ట సుఖముల పారమెరిగితి’ అంటూ తేలికమాటల్లో అనితరసాధ్య కవిత్వం వెల్లడించారు. ‘దేశభక్తి, ఆధునిక కవిత్వం, ప్రేమ, స్త్రీ చైతన్యం, సంఘ సంస్కరణ వంటి ఎన్నో ఉదాత్త వినూత్న భావాలను నిర్వచించి, నిర్వహించి వెళ్లిన కావ్యకర్త, కార్యకర్త’ గురజాడ అంటారు తెలకపల్లి రవి. గురజాడ జీవితాన్నీ సాహిత్యాన్నీ– యువకవిగా యుగకవి, గిరీశం పాత్ర–అపార్థాలు, ముత్యాల సరాలు! సత్యాల స్వరాలు, నైతిక విలువలపై వాస్తవిక దృక్పథం... ఇలా 17 అధ్యాయాలుగా విశ్లేషిస్తూ ఆయన ‘యుగస్వరం’ వెలువరించారు. ‘గురజాడ భావాలకూ, సంస్కరణలకూ ఇప్పుడు గతం కన్నా ప్రాధాన్యత పెరిగింది. అందుకు దేశంలో వచ్చిన రాజకీయ, సామాజిక దుష్పరిణామాలు కూడా ఒక కారణం. ప్రపంచీకరణలో భాగంగా మత, మార్కెట్ తత్వాలు విజృంభించిన నేపథ్యం ఇందుకు ప్రధాన భూమిక’ అంటూ అప్పటికి ఆధునికుడైన గురజాడ సాహిత్యానికి ఇప్పటి ఆధునిక కాలంలో ఉన్న ప్రాసంగికతను చర్చించారు. గురజాడ: యుగస్వరం; రచన: తెలకపల్లి రవి; పేజీలు: 208; వెల: 125; ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, 27–1–64, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ–520002. ఫోన్: 0866–2577533 -
స్వతంత్ర మేధావి హృదయ సంస్కర్త
(పొట్లపల్లి శతజయంతి ఉత్సవాల ప్రారంభం. నేడు 10 గంటలకు ఓ.యూ.లోని ప్రొ‘‘ జి.రాంరెడ్డి దూరవిద్యా కేంద్రం ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది.) పొట్లపల్లి రామారావు స్వభావ రీత్యా రాజకీయ జీవి కాదు. రాజకీయ ప్రమేయం వున్న అనుబంధ సాహిత్య సంస్థల్లో ఆయనకి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. అయితే ప్రజోపయోగకరమైన రాజకీయాల గురించీ, సంక్షేమ రాజ్యం గురించీ పొట్లపల్లికి స్పష్టమైన వైఖరి వుందని చెప్పడానికి ఆయన జీవించిన జీవితం, సృజించిన సాహిత్యమే ప్రబలమైన సాక్ష్యాలు. ‘కీర్తి ప్రతిష్ఠలు, దానం, యిలాంటి క్షుద్రత్వాలను, అల్పత్వాలను అన్నీ తొలగించివేయి. రచన కోసరం సర్వస్వం త్యాగం చేయనిదే రచనలు సృష్టి కావు’ (నాలో నేను) అని నమ్మిన పొట్లపల్లి రామారావు ప్రధానంగా సాహిత్య జీవి. స్వేచ్ఛా లాలసుడు. ఆదర్శ భావుకుడు. హృదయ సంస్కర్త. ఆత్మ విమర్శకుడు. రామారావు వ్యక్తిత్వం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వొదగదు. రాజకీయ ప్రమేయం వున్న అనుబంధ సాహిత్య సంస్థల్లో ఆయనకి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. అందువల్ల యే సంస్థా ఆయన్ని భుజానికెత్తుకోలేదు. ప్రజోపయోగకరమైన రాజకీయాల గురించీ, సంక్షేమ రాజ్యం గురించీ పొట్లపల్లికి స్పష్టమైన వైఖరి వుందని చెప్పడానికి ఆయన జీవించిన జీవితం, సృజించిన సాహిత్యమే ప్రబలమైన సాక్ష్యాలు. కవిత్వంలో కాళోజీకీ, కథారచనలో వట్టికోటకీ సమవుజ్జీ పొట్లపల్లి. ముగ్గురూ రెండో తరానికి చెందిన తెలంగాణ సాహిత్య వైతాళికుల్లో ఆకాశమంత యెత్తు నిలిచిన త్రినగాలు. ముగ్గురూ సమవయస్కులే కాదు; సమస్కంధులు కూడా. ఒకరి ఆత్మని మరొకరు పట్టుకున్నవారు. ఒకే గంగ త్రిపథగ అయినట్టు ముగ్గురూ తమ తమ ప్రత్యేకతల్తో తెలంగాణ ప్రజా జీవన క్షేత్రాల్లోకి ప్రవహించారు. ‘పొట్లపల్లి రామారావు ప్రపంచ పౌరుడు. అతడు విశ్వకుటుంబి. రంగు రూపు దేశం వేషం భాష సంస్కృతి మొదలగువాటి పేర పాటించబడే విభేదాలేవి పాటించేవాడు కాడు. మానవునిలోని ఆత్మీయతను పెంపొందించి విశ్వమానవ సౌభ్రాతృత్వం నెలకొల్పితేనే కానీ ప్రపంచశాంతి చేకూరదని అతని దృఢ విశ్వాసం’ అని (ఆత్మ నివేదనం ముందుమాటలో) కాళోజీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. తొలినాళ్ళలో పొట్లపల్లి రాసిన ‘ఆత్మ నివేదన’ కవిత్వం అభ్యుదయ భావాలతో నిండి వుంది. కష్టజీవుల శ్రమ లేకుంటే ప్రభువుల భోగాలు లేవని మార్క్సిస్టు తత్త్వశాస్త్ర సారాన్ని తేలిక మాటల్లో సూత్రీకరించాడు. సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఫ్యూడల్ దోపిడిని పెదాలపై అమలయ్యే హింసని దగ్గరగా చూసి చలించిన రామారావు శ్రమ విలువనీ శ్రమజీవుల హక్కుల్నీ స్వయంగా అర్థం చేసుకొని తన కవిత్వం కథలు నాటికల ద్వారా పాఠకులకీ ప్రేక్షకులకీ బోధపరిచాడు. ‘మనం పండించె పంటతోనె గద నరలోకం జీవి నిలబడుతున్నది. లేకుంటే వీళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలల్ల కూసోని, కాగితాల మీద సిరా గీతాలు గీయంగనే పంటలు పండుతాయి?’ ‘సర్ బరాహి’ (1945) నాటికలో వెట్టి మాదిగ గొంతు రామారావుదే. ఆళ్వారు స్వామి జైలులోపల కథలకంటే చాలా ముందే రామారావు జైలు కథలు వెలికి వచ్చాయి. వట్టికోటకి జైలు అనుభవాలు రికార్డు చేయడానికి రామారావే స్ఫూర్తి కావొచ్చు. ఇద్దరి అనుభవాలు వేరుగా వుండ వచ్చునేమో గానీ క్షణికావేశంలో తెలియక తప్పులు చేసి, అసలు యే నేరం చేయక పోయినా క్రూరమైన శిక్షలు అనుభవించే అభాగ్యులైన ఖైదీల పట్ల వారి మానవీయ స్పందనలు మాత్రం వొకటే. రాజ్య స్వభావం పట్ల దాని శకార న్యాయం పట్ల పొట్లపల్లికి స్పష్టమైన అవగాహన వుందని చెప్పడానికి యెన్నో వుదాహరణలు ‘జైలు’ కథల్లో వున్నాయి. అయితే ‘చుక్కలు’ (1965) రాసేనాటికి పొట్లపల్లి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు ఆ తర్వాతి కాలపు కవిత్వంలో (అక్షరదీప్తి, 1993) సైతం కొనసాగింది. అంతర్ముఖుడై బాహ్య సంఘర్షణని పట్టించుకోకుండా తనలోకి చూసుకోవడం మొదలెట్టాకా తన తొలినాళ్ళ రాజకీయ అభిప్రాయాల నుంచి రామారావు దూరమయ్యాడని కేవీయార్ లాంటి వాళ్ళు భావించడంలో కొంత నిజం వున్నప్పటికీ కవిగా రామారావు సమాజం పట్ల తన బాధ్యతని మర్చిపోలేదు. మనిషి లోపలి బలహీనతల మీద యెక్కువ దృష్టి సారించాడు. ‘నేను చదివిన చదువులు, అధ్యయనం చేసిన శాస్త్రాలు, గడించిన అనుభవాలు ఏమీ లేవు. బడికి రాని కారణంగా పేరు తొలగింపబడి, బయటికి గెంటివేయబడ్డ విఫల విద్యార్థిని నేను. బడి నుండి గెంటివేయబడ్డ విద్యార్థులకు చెట్లు, చేమలు, కొండలు వాగులే సైదోడులుగా మిగులుతాయి. ప్రకృతితో ఏర్పడ్డ ఆ సాన్నిహిత్యం క్రమక్రమంగా ఒక విధమైన ఏకాంతంలోకి మారింది. ఏకాంతంలో తోడుగా ఉండేవి ఆలోచనలు’ అని తాను అంతర్ముఖుడు కావడానికి కారణాలు సైతం ‘చుక్కలు’లో పేర్కొన్నాడు. యీ లోచూపు పొట్లపల్లిని శుద్ధ ఆత్మవాదిగా మార్చిందని చెప్పడం తప్పే అవుతుంది. అప్పుడు కూడా మనిషిని కేంద్రంగా చేసుకొని సమాజ శ్రేయస్సునే కాంక్షించాడు. సమత్వ భావన సాధించడం కోసం మనిషి పెంపొందించుకోవాల్సిన ‘హృదయ పరిపక్వత’ గురించీ, ‘ఆత్మ వికాసం’ గురించీ ఆలోచించాడు. ఇతరుల్ని నియంత్రించే చట్టాలు కాకుండా తనను తాను నియంత్రించుకొనే చట్టాల గురించి చింతన చేశాడు. ఆ కాలంలో వొక విధంగా వర్గ సామరస్యాన్ని కోరుకున్నాడు. పీడకుల్లో పరివర్తన ఆశించాడు. ప్రజాస్వామ్య సిద్ధాంతం సఫలమవ్వాలంటే ఆత్మ నిగ్రహం ఆత్మ విమర్శల అవసరాన్ని గుర్తించాడు. ‘అట్టడుగు జనం యొక్క సంతుష్టి మీదనే దేశ క్షేమం ఆధారపడి ఉంది – పునాదులు కదిలిన ఇల్లు కలకాలం నిలవజాలదు’ అన్న నిర్ధారణ చేశాడు. ఈ ప్రజాస్వామిక భావననే పొట్లపల్లి చివరిదాకా విశ్వసించాడు. 1947లో పొట్లపల్లి రాసిన ‘సైనికుని జాబులు’ ఆయన రాజకీయ దృక్పథాన్ని తెలుసుకోడానికి నిలువెత్తు సాక్ష్యాలు. దేశాధినేతల యుద్ధోన్మాదంలో సైనికుల దైన్యాన్నీ పరాధీనతనీ నిస్సహాయతనీ గొప్ప ఆర్తితో చిత్రించాడు. సాధారణంగా అభ్యుదయ రచయితల రచనల్లో కనిపించే యుద్ధ వ్యతిరేకత శాంతి కాముకతతో పాటు పొట్లపల్లి సైనిక జాబుల్లో వుదాత్తమైన మానవీయమైన జీవన తాత్త్విక కోణాలు ఆవిష్కారమయ్యాయి. అంతేకాదు పాశ్చాత్య దేశాల భౌతిక తృష్ణ యితర దేశాల్ని సరుకుల మార్కెట్లుగా మార్చిందనీ, ప్రకృతి విధ్వంసానికి సైతం ఆ తృష్ణ కారణమౌతుందనీ 70 సంవత్సరాల పూర్వమే గుర్తించిన క్రాంతదర్శి పొట్లపల్లి. అయితే చాలామంది భావించినట్లు భారతీయ సంప్రదాయమో తాత్వికతతో ప్రపంచ శాంతికి మార్గదర్శనం చేస్తుందన్న భ్రమలు ఆయనకీ లేవు. ‘మన హిందూ వేదాంత సూక్తులతో ప్రపంచ శాంతి అనేది కల్ల. మన వేదాంతముతో మన దేశములోనే శాంతి స్థాపించుకోలేనప్పుడు ప్రపంచశాంతి అనడం కూడా సిగ్గే... భౌతిక కాంక్షా ప్రవాహములో పుడకలుగా కొట్టుకుపోవడానికి బదులు నావలమై నావికులమై మన దేశాన్ని విపదాబ్ధి నుంచి కాపాడడమే’ కర్తవ్యమని సమన్వయ దృష్టిని ప్రబోధించాడు. జాతీయోద్యమంలోని పరిమితుల్ని లోపాల్ని సైతం రామారావు గుర్తించాడనటానికి ‘పాదధూళి’ (1948) నాటిక నిదర్శనంగా నిలుస్తుంది. గాంధీని జాతీయ బూర్జువా సమాజం తమ స్వార్థానికి వాడుకున్న వైనాన్ని యీ నాటికలో యెత్తి చూపాడు. ప్రభుత్వాల అవార్డులు తీసుకొనేవారి విషయంలో తటస్థంగా వున్నా కొన్ని సార్లు ఆయనకి తెలియకుండానే వాటి పట్ల వ్యతిరేకత అసంకల్పితంగా వెలికి వచ్చేది. కాళోజీకి పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు ఇచ్చేవాడు ఎందుకిచ్చాడనేది కాదు ప్రశ్న, తీసుకొనేవాడు ఎందుకు తీసుకున్నాడు అనేదే ప్రశ్న (ఏ సవాల్ నయ్యే దేనేవాలా కైకు దియా హై , ఏ సవాల్ హై లేనేవాలా కైకు లియా హై) అని తీవ్రంగానే విమర్శించాడు. అది ఉర్దూలో అనడంవల్ల అంతగా ప్రచారంలోకి రాలేదు. రాత్రికి రాత్రి విప్లవాలు రావనీ వ్యవస్థలో మార్పులు అకస్మాత్తుగా సంభవించవనీ రామారావు నమ్మకం. తుపాకి గొట్టంలో నుండి అధికారం ఉద్భవిస్తుంది అన్న నినాదాన్ని కూడా అంగీకరించలేదు. ‘తుపాకిగొట్టంలో ఆవేశం పాలు తప్ప ఆలోచన భాగం శూన్యంగా కనిపిస్తుంది’ అని నిర్ధారిస్తాడు. ‘తుపాకి వాడి చేతిలో వుంటుందో తుపాకి చేతిలో వాడుంటాడో తెలియదు’ అన్నప్పుడు ఆయుధధారి విచక్షణాశీలి అయివుండాలన్న తాత్త్వికతని బోధించాడు. అదే సమయంలో ‘తలబరువుగా పరిణమించిన ఏ వ్యవస్థకు గాని ఏదో ఒక దశలో ప్రజలు చరమగీతం పాడక తప్పదు’ అని తీర్మానిస్తాడు. ‘ఎన్ని ప్రాణులు ఎండలో కమిలి, వానలో నాని, చలికి బిగిసి, నిద్రలు కాచి, కడుపు అంటగట్టుకొని శ్రమిస్తే ఈ అపార సంపద కూడింది ?... ఎంతమంది నిసుగులు తాగడానికి పాలులేక, సరియైన పోషణ లేక తల్లి ఒళ్లో ప్రాణాలు వదులుతున్నారో!... కళ్ళలో మెరుపు, హృదయంలో తృష్ణగల వక్తలు, తాత్వికులు, వైజ్ఞానికులు, శిల్పులు; ఎంతమంది అనామకులై పోతున్నారో! ఈ ప్రభుత్వాలు ఎన్నడైనా ఆలోచించాయా ?’( నా డైరీలో కొన్ని పేజీలు, 1945) యిదీ పొట్లపల్లి రామారావు హృదయం. అదే ఆయన రాజకీయ దృక్పథం. ఆయన సాహిత్య – జీవిత ప్రస్థానాల పొడవునా అది ఆచరణాత్మకంగా ప్రతిఫలించింది. దానికి అభ్యుదయవాదమనో సంస్కరణవాదమనో మానవతావాదమనో ప్రజాతంత్రవాదమనో యే పేరు పెడతామో, అది యే యిజాల్లోకి పదాల్లోకి యిముడుతుందో వొదుగుతుందో నిర్ణయించాల్సింది సహృదయులే. - ఎ.కె.ప్రభాకర్ 040–27761510 -
తెలుగు భాష పరాయీకరణపై ప్రశ్నలు
భాషా శాస్త్రవేత్తలు భాష పుట్టుక, కాలమాన మార్పులు తదితర భౌతిక విషయాలను విశ్లేషించగలరేమోగాని, ఇతర భాషల ఆధిపత్యంలో ఒక భాష ఎలా చిన్నాభిన్నమవుతుందో భాషా, సమాజ ప్రేమికులు మాత్రమే పసిగట్టగలరు. ఈ నేపథ్యంలో తెలుగు భాషా పరిస్థితిని పరామర్శిస్తూ జయధీర్ తిరుమలరావు రాసిన వ్యాస పరంపర ‘భాషావరణం’. ఇందులోని 46 వ్యాసాలు ఏప్రిల్ 2008 నుండి డిసెంబర్ 2012 వరకు చూపు శీర్షికన ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రికలో వచ్చినవి. శీర్షిక పరిమితులకు లోబడినట్లు కాకుండా రచయిత ఎత్తుకున్న అంశంపై సర్వస్వతంత్రంగా వ్యవహరించారు. అందువల్ల ఇవి పత్రికా వ్యాసాలుగా కాకుండా రచయిత భాష పట్ల సమర్పించిన ఒక పరిశోధక గ్రంథంగా కనిపిస్తాయి. జన సామాన్య భాషగా బతికిన తెలుగును ఆర్య భాష అయిన సంస్కృతంతో నింపి, దాని సహజ రూపాన్ని దూరం చేశారనీ, ఇలా వాడుక తెలుగును సామాన్యుడికి అర్థంకాని స్థాయికి తీసుకెళ్లి పండితులు తెలుగు సాహిత్యాన్ని తమ గుప్పిట్లో ఉంచేసుకున్నారనీ, జనం కళలు, భాష, సాహిత్యాన్ని న్యూనతా భావంలోకి నెట్టేశారనీ ఈ వ్యాసాలు ఆరోపిస్తాయి. ఆంగ్లం విషయ పరిజ్ఞాన సముపార్జనకు పరిమితం కాకుండా యావత్ తెలుగు జాతి జీవన రీతుల్నీ, వాటి మూలాల్నీ ధ్వంసం చేస్తున్న విధానాన్ని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ఈ వ్యాసాలు గుర్తు చేస్తాయి. భూస్వామ్య రాచరిక మత వ్యవస్థకు సంకేతమైన సంస్కృతాన్ని, సామ్రాజ్యవాద సంస్కృతిని విస్తరింపజేస్తున్న ఆంగ్ల భాషాదిపత్యాన్ని ప్రశ్నిస్తూ, తెలుగు భాష మనుగడ కోసం ప్రజలను ఆలోచించేలా చేయాలనేది తన వ్యాసాల ప్రధాన ఉద్దేశమని రచయిత పరిచయ వాక్యాల్లో పేర్కొన్నారు. పరభాషల దాడుల వల్ల తెలుగువారు స్వాభావికంగా తెలుగువానిగా లేడు. వాడు పాళీపండితుడు, వాడు నిరంతరం సంస్కృత పండితుడు. నివసిస్తున్న సమాజం సంస్కృత భూయిష్ట సమాజం. ఇంత జరిగినా భాషా శాస్త్రవేత్తలు భాషా పరిణామానికి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు దోహదపడుతాయన్న దృష్టికోణాన్ని విస్మరించారని రచయిత ‘మన నాలుకపై పరభాష పొరలా!’ అని ప్రశ్నించారు. అన్ని రకాల యాసలు, మాండలికాలు, వ్యవహార భాషలు, వృత్తుల భాషలు భాషా వ్యవస్థలో అనివార్య విభాగాలనీ వాటిని ‘అపభ్రంశాలు’గా భ్రమ పడకూడదనీ హితవు పలికారు. 1963లో తెలుగు నానుడి కూటమి వారు అచ్చేసిన ‘తెలుగా, ఆంధ్రమా?’ అనే 68 పేజీల పుస్తకం, అదే రచయిత రాసిన 340 పేజీల ‘నుడి, నానుడి’ ప్రస్తావన ఈ వ్యాసాలకు వన్నె తెచ్చింది. ఈ రెండు పుస్తకాల రచయిత ‘వాగరి’. 1992లో చనిపోయిన వాగరి అసలు పేరు బి.సత్యానందం. అది సంస్కృత పదం కాబట్టి బంగారయ్యగా పేరు మార్చుకున్నట్టు తిరుమలరావు రాశారు. బంగారయ్య తెలుగును చుట్టేసిన సంస్కృతాన్ని తూర్పార బట్టారు. ‘తెలుగు చరితాకారులు పరిసోదకులు కారు, వారు చాటింపుదారులు. వారు చేసేపని నారు ఒక చోట నుండి తీసి మరి ఒక చోట నాటడము. తెలుగును తీసి ఆంధ్రమును నాటాలి. తెలుగు నాడును ఆంధ్రప్రదేశమును మొల ఎయ్యాలి. తెలుగు జాతిని ఆంధ్ర జాతిగా మార్చాలి. ఇంతకు మించి ఏమీ చేయలేదు’. ‘తెలుగునాటిలోని బడులలో తెలుగు అనే పేరున పిల్లలకు నేర్పింపబడుతూ ఉండినది తెలుగు లిపిలోని సమస్క్రుతము’ అని పలికిన బంగారయ్య వాదన మూడు వ్యాసాల్లో వివరించబడింది. ‘భాషావరణం’ పద బంధంలోనే విస్తృత అర్థం ఉంది. భాష అనగానే అక్షరమాల, లిపి, శాస్త్రాల గిరిగీసుకోక– భాషతో సమాజానికీ జీవనానికీ ఉన్న లెంకలన్నీ ఇందులో చర్చించబడ్డాయి. సాంప్రదాయ వాదుల నుండి, కార్పొరేట్ శక్తుల నుండి, తల్లినుడి కాపాడుకోవాలని ఉద్బోధించాయి. వ్యాసాలు కొనసాగించేందుకు రచయిత భాషతో బంధం గల పత్రికారంగం, పాఠశాల వ్యవస్థ విద్యాహక్కులను కూడా తడమక తప్పలేదు. కొన్ని వ్యాసాలు పేరుకు భాషతో మొదలై సాహిత్య చర్చలోకి జారిపోయాయి. ఈ సంపుటి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడింది. రూపకల్పన ఆకర్షణీయంగా ఉంది. - బి.నర్సన్ 9440128169 భాషావరణం (వ్యాసాలు); రచన: జయధీర్ తిరుమలరావు; పేజీలు: 310; వెల: 200; ప్రచురణ: సాహితీ సర్కిల్, 402, ఘరోండా అపార్ట్మెంట్స్, ఓ.యూ. మెయిన్ గేట్ దగ్గర, లేన్ –1, డీడీ కాలనీ, హైదరాబాద్–7. ఫోన్: 9951942242 -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
చంఘిజ్‌ఖాన్ (తెన్నేటి సూరి) నా హైస్కూల్ జీవితంలో నన్ను అమితంగా ప్రభావితం చేసిన రచన. చరిత్రకారులు అత్యంత క్రూరుడిగా చిత్రించిన విజేత చంఘిజ్‌ఖాన్ జీవితాన్ని మరోకోణంలో చూపే నవల. నాటి కుటిల రాజకీయాల మధ్య తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చంఘిజ్‌ఖాన్ సాగించిన పోరాటాన్ని తనదైన శైలిలో రచించి ఆలోచింపజేశారు రచయిత. Notes from the Gallows (జూలియస్ ప్యుషిక్) రెండవ ప్రపంచయుద్ధ కాలంలో వెలువడిన చెరసాల–సాహిత్యం కోవకు చెందినది. నాజీల ఆక్రమణకు గురైన జెకొస్లవేకియా ప్రజల తిరుగుబాటు యుద్ధంలో పాలుపంచుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు, పాత్రికేయుడు ప్యుషిక్ జైలులో తను, తన సహచరులు అనుభవించిన నరకయాతనను తన నోట్స్‌గా వ్రాసుకున్నారు. ఈ నోట్స్ వెలుగుచూడకముందే ఆయన జైలులో మరణించాడు. ఆయన ముగింపు వాక్యాలు: ‘నా ప్రజలూ, ఫాసిజాన్ని నిరసించే ప్రపంచ పౌరులందరూ ఈ రచనకు శుభమైన ముగింపు పలుకుతారు’. లజ్జ (తస్లిమా నస్రీన్) బాబ్రీ మసీదు కూల్చివేత తరవాత ముస్లిం మత ఛాందసులు బంగ్లాదేశ్‌లోని హిందువులను ఒక ప్రణాళిక ప్రకారం చంపడం, ఆస్తులను హరించడం, భయభ్రాంతులకు గురిచేయడాన్ని తస్లిమా ఈ నవలలో కళ్లకు కట్టినట్టు చూపారు. ఫలితంగా ఫత్వా జారీౖయె ప్రాణభయంతో భారతదేశంలో తలదాచుకున్నారు. నిప్పులాంటి నిజాన్ని బట్టబయలు చేయడానికి ఒక స్త్రీగా ఆమె చేసిన సాహసం అరుదైనదీ, అమోఘమైనదీను. The Pelican Brief (జాన్ గ్రిశామ్) ఇద్దరు అమెరికన్ సుప్రీంకోర్టు న్యాయాధికారుల హత్య వెనక ఎంత పెద్ద కుట్ర దాగివుందో తన ‘లా’ పరిజ్ఞానంతో ఊహించి వ్రాసుకున్న నోట్స్ చేరవలసిన వాళ్లకు చేరి, ఒక శాపంలా మారి, డర్బీ షా జీవితాన్ని వెంటాడి వేటాడుతుంది. ఆమె చివరకు ఎలా నెగ్గుకొస్తుందో అనే ఊత్కంఠరేపుతుంది. మ్యూజింగ్స్ (చలం) సమాజంలోని వివిధ విషయాలపై చలం అంతర్మథనం ఈ మ్యూజింగ్స్. తనకు కనిపించిన లొసుగులపై ఆయన సంధించిన వ్యంగ్యబాణాలు మనని నవ్విస్తాయి. కానీ, అవి రుచించని వాళ్లు ఆయనకు కల్పించిన ఖేదాన్ని చూసి మేధావి కావడం కూడా ఒక శాపమా? అనిపించక మానదు. Sense of humour, how dangerous అంటాడాయన ఒకచోట. - తెన్నేటి శ్యామకృష్ణ 9490995015 -
అష్ట భాషా కవి పి.బి.ఎస్.
(సెప్టెంబర్ 22న పి.బి.శ్రీనివాస్ జయంతి) ‘‘అష్ట భాషా కవి నాచన సోముడు అని మనం చదివాం. కానీ ఆ అష్టభాషలు తెలుగు మాండలిక భేదాలే. వేరు వేరు భాషలు కావు’’. సి.నారాయణరెడ్డి ఈ మాటలు అన్నారు. ‘‘మనకు తెలిసిన ఏకైక అష్టభాషా కవి తెలుగువారైన పి.బి.శ్రీనివాస్.’’ ఈ మాటలూ సినారెవే. పి.బి.శ్రీనివాస్ ఒక బహుభాషా చలన చిత్ర నేపథ్య గాయకులు మాత్రమే కాదు; అష్టభాషా వేత్త, కవి కూడా! తెలుగువారైన ఆయన తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్, తమిళం, కన్నడం, మలయాళం, ఉర్దూ భాషలలో ఎన్నో కవితలు రాశారు. పద్య ఛందస్సులో కొత్త కొత్త వృత్తాలను సృష్టించారు. 1960ల ఉత్తరార్థంలో ఆంధ్రప్రభ పత్రికలో ఆయన సృష్టించిన కొత్త వృత్తాల పద్యాలు అచ్చయ్యేవి. అంతర్లాపి కవితా పద్ధతిని ఆయన ప్రచారంలోకి తెచ్చారు. ఒక కవితలో మొదట్లోనో, మరో చోటో నిలువుగా ఉన్న అక్షరాలను కలిపి చదివితే విడిగా వేరే వాక్యం వస్తుంది. దాన్ని అంతర్లాపి అంటారు. ‘సద్వైద్వ జీవనము’ రాసిన వైద్య కవి లోలంబరాజు అంతర్లాపిలో ప్రసిద్ధుడు. పి.బి.శ్రీనివాస్ ఆ పద్ధతిలో ‘దశగీత గీత సందేశం– సంఖ్యాక్షర సందేశ పద్ధతి’ అని ఒక వినూత్న ప్రయోగం చేశారు. ఇందులో వరుసగా 10 గీతాలు ఉంటాయి. వాటిల్లోని ఒక్కో గీతంలోని ఒక్కో వాక్యంతో 11వ గీతం పుడుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన దేవులపల్లి వారు పి.బి.శ్రీనివాస్‌ను ఇంగ్లిష్ కవి విలియం బ్లేక్‌తో పోల్చారు. 1979లో శ్రీనివాస శ్రీ గాయత్రీ వృత్తములు అనే అపూర్వ చ్ఛందః ప్రకరణ గ్రంథాన్ని ప్రకటించారు పి.బి. శ్రీనివాస్. శ్రీనివాస వృత్తం పాద పాదానికీ 11 యతులతో 116 అక్షరాలతో నడిచేది. శ్రీ గాయత్రీ వృత్తం షడక్షర (కళా) గణాలతో పేర్లకు తగ్గట్టు రూపొందేది. ఛందః ప్రస్తారాల్లో గాయత్రీ ఛందస్సులోని 64 గురు లఘు సంయోగ పద్ధతుల ప్రాతిపదికగా ఈ గాయత్రీ వృత్తం సృష్టించబడింది. పంచతాళ వృత్తం అనే మరో అద్భుతమైన 72 అక్షరాల వృత్తాన్ని కూడా ఆయన సృష్టించారు. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల రూపాలనూ, స్వరాలనూ తేలికగా గుర్తుంచుకోవడానికీ, గుర్తుపట్టడానికీ గణితం అధారంగా ‘డైమన్డ్ కీ’ అనే సూత్ర రచన చేశారు. 1978లో కడప ఆకాశవాణి కేంద్రంలో తొలి తెలుగు గజల్ వాగ్గేయకారులుగా ‘‘కల్పనలు సన్నాయి పాడే వేళ చింతలు దేనికి?’’ అన్న గజల్ రాసి పాడారు. గజలియత్‌ను తెలుగుకు తెచ్చిన కవి ఆయనే. ఎనిమిది భాషలలో గజళ్లు రాసిన ఏకైక కవి. ఉర్దూ, కన్నడ, తమిళ గజళ్లు రికార్డులపై విడుదలయ్యాయి. చార్ దిన్ కీ జిందగానీ క్యూం కిసీసే దుష్మనీ దుష్మనీ చాహేతొ కర్లీ దుష్మనీసే దుష్మనీ (నాలుగు నాళ్ల జీవితంలో మనకెందుకు శత్రుత్వం శత్రుత్వమే కావాలనుకుంటే చేద్దాం శత్రుత్వంతో శత్రుత్వం) అన్న ఆయన ఓ గజల్ షేర్ ఖండాంతరాలకు వ్యాపించింది. 1996లో విశ్వసాహితీ వారు ‘గాయకుడి గేయాలు’ అన్న పి.బి.శ్రీనివాస్ గేయాల సంకలనాన్ని ప్రచురించారు. ఇందులో గజళ్లు కూడా ఉన్నాయి. ‘‘శక్తులలో గొప్ప శక్తి కల్పనా శక్తి/ పంక్తులలో గొప్ప పంక్తి కవితా పంక్తి’’ అన్నారు. ఆకాశవాణి కేంద్రాల కోసం చాలా లలిత గేయాలు రాసి పాడారు. నవరసాలపై ఒకే రాగంలో రాసిన 9 పాటలు ఆకాశవాణి చెన్నై కేంద్రంలో ప్రసారమైనాయి. ‘‘పాలవెల్లి నీ పిల్లన గ్రోవి నీల గగనమే నీ మ్రోవి’’ అంటూ ఆ పాటలో చివరి పంక్తులుగా ‘‘ప్రశ్నార్థకమే విధాత రాత, ప్రత్యుత్తరమే భగవద్గీత’’ అని తమ రచనా వైదుష్యాన్ని ప్రదర్శించారు. ‘‘అన్నీ పోతాయి ప్రేమ పోతే’’ అన్నారు ఓ పాటలో. ‘‘బ్రతుకు ప్రేమించడానికి, ప్రేమించు బ్రతకడానికి’’ అని అన్నప్పుడు దాశరథి మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. 1969లో చంద్రుడిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ దిగిన సందర్భంలో ‘మేన్ టు మూన్’, ‘మూన్ టు గాడ్’ అనే రెండు పాటలు రాసి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌కూ, ఆర్మ్‌స్ట్రాంగ్‌కూ పంపి వారి నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. 1970ల ఉత్తరార్థంలో ‘లవ్లీ లవ్ సాంగ్స్’, ‘వైట్ షాడోస్’ అన్న రెండు ఇంగ్లిష్ కవితా సంకలనాల్ని వెలువరించారు. 1997లో ఆకృతి సంస్థ వారు పి.బి.శ్రీనివాస్ అష్టభాషా కవితల సంకలనం ‘ప్రణవం’ విడుదల చేశారు. ఇందులో స్వదస్తూరితో ఆయన రాసిన సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ కవితలు ఉన్నాయి. ఈ సంకలనంలో ఇతర 7 భాషల కవితలకు ఇంగ్లిష్‌లో ప్రతిలేఖనం, అనువాదం ఉన్నాయి. బహుశా ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి ప్రయత్నం, ప్రయోగం జరిగి ఉండదు. ఆయన ఎన్నో తెలుగు, సంస్కృత, హిందీ, కన్నడ స్తోత్రాలను రాశారు. సంగీతా సంస్థ వారు ఆయన రాసిన హిందీ, సంçస్కృత భజనలను ‘భజన్ సుధ’పేరుతో క్యాసెట్ విడుదల చేశారు. 1963–64లో అప్పటి జ్యోతి పత్రికలో ‘స్వర లహరి’ శీర్షికతో దేశంలోని చలనచిత్ర సంగీత దర్శకులపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. మళ్లీ అదే ప్రయత్నాన్ని 1986లో శివరంజని పత్రిక కోసమూ చేశారు. కర్ణాటక సంగీత వాగ్గేయకారుడిగా ‘నవనీత సుమ సుధ’ అన్న రాగ సృజనా, దానికి సాహిత్య రచనా చేశారు. ‘ఏక స్వరి’ అంటే ఒకే స్వరంతో ఉండే రాగాన్ని రూపొందించి దానికి ‘‘ఆనందం, ఆనందం’’ అంటూ కృతి రాసి శ్రుతి నిచ్చారు. కొన్ని అన్నమాచార్య సంకీర్తనల్ని హిందీలోకి అనువదించారు. ఆయన మరణానంతరం ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం వారు ఆయన గేయాలు కొన్నిటిని ‘గేయ కవితలు’ పేరుతో ప్రచురించారు. ‘‘ఎన్నో భాషలలో అఖండమైన పాండిత్యాన్ని ఆపోసన పట్టిన రచయిత. సాహిత్యంలో సాము గరిడీలకు ఆయన పెట్టింది పేరు’’ అన్నారు గొల్లపూడి మారుతిరావు. ‘‘ఆయన ఒక విద్యా సాగరం’’ అన్నారు తమిళ కవి వాలి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ‘ (P) పుం (B)భావ (S) సరస్వతి’’ అన్నారు. - శ్రీకాంత్ జయంతి 09444012279 -
ఈ ఐదు పంచప్రాణ ప్రేరణలు
నాకు నచ్చిన 5 పుస్తకాలు పుస్తక పఠనం గొప్ప అనుభవం. అనేక జీవితాల్ని కనుల ముందు నిలుపుతుంది. వివరిస్తుంది. విశ్లేషిస్తుంది. వికసింప జేస్తుంది. మనసును శుభ్రపర్చి ఎప్పటికప్పుడు తాజాకాంతితో పరిమళింప జేస్తుంది. వ్యక్తిత్వంతో, కవిత్వంతో నిలదొక్కు కోవటానికి ప్రేరణ పుస్తకాలే. వేల పుస్తకాల సారం నేను. ఐదు పుస్తకాలు పంచప్రాణ ప్రేరణలు. శిథిల విపంచి: తీగలు తెగిన వీణ స్వరాక్షరాలు. అష్టకాల నరసింహ రామశర్మ పద్య ఖండికల సంపుటి. దుఃఖపు తెరల్ని, ఆర్ద్ర సన్నివేశాల్ని పంచి హృదయాన్ని సున్నితంగా మలిచింది. భావోద్వేగాలు నాలో రేకెత్తించి కవిత్వం వైపు నడిపించింది. మహాప్రస్థానం: కొత్త ప్రపంచపు సింహద్వారం తెరిచింది. మహాకవి శ్రీశ్రీ ఘోష. శ్రమైక జీవన సౌందర్య దృక్పథాన్ని పాదుకొల్పింది. నాలో కవిని కదిలించి, బతికించి, బలమిచ్చి సమాజబాధ్యత వైపు మళ్లించింది. అగ్నిధార: ఉద్యమ ఉద్వేగాలకు ఊపిరి పోసింది. విప్లవాగ్ని, ప్రణయాగ్ని కలెగలిసిన సమర రసధార. మహాకవి దాశరథి ఆవిష్కరించిన బడబానలం. తెలంగాణ పదం, ఉద్యమ పథం పెనవేసిన పేగుబంధం అందమైన పద్యం. కమ్యూనిస్టు ప్రణాళిక: నడిచిన, నడుస్తున్న చరిత్రకు నవదర్శనం. మార్క్స్, ఎంగెల్స్ రూపకల్పనం. మార్క్స్ తత్వాన్ని లోలోపలికి ఎక్కించి మానవత్వాన్ని పదునుపెట్టిన రచన. వర్గస్పృహను పెంచి ప్రజాపోరాటాల వైపు నడిపించిన సమాజశాస్త్రం. ప్రణాళికాశాస్త్రం. రక్తం సూర్యుడు: కవిత్వానికి వచనలయ జోడించిన నేర్పు. కూర్పు. కె.శివారెడ్డి అభివ్యక్తి, భావావేశం నవనవోన్మేషంగా పొడిచిన రక్తగానం. సరికొత్త పదజాల ప్రభంజనాలు సృష్టించి నిత్య కవిత్వమయం చేసి నిరంతర ప్రవాహధారగా మలిచింది. - నందిని సిధారెడ్డి -
టాల్‌స్టాయ్ చెప్పిన చరిత్ర: యుద్ధము–శాంతి
పఠనానుభవం మొత్తానికి టాల్‌స్టాయ్ ‘యుద్ధము – శాంతి’ పూర్తి చేయగలిగా. ఇప్పుడుగనక చదవకపోతే ఇక జీవితంలో సాధ్యపడదని చదవటం మొదలెట్టా. అయితే ఈ నవలలోకి ప్రవేశించటానికి చాలా యుద్ధమే చేయాల్సి వచ్చింది. అనేక రాజకుటుంబాలు, గుర్తు పెట్టుకోలేనన్ని పాత్రలు, రష్యన్, యూరోపియన్ జియోగ్రఫి, చరిత్ర... ఇదంతా ఫాలో అయి అర్థంచేసుకోవటం... ఎలాగైతేనేం ఒక యాభై పేజీలు ఆపకుండా చదివేసరికి మిగతా నవలంతా దానంతట అదే గుర్రబ్బండిలా పరుగెత్తసాగింది. ఒకపక్క నవల పొడుగూతా వందలకొద్దీ పాత్రలు, ఊళ్లు, నదులు, రష్యన్ నగరాలు, బాల్రూమ్ నృత్యాలు, విందులు, వినోదాలు, ప్రేమలు, పెళ్లిళ్లు. మరోపక్క ఫ్రాన్స్‌లో మొదలైన కల్లోలం నెపోలియన్ రూపంలో దేశదేశాల నుంచి రష్యాకు విస్తరిస్తున్న సమరం. వెరసి విస్తృతమైన టైమ్ అండ్ స్పేస్‌లో నడిచిన బృహత్తర చారిత్రక నవల! మొదట టాల్‌స్టాయ్ దీనికి 1805 అని పేరుపెట్టాడు. చివరికి ‘వార్ అండ్ పీస్’గా మార్చాడు. దీన్ని నవలగా చెప్పడానికి టాల్‌స్టాయ్‌కే చాలా అభ్యంతరాలున్నాయి. ఇందులోని చరిత్ర, చరిత్రకు సంబంధించి టాల్‌స్టాయ్ వ్యాఖ్యానాలు పక్కకుతీసి చూస్తే ఈ నవలలో నడిచిన పాత్రల కథనం, గమనం ఆయన ఇతర రచనల మాదిరిగానే ఉంటుంది. ఇందులో నెపోలియన్ బోనాపార్టి రక్తమాంసాలతో ఉన్న ఒక పాత్ర. తన సైనికులతో, రష్యన్ రాయబారులతో ఆయన సంభాషణలు తారీఖులతో సహా ఉన్నాయి. అప్పటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్, అప్పటి యుద్ధంలో పాల్గొన్న రష్యన్ ఆర్మీ చీఫ్ కొటోజొవ్ కూడా ఉన్నారు. నాకనిపించింది ఏమంటే ఈ నవలలోని పాత్రలు, వాటి తీరుతెన్నులు, వాళ్ల ద్వారా నడిచిన కథనాన్ని గుర్తుపెట్టుకుని అర్థం చేసుకోవడంకంటే ఇందులో వర్ణించిన ఆ కాలంనాటి యుద్ధవాతావరణాన్నీ, ఆనాడు నడిచిన యూరోపియన్ రాజకీయాలనూ, ఇరుపక్షాల యుద్ధ తంత్రాలనూ, ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్ యుద్ధ నైపుణ్యాన్నీ, జార్ అలెగ్జాండర్ వైఖరినీ, రష్యన్ సేనాని కొటోజొవ్ యుద్ధవ్యూహాన్నీ అవగతం చేసుకోవడం మరింత కష్టమైన పని. అంతకుమించి చరిత్ర రచన గురించి టాల్‌స్టాయ్ తాత్విక దృక్పథాన్ని అర్థం చేసుకోవడం సంక్లిష్టమైన విషయం. ఈ నవల ఆనాటి ఫ్రెంచి, రష్యన్ పాఠకులకు ఎలా అనిపించింది? నెపోలియన్ గురించీ, ఫ్రెంచి సైన్యాన్ని గురించీ టాల్‌స్టాయ్ చేసిన వాఖ్యలను వాళ్లు ఏవిధంగా అర్థం చేసుకుని ఉంటారు? రెండు వందల సంవత్సరాల తరువాత ఇప్పటి ఈ కాలరేఖమీద నిలబడి దీన్ని ఎలా చూడాలి? టాల్‌స్టాయ్ చెప్పిన విషయాలు అందరికీ ఆమోదయోగ్యమేనా? అధ్యయనం చేయడానికి ఆసక్తి కలిగించే విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. నవల ప్రారంభమైనప్పుడు ఇందులోని పాత్రలన్నీ దాదాపు తరుణ వయస్కులైన యువతీ యువకులు. వీళ్లంతా ఉన్నత తరగతికి చెందిన రాజకుటుంబాలకు చెందినవారు. వాళ్లకు తెలిసిందల్లా ప్రేమించడం, కలలుగనడం. యుద్ధం ముగిసేనాటికి వాళ్లలో కొందరు చనిపోతారు. కొందరు భగ్నప్రేమికులవుతారు. జీవితం అనేక మలుపులు తిరిగి తాము ప్రేమించినవారిని కాక మరొకరిని పెళ్లాడతారు. కొందరు పెళ్లికాకుండా అలాగే మిగిలిపోతారు. జీవితంలో అనేక మార్పులు సంభవించినట్లు వాళ్ల ఆలోచనా విధానంలో కూడా అనేక మార్పులు వస్తాయి. నవల మొదట్లో నెపోలియన్ పట్ల ఆరాధనాభావంతో ఉండే పీటర్ ఫ్రెంచి సైన్య మాస్కో ముట్టడి తరవాత అవకాశం వస్తే నెపోలియన్‌ను హత్య చేయాలనుకుంటాడు. కౌమార దశలో ఉన్న నటాషా మొదట బోరిస్‌ని ప్రేమిస్తుంది. ఆ తరువాత ఆండ్రూతో నిశ్చితార్థమవుతుంది. మరొకసారి అనెటోవ్తో లేచి పోదామనుకుంటుంది. నవలాంతానికి ఆండ్రూ యుద్ధంలో గాయపడి నటాషా దగ్గరే మరణిస్తాడు. నటాషా చివరికి పీటర్‌ను పెళ్లాడి నలుగురు పిల్లలతో పరిపూర్ణ స్త్రీ అవుతుంది. ఆమె వక్షోజాలు పసరు మొగ్గల్లాగా ఉన్నప్పుడు మొదలైన నవల ముగ్గురు పిల్లల్ని కని వాళ్లకు పాలిస్తున్న తల్లిగా మారడం వరకు నడుస్తుంది. ఈ కథనాన్నంతా అవతల యుద్ధానికి సమాంతరంగా నడిపిస్తాడు టాల్‌స్టాయ్. చరిత్ర అవ్యక్తమైందనీ, విధాత అధీనంలో ఉందనీ భావించిన టాల్‌స్టాయ్ తను సృష్టించిన పాత్రల గమనాన్ని కూడా అదే దృష్టితో రూపొందించాడా అనేది మరొక ఆసక్తికరమైన పరిశీలన. 1812లో నెపోలియన్ మాస్కో నగరాన్ని ముట్టడించాడు. ఫ్రెంచి సైనికులు మాస్కోకు నిప్పుపెట్టారు. నగరం చాలా వరకు ధ్వంసమైంది. నెపోలియన్ 1821లో మరణించాడు. 1828లో పుట్టిన టాల్‌స్టాయ్ తన ముప్పయ్యారవ యేట ఈ నవల ప్రారంభించాడు. అంటే సుమారు యాభై ఏళ్ల వెనక్కు వెళ్లి తారీఖులతో సహా ఇందులోని సంఘటనలనూ యుద్ధక్రమాన్నీ ఊహించి విశదీకరించాడు. అందుకోసం రష్యాపై ఫ్రెంచివారి దండయాత్రని అధ్యయనం చేశాడు. అనేక ఊళ్లు తిరిగాడు. యుద్ధంలో పాల్గొన్నవారితో మాట్లాడాడు. నెపోలియన్ మీద పుస్తకాలు, ఆయన రాసిన ఉత్తరాలు చదివాడు. వాటినే ఇందులో పొందుపరిచాడు. టాల్‌స్టాయ్ యాభై ఏళ్లు వెనక్కువెళ్లి యుద్ధాన్ని ఎలా చూసాడు? అప్పటి యూరప్ రాజకీయాలు అలానే ఉన్నాయా? సమరం ఈ తీరుగానే నడిచిందా? వాళ్లు అలానే ఆ పర్వతాలు దాటి వెళ్లారా? వాళ్లు అలానే నిమెన్ నదిని దాటారా? ఇదంతా ఎవరు చూశారు? రష్యన్ చీఫ్ కమాండర్ కొటోజవేనా? అతడు టాల్‌స్టాయ్ చెప్పినట్టే ఉండేవాడా? ఇందులో వర్ణించిన చక్రవర్తులు, సేనాధిపతులు, గవర్నర్లు, జనరల్స్ వివిధ సందర్భాల్లో వాళ్ల ప్రవర్తన, నడవడిక, హావభావాలు ఇవన్నీ అప్పుడు ఆయా సందర్భాల్లో జీవించిన ఆ తరానికి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఈ నవలని çసృష్టించిన టాల్‌స్టాయ్‌కి కూడా! ఇదంతా కల్పన. ఇందులో ఇమిడివున్న అనేక దేశాల సార్వభౌమత్వం, యుద్ధతంత్రం గురించి రాయగల సాధికారత ఒక్క టాల్‌స్టాయ్‌కే సాధ్యం. ఇంతకీ ఈ యుద్ధంలో టాల్‌స్టాయ్ ఏ పక్షం తీసుకున్నాడు? నెపోలియన్‌ను ఎలా అర్థం చేసుకున్నాడు? టాల్‌స్టాయ్ రష్యన్ కాబట్టి ఫ్రెంచివారిని విమర్శించాడా? ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే నవల చివర టాల్‌స్టాయ్ చెప్పిన చరిత్ర ధర్మాలని అర్థం చేసుకోవాలి. అసలు చరిత్ర ధర్మం ఏమిటి? చరిత్రని సంస్కర్తలు, రాజులు, చక్రవర్తులు నడిపించారంటే నమ్మడం కేవలం ఊహాజనితంగా ఉంటుందంటాడు టాల్‌స్టాయ్. ఆర్థిక, రాజకీయ భౌగోళిక శాస్త్రాల ధర్మాలతో అన్వయించడం చరిత్ర ధర్మాలకు విరుద్ధం అంటాడు. మానవజాతి ప్రగతిని వ్యాఖ్యానించడమే చరిత్ర యొక్క ప్రధాన ప్రయోజనమైతే మానవజాతి ప్రగతిని నిర్దేశిస్తున్న శక్తి ఏది అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పుకోవలసి ఉంది. కాని ఈ పశ్నకు ఆధునిక చరిత్రకారుల వ్యాఖ్యానాలలో జవాబు దొరకదు. ఎవరు చరిత్రలో గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధి వహించారో వారంతా కేవలం నామమాత్రులే. సంఘటనలకు ఊరకే వారి పేర్లు తగిలిస్తారు కానీ, వాస్తవానికి వారికీ ఆ సంఘటనలకూ– ఒక పేరుకూ ఆ పేరు పెట్టిన వస్తువుకూ ఉన్న సంబంధం కూడా ఉండదు. వారు తమంతట తామే చేశామనుకునే పనులలో ఏ పని కూడా నిజంగా వారలా చేసింది కాదు. దానికీ చరిత్రగతికీ మానవజీవిత గతికీ ఒక సంబంధం ఉన్నది. కాలం మొదలుపెట్టినప్పటినుంచీ దాని స్థానం ముందే నిర్ణీతమై ఉన్నది అంటాడు టాల్‌స్టాయ్. యుద్ధం రావలసివుంది కాబట్టి వచ్చింది. అందుకనే కొన్ని కోట్ల మంది ఇంగితజ్ఞానాన్నీ మానవత్వాన్నీ మర్చిపోయి పశ్చిమాన్నుంచి ప్రాచ్యముఖంగా వారి తోటివారిని వధించటం కోసం తరలివచ్చారు. జాతుల యొక్క రక్తం ప్రవహింపచేయాలా వద్దా అనే విషయం తన నిర్ణయం మీద ఆధారపడి వుందని నెపోలియన్ అనుకున్నప్పటికీ అతనికి తెలీకుండానే అతణ్ని చరిత్ర ముందుకు లాక్కొనిపోతూవుంది. రాజులు చరిత్రకు బానిసలు అంటాడు టాల్‌స్టాయ్. పరిసరాల్నీ మనుషుల్నీ సంఘటనల్నీ వాటి తీరుతెన్నుల పరిణామాన్నీ నిశితంగా పరిశీలించే మనుçషులు ఎప్పుడూ ఉంటారు. ఊహకందని కొన్ని సూత్రాల ప్రకారం ఈ ప్రపంచం, ఈ చరాచర జగత్తు నడుస్తూ నడిపించబడుతూ ఉందంటే హేతువాదులు, ప్రగతిశీలురు ఒప్పుకోవడం కష్టమే. ఆ సిద్ధాంతం పాతది కూడాను. ఎప్పటికో గతానికి వెళ్లి చూడటం కాదు. ఇప్పుడు మన కళ్లముందు జరిగే సంఘటనల పూర్వాపరాలను వ్యాఖ్యానించడంలోనే మనకు అనేక అభిప్రాయ భేదాలున్నాయి. అలాంటి సందర్భంలో టాల్‌స్టాయ్ చెప్పిన చరిత్ర ధర్మాన్ని మనం ఎందుకు కాదనాలి? నవలలో కొన్నిసార్లు బాల్ రూమ్ దృశ్యాల వర్ణన. మరొకసారి కెమెరా కంటికి దొరకని మనుషుల అతి సున్నితమైన హావభావాలు. సంభాషణలతో కాక పాత్రల అంతరంగాన్ని విడమర్చి చెప్పే ముఖకవళికలు. కొన్నిచోట్ల (సైనికుల తరలింపు) చదువుతుంటే ఇంగ్లీషు సినిమా డైరెక్టర్లు టాల్‌స్టాయ్ వర్ణనలను కాపీకొట్టారనిసిస్తుంది. యుద్ధం గురించి వచ్చినప్పుడు, చరిత్ర గురించి వచ్చినప్పుడు పేజీలు తిప్పేసే అలవాటు కొంతమందికి ఉంది. ఇది రుచికలిగించే దినుసుల్ని ఊసేసి రుచిలేని పాయసాన్ని తాగటంలాంటిది. సైనికుల ప్రయాణాలూ, వాళ్లని తరలించడమూ, యుద్ధ తంత్రాలూ, చరిత్రా ఇవన్నీ నవలలో భాగంగా చూసి చదవటం మంచిది. కేవలం పాత్రలతో కూడిన నవల పూర్తిచేద్దామనుకుంటే మనకు మనం అన్యాయం చేసుకున్నట్లే. భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా భూమి కదులుతూ ఉన్నట్లు మనం గ్రహించాలి. అలానే భ్రాంతిజన్యమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అధిగమించి గోచరం కాని ఒక పరాధీనతను మనం అంగీకరించాలి అంటాడు టాల్‌స్టాయ్. ఇదే ఇంతపెద్ద నవలలోని ఆఖరు వాక్యం. చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తిగా నెపోలియన్ ఎప్పుడూ కీర్తించబడుతూనే ఉంటాడు. చరిత్రకారులు ఆయన గొప్పతనాన్నీ ఔదార్యాన్నీ ఖడ్గాన్నీ ప్రస్తుతిస్తూనే ఉంటారు. అయితే చరిత్రలో నెపోలియన్‌తో పాటు టాల్‌స్టాయ్ కూడా ఉన్నాడు. చరిత్ర ధర్మంలో మానవుల పాత్ర ఎంత నామమాత్రమైందో, ఎంత పరిమితమైందో యుద్ధము–శాంతి ద్వారా మనకెప్పుడూ చెబుతూనే ఉంటాడు. - బి.అజయ్‌ప్రసాద్ 9247733602 -
నన్ను ముక్కలు చేసినా
నివాళి చైనా దేశపు ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కుల పోరాటంలో అహింసాత్మక ఉద్యమకారుడు, నిరంకుశాధికార వ్యతిరేకి, సాహిత్య విమర్శకుడు, కవి, 2010లో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత లియూ జియాబో ప్రభుత్వ నిర్బంధంలోనే జూలై 13న కాలేయ కేన్సర్‌తో కన్నుమూశారు. అయిదుగురు సోదరులలో మూడవవాడు జియాబో. తండ్రి గ్రం«థాలయంలోనే బాల్యంలో మార్క్స్, లెనిన్ రచనల్ని చదివాడు. కాఫ్కానీ, దోస్తోవ్స్కీనీ ఎదుగుతున్న ప్రాయంలో చదివాడు. విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు కవిత్వం పట్ల ఆసక్తి మొదలైంది. సాహిత్య ఆచార్యుడుగా చేరాక, తత్వశాస్త్రం, మానవ స్వేచ్ఛ రచనలు చేయడం మొదలెట్టాడు. 1989 జూన్ 4న తియాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన విద్యార్థుల ప్రజాస్వామ్య ఆందోళనలో జియాబో ప్రముఖ పాత్ర వహించి, నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. యుద్ధ ట్యాంకుల బీభత్సంలో వందలకొద్దీ విద్యార్థుల ప్రాణాలు పోవడం చూసి చలించి, మిగిలిన వేలమందిని ముందు ప్రాణాల్ని రక్షించుకోమని ఒప్పించి, సైన్యంతో రాయబారం నడిపి, రెండు వేలమంది ప్రాణాల్ని కాపాడగలిగాడు. తియాన్మెన్ సంఘటనల ఫలితంగా ప్రజాజీవనాన్ని భంగపరుస్తున్నాడన్న కారణంతో 1989– 1991 వరకూ మొదటిసారి ఆయనను నిర్బంధించారు. 1995లో ఏ విచారణా లేకుండా నిర్బంధించి, 1996 – 1999 వరకూ శ్రామిక శిబిరంలో ఉంచారు. ప్రాథమిక మానవ హక్కుల కోసం 2008లో ‘చార్టర్ 08’గా పిలవబడ్డ కార్యాచరణ పత్రం రూపొందించడంలో ముఖ్య భూమిక వహించిన కారణంగా, ‘రాజ్యాధికారాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నుతున్నా’డన్న నేరారోపణతో 2009లో 11 ఏళ్ల కారాగారాన్ని విధించారు. ఆయన భార్య లియూ జియా(కవయిత్రి)ను గృహ నిర్బంధంలో ఉంచి, బయటి ప్రపంచంతో పరిమిత సంబంధాల్ని కలిగించి, నిఘా పెట్టారు. పోలీసుల కనుసన్నలలో నెలకొకసారి కొద్ది సమయం మాత్రం భర్తను చూసేందుకు అనుమతించారు. 2010లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన విషయం భార్య నోట విన్నప్పుడు భోరున ఏడ్చి, ఆ బహుమతిని తియాన్మెన్లో ప్రాణాల్ని కోల్పోయిన విద్యార్ధులకు అంకితమిచ్చాడు జియాబో. బహుమతి తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించని కారణంగా, ప్రదానోత్సవాన, ఆ బహుమతిని ఆయన పక్షాన ఒక ఖాళీ కుర్చీలో ఆయన ఫొటో ముందు పెట్టారు. 2009లో ఆయన్ను విచారిస్తున్నప్పుడు చేసిన ప్రకటననే స్వీకారోపన్యాసంగా, నార్వే నటి, దర్శకురాలు లివ్ ఉల్ల్మన్ చదివారు. ‘నా చివరి ప్రకటన ఇది: నాకు శత్రువులు లేరు’ అని చెప్తూ, భార్య జియా పట్ల ప్రేమనీ, పోలీసు విచారణాధికారుల పట్ల శత్రుత్వ లేమినీ, చైనా రాజకీయ సరళీకరణం తప్పకుండా జరిగి తీరుతుందన్న నమ్మకాన్నీ వ్యక్తపరిచాడు. తియాన్మెన్ స్క్వేర్ మృతుల జ్ఞాపకార్థం రాసినవాటితో బాటు, తన సహచరికి రాసిన కవితలతో ‘జూన్ నాలుగు నాటి విషాదగీతాలు’గా 2011లో జియాబో మిత్రులు సంకలనం తెచ్చారు. దలైలామా ముందుమాట రాశారు. ఒకటైనా వేరుగా జీవితం గడపాల్సి వస్తున్నందుకు తాను ప్రేమించిన భార్యను ఓదారుస్తూ– ‘నీ ప్రేమ సూర్యకాంతిలా ఎల్తైన గోడల్ని గెంతి, నా జైలు ఇనుప ఊచల్ని దాటుకుంటూ, నా చర్మం ప్రతీ అంగుళాన్ని లాలిస్తుంది, నా శరీరపు ప్రతీ కణాన్ని వెచ్చబరుస్తుంది... జైలులో నా సమయపు ప్రతి నిమిషాన్ని అర్థవంతం చేస్తుంది’ అంటూ రాశాడు. ‘నన్ను ముక్కలు ముక్కలు చేసి చూర్ణం చేసేసినా, నిన్ను నా చితాభస్మంతో హత్తుకుంటాను. జైలు గోడలు శరీరాన్ని నిర్బంధించగలవేమో కానీ, ఏ జైలు గోడలూ ఆత్మని నిరోధించ లేవు’ అన్నాడు. - ముకుంద రామారావు 9908347273 -
అదృశ్యమైన నిప్పుపిట్ట, ఎర్రకుందేలు
నల్లమిరియం పంట ఆశల్ని ఆకుపచ్చని దేశంలో వెదజల్లి అదృశ్యమైపోయింది నిప్పుపిట్ట! ఆప్తుల్నీ, ఆత్మీయుల్నీ, నమ్ముకున్న తెలుగు కథనీ, నవలనీ రెండు మూడు రోజులలో కోలుకొని గుంటూరొచ్చి కలుస్తానని నమ్మబలికి అదే సమయానికి అదృశ్యమైపోయింది ఎర్రకుందేలు. అనారోగ్యంతో యుద్ధం చేసి చేసి మహాయోధుడై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు డాక్టర్ వి.చంద్రశేఖర రావు. హితుడా! నేస్తుడా! మహాకథకుడా! మోహనా! కన్నీటితో ఎలిజీలు రాయటం ఎంత కష్టమో నీకు తెలీదా? మాకందరికీ ఎంత శిక్షని విధించి వెళ్లిపోయేవు! నువ్విక కనబడవని గుంటూరు వెక్కి వెక్కి ఏడుస్తోంది. మహాకథవై తిరిగిరా! మూడు దశాబ్దాల క్రితం బెజవాడలో ఉన్పప్పుడు రైల్వే ఆఫీసు నుంచి ఒక మధ్యానం ఫోను. ‘‘నేను డాక్టర్ వి.చంద్రశేఖర రావుని. కథలు రాస్తాను. ఆంధ్రజ్యోతిలో రామకృష్ణారెడ్డిగారు మీ అడ్రసు చెప్పా’’రంటూ. అప్పటికే ఆయనకు రైల్వేలో పెద్ద పోస్టు. ఐఆర్ఎస్ ఆఫీసరు. నన్ను వెదుక్కుంటూ నిరాడంబరంగా మా ఆఫీసుకొచ్చేడు. నా కథ ‘కర్రావు’ ‘కథ–90’లో చదివానని చెప్పేడు. ఆయన కథ ‘నైట్ డ్యూటీ’కి 1990 ఏప్రిల్‌లో రామకృష్ణారెడ్డిగారే జ్యోతిలో పురుడు పోసేరు. 91లో ‘జీవని’ వచ్చింది. అదొక దయగల తల్లి కథ. మానవ సంబంధాల్ని స్త్రీ వాద దృక్పథం నుంచి ఒక మానసిక వికలాంగ బాలిక నేపథ్యంలో వ్యాఖ్యానించిన కథ. అట్లా మొదలైన మా స్నేహం సాహిత్య పరిధి దాటి వ్యక్తిగత విషయాలు వెళ్లబోసుకునేదాకా– బెజవాడలో ఏదో ఒకటి చెయ్యాలన్న తపన– ఇద్దరం కల్సి సాహితీ మిత్రులు పేరుతో మధురాంతకం రాజారాం గార్ని, మునిపల్లె రాజు గార్ని, శ్రీపతి గార్ని ఆహ్వానించి రామ్మోహన గ్రంథాలయంలో కథ మీద సభ పెట్టేం. ఒక్క సభతోటే ఎంతో అనుభవం– ఆ తర్వాత మరో రెండు చిన్న సభలు– తర్వాత నాకు కలిచేడుకి బదిలీ– 94లో ఆయన జీవని కథల పుస్తకం వచ్చింది. కథావస్తువుతో పాటు రూపం మీద శ్రద్ధ చూపిన కథకుడిగా వల్లంపాటి వెంకటసుబ్బయ్య గుర్తించారు. లెనిన్ ప్లేస్ 98లో వచ్చింది. మాయ లాంతరు, ద్రోహవృక్షం– వెనక్కి తిరిగి చూడలేదు చంద్రశేఖర రావు. నూట ఇరవైకి పైగా కథలు రాశారు. తెలుగు కథకు తనదైన రాతను రుచి చూపించాడు. తనదంటూ ఒక కథాభాషను సృష్టించుకున్నాడు. ఉద్యమాల పట్ల గాఢ అనురక్తి, ప్రగతిశీల వాదుల పట్ల ప్రేమ, ఉద్యమ విద్రోహుల పట్ల ప్రచండమైన ఆగ్రహం ప్రకటించేడు. తెలుగు కథకు ఒక మార్మిక సొబగును అలంకరించాడు. కవిత్వానికే కాదు, కథకు కూడా స్పాంటేనిటీ ఉంటుందనీ, సమకాలీన సమస్యలకు తక్షణ స్పందన కథకుడి బాధ్యత అనీ గుర్తు చేసేడు. కళలన్నీ వ్యాపార మాయలో చిక్కుకున్న సందర్భాన్ని చిట్టచివరి రేడియో నాటకంగా రాసేడు. బెల్లి లలిత, కలేకూరి ప్రసాద్, రోహిత్... ఒక్కో దుఃఖ రుతువును కథల్లోకి అనువదించాడు. తెలుగు కథను వర్తమాన చరిత్రకు చిరునామా చేసిన ఏకైక కథకుడయ్యాడు. పోస్ట్ మోడ్రనిస్ట్ నవలగా ఐదు హంసలు రాసేడు. నల్లమిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం నవలలు రాసేడు. శ్రీరామకవచం, మూర్తీ, నేనూ, చంద్రశేఖరరావూ కల్సి నల్లమల చెంచు గూడేలకు వెళ్లేం. కొండలు, గుట్టలు ఎక్కి దిగేం. చెంచుల మాటలు విన్నాం. పాటలు పాడేం. వాళ్ల విల్లంబులు ఎత్తిపట్టేం. ఉడుముల బయ్యన్న, పెద్ద గురయ్య, మంతయ్య– అన్నీ సజీవ పాత్రలే. ఆకుపచ్చని దేశం ఒక కథాకావ్యం. చెంచుల రాజ్యంలో విత్తనం మొలకెత్తుతుందనీ, పంట నిలుస్తుందనీ గొప్ప ఆశను వెదజల్లాడు. ఉద్యోగ జీవితంలో అత్యంత నిక్కచ్చి మనిషి. నిఖార్సైనవాడు. ఐఆర్ఎస్ ఉద్యోగంలో అవినీతితో కోట్లకు పడగలెత్తిన వాళ్లున్నారు. తండ్రి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు. ‘ఇప్టా’లో ఉంటూ కొన్నాళ్లు నాటకాలు ఆడేడు. ఆ వారసత్వం చంద్రశేఖరరావుది. నిజాయితీ ఊపిరిగా బతికినవాడు. కనీసం బదిలీలు కూడా ఆపుకోవటం తెలీనివాడు. ఆ బదిలీలే చంద్రశేఖరరావు ఆరోగ్యాన్ని బలిగొన్నాయి. భువనేశ్వర్ వెళ్లినప్పుడు తిండి పడక జీర్ణ వ్యవస్థ, ప్యాంక్రియాటైటిస్ సమస్య వచ్చి దాదాపు మృత్యువు ఒడిదాకా వెళ్లి వచ్చేడు. హుబ్లీలో డయాబెటిస్ ఒంటినంతా స్వాధీనం చేసుకుంది. దాదాపు సంవత్సరం పాటు పోరాడాడు. నరక యాతన అనుభవించేడు. కంటిచూపు మందగించినా కలం వదల్లేదు. మూడో నాలుగో కథలు రాసేడు. చిత్తుగా ఉన్న వాటిని సాఫు చేసి రాయడానికి వీలు కాలేదన్నాడు. చినుకు ప్రత్యేక సంచికకు ఒక కథ పంపాలన్నాడు. సాహిత్య గోదావరికి కథ పంపలేక పోయానని బాధపడ్డాడు. పాలపిట్టకు ఒక కథ ఇచ్చానని తృప్తి పడ్డాడు. తన కథల్నీ, నవలల్నీ ప్రమోట్ చేసుకోవటం ఇష్టం లేని వ్యక్తిత్వం గలవాడు. దానికితోడు ఇప్పుడున్న సామాజిక సమీకరణాలు సరేసరి. ఆయన కథన శక్తికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. అయినా ఎప్పుడూ లొంగిపోలేదు. కుంగిపోలేదు. చివరి నిమిషం వరకూ సాహిత్య శ్వాస పీలుస్తూనే ఉన్నాడు. కథను రూప సౌందర్యంగానూ, మార్మిక శక్తిగానూ, సమకాలీనంగానూ, ప్రాచీన స్మృతిగానూ, వినిర్మాణ రూపంగానూ మార్చుకున్నానని ప్రకటించాడు. సత్యాన్వేషణ గురించిన ఒక ఎరుకను తన కథల ద్వారా చెప్పాలని భావించాడు. సామాజిక సూత్రాలు పనికిరాని కాలంలో, నమ్ముకున్న ఉద్యమాలు, విప్లవాలు తెరలు దించేసి మహాభినిష్క్రమణ చేసిన కాలంలో కథకుడు ఉండాలని నమ్మినవాడు... రైతులు రేపటి పంటకు విత్తనాలు దాచిపెట్టినట్లుగా కథకుడు తన పాఠకుడిలో ఒక ఆశను దాచిపెడతాడని గాఢంగా విశ్వసించినవాడు డాక్టర్ వి. చంద్రశేఖరరావు. మా కాలం మహామాంత్రిక కథకుడు. అతడితోపాటు కల్సి నడిచినందుకు గర్వంగానూ ఉంది, దుఃఖభరితంగానూ ఉంది. ఎన్నో పర్యాయాలు తెలుగు కథకోసం ఒక పత్రిక తీసుకురావాలన్న కోర్కెను వెలిబుచ్చేవాడు. ప్రత్యేకంగా కథల పత్రిక. కథకుడు ముఖచిత్రంగా గల పత్రిక. అదీ రంగులతో తేవాలన్నది ఆయన స్వప్నం. ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ అయిన తర్వాత గుంటూరులో ఉంటూ రోజూ అందరం కలుసుకోవాలనీ, ఇటువంటి స్వప్నాలను సాకారం చేసుకోవడానికి మిత్రులం చర్చించాలనీ అనేవాడు. జూలై కూడా వచ్చింది. ఎనిమిదో తారీఖు ఎంతో నిర్దయగా తెలుగు కథమీంచి నడిచి వెళ్లింది. ఒక మేధోకథకుడ్ని ఎత్తుకెళ్లిపోయింది. ఆయన తోడూనీడా డాక్టర్ ప్రసూన గారినీ, అనారోగ్యం పొడుగునా తల్లిలా వెంట నడిచిన కూతురు డాక్టర్ ప్రణవినీ, కుమారుడు రిత్విక్నూ, వృద్ధాప్యంలో ఉన్న తల్లినీ వదిలి మహాకథకుడు కానరాని మాంత్రిక లోకాలకు తరలి వెళ్లిపోయాడు. తెలుగు కథ ఉన్నంతవరకూ డాక్టర్ వి.చంద్రశేఖరరావు అజరామరుడు. అ మహాకథకుడికి, మంచి మనిషికి నా కన్నీటి వీడ్కోలు. - కాట్రగడ్డ దయానంద్ -
సంస్కృతీ సౌరభం
పుస్తక పరిచయం తనకు ప్రమేయం లేకుండా అనాథగా మారిన లీల అనే అమ్మాయి జీవితంలో వెలుగుల దీపాల్ని వెలిగించి ‘రుణం’ తీర్చుకునేందుకు అబ్బుశాస్త్రి అనే నిష్టాగరిష్టుడైన వటువు కర్మిష్ఠిగా మారిన వైనాన్ని ఆర్ష సంప్రదాయ నేపథ్యంలో చిత్రించిన నవల ఇది. ఇందులో సంప్రదాయ వైభవానికి మేరువు లాంటి పెదచయనుల మూర్తిమత్వం దర్శనమిస్తుంది. సోమిదేవమ్మలోని మూర్తీభవించిన మాతృహృదయం ఆకట్టుకుంటుంది. సర్వమంగళం, రామశర్మ, అనసూయ లాంటి లోకహితం కోరే పాత్రలున్నాయి. లీల, టెడ్డీ, కొండల్రావు, మాళవిక, డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే మెకార్దీ, ముకుల్ శిశోడియా లాంటి నాగరికులూ కనిపిస్తారు. చినజగ్గుబాబు, నాలుగో ఆయన, అమావాస్య రాజు , మందయ్య, సాయిలమ్మ, నరిసిపండు, సోయితా లాంటి గ్రామీణ నేపథ్యమున్న పాత్రలూ వాటికి అవే సాటిగా నిలుస్తాయి. ఇతివృత్తం అంతా గోదావరి తీర గ్రామాలు, పట్టణాలు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు, నిజామాబాద్ ,హైదరాబాద్ తోపాటు, బొంబాయి, హరిద్వారం చుట్టూ తిరుగుతుంది. లోకస్సమస్తాస్సుఖినోభవంతు అని బోధించే వేదం పరమార్థాన్ని పరమపవిత్రంగా పరిచయం చేసిన తీరు అద్భుతం. ‘పగలు మనుషుల్ని వెదజల్లే నగరంగా , రాత్రివేళ పండి ముదిరిన రాచపుండుగా, ఎదుటివాడి అవసరానికి వెలకట్టే వెలయాలిగా’ బొంబాయి వైకల్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు రచయిత. పాఠకుడు ఓపికతో చదివినందుకు కృతజ్ఞతగా అన్నట్టు ప్రధాన కథకు సమాంతరంగా, ఎలాంటి విసుగు కలిగించని రీతిలో బోలెడు జ్ఞాన సముపార్జనకు వీలైన సూక్ష్మాతిసూక్ష్మమైన విషయ వివరణ చేశారు గొల్లపూడి. జమ్షెడ్జీ టాటాలోని దార్శనికత, కాళిదాసుకి అమ్మ కటాక్షం, పొలమారినప్పుడు దేవుడి పేరు చెప్పడం, మంత్రాల పరమార్థం, యోగ శాస్త్ర చరిత్ర, సూర్య నమస్కారాల వల్ల లాభాలు, ఆదిశంకరులు, మండనమిశ్రునికి మధ్య జరిగిన వివాదం, చేపల్లో రకాలు, వాటి గుణగణాలు, త్యాగయ్యలోని సైకో ఎనాలసిస్ట్, జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఓరిగామీ హస్తకళ... ఇలా ఎన్నో విషయాల వెనక అంతరార్థాలను అలవోకగా వర్ణించే తీరు హృదయ రంజకం. కథ రుచించేలా చేసేందుకు గొల్లపూడివారుపడ్డ ఏళ్లనాటి శ్రమకు మనం ‘రుణం’ తీర్చుకోలేం. తెలుగు నుడికారంతో కథను నడపడంలోనూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు సముచిత స్థానం వేయడంలోనూ తాను అందెవేసిన చేయని ఆయన ‘సాయంకాలమైంది’ నవలతో తెలుగు పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇది దానికి కొనసాగింపని చెప్పుకోవచ్చు. ఈ నవల చదివితే మానవత్వంపై మమకారం పెరుగుతుంది. మంచితనంపై మక్కువ ఏర్పడుతుంది. సత్ప్రవర్తనపై నమ్మకం పెరుగుతుంది. ఉత్తమాభిరుచి ఉన్నవారు తప్పక చదవాల్సిన సంస్కృతీ సౌరభం ఈ ‘రుణం’ . రుణం (నవల); రచన: గొల్లపూడి మారుతీరావు; పేజీలు: 288; వెల: 250; ప్రచురణ: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, 1–8–725/ఎ/1, 103 సి, బాలాజి భాగ్యనగర్ అపార్ట్మెంట్స్, నల్లకుంట, హైదరాబాద్–44. ఫోన్: 9848065658 - బొబ్బిలి శ్రీధరరావు 7660001271 -
తొలి తెలుగు దళిత మహిళా కావ్యం
విమర్శ 1934 దాకా గుర్రం జాషువ పౌరాణిక చారిత్రక రచనలే చేశారు. 1934లో ఆయన ‘స్వప్నకథ’, ‘అనాథ’ అనే రెండు సాంఘిక కావ్యాలు రచించారు. ఈ రెండూ పేద స్త్రీల జీవితాలను ప్రతిబింబించే కావ్యాలు. మొదటిది ఒక పేద రెడ్డి మహిళ మానవీయ జీవితాన్ని ఆవిష్కరించగా, రెండవది ఒక పేద దళిత మహిళ దైన్య జీవితాన్ని ప్రతిఫలించింది. 1934 నాటికి గాంధీజీ స్వాతంత్య్రోద్యమంలో భాగమైన నిర్మాణ కార్యక్రమాలలో హరిజనోద్ధరణ ఒకవైపూ, బి.ఆర్.అంబేడ్కర్ దళితోద్యమాలు మరొకవైపూ కొనసాగుతున్నాయి. తెలుగులో ఒకవైపు భావ కవిత్వం, మరోవైపు స్వాతంత్రోద్యమ కవిత్వం ముమ్మరంగా వస్తున్నాయి. అభ్యుదయ కవిత్వం పురుడుపోసుకుంటున్నది. ఈ సంధి దశలో జాషువ ‘అనాథ’ రచించారు. ఉత్పత్తి రంగంతో సంబంధం లేని భావకవులు విశ్రాంతి వర్గ స్త్రీలను ప్రణయమూర్తులుగా చిత్రిస్తూ ఉంటే, జాషువ వాళ్లకు భిన్నంగా శ్రామిక దళిత స్త్రీ జీవితం వస్తువుగా, వాస్తవిక దృక్పథంతో ‘అనాథ’ రచించారు. ఇది తెలుగులో తొలి దళిత మహిళా కావ్యం. ఈ కావ్యం రావడానికి 25 ఏళ్ళు ముందు నుంచే దళిత కవిత్వం వస్తున్నది. మాలవాండ్ర పాట (1909, అజ్ఞాత కర్తృకం) తొలి తెలుగు దళిత కవిత. ‘లవణరాజు కల’ (గురజాడ, 1910) తొలి తెలుగు దళిత కథాకవిత. నిరుద్ధ భారతము (1915, మంగిపూడి వెంకటశర్మ) తొలి తెలుగు పద్యమహాకావ్యం. ‘మాకొద్దీ నల్ల దొరతనము’ (కుసుమ ధర్మన్న, 1921) దళితుడైన కవి రాసిన తొలి కవిత. హరిజన శతకము (కుసుమ ధర్మన్న, 1933) తొలి తెలుగు దళిత శతకం. ఈ మధ్య కాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ, జాలా రంగస్వామి వంటివారు దళిత కవితలు రచించారు. అయితే దళిత మహిళ జీవితాన్ని కావ్యంగా రాసిన తొలి కవి గుర్రం జాషువ. ఈ కావ్యంలో స్త్రీ వస్తువుగా వచ్చే భావ కవిత్వ ధోరణి, ఆర్థిక అసమానతను ప్రశ్నించే అభ్యుదయ కవిత్వ ధోరణి, భారతీయ సామాజిక నిర్దిష్టతకు చెందిన అట్టడుగువర్గ చిత్రణ చేసే దళిత కవిత్వ ధోరణి – ముప్పేటగా పెనవేసుకొని ఉన్నాయి. అనాథ 72 పద్యాల ఖండ కావ్యం. ఒక పేద దళిత వితంతువు. ఆమెకు ఆరుగురు సంతానం. అందరూ ‘నేదరులు’. ‘నడచు పీనుగులు’ లాగా ఉన్నారు. ఆమెకు కట్టుకున్న బట్టలు తప్ప ఇంకే ఆస్తి లేదు. భిక్షాటన తప్ప మరో బ్రతుకుతెరువు లేదు. బిచ్చమెత్తుకోవడంలో ఆమె పడిన బాధలే ఈ కావ్యం. ఇది మూడు విషయాలను ప్రతిపాదించింది. 1. మన సమాజం ధనిక పేద వర్గాల సమాజం. ‘‘సుఖమొకచోట గడగండ్లొకచోట గదా వసుంధరన్’’ 2. దళితుల పేదరికానికి కారణం ఎవరు? అన్న ప్రశ్న. ఎవడారగించు నమృత భోజనంబున గలిసెనో యీలేమా గంజిబువ్వ.... ఎవడపహరించె నేమయ్యె నీమె సుఖము కలుషమెరుగని దీని కొడుకుల సుఖము? 3. సాంఘిక, ఆర్థిక అసమానతలు గల సమాజమే అయినా, అందరూ చెడ్డవాళ్ళు కాదు. ఈ మూడింటితో పాటు, కావ్యంలో నాలుగో అంశాన్నిగూడ గుర్తించవచ్చు. ఇది ముఖ్యమైంది కూడా. ఇది 1934 నాటికి జాషువ భావజాలానికి సంబంధించినది. సాంఘిక, ఆర్థిక అసమానతలతో కూడిన సమాజంలో భగవంతుడు పేదలవైపే ఉన్నాడన్నది నాల్గవ అంశం. ఈ కావ్యంలో ‘అనాథ’ దారిద్య్రాన్ని చిత్రిస్తూ, భర్త మరణంతో ఆమెకు మిగిలింది ‘పిత్య్రమగు ధనము జోలెసంచి’ అన్నారు జాషువ. ఈ అనాథకు బిచ్చమెత్తడ మొక్కటే మిగిలిన దారి. ఆ క్రమంలో దళితేతర సంపన్నులు ఆమె పట్ల ప్రవర్తించే తీరును చిత్రించడం ద్వారా జాషువ సమాజంలోని ఆర్థిక అంతరువులను, వాటి మధ్య బతుకుతున్న మనుషులలోని మంచి చెడ్డలను ఆవిష్కరించారు. దీనికోసం ఆయన మూడు సంఘటనలను చిత్రించారు. మొదటిది: అనాథ ఒక రాత్రి పూట ఒక ఇంట వసారాలో తలదాచుకుంటుంది. తెల్లవారగానే ఆ యింట్లోంచి ఒకమ్మాయి కళ్ళాపు చల్లడానికి బయటకు వస్తుంది. ఓసీ యెవ్వతెవీవు? నీ మగని సొమ్మన్నట్లు పాపిష్ఠు రా లా! సంసారము బెట్టినావు మొగసాలన్ లేచి పొమ్మంచు ఆమె నీటి చెంబును కాలితో తన్ని తరిమేస్తుంది. ఆమె వెళ్ళి ఒక చెట్టుకింద కూర్చుంటుంది. అప్పుడు పక్కింటి స్త్రీ వచ్చి, ఒక పెళ్ళి ఉందనీ, ఆక్కడికి పోతే బాగా తిండి దొరుకుతుందనీ చెప్పి, తన దగ్గరున్న చద్దన్నం కొంచెం పెడుతుంది. రెండవది: ఆమె పెళ్ళి జరిగే చోటికి బయలుదేరుతుంది. అప్పటికే పంగనామాలు పెట్టుకొని, పట్టు పంచెలు కట్టుకున్న వాళ్ళు వెళ్తూ వుంటారు. వాళ్ళు అనాథను చూచి చీదరించుకుంటారు. ఆమె వాళ్ళకు దండంబెట్టి పక్కకు తప్పుకుంటుంది. పెండ్లి ఇంటి దగ్గర ఒక చెట్టుకింద కూర్చుంటుంది. ఆ సమయంలో ఒక సైకిల్ కుర్రాడు వచ్చి ఆమెను, ఆమె చంక బిడ్డను దొర్లించేసి, ఆమెను తిట్టి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు గానీ ఒక్కరూ దగ్గరికి వచ్చి ఆమెను లేవనెత్తే ప్రయత్నం చేయలేదు. ఒక మేడమీద సరసాలాడుకుంటున్న దంపతులు, ఆ దృశ్యాన్ని చూచి తమకేమీ పట్టనట్టు తమ ఆనందంలో మునిగిపోతారు. అప్పుడు ఒక యువకుడు వచ్చి ఆమెను లేపి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. దీనిని గమనించిన అమ్మలక్కలు అతని భార్యకు చెప్పి దెప్పిపొడుస్తారు. ఓ లలనా! నీ మగండొక మాలది పడిపోవ నంటి మైలవడియె వై ద్యాలయము జేర్చినాడిక నీలాగున నయిన గుడియనెడమయు లేదె? అని వ్యాఖ్యానించి ఆమెకు ‘‘త్రాపి రెలమి క్రోధరసము’’. ఆ యువకుడు ఇంటికి రాగానే ఆమె స్నానం చేసి గాని ఇంట్లోకి రావద్దంటుంది. ఆయన స్నానం చేసి, భార్యను సమీపించి అలుక శమించెనా జలకమాడిన యంతనె? మాలదాని పిల్లల కడగండ్లు చూచి బహుళంబుగ దాప్తమునందు నామనో జలజము మైలవడ్డదాది స్నానము చేసెనె? వెఱిదాన! యీ వెలుపలి శుద్ధి జీవులకు బెట్టునె? పోయునె? ముక్తినిచ్చునె? అని తీవ్రంగా ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు అంటు జాడ్యంతో బాధపడుతున్న అతని భార్య దగ్గర సమాధానం లేదు. అతను మరునాడు పోయి అనాథ పిల్లల్ని అనాథ శరణాలయంలో చేర్పిస్తాడు. మూడవది: ఒక రోజు బాగా వర్షం కురుస్తున్నది. అనాథ ఒక చావడిలోకి వెళ్తుంది. అక్కడ ఒకడు తన పెంపుడు కుక్కను పెట్టుకొని ఉన్నాడు. అనాథను చూడగానే ‘పంచనంటుకొన్నావటే’ అని అరచి వెళ్లమంటాడు. అప్పుడు అతని భార్య వస్తుంది. ఆమె దయాళువు. ఎవరైననేమి? రక్షణ మవశ్య కర్తవ్యమే కదా? నరులకు, ధ ర్మువునకు గలుగునే కుల వివక్షతము జిన్నపెద్ద భేదము నాథా! అని బుద్ధి చెబుతుంది. ఈ మూడు సందర్భాలలో దళితేతరులు అనాథ పట్ల కొందరు మానవత్వంతోనూ, మరికొందరు అమానుషంగానూ ప్రవర్తించినట్లు చిత్రించారు జాషువ. ఈ కావ్యం రాసేనాటికి జాషువ భావవాదిగానే ఉన్నాడు. భగవంతుడు పేదవాళ్ళ వైపే ఉంటాడు అన్న అవగాహనతో ఉన్నాడు. పరుల దుర్గతిగని గుండెగఱిగి వగచు సదాయసహృదయుల వీక్షణాంచలమునందు బుట్టుచుండును కన్నీటి బొట్టు్టవోలె ఏడి భగవంతుడని సంశయింతు వేల?’’ ఈ అంశాన్ని చెప్పడానికి జాషువ ఈ కావ్యం రాశాడేమో అనిపిస్తుంది. అనాథకు ఆరుగురు పిల్లలనీ, ఆమె భర్త చివరి బిడ్డ పురిటిలో ఉండగానే మరణించాడనీ చెబుతూ, అది ‘నలువ సేయు విలాసమేమొ’ అని వ్యాఖ్యానించారు. సైకిల్ కుర్రాడు అనాథనూ, ఆమె చంకలో బిడ్డనూ దొర్లించి, ఆమెను తిట్టి వెళ్ళిపోతాడు. అనాథకు దెబ్బలు తగిలి రక్తం కారుతుంది, కాని చిన్న బిడ్డకు ఏమీ కాదు. ఈ సందర్భంలో కూడా కవి దేవుడి ఉనికిని చాటి చెప్పాడు. ఓయి నాస్తికుడా! వినుమొక్కమాట అరసి యుందువు ఘోర దృశ్యంబు నిచట మృత్యుదేవత కోఱలు మెఱయునపుడు శిశువునేమహాశక్తి రక్షించెనోయి! గబ్బిలం కాలం నాటికి ఈ విశ్వాసాల పట్ల జాషువకు అనుమానాలు మొలకెత్తాయి. సాంఘిక, ఆర్థిక అసమానతలను గుర్తించాడు జాషువ ఇందులో. అయితే, ఇందుకు కారణాలను, ఆ అసమానతలను నడిపిస్తున్న తాత్విక విశ్వాసాలను అనుమానించే దశకు చేరలేదు. అప్పటికి జాషువ పరిమితి ఇది! - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 9440222117 -
కవితలలో ఉగాది
చైత్రమాసంలో వసంత రుతువు అనాదిగా మానవ జాతికి మరువలేని తీపి గురుతు. శిశిరంలో ఆకురాల్చిన ప్రకృతి వసంతంలో లేత ఆకుపచ్చని కొత్త చిగుళ్లు వేసి నవ యవ్వన ప్రాయంలోని యువ హృదయాలకు ఓ మధురమైన వలపు చిత్రమవుతుంది. కొత్త పూల నెత్తావులతో వీచే పిల్ల వాయువులు ప్రేమపక్షుల తనువులను తాకి గిలిగింతలు పెడతాయి. చైత్రంలో వసంతం రావడం, ఆ వసంతం ఇన్ని మధురానుభూతులను కలిగించడం వలన ఈ మాసానికి ‘మధుమాసం’ అని పేరు. ప్రకృతికి ఉగాది పుట్టిన రోజు పండగ లాంటిది. వనాలు మాసిపోయిన బట్టలు విసర్జించి లేతాకుపచ్చ పట్టుపావడ ధరించి రంగురంగుల పూల డిజైన్ల వాణీలు వేసుకుంటాయి. లేత మామిడి చిగుళ్ల బిర్యానీలు తిన్న కొంటె కోయిలలు ఆ దృశ్యాలకు పరవశించి ప్రేమగీతాలు పాడతాయి. అలౌకికులయిన కవులు ఈ గీతాలు విని కలాలలో వలపు సిరాలు పోసి శృంగార గీతాలు రాయడం కూడా ఆనవాయితీ. ఆ తర్వాత ఆ సంప్రదాయం మారింది. సమకాలీన సమాజ సమస్యలకు స్పందించడం కవుల వంతయింది. ఈ ఉగాది నాడు ఆ తరం, ఈ తరం కవుల స్పందనలపై చిన్న విహంగ వీక్షణమిది. సంప్రదాయ కవుల ప్రతినిధి విశ్వనాథ సత్యనారాయణ ఉగాది ఎలా ఏతెంచిందో చెబుతూ చక్కటి శృంగార భావన ముందుంచారు: పరిచయాను ద్రిక్త పరి రంభ సమయాన ప్రియురాలి ఎద చెమరించినంత శీతోదక స్నాన జాత సౌఖ్యము పైని ముకుపుటాన జమర్పు పుట్టినంత పేరంటమునకేగు పిన్న బాలిక వాలు జడ మల్లెమొగ్గ కన్పడియనంత వంగిన వేపకొమ్మ చివరన పజ్జ యీనెకు పూత పట్టినంత వసంత మరుగుదెంచెను, మధురోహలు స్ఫురించగా. కొత్తగా పరిచయమైన ప్రియుడి చెంత ప్రియురాలికి గుండె ఝల్లుమన్నట్టు, చల్లని నీటి స్నానం చేసినపుడు ముక్కు కొసన నీటి బిందువు ముత్యంలా మెరిసినట్టు, పేరంటానికి వచ్చిన కన్నెపిల్ల వాలుజడ కురులలో అలవోకగా మెరిసిన మల్లెమొగ్గలా, వంగిన వేపకొమ్మ చివరన ఈనెకు పూసిన పువ్వులా వసంతం వచ్చిందని పాఠకుల హృదయం పులకించేలా చెప్పారు విశ్వనాథ. ఇదే కోవలో కాస్త ముందడుగు వేసి భావ కవిత్వాన్ని చెప్పిన కృష్ణశాస్త్రి తన సినీ కవితా వాణినిలా విన్పించారు. మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా అంటూ, విత్తు ముందా, చెట్టు ముందా అనే ప్రశ్న వెలయించారు. తెలంగాణ ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య ఉగాదిని గుర్తు చేసే కోయిల పాట వింటే ప్రాణం లేచి వస్తుందంటారు. కోయిల కో అంటే ప్రాణం లేచి వస్తుంది తీయదనం చేదువేపలోనూ దీపిస్తుంది కాలాన్ని కదలకుండా ఆపే వారెవ్వరు? కాలం బ్రహ్మ స్వరూపమని తెలిసిన వారెందరు? అఖండ బ్రహ్మాండ కటాహంలో అమృతం నింపుతోంది వసంత కన్య అశేష ప్రజలకు కాలశక్తి అవగతం చేయగలిగితే ఆమె ధన్య! జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి నవ చైతన్యాన్ని పలుకుతో నవ వర్షానికిలా నాంది పలికారు. రేపటి మనిషి భవితవ్యానికి ఊపిరి పోసేది బిగి తప్పిన పిరికి కండరాల్లో చేతనా జ్యోతులు వెలుగించేది ఉగాది అభ్యుదయ కవి మిరియాల రామకృష్ణ తనదైన శైలిలో వసంతాన్నిలా ఆవిష్కరించారు. ఇది వసంతం పండుటాకుల పాటకంతం కొత్త కోకిల కూత పంతం, గోరువంకల గోష్ఠి గీతం ఇది వసంతం సుమ నితాంతం. చతుర్వేదుల అమరేంద్ర తన కవితలో కోకిలమ్మ ఏమందో చక్కగా చెప్పారు. గున్న మావి గుబుర్లలో కొసరి కొసరి కోకిలమ్మ ఏమన్నది? ఏమన్నది? నిన్నటి నీ వెతలన్నీ పాతబడిన కలలన్నది. విప్లవకవి అద్దేపల్లి రామ్మోహనరావు– ఆకాశానికి నాలుకలు చాచే అపార్టుమెంట్ల శిఖరాలు దాటి సాగర తీర కర్మాగారాల కారిడార్లు దాటి ధూమ కేతువులయిపోయిన నగరాల నల్ల చేతులకి చిక్కకుండా తప్పించుకుంటూ ఎట్టకేలకు మా తోటలోకి అడుగు పెట్టింది వసంతం అంటూ వాస్తవ పరిస్థితులపై ధ్వజమెత్తారు. అభ్యుదయాన్నీ, మానవతావాదాన్నీ చక్కగా పలికిస్తున్న వేణు సంకోజు యుగధర్మం మార్చే ఉగాది రావాలంటారు. యుగధర్మం మార్చగలుగు ఉగాదొకటి చాలు జగమంతా వసంతాలు పూయు వేలవేలు అగమ్య గోచరము కాని ఉగాది, వస్తే రానిమ్ము రాగమయపు అభ్యుదయం తన తోడుగా తేనీ కవయిత్రి శారదా అశోకవర్ధన్ ఉగాది మీద నిష్ఠూరాలు పలికిస్తూ కలం ఝుళిపించారు. నీ రాకకు స్వాగతం చెబుదామంటే, కొత్త చింతపండు కొనండి చూద్దామంటూ చెట్టెక్కి కూర్చుంది. కొట్టులోని కొబ్బరికాయ కొంపకి చేరదు సందు దొరికిందని బెల్లం, చక్కెరతో కలసి చుక్కలు చూపిస్తోంది. వేపపువ్వే కాస్త చవగ్గా ఉంది. అందుకే తీపి తగ్గించి, చేదు పెంచి కలుపుతున్నాను అంటూ. నా అక్షరాలు వెన్నెట్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలని చెప్పుకొన్న చమత్కార కవితా సాహసి బాలగంగాధర తిలక్ ఆనాడే సరికొత్తగా ఉగాది గురించి చెప్పారు. లైట్లు వేసిన స్టేషన్లోకి రైలొచ్చి ఆగినట్లు వచ్చింది ఉగాది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో కవులు, ఎన్నో ఉగాదులు. అన్నీ ఒక్కసారే చెప్పుకోలేంగా! అందుకే మచ్చుకు కొన్ని పాదాలు మీ గుర్తుకు తెచ్చాను. వీటి స్మృతిగా మీ తలపులు రంగరించుకుని మనసుకి ఉగాది పచ్చడి తినిపిస్తారని చిన్న ఆశ. l - ఆచంట సుదర్శనరావు 9000543331 -
పక్కకి ఒత్తిగిలితే
పుస్తక సమీక్ష ముందుగా, శివారెడ్డి కవిత్వం గురించి రెండు మాటలు చెబుతాను- చిన్న నీటి కుంటలో ఒక గులకరాయిని వేస్తే, అది నీటిలో వలయాలు సష్టిస్తుంది. ఆ దశ్యం చూడ్డానికి అందంగా ఉంటుంది. అయితే ఆ వలయాలు గట్టు వరకు సాగి ఆగిపోతాయి. కానీ ఒక పెద్ద బండరాయిని కుంట మధ్యలో పడవేస్తే ఆ ఒత్తిడికి నీళ్లు చెల్లాచెదురై ఎగిసి గట్టును దాటి బయటకు దూకుతాయి- గట్టును ఆనుకొని విశ్రమించేది కాదు, గట్టును దాటి చేలల్లో పారే మహోద్రిక్త చైతన్యం శివారెడ్డి కవిత్వం! శివారెడ్డి కొత్త కవితా సంపుటి ‘పక్కకి ఒత్తిగిలితే...’లో వందకు పైగా వచన కవితలున్నాయి. ఎన్నెన్ని సంఘటనలు, ఎన్నెన్ని సందర్భాలు, ఎంత జీవితం, ఎన్నెన్ని సమస్యలు... పొంగి పొంగి గుండెల వరకు ఎగిసి ముంచేసే ఆవేదన.. ఆవేశం. ఎంతో సున్నితంగా మరెంతో ప్రభావం చూపేదిగా చెప్పడానికి చేసిన ప్రయత్నం పాఠకుణ్ణి ఉద్రిక్తం చేస్తుంది. సునిశితమూ చేస్తుంది. తొలి కవిత ‘పక్కకి ఒత్తిగిలితే’లో శివారెడ్డి ఇంతకు ముందు అనుసరించని ఒక ధోరణి ప్రవేశపెట్టడం చూస్తాం. అది కవిత్వంలో జానపద కథలను సందర్భోచితంగా చొప్పించడం. జీవితాన్ని గ్రహించడానికి, అనుభవించడానికి, లోలోపలికి ప్రసరించడానికీ ‘కల్పన’ ముఖ్యమవుతుంది. పైగా ఒక అందమైన పొందిక వస్తుంది. ఆ కవిత ఇది- ‘‘పూర్వం ఒక రాజు తనకీ తన పెళ్లానికి మధ్య కత్తినాటాడట పక్క మధ్యలో... ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది .......................... కవిత్వం రాయటమంటే ఖడ్గంతో సహజీవనం చెయ్యటం! - ఈ కవితలోని జానపద కథను అటుంచితే కవి చెప్పదల్చుకున్న సారాంశం స్పష్టమైంది కదా! మీరంతటికి అనే కవితలో- మీరంతటికి మీరే.. దేశమొదలి పోనక్కర్లేదు వాళ్లే పంపిస్తారు పొగ బెడతారు కలుగుల్లో నీళ్లు నింపుతారు .............. ఇక ఒకటే రంగు మిగుల్తుంది ఎండిన రక్తం గుర్తు చేసే కాషాయరంగు! ఈ కవిత చదువుతుంటే, ముఖ్యంగా గత మూడేండ్ల కాలంలో మన దేశంలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలు గుర్తొస్తాయి. పాలస్తీనా కవి మహమ్మద్ గార్విష్ 2006లో ఇజ్రాయెల్ అరబ్బు దేశాలపై దాడిచేసి బీభత్సాన్ని సష్టించిన సందర్భంగా అనుభవించిన క్షోభ, సంక్షోభం శివారెడ్డి అనుభవించినట్టు అవగతమవుతోంది. శివారెడ్డి కవిత్వం గురించి మరొక్కమాట- శివారెడ్డి కవిత్వం చదువుతుంటే... మంచి మిలిటరీ హోటల్లో అప్పటికప్పుడు కాల్చిన పరోటాను తింటున్నట్టుగా.. పొరలు పొరలుగా పరోటా విడిపోతూ ఉంటుంది! ఈ పరోటా రుచి పిండిలోనా, పిండి కలపటంలోనా, కాల్చడంలోనా, కాల్చిన పరోటాను తీసి పక్కనున్న బండపై రెండు అరచేతులతో పొరలు పొరలుగా విడిపోయేట్టు దగ్గరగా నొక్కడంలోనా? ఎందులో ఉంది రుచి? అంటే, పరోటా మాస్టర్ నైపుణ్యంలో అని ఎవరైనా ఠక్కున చెపుతారు. శివారెడ్డి కవిత్వమూ అంతే. చదువుతుంటే పొరలు పొరలుగా విడిపోతూ ఉంటుంది. ఎక్స్టెండ్ అవుతుంది. లోలోపలికి తీసుకెళుతుంది. ఎలా? అద్భుత కవిత్వంగా ఒక వస్తువును ఎలా మౌల్డ్ చేయాలో తెలిసిన కవి. అపార అనుభవం, దక్షత. అందుకు కారణం. రచయిత:ఎం.కె.సుగమ్ బాబు 8096615202 -
సంఘటనల వెంట సమకాలీన కవి
ప్రసంగం సమకాలీన తెలుగు సాహిత్యంలో వట్టి వచనం కవిత్వం పేరిట చలామణి అవుతుంది. ఇది అధికశాతం కాబట్టి కవిత్వ ప్రేమికుల దాహం తీరకుంది. కవిత్వానికీ వచనానికీ మధ్య భేదాన్ని కవులు సంకల్పితంగానే విస్మరిస్తున్నారు. కవిత్వానికి ప్రాణప్రదమైన అనుభూతి గాఢత్వం, పద లాలిత్యం, నిర్మాణ కౌశలం పట్ల కవులు కనీస శ్రద్ధాసక్తులు కనబరచడం లేదు. వ్యక్తి స్పృహ నుంచి సామాజిక స్పృహవాదం తెలుగు కవిత్వంలో స్థిరపడిన తర్వాత ఎక్కువ మంది కవులు అలవోక రాతకి అలవాటు పడ్డారు. సాహిత్యంలో ఇతర ప్రక్రియలకంటే కవిత్వ రచన సులభతరమని భావించినట్టున్నారు. లేకుంటే దశాబ్దాల తరబడి ఇంత పెద్ద మొత్తంలో అకవిత్వం వెలువడేది కాదు. ఈ పరిస్థితి మరే భాషలోనూ లేదనుకుంటాను. అయితే ప్రతితరంలో మాదిరి వర్తమానంలో కూడ కొందరు కొత్తకవులు మెరుపువలె, ఉరుముమల్లే వర్షాగమనాన్ని ఊరించక మానడం లేదు. సమీపగతంలో ప్రజాఉద్యమాలేవీ లేవు. అిస్తిత్వవాద ఉద్యమాలు కూడ అనతి కాలంలోనే సద్దుమణిగిపోయాయి. అక్కడక్కడా ఆ మిణుకుమనే నిప్పురవ్వలను రాజేయాలని నిమగ్న కవులు తమ పరిధిలోనూ, ప్రక్రియల్లోనూ ఊపిరిలూదుతూనే ఉన్నారు. ఇక ‘తాత్కాలికం’ మాత్రమే మిగిలింది. తెలుగు కవి పని, ఒక ఘటన కోసం ఎదురు చూడటంలాగా ఉంది. పంకిలంలోంచి పద్మం వంటి అద్భుతమైన అనుభవం కోసమో లేదా ఛిన్నాభిన్నమైన ప్రతిబింబ శకలాలను అతికే సహానుభూతి కోసమో నిరీక్షించవలసిన కవి సంఘటన వెంటపడి కొట్టుకుపోవడమే బాధాకరం. ఒక ఘటన నుంచి మరొక ఘటనకు ఉరుకడమే దుర్బలం. మన పూర్వకవుల నుంచి మనం ఏ మేరకు ప్రేరణ పొందాలి? ఏయే సుగుణాలను అలవర్చుకోవాలి? ముఖ్యంగా ఓరిమి, సంయమనం, అధ్యయనం అంటాను. నెలవంక నిండుజాబిలిగా వికసించేంత వరకు; చితుకు చితుకు ముక్కున కరచుకొచ్చి పక్షి పదిలంగా గూడు అల్లేంత వరకు; తల్లిగర్భంలోంచి నవజాత శిశువు పొత్తిళ్ళలో కిలకిలమని నవ్వేంతవరకు ఒకింత ఓపిక పట్టితీరాలి. మౌలానా జలాలుద్దీన్ రూమీ అన్నట్టు, ముల్లు సమీపంలో గులాబిపువ్వు చూపే ఓరిమి/దాన్ని సువాసన భరితంగా ఉంచుతోంది. ఇటీవలి ఉదాహరణలు చూడండి. చెన్నై వరదలు, కల్బుర్గి కాల్చివేత, రోహిత్ ఆత్మహత్య. ఇటువంటి సందర్భాల్లో కవి హుటాహుటిన ఇరవై, ముప్పై పంక్తులు రాస్తున్నాడు. కేవలం వార్త ఆధారంగానే కవిత్వ రచనకు సమాయత్తమవుతున్నాడు. ఉపరితలాంశాలను ఏకరువు పెట్టడంతోనే సరిపెట్టుకొంటున్నాడు. ఆ రచన పత్రికల్లో ప్రకటించుకోవాలని ఉబలాటపడుతున్నాడు. అదే ఘనకార్యంగానూ, సామాజిక బాధ్యతను నెరవేర్చినట్టుగానూ ఆత్మవంచనకు పాల్పడుతున్నాడు. ఈనాటికీ ఒక విలేకరివలె దృశ్యచిత్రణకి, వ్యాఖ్యానానికి పరిమితమవుతున్నాడు తప్ప కవిత్వ ప్రక్రియలో అత్యంత ప్రధానమైన కవి దర్శనం కానరావడం లేదు. కవి గుప్పిడి తెరిస్తే ఏ చింతనా రహస్యమూ గుసగుసలాడటం లేదు. అతను స్పృశించిన చీకటి నీడలని మన ముందు పొరలుగా వలవడం లేదు. అతని అంతఃసంఘర్షణ గడ్డకట్టిన కన్నీటిచుక్కై మనని కోతపెట్టడం లేదు. ఆఖరికి ఒక అందమైన ఊహ ఎగసివచ్చి మన చేతిని లాలనగా తాకడం లేదు. పాఠకుని అంతర్బాహిర్ ప్రపంచాల మధ్య వర్తమాన కవి ఓ దేహళీ దీపమై కాంతిని పంచిపెట్టలేకపోతున్నాడు. కవి జీవితంలో అంతర్భాగం కావలసిన కవిత్వం ఇవాళ అతని ఒంటిమీద ధగధగలాడే నగలాగా తయారయింది. లేదా ఒక పార్టీవేర్‌గా మారిపోయింది. సంఘటనకు కవి ఎడంగా నిలవాలని నేను కోరడం లేదు. సంఘటనను వస్తువుగా స్వీకరించడంవల్ల కవిత్వం కలుషితమవుతుందనీ అనడం లేదు. సంఘటన పూర్వాపరాలను కవిత్వీకరించడంలో ఎక్కువమంది విఫలమవుతున్నారనే చెబుతున్నాను. సామాజిక స్పృహవాదం కవి మెడకు గుదిబండగా మారిందని సందేహిస్తున్నాను. అతను శిరస్సు ఎత్తి దిక్కులన్నీ పరికించే స్వేచ్ఛని అది కట్టడి చేస్తుందా? వైయక్తిక అనుభవంలో లేకుండా కేవలం సామాజిక స్పృహతో కవిత్వ సృజనకి పూనుకోవడమనేది శక్తికి మించిన బాధ్యతగా పరిణమించిందా? అందుకనే అతను వృత్తాంతంగా మినహా కవిత్వంగా పలుకలేకపోతున్నాడా? ఇవన్నీ ఒక చదువరి ప్రశ్నలుగా సమకాలీన కవులు పరిగణించాలంటున్నాను. వర్తమాన తెలుగు కవిని కవిత్వం నుంచి వేరుపరుస్తున్న బలీయమైన శక్తులేమిటో కానుకోమంటున్నాను. నేను ప్రగతిశీల రాజకీయాల ప్రాముఖ్యం గుర్తెరిగి ఉన్నాను. అదే సమయంలో సాహిత్యంతో రాజకీయాలకి గల సంబంధంలోని పరిమితులను కూడ దృష్టిలో ఉంచుకొన్నాను. దేశదేశాల కవులు సరే, భారతీయ భాషల్లోని కవులు సైతం ఎంతో వైవిధ్యంతో రాస్తున్నారు. మనకి పూర్తి భిన్నంగా సృజిస్తున్నారు. భావకవిత్వం మొదలుకొని మన ముందుతరం కవులలో అనేకులు కవిత్వం చేజారిపోకుండా కాపాడుకొన్నారు. ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ, తిలక్, బైరాగి, అజంతా, ఇస్మాయిల్, శివసాగర్లను మనం మళ్ళీ మళ్ళీ చదువుతున్నాం కదా! ఎప్పటివాడు రూమీ! ఎక్కడివాడు పాబ్లో నెరూడ! ఎందుకు గుండెలకు హత్తుకుంటున్నాం. కవి, వియత్నాం విప్లవనేత హోచిమిన్ రాసిన ప్రతి కవిత లలిత లలితంగానూ, నిత్యనూతనంగానూ ఉంటుంది. ఎందుకని? అనుభంలోంచి ప్రభవించడం వల్ల. కవిత్వంతో తొణికిసలాడటం వల్ల. అందులో అంతర్లీనంగా సామాజిక స్పృహ కూడ లేకపోలేదు కదా. ‘‘వర్షంలో సూర్యుణ్ణి చూడడం/ అగ్ని లోపల్నుంచి/ శుభ్రజలాన్ని చేదడం’’ అన్నాడొక జపనీయ ప్రాచీన కవి. అదీ కవిదర్శనం. ప్రసుత్తం అనేకమంది కొత్తగా కవిత్వం రాస్తున్నారు. బ్లాగ్, ఫేస్బుక్, కొన్ని అంతర్జాల పత్రికల్లో ప్రతిరోజూ విరివిగా కవితలు ప్రకటిస్తున్నారు. వీరిలో పలువురికి కవిత్వమంటే మౌలిక అవగాహన లేదు. కొందరు సొంత గొంతుతో జీవనానుభవాన్ని అభివ్యక్తీకరిస్తున్నారు. సమకాలీన కవి కవిత్వ ప్రచురణను సమస్యగా ఎదుర్కొంటున్నాడు. తెలుగులో మేలిమి సాహిత్యపత్రిక లేకపోవడం వల్ల దినపత్రికల సాహిత్య పేజీల మీదనే ఆధారపడుతున్నాడు. కవే తన కవిత్వసంపుటం అచ్చు వేసుకొంటున్నాడు, ఉచితంగా పంచిపెడుతున్నాడు. ఈ దుస్థితి మరే భాషలోనూ చూడమనుకుంటాను. బుక్‌షాపుల నిర్వాహకులు కవిత్వ పుస్తకమంటే అయిదు ప్రతులు మించి తీసుకోవడం లేదు. కొందరు విక్రేతలైతే ససేమిరా వద్దంటున్నారు. ఇదీ జీవితాన్ని ఉన్నతీకరించే కవిత్వానికి దీర్ఘకాలంగా లభిస్తున్న ఆదరం! ఈ అంశం కూడ సమకాలీన కవిత్వపు తీరుతెన్నులను రుజువు చేయకమానదు. దక్షిణకొరియా కవి చోంగ్ హ్యోన్-జోంగ్ అంటారు: జీవితాన్ని జీవితంతో ప్రేమించకపోతే/ విషాదంతో విషాదించకపోతే / కవిత్వంతో కవిత్వాన్ని ప్రేమించకపోతే/ మరి కవిత్వంతో దేన్ని ప్రేమిస్తావు?/ రాత్రి కురిసే హిమాన్ని ఎవరూ చూడరు/ ఎవరూ నడవరు, అడుగుజాడలుండవు/ అది నిశ్శబ్దం, స్పష్టం, స్వయం సుందరం. (‘రెండో ప్రతిపాదన’, అనువాదం: ఇస్మాయిల్). ఏ పాఠకుడూ సమాచారం కోసం కవిత్వాన్ని సమీపించడు కదా! కవి హృదయం పలికే సత్యం వినవస్తుందని మాత్రమే కవిత్వాన్ని ఆశ్రయిస్తాడు. ఆ సత్యమే నిశ్శబ్దం, స్పష్టం, స్వయం సుందరం. దానిని సదా కాపాడుకుందాం! - నామాడి శ్రీధర్ 9396807070 (విజయవాడలో ‘కవిత్వంతో ఒక సాయంకాలం’ మేడే సభలో ‘సమకాలీన కవిత్వం తీరు’పై ప్రసంగం సంక్షిప్త పాఠం) -
మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!
మే 28న సురవరం జయంతి రాజుల చరిత్రలు మన కంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినవి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు, దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పుడెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో యవన్నీ తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన నభిలషింతురు. తేలిన సారాంశమేమన సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!! అల్లా ఉద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు, అసఫజా చరిత్రలకంటే మన చరిత్రలు మాత్రము తక్కువ వైనవా? మనము వారివలె ఘోరాలు చేసినవారము కాము. కాన బహుశా మనమే మెరుగేమో! సాంఘిక చరిత్ర మానవ చరిత్ర- ప్రజల చరిత్ర, అది మన సొంత కథ!! అది జనుల జీవనమును ప్రతి శతాబ్దమందెట్లుండునో తెలుపునట్టిది. అది మన తాతముత్తాతల చరిత్ర! వారి యిండ్లు, వారి కట్టు, వారి తిండి, వారి ఆటలు, వారి పాటలు, వారు పడిన పాట్లు, వారు మనకిచ్చిపోయిన మంచి చెడ్డలు, ఇవన్నీ తెలిపి మనకు సహాయపడును. (1949లో తొలిసారి ప్రచురితమైన సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నుండి...) -
అస్తిత్వ ఉద్యమాలూ, పరిమితులూ
అభిప్రాయం ప్రతి అస్తిత్వ ఉద్యమానికీ ఫలితాలూ, పరిమితులూ వుంటాయని సమాజ చలనం తెలియజేస్తూనే వుంటుంది. ఫలితాలు అంటే, ఆ ఉద్యమం సమాజం దృష్టికి తెచ్చిన కొత్త అంశాలు. పరిమితులు అంటే, ఆ ఉద్యమం లోపలా, బయటా వున్న పరిమితులు. లోపల వున్న పరిమితులు, ఉద్యమాన్ని అంతకు మించి ముందుకు వెళ్ళలేని పరిస్థితిని కల్పిస్తాయి. దాంతో అది బయటి పరిమితి అవుతుంది. సమాజంలో కులాల మధ్యా, మతాల మధ్యా, జాతుల మధ్యా, స్త్రీ, పురుషుల మధ్యా అసమానతలున్నంతవరకూ అస్తిత్వ ఉద్యమాలు పుట్టుకొస్తూనే వుంటాయి. మరి, అన్ని అసమానతలూ అలా వుండగానే (ఇంకా పెరుగుతుండగా) అస్తిత్వ ఉద్యమాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఎందుకొస్తున్నట్టు? ఆ ఉద్యమాల లోపల వున్న పరిమితే బయటి పరిమితికి కారణం అన్నాము. ఆ లోపలి పరిమితులేమిటి? ఏ అస్తిత్వవాద లక్ష్యమైనా ఏముంటుంది? తమకు జరుగుతున్న అన్యాయాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్ళడం. ఇందులో తప్పు పట్టవలసిందేమీ లేదు. తమకు జరుగుతున్న అన్యాయాన్నే గుర్తించలేనివాళ్ళు ఇతరులకు జరుగుతున్న అన్యాయాన్ని ఏం గుర్తిస్తారు? అయితే, సమాజంలో అన్ని అసమానతలకూ మించిన అసమానత వున్నది. పేద, ధనికుల మధ్య వున్న తేడా! దీన్ని ఏ అస్తిత్వవాదమూ అంతగా పట్టించుకోదు. పేదలకూ ధనికులకూ మధ్య వున్న తేడా ఆర్థికపరమైనది. అస్తిత్వ ఉద్యమాలకు కారణం సామాజికమైనది. రెండింటినీ కలిపి చూడవచ్చా... అనవచ్చు. కలిసే వున్నప్పుడు కలిపి చూడక తప్పదు. సామాజిక పరమైన అసమానతలు ఆర్థిక పరమైన అసమానతలకూ, ఆర్థిక పరమైన అసమానతలు సామాజిక అసమానతలకూ కారణాలవుతున్నాయి. ఇందుకు స్త్రీ అస్తిత్వవాదం ఒక ఉదాహరణ. స్త్రీ చైతన్యవాదమన్నా, ఫెమినిజమన్నా అదే. చాలా న్యాయమైనది. అంత న్యాయమైన ఉద్యమం కూడా కొంతవరకూ కదిలి కదిలించి ఆగింది. సాహిత్యంలోనూ అది తీసుకొచ్చిన సంచలనం ఆగి, కొంత స్తబ్దతకు గురయింది. ఇంకేం చెయ్యాలో తెలీని కొందరు పురాణ పాత్రలకు స్త్రీవాద పాఠాలు చెబుతున్నారు. అయితే, స్త్రీలపై అన్ని రకాలుగా సాగుతున్న అణచివేతనూ, వివక్షనూ స్త్రీవాదం గట్టిగా ప్రశ్నించింది. పురుషాధిపత్యాన్ని ప్రశ్నించడంలో కొంత తప్పు ధోరణి కనిపించినా, అస్తిత్వ ఉద్యమాల ప్రారంభంలో వుండే అత్యుత్సాహంగా, ఆవేశంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆ స్త్రీ చైతన్యవాదం స్త్రీలనే కలుపుకోలేక పోయిందని అనక తప్పదు. దళిత కుటుంబాలకు చెందిన స్త్రీలు, ఎగువ మధ్య తరగతికీ, ఆపై వాళ్ళకూ చెందిన స్త్రీవాదంగా దాన్ని భావించారు. సామాజిక పరమైన అసమానతలు ఆర్థిక పరమైన అసమానతకూ, ఆర్థిక పరమైన అసమానత సామాజిక పరమైన అసమానతకూ కారణాలవుతాయంటే ఇదే. స్త్రీ అస్తిత్వవాదం కోరిందేమిటి? తమను మనుషులుగా గుర్తించాలని కాదు. స్త్రీలుగా గుర్తించాలనే. అందువల్ల, సహజంగానే వాళ్లు ఏ వర్గానికి చెందిన స్త్రీలో వాళ్ళ అస్తిత్వవాదంగానే అది వుండిపోయింది. ఒక్క స్త్రీ అస్తిత్వవాదమే కాదు, అన్ని అస్తిత్వవాదాల, లేదా ఉద్యమాల పద్ధతీ అదే. మైనారిటీ అస్తిత్వవాదం, తమను మైనారిటీలుగా గుర్తించాలనే కోరుతుంది. వివిధ కుల సంఘాలన్నీ తమను ఆ కులం వారుగా గుర్తించాలనే కోరుకుంటాయి. ఈ ఆలోచన స్త్రీల గురించి స్త్రీలే రాయాలనీ, ఫలానా కులం గురించి ఆ కులం వారే రాయాలనేంత విపరీత ధోరణికి వెళ్ళడము చూశాం. దాంతో ఏ అస్తిత్వ ఉద్యమానికీ మరొక అస్తిత్వ ఉద్యమం మద్దతు లభించదు. కొన్ని సందర్భాల్లో ఒకదానికి మరొకటి వ్యతిరేకం కూడా! ఒక్కమాటలో చెప్పాలంటే, అస్తిత్వ ఉద్యమాల ఆలోచన తాము కోరుతున్న వాటిని సాధించడం మీద కన్నా, అస్తిత్వాన్ని కాపాడుకోవడం మీదనే ఎక్కువగా వుంటుందనాలి. ఆ పరిమితే ఆ ఉద్యమాలు సాధించినవాటికీ వర్తిస్తుంది. - పి. రామకృష్ణ -
దర్శన దర్శనం
అనువాద సాహిత్యం 1940-42 ప్రాంతాలలో కమ్యూనిస్టు రాజకీయ ఖైదీగా దేవలీ, హజారీబాగ్ జైళ్ళలో రాహుల్జీ వున్నప్పుడు సైన్స్, సమాజ శాస్త్రము, దర్శనాలకు సంబంధించిన విషయాలను ఒకే గ్రంథంగా పాఠకులకు ఇవ్వాలనుకున్నారు. కానీ రాసే క్రమంలో ఏ విషయానికి ఆ విషయాన్ని వేరు వేరుగా రాయటమే సరైనదనుకున్నారు. విశ్వకీ రూప్ రేఖా (సైన్స), మానవ సమాజ్ (సమాజ శాస్త్రం), దర్శన్-దిగ్దర్శన్ (దర్శనం), వైజ్ఞానిక భౌతికవాదం (గతితార్కిక భౌతికవాదం), ఇలా నాలుగు గ్రంథాలుగా వ్రాసారు. అయితే మిగతా గ్రంథాలతో పోలిస్తే, దర్శన్-దిగ్దర్శన్కు కొంత ప్రత్యేకత ఉంది. ఆయన దేవలీ జైలులో వున్నప్పుడు తోటి కామ్రేడ్సకు దర్శన శాస్త్రం (ఫిలాసఫీ) పట్ల అవగాహన కల్గించటానికి ఒక నెల రోజులపాటు మధ్యాహ్నం పూట క్లాసులు తీసుకునేవారు. ఆ విషయాలనే దర్శన్-దిగ్దర్శన్గా రచించారు. ప్రపంచ తాత్విక జ్ఞానాన్ని ఈ గ్రంథంలో రాహుల్జీ పాఠకులకు అందించారు. మా నాన్నగారు ఆలూరి భుజంగరావు మూలంలో దాదాపు 1000 పేజీలున్న ఆ గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలుగు పాఠకుల సౌలభ్యంకోసం భారతీయ దర్శనం, ప్రాక్పశ్చిమ దర్శనాలు అనే రెండు భాగాలుగా ప్రచురించిన విషయం తెలుగు పాఠకులకు విదితమే. ఇక వైజ్ఞానిక భౌతికవాదం (గతి తార్కిక భౌతికవాదం) గ్రంథాన్ని నాన్నగారు 60 పేజీల దాకా అనువాదం చేసి, మెదడుకు సంబంధించిన సమస్య వలన మిగతాది చేయలేకపోయారు. మిగిలిన 120 పేజీలను ఆయన సలహాలు తీసుకుంటూ నేను తెలుగులోకి తేవటం జరిగింది. భారతీయ దర్శనం గ్రంథంలో- వేదాలలో దార్శనిక భావాల నుండి మొదలుపెట్టి, ఉపనిషత్ దార్శనికులతోపాటు స్వతంత్ర దార్శనికులైన నాగార్జునుడి శూన్యవాదం, చార్వాకుడి భౌతికవాద దర్శనం, అలాగే గౌతమ బుద్ధుని క్షణిక, అనాత్మావాదం, కణాదుడి పరమాణువాదం, జైనదర్శనం, పతంజలి యోగదర్శనం, ధర్మకీర్తి దర్శనం, ఇలా దార్శనికుల దర్శనాలే కాకుండా ఆనాటి సామాజిక స్థితిగతులను చెప్తూ భారతీయ దర్శన చరమవికాసమైన తాత్విక జ్ఞానాన్ని పాఠకులకు అందించారు రాహుల్జీ. ప్రాచీన సింధూ నాగరికతా కాలానికి భారతదేశంలో దర్శనమన్నది లేదు. దాదాపుగా క్రీస్తు పూర్వం 600 నుండే దార్శనిక చింతన మొదలైందని చెప్పవచ్చు. అయితే క్రీ.పూ. 1500 నుండి 1000 వరకు రచించిన వేదాలలో దార్శనిక చింతన తాలూకు ఛాయలు కనపడతాయి. క్రీస్తు శకం 350 తరువాతనే భారతీయ దర్శన పరిపూర్ణ వికాసం జరిగింది. వేదాలలో ఆనాటి ఆర్యుల భావాలు, వారి సామాజిక వ్యవస్థ, ఆచారాలు, సుస్పష్టంగా ఉంటాయి. ఆర్యులు- ఇంద్ర, సోమ, వరుణులను స్తుతించారు. యజ్ఞాలవల్ల, దాన దక్షిణలవల్ల ఈ లోకంలో సుఖపడటం, మరణించాక స్వర్గంలో సుఖపడటం- ఇవే వైదిక రుషుల లక్ష్యంగా ఉండేది. చార్వాకులు- భగవంతుడు లేడు, ఆత్మ లేదు, పునర్జన్మ, పరలోకం లేదు, జీవిత భోగాల్ని వదులుకోవలసిన పనిలేదు, సర్వభోగాలను అనుభవించవచ్చును, సత్యాన్వేషణకు అనుభవాన్ని, బుద్ధిని మార్గదర్శనం చేసుకోవాలని అంటారు. అన్నీ క్షణికమైనవి, ఆత్మవాదం అసత్యమైనది, చెడు పనులు చేయకుండా ఉండటం, మంచి పనులు చేయటం, చిత్తవృత్తుల్ని అదుపులో ఉంచుకోవడం- ఇదే బుద్ధుడి ఉపదేశాల సారం. బుద్ధుడు పొందిన జ్ఞానమే బౌద్ధ దర్శనం అయ్యింది. వేదగ్రంథాన్ని ప్రామాణికంగా భావించడం, సృష్టికర్త ఒకడు ఉన్నాడనుకోవడం, స్నానం ద్వారా ధర్మాన్ని సంపాదించామనుకోవడం, జాతివాదాన్ని పాటించడం, ఉపవాసాల ద్వారా ఇతర విధాలా శరీరాన్ని బాధపెట్టుకోవడం, ఇవన్నీ బుద్ధి హీనులు, వజ్ర మూర్ఖులు చేసే పనులుగా బౌద్ధ దార్శనికుడైన ధర్మకీర్తి భావించారు. సమాజంలోని అన్ని రకాల అసమానతలను, దోపిడీలను, అత్యాచారాలను అనంతంగా ఉంచటానికి అత్యంతంగా దోహదపడేదే శంకరాచార్యుని మాయావాదం. జీవునిమీద, ముక్తిమీద, ముక్తి ఫలితంమీద నమ్మకంలేని శంకరాచార్యున్ని ప్రచ్ఛన్న బౌద్ధుడంటారు. శంకరాచార్యుని దార్శనికతతో భారతీయ దర్శన గ్రంథం ముగుస్తుంది. ప్రాక్పశ్చిమ దర్శనాలలో- సోక్రెటీస్ యథార్థవాదం, ప్లేటో కాల్పనికవాదం, అరిస్టాటిల్ వస్తువాదం, ఎపికురియన్ల భౌతికవాదం, యవన దార్శనికులు, ఇస్లాం దార్శనికులు, క్రైస్తవ దర్శనం, యూరప్ దర్శనాలు, న్యూటన్, బర్కలే, హ్యూమ్, మార్క్స గతితార్కిక భౌతికవాదం దాకా పాఠకుల ముందు ఉంచారు రాహుల్జీ. వైజ్ఞానిక భౌతికవాదాన్ని సైన్స లేదా ప్రయోగశాస్త్రం అనవచ్చు. ప్రయోగాన్ని మార్గదర్శకంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది కనుకనే సైన్స యొక్క అధినాయకత్వాన్ని గతితార్కిక భౌతికవాదం శిరసావహిస్తుంది. ఈ గ్రంథంలో కార్యకారణ నియమం నుండి మొదలుకొని ప్రతిషేద ప్రతిషేదం వరకు అనేక అంశాలను తర్కించుకుంటేనే తర్కం బోధపడుతుంది అన్నట్లుగా ఇతర దర్శనాలకు, గతితార్కిక భౌతిక వాదానికి ఉన్న తేడాను విపులీకరించారు రాహుల్జీ. అనువాదం గురించి: ఒక భాష నుండి మరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నాన్నగారు చెప్తుండేవారు. ఏ గ్రంథాన్నైతే అనువాదం చేయాలని అనుకుంటామో ఆ గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి; మక్కీకి మక్కీగా చేసే అనువాదం అనువాదమే కాదు; గ్రంథాన్ని అధ్యయనం చేసి మూల రచయిత భావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని అనువదించాలనేవారు. అనువదిస్తున్న భాషలోకి రచయిత మూలభావం దెబ్బతినకుండా పాఠకులకు అర్థమయ్యే రీతిలో అనువాదం చేయాలనేవారు. మూలభాషమీదా, అనువాదం చేసే భాషమీదా పట్టు వుండాలనేవారు. భాషలమీద పట్టుకోసం ప్రాచీన గ్రంథాలను తప్పక అధ్యయనం చేయాలనేవారు. వైజ్ఞానిక భౌతికవాదం గ్రంథంలో- ‘దృష్టి కె వికార్’ అన్న పదాన్ని ‘దృష్టి పరివర్తన’ అని తెలుగులో అనువదించారు నాన్నగారు. ఇందులో రాహుల్జీ ‘భూత్’ అన్న పదాన్ని భౌతిక తత్వము లేదా పదార్థము అని తెలపటానికి వాడారు. ‘బుద్ధ్ నె అపనే దర్శన్ కీ ఇతనీ నాకాబందీ కీ హై’ అన్న వాక్యాన్ని- ‘బుద్ధుడు తన తత్వాన్ని ఎంత బలవత్తరంగా ఎంత దృఢంగా, ఎంత కఠినంగా స్థిరీకరించాడంటే’- అని అనువదించారు. జబ్ తక్ జియె సుఖ్ సె జియె, ఋణ్ కర్ కె ఘీ (శరాబ్) పియె! దేహ్ కె భస్మీభూత్ హూ జానే పర్ ఫిర్ ఆనా కహా సె’... ఈ శ్లోకానికి అర్థం తెలుగులో ఇలా ఇచ్చారు: ‘బతికినంతకాలం సుఖంగా బతకండి, అప్పుచేసైనా పప్పుకూడు తినండి. ఈ దేహం భస్మీపటలం అయ్యాక ఇక మనం ఏమి చేయగలం, ఏమి అనుభవించగలం?’ ఇలా ఈ పుస్తకాలు అనువాదం కాదేమో, తెలుగులోనే రాసినవేమో, అనుకునేట్లుగా అనువదించారు నాన్నగారు. కవిని ఆలూరి 9701605623 -
శాలింజర్ నవల మీద
తొలి పుస్తకం నేను గనక ఒక పియానో ప్లేయరో, ఒక యాక్టరో లేదా ఇంకేదన్నా అయ్యుండి ఆ శుంఠలందరూ నన్నొక అద్భుతం అనుకుంటే, దాన్ని నేను ద్వేషించేవాడిని. వాళ్లు నాకు చప్పట్లు కొట్టాలని కూడా కోరుకుని వుండేవాడిని కాదు. మనుషులందరూ తప్పుడు పనులకే చప్పట్లు కొడతారు. (ద క్యాచర్ ఇన్ ద రై/ పేజీ 78) నోరుంది గదా అని నవ్వలేము, కళ్లున్నాయి గదా అని ఏడ్వలేము. ఈ పనులు చేయాలంటే వుండవలసింది లోపల ఆత్మ. అది వున్నవాడు జె.డి. శాలింజర్. అది వున్న వాడే గాదు, దాన్ని పట్టుకున్న వాడు గూడా. అది కేవలం అమెరికన్ ఆత్మ కాదు, ప్రపంచ మానవుడి ఆత్మ. అందుకనే శాలింజర్ రాసిన ‘ద క్యాచర్ ఇన్ ద రై’ నవల విశేషంగా ఆకర్షించింది, ముఖ్యంగా యూత్‌ని. ఈ నవలలో ఎన్నో కోణాలు వున్నాయి. విద్య, యుద్ధం, సెక్స్, మానవీయత, స్త్రీ, సంగీతం, సాహిత్యం, నృత్యం, ఇంకా చెత్తలోకి చెత్త సినిమా కూడా. మతాన్నీ వదల్లేదు. జీసస్ అంటే ప్రాణం, మతం అన్నా పాస్టర్లన్నా కాదు. విషయాలను తిరగేసి ఆలోచించడం శాలింజర్‌కి వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడ మనకున్న కులం గోల ఎంతో, అక్కడ అమెరికాలోనూ క్యాథలిక్ మతం గోల అంతే. లోకం దృష్టిలో జీసస్‌ను పట్టి యిచ్చిన జూడాస్ పాపి, ఆయన్ని శిష్యులు నరకానికి పంపుతారేమో గానీ జీసస్ అలా చేయడని తన పాత్ర హోల్డెన్ కాల్ఫీల్డ్ చేత అనిపిస్తాడు. ఒక ఏడుపు గొట్టు చండాలపు సినిమా చూస్తూ బోరుమని ఏడ్చే ఆడమనిషి తనతో వున్న పిల్లవాడు వుచ్చపోసుకోవడానికి తీసుకుపొమ్మని పోరుతుంటే ఆవిడ కాస్త ‘మర్యాద’గా ప్రవర్తించు అని కసురుతుంది. ఆమె ఒక గాడ్ డామ్ నక్కలా దయగలది అని వెక్కిరిస్తాడు శాలింజర్. ఈ నిర్మొహమాటమైన భాష వల్లే ఈ నవలను అమెరికాలో చాలా సార్లు నిషేధించారు. కాల్ఫీల్డ్ బూతులు మాట్లాడతాడనీ, సిగరెట్లు కాలుస్తాడనీ, మందు తాగుతాడనీ, వేశ్యతో గడుపుతాడనీ, తెల్లవాళ్లకు వ్యతిరేకమనీ... 1960 నుంచీ 80 దాకా పలుమార్లు నిషేధించారు. ఒక స్కూల్ టీచర్ పిల్లల్ని ఈ పుస్తకం చదవమన్నందుకు అతన్ని యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ నాన్సెన్స అంతా కాలప్రవాహంలో కొట్టుకుపోయి ఇప్పుడిది పిల్లలకు అసైన్మెంటై కూర్చుంది. కాల్ఫీల్డ్కి జేన్ గాలఘర్ అంటే ప్రాణం. ఆ అమ్మాయి ఎర్రటి గౌను వేసుకుంటే దట్ కిల్డ్ మి అంటాడు. ఎరుపు స్వచ్ఛతకు ప్రతీక. కాల్ఫీల్డ్ వేసుకునే టోపీ ఎర్రది, చెల్లి ఫీబీ జట్టు ఎరుపు, ఎప్పుడో చనిపోయిన తమ్ముడు అల్లీది ఎర్ర జట్టు. ఇలాంటి అబ్జర్వేషన్‌స ఒక పది కోట్ల దాకా వుంటాయీ పుస్తకంలో. జేన్ కన్నీటి చుక్క కూడా చెకర్స బోర్డులో రెడ్ స్క్వయర్ మీదే పడుతుంది మరి. ఇలా చెప్తూ పోతే రెండు మూడు పుస్తకాలు రాయచ్చు. ఇదంతా గూగుల్‌లో పోగుపడ్డ చెత్తే. చదవడం అనవసరం. పుస్తకాన్ని మాత్రం తప్పక చదవండి. ఇది పేరాకు పేరా ఆ మాటకొస్తే లైన్ టు లైన్ ట్రాన్సలేషన్. తెలుగులో చదివాక ఇంగ్లీషు పుస్తకాన్నీ చదవండి, ఇంకా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ఇంగ్లీష్ అవసరం చాలా ఉంది. ఇదంతా కాదు నవల గురించి ఒక్క ముక్కలో చెప్పు అంటే - చైల్డ్‌హుడ్ నుంచి అడల్ట్హుడ్లోకి వచ్చే దశలో ప్రతి ఒక్కరూ పడే సంఘర్షణ అని చెప్తాను. ఉదాహరణకు కాల్ఫీల్డ్ మంచుకాలంలో గడ్డకట్టిపోయిన సరస్సులో బాతులు ఏమై ఉంటాయా అని పదే పదే తనలోతాను, ఇతరులతో తాను తర్కించుకోవడం. ఇన్నొసెన్సని పోగొట్టుకోవడం ఎంత బాధాకరం! చివరగా కాల్ఫీల్డ్లా నేననేదేంటంటే పుస్తకాలు చదవండి. అప్పుడే మీరు ప్రేమించడం నేర్చుకుంటారు. జీవితాన్ని తెలుసుకుంటారు. నేననేదిదే. శాలింజర్ అన్నదే. - టామ్ సాయర్ (టామ్ సాయర్, విద్యార్థి. వయసు 24 ఏళ్లు. జె.డి.శాలింజర్ ‘ద క్యాచర్ ఇన్ ద రై’ని అదే పేరుతో తెలుగులోకి అనువదించాడు. ఇది అతడి మొదటి వర్కు. ‘సి’ గ్రేడ్ కారణంగా ఉద్యోగార్హత కోల్పోయినందుకు ఆత్మహత్య చేసుకున్న తన స్నేహితుడే గనక పుస్తకాలతో స్నేహం చేసివుంటే, ఆ పని కచ్చితంగా చేసివుండేవాడు కాదని టామ్ నమ్మకం. అదే తనను విద్యావ్యవస్థలోని లోటుపాట్లను స్పృశించిన ఈ పుస్తకానువాదానికి పురిగొల్పిందని చెబుతాడు. ఫోన్: 0877-2242102) -
నేను కోరే శాంతి ఈ మామూలు శాంతి కాదు
మే 19న చలం జయంతి నేను జీవితమంతా ఆశించింది శాంతి. కాని నా తల ఎప్పుడూ ఆలోచనలతో, సమస్యలతో బాధపడుతో వుండేది. రాత్రి పడుకున్నా, తెల్లారి లేచినా, ‘‘ఏమిటి యిదంతా?’’ అనేటటువంటి ఒక పెద్ద సమస్య పట్టుకునేది. కాని ఎన్నడూ శాంతిని నిలుపుకోలేదు. ఆనాడు నేను అనుకున్న శాంతి కావాలంటే ఏ జోలికిపోక నా డబ్బుని నేను దాచుకుని, నా తిండిని నేను తిని, ఇంకొకరి సంగతి పట్టించుకోక నిద్రపోవడం; అట్లా వుండాలనే ఆలోచనే రాలేదు నా తల్లోకి. శాంతిని భగ్నం చేసేటటువంటి పనులన్నీ చేసేవాణ్ని. నేను సమస్యలు గనక పెట్టుకోకపోతే, నా జీవితంలో నేను ఏ మాత్రమూ అశాంతి పడవలసిన పనిలేదు. నాలో పుట్టిన ఉద్రేకాల్నించి శాంతి నాకు కావాలి. అన్ని సమస్యలూ, స్త్రీల సమస్య, మృగాల సమస్య, బిడ్డల సమస్య, లోకం సమస్య యివన్నీ గూడా నా శాంతిని నాశనం చేశాయి. సుఖపడవలసినవాళ్ళు జీవితంలో యివేమీ పెట్టుకోరు. అసలు జీవితంలో వాళ్ళు యివి తీసుకోరు. తమ ఆలోచనలలో గాని, జీవితంలో గాని తీసుకోరు. ఎవరన్న వొస్తే ఓ అట్టానా! అని పంపించేస్తారుగాని, తమ లోపలికి తీసుకుని ఏమిటి బాధ అని వాళ్ళని ప్రశ్నించరు. ఆ విధంగా ఎవరిదో ఒకరి బాధ నా జీవితమంతా వ్యాపించి వుండేది. అబ్బ ఇంక పెట్టుకోలేననుకునేవాణ్ని, కాని ఇంకా వొచ్చేవి. మరి శాంతిని ఈ విధంగా కోరుతూ ఎందుకు ఎప్పడూ అశాంతి నిచ్చేవాటిలోకి పోవాలి? ఎందుకంటే- యిప్పుడు తెలుస్తోందన్నమాట. అశాంతి నిచ్చేవి నా జీవితంలోకి రాకపోతే నేను వుత్త మొద్దులాగుండేవాణ్ని. బడికి వెళ్ళడం, ఇంటికి రావడం, భోజనం చెయ్యడం, కూచోడం, ఏదో పుస్తకాలు చదవడం, ఇంతకంటే నాకు పనేమిటి? అదంతా శాంతి, ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది నేను కోరే శాంతి ఈ మామూలు శాంతి కాదు. (చలం ఆత్మకథ ‘చలం’ లోంచి...) దిక్కులేని స్థితిలో చలం సమాధి రెండేళ్ల క్రిందట యానాం ప్రాంతానికి చెందిన తొలితరం కథకుడు వి.వి.సుబ్బరాజు, తమిళనాడులోని తిరువణ్ణామలైలో దిక్కూమొక్కూ లేకుండా పడివున్న రచయిత చలం సమాధి గురించి తెలియజేశాడు. ఈనెల 7వ తేదీన నేను తిరువణ్ణామలై వెళ్లాను. ఎంతో కష్టపడి చలం సమాధి ఉన్న చోటు కనుక్కోగలిగాను. రమణాశ్రమానికి కొంత దూరంలో రోడ్డువార చెత్తాచెదారం మధ్య ఒక సమాధి కనిపించింది. అక్కడ ఒక చెట్టుకింద కూర్చున్న యాచకులనూ, కొబ్బరి బొండాలు అమ్మేవాళ్లనూ ఆ సమాధి ఎవరిదని అడిగితే వెనకాల ఉన్న ఆఫీసులో కనుక్కోమన్నారు. అక్కడ ‘శాంతిమలై హేండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్’ (విలేజ్ వుమన్ హేండీక్రాఫ్ట్స్) పేరుతో ఉన్న ఆఫీసులో ఉద్యోగినులను అడిగాము (నాతో ఉన్న మా అబ్బాయి చక్రవర్తికి తమిళం తెలుసు). అది ఎవరో జలం అనే తెలుగు రైటర్ సమాధి అనీ, అప్పుడప్పుడు ఎక్కడి నుంచో ఒక ముసలాయన వచ్చి దానిని శుభ్రం చేసి పెడుతుంటాడనీ చెప్పారు. అంతకంటె వివరాలు చెప్పలేకపోయారు. అతిదారుణమైన విషయం ఏమిటంటే, ఆ సమాధి మీద చనిపోయిన వ్యక్తి పేరుగానీ, ఇతర వివరాలుగానీ ఏమీలేవు. సమాధి చుట్టూ ఉన్న అతిచిన్న ప్రహరీని చేర్చి కొంతమంది చిరువ్యాపారుల తోపుడుబళ్లు ఉన్నాయి. రోడ్డు విస్తరణలాంటిదేమైనా జరిగితే సమాధి మొత్తం లేచిపోయే ప్రమాదం కూడా ఉంది. తన రచనలతో ఆంధ్రదేశంలో పెను సంచలనం సృష్టించిన మహారచయిత చలం సమాధి 'unwept, unsung, unhonoured' అన్నట్టుగా ఉండటం చూసి ఎంతో బాధ కలిగింది. - అదృష్టదీపక్ 9440528155 -
కథ తెలుస్తూనే ఉంటుంది..
పాఠకుడితో సంభాషణ బొమ్మలు వేసేటప్పుడు వేళ్లు కదల్చాలా? మణికట్టు కదల్చాలా? కొత్తగా బొమ్మలు వేసేవాళ్లకూ చాలా ఏళ్లుగా బొమ్మలు వేసేవాళ్లకు కూడా ఈ సందేహం ఉంటుందట. మరి కొత్తగా కథలు రాసేవాళ్లకు? మపాసా ఒక కథ రాశాడు. అందులో ఒక అమాంబాపతు రైతు. అతనికి ఒక ముసలితల్లి. జబ్బు పడుతుంది. గుటుక్కుమంటే వేరే సంగతి. కాని మంచాన పడితే? పోయేలా ఉంది. ఎప్పుడు పోతుందో తెలీదు. తనేమో పొలానికి వెళ్లాలి. చూడ్డానికి ఇంట్లో ఎవరూ లేరు. ఊళ్లో ఒక దాదీ ఉంటుంది. ఆమె దగ్గరకు వెళితే రోజుకు రూపాయి అడుగుతుంది. రోజుకు రూపాయా? రేపో మాపో పోయేలా ఉంది కదా... అందుకని రైతు పోయేదాకా చూసుకో ఏడు రూపాయలు ఇస్తా. ఇవాళ పోయినా ఏడు రూపాయలే, పది రోజుల తర్వాత పోయినా ఏడు రూపాయలే అంటాడు. దాదీ వచ్చి ముసలిదాని వాలకం చూస్తుంది. మూడ్రోజులకు మించి ఉండదు. సరే అంటుంది. ఒక రోజు గడుస్తుంది. ముసలిదాని వాలకం మారుతుంది. ఈ రాత్రికే అన్నట్టు ఉంటుంది. రైతుకు బాధ. అయ్యో ఈ రాత్రికే పోతే అనవసరంగా దాదీకి ఏడు రూపాయలు ఇవ్వాలే. మరో రోజు గడుస్తుంది. ముసలిదాని వాలకం మళ్లీ మారుతుంది. ఒక నెలైనా బతికేలా ఉంది. దాదీకి బాధ. నెల రోజులు బతికితే వచ్చేది ఏడు రూపాయలా? ఏమీ తోచదు. సరే చేసేదేముంది అని ఆ రోజు రాత్రి దీపాలన్నీ ఆర్పేసి చేతిలో చీపురు, నెత్తి మీద చేట పెట్టుకొని నాలుక బయటపెట్టి వికృతమైన ఆకారం ధరించి హఠాత్తుగా ముసలిదాని ముందుకు వస్తుంది. దయ్యం కనపడితే ఎవరు బతుకుతారు? ముసల్ది పుటుక్కుమంటుంది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని సిద్ధాంతపరంగా నిరూపించడానికి ఎన్ని వందల పేజీలు రాయాలో తెలియదు. మపాసా మాత్రం ఒక ఐదారు పేజీల్లో ఈ కథలో చెప్పేశాడు. ఈ విద్య అతనికి ఎవరు నేర్పించారు? ఎవరైనా చెప్తే కొన్ని తెలుస్తాయా? కథ రాసేవాళ్లు ఏవైనా సరే ఎవరి దగ్గరైనా సరే కొన్ని నేర్చుకోవాలా? అవసరమేనా? కథ రాసి ఎలా ఉందో చెప్పమని వేమన వసంతలక్ష్మి, చూపు కాత్యాయని, ఇండియా టుడే మాజీ ఎడిటర్ ఎం.రాజేంద్ర, శ్రీరమణ, అనంత్, జంపాల చౌదరి వంటి మిత్రులకు చూపుతుండేవాణ్ణి. బాగుందో బాగలేదో చెప్తుండేవారు. దర్గామిట్ట కతలు రాసేటప్పుడు కథల నిండా కథల మధ్యలో బ్రాకెట్లు పెట్టి కొన్ని వివరాలు ఇస్తుండేవాణ్ణి. సాధారణంగా శ్రీరమణ సలహాలు ఇవ్వరు. కాని నా మీద దయతలచి ‘అలా బ్రాకెట్లు పాఠకులకు ఇబ్బంది అండీ’ అన్నారు. అంతే. ఇప్పటి వరకూ కథల మధ్యలో బ్రాకెట్లు వాడలేదు. నామిని నా ‘జమీన్’ కథను చదివి మధ్యలో మూడు చుక్కలు ( ) పెట్టి బ్రేక్ ఎందుకు చేస్తున్నావు? అది బ్యాడ్ నెరేషన్. జానపదులు ఓరల్ ట్రెడిషన్‌లో మధ్యలో మూడు చుక్కలు అని ఆపుతారా? ఆపరు కదా? కంటిన్యూగా కథ చెప్పలేవా? అని సలహా ఇచ్చాడు. నా ‘కింద నేల ఉంది’ 32 పేజీల కథ. ఒక్క బ్రేక్ లేకుండా కంటిన్యూగా కథ చెప్పాను. అంతే కాదు ఎంత పెద్ద కథనైనా ‘మూడు చుక్కల బ్రేక్’ లేకుండా చెప్పడం సాధన చేస్తున్నాను. ఎవరో ఒకరు కొన్ని చెప్పాలి. కొన్ని మనకు మనమే నేర్చుకోవాలి. అందుకు మార్గం ఏమైనా ఉందా? కార్మికుల కష్టాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. రైతుల కష్టాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. అభివృద్ధి చేస్తున్న విధ్వంసక రూపాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. రాశాం. రాస్తున్నాం. కాని కొంచెం మార్చవచ్చు కదా. వేరేది రాయవచ్చు కదా. ‘బస్ట్ సైజ్ ఫొటో’... ఇది ఒక సంస్కారం. మనిషిని అంత వరకే చూసి రాయడం లోకం మెచ్చిన సంస్కారం. కాని ఆ బస్ట్ కింద ఉండే చీకట్లను, జ్వాలలను, తాపాలను, తెప్పరింతలను, కటి ప్రాంతం ఈడ్చుకుంటూ వెళితే ఒంటి మీద పడే చెక్కుళ్లను లోకంలో చాలా మంది రాశారు. ఆల్బెర్టో మొరావియా, హెన్రి మిల్లర్, డి హెచ్ లారెన్స్, మంటో, ఇస్మత్ చుగ్తాయ్, కమలా దాస్, చలం... ‘అయ్యో.. పూర్వం మనం బాగానే మాట్లాడుకున్నామండీ... ఈ విక్టోరియన్ మొరాలిటీ తగలడ్డాకే ఇలా తయారయ్యాం’ అనేవాళ్లు ఉన్నారు... అయితే కొంచెం ప్రయత్నించి ‘బియాండ్ కాఫీ’ అని పది కథలు రాశాను. కొంచెం విమర్శ వస్తుంది. ఉక్కిరిబిక్కిరి వస్తుంది. అది ‘అంగీకారం’ పొందే వరకూ ఎలా తట్టుకొని నిలబడాలి? కొత్తదారిని ఎలా కనుగొనాలి? ఆ దారిన ఎదురుదెబ్బకు ఏ మందును పట్టుకొని నడవాలి? ఒక్కోసారి కథ తెలుస్తూ ఉంటుంది. దానికి పాత్రలు వెతుక్కోవాలి. ఎలా? ఒక్కోసారి ఒక బ్రహ్మాండమైన పాత్ర కళ్ల ముందు కనపడుతూ ఉంటుంది. దానికి కథను వెతుక్కోవాలి. అదీ ఎలా? ఒక్కోసారి కథంతా పూర్తయిపోతుంది. దానికో పేరు ఎంతకీ తెమలదు. సరైన పేరు ఎలా పెట్టాలి? ఒక్కోసారి కథంతా ముక్కలు ముక్కలుగా గోచరమవుతూ ఉంటుంది. ఏ ముక్క మొదట రాయాలి... ఏ ముక్క చివర అమర్చాలి? నిడివి పెరుగుతూ పోతే దోషమా? మరీ క్లుప్తంగా వచ్చేసిందే... లోపమా? ఓ కథాదేవేరీ... నీవెప్పుడు నా పక్కన సుఖాశీనురాలివి అవుతావు? నా వక్షాన ఎప్పుడు శాశ్వత ప్రతిష్టితమవుతావు? నిదుర రాదు. రాసేటప్పుడు విపరీతంగా ఆకలి వేస్తుంది. ఇంట్లో వారికి ప్రవర్తన అర్థం కాదు. ట్రాఫిక్‌లో ఎవడో మన పరధ్యానానికి బండబూతులు తిడతాడు. ఆఫీస్‌లో పని తెమలదు. ఆ సాయంత్రం స్నేహితుల సాంగత్యం రుచించదు. కథ వెంట పడుతుంది. కథే ముద్ద మింగకుండా మన గొంతుకు అడ్డం కూచుంటుంది. పారిపోవాలనిపిస్తుంది. కాని కథ ముగిస్తేనే విడుదల పత్రం దొరుకుతుంది. ఈ జంజాటం జీవితాంతం ఉంటుంది. ఈ ప్రయాణానికి మనకేం తోడు కావాలి? కథ ఎప్పటికీ తెలిసిపోదు. అసలు సంపూర్తిగా తెలిసిపోయేదేదీ విద్య కాదు. అది తెలుస్తూ ఉంటుంది. అరె... నా అనుభవం ఇది... నీ ప్రయాస ఇదా... నేను ఇలా చేశాను... నువ్వు ఎలా చేస్తున్నావు.... డిగ్రీలు అమెరికాకు టికెట్టు కొనుక్కోమంటుంటాయ్. బయట రియల్ ఎస్టేట్ హోర్డింగ్స్ పిలుస్తుంటాయ్. టీవీల్లో చెత్త. సినిమాల్లో బురద. సరిగ్గా పిల్లల స్కూల్ ఫీజ్ కట్టలేవు, ఈ కథను పట్టుకుని ఎందుకురా ఊగులాడుతున్నావ్ అని మధ్య మధ్య విసుగు వస్తూ ఉంటుంది. కాని- వదల్లేం. చేయి విదిలించుకోలేం. కథకు మనం తగిలాం. కథ మనల్ని దొరకబుచ్చుకుంది. దానిని తెలుసుకుంటూ దానికి మనల్ని తెలియచేసుకుంటూ ఈ మధురబాధాయానాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. నాకు కొంత తెలిసింది. చెప్పేశాను. ఇక మీ వంతు. - మహమ్మద్ ఖదీర్‌బాబు 9705444243 -
లోలోపలి మనిషిని పట్టుకునే ప్రయత్నం
పుస్తక నేపథ్యం చారిత్రక ఘట్టాలను నవలీకరించే ప్రయత్నం మనకు తక్కువ. స్వాతంత్య్రోద్యమం ఇతివృత్తంగా ‘తమస్’(భీష్మ సహానీ), ‘కొల్లాయి గట్టితేనేమి..!’ (మహీధర), ‘ప్రజల మనిషి’ (వట్టికోట) వంటి నవలలు; మంటో, గుల్జార్, ఇస్మత్ చుగ్తాయ్, కుష్వంత్‌సింగ్ వంటి వారి కథలైనా వచ్చాయి. ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగినదని చెప్పే మన స్వరాజ్య పోరాటం మీద అసాధారణమైన నవలేదీ అంటే సమాధానం రాదు. అలాగే వెయ్యేళ్ల దాస్యం తరువాత స్వాతంత్య్రం తెచ్చుకున్న జాతి తొలి అడుగులలో తడబాటు, సంఘర్షణ కనిపిస్తాయి. స్వతంత్ర భారత రాజకీయ నాయకత్వం భ్రమలలో గడిపేయడం ఆ దశలో చేదు నిజం. ఘనమైన స్వాతంత్య్ర పోరాటం ద్వారా సంక్రమించాయనుకున్న విలువలు తొలి ఎన్నికలలోనే వలువలు విప్పేసుకోవడం వంటి వాస్తవాలను రచయితలు స్వీకరించలేదు. ఆ విజయాలనూ, ఈ వైఫల్యాలనూ కళ్లకు కట్టే నవల పీవీ నరసింహారావు ‘ది ఇన్సైడర్’ (‘లోపలి మనిషి’; అనువాదం: కల్లూరి భాస్కరం). కానీ ఈ నవలకు తెలుగునాట రావలసినంత ఖ్యాతి రాలేదు; 20వ శతాబ్దంలో అనువాదకులు తెనిగించిన గొప్ప గ్రంథాలలో ఇదొకటని నా నమ్మకం. మరికొద్దిమందినైనా ఆ నవల చదివేలా పురిగొల్పేందుకు అందులోని భిన్న కోణాల్ని ఏడు వ్యాసాలుగా మలిచాను. పీవీ ఈ నవలలో స్పృశించిన అంశాలు ఎన్నో. నేను పరిశీలించినవి కేవలం ఏడు. రైతాంగ పోరాట తెలంగాణ, అందులోని వైరుధ్యాలు, హిందూ-ముస్లిం సంబంధాలు చెప్పే వ్యాసం ‘లోపలి మనిషిలో తెలంగాణ సామాజిక దృశ్యం’. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తినీ, గాంధీజీ ప్రవచనాలనీ భారతజాతి ఎంత త్వరగా మరచిపోయిందో చెప్పేదే ‘లోపలి మనిషిలో ఎన్నికల చిత్రం’. గొప్పనేతలే అయినా నెహ్రూ, ఇందిరలకీ పరిధులు ఉన్నాయని తీర్పు చెప్పే అంశం ‘లోపలి మనిషి బోనులో నెహ్రూ- ఇందిర’. రాష్ట్రాలు బలహీనపడితే నక్సలిజం వంటి పరిణామాలు తప్పవని సశాస్త్రీయంగా (‘లోపలిమనిషిలో నక్సల్బరీ జాడలు’) చెప్పారు పీవీ. ఇలాంటి మలుపులను చారిత్రకంగా అంచనా వేసిన విశిష్ట నవల ఇది. ఈ నవల మీద పరిచయ వ్యాసాలు వెలువరించే అవకాశం నాకు వచ్చింది. - డాక్టర్ గోపరాజు నారాయణరావు 9849325634 -
పురస్కారం - తిరస్కారం
చరిత్ర 1964లో స్వీడిష్ అకాడమీ నోబెల్ సాహిత్య పురస్కారాన్ని సుసంపన్నమైన భావాలతో, స్వతంత్ర కాంక్షా భరితమై, సత్యశోధనతో మన యుగంపై గొప్ప ప్రభావాన్ని చూపిన రచనలు చేసినందుకు ఫ్రెంచి రచయిత జా పాల్ సార్త్రకు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా, ఈ బహుమానాన్ని స్వీకరించేందుకు సుముఖంగా లేనని సార్త్ర తెలియజేశారు. ఈ గౌరవాన్ని సార్త్ర తిరస్కరించిన కారణాన ఈ పురస్కార ప్రాధాన్యత ఏమాత్రం వికృతీకరించబడదు. ఈ పరిస్థితులలో, బహుమతి ప్రదానోత్సవం జరగదని మాత్రమే అకాడమీ పేర్కొనగలదు. LE FIGARO అక్టోబర్ 23, 1964 ప్రతిలో ప్రచురితమైన ఒక బహిరంగ ప్రకటనలో సార్త్ర తానీ పురస్కారాన్ని తిరస్కరించడం వివాదం కావడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. స్వీడిష్ అకాడమీ ఒకసారి తీసుకున్న నిర్ణయపు అనుక్రమణీయత తెలియని కారణాన, తనను ఈ బహుమానానికి ఎన్నుకోవలదని ఒక లేఖ ద్వారా స్వీడిష్ అకాడమీని కోరినట్లు సర్వులకు తెలియాలని సార్త్ర అభిలషించారు. తనకు స్వీడిష్ అకాడమీని కించపరిచే ఉద్దేశం లేదని, తన నిరాకరణ ఆత్మగత, ఇతరేతర కారణాల ప్రేరితం అని సార్త్ర ఈ లేఖలో సూచించారు. ఆత్మగత కారణాలకు సంబంధించి, రచయిత కర్తవ్యం గురించి తీసుకున్న భావన మూలంగా తానెప్పుడూ అధికారిక పురస్కారాలను తిరస్కరిస్తూనే వచ్చానని సార్త్ర పేర్కొన్నారు. అంతకుముందు కూడా సార్త్ర LEGION OF HONOUR లో సభ్యత్వాన్ని నిరాకరించి COLLEGE DE FRANCE ప్రవేశాన్ని అభిలషించలేదు. అంతేకాదు, లెనిన్ ప్రైజ్‌ను తనకివ్వజూపినా, దాన్ని కూడా తిరస్కరిస్తానని సార్త్ర అన్నారు. ఈ విధమైన గౌరవాన్ని ఆమోదించడం రచయిత తన వ్యక్తిగత పూచీలను, బాధ్యతలను బహుమతి ప్రదానం చేసిన వ్యవస్థతో సహచరితం చేయడమే. రచయిత ఎటువంటి పరిస్థితిలో కూడా తనను తాను ఒక వ్యవస్థగా పరివర్తన చెందేందుకు అనుమతించకూడదు. ఇతర కారణాలకు సంబంధించి సార్త్ర ఒక పట్టికనిచ్చారు. ఏ వ్యవస్థల జోక్యం లేకుండా ప్రాక్పశ్చిమాల ప్రజల మధ్య, సంస్కృతుల మధ్య, ఆదాన ప్రదానాలు జరగాలని తన నమ్మిక అని సార్త్ర పేర్కొన్నారు. అంతేకాదు తన అభిప్రాయంలో, గతంలో ఈ పురస్కారం అన్ని భావజాలాలకు, అన్ని జాతులకు సమాన ప్రాతినిధ్యం వహించలేదు. ఇటువంటి స్థితిలో తానీ బహుమానాన్ని ఆమోదించడం, అవాంఛనీయ, అన్యాయపూరిత విమర్శలకు తావియ్యవచ్చు అని ఆయనన్నారు. స్వీడిష్ అకాడమీకి ఒక ప్రేమపూర్వక సందేశంతో సార్త్ర తన లేఖను ముగించారు. (స్వీడిష్ అకాడమీ సభ్యుడు ఏండర్స్ ఆసర్లింగ్ ద్వారా) - మువ్వల సుబ్బరామయ్య 8978261496 -
జీనా హై తో మర్నా సీఖో
పుస్తక పరిచయం పుస్తకంలోకి అడుగు పెట్టకముందే, ఆ కాలాతీత యోధుడు మనల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. ఒక నిమిషం ఏకాగ్రతతో ఆయన కళ్లకేసి చూడండి: ‘నాకు సమాధానాలు కావాలి’ అని అడుగుతున్నాయవి. సెంట్రల్ యూనివర్సిటీ, రోహిత్, జేఎన్‌యూ, అతి సహనం, అతి అసహనం... ఎన్నో అడుగుతూనే ఉన్నాడు. మన దగ్గర సమాధానం ఉందో లేదో తెలియదు, ఉన్నా చెబుతామో లేదో తెలియదు... అయినా సరే లోపలికి వెళతాం. ఉస్మానియా యూనివర్సిటీలో 1960ల చివరి నుండి-70ల తొలిరోజుల విద్యార్థి ఉద్యమం జార్జిరెడ్డిగా దర్శనమిస్తుంది. ‘ఉద్యమ’ నిర్వచనాలు తారుమారవుతున్న కాలం. సైద్ధాంతిక బలం ఎక్కువై, ఆచరణ బలహీనత ఒక సామాజిక రోగంగా మారుతున్న కాలం. సిద్ధాంత సారం సిద్ధాంతాల్లోనే ఉండిపోయి, ప్రగతిశీల ‘మేధ’ కనిపించీ కనిపించని కాలంలో... జార్జిరెడ్డి జీవితాన్ని చదువుకోవడం అంటే లీలమ్మ, రఘునాథరెడ్డి పుత్రుడి గురించో, అత్యంత ప్రతిభావంతుడైన ఒక విద్యార్థి గురించో, ఇతరుల క్షేమం గురించి తప్ప తన జీవితం గురించి పట్టించుకోని ఒక బలమైన విద్యార్థి నాయకుడి గురించో మాత్రమే చదువుకోవడం కాదు; ‘జీనా హైతో మర్నా సీఖో’ అంటూ ఈ కాలానికి అవసరమైన ధైర్యవచనాలను ధైర్యంగా చదువుకోవడం.బా...గా... కుంచించుకుపోయిన జీవితాన్ని విశాలం చేసుకోవడం. ఈ పుస్తకానికి ముందు చే గువేరా జీవితాన్ని పరిచయం చేశారు ‘చూపు’ కాత్యాయని. జార్జిరెడ్డి గురించి చదువుతున్నంత సేపూ ఎక్కడో ఒక చోట చే గుర్తుకు వస్తూనే ఉంటాడు. - యాకుబ్ పాషా యం.డి. -
పరిశోధన: నాడు, నేడు, రేపు
సదస్సు పత్రాలు 108 తెలుగు, ఒక ఆంగ్లం, వెరసి 109 రచనలతో యీ బృహద్గ్రంథం ఫిబ్రవరిలో మద్రాసు యూనివర్సిటీ జరిపిన సదస్సులో వెలువడింది. తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తికి అంకితం, దాని ప్రక్కనే కీ॥గంధం అప్పారావు గారి తెలుగు తల్లి ప్రార్థన పుస్తకం పుట త్రిప్పగానే కనబడి సహృదయులకు ఆహ్లాదం కలిగిస్తుంది. పామరుడినైనా గురుభక్తి ఎన్నో మెట్లెక్కించగలదు కదా యిక పండితులకేమి! వెనువెంటనున్న సంపాదకుని పరిచయ వాక్యాలు - పత్రం సమర్పయామి - యీనాటి విశ్వ విద్యాలయంలోని తెలుగు చదువుల గుంటమిట్టలను నిర్భీతిగా, నిస్సంకోచంగా కళ్లక్కట్టిస్తుంది. వెయ్యాలి వీరతాడు! ఉన్న 109 పత్రాలలో ఒక నలభై కుండలో మెతుకు తడిమినట్లుగా చూశాను. ఇరవై అతి జాగ్రత్తగా చదివాను. దాదాపు పది వరకూ నాకు తెలియని విషయాలు ఆసక్తికరంగా విప్పగలిగాయి. అందులో యివి, పఠితలకు పరిచయదగ్గవిగా ఉన్నవి. చదువరులలో ఒక ప్రశ్న పొడసూపవచ్చు. ‘అన్నిటిలో యిన్నేనా?’ అని. దీనికి జవాబు చివర లభిస్తుంది. నా ఉద్దేశంలో ప్రథమ స్థానం తెలంగాణా పద సాహిత్యంపై మొరంగపల్లి శ్రీకాంత్ కుమార్ వ్యాసానికివ్వాలి. తొలుతనే పదమనే పదానికి నమ్రత చూపవలసిన పెద్దల నిర్వచనాలు ఉటంకించారు. ఈ సాహిత్యంలో ఉన్న వేర్వేరు పాయలు, శైలీ భేదాలు, భిన్న వస్తువులు స్పష్టపరుస్తూ ఆయా కవుల ప్రసక్తి తీసుకువచ్చారు. నలుగురికీ తెలిసిన తెలుగు వాగ్గేయకారులు యిప్పటి ఆంధ్ర తెలంగాణాలలోనే కాక తమిళ దేశానా ఉన్నారు. (త్యాగయ్య, క్షేత్రయ్య - యీ రెండవ వ్యక్తి ఉనికి మనికి గురించి మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రశ్నలతో ఏనాడో ప్రస్ఫుటపరిచారు) మాతువంటే మాట, ధాతువంటే సంగీతం, యీ రెంటినీ ఒకే మారు సృష్టించే వాడే వాగ్గేయకారుడు అని చెప్పి, తెలిసిన వారి గురించి టూకీగా ప్రస్తావించి, ప్రధాన వస్తువుకి రాచమార్గంలో వచ్చారు. తెలంగాణకు చెందిన రామదాసు (కంచెర్ల గోపన్న 1620-1680) తెలుగు దేశాన ఉన్నవారికి ఉగ్గుపాలనాటివాడు. రామదాసు కీర్తనలు వినబడని జనావాసాలుండవు. వీటిని సినిమాలు (దేవత, చరణములే నమ్మితి, గరుడగమన రారా, రెంటచింతల సత్యనారాయణ), నాటికలు, హరికథలు, ఆ తరువాత ఆకాశవాణి, దూరదర్శన్ -అన్నీ ప్రచారంలోకి తెచ్చాయి, పబ్బం గడుపుకొంటున్నాయి. ‘‘అంతకుముందే కాసె గంగాధరయ్యవి (1525-1575) గంగాధరయ్య వచనములు ఉన్నవి. ఇవి పాలమూరు జిల్లా మహ్మదాబాద్‌లో దొరికాయి. ముద్ర ‘కరుణాకటాక్ష గంగాధరయ్య’. ముష్ఠిపల్లి వేంకట భూపాలుడు (1663-1712) రాజవోలి వేంకటేశ్వర కీర్తనల రచయిత. ఇవి 3476 కీర్తనలనీ, అన్నమయ్య తరువాత అన్నిటి రచయిత యితడేననీ కపిలవాయి లింగమూర్తిగారన్నారు. అయితే యివి అముద్రితాలు.’’ ఈ వ్యాసంలో మరో యిరవై వాగ్గేయకారుల ప్రసక్తి ఉన్నది. ఒకరిద్దరు తప్ప తక్కినవారు సాధారణ పఠితకు అపరిచితులే. ‘ఆధునిక తెలుగు సాహిత్యం- చాకలివారి జీవిత ప్రస్తావన’ పి.దస్తగిరి వ్యాసంలో తెలుసుకోదగిన విషయాలెన్నో ఉన్నవి. ఒక కులం గురించి రచనలు అంటే ఆ కుల ప్రసక్తి మాత్రమే కాదు, ఆయా వృత్తుల వారికి తమ కులాల వలన ఏర్పడిన పరిస్థితులు ఏమిటి, వాటినెలా ఎదుర్కొంటున్నారు, ఎలా అధిగమిస్తున్నారు అన్న పరామర్శ ఉండాలి. అలాంటి వాటి పరిచయం వున్నదిందులో. ఒక్క వింత కబురు. మానేపల్లి రవిబాబు ‘రజకప్రభ’ కవితలో ‘కవిభాసుడు నీవాడేనని’ చాకలివారి ఘనతను చాటడం వుందట. భాసుడు చాకలా అని సంస్కృత సాహిత్యవేత్తలను ఒక నలుగురినడిగాను. మేమీ విషయమెక్కడా వినలేదని ముగ్గురు తెలిపితే ఒక్కరిలా (ముళ్లపూడి జయసీతారామ శాస్త్రి) తెలియపర్చారు. ‘‘హర్షవర్ధనుని వద్ద ధావక అని ఘోస్ట్ రైటర్ ఉన్నట్లు కథ. ధావక అన్న పదానికి చాకలి అన్న అర్థం వుంది. కానీ భాసకవికీ దీనికీ సంబంధం లేదు.’’ ఒకవేళ ఆ గేయంలో ఆ విషయం ఎక్కడినుండి సంగ్రహించారో తెల్పకపోయినా దాని గురించి వ్రాసే ఆ వ్యాసకర్త యీ విషయం ఉగ్గడించే ముందు డి.ఎన్.ఎ. పరీక్ష చేసి వుండాలి కదా! జయదేవుడు నా ముది ముది ముత్తాతకు మేనమామ అని నేనంటే చెల్లునా! దుంగావత్ నరేష్కుమార్ నాయక్ ‘గోర్బోలి భాష - వ్యాకరణం’ ఎన్నో తెలియని విషయాలు తెల్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే కొన్ని మాటలు తర్కానికి అందకుండా ఉన్నవి. పదాదిన సంయుక్తాక్షరాలు ఆర్యభాషలలో ఉంటవని చూపిన ఒక్క పదంలోనూ - ఆద్మీ, కోత్రా, టోక్డా - కనబడవు. ఇక వ్యాసమంతటా ‘శబ్ధం’ అని ఉండడం చేత యిది ముద్రారాక్షసం కాదేమో, యిది ఆ పదం సరైన రూపమని వీరి భ్రమేమో అన్న అనుమానం కలుగుతున్నది. ఈ పుస్తకమంతటా పుటకు నాలుగైదు అచ్చు తప్పులు, అసంతగమైన పదవిభజనలు ఉన్నవి. జాగ్రత్తగా చూస్తే కొందరు రచయితలకు సరియైన వాక్యనిర్మాణం తెలియదన్న విషయం రూఢి అవుతున్నది. అయితే సంపాదకులు (సహబాధ్యత: డా॥కోదండ లక్షణ) వీటినెలా వదిలారు? ఒకటే జవాబు. ‘పుస్తకం సకాలంలో అందించాలని’. ఈ సోడిపిండి అంబలి, సంకురాత్రి సంజాయిషీ గత పదేళ్లుగా, ఆదరాబాదరాగా జీతభత్యాలు పెరుగుట కోసం చదువుకొన్న వారు వేస్తున్న పుస్తకాలలో చూస్తున్నదే, వింటున్నదే. ఈ తప్పులన్నీ తొలగించి యీ పుస్తకాన్ని పునర్ముద్రిస్తే కొని, తలెత్తుకొనవలసిన సంపుటి యిది. ఇక్కడ మాడభూషి సంపత్‌కుమార్ ఆకులో కొన్ని వాక్యాలు చూడాలి. 1. పరిశోధకుల సంఖ్య బాగా పెరిగింది. దాని వలన పరిశోధనలో కొంత శ్రద్ధ తగ్గడం కూడా అనివార్యం! నిజంగా అనివార్యమా? 2. పర్యవేక్షకులలో ఓపిక తగ్గడం వలన సిద్ధాంత వ్యాసాల మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నవి. మరి పిల్లికి గంట కట్టేదెవరండి? 3. చేసిన అంశాలపైనే పరిశోధన చేస్తూ ఉండడం మరో పెద్ద సమస్య. కంప్యూటర్లందుబాటులో ఉన్న యీ రోజుల్లో, అదొక ఎక్కలేని జారుడు బండకాదు! వెలుదండ నిత్యానందరావు వీటినొక కొలిక్కితెచ్చి వేసిన పుస్తకం చేర్పులతో పునర్ముద్రణం కూడా పొందినది! సందులు వెతకడం సాకులు చెప్పడం మానితే యివన్నీ సర్దుకొంటాయి. ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ దానికి పూనుకొంటే మంచే జరుగక మానదు. పండితుల మాటేమోగాని (చదివితే, చదువుతున్నప్పుడే తప్పులేవో ఒప్పులేవో గ్రహించగలరు వారు!) భాషయందభినివేశం లేకపోయినా ఆసక్తి వున్న నాలాంటి వారికి సరస్వతీదేవి వరప్రసాదమే కాగలదు. -
‘రాయ్ దగ్గర బాంబులు చేయటం నేర్చుకుంటారా?’
రాచకొండ విశ్వనాథ శాస్త్రి నాకు మంచి మిత్రుడు. ఆయన హైదరాబాదు వచ్చినప్పుడల్లా గోరా శాస్త్రి, సి.ధర్మారావు, నేను కలిసి కబుర్లు చెప్పుకుని ఆయన జోక్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. అయితే, ఆ రోజులలో మా సంభాషణలో ఎప్పుడూ ఎం.ఎన్.రాయ్ ప్రస్తావన రాలేదు. అది తెలిసివుంటే ఆయనను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసేవాడిని. ఇటీవల ‘రావిశాస్త్రి సర్వస్వం’ తిరగేస్తుంటే, ఆయన డైరీలలో రాయ్ ప్రస్తావన వచ్చి, ఆశ్చర్యపోయాను. 1937లో రాయ్ తొలిసారి విశాఖపట్టణం వచ్చినప్పడు ఆయన్ని రాచకొండ కలిశాడు. అప్పుడు రాచకొండ ఎ.వి.ఎన్. కళాశాల విద్యార్థి. ఆయనా, ఆయన మిత్రుడు వరదరాజేశ్వరరావు కలిసిన వారిలో వున్నారు. రాయ్‌ని వాళ్ళ కాలేజీకి ఆహ్వానించి ఉపన్యసించమన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఈ విషయం తెలిసి, ‘రాయ్ దగ్గర బాంబులు చేయటం నేర్చుకుంటారా?’ అని ఎగతాళి చేశాడు. విశాఖ బీచ్ ఒడ్డున ఈ ప్రసంగాలు జరిగాయి. 1937 ఆగస్టు 27న రాయ్ ఆ సమావేశంలో మాట్లాడాడు. ఆయన గురించి తమ ప్రిన్సిపాల్ ఎలా అభిప్రాయ పడుతున్నాడో రాయ్‌కు రాచకొండ వివరించాడు. తన ఉపన్యాసంలో ప్రిన్సిపాల్‌ను రాయ్ తీవ్రంగా విమర్శించాడు. సోషలిజం భారతదేశానికి అప్పట్లో సరిపడదని రాయ్ చెప్పాడు. రాయ్ మాట్లాడుతుంటే ఆయనపై జర్మన్ భాష ప్రభావం కనిపించిందని రాచకొండ వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి ఆయన రాసిన లేఖావళిని రాచకొండ తార్కికంగా, అర్థవంతంగా వుందని అభిప్రాయపడ్డాడు. ఆ తరువాత రాయ్‌తో ఫొటోలు తీయించుకున్నాడు. ఆనాడు ఇండిపెండెంట్ ఇండియా అనే పత్రికను రాయ్ నడిపేవారు. అది క్రమం తప్పకుండా రాచకొండ చదవటం మొదలు పెట్టాడు. రాయ్ రాసిన కొన్ని పుస్తకాలు కూడా తెప్పించుకున్నాడు. రాయ్ రాసిన గాంధీయిజం నేషనలిజం సోషలిజం పుస్తకాన్ని చదివి ఆకర్షితుడయ్యాడు. తనకున్న కొన్ని సందేహాలు ఆ పుస్తకం తీర్చిందని చెప్పాడు. ఇవన్నీ కూడా రాచకొండ 1937 నుండి 1941 వరకు డైరీలలో రాసుకున్నాడు. రాచకొండ రచనలపై ఆయన ప్రభావం ఏ మేరకు వున్నదో ఈ విషయాల దృష్ట్యా పరిశీలించవలసి వున్నది. (మార్చి 21న ఎం.ఎన్.రాయ్ జయంతి) - నరిశెట్టి ఇన్నయ్య innaiah@gmail.com -
ఒక కళాకారుడి జీవన లాలస
బ్లాగు కాచిన వెన్నెల విన్సెంట్ వ్యాన్గో, జీవితాన్ని ఊపిరాడనంత మోహంతో కౌగిలించుకున్న ఒక వెర్రి డచ్చివాడు. రంగులే శ్వాసగా బతికినవాడు. కళ్లు చెదిరే మాస్టర్ పీస్‌లతో జనం కంటికి కొత్త రంగుల భాషను నేర్పిన గ్రేట్ మాస్టర్. అంతేనా! తమ్ముడికి రాసిన వందలాది లేఖల్లో తన అంతర్ బహిర్ రణఘోషను ఉద్వేగభరితంగా బొమ్మకట్టిన అపురూప లేఖాసాహిత్యకారుడు కూడా. కళతోపాటు జీవితంలోనూ అలుపెరగకుండా పోరాడిన ఆ కళాయోధుడి జీవితాన్ని వర్ణకావ్యంలా పరిచయం చేస్తుంది ‘లస్ట్ ఫర్ లైఫ్’ నవల. రచయిత, జీవితచరిత్రా నవలల్లో కాకలు తీరిన ఇర్వింగ్ స్టోన్. ఎనభయ్యేళ్ల కిందట వెలువడిన ఈ తీరని జీవన లాలస నేటికీ వన్నె తగ్గని పెయింటింగులా పాఠకులనూ, కళాప్రియులనూ ఆకర్షించి వ్యాన్గో రసోన్మాద జగత్తులోకి లాక్కెళ్తోంది. బొమ్మలు వేయడం తప్ప తన బతుక్కి మరో అర్థం లేదని చాటిన వ్యాన్గో నడిచిన పూలబాటల్లో, ముళ్లబాటల్లో స్టోన్ మనల్ని వేలుపట్టుకు నడిపిస్తాడు. ఆ వర్ణకారుడి ఫలించని తొలిప్రేమ, బెల్జియం బొగ్గుగనుల్లో మతబోధన, చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయే రంగులతో అనుదిన పోరాటం, ఆత్మను అరగదీసే సంశయాలు, సాటి మనిషి కష్టానికి చెరువయ్యే గుండె, పతితజనంతో సహవాసం, సంఘ బహిష్కారం... అన్నింటిని జీవం తొణకిసలాడే చిత్రాల్లో పరిచయం చేస్తూ వెళ్తాడు. పోరాటంలో మనోదేహాలు ఛిద్రం చేసుకుని, తను చేయాల్సింది చేశానన్న తృప్తితో హాయిగా నవ్వుతూ ముప్ఫై ఏడేళ్లకే ప్రాణాన్ని తూటాకి అర్పించుకున్న ఆ అమర కళావేత్త బలిదానాన్నీ కళ్లముందు పరచి గుండెను తడిచేస్తాడు. ఈ నవలను పదమూడేళ్ల కిందట తొలిసారి చదివినప్పుడు కదలిపోయాను. అప్పట్నుంచి వ్యాన్గో కళాజీవితాలను మరింత తెలుసుకోవాలనే ఆరాటం ఆరని జ్వాలలా ఎగసిపడుతూనే ఉంది. దాని వెలుగును ఇంకొందరికి పంచుదామని అనువాదం మొదలుపెట్టాను. కళాసాహితి http://kalasahiti.blogspot.in బ్లాగులో దీన్ని అందిస్తున్నాను. ఒక చిన్న భాగం ఇది... అనుకోకుండా అలా... వేసవి వెళ్లిపోయి శిశిరం మొదలైంది. ఉన్న కాసింత పచ్చదనమూ కనుమరుగైంది. అయితే విన్సెంట్‌లో ఏదో నూతన జీవశక్తి పురులు విప్పింది. తన జీవితాన్నే దీటుగా ఎదుర్కోలేని అతడు ఇప్పుడు ఇతరుల జీవితాలపైకి మళ్లాడు. తిరిగి పుస్తకాలు పట్టుకున్నాడు. పఠనం అతనికి ఎప్పుడూ ఇష్టమైన వ్యాపకమే. ఇతరుల జయాపజయాలు, సుఖదుఃఖాల గాథల్లో అతడు తనను వెంటాడుతున్న తన జీవిత వైఫల్యపు రక్కసి బారినుంచి రక్షణ పొందుతున్నాడు. వాతావరణం బాగున్నప్పుడు మైదానంలోకి వెళ్లి పగలంతా అక్కడే చదువుకుంటున్నాడు. వానపడితే గదిలోని చూర్లకిందున్న తన మంచంలో పడుకునో, లేకపోతే డెనిస్‌ల వెచ్చని వంటగది గోడపక్కన కుర్చీలో కూర్చునో గంటలకొద్దీ చదువుకుంటున్నాడు. గోరంత విజయాన్ని, కొండంత అపజయాన్ని మూటగట్టుకునే తనలాంటి అతి సామాన్య మానవుల జీవితగాథలతో మమేకమైపోతున్నాడు. వాళ్లు చూపిన బాటలో తన జీవితాన్ని సరైన రీతిలో దర్శించుకోగలుగుతున్నాడు. నెమ్మదిగా అతని మనసులో ఒక నవ్యభావన సుళ్లు తిరగసాగింది. ‘‘నేను పరాజితుణ్ని, పరాజితుణ్ని’’ అనే కుంగుబాటు స్థానంలో, ‘‘ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకేది తగింది? ఈ ప్రపంచంలో నాకు సరైన స్థానమేది?’’ అనే ఆరాటం మొదలైంది. తను చదివే ప్రతి పుస్తకంలోనూ తన జీవిత గమనాన్ని నిర్దేశించే దిక్సూచి కోసం తపనతో అన్వేషిస్తున్నాడు. తను ఎందుకూ పనికిరాడని తిడుతూ ఇంటి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. సోమరిగా తిరుగుతూ, సభ్యతాసంస్కారాలను, సంఘపు కట్టబాట్లను అతిక్రమిస్తున్నావంటూ తండ్రి నిందిస్తున్నాడు. మళ్లీ నీ కాళ్లపై నువ్వు నిలబడి, సమాజానికి నీ వంతు ఉపకారం ఎప్పుడు చేస్తానని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం విన్సెంట్ కూడా ఎదురుచూస్తున్నాడు. దొరికితే అతనికీ సంతోషమే. చివరికి, అతనికి పుస్తక పఠనంతోనూ విసుగెత్తింది. పరాజయం తర్వాత కొన్నాళ్లు అతడు దేన్నీ స్వీకరించనంతటి ఉద్వేగరాహిత్యంలోకి జారిపోయాడు. తర్వాత మనశ్శాంతి కోసం పుస్తకాలు చదివాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. కానీ కొన్ని నెలలుగా అణచిపెట్టుకున్న తీవ్రవేదన ఇప్పుడు కట్టలు తెంచుకుని అతణ్ని దుఃఖంలో ముంచెత్తింది. పుస్తకాలతో సాధించిన మనోస్థిమితం ఆ ప్రవాహానికి ఏ మాత్రం అడ్డుకట్ట వెయ్యలేకపోయింది. అతడు జీవిత పతనావస్థకు చేరాడు. ఆ సంగతి అతనికి బాగా ఎరుకే. అయితే తనలో ఎంతో కొంత మంచి ఉందనీ, తను మరీ అంత మూర్ఖుణ్నీ, వ్యర్థజీవిని కాననీ, లోకానికి తను పిసరంతైనా మేలు చేయగలననీ అతడు అనుకుంటున్నాడు. మరి ఆ మేలేమిటి? తను వ్యాపారానికి పనికిరాడు. తనకు ఏది సరిపోతుందో దాంట్లో తప్ప మిగిలిన అన్ని వ్యవహారాల్లో ప్రయత్నించి ఓడిపోయాడు. కానీ తనెప్పుడూ ఇలా పరాజయానికి, వేదనకు గురికావాల్సినంత శాపగ్రస్తుడా? తన జీవితం పరిసమాప్తమైపోయిందా? అన్నీ ప్రశ్నలే. సమాధానాల్లేవు. రోజులు దొర్లిపోతున్నాయి. శీతాకాలం ప్రవేశించింది. తండ్రి విసుగెత్తిపోయి డబ్బు పంపడం మానేశాడు. విస్సెంట్ డెనిస్‌ల ఇంట్లో భోజనం మానుకుని పిడికెడు బ్రెడ్డుతో కడుపు నింపుకుంటున్నాడు. తమ్ముడు థియో బాధపడిపోయి కాస్త డబ్బు పంపుతున్నాడు. అతనికీ సహనం నశిస్తే తండ్రి తన బాధ్యత గుర్తెరిగి మళ్లీ కాస్త డబ్బు పంపుతున్నాడు. రివాజుగా మారిన ఆ ఇద్దరి సాయంతో విన్సెంట్ అరకడుపుతో రోజులు నెట్టుకొస్తున్నాడు. నవంబర్‌లో వాతావరణం తేటగా ఉన్న ఓ రోజున విన్సెంట్ మార్కాస్ బొగ్గు గనుల వద్దకు వెళ్లాడు. మనసులో ఏ ఆలోచనలూ లేవు. గోడపక్కనున్న ఓ తుప్పు పట్టిన ఇనుప చక్రమ్మీద కూర్చున్నాడు. గేట్లోంచి ఓ ముసలి కార్మికుడు బయటికొచ్చాడు. తలపైని నల్లటోపి కళ్లను కప్పేస్తోంది. భుజాలు కుంగిపోయాయి. చేతులు జేబుల్లో పెట్టుకున్నాడు. మోకాళ్ల చిప్పలు బయటికి పొడుచుకొచ్చాయి. అతని రూపంలో ఏదో మాటలకందనిది విన్సెంట్‌ను అమితంగా ఆకర్షించింది. తనకు తెలియకుండానే అలవోకగా జేబులోంచి పెన్సిల్ ముక్కను, ఇంటినుంచి వచ్చిన ఉత్తరాన్ని బయటికి తీశాడు. బొగ్గునుసితో నలుపెక్కిన మైదానంలోంచి వెళ్తున్న ఆ శల్యావశిష్టుని రూపాన్ని కవరు వెనకవైపు వేగంగా గీశాడు. తర్వాత ఆ కవర్లోని తండ్రి ఉత్తరాన్ని తీసి చదివాడు. ఒకే ఒక ముక్క రాసి ఉంది. కాసేపయ్యాక గేటుగుండా మరో కార్మికుడు బయటికొచ్చాడు. పదిహేడేళ్ల కుర్రాడు. పొడవుగా, నిటారుగా ఉన్నాడు. నడుస్తోంటే భుజాలు చూడముచ్చటగా కదులుతున్నాయి. ఎత్తయిన రాతిగోడపక్క నుంచి రైలుపట్టాలవైపు కదలిపోతున్నాడు. విన్సెంట్ అతడు కనుమరుగయ్యేంతవరకు చూసి అతని బొమ్మ గీశాడు. - పి.మోహన్ -
ఎందుకా కవిత్వం ఏడవనా?
పుస్తకం లోంచి... మహాకవులు ఎవరయినా తీసుకోండి ఎవరయితే ప్రజల్ని ప్రభావితుల్ని చేశారో నాగరికతల్ని సంస్కృతుల్ని సృష్టించారో అలాంటి కవులు అందరూ వాళ్ళ కవిత్వాన్ని వర్తమాన భాషలోనే రాశారు. వాళ్ళు కవిత్వం కవిత్వం కోసం రాయలేదు, స్వకీర్తి కోసం రాయలేదు, మనుషుల్ని మార్చాలని రాశారు. అది ఒక మహత్తరమైన ద్రష్టృత్వం.కనకనే వాళ్ళ మాటకు మనిషిని మార్చే శక్తి వచ్చింది. ఆ శక్తి ఉన్న మాటే కవిత్వం అనిపించుకుంది అనిపించుకుంటుంది. లేకపోతే ఎందుకా కవిత్వం ఏడవనా? తుపాకి చూపించి ఈ పని చెయ్ అన్న ధర్మశాస్త్రం మనిషిచేత బలాత్కారంగా పని చేయిస్తుంది. కానీ శక్తివంతమైన మాట మనిషిలో ఉన్న నిజపదార్థాన్నే మార్చి వేస్తుంది, తద్వారా ఒక ఐచ్ఛిక ఆంతరిక పరిణామాన్ని తెస్తుంది. తుపాకిశక్తికీ మాటశక్తికీ ఉన్న తేడాయిది. మనుపు ఆపస్తంబుడు చూపించిన తుపాకులు ఈనాడు లేవు మనిషి వాటి బెదురుతో నడవడానికి, కానీ వాల్మీకి మాట ఈనాటికీ ఉంది. మనిషిని నడుపుతూనే ఉంది. అరే పిచ్చోడా! తుపాకి ఎవడైనా పట్టుకుంటాడు; కలం ఎవడైనా పట్టుకునేది కాదు. ఈ రోజు భారతదేశంలో మనుషులు ఒక సామాజిక జీవనం చేస్తున్నారంటే అరణ్యక జంతుజీవనం చెయ్యడం లేదంటే ఈ దేశానికి అది రామాయణ మహాభారతాలు పెట్టిన భిక్షే. అన్య ఆధునిక విలువల చేత రామాయణం ప్రతిపాదించిన కొన్ని విలువల తీరాలు నేడు కోసుకుపోతుంటే పోవచ్చుగాక కాల ప్రవాహ వేగంచేత, దాన్ని ప్రతిఘటించవలసిన అవసరం లేదు. ఏ యుగపు ప్రజలు ఆ యుగం కోసం వాళ్ళ విలువల్నీ వాళ్ళ ప్రపంచాన్నీ వాళ్ళు నూతనంగా సృష్టించుకుంటారు. అది కాలధర్మం. ‘‘ప్రాప్తకాల ముపాస్యతాం’’ అన్నాడు వాల్మీకే- కాని ప్రస్తుత విషయమేమిటంటే ఆ మహాకవులు కొన్ని విలువల్ని ప్రతిపాదించి ఆ విశాల వలలో ప్రజానీకాన్ని పట్టి ఉంచారు గనక గానీ, లేకపోతే ఈ ప్రజలు ఏ క్షణంలోనో మళ్ళీ జాంతవ స్థితికి జారిపడేవారే. - గుంటూరు శేషేంద్ర శర్మ (‘కవిసేన మేనిఫెస్టో’ నుంచి...) -
కథ రాయడం చాలా కష్టం
అభిప్రాయం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, గుండెను తడి చేసే కథలు రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ గురించి, కథ రాయడంలోని కష్టం గురించి ‘సాక్షి’తో సంభాషించారు.. కథ రాయాలంటే... కేవలం ఇతరుల రచనలు చదవడమే కాకుండా, లోకజ్ఞానం కోసం అనేక ప్రాంతాలు సందర్శించినప్పుడే మంచి కథలు వస్తాయి. తలుపులు మూసుకు కూర్చుంటే ఉత్తమ కథలు రావు. అనేక జీవితాలను పరిశీలించాలి. ఒక వింతైన మాట, వింతైన దృశ్యం కథ అవుతుంది. అయితే దాన్ని పట్టించుకోవాలి. అది మనసులో బీజంలా నాటుకోవాలి. అప్పుడు అది మనకు తెలియకుండానే మనలో పెరిగిపెరిగి మాను అవుతుంది. అప్రయత్నంగా కథరూపంలా బయటకు వస్తుంది. అయితే, కథ రాసేవారికి బయటి నుంచీ ఏవీ సహకరించవు. రచయిత చూసినవి, రచయిత స్వానుభవం మాత్రమే కథలో ఉంటాయి. కథ రాయడానికి మనిషి మానసికంగా బాధ పడాలి, అనుభూతి చెందాలి. ఉత్తమకథ అంగవైకల్యం లేని శిశువులా బయటకు వస్తుంది. చిన్న కథ పుట్టుక... ‘చిన్న కథ’ గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలలో పుట్టి పెరిగింది. అయితే, ఇప్పుడు కోస్తా జిల్లాల నుంచి కథలు రావట్లేదు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి మంచి కథలు వస్తున్నాయి. అక్కడ మనిషికి భూమితో ఇంకా సంబంధం తెగిపోలేదు. భూమి పండితే సంతోషం, ఎండితే దుఃఖం. వారి కథలలో భూమి, మనిషి కథాంశాలు. వీరు కూడా రచించారు... ప్రక్రియలన్నిటిలో కూడా కథానిక ప్రత్యేకమైనది. ఇది పాశ్చాత్య ప్రక్రియ. పాఠకులకు ఒక జీవిత శకలాన్ని చూపించే సాధనం కథ. ఉత్తమ కథానికలో ఒక్క అక్షరం కూడా వృథాపోదు. కథలో సాధారణ మానవుడి జీవితాన్ని సాధారణమైన పద్ధతిలో ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు. కృష్ణశాస్త్రి, విశ్వనాథ, వేలూరి వంటి పద్యకావ్య రచయితలు సైతం కథానికలు రాశారు. వారు కథను ప్రేమించారు. వాటి గొప్పదనాన్ని గుర్తించారు. ‘ముసురు’ కథ... ఒక శవం పక్కన ఒక తమిళ అమ్మాయి కూర్చున్న దృశ్యం నన్ను ఆకర్షించింది. ఏం జరిగిందని పక్కన వాళ్లను అడిగితే, వారిద్దరూ ప్రేమికులనీ, లేచిపోయి వచ్చారనీ, చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగిస్తున్నారనీ, అతడు చనిపోయాడనీ, ఆ అమ్మాయికి మన భాష రాదనీ చెప్పారు. ఆ దృశ్యం చూశాక అంతర్మథన పడ్డాను. అందులో నుంచి వ చ్చిన కథే ‘ముసురు’. ‘ఇంగువ’ గురించి... నా బాల్యమిత్రుడు ‘ఇంగువ అంటే ఏంటి?’ అని అడిగాడు. ఆ తరవాత కొన్నాళ్లకి చనిపోయాడు. ఇంతకీ అతడు ఈ విషయం తెలుసుకుని పోయాడా, తెలుసుకోకుండా పోయాడా అనుకున్నాను. జీవితంలో తెలుసుకునేవి తక్కువ, తెలియని విషయాలు ఎక్కువ. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘ఇంగువ’ కథ. ఇలా ఎన్నో కథలు నేను ఎన్నో జీవితాలను పరిశీలించి రాసినవే. పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో రైలు తుడవ డానికి ఎక్కే నలుగురు కుర్రాళ్ల జీవితాల మీద నాలుగు కథలు రాశాను. వారిలోనూ అద్భుతమైన జీవితం ఉంటుంది. వాళ్లకి ఆ స్టేషనే జన్మస్థలం, పడక, పక్క అన్నీ! వాళ్లు అక్కడ నుంచి బయటకు వెళ్లలేకపోతారు. వెళ్లాలంటే భయం. విమర్శలు... చాలామంది నా కథలు ఏడుపు కథలన్నారు. కరుణ అనేది సున్నితమైన సూత్రం. అది తెగితే జుగుప్స. నేను అచ్చంగా చూసిన జీవితాన్ని చూసినట్టు రాశాను. అలాగే, మనిషిలో అసంతృప్తి అనే లక్షణం ఉంటుంది. ఆ అసంతృప్తే నా కథలకు ప్రధాన వస్తువు. సరిగ్గా పరిశీలించి అర్థం చేసుకునేవారికి, మన చుట్టూ ఉన్నవన్నీ కథా వస్తువులే. అయితే, కథలు చదవడానికి కూడా ఒక కల్చర్ ఉండాలి. ఇంకించుకునేవారు ఉత్తమ పాఠకులు. - డా. పురాణపండ వైజయంతి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి -
పి.రామకృష్ణ రచనా సర్వస్వం
పుస్తక సమీక్ష పి.రామకృష్ణ సమగ్ర సాహిత్య సంపుటి ఇది. ఇందులో మూడు నవలలూ, ముప్పయి ఐదు కథలూ, వ్యాసాలూ, పుస్తక సమీక్షలూ, కాలమ్స్ రాతలూ, కవితలతో పాటు, ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టిన ‘పెన్నేటి కత’లూ ఉన్నాయి. ఆయన యాభై ఏళ్ల సాహిత్య కృషినంతా ఈ సమగ్ర సంపుటి ద్వారా పాఠకుడికి అందించే ప్రయత్నం ఇది! పెన్నానది ఒడ్డున ఉన్న ఒకప్పటి పల్లె జీవితాన్ని గురించి, నిసర్గమైన ఆ ప్రాంతపు మాండలీకంలో, సహజమైన వాస్తవికమైన పాత్రలతో, నిర్దిష్ట స్థలకాలాల స్పృహతో చిత్రిక పట్టిన ‘పెన్నేటి కతలు’ ఇప్పుడు కూడా చదివి, ఆనందించటమే గాదు, గుండెల్లో నింపుకోవచ్చు! ఈ కతలే గాక, ఆయన రాసిన మరో 35 కథల్లో కూడా, ప్రాంతీయ ముద్ర, ప్రాదేశిక చిత్రణ కలిగిన ‘నీళ్లు’, ‘తేడా’, ‘కర్రోడు చచ్చిపోయినాడు’, ‘ఎలిగే పెద్దోళ్లు నలిగే సిన్నోళ్లు’ ‘మనిషీ - పశువూ’, ‘కరువు పీల్చిన మనుషులు’ ‘బండ కోడెలూ- బక్కెద్దులూ’ లాంటివి రాయలసీమ ప్రాంతపు జీవితాన్ని రికార్డు చేసిన సాంఘిక చరిత్రల్లాంటివే! ఆయన తొలి రోజుల్లో ‘తులసీకృష్ణ’ కలం పేరుతో రాసిన ‘రుతుపవనాలు’ మాత్రం పేలవమైన నవల! పేరుకు రుతుపవనాలే అయినా, అందులో రుతువులూ లేవూ, పవనాలూ లేవూ. ఆయన ఈ నవల రాసిన కాలంలో వచ్చిన చచ్చు ప్రేమ నవలల బలహీనతలన్నీ ఈ నవలలో కనిపిస్తాయి. ఏడు జంటల ప్రేమలు ఉన్నాయి మరి! ఆయన ‘లోకవృత్త పరిశీలన’కు నిదర్శనం లాంటి మంచి నవల ‘నత్తగుల్లలు’! సగటు మధ్యతరగతి జీవన విలాసాల్నీ, గమనాల్నీ, మిధ్యా విలువల్నీ నిర్మమకారంగా నిర్దాక్షిణ్యంగా విమర్శకు పెట్టిన ఈ నవలకు సాహిత్య చరిత్రలో సముచిత స్థానం ఎప్పటికీ ఉంటుంది. ‘‘ప్రపంచం పది కిలోమీటర్ల దూరం ముందుకు నడిస్తే, నత్తగుల్ల నాలుగడుగులు వెయ్యడానికి భయపడుతుంది’’ అని మధ్యతరగతిని పరిహసించిన నవల ఇది! ‘ఉదయమూ- సాయంకాలమూ’ వృద్ధాప్య సమస్యను కొత్తకోణంలో చూపెట్టాలని రాసిన నవల. ‘‘సుదీర్ఘ జీవితం ముందున్నవారి కన్నా కొద్దిపాటి జీవితం మిగిలివున్న వాళ్లకు జీవితం ఇంకా వాంఛనీయంగా ఉండాలి’’ అని చెప్పిన నవల! వృద్ధాప్యం ఒక సామాజిక సమస్యగా మారిన వర్తమానంలో ఈ నవల చాలా అంశాల్ని, సామాజిక ఆర్థిక కోణాలలో చర్చకు పెట్టింది. ఇందులో అంగీకరించే అంశాలే గాక, విభేదించే అంశాలు కూడా లేకపోలేదు. కథా నవలా రచయితే కాదు, రామకృష్ణ మంచి సాహిత్య విమర్శకుడు కూడా అనటానికి ఈ సంపుటిలోని సమీక్షలూ, వ్యాసాలూ సాక్ష్యమిస్తాయి. నిర్మొహమాటమూ, నిర్భీకతా, నిజాయితీ గల వీరి సాహిత్య వ్యాసాలూ, పుస్తక సమీక్షలూ ఇప్పటి విమర్శకులు జాగ్రత్తగా పరిశీలించదగ్గవి. చలం, రావిశాస్త్రి, చాసో, కేశవరెడ్డి, గోపీచంద్, రా.రా. లాంటి ప్రముఖుల గురించి రాసిన సాహిత్య వ్యాసాలూ, భాషా వ్యాసాలూ కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. కథ గురించి రామకృష్ణ ఇంటర్వ్యూ చాలా చర్చలు చేసింది. కథకులు గమనించాల్సిన అంశాలెన్నో ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి. - సింగమనేని నారాయణ -
అస్తిత్వవాద కథంటే?
ఇది అస్తిత్వవాద యుగం. ఆదివాసులు, దళితులు, వెనుకబడిన కులాలు, మత అల్పసంఖ్యాకవర్గాలు, స్త్రీలు, కార్మికులు మాత్రమేగాక, భాషా, ప్రాంత, వర్ణ తదితర కారణాల వల్ల అణచివేతకు గురవుతున్న అసంఖ్యాక శ్రేణులు తమ విముక్తికోసం ఆరాటపడుతున్నాయి. తమతమ స్థాయుల్లో తమదైన శైలుల్లో పోరాడుతున్నాయి. సాహిత్యం చాలా పనులు చేస్తుంది కానీ, వాటన్నింటిలో మహత్తరమైనది అది అణగారిన శ్రేణులకు అండగా నిలబడడమే. కష్టాల్లో ఉన్నవాళ్ల పక్షాన నిలబడాలనుకునే కవులు, రచయితలకు తెలుగునాట కొదవలేదు. తెలుగు సాహిత్యా నికి ఇది చాలా గొప్ప పార్శ్వం. అయితే, ఆశయం వేరు. గమనం వేరు. గమ్యం వేరు. చాలామంది రచయితలకు అస్తిత్వ శ్రేణుల మీద అపార అభిమానమున్నా వాళ్ల కథలు చాలా సందర్భాల్లో ప్రకటిత లక్ష్యాలను సాధించడంలేదు. దానికి కారణం ఏమంటే చాలామంది రచయితలు రచన నిర్మితిని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. రచనకు మౌలికంగా సందర్భం, సంఘర్షణ, పరిష్కారం (Setup, the Confrontation and the Resolution) అనే మూడు అంకాలు (three-act structure) వుంటాయనేది అందరికీ తెలిసిన అంశమే. అస్తిత్వవాద రచయితలు ఈ సంఘర్షణ అంకాన్ని మరింత లోతుగా అభ్యాసం చేయాల్సిన అవసరం వుంది. ఒక అమ్మాయికి కష్టం వస్తే అది ఒక అమ్మాయి కథ అవుతుందిగానీ స్త్రీవాద కథో, పురుషాధిక్య కథో అవ్వదు. ఘర్షణ చట్రంలో ఆ అమ్మాయితోపాటూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక పురుషుడు ఉండాలి. ఆమె మీద పురుషాధిక్య అణచివేత కొనసాగిందనే నిరూపణ అయినప్పుడే అది స్త్రీవాద కథ అవుతుంది. ఆమె సాగించే పోరాటం విస్తృతమయితే మొత్తం స్త్రీజాతి విముక్తి చెందుతుందనే నమ్మకాన్ని పాఠకులకు కలిగిస్తే ఆ కథకు సార్వజనీనత కూడా సమకూరుతుంది. ఇదే సూత్రం ముస్లింవాద, దళితవాద, తెలంగాణవాద తదితర రచయితలకూ వర్తిస్తుంది. కథలో పాత్రలన్నీ దళితులయినంత మాత్రాన అది దళిత కథ కానట్టే, కథలో పాత్రలన్నీ ముస్లింలు అయినంతమాత్రాన ఆ కథ ముస్లింవాద కథ కాదు. ఛార్లెస్ డికెన్స్ రచనల్లోని పాత్రలన్నీ దాదాపుగా క్రైస్తవులే. అంతమాత్రాన వాటిని క్రైస్తవవాద రచనలు అనలేం. సిరిసిల్లలో ఒక సాలె అతను పేదరికంతో చనిపోతే అది తెలంగాణ కథ అవుతుంది కానీ తెలంగాణవాద కథ కాదు. ఎందుకంటే సిరిసిల్లలో సాలెవాళ్ళు పేదరికంతో చనిపోతున్నట్టే, ఆంధ్రాలో భట్టిప్రోలు, జాండ్రపేటల్లోనూ సాలెవాళ్ళు పేదరికంతో చనిపోతుంటారు. సిరిసిల్ల కథను తెలంగాణవాద కథగా మార్చాలంటే ఆ సాలెవాని చావుకు ఆంధ్రా ప్రాంతీయుల పాలన కారణమనే ఉపపత్తిని నిరూపించాల్సి ఉంటుంది. ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నప్పుడు ఇలాంటి రచనలన్నీ ఉద్యమ సాహిత్యంగా చలామణి అయిపోతుంటాయి. వీటిల్లో తప్పును ఎత్తిచూపడానికి కూడా సాహిత్య విమర్శకులు సాహసించరు. ఘర్షణ చట్రంలోనికి పరస్పర విరుద్ధ శక్తుల్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రవేశపెట్టినప్పుడే అది అస్తిత్వవాద రచన అవుతుంది. జ్ఞానం అనేది ఆధిపత్య కులాల సొంత ఆస్తి కాదని చెప్పడానికి ‘జాగీరు’ కథలో పసునూరి రవీందర్ దళిత యువకుడ్ని ఏకంగా ఆధిపత్య కులస్తుడి ఇంట్లో ప్రవేశపెడతాడు. స.వెం. రమేశ్ కథ ‘పాంచాలమ్మ పాట’లో సునందత్త పాత్ర తనను మొగుడు చీట్లపేకాటలో ఫణంగా పెట్టి ఓడిపోయాడనీ, వాడికి మొగుడుతనం పోయిందనీ, తను ముండమోసాననీ తనే ఊర్లో డప్పుకొట్టి మరీ చాటి చెపుతుంది. ఇలాంటి ముఖాముఖి ఘర్షణ అస్తిత్వవాద రచనలకు వన్నె తెస్తుంది. పీవీ సునీల్ కుమార్ కథ ‘థూ’, వేంపల్లె షరీఫ్ ‘తలుగు’ కథల్లో మనం ఇలాంటి ఘర్షణను చూస్తాం. ఘర్షణ చట్రంలోనికి పరస్పర విరుద్ధ శక్తుల్ని ప్రవేశపెట్టాలనే సూత్రం తెలిసిన రచయితలు సమర్థమైన అస్తిత్వవాద రచనలు చేస్తారు. ఆ సూత్రం తెలియనివాళ్ళు గాల్లో కలాలను ఝుళిపిస్తారు. అంతే తేడా. రచయితలకు లక్ష్యం వుంటే సరిపోదు లక్ష్యాన్ని సాధించే మెళకువలూ తెలియాలి. అస్తిత్వవాద రచయితలు ఉద్యమ నాయకుల్లా ఆలోచించాలి; ఉద్యమ అనుచరుల్లా కాదు. - ఉషా ఎస్ డానీ రచయిత, విమర్శకుడు (‘ప్రాతినిధ్య కథ-2014’ ఆవిష్కరణ ప్రసంగంలో ఒక భాగం) -
ప్రతి సాధకుడూ అర్జునుడే!
ఎందుకు రాశానంటే! ఇదొక చిత్రమైన సైన్సు, ఆధ్యాత్మికత కలయిక. ఏస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసిన డాక్టర్ ముంజులూరి నరసింహారావు పరమహంస యోగానంద శిష్యులు. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కళాశాలలో పనిచేసి 2001లో రీడర్‌గా రిటైర్ అయ్యారు. ఆయన ఇటీవలే రెండు సంపుటాలుగా శ్రీమద్భగవద్గీతకు (మొదటి సంపుటం; 1-6 అధ్యాయాలు; రెండో సంపుటం; 7-18 అధ్యాయాలు) బృహత్ వ్యాఖ్యానాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా ఆయనతో చిరు సంభాషణ: - భగవద్గీతకు సంబంధించిన వ్యాఖ్యానాలు ఏదోరకంగా ఎన్నో ఉనికిలో ఉన్నప్పుడు, మళ్లీ మీరు వ్యాఖ్యానానికి ఎందుకు పూనుకున్నారు? ఇది ‘రోజూ తింటూన్న అన్నాన్నే మరోసారి తినమన్నట్టు’గా ఉంటుందిగదా అనుకోవడం సహజమే. అయితే ఈ వ్యాఖ్యానం శ్రీకృష్ణుడికీ అర్జునుడికీ మధ్య జరిగిన సంవాదంగా కాకుండా, ప్రతి మనిషి గుండెల్లోనూ కొలువై ఉన్న భగవంతుడికీ పుట్టినదగ్గరి నుంచీ వెంటాడుతూన్న పుట్టెడు దుఃఖాల్ని పోగొట్టుకొందామని ప్రయత్నిస్తూన్న సాధకునికీ మధ్య ప్రతి క్షణమూ జరుగుతూన్న సంవాదంగా చెబుతుంది. - అంటే ప్రతి సాధకుడూ అర్జునుడే... అవును, ప్రతిసాధకుడూ అర్జునుడే. ఇంట్లో భార్యాభర్తల కీచులాటలూ, అన్నదమ్ముళ్ల కుమ్ములాటలూ, డబ్బుకోసం అందరిమధ్యా వచ్చే మనస్పర్థలూ, భాగస్వామ్య వర్తకాల్లో పుట్టే కొట్లాటలూ, దేశాల మధ్య వచ్చే సరిహద్దు తగాదాలూ, యుద్ధాలూ చూసి, వేసారిపోయి ‘ఇంతేనా జీవితమంటే’ అనే మీమాంసకు వస్తాడు ప్రతిమనిషీను. ఈ వరస ప్రశ్నలతో పుట్టే జిజ్ఞాసతో ప్రతిమనిషీ, బయట దానికి జవాబు దొరకక, లోపలికి ఆలోచనను మళ్లిస్తాడు. బయట నుంచి దృష్టిని లోపలికి తిప్పడమే పెద్ద ముందడుగు. అప్పుడు లోపలున్న స్వచ్ఛమైన ‘నేను’ (అంటే ఆత్మ లేక భగవంతుడు) మౌనంగానే మాట్లాడుతుంది. ఆ మాటలను ప్రతివాడూ వింటాడు గానీ వినిపించుకోడు; చెవిని మలుపుకొనో నులుముకొనో పరధ్యానాన్ని నటిస్తాడు. ఈ వ్యాఖ్యానం ఆ పరధ్యానాన్ని మాని, సూటిగా ఆ లోపలి నుంచి వచ్చే మాటలను శ్రద్ధగా వినమని చెబుతుంది. - మిగతా వ్యాఖ్యానాలకూ మీ వ్యాఖ్యానానికీ ఉన్న ప్రధాన తేడా? ప్రతి అధ్యాయమూ ఒక్కొక్క యోగమే అయినా యోగశాస్త్రంగా భగవద్గీతకు తెలుగులో ఒక్క వ్యాఖ్యానమూ లేదు. యోగమంటే పరమాత్మతో శరీరాల్లో మగ్గుతూ ఉన్న ఆత్మను కలుపుకోడమూ దానికోసం అనుసరించవలసిన ఉపాయమూను. అంతేతప్ప వట్టి ఆసనాలూ ముద్రలూ మాత్రమే కాదు. శ్రీ పరమహంస యోగానందగారిని అనుసరిస్తూ, పతంజలి మహర్షి చెప్పిన యోగసూత్రాలతో భగవద్గీతా శ్లోకాలను పోల్చుకొంటూ, ఇతరమైన ఉపనిషత్తులతోనూ వేదమంత్రాలతోనూ తులనను చూపిస్తూ నా వ్యాఖ్యానం సాగింది. - ఈ పుస్తకం ద్వారా పాఠకుడికి అందగల పరమార్థం ఏమిటనుకుంటున్నారు? ‘నీలోనే దుర్యోధనుడు ఉన్నాడు, ధర్మరాజూ ఉన్నాడు, శ్రీకృష్ణుడూ ఉన్నాడు. వాళ్లందర్నీ ఏవో కథలోని పాత్రలుగా సరిపెట్టుకొని అసలు విషయాన్ని దాటెయ్యకు. అవతలి పోరాటాల కన్నా నీలోనే మంచికీ చెడుకీ మధ్య జరుగుతూన్న జగడాలే ముఖ్యమైనవి.వాటిల్లో గెలవడానికి ప్రయత్నిస్తే, బయటి పోట్లాటలూ వాటికవే సద్దుమణుగుతాయి. అన్నిరకాల పోరాటాలూ మనస్సు తాలూకు ఆవేశాల వల్ల పుట్టుకొచ్చినవే. ఆ ఆవేశాలను జయించడానికి, ప్రాణాన్ని అదుపులో పెట్టుకో. మనస్సూ ప్రాణమూ ఒకదాన్నొకటి విడిచి ఉండలేవు. ప్రాణాన్ని అదుపులో పెట్టుకోవడమే తడవు, మనస్సూ అదుపులోకి వస్తుంది. మనస్సు అణిగిపోగానే అహంకారమూ అణిగిపోతుంది’. ఇలా గ్రంథం పొడుగునా ప్రమాణ వాక్యాలను సూచిస్తూ అక్కడక్కడ చిన్ని చిన్ని కథల ద్వారా విషయాన్ని ఆకళింపుకు తేవడానికి ప్రయత్నం చేశాను. జిజ్ఞాసువులకూ సాధకులకూ ఆధ్యాత్మిక లాభాన్ని చేకూర్చే పుస్తకం ఇది. ఆ ఉద్దేశంతోనే దీన్ని రాయడం జరిగింది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
ఊహాశక్తికి పుస్తకమే మార్గం
పఠనానుభవం కాలేజీ రోజుల్లో హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఓ వెయ్యి పేజీల పుస్తకం చదవడం కన్నా ఒక సినిమా చూడటం సులువు అనే ఆలోచ నతో సినిమాలు విపరీతంగా చూశాను. అప్పుడు పుస్తకాల విలువ నాకు తెలియదు. నేను దర్శకుడి నయ్యాక స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు పుస్తకాల గొప్పతనం అర్థమయింది. సినిమాలో ఓ సన్నివేశం చూసేటప్పుడు మన ఊహాశక్తికి పని ఉండదు. ఎవరో ఊహించి అక్కడ సన్నివేశం రాస్తారు. ఇక సినిమా చూసే ప్రేక్షకులు ఇంకేం ఊహించుకుంటారు! సన్నివేశంలో ఇక్కడ ఇల్లు ఉంటుంది, పిల్లి ఉంటుంది అని వాళ్లే చెప్పేస్తారు. అంతకు మించి ఊహించుకోవడానికి ఏమీ ఉండదు. కానీ పుస్తకం చదివేటప్పుడు ఇమేజినేషన్ పాళ్లు ఎక్కువ. పది మంది ఓ పుస్తకం చదివితే దానిని పదిరకాలుగా ఆలోచిస్తారు. నేను మొట్టమొదటిసారి చదివిన ఇంగ్లీషు పుస్తకం మార్క్ ట్వేన్ ‘ది ఎడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’. చదివిన తర్వాత మా ఫ్రెండ్స్‌కు దాన్ని యథాతథంగా అప్పజెప్పా. నేను ఇంటర్మీడియట్లో ఉండగా ఓ అమెరికన్ దంపతులు తమ లైబ్రెరీ నుంచి వాళ్ల పుస్తకాలు ఇచ్చారు. అలా మార్క్ ట్వేన్ రచనలన్నీ చదివేశా. అలాగే, రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ నవలలు కూడా నన్ను బాగా ఆకర్షించాయి. పెరల్ ఎస్ బక్ ‘ద గుడ్ ఎర్త్’ నాకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి. అందులో సంభాషణలు సహజంగా ఉంటాయి. నా అదృష్టం ఏంటంటే నవల చదివాక దాని ఆధారంగా వచ్చిన సినిమా చూశా. చైనా వాళ్ల జీవిత విధానం ఎలా ఉంటుందో ఈ నవల కళ్లకు కట్టినట్లు చూపించింది. హెమింగ్వే ‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ’ చాలా ఇష్టం. సముద్రంలోని మార్లిన్ అనే చేపకూ, ఓ జాలరికీ మధ్య జరిగే సంఘర్షణ ఈ నవల ఇతివృత్తం. ఎలిజబెత్ బోవన్ అనే నవలా రచయిత దీని గురించి మాట్లాడుతూ-‘ నాట్ ఎ వర్డ్ కెన్ బి రీప్లేస్డ్’ అని వ్యాఖ్యానించారు. ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో సినిమా తీశారు. కానీ నాకు ఆ సినిమా నచ్చలేదు. నవల చదువుతున్నప్పుడు కలిగిన అనుభూతి సినిమా చూస్తున్నప్పుడు కలగలేదు. ఆ తర్వాత - నాకు నాటకాలంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో జార్జ్ బెర్నార్డ్ షా నాటకాలంటే ఎగబడేవాళ్లం. ఆయన ‘పిగ్మాలియన్’ బాగా నచ్చింది. ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘షి స్టూప్స్ టు కాన్‌క్వర్’ నాటకం కూడా బాగా నచ్చింది. తెలుగు విషయాని కొస్తే, కాళీపట్నం రామారావు, పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు రచనలు చాలా ఇష్టం. ముళ్లపూడి వెంకటరమణ రచనలు చాలా ప్రేరణ కలిగించాయి. ఇక, విశ్వనాథ సత్యనారాయణ ‘మా బాబు’ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను పెరిగి పెద్దయ్యేవరకూ కూడా ఆ కథలోని పాత్రలు, సన్నివేశాలు నా మనస్సులో అలా ముద్ర పడిపోయాయి. ఇప్పటికీ మరోసారి దాన్ని చదవాలనిపిస్తుంది. - సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు -
కుంభమేళాలో తప్పిపోయిన కుర్రాడా!
కుళాయి తిప్పితే జలజల రాలేది కవిత్వం కాదు. అవి పైపుల్లోని నీళ్లు మాత్రమే. ఆత్మ మెలిదిరిగినపుడు, నరాలను పిండినప్పుడు, కాలిగోరు నుంచి పాములా పాకుతూ, కంటి నుంచి రాలే నిశ్శబ్దపు కన్నీటిబొట్టే కవిత్వం. ‘జీరోడిగ్రీ’లో ఆ కన్నీళ్లు గడ్డకట్టుకుపోయి అక్షరాలైనాయి. కవిత్వపు చక్కదనం, కన్నీటి చిక్కదనం తెలిసినవాడు మోహన్ రుషి. మోహన్ కొత్తగా ఏమీ చెప్పలేదు. అన్నీ మనకు తెలుసు. తెలిసినా గుర్తించం. గుర్తించినా అంగీకరించం, అంగీకరించినా మన లోపలి అరల్లో భద్రంగా దాస్తాం. ఆ రహస్యపు గాజుపెట్టెను అతను పగులగొట్టాడు. గాయపడ్డాడు, కట్టు కట్టుకోవడం తెలియనివాడు, కనికట్టు ఎరుగనివాడు. కుంభమేళాలో తప్పిపోయిన కుర్రాడు మోహన్ రుషి. మేళా మనల్ని అబ్బురపరుస్తుంది, భయపెడుతుంది. తప్పిపోయిన చాలామంది ఇళ్లు చేరుకోరు. వాళ్లకోసం ఎవరో వెతుకుతుంటారు. వాళ్లు ఇంకెవరినో వెతుకుతుంటారు. వెతకడంలోనే కొందరు బతుకును ముగిస్తారు. ఈ కవిత్వం అందరికీ ఒకేలా అర్థం కాకపోవచ్చు. అసలు అర్థమే కాకపోవచ్చు. ఇఫ్స్ అండ్ బట్స్‌తో సముదాయించుకోవాలని చూస్తే పెద్దగా వొరిగేది కూడా ఉండదు. ఒక పల్లెటూరి అబ్బాయి నగరానికొచ్చి తన ముఖాన్ని పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ ఈ కవిత్వం. కూలిన రాజ్యాలను పునర్నిర్మించొచ్చేమో కానీ, చెదిరిన ఆ పిచ్చుక గూడుని ఏ గడ్డిపోచలతోనూ తిరిగి కట్టలేరని అంటాడు మోహన్. ఈ ప్రపంచంలో చాలామంది పైకి మనుషులు, లోపల ‘గొల్లుంలు’. గొల్లుం అంటే మనిషి కాదు. జంతువు కాదు. వినయంగా ఉంటూ వంకీ కత్తితో పొడుస్తాడు. నవ్వుతూ రక్తం తాగుతాడు. పసితనంలోనే వృద్ధుడు (లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పుస్తకంలో ఒక పాత్ర పేరు గొల్లుం). బ్రాండెడ్ బట్టల ముసుగులో ఈ జంతువులు ఎక్కువై లైఫ్‌స్కిల్స్‌కి సానపెడుతూ మనుషుల్ని పీక్కుతింటున్నాయి. వేటగాళ్లని వేటాడితే తప్ప, బతకలేని నగరంలో తెగిపోయిన పతంగుల్ని ఎగరేసే ప్రయత్నంలో ఉన్నవాడు మోహన్. ఈ పుస్తకాన్ని అమ్మకి అంకితమిచ్చాడు. ‘లోకం మెచ్చని నా బతుకుని లోకంగా చేసుకున్న అమ్మ రాజమల్లమ్మకు’ అన్నాడు. ఈ వాక్యమే అతి గొప్ప ఆర్ట్ పీస్. - జి.ఆర్.మహర్షి -
1 క్యూ 84
‘1 క్యూ 84’. జపాన్ కవిత్వమైనా కొద్దిగా చదివాను గానీ వర్తమాన జపాన్ నవలలతో అసలు పరిచయం లేదు. పది రోజుల క్రితం నాకు మంచి స్నేహితుడు, అంతర్జాతీయంగా సినిమాటోగ్రఫీలో ప్రసిద్ధుడు అయిన మధు అంబట్... హారుకి మురకామి గురించి చెప్పాడు. మధు సాహిత్యాభిరుచి తెలుసు. అందుకని వెంటనే హారుకి 2011లో రాసిన ‘1 క్యూ 84’ చూడాలనిపించింది. తీరా పుస్తకం ‘ఫ్లిప్‌కార్ట్’లో వచ్చాక చూస్తే 1,318 పేజీలుంది. సాహసంతో మొదలుపెట్టాను రెండు రోజుల క్రితం, రోజుకి వంద పేజీలైతే 13 రోజుల్లో పూర్తవుతుందిలే అనే ధీమాతో! మూడు వందల పేజీలు చదివాను. రచన సరళంగా, సూటిగా అదే సమయంలో సాంద్రంగా ఉంది. ప్రతి చిన్న వివరమూ రాస్తున్నాడు. అలా రాయటం పేజీలు నింపటానికి కాకుండా పాత్ర పోషణకు ఉపయోగపడుతున్నదని క్రమంగా తెలిసివస్తోంది. మూడు వందల పేజీల్లో ఐదారు పాత్రలే ప్రవేశించాయి. ఒక హత్య జరిగింది. హత్య చేసింది ‘అయెమామె’ అనే ముప్పై ఏళ్ల యువతి. హత్య చాలా సున్నితంగా జరిగింది. నాకేం జరిగిందని ఆ చనిపోయిన వ్యాపారి కళ్లు ఆశ్చర్యంతో నిండి ఉండగానే అతని ప్రాణం పోయింది. అతని భార్యే చంపించినట్లనిపిస్తోంది. అప్పుడప్పుడే రాస్తున్న ఒక యువ రచయిత, పెద్ద పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు ఈ నవలలోని మరో రెండు పాత్రలు. ఆ సంపాదకుడు ఒక పదిహేడేళ్ల అమ్మాయిని స్టార్ రైటర్ని చేయటానికి ఈ యువ రచయితని వాడుకుందామని చూస్తాడు. జపాన్‌లో పబ్లిషింగ్ రంగం, సాహిత్య రంగం ఎంత పెద్దవో ఎలా ఉన్నాయో మనకు కొంత అర్థమవుతుంది. అతను ఈ సాహిత్య స్కామ్ చేయటానికి చెప్పిన కారణాలు సరదాగా ఉన్నాయి. అతనికి పెద్ద పెద్ద రచయితలంటే కోపం. చిరాకు. అసహ్యం. వాళ్ల అహంకారాలను భరించలేడు. ‘‘నేనీ పని డబ్బుకోసం చేయటం లేదు. ఈ సాహిత్య ప్రపంచాన్ని గందరగోళం చెయ్యటం కోసం చేస్తున్నాను. వాళ్లంతా ఒక గుంపు. ఒకచోట చేరి నానా ఛండాలం చేస్తారు. ఒకరి గాయాలొకరు నాకుతారు. అదంతా సాహిత్య సేవ అంటారు. వాళ్లని చూసి పగలబడి నవ్వుకోవాలని ఈ పని చేస్తున్నాను. ఈ సాహిత్య వ్యవస్థ తెల్లబోయేటట్లు, ఆ గుంపునంతా ఒట్టి ఇడియట్లని చూపించటానికి నేనీ పని చేస్తున్నాను.’’ అంటాడు (ఇది స్వేచ్ఛానువాదం. అసలు మాటలు నేను రాయలేనట్లున్నాయి). కొన్ని నవలలు చదువుతుంటే ‘ప్లాట్’ విషయంలో తెలుగు నవలా రచయితలు చాలా వెనకబడి ఉన్నారని అనిపిస్తుంది. ఈ నవల చదువుతుంటే అదే అనిపిస్తోంది. 80 దశాబ్దపు జపాన్ ఈ నవలలో పరిచయమవుతోంది. జపాన్ సినిమాలెంత గొప్పవో నవలలూ అంత గొప్పవని ఈ నవల పూర్తయ్యేసరికి అనుకోగలుగుతానని ఆశపడుతున్నాను. ఈ రచయితకు మిలన్ కుందేరా, వి.ఎస్.నయ్పాల్లకు వచ్చిన ప్రతిష్టాత్మకమైన ‘జెరూసలెమ్ ప్రైజ్’ వచ్చింది. ఇతని రాబోయే నవల రాకముందే ఇప్పటికి ఇరవై లక్షల కాపీలు అమ్ముడుపోయిందట. - ఓల్గా -
మాతృవందనం
(జీవన కాలం) - గొల్లపూడి మారుతిరావు ప్రపంచంలో అన్ని దేశాల జాతీయ గీతాలలోనూ భారత దేశపు జాతీయ గీతం గొప్పగా ఉన్నదని ఐక్యరాజ్య సమితి సంస్థ (యునెస్కో) ప్రకటించింది. ఇది గర్వకారణం. క్రికెట్ ధర్మమా అని దాదాపు సంవత్సరం పొడుగునా అన్ని దేశాల జాతీయ గీతాలను వినే అవకాశం మనందరికీ కలిసొచ్చింది. తప్పనిసరిగా యునెస్కోకి అనిపించిన ఆలోచన మనకి వస్తూనే ఉంటుంది. ‘జనగణమన’ నిస్సందేహంగా గొప్ప గీతం. గొప్ప బాణీ. గీతంలో గాంభీర్యం, బాణీలో ఉద్ధతి ఉంది. అయితే మన మాతృవందనం ‘వందేమాతరం’ కానీ, జాతీయగీతం ‘జనగణమన’ కానీ దేశం కోసం రాసినవి కావు. అదే విచిత్రం. వందేమాతరం బంకించంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠ్’ నవలలో బ్రహ్మచారుల మఠం ప్రార్థ్ధన గీతం. నేను మద్రాసు రేడియోలో పని చేసే రోజుల్లో ‘వందేమాతరం’ గీతం శత జయంతికి ‘ఆనందమఠ్’ నాటకాన్ని ప్రొడ్యూస్ చేశాను. బెంగాలీ రచన కనుక మద్దిపట్ల సూరి గారిని నాటకం రాయమన్నాను. నాటకాన్ని చదవకుండానే 18 కాపీలు రాయించి - నటుల్ని బుక్ చేశాం. దేవిక, అట్లూరి పుండరీకాక్షయ్య, పట్టాభిరామిరెడ్డి, రావి కొండలరావు, మమత - ఇలాగ. వందేమాతరం బృందగానానికి బాలసుబ్రహ్మణ్యాన్ని బుక్ చేశాం. పుండరీకాక్షయ్యగారు తమ ఆఫీసులో రిహార్సల్స్ చేద్దామన్నారు. తీరా స్క్రిప్టు చదవడం ప్రారంభిస్తే - ఒక్కొక్కరికీ రెండేసి డైలాగులు వచ్చాయి. నాటకాన్ని రాసిన మద్దిపట్ల సూరిగారు - మూలాన్ని అనుసరించి రాశారేగానీ నటులని దృష్టిలో పెట్టుకు రాయలేదు. అది ఆయన తప్పుకాదు. నాకు మతిపోయింది. 18 మందితో గంట నాటకం. అందరూ పెద్ద నటులు. స్క్రిప్టు ఇలా కొంపముంచింది. ఆ రోజుకి రిహార్సల్స్ చాలించి - ఇంటికొచ్చి రాత్రికి రాత్రి గంట నాటకం తిప్పి రాశాను - ఈసారి నటులను దృష్టిలో పెట్టుకుని. మళ్లీ ఈ రచనకు కాపీలు రాయాలి. మర్నాడు రోజంతా మా ఆవిడా, మా ఇంటి ఎదురుగా ఉన్న అనిశెట్టి సుబ్బారావుగారి భార్యా 18 కాపీలు తయారు చేశారు. ఈసారి నటులంతా తృప్తిపడ్డారు. ఈలోగా బాలు రికార్డింగుకి రాలేకపోతున్నానని చిన్న చీటీ పంపారు. ఏం చెయ్యాలి? ‘ఎస్. జానకి చేత పాడించేస్తాను’ అన్నారు అనౌన్సర్ మల్లంపల్లి ఉమామహేశ్వరరావుగారు. రిహార్సల్స్ హడావుడిలో ఉన్నానేమో - సరేనన్నాను. స్టూడియోలో పాట రికార్డు అయిపోయింది. నాటకం బాగా వచ్చింది. కాని పెద్ద పొరపాటు - నాటకంలో బ్రహ్మచారుల సంస్థ ప్రార్థనా గీతాన్ని స్త్రీ పాడటం. ఆఫీసులో దుమ్ము లేచింది. నాకు పచ్చివెలక్కాయ నోట్లో పడింది. అయితే సందర్భం ‘వందేమాతరం’ శత జయంతి కనుక, అది మన జాతి గీతం కనుక - నవలలో భాగంగా కాక - జాతి వందనంగా స్త్రీల బృందగానంతో దాన్ని జనరలైజ్ చేశానని అన్నాను. ఇది నిజానికి బుకాయింపే. కాని పబ్బం గడిచిపోయింది! ఇక - జనగణమన. 1911లో మన దేశంలో జరిగిన 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా రవీంద్రుడు మదనపల్లి థియోసాఫికల్ వసతి గృహంలో కూర్చుని రాసిన గీతం - చక్రవర్తికి నివాళులర్పిస్తూ. మొన్న 2011లో కొన్ని వందల మంది మదనపల్లిలో ఈ గీతాన్ని శతజయంతి సందర్భంగా పాడారు. గీతం ‘అధినాయకుని’ ఉద్దేశించి రాసినది. మనది మాతృదేశం. నిజానికి ‘అధినాయకి’ అని ఉండాలి కదా? మిగతా చరణాలలో ఒకచోట ‘తవ సింహాసన పాషే’ అంటారు కవి - ఆయన సింహాసనాన్ని అధిష్టించే సందర్భం కనుక. ‘జయ జయ రాజేశ్వర’ అంటారు మరొకచోట. మన దేశంలో జాతీయగీతం స్థాయికి రాగల గొప్ప రచనలున్నాయి. ‘సారే జహా సె అచ్చా హిందూ సితా హమారా’ అన్న ఇక్బాల్ గీతం గొప్పది. కాని ‘హిందుస్తాన్ మనదే’ అంటూ ఆయన పాకిస్తాన్‌కి తరలిపోయారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి’ అన్నగీతం ఏ జాతీయ గీతానికీ తీసిపోదు. జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం పాపులర్ చేసిన ‘జయతి జయతి భారతమాతా’ అన్న మాయవరం విశ్వనాథశాస్త్రి గీతం అపూర్వమైనది. చిన్నప్పుడు మన నోళ్లలో కదిలే మరో గొప్ప గీతం: ‘నమో హిందు మాతా - సుజాతా - నమో జగన్మాతా! విపుల హిమాద్రులె వేణీ భరముగ, గంగా యమునలె కంఠహారముగ, ఘన గోదావరి కటి సూత్రమ్ముగ, కనులకు పండువు ఘటించు మాతా - నమో హిందు మాతా’. రచయిత గరిమెళ్ల సత్యనారాయణ. ఆయన పేరు చాలా మందికి వెంటనే గుర్తురాకపోవచ్చు- ‘మాకొద్దీ తెల్లదొరతనమూ’ రాసిన కవి. మహాత్మాగాంధీ, నెహ్రూ గార్లకు అత్యంత ఆప్తులు రవీంద్రులు. కాగా - దక్షిణ భారతదేశపు ఆణిముత్యాలు వారి చెవుల దాకా ప్రయాణం చేసి ఉండవు. ఏమయినా - యునెస్కో వంటి సంస్థలు మన జాతీయ గీతానికి కితాబులిచ్చినప్పుడు, బ్రిటిష్ మహారాజు గారిని పొగుడుతూ రాసినా - 36 సంవత్సరాల తర్వాత ‘అమ్మ’కి నివాళిగా జాతీయగీతం చేసుకున్నందుకు గర్వంగానే ఉంటుంది - ‘అయ్యో - ఇంకా పరాయి ప్రమేయం మాతృవందనంలోనూ తప్పలేదా!’ అని ఒక పక్క మనసులో అనిపిస్తున్నా. (ఈ కాలమ్ ఇకపై ప్రతి గురువారం వస్తుంది) -
అలా ఉందామా?
‘రామాయణ విషవృక్షం’ తర్వాత అదే తరహాలో ఉన్న విమర్శతో ‘ఇదండీ మహాభారతం’ అన్న గ్రంథాన్ని ఇటీవల ప్రచురించారు రంగనాయకమ్మగారు. ‘ఇది మరో విషవృక్షం’ అని కూడా అన్నారు. ఏ అంశం మీద విమర్శ రాయాలనుకున్నా, దాని మూలాన్ని పూర్తిగా తెలుసుకొని రాసే ఆమె పద్ధతి ఇందులోనూ కనిపిస్తుంది. సంస్కృత భారతాన్నీ, పురిపండా వచన భారతాన్నీ, గంగూలీ ఆంగ్లానువాదాన్నీ, అలాగే కవిత్రయ భారతాన్నీ చదివే ఈ విమర్శ చేశారు. దాన్తో విభేదం లేదు కానీ విభేదం విమర్శను గురించే ఉంటుంది. నిజానికి, రంగనాయకమ్మగారు అనుసరించిన పద్ధతికి ‘విమర్శ’ అనే పదం సరైనది కాదనాలి. విమర్శలో విమర్శకుల స్వీయాభిప్రాయాలు కనిపించరాదనేది విమర్శకు సంబంధించిన ఒక విలువ. స్వీయాభిప్రాయాలు లేని విమర్శ ఉంటుందా అన్నది వేరే చర్చ. అది సూక్ష్మ దృష్టికి మాత్రమే కనిపించేది. రంగనాయకమ్మగారి పద్ధతి వేరు; వేరు కాదు అందుకు వ్యతిరేకం. స్థూల దృష్టికే కనిపించేది. సాక్షాత్తూ ఆమె బడితె చేత ధరించి, భారతాన్నీ, అందులోని పాత్రల్నీ కీలుకీలునా విరగ్గొట్టి, చెత్తకుప్పలో పడవేసినట్టు కనిపించే విమర్శ! ఆ కుప్ప మీద ‘భారతం చదవడం వ్యర్థం’ అన్న తీర్పును కూడా రాశారు. వ్యర్థమని తెలిశాక, అంత శ్రమపడి పుస్తకం రాయడమూ, నష్టం భరించి ప్రచురించడమూ అవసరమా అన్న ప్రశ్నలకు మనకే సమాధానాలూ దొరుకుతాయి. వ్యర్థం అని ఆమెకు తెలిస్తే చాలా, అందరికీ తెలియాలి కదా! అందుకూ పుస్తకం తేవడం. అందులోనూ భారతం కథ అంతా ఎవరికీ తెలీదు. ‘‘మీకు భారతం కథ తెలుసా?’’ అని ఆమె చాలామందిని అడిగి చూశారు. వాళ్లు సినిమా చూశామనీ, అందులో ద్రౌపదికి బట్టలు విప్పుతారనీ చెప్పారు. ‘ఎలాంటివాళ్లను అడిగారో..’ అని అనిపిస్తుంది కానీ, మనకు మాత్రం భారతం అంతా తెలుసా? ఈ పనిలో దిగబడేవరకూ రంగనాయకమ్మగారికీ తెలీదు. తెలిశాక, రాయాలనుకోకుండానే, భరించలేక రాసేశారు. భరించలేకపోవడానికి గల కారణాలను, పుస్తకం టైటిల్ కింద నాలుగు లైన్ల మేరకు వివరించారు. నిజమే, ఆమె చెప్పినవన్నీ భారతంలో ఉన్నవే. అందులో రంగనాయకమ్మగారి కల్పనలు కానీ, వక్రీకరణలు కానీ లేనేలేవు. ఆయా సందర్భాలను పురస్కరించుకొని, చేసిన వ్యాఖ్యలూ, తర్కమూ, చెప్పిన అభిప్రాయాలూ మాత్రమే ఆమెవి. భారతం గురించి తను చెప్పిన ఏ మాటా, ఏ అభివర్ణనా నిరాధారంగా అన్నవి కావనీ, ఆ సంగతి పుస్తకం చదివితే అర్థమవుతుందనీ కూడా హామీ ఇచ్చారు. ‘ఇదండీ మహాభారతం’ చదివాక, ఇందులో ఉన్నవి భారతంలో ఉన్నవే అని అనుకున్నప్పటికీ, రంగనాయకమ్మగారు అన్న ‘వ్యర్థం’ అన్న మాటతో ఏకీభవించలేము. ఎందుకు? ‘రామాయణ విషవృక్షం’ తర్వాత, భారతం మీద కూడా రాయండి. అనడిగినవాళ్లకు ‘ఒక మత గ్రంథాన్ని మార్క్సిస్టు దృక్పథంతో అర్థం చేసుకున్న తర్వాత, ఏ మత గ్రంథాన్నయినా అలాగే అర్థం చేసుకోవచ్చు’ అని చెబుతూ వచ్చినట్టు, రంగనాయకమ్మగారే అన్నారు. ఈ సందర్భంగా రామాయణాన్నీ భారతాన్నీ పూర్తిగా మత గ్రంథాలుగా భావించవచ్చా, కావ్యాలుగా భావించరాదా అన్న చిన్న ప్రశ్నలు పుట్టుకొస్తాయి. వాటి సంగతి తర్వాత చూద్దాం. ఆరెస్సెస్ వాళ్లో, వీహెచ్‌పీ వాళ్లో అయితే, ‘ఇతర మత గ్రంథాల మీద కూడా ఇలా రాయగలరా?’’ అనడుగుతారు. రామాయణం మీద, భారతం మీద విమర్శ రాయకూడదని మనం అనం. కనుక, దాన్నీ అలా ఉంచుదాం. కేవలం సందేహాలను వ్యక్తం చేద్దాం. భారతం కాలం నాటికి బ్రాహ్మణులూ, శూద్రులూ అలా ఉండేవారని సరిపెట్టుకోవచ్చు, అని రంగనాయకమ్మగారు అన్నదే. ఈ కాలంలో కూడా అలా ఉండటమేమిటి? బహుశా, ఈ ప్రశ్నే ఆమె ఈ పుస్తకం రాయడానికి కారణమై ఉండొచ్చు. బ్రాహ్మణులూ, శూద్రులూ అనేవాళ్లు ఇప్పటికీ ఉన్నారంటేనే ఆనాటి భావజాలం అంతో ఇంతో మార్పులతో ఇప్పటికీ ఉన్నట్టే కదా! పదిహేనేళ్ల పాటు మార్క్సిజం నేర్చుకుంటూ, నేర్పుతూ ఉండిన ఆమెకు ఈ సంగతి తెలీదా? ఆ నాటికి బ్రాహ్మణులూ, శూద్రులూ అలా ఉండేవారని సరిపెట్టుకున్నట్టే, ఆనాటి ఆ మూఢనమ్మకాలు నమ్మకాలుగా ఉండేవనో, నమ్మేందుకు వీలైన పరిస్థితులు ఉండేవనో ఎందుకు సరిపెట్టుకోకూడదు? గణేశుడి విగ్రహాలు పాలు తాగడమూ, ఉత్తి చేతుల్లోంచి బంగారు గొలుసులు తీయడమూ, కక్కుకుంటూ నోట్లోంచి లింగాలు తీయడమూ, తన్ని కొట్టి రోగాలు నయం చేయడమూ, ఇప్పటికీ ఉండటమే కాక, నమ్ముతున్నవాళ్లూ ఉన్నారు కదా! ఈ నమ్మకాలే భారతంలోనూ కనిపించేవి. అయితే, వీటిని నమ్మాలనీ, విమర్శించరాదనీ కాదు. వాటిని ప్రధానంగా, ఆధారంగా చూసి, ‘భారతం చదవడం వ్యర్థం’ అన్న తీర్మానం చెయ్యవచ్చా? అవికాక, భారతంలో ఇంకేమీ లేవా? ఇవీ సందేహాలు. భారతం ఒక కావ్యం. రామాయణమూ కావ్యమే. వాటిలో ఆధిపత్య వర్గం భావాలు అధికంగా కనిపిస్తాయి. వాటితో పాటు వాటికి ఎదురు తిరిగి చేసిన చిన్న చిన్న పోరాటాలూ, ప్రతిఘటనలూ తక్కువగానైనా కనిపిస్తాయి. వాటిని మొత్తంగా మతగ్రంథాలుగా భావించవచ్చా మార్క్సిస్టులు? వాటిని కావ్య దృష్టితో కనీసంగానైనా చూడలేదు రంగనాయకమ్మగారు. నన్నయ కవిత్వాన్నో, తిక్కన కవిత్వాన్నో ఇష్టపడుతున్నవాళ్లు భారతంలో ఉన్న వరాలనీ, శాపాలనీ జరగడానికి వీల్లేని సంఘటనల్నీ నమ్ముతున్నట్టా? ఆ మాటకొస్తే, నన్నయ తిక్కనలు కూడా నమ్మి రాశారని నమ్మలేం. ఎందుకంటే వాళ్లు మనుషులు. దేవతల్నీ, రాక్షసుల్నీ వాళ్లెప్పుడూ చూసి ఉండరు. నమ్మని వాటిని రాయడమెందుకు అన్న ప్రశ్న మళ్లీ మొదటికి తెస్తుంది. ‘‘కవిత్వం కుల భేదాల్ని తీసివెయ్యలేదు’’ అని రంగనాయకమ్మగారు అనడం మరింత ఆశ్చర్యకరం. కవిత్వమే కాదు, మొత్తం ప్రపంచ సాహిత్యమంతా కలిసినా సమాజంలో ఉన్న అంతరాలను తొలగించలేదు. మార్క్సిజం తెలీనివాళ్లు కూడా కవిత్వం ఆ పని చెయ్యగలదని అనుకోరు. అది చెయ్యగల పని వేరు. కర్ణుడి కవచంలాగా (ఇదీ మూఢనమ్మకమేనండోయ్) రంగనాయకమ్మగారి హృదయం కవిత్వం చొరరాని కవచంగా ఉంటే తప్ప అటువంటి అభిప్రాయం ఏర్పడి ఉండదనీ, కవిత్రయాన్ని కడగంటనైనా చూడకపోవడం జరిగేది కాదనీ అనిపిస్తుంది. చివరగా చెప్పవలసింది ఇదీ. రంగనాయకమ్మ గారి ‘విమర్శ’ను అన్వయించి చూస్తే, మనకు ప్రాచీన సాహిత్యమంటూ మిగలదు. వేల ఏళ్లుగా ఉన్న సాహితీ వృక్షాలను విష వృక్షాలని నరికేస్తే ఏమవుతుంది? భారతం గురించి రంగనాయకమ్మ గారే చేసిన అభివర్ణనల్లో ఒక్కటైన ‘మొగ్గా పువ్వూ లేని, కాయా పండూ లేని మోడు’లుగా మనం మిగిలి ఉంటాం. అలా ఉందామా? - పి.రామకృష్ణ