బార్సిలోనాకి చెందిన అరవై యేళ్ల మాక్ నిర్మాణ వ్యాపారం కుప్పకూలిపోయింది. కొడుకులు వాళ్ల వాళ్ల జీవితాల్లో స్థిరపడి ఉన్నారు; భార్య ఫర్నిచర్ వ్యాపారంలో బిజీగా ఉంది. ఖాళీ సమయాన్ని ఎలా వెచ్చించాలా అని ఆలోచించిన మాక్ ఒక పుస్తకం రాయాలనుకుంటాడు. తన మరణానంతరం బయటపడి, అసంపూర్ణ రచనలా అనిపించే సంపూర్ణమైన రచన ఒకటి చేసిపెట్టుకోవాలని అతని ఉద్దేశం. అప్పటివరకూ చదువరిగానే తప్ప రచనానుభవం లేని మాక్‌కి సాహిత్యం పట్ల అభిప్రాయాలైతే ఉన్నాయి. సాహిత్యం మళ్లీ మళ్లీ పునరావృతమయ్యే ఒకే విశేషమనీ, సమస్యకి కారణాలు అన్వేషించే ప్రయాణాలే వివిధ రచనలుగా వెలువడుతున్నాయనేది అతని సిద్ధాంతం. రిపిటిషన్ అనేది సాహిత్యపు మౌలిక సూత్రం అన్నది అతని స్థిరాభిప్రాయం.
ఈ ప్రయత్నాల్లో అతనుండగా, పొరుగున ఉండే సాంచెజ్ అనే ప్రముఖ రచయితని కలవడం తటస్థిస్తుంది. ఈ రచయిత తొలినాళ్లల్లో వ్యసనాలకి బానిసగా ఉన్నప్పుడు ‘వాల్టర్స్ ప్రాబ్లమ్’ అనే పది గొలుసు కథలున్న నవల రాసాడు. వాల్టర్ అనే వెంట్రిలాక్విస్ట్ కోల్పోయిన తన గొంతుని తిరిగిపొందడం, వివిధ రచయితల గొంతుల్లో ఆత్మకథని వినిపించడం నవల సారాంశం. సాంచెజ్ చేసింది మంచి ప్రయత్నమే కానీ, అప్పటికి అతనున్న మైకపు స్థితుల్లో ఒక్కోకథలో అర్థంలేని కొన్ని పేరాలు రాసుకుంటూ పోయాడు. ఇప్పుడా పుస్తకం కాపీలు ఎక్కడా దొరక్కపోవడం అతనికి కొంత ఊరట. మాక్ ఈ పుస్తకాన్ని కొన్నేళ్ల క్రితం సగం చదివి పక్కన పడేసాడు. సాహిత్యం ఎలానూ పునరావృతమయ్యేదే కాబట్టి దీన్నే తిరగరాసేస్తే సరిపోతుంది కదా అనుకుంటాడు. ఇప్పుడా పుస్తకాన్ని మాక్ మళ్లీ చదువుతుంటే, రచయిత సొంతగొంతుని సాధించడం కోసం చేసే ప్రతీకాత్మక ప్రయత్నంగా కథ అర్థమవుతూ పాత్రలు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. ఎంత సుపరిచితంగా అంటే– పుస్తకం మధ్యలో అతని భార్య పేరు శీర్షికగా ఒక కథ ఉంది!
మాక్ కేవలం చదువరి అని మాత్రమే చెబితే చాలా తక్కువ చెప్పినట్టు. అతను చేసిన సాహిత్య శోధన అంతాయింతా కాదు. పుస్తకాలలోని వాక్యాలనీ, ఎపిగ్రాఫ్‌లనీ ఉదహరించగలిగినంత అపారమైన సాహిత్య పరిచయం ఉంది. ఈ పాండిత్యం నేపథ్యంగా తను సృష్టించబోతున్న నవలావరణంలోకి పూర్తిగా కూరుకుపోతున్న సమయంలోనే భార్య, సాంచెజ్‌ల మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానం కలిగాక అప్పటివరకూ సాహిత్య శిఖరాలని అందుకోవలని ప్రయత్నిస్తున్న మాక్, భ్రాంతుల లోతుల్లోకి జారిపోవడం ప్రారంభిస్తాడు. హెమింగ్‌వే అన్నట్టుగా ‘‘నో, ఐ కాన్ట్. ఐ యామ్ డన్ విత్ ఇట్,’’ లాంటి ఆత్మహత్యని ప్రేరేపించే వాక్యాలు మనసులో మెదులుతుంటాయి. కథకుడిగా మాక్ చెప్పినవన్నీ పూర్తి సత్యాలు కావనీ, కొన్ని అబద్ధాలూ ఉన్నాయనీ నెమ్మదిగా విశదమవుతూంటుంది. సాహిత్య నిర్మాణ యత్నంలో తనకు తానే సమస్య అయిపోయిన మాక్ రాసిన డైరీయే‘మాక్స్ ప్రాబ్లమ్’ నవల.
ఇది కేవలం కథకోసం ఒకటిరెండు రోజుల్లో చదవాల్సిన నవల కాదు. రచయిత బెర్నార్డ్ మాలాముడ్‌ని మాక్ ఉదహరించినట్టుగా– ఠీజ్చ్టి’టn్ఛ్ఠ్ట జీటn’్ట ్టజ్ఛి ఞౌజీn్ట. ఈ నవల ఒక అరుదైన సాహిత్య పరామర్శ, ప్రశంసాత్మక విమర్శ. ఎన్నో కథల గురించీ, పుస్తకాల గురించీ, రచయితల గురించీ, ప్రహసనాల గురించీ, సినిమాల గురించీ మాక్ వివరణలు, వాటిల్లోనుంచి కొటేషన్లూ ఈ రెండువందల పేజీల నవలలో విస్తృతంగా పరుచుకునుంటాయి. ఉదహరించిన రచనలతోబాటుగా ఈ నవలని చదవగలిగితే అది మరోస్థాయి పఠనానుభవం. పాఠకుడికి కొత్తదారుల్ని చూపించి ప్రోత్సహించే ఈ మెటాఫిక్షనల్ నవల హాస్యంతోపాటుగా మెటాఫిజికల్ ఆలోచనలనీ అందిస్తుంది.
ఎన్‌రికె విలా–మాతాస్ స్పెయిన్‌కి చెందిన ప్రముఖ రచయిత. నవలలో సాంచెజ్ రాసినట్టుగా చెప్పిన ‘వాల్టర్స్ ప్రాబ్లమ్’ నిజానికి ఈ రచయితే 1988లో రాసిన నవల. ఈ ఆధార నవల ఇంగ్లిష్‌లోకి అనువాదం అయితే కనక– హెమింగ్‌వే, బోర్హెస్, రేమండ్ కార్వర్, జాన్ చీవర్, జీన్ రీస్ లాంటి ప్రముఖ రచయితల గొంతులని విలా–మాతాస్ అనుకరించిన పద్ధతి తెలుసుకునే వీలుంటుంది. మార్గరెట్ జల్ కోస్టా, సోఫీ హ్యూస్ ద్వయం చేసిన ‘మాక్స్ ప్రాబ్లమ్’ ఇంగ్లిష్ అనువాదం సాఫీగానూ, ఫిలసాఫికల్‌గానూ సాగిపోతుంది.
- ఎ.వి. రమణమూర్తి
నవల : మాక్స్ ప్రాబ్లెమ్ (లేదా) మాక్ అండ్ హిజ్ ప్రాబ్లెమ్
రచయిత : ఎన్‌రికె విలా–మాతాస్
స్పానిష్‌లో ప్రచురణ: 2017
ఇంగ్లిష్ : మార్గరెట్ జల్ కోస్టా, సోఫీ హ్యూస్
ప్రచురణ : న్యూ డైరెక్షన్స్, 2019
Comments
Please login to add a commentAdd a comment