Book Review
-
స్ఫూర్తిదాయక ‘సాగుబడి’
హరిత విప్లవం పుణ్యమాని ఆహారోత్పత్తిలో మనదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఆహార ధాన్యాలు, కూరగాయాలు, పండ్లు అధికంగా పండించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంకోవైపు విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుచేసిన ఆహార ఉత్పత్తులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతున్నాయి. అధికోత్పత్తి ఆశతో మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఔషధాలు, మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి. ప్రజలు, మూగజీవాల ఆరోగ్యాలకు హానికరంగా మారడంతో పాటు నేల సారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయక ఉత్పాదకత, ఆహార భద్రత, పర్యావరణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికి విరుగుడుగా రసాయనేతర సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం మళ్లీ తెరమీదకు వచ్చింది.భూ సారానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా.. అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం పురుడు పోసుకుంది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో దీని గురించి రైతులకు, ఔత్సాహికులకు తెలియకుండా పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే సాక్షి దినపత్రిక ఈ గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది. పునరుజ్జీవన వ్యవసాయ కథనాలకు ‘సాగుబడి’ పేరుతో ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించి ముందడుగు వేసింది. ప్రకృతి, సేంద్రియ రైతుల స్ఫూర్తిదాయక కథనాలతో పాటు రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చింది. విత్తు దగ్గరి నుంచి విక్రయం వరకు.. అన్నదాతలకు ఉపయుక్తమైన సమాచారాన్ని ‘సాగుబడి’ సాధికారికంగా అందించింది. స్వల్ప వ్యవధిలోనే ‘సాగుబడి’ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు దిక్సూచిగా అత్యంత ఆదరణ చూరగొంది. ఇంటి పంటలు, సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు చేరువ చేసింది.చదవండి: తక్కువ ఖర్చుతో.. పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్‘సాగుబడి’లోని 2014-16 మధ్య కాలంలో ప్రచురితమైన ప్రకృతి వ్యవసాయ ప్రేరణాత్మక కథనాలను పుసక్తంగా ప్రచురించారు సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు. ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించిన అన్ని అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రకృతి వ్యవసాయంలో లబ్దప్రతిష్టులైన వారు, రైతు శాస్త్రవేత్తల ఇంటర్వ్యూలతో పాటు రైతులకు అవసరమయ్యే సమాచారాన్నంతా అందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రచురించిన ఈ పుస్తకాన్ని చూస్తేనే అర్థమవుతుంది రచయిత నిబద్దత. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వారితో పాటు సేంద్రియ సాగు గురించి తెలుసుకోవాలకునే వారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. రచయిత చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రకృతి వ్యవసాయానికి పెద్దబాలశిక్ష వంటిదే.సాగుబడి (మొదటి భాగం)ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాలుపేజీలు: 320;వెల: 600 /- ; రచన, ప్రతులకు:పంతంగి రాంబాబు,8639738658👉ఆన్లైన్లో సాగుబడి పుస్తకం కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
మెస్సయ్య దాటిపోయాక...
ఆస్పత్రి ప్రారంభోత్సవానికి పెద్దాయన వచ్చాడు. ఆయన రాకముందే రంగస్థలాన్ని చాలా శ్రద్ధగా సిద్ధం చేశారు. ఎంతగానంటే రెండు గంటల ముందు నుంచే ఫొటోగ్రా ఫర్లు మండుటెండలో ఎదురు చూసేట్లు. తీరా ఆయనొచ్చాక ఎడమ వైపు ఫొటోగ్రాఫర్ల బృందాన్ని చూసి చీదరించుకున్నాడు. ఎందుకంటే అక్కడనుంచి ఫొటోలు తీస్తే ఆయన ముఖం కనపడదు. నీడలు మాత్రమే వస్తాయి. ఆగమేఘాల మీద అది కూడా సరి చేశారు. అపుడు తీరిగ్గా ‘ప్రాచీన భాష లిపిలో, లోహపు కడ్డీకి చుట్టుకున్న పాములాగా కనిపించే మతచిహ్నం’ ఉన్న శిలాఫలకానికి మొక్కి, లేచి నిలబడి హటాత్తుగా చెట్టు కూలినట్లు నేల మీద పడిపోయాడు. ఆ పడిపోవడం ఉద్దేశపూర్వకంగా చేశాడేమో అన్నట్లు చేతులు రెండూ రెండు వైపులా కచ్చితంగా పెట్టినట్లు పడి పోయాయి. ఆయన ఆస్పత్రికి ప్రణామం చేస్తున్నాడేమో, కొత్త తంతు రిహార్సల్ ఏమో అనుకున్నారు. కానీ పెద్దా యన చచ్చిపోయాడు. మెస్సయ్య దాటిపోయాడు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన పెద్దాయన అంతమై పోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది?2023లో ఆకార్ పటేల్ ఇంగ్లిష్‌లో ‘ఆఫ్టర్ మెస్సయ్య’ (after messiah) నవల రాశారు. దాన్ని తెలుగులోకి ‘నియంత అంతం’ పేరుతో ఎన్. వేణుగోపాల్ అనువాదం చేస్తే ‘మలుపు’సంస్థ ప్రచురించింది. ఈ నవల అంతా కల్పనే. కానీ వాస్తవ భ్రాంతిని కలిగించే కల్పన. ‘జరుగుతున్నది ఇదే కదా!’ అని విస్తుపరిచే సంభావ్యత ఉన్న కల్పన. నియంత పాలించే కాలంలో ఆయన వైభవ కాంతి ముందు మిగతా లోకమంతా మసకలు కమ్ముతుంది. దేశభక్తి, మత రాజకీయాలు వినా ప్రజలకి గత్యంతరం ఉండదు. అభివృద్ధికి నిర్వచనాలు మారిపోతాయి. ప్రభుత్వాలను, వ్యవస్థలను, ప్రజలను తోలుబొమ్మలు చేసి ఆడించిన సూత్రగాడి తాళ్ళు పుటుక్కున తెగి దేశమంతా సంక్షోభపు చీకట్లలో మునిగి నపుడు, ‘ఆయన తర్వాత ఎవరు?’ అన్న ప్రశ్న పుట్టిన చోట కొత్త రాజకీయాలు మొదలవుతాయి.రాజకీయ పార్టీలలో నియంతృత్వ ధోరణుల వల్ల నాయకుల మరణం తర్వాత ప్రత్యామ్నాయం అంత తొందరగా తేలదు. దానికోసం కుమ్ములాటలు దేశానికి కొత్త కాదు. నియంతకి కుడిభుజంగా ఉండే జయేష్ భాయి, మత రాజకీయాల ద్వారా నూతనశక్తిగా ఎదిగే స్వామీజీల మధ్య పదవి కోసం జరిగే పోరు భారత రాజకీయ చరిత్ర పొడుగూతా జరిగిన అక్రమాలను స్ఫురింపజేస్తుంది. రిసార్టు డ్రామాలూ, కార్పొరేట్లతో లావాదేవీలూ, తమ ప్రయోజనాలకి అనుగుణమైన వాస్తవాలను నిర్మించే మీడియాల ‘పెనవేత రాజకీయాలూ’ అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేసి చట్టాన్నీ, న్యాయాన్నీ తమకి అను గుణంగా ఎలా మలుచుకుంటాయో చదివినపుడు దేశపౌరులుగా అభద్ర తకి లోనవుతాము. రాజ్యం ఎపుడూ తన మీద ఎవరో దాడి చేయ బోతున్నారనీ, తను బలహీనమైనదనీ ఊహించుకుంటుంది. అందుకోసం తన సమస్త శక్తులతో ఆ దాడిని ముందుగానే నిర్మూలించాలని అనుకుంటుంది. స్వతహాగా క్రూరమైన బలం ఉండడం వల్ల రాజ్యస్వభావం హింసతో కూడినదనీ, ప్రభుత్వాల హృదయమూ, ఆత్మా హింసేననీ నవల మొత్తం చెబుతుంది. అంతేకాదు ‘రాజ్యం అనేది ఒక హింసాత్మక రాజకీయ జంతువు’. ఈ జంతువుని చెడ్డవారు అధిరోహించినా అది హింసే. మంచివారు అధిరోహించినా హింసేనని తెలిసినపుడు కొంత వెలుగు మన ఆలోచనల మీద ప్రసరించి ఎరుక, దిగులూ కలుగుతాయి.ఆదివాసుల హక్కుల కోసం పనిచేసే మీరా – పార్టీలో ఒక సీనియర్ నాయకుని కూతురు. అనివార్య పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రధాని అవుతుంది. పీడిత ప్రజలకోసం పనిచేసే మంచి వ్యక్తి ప్రధాని అయినా రాజ్యస్వభావం మారదు. ఆదివాసీ హక్కులను పరిరక్షించే ఒక చిన్న చట్టం అమలు లోకి తేవడానికి మీరా, అనేక అడ్డంకులను ఎదుర్కుని, తన విలువలను పణంగా పెట్టాల్సి వచ్చినపుడు అంబేడ్కర్ గుర్తుకు వస్తారు. రాజ్యాంగం... హింస నుంచి పీడితులకు రక్షణ కల్పిస్తుందని నమ్మి, ఆ సాధనలోనూ, హిందూ కోడ్ బిల్లుని ఆమోదింపజేసే సందర్భంలోనూ అంబేడ్కర్ రాజ్యం పెట్టిన ఒత్తిడికీ, హింసకూ లోనయ్యి కూడా ఎంత గట్టిగా నిలబడ్డారో, దానికోసం ఎంత త్యాగం చేశారో, ఎంత రాజీపడ్డారో చరిత్ర చెబుతుంది.ఆ ఒక్క చట్టం కోసం ప్రత్యర్థి ముఠాలకి మీరా ప్రయోజనాలు సమకూర్చాల్సి వస్తుంది. ఆదివాసీల మేలు కోసం చట్టం చేయడానికి మీరా రాజ్య హింసకు లోబడి పని చేసిందని తెలుసు కున్న ఆదివాసీ ప్రతినిధి బృందంవారు ఆమె ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఒక మాట అంటారు. ‘పీడనకు గురయ్యాము కనుక పీడనను తిరస్కరించడం కాదు, అసలు పీడన అనేదే చెడ్డది కనుక దాన్ని మొత్తంగా తిరస్కరించాలని, ఒక పీడనను తొలగించడం కోసం మరో చోట మరో సమూహాన్ని పీడనకు గురి చేయడం భావ్యం కాదని’ చెబుతారు. చివరికి పదవి నుంచి దిగిపోయి ఆదివాసీ పోరాటాలలో భాగం కావాలని కోరుకుంటుంది మీరా.చదవండి: ప్రధాని మోదీ పేరిట గణాంక విన్యాసం.. అసలు కథ ఇదే!ఉనికిలో ఉన్న రాజ్య వ్యవస్థే హింసాత్మకం అయినపుడు, ఎంత మంచి వ్యక్తీ దాన్ని మార్చలేనపుడు, మరి ఎటువంటి పరిపాలనా ప్రత్యామ్నాయాన్ని ఈ నవల సూచించింది! బహుశా ఈ చర్చ పాఠకులలో జరగాలని రచయిత కోరుకుని ఉండొచ్చు. లేదా మీరా ఎంచుకున్న మార్గాన్ని మనకు సూచనప్రాయంగా అందించి ఉండొచ్చు. ‘ఏ రాయి అయి తేనేమి’ అన్న నిర్లిప్తత పెరిగిపోయిన వర్తమానంలో భిన్న రాజకీయ శ్రేణుల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయాల మీద చర్చ జరగాలి. ‘గమ్యమే మార్గాన్ని సమర్థిస్తుంది’ అన్న సూత్రాన్ని డీ కోడ్ చేయాలి.- కె.ఎన్. మల్లీశ్వరి‘ప్రరవే’ ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో పుస్తక సమీక్ష
శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో, సింగపూర్‌లో ప్రవాసభారతీయులతో డా. రామ్ మాధవ్ రచించిన నూతనగ్రంధ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. డా రామ్ మాధవ్ ఇటీవల రచించిన *ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్ (“The Indian Reality: Changing Narratives, Shifting Perceptions”) పుస్తక పరిచయం,విశ్లేషణ కార్యక్రమం సింగపూర్‌లో మే 4న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక స్థానిక భారతీయ సంస్థల అధిపతులతో పాటు సుమారు 100 మంది సింగపూర్ వాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ పాలక మండలి అధ్యక్షుడు డా రామ్ మాధవ్ భారతదేశం చుట్టూ అభివృద్ధి చెందుతున్న కథనంపై అంతర్దృష్టి దృక్కోణాలను పంచుకున్నారు. భారతదేశంలోని ప్రస్తుత పరిపాలన ద్వారా అందించబడిన జవాబుదారీతనాన్ని ఆయన నొక్కిచెప్పారు, సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో యువకులు విద్యావంతులు పెరుగుతున్న భాగస్వామ్యాన్ని హైలైట్ చేశారు. అంతేకాకుండా, భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని గురుంచి నొక్కిచెప్పారు. అనంతరం రామ్ మాధవ్ , వామరాజు సత్యమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అతిధులకు, ఇంకా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, నిర్మల్ కుమార్, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అతిధుల విందు భోజనంతో ఈ కార్యక్రమం ముగిసింది. -
హైదరాబాద్‌లో సినిమా కథ!
బ్రిటీష్ వారికి నిజామ్ రాజు ధారాదత్తం చేయగా అటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన సర్కారు జిల్లాలు, దత్తమండలాల ప్రాంతంలో కానీ, ఇటు నిజామ్ సొంత ఏలుబడిలో మరాఠ్వాడా, హుబ్లీ ప్రాంతాలతో కలసిన హైదరాబాద్ సంస్థానంలో కానీ సాగిన తెలుగు వారి సైలెంట్ సినిమా ప్రయాణం ఇవాళ్టికీ పూర్తిగా వెలుగులోకి రాని సమాచారఖని. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్ర స్ఫూర్తితో సినీ వ్యాసకర్త, పలు సినీ గ్రంథాల రచయిత హెచ్. రమేశ్‌బాబు ఇప్పుడు హైదరాబాద్ ప్రాంత మూకీ యుగ అంశాలను తవ్వి తీశారు. స్టీఫెన్ హ్యూస్ లాంటి విదేశీయుల నుంచి బి.డి. గర్గ లాంటి స్వదేశీయులు, స్థానిక విశ్వవిద్యాలయ పరిశోధకుల దాకా ఇప్పటికే పలువురు చేసిన శోధనలు, రచనల నుంచి కావాల్సినంత తీసుకొంటూ... అరుదైన ఫోటోలతో సహా అనేక పాత పుస్తకాల సమాచారాన్ని కలబోసి ఒకచోట అందించారు. ఈ పరిశ్రమ అభినందనీయం. అదే సమయంలో పరస్పర వైరుద్ధ్యాలనూ, పాత తప్పులనూ సరిచేసుకోవాలని మర్చిపోయి రచయిత తడబడ్డారు. చిత్రంగా ఈ రచనలో మద్రాసు ప్రాంత సినీచరిత్రను ఎత్తిరాయడంలోనూ తప్పులు దొర్లాయి. మద్రాస్‌లో తొలి సినిమా థియేటర్ (పేజీ 47), రఘుపతి వెంకయ్య ఆ హాళ్ళలో సిన్మాలు చూసి సినీరంగం వైపు వచ్చారనడం, ఆయన కుమారుడు ఆర్. ప్రకాశ్ హాలీవుడ్ దిగ్గజం సిసిల్ బి. డిమిలీ దగ్గర శిక్షణ పొందారనే (పేజీ 53) మాట... ఇలా అనేక తప్పుడు పాత పుకార్లనే మళ్ళీ అచ్చేశారు. హైదరాబాద్‌లో సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనలు ఎప్పుడు మొదలయ్యాయన్న విషయంలోనూ పొరబడ్డారు. మద్రాసులో తొలి సినీ ప్రదర్శనలు 1896 డిసెంబర్లో ఇచ్చిన స్థానికుడు టి.జె. స్టీవెన్సన్ ఆపై దక్షిణాది అంతటా పర్యటిస్తూ వచ్చి, తెలంగాణ గడ్డపై 1897 ఆగస్ట్‌లో ప్రదర్శనలు ఇచ్చారన్నది చరిత్ర. కానీ, అంతకు ఏడాది ముందే 1896 ఆగస్ట్‌లో జరిగాయని ఈ పుస్తకంలో చెబుతున్నవి– ఒక్కరే కంతలో నుంచి చూసే ‘పీప్ హోల్ షో’లు. అవి సినిమాకు ముందు రూపాలు. అందరూ ఏకకాలంలో చూసే సినిమాటోగ్రాఫ్లు కావని గ్రహించాలి. ‘1897 నాటికే సికిందరాబాదు నుండి మదరాసుకు ముడి ఫిలిం సరఫరా అయినట్టు పేర్కొన్నారు స్టీఫెన్ హ్యూస్’ (పేజీ 35) అని రమేశ్‌బాబు ఉట్టంకించారు. కానీ, ఆంగ్ల మూల రచనలో ఎక్కడా ఆ ఊసే లేదు. అలాగే, మూసీ వరదలపై టాపికల్ తీసింది ముంబయ్ కంపెనీ అని చరిత్ర చెబుతున్నా, సంబంధం లేని కలకత్తా మదన్ కంపెనీకీ, ధీరేన్ గంగూలీకీ ఊహల ముడి వేశారీ రచనలో. తెలుగు సినీ పితామహత్వం విషయంలోనూ ఈ పుస్తక రచయితకు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టున్నాయి. ఆ స్థానిక భావోద్వేగాలనూ, భిన్నాభిప్రాయాలనూ సానుభూతితో అర్థం చేసుకోవాల్సిందే! కానీ, ‘‘తెలుగు సినిమా మూలాలు తమిళనాట ఉన్నప్పుడు, తెలంగాణ సినీ పితామహుడు బెంగాలీయుడు (ధీరేన్ గంగూలీ) కావడంలో తప్పు లేదు’’ (పేజీ 22) అని పుస్తక రచయిత వాదన, అసలు మద్రాసు (చెన్నపట్నం) సహా నేడు తమిళనాడు అంటున్న ప్రాంతంలో సింహభాగం ఒకప్పుడు మన తెలుగు వారిదే! మన ఏలుబడిలోదే! ఆ చరిత్ర మర్చిపోతే ఎలా? ప్రదర్శన, స్టూడియో, పంపిణీ, చిత్రనిర్మాణం – నాలుగు సెక్టార్లలోనూ మూకీ యుగంలోనే కాలుమోపి, నాలుగింటా తెలుగువారిలో ప్రప్రథముడిగా నిలిచాడు గనకే వెంకయ్యను తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడన్నారు. దేశవిదేశాలకు తన సినీ ప్రదర్శన కృషిని విస్తరించి, మూకీ సినిమా తీసిన తొలి తెలుగువాడైన అలాంటి వ్యక్తిని కేవలం మద్రాసుకే పరిమితమన్నట్టుగా తగ్గించి చెప్పడం (పేజీ 51) భావ్యమా? అలాగే, ‘... మదరాసు రాష్ట్రానికి సంబంధించిన సినిమా విశేషాలన్నీ కూడా ఆ ప్రాంతానికే చెందుతాయి. కానీ, సమైక్య రాష్ట్రం ఏర్పడిన తరువాత అక్కడి పరిణామాలను తెలుగు సినిమా చరిత్రకు తొలిరోజులుగా చరిత్రకెక్కించారు’ (పేజీ 23) అని రచయిత నిందారోపణ చేశారు. నిజామ్ వదిలేశాక బ్రిటీషు ఏలుబడిలో, ప్రెసిడెన్సీలో, మద్రాస్ రాజధానిగా తెలుగు వారు గడిపినకాలం తెలుగువారిది కాకుండా ఎలా పోతుంది? తమిళుల చరిత్రను తెచ్చి తెలుగు సినిమా చరిత్ర అంటే తప్పు. అంతేకానీ, మద్రాసులో జరిగింది గనక తెలుగు వారి కృషైనా సరే తెలుగు సినీ చరిత్రే కాదని అనడం సబబా? ఒక్కమాటలో... ఇప్పుడు చేయాల్సింది ఆరోపణలు కాదు. ఆలోచనతో... మరుగునపడ్డ స్థానిక చరిత్రల పునర్నిర్మాణం. హైదరాబాద్ రాష్ట్రం సహా అంతటా తెలుగు వారి సినిమా ప్రస్థానంపై నిర్విరామ కృషి. నిరంతరం సాగాల్సిన ఆ ప్రయత్నంలో మన సినీ చరిత్రకు ఈ పుస్తకం అనేక లోపాలున్నా సరే ఓ కొత్త చేర్పు. మూకీల కాలంలోనే హైదరాబాద్ నుంచి బొంబాయికీ, సినీ రంగానికీ వెళ్ళిన పైడి జైరాజ్ సహా పలువురి సమాచారమే అందుకు సాక్ష్యం. లోటస్ ఫిలిం కంపెనీ – హైదరాబాదు (తెలంగాణ సినిమా మూకీ యుగం: 1896 –1932) రచన – హెచ్. రమేష్‌బాబు ప్రతులకు – అన్ని ప్రధాన పుస్తక విక్రయశాలల్లో. పేజీలు – 160, వెల – రూ. 150 – రెంటాల జయదేవ -
Vishwa Mahila Navala: తొలి నవలా రచయిత్రులకు పూమాల
మహిళా సృజనకారుల గురించీ, వారి జీవించిన సమాజం గురించీ, వారి రచనా స్వేచ్ఛ గురించి పరిశోధించి పాఠకుల చేతిలో పండు వలిచి పెట్టినట్లు రాయడంలో ఎంత శ్రమ, శ్రద్ధ, ఆసక్తీ అవసరమో కదా. అటువంటి ఆసక్తీ, శ్రమా శ్రద్ధల సమ్మేళనమే మృణాళిని ‘విశ్వమహిళా నవల’. ఇందులో జాపనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలలో తొలి నవలా రచయిత్రుల పరిచయం, వారి జీవించిన కాలంలో స్త్రీలకుండే పరిమితులూ, రచయిత్రుల జీవన శైలీ, రచనా శైలీ, వస్తువూ అన్నిటినీ విస్తృతంగా చర్చించారు మృణాళిని. ప్రపంచ సాహిత్యంలోనే మొదటి నవల రాసిన జాపనీస్ రచయిత్రి లేడీ మూరసాకీ (978–1014) నుంచి ఫ్రెంచ్ రచయిత్రి జార్జ్ సాండ్ (1804 –1876) వరకూ పదముగ్గురు రచయిత్రుల పరిచయం స్త్రీల సాహిత్య చరిత్రను మనముందు ఉంచుతుంది. లేడీ మూరసాకి వ్రాసిన ‘ది టేల్ ఆఫ్ గెన్జి’ ప్రపంచ భాషల్లోనే తొలి నవల అని విమర్శకులు గుర్తించారు. వెయ్యి పేజీల ఈ వచన రచన అప్పటికింకా ప్రాచుర్యంలో లేని నవలా ప్రక్రియను అవలంబించింది. 1వ శతాబ్దం మొదలు 19వ శతాబ్దం వరకూ ఆయా దేశాలలో ఉండే మహిళా రచయిత్రులు అక్కడి రాజకీయ పరిస్థితులు, సామాజిక నియమ నిబంధనలు, పితృస్వామ్యం... వీటన్నిటినీ తట్టుకుని నవలలు రాశారని ఈ పుస్తకం వల్ల తెలుస్తుంది. కొంతమంది రచయిత్రుల కృషి వారి జీవిత కాలంలో గుర్తింపబడకపోయినా... తరువాత కొంతమంది సద్విమర్శకుల వలన, స్త్రీవాదుల వలన గుర్తించబడింది. స్త్రీలు తమ స్వంత పేర్లతో రాయడానికి జంకి పురుషుల పేర్లతో రాయడం లేదా అనామకంగా రాయడం, ఎప్పుడైనా ధైర్యంగా రాయడం, రాజకీయాలను గురించి రాయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం... చివరకు నెపోలియన్నే నిలదీసి ఆయన ఆగ్రహానికి గురి కావడం ఈ పుస్తకంలో చూస్తాం. త్రికోణ ప్రేమ కథలు, హారర్ కథలు రాసిన తొలి రచయిత్రులు కూడా వీరు అయ్యారు. పల్లె సీమల అందాలని రొమాంటిసైజ్ చేయడం కాక అక్కడి ప్రజా జీవనాన్ని చిత్రించారు. కొందరు రచయిత్రులు ప్రఖ్యాత పురుష రచయితలకు ప్రేరణ కూడా అయ్యారు. సమాజం విమర్శించే జీవన శైలులు కూడా అవలంబించారు. ఈ పుస్తకానికి ఓల్గా కూలంకషమైన పరిచయం రాశారు. రచయిత్రుల జీవన కాలం, రచనా కాలం, వారి జీవిత విశేషాలు, అనుభవాలు... ఏదీ వదలకుండా ఒక సంపూర్ణ చరిత్రను... అందులోనూ ప్రపంచ మహిళా రచయితల చరిత్రను ఇష్టంగా మనకు అందించిన మృణాళినికి అభినందలు లేదా కృతజ్ఞతలు అనేవి చాలా పేలవమైన మాటలు. ప్రస్తుతం అన్ని విశ్వ విద్యాలయాల్లో స్త్రీ అధ్యయన కేంద్రాలు ఉంటున్నాయి. ఆ కేంద్రాలలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. (చదవండి: కళ్లు తెరిపించే కథా రచయిత్రి) ఇటువంటి వ్యాస సంపుటులు ఇంగ్లిష్‌లో ఉంటాయి కానీ తెలుగులో ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. ఇంగ్లిష్‌కన్నా తెలుగులో చదువుకోవడం సులభం కనుక యిది సాహితీ ప్రేమికులకూ చరిత్ర అభిమానులకూ మంచి కానుక. మరొక విషయమేమిటంటే ఇందులో మృణాళిని ప్రతి విదేశీ పదానికీ సరి అయిన ఉచ్ఛారణ ఇచ్చారు. ధృతి పబ్లికేషన్స్ ప్రచురించిన ‘విశ్వ మహిళా నవల’ హైదరాబాద్‌లోని నవోదయలో కొనుక్కోవచ్చు. చదువుతూ నాణ్యమైన సమయం గడపవచ్చు. - పి. సత్యవతి ప్రముఖ రచయిత్రి -
Varala Anand: ఆనంద్ అంతర్లోకాల చెలిమె
కవి తనని తాను చూసుకునే చూపు. అలాగే సమాజాన్ని చూసే చూపు. తనూ సమాజం కలగలసిన చూపు. విశాల విశ్వంలో తన చూపు ఆనే చోటు. ఇలాగ చూపులు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒక కవి తనలోకి అలాగే సమాజంలోకి చూసే దృక్కోణాలే కాకుండా– అతడు సమా జాన్ని తనలోకి ఒంపుకోవడం– అలాగే తను సమాజంలో కలగలిసిపోవడం. ఇలాగా ఎన్నెన్నో కోణాల నుంచి తనని తాను బేరీజు వేసుకునే కవి శ్రమించి తన కవితను తీర్చిదిద్దుతాడు. తనలో ఒక క్రమం. అలాగే సమాజంలోనూ ఓ క్రమం ఉంటుంది. క్రమం లేని తనమూ ఉండవచ్చు. ఇలా ఆలోచిస్తూ పోతుంటే కవి తనకు తాను సాధారణంగానూ, అసాధారణంగానూ తోచవచ్చు! ‘అక్షరాల చెలిమె’ అన్న వారాల ఆనంద్ కవితా సంపుటిని ఒకటికి రెండుసార్లు చదివినాక నాలో కలిగిన భావాలివి. ఆనంద్ భావకుడు. ఒక శిల్పి ఎలాగైతే తన శిల్పాన్ని తయారు చేస్తాడో అలాగే ఆనంద్ కవిత్వం చేయడంలో నేర్పరి. పుట్టుకతో మనిషి తెచ్చుకున్న బాధ ఉంది. రకరకాల అనుభూతులతో పాటు నేను న్నానని ఎప్పుడూ హెచ్చరించే బాధ ఉంది. బాధలు రకరకాలు. ఉండీ బాధ, లేకా బాధ. ఉండీ లేకా బాధ. ఒక్కోసారి బాధ కోసమే బాధ. సందర్భాన్ని బట్టి బాధ అలంకారమూ కావచ్చు. ఏది ఏమైనా సంతోషాన్ని నిరాకరించలేనట్టే బాధనూ నిరాకరించలేము. వేదన అన్నది మరొకటి. వేదనకీ, బాధకీ కొంత వ్యత్యాస ముంది. చాలా సందర్భాలలో వేదనకి బాధ మూలమై ఉంటుంది. ఉండకనూ పోవచ్చు. మనిషి జీవితంలో సందర్భాలు అనేకం. అందుకే వేదన సందర్భాన్ని అనుసరించి కూడా ఉండొచ్చు. ప్రారంభం లాగానే కొన్నింటికి ముగింపు కనిపిస్తుంది. కొన్నింటికి కనిపించదు. మరికొన్నింటికి కనిపించీ కనిపించని తనంలా తోస్తోంది. కదలిక– స్తబ్ధత, ఉదయం– సాయంకాలం, రాత్రి–పగలు, బాగుండడం– దిగులుగా ఉండడం, నవ్వు– ఏడుపు, ఆశ– నిరాశ, తీరం కనిపించడం– దరి దొరకకపోవడం, బతుకు– చావు... మానవ జీవితంలోని ద్వంద్వాలు ఇవి. ఉన్నవాటిని అంగీకరిస్తూనే, లేని వాటిని ఊహించడం. ఒక్కో సారి ఉన్నది వాస్తవం కాకపోవచ్చు. ఊహ సరైనది కావచ్చు. అలాగే ఉన్నది వాస్తవం అయినప్పుడు ఊహ సరైనది అయ్యే అవకాశం లేకపోవచ్చు. వాస్తవం– ఊహ అన్నవి నిజాలు. అలాగే అబద్ధాలూనూ! జీవితం నిజం. వాస్తవం. అంటే మన కంటితో చూస్తున్నది నిజమైతే – భౌతికంగా కనిపించే జీవితానికి పైన అద్దిన పన్నీ కూడా ఉంది. ఇవి రెంటినీ కలిపి చూస్తే – నీరెండ నీళ్ళపై తేలియాడే వెలుతురు. పసిపాప ముఖంపై సయ్యాటలాడే చిరునవ్వు. జీవితంలోని నిజాల్ని ఒప్పుకుంటేనే, జీవితం ముందూ వెనకా జరిగే సంఘటనలను నేర్పుగా పట్టుకోలేని అసాయత కూడా ఒకటి ఉంది. ‘విజయసూత్రం’ అనేది జీవితంలో అచ్చమైన నిజం కాదు. దానికి ముందూ వెనకా చాలా విషయాలు ఉంటాయి. జీవితం అన్నది అనేక అంశాల కూడలి. వాటి క్రమం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైవిధ్యభరితమైంది అది. వెలుగు నీడలూ, తెలుపు నలుపు అన్నవి ఎంత నిజమో; మానవ జీవితంలోని ప్రతి కదలికకి కలవరించి పలవరించడమూ అన్నది అంతే నిజం. సృజన కారుల్లో ఇది కాస్త మోతాదుని మించుతుంది. ఆనంద్ తను కవిగా చెందిన పరిణతి మనల్ని అబ్బురపరుస్తుంది. అలాగే అతడి జీవిత క్రమం కూడా! సామాన్యుల జీవితా లలో ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కాని అవి అంతగా పరిగణలోకి రావు. కాని సృజన కారుడి జీవితంలో జరిగే పరిణామాలు ఎన్నో వింతలూ విడ్డూరాల్ని సృష్టించవచ్చు. కారణం సృజనకారుడు సమస్య లోతుల్లోకి వెళ్ళి శోధిస్తాడు. అతడు ఇంకా సున్నిత మనస్కుడైనప్పుడు మనకు ‘అక్షరాల చెలిమె’ లాంటి విలువైన కవిత అందుతుంది. కవి ఇక్కడ జీవితంలోని అరలను, వాటిలోని వెలుగునీడల్ని మనకు పరిచయం చేస్తాడు. జీవితంలో తట్టుకొని... సంగీతాన్ని వినిపిస్తాడు. అందుకే ఆనంద్ కవిత్వమన్నా, జీవితమన్నా నాకు చాలా ప్రత్యేకమైనవి. మీరు కూడా ఈ కవితల ద్వారా ఎన్నో వింత వినూత్న అనుభవాలకు లోనౌతారని ఆశిస్తాను. (క్లిక్ చేయండి: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!) - బి. నరసింగరావు సినీ దర్శకులు, రచయిత -
పిల్లలు చెప్పిన పేరెంట్స్ కథ
తమ తల్లిదండ్రుల పెళ్లిళ్ల గురించి రాసిన ఇద్దరు రచయితల గురించి మాత్రమే నాకు ఇటీవలి వరకూ తెలుసు. ఒకరు నిగెల్ నికల్సన్. ఈయన రాసిన ‘పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ మ్యారేజ్’ పుస్తకం తన తండ్రి, రచయిత అయిన వీటా శాక్ విల్లే–వెస్ట్, హెరాల్డ్ నికల్సన్ మధ్య అస్థిరమైన, విశిష్టమైన సంబంధం గురించి చెబుతుంది. మరొకటి జరీర్ మసానీ రాసిన ‘అండ్ ఆల్ ఈజ్ సెడ్: మెమోయిర్ ఆఫ్ ఎ హోమ్ డివైడెడ్’ అనే పుస్తకం. శత్రుత్వం, పిచ్చితనం, అవిశ్వాసం వంటి కారణాల వల్ల మినూ మసానీ తన భార్య శకుంతల నుంచి విడిపోయిన ఉదంతాన్ని ఇది తెలుపుతుంది. ఆ రోజుల్లో ఆమె ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)లో చేరాలని భావించారు. కాగా మినూ మసానీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉండేవారు. వీరి ఉదంతం అప్పట్లో చాలా ఆసక్తి గొలిపింది. నేను ఇప్పుడే మూడో పుస్తకం కూడా చదివాను. దానిపేరు ‘సుమిత్ర అండ్ ఎనీస్ టేల్స్: అండ్ రెసిపీస్ ఫ్రమ్ ఎ కిచిడీ ఫ్యామిలీ’. ఇది సీమా చిస్తీ తల్లిదండ్రులు, అసాధారణమైందే అయినప్పటికీ వారి ప్రగాఢమైన ప్రేమ వివాహం గురించిన కథ. ఇది చాలా కొత్తగా, వైవిధ్యపూరితంగా ఉంది. నేను సీమా చిస్తీ వల్లే ఈ మూడో పుస్తకం చదివాను. ఆమె అప్పుడే కాలేజీ విద్య పూర్తి చేసి తన తొలి ఉద్యోగాన్ని నాతోనే ప్రారంభించింది. అందుకు ఈ పుస్తకం నా టేబుల్ వద్దకు వచ్చేసరికి దాన్ని తీసుకోకుండా ఉండలేకపోయాను. సుమిత్ర, ఎనీస్ వివాహం అసాధారణమైందని చెప్పాలి. ఆమె కన్నడిగ, హిందూ వ్యక్తి. అతడు ఉత్తరప్రదేశ్‌లోని దేవిరయా నుంచి వచ్చాడు. ముస్లిం. ఆమె అతడికంటే ఏడేళ్లు పెద్దది. ఇరు కుటుంబాల్లో ఎవరికీ చెప్పకుండానే పెళ్లాడారు. అదృష్టవశాత్తూ తర్వాత వారిని రెండు కుటుం బాలు సాదరంగా ఆహ్వానించాయనుకోండి! తమ కథను చెప్పడంలో, సీమ ఒక మార్మిక శైలిని స్వీకరించింది. కొన్నిసార్లు తన తల్లితండ్రులను మా అమ్మ అనీ, మా నాన్న అనీ రాసిందామె. కానీ చాలాసార్లు మాత్రం వారిని సుమిత్ర, ఎనీస్ అంటూ థర్డ్ పర్సన్ సింగ్యులర్ (ప్రథమ పురుష)లో రాసింది. నిజాయితీగా చెప్పాలంటే, ఇలాంటి హైబ్రిడ్ శైలిని మొదటిసారి చూశాను. ఇది చాలా ప్రభావశీలంగా ఉంది. న్యూఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో మెయిన్ స్ట్రీమ్ పత్రికా కార్యాలయం బేస్మెంట్లో సుమిత్ర, ఎనీస్ కలిశారు. దట్ ఓల్డ్ స్టేపుల్, ద హౌస్హోల్డర్, దిస్, ఇన్ 1964 వంటి సినిమాలు చూస్తూ వారి మధ్య ప్రేమ వికసించిందని సీమ రాసింది. మరింత ఎక్కువగా తన గురించి తెలుసు కోవడానికి ఆమె ఎన్నటికీ విముఖత చూపదని ఎనీస్కి అది సంకేతంలా కనిపించిది. కేవలం స్నేహితులుగా మాత్రమే తాము ఉండాల్సిన అవసరం లేదని ఆ సంకేతం ఎనీస్కి సూచించింది. ఇది కాల పరీక్షకు నిలిచిన సందర్భం. అది ఫలించింది కూడా! తన తల్లితండ్రుల నేపథ్యం, జీవితం, వారి ప్రేమ గాథ గురించి సీమ చెబుతున్నప్పుడు అన్నీ వివరించి చెప్పలేని నిరాకరణ కనిపించింది. అలాంటి పరిస్థితి మీలో మరింత ఆకాంక్షను రేపుతుంది. సుమిత్ర, ఎనీస్ ఇద్దరూ ఎగువ తరగతి వారే. అత్యంత వేడిగా ఉంటూ మిత్రపూరితంగా లేని నగరంలో తమకంటూ ఒక గూడుకోసం, కనీస వనరుల కోసం ప్రయత్నిస్తూ తొలి తరం వలసవచ్చినవారి గురించిన కథ వీరిది. జీవించడానికి 1960లలో ఒక నివాసం కోసం వెతకటం అనేది ఇప్పుడు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలాగే ఉంటుంది. ఒక సందర్భంలో లీజుపై సంతకం పెట్టిన తర్వాత ఎనీస్ అంటే అనీష్ (హిందువు) కాదని ఇంటి యజమానురాలికి అర్థమైపోయి ఆ లీజును వెనక్కు తీసుకుంది. పెళ్లయిన సంవత్సరానికి సీమ పుట్టింది. తన పేరును అలా పెట్టడం తనకు గమ్మత్తుగా ఉండిందని సీమ ఒప్పు కుంది. ఎనీస్ తల్లి నీలిరంగు ఉత్తరంలో బోలెడన్ని సూచనలు రాసి పంపింది. సుమిత్ర ఆ సూచనలను పాటిం చింది. తన భర్త ఇంటిపేరు పెట్టుకోవడానికి ఆమె స్వచ్ఛందంగా సిద్ధపడిపోయింది. నిఖా పట్ల సంతృప్తి చెందింది. కానీ ఆమె కూతురు విషయానికి వచ్చేసరికి సీమ అనే పేరు పెట్టడంలో కాస్త సందిగ్ధత ఏర్పడింది. సీమ అనే పేరు హిందూ, ముస్లిం రెండు మతాల పేరును స్ఫురించడంతో సరిగ్గా సరిపోయింది. అయితే తన పేరు గురించి సీమ పెద్దగా పట్టించు కోలేదు కానీ, సుమిత్ర–ఎనీస్ కథలో పేర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రెండు పేర్లకూ ఒకే అర్థం ఉంది. ఎనీస్ అంటే అరబిక్‌లో మంచి మిత్రులు అని అర్థం. సుమిత్ర అనే సంస్కృత పదానికీ అదే అర్థముంది. ఈ ఇద్దరికీ సంబంధించిన ఉమ్మడి లక్షణాల్లో పేర్లు కూడా కలిసిపోయాయి. ఈ పుస్తకంలో సగంపైగా తల్లి తన కుమార్తెకు ఎంపిక చేసే వంటకాల గురించే ఉంటుంది. అయితే ఆ కుమార్తెకు వాటిని చేసేంత సమయం ఉండదు. పైగా వాటిని ఆమె ఒప్పుకోదు. అవి సబ్టైటిల్ని మాత్రమే వివరిస్తాయి. కానీ అవి దేన్నో సూచిస్తాయి. ఆమె తల్లిదండ్రుల వివాహం ఇరుమతాల సంగమం, కలిపిన కిచిడీ లాంటిది. దీనికి మించి మెరుగ్గా నేను ఈ పుస్తకం గురించి వర్ణించలేను. తొలి నామవాచకం ఇరువురూ ఒక చెంతకు వచ్చి, ఒకే అస్తిత్వంగా మారిపోవడాన్ని సూచిస్తుంది. ఇక రెండోది ఒక కొత్త ఆనందకరమైన దాన్ని రూపొందిం చేందుకు వివిధ భాగాలను తెలివిగా, ఉద్దేశపూర్వకంగా కలపడాన్ని సూచిస్తుంది. (క్లిక్: సంఘీభావమే పరాయీకరణకు మందు) మినూ, శకుంతల దంపతుల లాగా సుమిత్ర, ఎనీస్ పోరాడారా లేక వీటా, హెరాల్డ్ లాగా విభిన్న మార్గాలను అనుసరించారా అనేది నాకు తెలీదు. సీమ కథ అంతవరకూ తీసుకుపోలేదు. కానీ అది మంచిదే. తల్లితండ్రుల అసమ్మ తిని పిల్లలు ఏ మేరకు వెల్లడించవచ్చు అనే అంశంలో ఒక పరిమితి ఉంటుంది. సామరస్యపూర్వకమైన స్నేహం ఆహ్లాదకరమైన పఠనానికి తావిస్తుంది కదా! (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం) - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
Book Review: అనువాదం ఒక సవాలు
‘భిన్న నేపథ్యాలు, కులాలు, మతాలు, ఇతివృత్తాలు, కథ నాలు, మాండలీకాలు ఉన్న 26 కథలను ఆంగ్లంలోకి అనువాదం చేయడమెట్లా? వాటిలోని విభిన్నతను, ప్రత్యేకతను అనువాదంలోకి తీసుకురావడమెట్లా?... ఇవీ అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్‌లకు ఈ పుస్తకం అనువాదం సమయంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు. ఇంగ్లిష్ అనువాదంలో వెలువడ్డ తెలుగు కథల సంక లనం ‘తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్’కు ఓల్గా సంపాదకులు. హార్పర్ పెరెన్నియల్ వాళ్ళు ప్రచురించారు. ‘గత ముప్పై ఏళ్ళల్లో వచ్చిన ముఖ్యమయిన కథల్లోంచి ఎంపిక చేసుకున్న ఈ 26 కథలు భారతీయ పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిస్తే నా యత్నం, ప్రచురణకర్తల ఉద్దేశం, అనువాదకుల ప్రయత్నం నెరవేరినట్లే’ అంటారు ఓల్గా. ఈ పుస్తకంలోని రచనలనూ, రచయితలనూ తెలుగు పాఠకులకు పరిచయం చేయా ల్సిన అవసరం లేదు. ఈ కథలన్నీ మనల్ని కదిలించినవే, ఆలోచింప జేసినవే. తెలుగు కథకు సరిగ్గా నూటా ఇరవై ఏళ్ళు. వేలాది కథలు, వందలాది కథల సంపుటాలు ఈ శతాబ్ద కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా 1990 నుండి వైవిధ్యమైన భావజాలాలు, అస్తిత్వాలు తెలుగు పాఠకులను కదిలించాయి. ఆ భిన్నత్వం అనుభవం నుండి, ప్రతిఘటన నుండి, ఉద్యమాల నుండి వచ్చింది. ఏ గొంతులు, మనుషులు, జీవితాలు, భాషలు సాహిత్యానికి వెలుపల ఉంచబడ్డాయో సరిగ్గా అవే, సాహిత్యం అంటే ఇదీ– కథ అంటే ఇదీ అంటూ ముందు కొచ్చాయి. అలాంటప్పుడు అన్ని కథల్లోంచి ఇరవై ఆరు కథలు ఎంపిక చేయాలంటే ఓల్గా తన ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, కష్టమయిన పనే. ఈ సంకలనంలో సతీష్ చందర్ ‘డాగ్ ఫాదర్’, ఎండ్లూరి మానస ‘బొట్టు భోజనాలు’, పెద్దింటి అశోక్ కుమార్ ‘జుమ్మే కి రాత్’, కరుణ ‘నీళ్లు చేపలు’, పి. సత్యవతి ‘ఇట్లు స్వర్ణ’, కోట్ల వనజాత ‘ఇత్తు’, ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి ‘సముద్రపు పిల్లోడు’, వి. ప్రతిమ ‘మనిషి విత్తనం’, వి. చంద్రశేఖరరావు ‘ద్రోహ వృక్షం’, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బినామీ’, సన్నపురెడ్డి వెంక ట్రామిరెడ్డి ‘సేద్దెగాడు’, ఎం.ఎం.వినోదిని ‘ఒక విలన్ ఆత్మ హత్య’, కె.ఎన్. మల్లీశ్వరి ‘రెండంచుల కత్తి’, మల్లిపురం జగదీశ్ ‘ఇప్ప మొగ్గలు’, కేతు విశ్వనాథరెడ్డి ‘అమ్మవారి నవ్వు’, కొలకలూరి ఇనాక్ ‘కొలిమి’, మహమ్మద్ ఖదీర్ బాబు ‘గెట్ పబ్లిష్డ్’, జూపాక సుభద్ర ‘ఎంపీటీసీ రేణుకెల్లు’, అక్కినేని కుటుంబరావు ‘పనివాడితనం’, కె.వరలక్ష్మి ‘మంత్రసాని’, అట్టాడ అప్పల్నాయుడు ‘బతికి చెడ్డ దేశం’, షాజహానా ‘సిల్సిలా’, జి.ఆర్.మహర్షి ‘పురాగానం’, బి.ఎస్.రాములు ‘మెరుగు’, ఓల్గా ‘సారీ జాఫర్’, కుప్పిలి పద్మ ‘వే టు మెట్రో’ కథలు ఉన్నాయి. పలు భాషలు, పలు రాతలు, పలు రచయి తలు, పలు సందర్భాలు, పలు కాలాలు, కానీ ఒక అనువాదం! అందుకే అనువాదాన్ని పలు అంచుల కత్తి అనడం అతిశయోక్తి కాదేమో. తాము లేవనెత్తిన చర్చకు సమాధానమే అన్నట్లుగా, రచనల, రచయితల విభిన్నతను అనువాదాల్లోకి తీసుకు రావడానికి అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్ తెలుగు పదాలను, ఉర్దూ మాటలను యథాతథంగా ఆంగ్లంలోకి తీసుకొచ్చారు. ‘నా తమిళ జీవితాన్ని, అనుభవాన్ని ప్రతిఫలించే ఆంగ్లం కావాలి’ అని మీనా కందసామి అన్న మాటలు గుర్తొస్తాయిక్కడ. అనువాదం అనువాదంలాగా ఉండాలా, అసలులాగే ఉండాలా, పదకోశం ఇవ్వాలా లేదా పాఠకులే కొంత ప్రయత్నించి అర్థం చేసుకోవాలా అన్న చర్చలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అయితే మూల కథలోని పదాలను అనువాదంలో అలాగే ఉంచేయడం ఎప్పుడూ ఒకలాగే పని చేయకపోవచ్చు. రచనల్లోని విభిన్నతే వాటిలోని నిగూఢ అర్థాలకు కూడా వర్తిస్తుంది కదా. (చదవండి: కాలానికి ముందు పయనించిన కవి) – కె. సునీతారాణి -
Book Review: మత్తెక్కించే ‘మధుశాల’
‘మధుశాల’ మత్తెక్కిస్తుంది. అలసిన ఆత్మలను ఆదమరపించి, అంతర్లోకాల సందర్శనం చేయిస్తుంది. శుష్కవచనం కవిత్వంగా చలామణీ అవుతున్న తెలుగునేల మీద– ఆరుతడి కవిత్వమే అపురూపంగా మారిన రోజుల్లో తన గుండెతడినే కవిత్వంగా మలచి మధువొలకబోశారు అనిల్ బత్తుల. ‘మధుశాల’లలోని కవితలు పురాతన మధువులాంటి పరిమళంతో చదువరులను మత్తెక్కిస్తాయి. మైకం, మోహం జమిలిగా జుగల్బందీ చేసిన కవితలివి. జీవన బీభత్సాన్ని సుందరమైన మధుపాత్రలో దర్శింపజేసే కవితలివి. మత్తెక్కించినట్లే ఎక్కించి, చెర్నాకోలతో చరిచినట్లుగా ఒక్కసారిగా మత్తొదిలించే కవితలూ ఇందులో ఉన్నాయి. (క్లిక్: నూరు నాటకాలు.. ఆరు సంకలనాలు) ‘అప్పుడు నా వయసు పన్నెండు గొర్రెలు కాచే పేద నల్లపిల్లను/ మా గ్రామదేవతలా చక్కటి కళ నా మొహంలో ఉండేది/ సమర్తాడిన వారానికి మా ఇంటి పక్కావిడ నా కన్నెరికాన్ని లక్షరూపాయలకు/ మా ఊరి వర్తకుడికి అమ్మేసింది/ ఆ రాత్రి నాకు చేరిన నా రక్తపు ముద్ద విలువ రెండువేలు మాత్రమే’... ఎంతటి బీభత్సం! లోకంలో ఇలాంటి బీభత్సం సర్వసాధారణం. యాంత్రికలోకంలోని సర్వసాధారణ బీభత్సాన్ని తట్టుకోవడం సున్నితహృదయులకు దుస్సాధ్యం. తట్టుకోవాలంటే ‘మధుశాల’లోనికి అడుగుపెట్టాల్సిందే! -
నూరు నాటకాలు.. ఆరు సంకలనాలు
‘నాటకం తరతరాల నుంచి మానవ సంస్కృతిలో ఒక భాగంగా ఉంటూ వస్తున్నది. మిగిలిన ఏ ఇతర సాహిత్య ప్రక్రియ ఇవ్వలేని ఆత్మతృప్తి నాటకం ఇస్తున్నది’ – ఆచార్య మొదలి నాగభూషణ శర్మ. ఒక జమీందారీ హయాంలో పెత్తనం చలాయించే రాజోద్యోగులు చేసే దుష్టచర్యలను గ్రహించి విచారించి వారికి దేశ బహిష్కరణ శిక్ష విధించి పరిస్థితులను చక్కదిద్దిన ఇతివృత్తంతో నడిచిన నాటకం ‘నందక రాజ్యము’. గుంటూరు సీమలోని రేపల్లె ప్రాంతానికి చెందిన కారుమూరు గ్రామవాసి వావిలాల వాసుదేవశాస్త్రి ఈ నాటక రచయిత. తెలుగులో తొలి సాంఘిక నాటకం ‘నందక రాజ్యము’. రచనా కాలం 1880. తెలుగునాట శతాబ్ది కిందట కొనసాగిన వృద్ధ వివాహ దురాచారాన్ని ‘నిర్మాణ కాలంలో కల్యాణమా? మరణశయ్య మీద మంగళహారతులా?’ అని ప్రశ్నిస్తూ పానుగంటి లక్ష్మీనరసింహారావు 1910లో రచించిన ‘వృద్ధ వివాహము’ నాటకం ఆనాటి సాంఘిక దురాచారాల్ని నిరసించింది. (చదవండి: కళ్లు తెరిపించే కథా రచయిత్రి) స్వాతంత్య్రోద్యమకాలంలో అమృతసర్ జలియన్‌వాలాబాగ్‌లో 1919 సంవత్సరం ఏప్రిల్ 13న (నేడు వామపక్షాలు మృతవీరుల దినంగా జరుపుకుంటున్న రోజు) జరిగిన ఘోర దురాగతానికి పౌరాణిక రూపమిచ్చి దేశభక్తిని రగిల్చిన నాటకం ‘పాంచాల పరాభవము’. గుంటూరుకు చెందిన న్యాయవాది దామరాజు పుండరీకాక్షుడు 1921లో రాసిన ఈ నాటకం నిషేధానికి గురైంది. నాటక రచనల వలన జైలుపాలైన దేశభక్తుడీ రచయిత. ‘ఈ పంజాబు దుండగాలు ఆరని అగ్రిహోత్రమై మన దాస్య బంధనములను దహించివేయును’ అనే తీవ్ర ధర్మాగ్రహాన్ని ప్రదర్శించిన నాటకం ‘పాంచాల పరాభవము’. 1880లో ప్రారంభమైన తెలుగు నాటకం 2020 వరకూ అంటే ఈ 140 ఏళ్లలో సమాజంతోపాటు నడుస్తూ, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ, సామాజిక చైతన్యాన్ని కలిగిస్తూ ప్రగతిశీల దృక్పథంతో నడిచిందనటానికి నిదర్శనంగా ఈ మూడు నాటకాలను రేఖా మాత్రంగా పరిచయం చేశాను. (చదవండి: జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు) ఈ నూటా నలభై ఏళ్ల కాలంలో తెలుగు సామాజిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ ప్రజా సమూహాలకు చేరువైన నూరు నాటకాలను సంకలనం చేసి సుమారు ఐదువేల పేజీలతో ఆరు నాటక సంకలనాలుగా అందించారు వల్లూరు శివప్రసాద్, గంగోత్రి సాయి. నాలుగు దశాబ్దాలుగా నాటకంతో ప్రయాణిస్తున్న ఈ ఇరువురూ తెలుగు నాటకరంగానికి అందించిన అపూర్వకానుకలు ఈ సంకలనాలు. గతంలో ‘ప్రసిద్ధ తెలుగు నాటికలు’, ‘ప్రసిద్ధ తెలుగు హాస్యనాటికలు’, 108 నాటికలను రెండు సంకలనాలుగా, ‘ప్రసిద్ధ పిల్లల నాటికలు’ సంకలనాన్ని అందించిన చరిత్ర ఈ సంపాదకులకు ఉంది. (మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన) అరవింద ఆర్ట్స్, తాడేపల్లి, గుంటూరు జిల్లా, తానా ప్రచురణలు – ఉత్తర అమెరికా ప్రచురించిన ఈ సంకలనాలను భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 19 నవంబర్ 2021న హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. తెలుగు నాటకానికి తేజస్సునూ ఓజస్సునూ కలిగించిన వారు గురజాడ వెంకట అప్పారావు. 1897లో తొలి ముద్రణ పొంది 1909లో నూతన జవజీవాలు పోసుకొని ప్రజల చేతికీ, నోటికీ అందిన తొలి నాటకం కన్యాశుల్కం. తెలుగులో వాడుక భాషలో వచ్చిన కన్యాశుల్కం పాశ్యాత్య పోకడలను పోయి ‘సోషల్ కామెడీ’ని అందించింది. సామాజిక ప్రయోజనాలను సాధించింది. గురజాడ మార్గంలో ఆధునిక తెలుగు కథ, గీతం నడిచినట్లుగానే నాటకమూ నడిచింది. (కన్యాశుల్కం అందుబాటులో ఉన్నందున ఈ సంకలనాలలో ఆ నాటకాన్ని సంపాదకులు చేర్చలేదు) అందుకు సాక్ష్యాలు ఈ వంద నాటకాలు. ‘సంఘ సంస్కరణాభిలాషతో ప్రారంభమైన సాంఘిక నాటకం జాతీయోద్యమకాలంలో దేశభక్తి ప్రబోధంగా నిలబడి ప్రజలను ఉద్యమ కార్యోన్ముఖులను చేసింది. స్వతంత్రం ప్రకటించిన తదుపరి భారతదేశంలో చెలరేగిన మత కలహాలను నిరసించింది. కులం, మతంలాంటి సాంఘిక దురాచారాల్ని దుయ్యబట్టింది. బొగ్గుగని కార్మికుల సమస్యలను ఎత్తి చూపింది. స్వాతంత్య్రానంతర కాలంలో స్వదేశీ పాలనలో వేళ్లూనుకొంటున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని, స్వార్థపూరితమైన ఓట్ల రాజకీయాల్ని ఎండగట్టింది. కార్మికులు, కర్షకులు, కూలీనాలీ జనం శ్రమదోపిడీని ఎలుగెత్తి చూపింది. ఆకలి, నిరుద్యోగం, వైవాహిక సమస్యలు, భూమి సమస్య, శ్రమ దోపిడీ, దళారి వ్యవస్థ, రాజ్యహింస, దళిత సమస్యలు, విద్యావిధానంలోని మార్పులు, విద్య కార్పొరేటీకరణ, విద్యార్థులపై ఒత్తిడులను చర్చించింది. పట్టణ ప్రాంతపు ప్రజల సాధకబాధకాలను దృశ్యమానం చేయగలిగింది. పురుషాహంకారం, స్త్రీల సమస్యలు, స్త్రీ, పురుష సంబంధాలలోని లోటుపాట్లు, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విద్య, మానవ సంబంధాల్లో లోపిస్తున్న మానవీయత మొదలగు అనేక అంశాలను అభ్యుదయ దృష్టితో చర్చించగలిగింది’. తెలుగు నాటకం – సామాజికత శీర్షికన సంకలన సంపాదకుడు వల్లూరు శివప్రసాద్ రాసిన ఈ మాటలు ఈ వంద నాటకాల సారాల్ని మన ముందుంచాయి. ఈ మాటలతో పాటు ‘తెలుగు నాటకం నిరాడంబరంగా కొనసాగిందేమో కాని నిష్ప్రయోజనంగా మాత్రం అపఖ్యాతిని మూటగట్టుకోలేదు. తెలుగు నాటకం సామాన్యుల కోసం రాయబడింది. సామాన్యుల ప్రయోజనం కోసం ఆడింపబడింది. సామాజిక అభ్యున్నతి కోసం నిలబడింది’. శివప్రసాద్ చెప్పిన మాటలు తెలుగు నాటక చరిత్రను పరిశీలిస్తున్న వారూ, పరిశోధిస్తున్న వారూ నిజమేనంటారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నట్లు, ఈ వంద నాటకాలు నిస్సందేహంగా ఒకటిన్నర శతాబ్దపు సమాజ చరిత్ర రచనకు విశ్వసనీయమైన ఆధారాలుగా నిలుస్తాయి! ఈ నాటకాల రచయితలు ప్రసిద్ధులు. ప్రతి నాటకమూ ఒక ప్రత్యేకతతో కూడుకున్నదే. అనేకం ప్రదర్శనాపరంగా జయప్రదమైనవే. జీవద్భాషను మాట్లాడినవే. మొత్తంగా తెలుగు సమాజాన్ని మన ముందుంచిన ఈ నాటక సంకలనాలను ఆదరించాల్సిన బాధ్యత తెలుగు సమాజానిది. ఏ అకాడమీలో, పీఠాలో, విశ్వవిద్యాలయాలో చేయ్యాల్సిన ఈ పనిని వారెవరూ చెయ్యకపోయినా, చేస్తారని ఎదురు చూడకుండా అభ్యుదయ రచయితల సంఘంతో, ప్రజా సాంస్కృతికోద్యమంతో ప్రగాఢ సంబంధాలున్న వల్లూరు శివప్రసాద్, గంగోత్రి సాయి ఎంతో శ్రమకోర్చి సాహిత్యం, సమాజం పట్ల బాధ్యతతో ఈ సంకలనాలను అందించినందుకు మాటల్లో అభినందనీయులు. – పెనుగొండ లక్ష్మీనారాయణ ‘అరసం’ జాతీయ కార్యదర్శి -
Book Review: తేనెటీగ కాదది విషపు తేలు
‘తేనెటీగ కాదది విషపుతేలు’ పుస్తక సంపాదకులు ఈదర గోపీచంద్ అంకిత భావం గల గాంధేయవాది. 1988 అక్టోబర్‌లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో మల్లాది వెంకటకష్ణమూర్తి మందారమకరందాన్ని మించిన సెక్సైటింగ్ నవల ప్రచారంతో ‘తేనెటీగ’ను సీరియల్‌గా ప్రచురించడం ప్రారంభించాడు. అందులో బూతుజోకులు, అసభ్యరేఖాచిత్రాలు పాఠకులపై విషం చిలకరిస్తున్న డర్టీ సీరియల్‌ను గోపీచంద్ చదివి అశ్లీల ప్రతిఘటనా వేదిక ద్వారా సీరియల్ ప్రచురణ ఆపించేందుకు మూడేళ్లపాటు (1989–91) అవిరళపోరాటం చేశాడు. ఒక సామాన్యకార్యకర్తగా ఆయన మొదలుపెట్టిన ఉద్యమం ప్రముఖ రచయితలు, 16 అభ్యుదయసంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, స్వాతంత్య్రసమరయోధులు, మహిళలు, విద్యార్థినులను భాగస్వాములుగా చేసి మహోన్నత సాంఘికపోరాటంగా మలచి విజయం సాధించాడు. ఈ నవలను తర్వాత సినిమా తీసేటప్పుడు అశ్లీల ప్రతిఘటనా వేదిక తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. రచయిత మల్లాది ఆంధ్ర భూమి దినపత్రికలో తన వాదాన్ని, సమర్ధించుకుంటూ ‘రచయితలకు స్వేచ్ఛ లేదా? అనే వ్యాసాన్ని రాశాడు. ప్రముఖ పాత్రికేయులు, అప్పటి ఆంధ్రభూమి సంపాదకులు డా. ఎ.బి.కె. ప్రసాదు ‘అక్షరం’ శీర్షికలో చర్చావేదిక ప్రారంభించారు. ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ మల్లాది వాదాన్ని ఖండిస్తూ సుదీర్ఘమైన వ్యాసం రాశారు. నిఖిలేశ్వర్, పాపినేని శివశంకర్, విరసం కృష్ణాబాయి, కొత్తపల్లి రవిబాబు, బీరం సుందరరావు, రావి రంగారావు వంటి రచయితలు మల్లాదిపై ఎదురు దాడి చేసి రచయిత స్వేచ్ఛకు హద్దులుండాలనీ, బాధ్యతలుండాలనీ సూచించారు. ప్రజాసాహితి, అరుణతార వంటి పత్రికలు ఈ చర్చను కొనసాగించాయి. ఎందరో రచయితలు తమ అభిప్రాయాలను వ్యాసాలుగా రాశారు. ఈ పోరాట ఫలితంగా గోపీచంద్ విజయం సాధించినట్టే సంపాదకుడు ఈ పుస్తకాన్ని 11 అధ్యాయాలుగా వర్గీకరించి విశ్లేషణాత్మకంగా సమగ్ర సమాచారంతో రూపొందించాడు. ప్రతి అధ్యాయం ఆరంభంలో ప్రధానమతాల నుంచీ లేదా మహా పురుషుల రచనల నుంచి నైతిక విలువలను బోధించే సూత్రాలతో ప్రచురించడం ఔచిత్యంగావుంది. మొదట అధ్యాయం నాందిలో ఈ ఉద్యమానికి ప్రేరకులు న్యాయవాది కాంతారావు గారి సహకారాన్ని వివరించారు. తక్కిన అధ్యాయాల్లో ఆంధ్రభూమి ‘అక్షరం’ శీర్షికలో వచ్చిన ప్రముఖ రచయితల వ్యాసాలు, పాఠకుల, ప్రేక్షకుల స్పందనలను చేర్చారు. అనుబంధంతో కేంద్రమంత్రి ఉపేంద్రగారితో ఉత్తర ప్రత్యుత్తరాలను తేనెటీగ కన్నడ అనువాదం ‘భ్రమరం’ ఆపాలన్న డిమాండ్ వంటివి చేర్చారు. గోపీచంద్ పోరాట ఫలితంగా మూడు దశాబ్దాలకు (2020) రచయిత మల్లాది పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ గోపీచంద్ నిజాయితీని ప్రశంసించారు. చెత్త నవలలను పునర్ ముద్రించనని ప్రతిజ్ఞ చేశాడు. అశ్లీల ప్రతిఘటనా ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరాడు. సామాజిక పోరాటస్పూర్తితో, పాత్రికేయ అనుభవంతో సంపాదకులు ఈ గ్రంధాన్ని సముచితంగా కూర్పు చేశారు. పాత్రికేయ, సాహితీ, నైతిక, సామాజిక, అభ్యుదయ ప్రగతి భావుకులు విధిగా చదవదగిన గ్రంధం ‘తేనె టీగ కాదది విషపు తేలు’. – డా. పి.వి. సుబ్బారావు తేనె టీగ కాదది విషపు తేలు వెల 120/రూ.; పేజీలు 196. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం. వివరాలకు: ఈదర గోపీచంద్ 9440345494 -
అక్షరాలతో ఆలయాల అద్భుత యాత్ర
‘‘గుడి అంటే కేవలం ఒక రాతిబొమ్మ మాత్రమే కాదు. గుడి ఒక భావన . ఎప్పుడో ఏ పురాణ కాలంలోనో జరిగిన ఏ ఘట్టంతోనో గుడి ముడి పడి ఉంటుంది. శతాబ్దాల క్రితం చెక్కిన శిల్పం, వందల ఏళ్లుగా మొక్కుతున్న దైవం, ధ్వజస్తంభం పాదాల వద్ద శతాబ్దాల దీపమాలికల నూనె చారికలు, మోగి మోగి ముసలివైనా కంఠం మూగవోని గంటలు కూడా కథలెన్నో చెబుతాయి’’ అని కస్తూరి రాకా సుధాకర్ రావు తన ‘అడుగడుగునా గుడి ఉంది’ అనే పుస్తకంలో తన మాటలుగా చెప్పుకున్నారు. 25 ఆలయాల చరిత్ర ఉన్న ఈ పుస్తకంలో ఆయా ఆలయాలకు సంబంధించిన విశేషాలన్నీ ఇప్పటికే కొన్ని వందలు, వేల వాట్సాప్ గ్రూపులలో రచయిత పేరు లేని షేర్లుగా చాలా మంది చదివినవే కావచ్చు. అయితే ఇంకా ‘స్మార్ట్’ కాని వారు, సామాజిక మాధ్యమాలకు కాస్త దూరాన్ని పాటించేవారు ఇందులోని విషయాలను హాయిగా చదివి మనో నేత్రాలతోనే ఆయా ఆలయాలను దర్శించి ఆత్మానందాన్ని పొందుతారు. ‘గూగుల్ తల్లికి తెలియని గుడి’ అంటూ గోల్కొండ నుంచి భువనగిరి వెళ్లే మార్గంలో అప్పటికే కొన్ని వందల ఏళ్ల నుంచి విలసిల్లుతూ, శిథిలావస్థకు చేరి, అక్కన్న మాదన్నలు పునరుద్ధరించిన వేణుగోపాలుడి ఆలయం గురించిన విశేషాలు అబ్బుర పరుస్తాయి. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో తలపై నిప్పుల కుంపటి పెట్టుకుని పదిహేను వందల ఎకరాలలో నడయాడి మరీ జాగీర్దార్ను మెప్పించి పెరుమాళ్లు పంతులు కట్టించిన వరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి చదువుతుంటే తెలియని తన్మయత్వం కలుగుతుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం ముదిగోళం గ్రామంలోని ఎలుక జోస్యం చెప్పే ఆలయం, (చిలక జోస్యం కాదు) కోరిన కోరికలు తీర్చే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి గుడి... ఇంకా ఎన్నో విశేషాలతో కూడిన రాకా రాతలకు తోడు ఆయా ఆలయాల అసలు శిల్పాలతో పోటీపడే వేణు మాధవ్ గీతలు... చదువరులకు విందు భోజనమే. రచయిత సీనియర్ పాత్రికేయులు కావడంతో వ్యర్థ పదాలు, అనవసర వాక్యాలు లేకుండా పుస్తకంలోని అన్ని శీర్షికలూ ఆసక్తిగా చదివిస్తాయి. అడుగడుగున గుడి ఉంది రచన: కస్తూరి రాకా సుధాకర్ రావు పుటలు: 146; వెల రూ. 100 ప్రతులకు: ప్లాట్ నం. 79, వీ ఆర్ ఆర్ ఎన్క్లేవ్ దమ్మాయిగూడ, హైదరాబాద్– 500 083 ఫోన్: 9000875952 జ్ఞాపకాల గుబాళింపు సాధారణంగా డాక్టర్ అనగానే వంటికి తెల్లకోటు, మెడలో స్టెత్, డెటాల్, స్పిరిట్.. ఇప్పుడైతే శానిటైజర్ వాసనా గుప్పుమంటాయి. అయితే ఈవిడేమిటీ, ముఖ పుస్తకం నుంచి ముద్రణాలయాల వరకూ... మామూలు పుస్తకాల నుంచి మహనీయుల మాటల దాకా దేనినీ వదలకుండా పూల గుత్తిలా గుచ్చి దానిని సింపుల్‌గా ‘ఒక భార్గవి’ అని చెప్పేశారు... ఈవిడ మెడికల్ డాక్టరే కాదు.. లిటరరీ డాక్టర్ కూడానేమో అనిపిస్తుంది ఈ పుస్తకం చదివాక. జ్ఞాపకాల పొదరిల్లు అంటూ తను కన్ను తెరిచాక చూసిన ఇంటి జ్ఞాపకాలతో మొదలు పెట్టిన భార్గవి ‘మోహనం... సమ్మోహనం’ లో మోహన రాగాన్ని వినిపించారు. దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారి స్వీయచరిత్ర గురించి చెప్పుకొచ్చారు. అమ్మ కన్నా పెద్ద అమ్మతో తన ఆత్మీయతానుబంధాన్ని వర్ణించారు ‘మమతల పాలవెల్లి మా అమ్మ’లో. ఆ తర్వాత మంగళంపల్లి వారి సురాగాల జల్లులోనూ, పెదనాన్న జ్ఞాపకాలతోనూ గుండె తడి చేస్తారు. తర్వాత ఆపాత మధురం అనే మ్యూజికాలజిస్ట్ హాసం రాజాగారి పుస్తకాన్ని సమీక్షిస్తారు. ఇంకా బోలెడన్ని పండుగలు, పర్వదినాల జ్ఞాపకాలతో గుమ్మెత్తిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వృత్తి వైద్యమే అయినా, ప్రవృత్తి అయిన సంగీత, సాహిత్యాల లోతులు తరచే ప్రయత్నంలో సినిమాలూ, పుస్తకాలూ, ప్రముఖ వ్యక్తుల గురించి రాసిన ఈ వ్యాసాల సంకలనంలో తడమని అంశమంటూ లేనే లేదు. ఒక పక్క పాఠక దేవుళ్లకి సాహితీ నైవేద్యం పెడుతూనే, మరో చెంప అవసరమైన చోట తన వృత్తిగతమైన వైద్య విషయాలను కూడా అలవోగ్గా అందించేయడం ఈ డాక్టరమ్మ కలంకారీతనానికి అద్దం పడుతుంది. అందమైన అక్షరాలు, వాటికి తగ్గట్టు గిరిధర్ గౌడ్ గీచిన చక్కటి వర్ణచిత్రాలు ఈ పుస్తకానికి సిరాక్షరాలు. ఒక భార్గవి పుటలు: 268, వెల రూ. 320 ప్రతులకు: డా. భార్గవి, ఫోన్ : 08674 253210, 253366; మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు – డి.వి.ఆర్. -
ఆమె అందంగా ఉంటుంది... 25 ఏళ్లకే చనిపోయింది..
వెంకటేష్ ప్రభు కస్తూరిరాజా ఎవరు? అంటే ‘ఏమో’ అనేవాళ్లే ఎక్కువ. ‘అదేనండీ ధనుష్’ అంటే మాత్రం తెలియదనే వాళ్లు తక్కువ. అది ఆయన స్క్రీన్‌నేమ్. పదాలు అల్లడం, పాటకు గొంతు సవరించడంతో పాటు పుస్తకాలు చదవడం అనేది కూడా ఆయన అభిరుచుల్లో ఒకటి. ధనుష్‌కు నచ్చిన పుస్తకాల్లో ఒకటి లవ్‌స్టోరీ.. ప్రేమికుల దినోత్సవం, 1970లో విడుదలైన ఈ నవల సంచలనం సృష్టించింది. అమెరికన్ రచయిత ఎరిక్ సెగల్ రాసిన ఈ రొమాన్స్ నవల ‘ది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్’ జాబితాలో అనేక వారాల పాటు అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో భాషలలోకి అనువాదం అయింది. సినిమాకు స్క్రీన్‌ప్లేగా రాసుకున్న ఈ కథను నవలగా రాశాడు సెగల్. ‘ఆమె అందంగా ఉంటుంది. తెలివైనది. పాతికేళ్ల వయసులోనే ఆమె చనిపోయింది...’ అంటూ నవల మొదలవుతుంది. విషాదాంత కథలకు నిర్దిష్టమైన కాలపరిధి అంటూ ఉండదు. అవి కాలతీతమైనవి అని చెప్పడానికి ఈ నవల మరో బలమైన ఉదాహరణ. స్థూలంగా చెప్పాలంటే ఇది పెద్దింటి అబ్బాయి, పేదింటి అమ్మాయి ప్రేమకథ.(ఒక అమెరికన్ ప్రముఖుడి యవ్వనపు రోజుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ నవల రాశాడు అనే గుసగుసలు కూడా ఉన్నాయి. ఆలివర్, జెన్నిఫర్లు హార్వర్డ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో పరిచయం అవుతారు. ఆ పరిచయం గాఢమైన స్నేహంగా మారడానికి ఎంతో కాలం పట్టదు. క్లాసిక్ మ్యూజిక్ స్టూడెంట్ అయిన జెన్నీ(జెన్నిఫర్) పై చదువుల కోసం ఫ్రాన్స్‌కు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నానని ఆలివర్‌కు చెబుతుంది. ఆ మాట ఆలివర్ను పిడుగుపాటులా తాకుతుంది. ఆమె ఫ్రాన్స్‌కు వెళితే తనకేమిటి బాధ? తను ప్రేమలో పడ్డాడా? ఎస్...తన మనసులో మాటను ఆమెతో చెబుతాడు,....‘ఐ లవ్ యూ’ అని. ఆమె కూడా ‘లవ్ యూ’ అంటుంది.అంతమాత్రాన కథ సుఖాంతం అవుతుందా? అందం, ఆలోచనల విషయంలో ఇద్దరూ ఒకటే. ఆస్తుల విషయంలో మాత్రం హస్తిమశకాంతరం తేడా ఉంది. ఆలివర్ సంపన్నుడి వారసుడు. విలువైన వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తి. జెన్నీని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళతాడు. వారికి ఆమె నచ్చదు. కారణం ఏమిటో తెలిసిందే.‘నువ్వు ఆ అమ్మాయిని మరిచిపో. నా మాట కాదని పెళ్లి చేసుకుంటే ఆస్తి నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వను’ అని హెచ్చరిస్తాడు తండ్రి. అయితే తండ్రి మాటని కాదని జెన్నీని పెళ్లి చేసుకుంటాడు ఆలివర్. ఊహించినట్లుగానే ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. అంతమాత్రాన వారు వెనక్కి తగ్గరు. జెన్నీ ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంది. ఈలోపు చదువు పూర్తి కావడంతో న్యూయార్క్ సిటీలో లా ఫర్మ్‌లో చేరుతాడు ఆలివర్. ఇక ఆర్థిక కష్టాలు పోయినట్లే, సంసారం గాడిన పడినట్లే అనుకుంటున్న ఆనంద సమయంలో ఆలివర్ను నిలువెల్లా దహించివేసే వార్త....జెన్నీకి క్యాన్సర్! ఇక ఎన్నో రోజులు బతకకపోవచ్చు!! మొదట ఈ దుర్వార్త ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. కాని ఎన్ని రోజులు? ఆమెను బతికించుకోవడానికి ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి తండ్రి దగ్గర చేయి చాస్తాడు ఆలివర్. అయినా ఫలితం ఉండదు. ఆమె తనకు దక్కదు. ఎటు చూసినా దుఃఖమే...ఏం మాట్లాడినా దుఃఖమే...ప్రపంచమంతా చీకటే! ఆరోజు కొడుకు వైపు చూస్తు...‘ఐయామ్ సారీ’ అంటాడు తండ్రి. ‘లవ్ మీన్స్...నెవర్ హావింగ్ టూ సే యూ ఆర్ సారీ’ అని బదులిస్తాడు కొడుకు. ఒకరోజు ఏదో సందర్భంలో ‘సారీ’ అని చెబితే జెన్నీ తనతో చెప్పిన మాట ఇది. ఈ నవల ఒక ఎత్తయితే ‘లవ్ మీన్స్...’ అనే డైలాగ్ ఒక ఎత్తు. బాగా పాప్లర్ అయింది. ప్రేక్షక ఆదరణ పొందిన సినిమా డైలాగుల జాబితాలో చోటుచేసుకుంది. -
కమెడియన్‌ను చంపింది ఎవరు? రోర్‌సాక్ చెప్పింది నిజమేనా?
పూజా హెగ్డేకు ఆటలు, పాటలు ఎంత ఇష్టమోపుస్తకాలుచదవడం కూడా అంతే ఇష్టం. లాక్డౌన్లో ఖాళీ సమయాన్ని పుస్తకాలకు వినియోగించిందట. ఆమెకు నచ్చిన పుస్తకాల్లో ఒకటి గ్రాఫిక్ నావెల్ వాచ్మెన్. ఈ పుస్తకం గురించి... బ్రిటీష్ రచయిత అలెన్ మోర్, ఆర్టిస్ట్ డేవ్ గిబన్స్, కలరిస్ట్ జాన్ హిగ్గిన్స్ల అద్భుత సృష్టి వాచ్మెన్. నిజానికి ఈ పుస్తకానికి ముందు, పుస్తకం తరువాత ఎన్నో కామిక్స్ నావెల్స్ వచ్చాయి. అయితే ‘వాచ్మెన్’ మాత్రం ఒక మైలురాయిగా నిలిచింది. కాలంతో కలిసి నడిచే పుస్తకాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఇది అలాంటి పుస్తకమే. అమెరికన్ పబ్లిషింగ్ హౌజ్ డీసీ కామిక్స్ 1986లో తొలిసారిగా ప్రచురించిన ఈ పుస్తకం ‘లీస్ట్ ఆఫ్ ది 100 బెస్ట్ నావెల్స్’లో ఒకటిగా నిలిచింది. సినిమాగా వచ్చింది. వీడియో గేమ్ సిరీస్‌లతో అలరించింది. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు రెగ్యులర్ కామిక్ బుక్‌లాగా అనిపించదు. ఇంకా చెప్పాలంటే ‘కాంప్లెక్స్ స్టఫ్’గా అనిపిస్తుది. ఎందుకీ కాంప్లెక్స్? ఎందుకంటే ఇది ‘అల్టర్నేటివ్ హిస్టరీ’ జానర్లో వచ్చిన నవల. ఈ నవలలో కనిపించే నిర్ధిష్టమైన కాలానికి సంబంధించిన చరిత్ర (కోల్డ్‌వార్, నిక్సన్ పాలన, న్యూక్లియర్వార్....మొదలైన విషయాలు) ఎంతో కొంత మనకు తెలిసి ఉంటే సంక్లిష్టత దూరం అవుతుంది. ‘ది వాచ్మెన్’ పేరుతో అమెరికన్ గవర్నమెంట్‌కు సహాయపడే సూపర్ హీరోల బృందం ఉంటుంది. అందులో కొందరు... 1. డా.మన్‌హట్టన్ 2. సిల్క్ స్పెక్టర్ 3. ఒజిమాండియస్ 4. నైట్ వోల్ 5. రోర్‌సాక్ 6. కమెడియన్ అమెరికన్ గవర్నమెంట్ ‘కీన్ యాక్ట్’ పాస్ చేయడంతో సూపర్‌హీరోల ప్రాభవం తగ్గుతుంది. నిజానికి ఈ సూపర్‌హీరోలు అప్పటికే దాదాపుగా రిటైరై ఉంటారు. అయితే డా.మన్‌హట్టన్ ప్రభుత్వం తరఫున పనిచేస్తుంటాడు. రోర్‌సాక్ అండర్‌గ్రౌండ్ కార్యకలాపాల్లో బిజీగా ఉంటాడు. అది 1986 సంవత్సరం. అక్టోబర్ నెల...న్యూయార్క్ సిటీలో ఎడ్వార్డ్ బ్లేక్ అనే వ్యక్తి హత్యకు గురవుతాడు. అతడిని చంపి గ్లాస్ విండో నుంచి బయటికి విసిరేస్తారు హంతకులు. డిటెక్టివ్లు రంగప్రవేశం చేస్తారు. అణువణువూ గాలిస్తారుగానీ ఏ ఒక్క ఆధారం వారికి చిక్కదు. పక్కా ప్లాన్‌తో జరిగిన మర్డర్ అనే విషయం అర్థమవుతుంది. సూపర్హీరోల్లో ఒకడైన రోర్‌సాక్ ఈ హత్య గురించి సొంతంగా దర్యాప్తు ప్రారంభిస్తాడు. హత్యకు గురైన ఎడ్వార్డ్ బ్లేక్ ఎవరో కాదని సూపర్ హీరోల్లో ఒకడైన ‘కమెడియన్’ అనే నిజం తెలుస్తుంది. ఇతడి హత్య వెనుక వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు ఏమీ లేవని సూపర్ హీరోలు అందరినీ తుదముట్టించే పనిలో భాగంగానే ఇది జరిగిందని, ఈ హత్య ఒక హెచ్చరిక అని నిర్ధారణకు వస్తాడు. తాను నమ్మింది ఇతర సూపర్ హీరోలకు చెబుతాడు. అయితే వారు ఇతడి మాటలను సీరియస్‌గా తీసుకోరు. కమెడియన్‌ను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? రోర్‌సాక్ చెప్పింది నిజమేనా? మహత్తరమైన శక్తులు ఉన్నవాడిగా పేరున్న డా. మన్‌హట్టన్ అంగారక గ్రహానికి ఎందుకు వెళ్లాడు...ఇలాంటి ఆసక్తికరమైన విషయాలలోకి వెళ్లవచ్చు. నిజానికి ఈ పుస్తకం ‘కథావస్తువు’ గురించి మాత్రమే మాట్లాడడం అంటే కుదరదు. కచ్చితంగా బొమ్మల అద్భుతం గురించి మాట్లాడుకోవాల్సిందే. వావ్! ఆ బొమ్మలను చూసి తరించాల్సిందే. ఆర్టిస్ట్ డేవ్ గిబన్స్ బొమ్మలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ కాలంలో సూపర్ హీరో కామిక్ బుక్స్ పోస్టర్–టైప్ పేజీ లేఔట్లతో, ఒక పెద్ద సీన్ దాని చుట్టూ ప్యానెల్స్‌తో వచ్చేవి. దీంట్లో మాత్రం 9–ప్యానల్ గ్రిడ్ లే ఔట్లో కాగితాల్లోనే సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. -
వలసలు నిజం... వాదనలు అబద్ధం
మనుగడ కోసం పక్షులే వేల కిలోమీటర్లు ఎగురుతూ వెళ్లిపోతాయి. మరి మనుషులు మాత్రం ఉన్నచోటే ఎందుకుంటారు? స్వావలంబన కోసం ఉన్న ప్రాంతాన్ని వదిలి, కొండలు, కోనలు, పర్వతాలు, సముద్రాలు దాటి కొత్త ఖండాలకు వెళ్లి నివాసాలు ఏర్పరుచుకున్నారు. చారిత్రక పరిణామ క్రమంలో వలసలు అనివార్యం. ఈ క్రమంలో జాతులు సంపర్కం చెందాయి. సమాజాలు కలగలిసిపోయాయి. ఈ రోజు ఆర్య రక్తం, అనార్య రక్తం అనేది వేరుచేయగలిగేది కాదు. అయినా కొన్ని రాజకీయ శక్తులు కులాలను, మతాలను, జాతులను తమ స్వార్థం కోసం, అధికారం కోసం విడదీసే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వాటిని తిప్పికొట్టడానికి శాస్త్రీయమైన పరిశోధనలు, ఆ పరిశోధనల ఆధారంగా రాసిన పుస్తకాలే ఆయుధాలు. ‘‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది?’’ ఈ ప్రశ్నలో సంధించిన మానవకథ- ప్రకృతి కథే! పశుపక్ష్యాదులు, శిల్పం, సాహిత్యం, శాస్త్రం, వైజ్ఞానిక శాస్త్రం, కవిత్వం, నాట్యం, అన్నీ ప్రకృతి జననంతో ముడిపడి ఉన్నవే. అవి మానవుడి ద్వారా వివిధ రూపాలలో వ్యక్తమవుతూ ఉంటాయి. విశ్రాంత సాంకేతిక నిపుణులు, భౌతికవాది, పరిణామవాద, వైజ్ఞానిక శాస్త్రాంశాల పరిశోధనలో తలమునకలుగా ఉన్న మర్ల విజయకుమార్ తాజాగా వెలువరించిన ‘భారతీయుల (చారిత్రక, సాంస్కృతిక, జన్యు) మూలాలు’ అన్న గ్రంథం (పీకాక్ క్లాసిక్స్) నేటి తరాలకు ఒక అమూల్య రచన. ‘ఓల్గా నుంచి గంగా’ నదీ తీరందాకా మధ్యాసియా ఇరానియన్ సాంస్కృతిక పూర్వ రంగం నుంచి ఆసియా ఖండంలో సాగిన మానవ వలసల గురించి అత్యంత విలువైన సమాచారంతో కూడిన వైజ్ఞానిక పరిశోధనా గ్రంథాన్ని కథల రూపంలో మహాపండితుడు, బౌద్ధ దార్శనికుడు, ముప్పయ్ భాషలు తెలిసిన విజ్ఞానవేత్త రాహుల్ సాంకృత్యా యన్ అందించారు. ఆ తర్వాత తొలి తరం సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారులలో అగ్రగణ్యులైన ప్రొఫెసర్ డీడీ కోశాంబి, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ, ఆ తరువాతి తరం చరిత్రకారులలో సుప్రసిద్ధులైన డీఎన్ ఝూ, ఇర్ఫాన్ హబీబ్‌లు కూడా దక్షిణాసియా నుంచి మన దేశం లోకి ఉధృతంగా సాగిన మానవ వలసల గురించి, విభిన్న జాతులు, తెగల గురించి విస్తారంగా ప్రస్తావించడం జరిగింది. రాహుల్జీ ఒక సందర్భంలో పేర్కొన్నట్టు ‘పక్షి సంతానం కంటే, మానవ సంతానానికి ఈ ప్రపంచంలో బతకడానికి సాధనాలు, అవకాశాలు కూడా ఎక్కు వన్న విషయాన్ని చాలామంది మరిచిపోతారు’’. సరిహద్దులు ఎరుగని జగజ్జనులు మనకు తెలుసు, ఆంధ్రలో కొల్లేరు సరస్సుకు, పులికాట్ సరస్సుకు వచ్చే పక్షులన్నీ సైబీరియా (రష్యా) నుంచి వచ్చి రుతువును బట్టి సేద తీర్చుకుంటుంటాయి. లాల్సర్ పక్షులు అలా చలికాలంలో వచ్చి వేసవి వస్తుందనగానే ఏప్రిల్‌లో హిమాలయాలవైపు వెళ్లి పోతాయి. ఇలా తమకు బొత్తిగా తెలియని దూర తీర ప్రాంతాలకు పక్షులు, వాటి పిల్లలకు ఎగిరివెళ్లి, వాలి తమ జీవనాన్ని గడుపుకోగల శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది స్వావలంబన వల్లనే అనివార్యమవుతుంది. ఇలా పశుపక్ష్యాదులే స్వావలంబన ద్వారా తమ జీవితాలకు మెరుగు పెట్టుకుంటుండగా మానవ సంతానం ఇంకెలా ఉండాలి? అని మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్ తన ‘లోక సంచారి’ గ్రంథంలో ప్రస్తావించాడు. అలాంటివే సప్తఖండాలలోనూ జరిగాయి. ఒక చోటు నుంచి, ప్రాంతం నుంచి, దేశాల నుంచి, ఖండాంతరాల నుంచి ‘సరిహద్దులు ఎరుగని జగజ్జనులు’ చారిత్రక పరిణామ క్రమంలో కొండలు, కోనలు, పర్వతాలు, సముద్రాలు దాటి తమ అవసరాల కొద్దీ కొత్త ప్రాంతాలకు వెళ్లి స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నారు. వలసలు వచ్చి స్థిరపడిన జనాల మధ్య పనిగట్టుకుని కుల, మత వివక్షలు రేపుకోవడం కన్నా భుక్తి గడుపుకోవడానికి, ఉనికిని కాపాడుకోవడానికే సమయమంతా సరిపోయింది. జనపదాల కదలికలు మారాయి, అలవాట్లకు పెట్టే పేర్లూ మారాయి. సమాజం పరిణామం చెందుతున్నకొద్దీ భక్ష్య పదార్థమైన ‘సూపా’న్ని ప్రాచీనులు మాంసానికి వాడితే, దాన్నే తరువాతి కాలాల్లో శ్రోత్రియ కుటుంబాలు ‘కందిపప్పు’ని సూపంగా చెప్పసాగాయి. నేటికి రెండులక్షల సంవత్సరాల నాటికే పాత తరాల యుగపు మాన వుడు అడవుల్లో నివసిస్తూ వేట, ఆహారసేకరణ ఆధారంగా జీవించ సాగారు. మానవ జాతికి పుట్టిల్లు తూర్పు ఆఫ్రికా అని అనేక మానవ జన్యుకణాల పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు నిరూపించారని మర్ల విజయకుమార్ పేర్కొన్నారు. మానవ నివాసానికి అనుకూలం గాని ప్రాంతాల నుంచి అను కూలమైన ప్రాంతాలకు మానవ వలసలు ఎందుకు సాగాయో సోదాహరణంగా వివరించారు. ఈ మానవ వలసల్లో భాగంగానే చరిత్రలో ఆదిమ జాతులుగా పేర్కొన్న మానవులు లక్ష ఏళ్ల నాటికే ఆఫ్రికా నుంచి వచ్చి వాతా వరణం కాస్త వేడిగా ఉన్న హిమాలయ పర్వతాలకు చేరుకున్నారు. వాతావరణం ప్రభావం రంగును, ముఖ కవలికల్ని కూడా మార్చేశాయి. సింధు అయ్యింది హిందూ... అలాగే భారతదేశంలో కొందరు మతాభిమానులు దేశ నాగరికతను మత ప్రాతిపదికపై విభజించి చూపేందుకుగాను సింధు నాగరికతను ‘హిందూ’ నాగరికతగా చిత్రించడానికి చేస్తూ వచ్చిన ప్రయత్నాన్ని ఈ గ్రంథకర్త తిప్పికొట్టారు. ఎందుకంటే భారతదేశంతో సంపర్కం కల్గిన పర్షియన్లకు చారిత్రక మొహెంజదారో–హరప్పా నాగరికతలకు ఆల వాలంగా ఉన్న సింధు నదీలోయ ప్రాంతాన్ని... ‘స’కారాన్ని అదే అక్షరంతో పలకడం రానందున, దాన్ని ‘హ’కారంగా మార్చుకుని ‘సింధు’ను ‘హిందు’గా ఉచ్చరించుతూ రావడంవల్ల ఈ గందరగోళం ఏర్పడిందని గుర్తించాలి. ఉచ్చారణలో ఒక్క ‘అక్షరం’ మార్పిడివల్ల భారతదేశంలోని ఛాందస వర్గాలు కొందరు మొత్తం దేశ ఐక్యతకు, మత సామరస్యానికి, లౌకిక వ్యవస్థకు ఎంత చేటు కల్గిస్తూ వచ్చారో చరిత్ర చెబుతోంది. వాడికి ‘స’ అక్షరం నోరు తిరగలేదు కాబట్టి మన ఛాందసులు ‘వికార’ పోకడలు ఎందుకు పోవాలి? మూలాలను నిర్ధారించే పరిశోధన జన్యు విజ్ఞాన పరిశోధనలకు చరిత్ర పఠనంలో ఎంత విలువుందో తెలుసుకోవాలంటే ఇటీవల కాలంలో వెలుగు చూసిన ఒక గొప్ప సత్య నిరూపణను పాఠకుల ప్రయోజనార్థం ఇక్కడ ఉదహరించదలిచాను. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మాజీ డైరెక్టర్ జనరల్, బౌద్ధ పరిశోధకులు ఆంజనేయ రెడ్డి కుటుంబం తాలూకు జన్యు లక్షణాల పుట్టుపూర్వాలు, వారి కుటుంబ పూర్వీకులు ఎక్కడి నుంచి తెలుగుదేశానికి ఊడిపడి స్థిరపడ్డారన్న యావత్తు తబిశీళ్లు ఒక ‘జినోగ్రాఫిక్’ ప్రాజెక్టు ద్వారా బయటపడ్డాయి. ఈ ప్రాజెక్టును ప్రపంచ ప్రఖ్యాత పత్రిక ‘నేషనల్ జాగ్రఫిక్’ (ఐబీఎం) నిర్వహించింది. ఆంజనేయరెడ్డి ‘పుట్టెంట్రుకల’ తబిశీళ్లు బయటికి లాగిన ఈ ప్రాజెక్టు ఆ కుటుంబ జన్యుకణాల పూర్వాపరాలను డీఎన్ఏ పరీక్ష ద్వారా వెల్లడించింది. అంజనేయరెడ్డి క్రోమోజోమ్ ‘వై’గా నిర్ధారణ చేసి, దాన్ని హాప్లోగ్రూప్–ఎల్గా గుర్తించింది. 60,000 సంవత్సరాల క్రితం వీరంతా ఆఫ్రికనేతరులుగా నిర్ధారించారు. ఈరోజున దక్షిణ భారతంలో నివసించే వారిలో నూటికి 50 మందికి పైగా ఈ ‘హాప్లో’ గ్రూపుకు చెందినవారేనని తేల్చారు. ఆంజనేయులు పూర్వీకులలో తొలితరం పూర్వీకుడు 50 వేల ఏళ్ల క్రితంవాడని కూడా నిర్ధారించారు. ఆ పూర్వీకుడికి సంకేతం ‘ఎం– 168’గా నిర్ణయించారు. వీరంతా ఒకప్పటి ఆఫ్రికా వాసులుగా, వీరికి సంబంధించిన నిర్దిష్టమైన గుర్తులుగా రాతి పనిముట్లను గుర్తించడం విశేషం. ఈశాన్య ఆఫ్రికాలోని రిఫ్ట్ లోయలో (ఈనాటి ఇథియో పియా/కెన్యా/టాంజానియా ప్రాంతం) 31,000 నుంచి 79,000 సంవత్సరాల క్రితం ఆంజనేయులు పూర్వీకులు ఉండి ఉండవచ్చునని నిర్ధారించారు. వేదాలలో సర్వజ్ఞానం పొందుపర్చబడి ఉందని, ఈ ‘అపార విజ్ఞానాన్ని’ పాశ్చాత్యులు దొంగలించి తమ శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకున్నారని కొందరు పండితులనుకునేవారు ప్రకటనలు చేశారు. విజయకుమార్ అన్నట్టు కుల చట్రంలో ప్రజలను బందీలు చేసి వారిని దోపిడీకి గురి చేసినందున, దానికి మతం రంగు పూసి, తమ ఆర్థిక సామాజిక దోపిడీని కొనసాగించడమే దీనికి కారణం. నేడు కల్తీలేని ఆర్యజాతిగానీ, అనార్య జాతులు గానీ లేవు. కాల క్రమంలో జాతుల మధ్యన జన్యు మిశ్రమం జరిగిపోయింది గనుక. ఆ మాటకొస్తే చరిత్ర, సంస్కృతి విషయంలో భారత ప్రజల్లో అత్యధికులు అనార్య మూలాలు కలిగినవారే సుమా! కనుకనే భావ విప్లవానికి మతం, మూఢ విశ్వాసాలు ప్రధాన అడ్డంకి అని రాహుల్జీ హెచ్చరించి ఉంటాడు. మరి ఈ అడ్డంకిని తొలగించాలంటే ఏం కావాలన్నాడు శ్రీశ్రీ? ‘‘కదిలేదీ కదిలించేదీ/మారేదీ మార్పించేదీ/పాడేదీ పాడిం చేదీ/మునుముందుకు సాగించేది/పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ...’’! ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
పేజ్ త్రీ కేళీ.. కామోత్సవ్
విలువలు మధ్యతరగతి జీవితాల వెలలు. ఆ పై తరగతికి సంతోషమే పరమావధి.. కింది తరగతికి బతుకీడ్చమే ప్రధానం. అందుకే ఆ రెండింటి భారాన్ని మధ్యతరగతి మోస్తూ ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘కామోత్సవ్’ ఈ విషయాన్నే వెల్లడిస్తుంది ఉన్నత వర్గపు జీవన శైలిని నవల రూపంలో. కథానాయకుడు జ్ఞాన్.. చిత్రకారుడు. చిత్రకళ మీదే కాదు సాహిత్యం, చరిత్ర, సమకాలీన రాజకీయాల మీదా పట్టున్నవాడు. లెఫ్ట్ ఐడియాలజీ ప్రేమికుడు. ఎలీట్ కుటుంబపు అల్లుడు. ఆ లైఫ్‌స్టయిల్‌లోని సుఖభోగాలన్నిటినీ అనుభవిస్తుంటాడు, ఆస్వాదిస్తుంటాడు. పోలీసు నిర్బంధంలో ఉన్న ఓ వ్యక్తిని కలిసి పోలీసులకు పట్టుబడి.. వాళ్ల కన్నుగప్పి పారిపోయి నిందితుడిగా వాళ్ల గాలింపులో ఉంటాడు. భార్య కీర్తి జ్ఞాన్‌ను కాపాడుకునే ప్రయత్నంతో ముంబై తీసుకెళ్తుంది. అక్కడ స్టార్ హోటల బస, సినిమా, వ్యాపార, రాజకీయవేత్తల, కళాకారుల పార్టీలతో కాలం వెలిబుచ్చుతుంటారు. అది ఏ మలుపు తీసుకొని ఎక్కడికి వెళ్తుందనే గమనం ఆసక్తిగా సాగుతుంది. ఈ క్రమంలో ఉన్నత వర్గాల జీవితాలను, సంబంధాలను, చట్టాలకతీతమైన వాళ్ల వెసులుబాటునూ చెప్తుందీ నవల. 1987లో అప్పటి ఆంధ్రజ్యోతిలో సీరియల్‌గా వచ్చిన కామోత్సవ్‌ను ఈ యేడు నవలగా తీసుకొచ్చారు. కాలతీతం కాని రచన. వర్తమానాన్నే ప్రతిబింబిస్తుందేమో అనిపిస్తుంటుంది పాఠకులకు. అప్పట్లో ఈ సీరియల్ ఒక సంచలనం. అశ్లీల రచనగా కోర్ట్ దాకా వెళ్లింది. కాని ఆ కేసును కోర్ట్ కొట్టిపారేసింది. ఇప్పటి సాహిత్యమే కాదు, సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని కథాంశాలు, చిత్రీకరణలతో పోల్చుకుంటే కామెత్సవ్ మీద అశ్లీల రచన ముద్ర హాస్యాస్పదం అనిపిస్తుంది. ‘పేజ్ త్రీ’ సినిమా కంటే ఎన్నో ఏళ్ల ముందే తెలుగులో ఆ కల్చర్ మీద ఈ రచన వచ్చింది. పేజ్ త్రీ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న పాఠకులకు ఆ కుతూహలాన్ని తీర్చే నవల కామోత్సవ్. కామోత్సవ్ రచయిత.. గుంటూరు శేషేంద్ర శర్మ ప్రచురణ: గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్ట్ పేజీలు: 198, వెల.. 200 రూపాయలు ప్రతులకు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పుస్తక దుకాణాల్లో దొరుకుతుంది. -
‘చెడు అలవాట్లు మానుకోవడం మంచి అలవాటు’
‘చదవడానికి టైమ్ దొరకడం లేదు’ అని సాకు వెదుక్కోవడం కంటే ‘పుస్తకాలకు టైమ్ తప్పకుండా కేటాయించాలి’ అని నిర్ణయం తీసుకుంటే టైమ్ చాలా సులభంగా దొరుకుతుంది. బాలీవుడ్ అందాలతార ఆలియాభట్ వృత్తిరీత్యా బిజీగా ఉన్నప్పటికీ పుస్తకాలు చదవడంలో వెనకబడి పోలేదు. ఆమెకు నచ్చిన పుస్తకాల్లో ఒకటి...‘ది పవర్ ఆఫ్ హ్యాబిట్: వై వుయ్ డూ వాట్ వుయ్ డూ ఇన్ లైఫ్ అండ్ బిజినెస్’ న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్, పులిట్జర్ విజేత చార్లెస్ డుహెగ్ రాసిన ఈ పుస్తకం పరిచయం... విలియం జేమ్స్...19వ శతాబ్దానికి చెందిన ఈ సైకాలజిస్ట్ మనుషుల అలవాట్ల గురించి ఒక మంచి మాట చెప్పారు. ‘అనేకానేక అలవాట్ల సమహారమే మన జీవితం’ అలవాటే కదా...అని తేలిగ్గా తీసుకోవద్దు. ఆ అలవాటే జీవితాలను ముంచుతుంది. ఆ అలవాటే చరిత్రహీనులను చేస్తుంది. ఆ అలవాటే జీవితాన్ని వెలిగిస్తుంది. ఆ అలవాటే చరితార్థులను చేస్తుంది. ఏ అలవాటుకు మనం దగ్గర కావాలనేదానిపైనే మన ఉన్నతి ఆధారపడుతుందంటాడు రచయిత.మంచి అలవాట్ల సంగతి అలా వదిలేద్దాం. ఇప్పుడు మన సమస్యంతా చెడు అలవాట్ల గురించే. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్: అలియా,రణ్‌బిర్‌లతో నాగార్జున టాలీవుడ్‌కు జాన్వీ కపూర్.. డైరెక్టర్ ఎవరంటే! అదొక అలవాటుగా మారిపోయింది. ‘అలవాటు అనేది విధిరాత కాదు. ఈ సత్యం తెలిస్తే వ్యాపారాలే కాదు జీవితాలు కూడా ఊహించనంతగా మారిపోతాయి’ అంటాడు రచయిత. ఒక వ్యాపారం శిఖరస్థాయికి చేరడంలో వినియోగదారుల ‘అలవాటు’ ఎంత కీలకంగా మారుతుందో చెబుతారు రచయిత. కొందరు పెర్ఫ్యూమ్ నుంచి చెప్పుల వరకు ఒకేరకమైన బ్రాండ్‌ను ఇష్టపడతారు. దీంట్లో నాణ్యత పాత్ర కంటే ‘అలవాటు’ పాత్రే చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్తవి ట్రై చేయకపోవడానికి ఇదే కారణం. ఒన్స్ అపాన్ ఏ టైమ్...అమెరికన్స్ టూత్‌పేస్ట్ వాడే వారు కాదు. పండ్లు వాటికవే శుభ్రమవుతాయని కొందరు వీలైనంత గట్టిగా నమ్మేవారు. అలాంటి పరిస్థితుల్లో పెప్సిడెంట్(1916) టూత్‌పేస్ట్ కంపెనీ ఒక అందమైన అమ్మాయితో ‘పెప్సిడెంట్ గీవ్స్ యూ ఏ బ్యూటీఫుల్ స్మైల్’ అంటూ యాడ్ చేసింది. ఇది సూపర్‌హిట్ అయింది. ప్రజలు మెల్లిగా ఈ పేస్ట్‌కు దగ్గరయ్యారు. మొదట ఏ దృష్టితో దగ్గరైనా ఆ తరువాత అదొక అలవాటుగా మారిపోయింది. కంపెనీ ఎక్కడికో వెళ్లిపోయింది! అలవాటు ఏర్పడడంలోనూ ఒక సైన్స్ ఉంటుందని, ‘హ్యాబిట్ ఫామింగ్’లోని ఈ సైన్స్ కేవలం వాణిజ్య ఉత్పత్తుల అమ్మకానికే కాదు మన వ్యక్తిత్వ పునర్నిర్మాణంలోనూ కీలకం అంటాడు రచయిత. మంచి అలవాట్లు అనేవి మైఖేల్ ఫెల్ఫ్, స్టార్‌బక్స్ సీయివో హోవార్డ్ షోల్చ్, పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్...మొదలైన వారి విజయాలలో ఎంతకీలకమయ్యాయో చెబుతారు రచయిత. హౌ హ్యాబిట్స్ వర్క్, హౌ టు క్రియేట్ న్యూ హ్యాబిట్స్, ది గోల్డెన్ రూల్ ఆఫ్ హ్యాబిట్ చేంజ్, కీ స్టోన్ హ్యాబిట్స్, ది పవర్ ఆఫ్ ఏ క్రైసిస్, హౌ లీడర్స్ క్రియేట్ హ్యాబిట్స్ త్రూ యాక్సిడెంట్ అండ్ డిజైన్, ఆర్ వుయ్ రెస్పాన్స్‌బుల్ ఫర్ అవర్ హ్యాబిట్స్....ఇలా ఈ చాప్టర్లలో నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. గాలి పోగేసి రాయడం కాకుండా, సోషల్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, న్యూరోసైన్స్‌కు సంబంధించిన వందలాది సైంటిఫిక్ పేపర్స్ స్టడీ చేసి, ఎంతోమంది వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి ఈ పుస్తకం రాశారు రచయిత. మొదటి చాప్టర్లో ఇచ్చిన ది హాబిట్ లూప్ (రోటిన్, క్యూ, రివార్డ్) ఫ్రేమ్‌వర్క్‌లోనే పుస్తకం మొత్తం ఉంటుంది. వ్యక్తులు కావచ్చు, కంపెనీలు కావచ్చు...మారాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కాని చాలా సందర్భాల్లో అది ప్రయత్నానికి మాత్రమే పరిమితమవుతుంది. ‘అలా కాదు...ఆ ప్రయత్నం ఫలవంతం కావడం చాలా సులభం’ అనే సత్యాన్ని తెలుసుకోవడానికి కచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఇది. -
తొలివైద్యుల చరిత్ర
అనేక కులవృత్తులు ఉన్నాయి. వాటన్నింటికీ వాటి వాటి చరిత్రలూ ఉన్నాయి. అణగారిన కొన్ని కులాల వృత్తుల చరిత్రలు చాలావరకు మరుగునపడ్డాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి వాటిని వెలికితీసే ప్రయత్నం అంత తేలికేమీ కాదు. ‘తొలి వైద్యులు’ పుస్తకం ద్వారా అలాంటి ప్రయత్నమే చేశారు రచయిత అన్నవరపు బ్రహ్మయ్య. అంతేకాదు, తన ప్రయత్నంలో కృతకృత్యులయ్యారు కూడా. క్షురక వృత్తికి సంబంధించిన ప్రాచీన మూలలను పరిశోధించి, చక్కని పుస్తకాన్ని అందించిన రచయితకు అభినందనలు. భారత భూభాగాన్ని ఏలిన తొలి చక్రవర్తి మహాపద్మనందుడు మంగలి కులస్తుడు. భారతదేశంలోనే కాదు, మిగిలిన ప్రపంచ దేశాల్లోనూ ఎక్కడైనా తొలినాటి వైద్యులు క్షురక వృత్తి చేసేవారే. శరీర శుభ్రతకు దోహదపడేలా వెంట్రుకలు కత్తిరించడమే కాదు, వ్రణాలు, గాయాల వల్ల పాడైపోయిన అవయవాలను తొలగించే తొలి శస్త్రచికిత్సకులు క్షురకులే! మంగళవాద్యాలను వాయించే క్షురకులకు సంగీతంతో గల చిరకాల అనుబంధాన్ని కూడా ఈ పుస్తకంలో చారిత్రక ఆధారాలతో సహా ప్రస్తావించడం విశేషం. క్షురక సామాజిక వర్గం నుంచి ఎదిగి వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారి సంక్షిప్త పరిచయ వ్యాసాలు ఈ పుస్తకానికి నిండుదనాన్ని ఇచ్చాయి. ఒకనాడు దేశాన్ని ఏలిన కులానికి చెందిన వారు, ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచిన కులానికి చెందినవారు కాలక్రమంలో వెనుకబాటుకు లోనైన క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే! కుల వివక్ష వేళ్లూనుకున్న మన దేశంలో అణగారిన కులాలకు సంబంధించిన చారిత్రక విశేషాలను వెలుగులోకి తెచ్చే ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - దాసు తొలివైద్యులు రచయిత: అన్నవరపు బ్రహ్మయ్య ప్రచురణ: తెలుగు తోరణం ప్రచురణ, విజయవాడ ధర: రూ.180 ప్రతులకు: రచయిత, ఇంటినం: 15–103/3డి, గొల్లపూడి డైమండ్ అపార్ట్మెంట్, గొల్లపూడి, విజయవాడ మొబైల్: 94403 20886, 89198 23256 -
అమ్మతోడు... ఆమె అలా చేస్తుందనుకొలేదు!
బాలీవుడ్ అందాల నటి పరిణీతి చోప్రాకు ఇష్టమైన పుస్తకాలో ఒకటి...ది గర్ల్ ఆన్ ది ట్రైన్. ‘ది న్యూయార్క్ టైమ్స్ ఫిక్షన్ బెస్ట్ సెల్లర్స్’లో మొదటి స్థానంలో నిలిచిన ఈ పుస్తకం 34 దేశాల్లో ఎన్నో భాషల్లోకి అనువాదం అయింది. ఈ సైకాలాజికల్ థ్రిల్లర్ సంక్షిప్త పరిచయం... 30 సంవత్సరాల రేచల్ వాట్సన్ కొన్ని కారణాల వల్ల భర్త టామ్‌తో విడాకులు తీసుకుంటుంది. ఆ బాధలో డిప్రెషన్లోకి వెళుతుంది. తాగుడుకు బానిసగా మారుతుంది. ఉద్యోగం పోతుంది. ఇప్పుడు ఆమె పని లోకల్ ట్రైన్లో రోజూ పోవడం, రావడం. తాను ఇంకా ఉద్యోగం చేస్తున్నానని భ్రమ కలిపించడం కావచ్చు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కావచ్చు, ఖాళీగా ఇంట్లో కూర్చోలేకపోవడం కావచ్చు...కారణం ఏదైతేనేం ఆమె రోజూ రైలుప్రయాణం చేస్తూనే ఉంది. ఒకరోజుకు ఇంకోరోజుకు మధ్య కొత్త వ్యక్తులు, కొత్త మాటలు, కొత్త జీవితాలు. రేచల్ ప్రయాణించే రైలు మాజీ భర్త టామ్ ఇంటి మీదుగా వెళుతుంది. ఆ ఇంటికి రెండు, మూడు ఇండ్ల పక్కన ఒక జంటను చూసి ‘అబ్బ! ఎంత ముచ్చటైన జంట’ అనుకుంటుంది. వాళ్ల పేరేమిటో తెలియదు. తానే ఇద్దరికి కల్పిత పేర్లు పెడుతుంది. అమ్మాయి పేరు: జెస్ (అసలు పేరు: మేఘన్) అబ్బాయి పేరు: జాసన్ (అసలు పేరు: స్కాట్) ఒకరోజు మందు మత్తులో ఉన్న రేచల్, ఒక వ్యక్తితో మేఘన్ సన్నిహితంగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అతడు స్కాట్ కాదు. ఎవరో? కట్ చేస్తే... మేఘన్ అదృశ్యమైపోతుంది. ఎవరు మాయం చేశారు? అసలు బతికి ఉందా? రేచల్ అనుకున్నట్లు వారిది బంగారుజంట కాదు. జెస్ అసలు పేరు మేఘన్. మేఘన్‌కు చాలామంది మగాళ్లతో ఎఫైర్ ఉంటుంది. ఇక స్కాట్ విషయానికి వస్తే ఎప్పుడూ ఏదో ఒక అభద్రతలో ఉంటాడు. మేఘన్‌పై పెత్తనం చేయాలని చూస్తుంటాడు. రేచల్ మాజీ భర్త టామ్, అతని రెండో భార్య అనా ఇంట్లో మేఘన్ బేబిసిట్టర్. మేఘన్ అదృశ్యం గురించి మాట్లాడడానికి స్కాట్‌ను కలుస్తుంది. మేఘన్ ఫ్రెండ్‌గా తనను పరిచయం చేసుకుంటుంది. మేఘన్ ఒకవ్యక్తితో సన్నిహితంగా ఉన్న దృశ్యాన్ని తాను చూసినట్లు చెబుతుంది. ఎవరా వ్యక్తి? అనే శోధనలో ఆ వ్యక్తి సైకియాట్రిస్ట్ డా.కమల్ అని తెలుస్తుంది. పోలీసులు డా.కమల్‌ను పిలిచి విచారిస్తారు. తనకు మేఘన్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆమె తన పేషెంట్ మాత్రమే అని చెబుతాడు డాక్టర్. కానీ రేచల్, స్కాట్ ఆయన మాటలు నమ్మరు. ఒకరోజు టామ్ జిమ్బ్యాగ్లో సీక్రెట్ ఫోన్ చూసి ఆశ్చర్యపోతుంది అతడి భార్య అనా. ఆ ప్రీ–పెయిడ్ ఫోన్ మేఘన్ కోసమని తెలిసి ఆమె ఆశ్చర్యపోతుంది. అసలు కథ ఏమిటంటే, భార్యకు తెలియకుండా టామ్ మేఘన్‌తో సంబంధం పెట్టుకుంటాడు. ఆమె గర్భం దాల్చుతుంది. ‘అబార్షన్ చేసుకో...’ అంటాడు టామ్. అందుకు ఆమె నిరాకరిస్తుంది. గట్టిగా అరుస్తుంది. తమ మధ్య ఉన్న సంబంధాన్ని లోకానికి తెలియజేస్తానని హెచ్చరిస్తుంది. నిజం బయటకు రాకుండా ఉండడానికి మేఘన్‌ను టామ్ హత్య చేస్తాడు. టామ్ దుర్మార్గాన్ని అంతం చేయడానికి ఒకప్పటి ప్రత్యర్థులు రేచల్, అనా ఒక్కటవుతారు. టామ్‌ను హత్య చేస్తారు. ఆత్మరక్షణ కోసమే తాము టామ్‌ను చంపామని చెబుతారు. మద్యం మానేసి కొత్త జీవితంలోకి ప్రవేశిస్తుంది రేచల్. ముగ్గురు మహిళలు...రేచల్, అనా, మేఘన్ ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నవల ఉంటుంది. మై ఫెవరెట్ బుక్: ది గర్ల్ ఆన్ ది ట్రైన్ రచన: పాలో హాకిన్స్ -
కనిపించని గుంతలు
నవల : ది హోల్ రచయిత్రి : హిరోకో ఓయమడా జపనీస్ నుంచి ఆంగ్లానువాదం : డేవిడ్ బాయ్డ్ ప్రచురణ : న్యూ డైరెక్షన్స్: 2020 చుట్టూ ఉండే సాధారణ వస్తువులు సైతం ప్రతీకలుగా, ఫాంటసీ కలగలసిన అద్భుతాలుగా, మళ్లీ అవే అధివాస్తవికంగా రూపం మార్చుకుంటూ– అలాంటి రూపాంతరాలు ప్రత్యేకించి కొట్టొచ్చినట్టు కనబడకుండా సాగుతూ అబ్బురపరుస్తుంది ఈ నవలిక. 2013లో జపాన్‌లోని అకుతాగవా ప్రైజ్ సంపాదించుకున్న రచయిత్రి హిరోకో ఓయమడా రాసిన ‘ది హోల్’ నవల ఆంగ్లానువాదం ఈ సంవత్సరమే విడుదలయింది. నవలలో జరుగుతున్నవి మామూలు విషయాలుగా జమకట్టి ఉపేక్షించే అవకాశాన్ని ఈ రచన ఎక్కడా ఇవ్వదు– అలా వదిలేస్తున్నామేమో అన్న ఉలికిపాటుని తప్ప. ముప్పై ఏళ్ల ఆసా తన టెంపరరీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, భర్త బదిలీ కారణంగా అతనితో వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నది బొటాబొటీ సంపాదనే అయినప్పటికీ, దాన్ని వదిలిపెట్టాలంటే కొంత సందేహం. కాకపోతే, వెళ్తున్నది భర్త సొంతవూరికి కాబట్టీ, అక్కడ వాళ్లకి రెండు ఇళ్లున్నాయి కాబట్టీ, వీళ్లు ఒక ఇంట్లో అద్దె ఇవ్వకుండా ఉండవచ్చని అత్తగారు చెబుతుంది. అక్కడికి చేరుకున్నాక గృహిణిగా ఆసా జీవితం ప్రారంభమౌతుంది. అత్తగారు కూడా ఉద్యోగినే. తన పనుల్లో బిజీగా ఉండే మామగారు కనిపించడం కూడా అరుదే. మానసిక స్థిమితం లేని తాతగారు ఉన్నా, ఆయనకున్న చెముడు వల్ల ఆయనతో సంభాషించే వీలూ లేదు. ఒంటరితనం, వేసవి వేడి తాలూకు ఉక్కపోత, చుట్టుపక్కల భరించలేని కీచురాళ్ల రొద (‘‘అసలేదో కీచురాయి నా ఒంట్లోనే ఉన్నట్టుంది’’), ఏమీ తోచని ఖాళీ ఆమె జీవితాన్ని ఆక్రమించుకుంటాయి. ఎక్కడికి వెళ్లాలన్నా దూరాలు, సొంత కారు లేదు. జీవితం రసహీనంగా సాగుతున్న తరుణంలో ఒకరోజున అత్తగారు చెప్పిన పనిమీద స్టోర్‌కి వెళ్లిన ఆసా, ఒక వింతజంతువుని రోడ్డుమీద చూసి, ఆసక్తితో దాన్ని అనుసరిస్తూ వెళ్లి, ఒక గోతిలో పడుతుంది (‘‘ఇదేదో సరీగ్గా నా సైజుకి తవ్విన గొయ్యిలాగుంది!’’). ఆ ప్రాంతంలోనే ఉండే ఒక మహిళ సాయంతో దాన్నుంచి బయటపడుతుంది. ఈ సంఘటన దగ్గర మలుపు తిరిగే కథ ఆసా పరంగా కల్పన, వాస్తవికత, అధివాస్తవికతల మధ్య సాగుతూ ఉంటుంది. తన పరిశోధనల్లో ఇంటి వెనకాల నివాసం ఉంటున్న భర్త సోదరుడి గురించిన సమాచారం; స్టోర్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఆడుకుంటూ కనిపించిన పిల్లలు; స్టోర్స్‌కి వెళ్లే దారికి సమాంతరంగా ఉన్న నది ఒడ్డున ఆడుకుంటున్న పిల్లలు; రోడ్డుకీ, నదికీ మధ్య ఉన్న వాలులో పెరిగిన రెల్లు మాటున దాగివున్న గుంతలు; అత్తగారి ఇంట్లో ఉన్న ఫొటోలో భర్త నానమ్మ పోలికల్లో అత్తగారు ఉండటం – ఇవన్నీ కొన్ని నిజాలుగా, కొన్ని ఊహలుగా, మరికొన్ని భ్రాంతులుగా ఆవిష్కారం అవుతున్నా– అంతర్లీనంగా ఉన్నది మాత్రం కరిగిపోతున్న అస్తిత్వం పట్ల ఆసాలో కలుగుతున్న సంచలనం. ‘‘ఇక్కడ ప్రతి సంవత్సరపు ప్రతి రుతువులోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందా? ఇలాంటి వేడి, ఉక్కపోతే ఉంటుందా?’’అన్న మీమాంసకి లోనయిన ఆసా, తాతగారి మరణానంతరం అంతకుముందు వెళ్లిన స్టోర్స్‌లోనే చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంటుంది. కానీ నిజానికి అక్కడ ఆమె అంతకుముందు చూసిన పిల్లలు ఎవరూ లేరు. అడపాదడపా వచ్చేది కేవలం ముసలివాళ్లేనని ఆ స్టోర్స్ మేనేజర్ అంటుంది. ‘‘మనకి కావాల్సింది మాత్రమే మనం చూస్తాం’’ అని నవలలో ఒక పాత్ర చెప్పినట్టు, తన జీవితంలో లోపించిన దానిని మాత్రమే ఆసా ఊహించుకుంటూ ఉంది. పేరు తెలియని ఏదో జంతువు (సమాజం) చూపించిన మార్గాన్ని అనుసరిస్తే, చివరికి ఆసా పడింది సంసారకూపంలో. అస్థిమితానికి గురిచేస్తున్న వేసవితాపం తనలోని ఉక్కపోత. సమాజ ధిక్కరణ చేస్తే జరిగే ఫలితానికి ఉదాహరణ వెలివేయబడ్డ భర్త సోదరుడు. చిన్నపిల్లలు నెరవేరని కోరికలు. దూరంగా నది దగ్గర కోలాహలం అవతలివాళ్లు ఆనందోత్సాహాలతో ఉన్నారనుకునే ఇవతలివాళ్ల భ్రాంతి. వీటన్నింటినీ అంతర్గతంగా ఓ స్వరం (కీచురాళ్లు) మనకి వినిపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే రచన ఇది! - ఎ.వి.రమణమూర్తి -
మసిబారిన పసితనం
నవల : షగ్గీ బెయిన్ రచన : డగ్లాస్ స్టువర్ట్ ప్రచురణ : గ్రోవ్; 2020 డగ్లాస్ స్టువర్ట్ రాసిన తొలినవల ‘షగ్గీ బెయిన్’ బుకర్ ప్రైజ్‌కి షార్ట్‌లిస్ట్ కావడం వెనకాల తొమ్మిది వందల పేజీల మొదటి డ్రాఫ్ట్మీద పన్నెండేళ్లపాటు కృషి చేసిన శ్రమ ఉంది. కొంతవరకూ ఆటోబయోగ్రఫికల్ నవల కూడా కావడంతో నవలలోని వేదన– బరువునీ, వాస్తవికతనీ, మనసుని కదిలించగల శక్తినీ సంతరించుకుంది. యు.కె.లోని స్కాట్లాండ్ నేపథ్యంలో గత శతాబ్దపు ఎనభ య్యవ దశకంలో సాగే నవలలో కొన్ని చారిత్రకాంశాలు కూడా కలగలిసిపోయి ఉన్నాయి. మార్గరెట్ థాచర్ అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల పరిశ్రమలు దెబ్బతిని కార్మికులు ఉపాధి కోల్పోయి పేదరికంలోకి కూరుకుపోవడం, నిరుద్యోగులై వారిలో చాలామంది వ్యసనాలకి బానిసలైపోవడం, కొంతమంది ఆడవాళ్లు కూడా మద్యానికి బానిసలైపోయి కుటుంబాలు వీధిన పడటం నవలలో సమాంతరంగా కనిపించే అంశాలు. 1981లో కథ ప్రారంభమయ్యేనాటికి ఆగ్నెస్‌కి మూడు పదుల పైన వయసు, ఎలిజబెత్ టేలర్‌కి ఉన్నంత అందచందాలు ఉన్నాయి. మొదటి వివాహంలోని యాంత్రికతని భరించలేక, ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న షగ్తో వచ్చేసి, తల్లిదండ్రుల ఇంట్లో కాపురం పెట్టిన ఆగ్నెస్‌కి ద్వితీయ వివాహంలో ఐదేళ్ల షగ్గీ బెయిన్తో బాటు, మొదటి వివాహంలో పుట్టిన కొడుకు లీక్, కూతురు కేథరిన్ సంతానం. స్వతహాగా అందగాడైన భర్త పలు అక్రమ సంబంధాలని పెట్టుకోవడం, చివరికి తన స్నేహితురాళ్లతోనే బాహాటంగా తిరుగుతూండటం వాళ్ల సంసారం బీటలు వారడానికీ, ఆగ్నెస్ తాగుడుకి బానిస కావడానికీ కారణమవుతుంది. ఈ స్థితిని చక్కదిద్దడానికా అన్నట్టు, షగ్ తన సంసారాన్ని ఊరికి దూరంగా ఉన్న బొగ్గు గనుల కాలనీకి మారుస్తాడు. ఈ స్వతంత్ర జీవనంవల్ల తన కాపురం మెరుగవుతుందనుకున్న ఆగ్నెస్ ఆశపడుతుంటే, షగ్కి ఉన్న ఆలోచనలు మాత్రం వేరు. అదే రోజున తన సామానుతో షగ్ బయటికి వెళ్లిపోతాడు. మూతపడిన బొగ్గుగనికి అనుబంధంగా ఉన్న ఆ కాలనీలో పేదరికం, వ్యసనాలు రాజ్యమేలుతుంటాయి. ప్రభుత్వం ఇచ్చే బొటాబొటీ భృతితోనే సంసారాన్ని నడపాల్సిన పరిస్థితుల్లో సైతం ఆగ్నెస్ తన బలహీనతలోకి మరింత కూరుకుపోతుంటుంది. అవకాశం కోసం పొంచివుండే ‘అంకుల్స్’ మద్యం ఎరతో ఆగ్నెస్ని వాడుకుంటూంటారు. యుక్తవయసొచ్చిన కూతురు కేథరిన్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని పెళ్లిచేసుకుని ఆఫ్రికాకి వెళ్లిపోతుంది. ఆర్ట్ క్లాసులకి వెళుతుండే కొడుకు లీక్ ఇంటి పరిస్థితులని భరించలేక సాధ్యమైనంతవరకూ ఇంటికి దూరంగా ఉంటూంటాడు. తల్లి సంరక్షణ కోసం వయసుకి మించిన బాధ్యతని తలకెత్తుకోవాల్సి వచ్చిన షగ్గీ బెయిన్‌కి ఇంకో వ్యక్తిగత సమస్య కూడా ఎదురవుతుంది: తనలో శారీరకంగా వస్తున్న స్త్రీ లక్షణాల వల్ల కలుగుతున్న గందరగోళం, ఎదురవుతున్న అవహేళనలు. నలభై యేళ్ల క్రితం సమాజంలో ఇలాంటి సమస్య పట్ల ఎలాంటి చిన్నచూపు ఉండేదో ఊహించవచ్చు. మధ్యలో తాగుడు వదిలేయాలని ప్రయత్నించి, ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్న ఆగ్నెస్ స్థిరచిత్తంతో సంవత్సరం పాటు ఉండగలుగుతుంది కానీ, అప్పుడు పరిచయమైన యూజీన్ అనే వ్యక్తి వల్ల మళ్లీ అదే బిలంలోకి జారిపోతుంది. కాలం గడుస్తున్నా వ్యసనం నుంచి బయటపడలేని ఆగ్నెస్, తనున్న లైంగికతా చట్రాన్ని దాటుకోలేని షగ్గీ– ఇద్దరూ భౌతికమైన సమస్యలతో బాధపడుతున్నవారే; ఇద్దరూ ఆ సమస్యలు çసృష్టిస్తున్న మానసిక వైకల్యాలకి లోనవుతున్నవారే; ఇద్దరూ వాటి నుంచి బయటపడి సమాజం శాసించే ‘నార్మాలిటీ’ అందుకుందామని ప్రయత్నిస్తున్నవారే. కానీ, గమ్యాన్ని చేరుకోవడమే ఇద్దరికీ కష్టంగా ఉంది. ఆ దూరాన్ని దాటడానికి ఇద్దరూ చేసిన ప్రయాణం, నిలుపుకున్న పరస్పర ప్రేమాభిమానాల మీదుగా మిగతా కథ నడిచి, ఊహించగలిగిందే అయినా మలుపు దగ్గర ఆగిపోతుంది. నవలలో విరివిగా కనిపించే స్కాటిష్ మాండలీకం ఎక్కడా ఇబ్బంది కలిగించదు కానీ, ఒకే తరహా సన్నివేశాలు పునరావృతమవడం వల్ల నవల ప్రభావం స్వల్పంగా పలచబడినట్టనిపిస్తుంది. స్వీయచరిత్రాంశాలు ఉన్న కారణంగా బహుశా అది అనివార్యం కావొచ్చేమో కానీ, నిడివి విషయంలో(448 పేజీలు) మరింత జాగ్రత్త వహించి కుదించివుంటే, పఠనానుభూతి మరింత గాఢంగా ఉండేది! - ఎ.వి.రమణమూర్తి -
అంతర మథనం
బుకర్ ప్రైజ్ 2020 షార్ట్‌లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న ‘బర్ట్న్ శుగర్’ (ఇండియాలో గత సంవత్సరం ‘గర్ల్ ఇన్ వైట్ కాటన్’ పేరుతో ప్రచురించబడింది) రచయిత్రి ‘ఆవ్నీ దోషీ’ తొలిరచన అంటే అపనమ్మకం, ఆశ్చర్యం ఏకకాలంలో కలుగుతాయి. తల్లీకూతుళ్ల సంఘర్షణ వస్తువుగా చాలా రచనలే వచ్చివుండవచ్చు కానీ, ఆ ఘర్షణ రూప, పరిణామాల పరిమాణాలని విభిన్న సారాంశాల (థీమ్స్) పరంగా చెప్పడం ఇందులోని తాజాదనం కాగా, కథకురాలి విలక్షణమైన భావరహిత స్వరంలోని మెటఫోర్స్, మనస్తత్వాలు, సత్యాసత్యాలు ముప్పిరిగొంటాయి. ఈ దూరాన్వయాల క్లిష్టతల వల్లనే బహుశా రచయిత్రికి నవలని సంతృప్తికరంగా పూర్తి చేయడానికి ఐదేళ్ల సమయం పట్టింది. యు.కె.లో ఈ సంవత్సరం ప్రచురణ జరిగినప్పుడు నవల శీర్షిక అర్థవంతంగా మారడమే కాకుండా, నవల ప్రారంభంలోని ఎపిగ్రాఫ్ కూడా– ‘మందు పూయకుండా వదిలేస్తే కూతురికి అయిన గాయం రూపం మారుతుందా?’ బదులు, ‘అమ్మా! నన్ను నీకు పరిచయం చేసుకుంటూ, చేసుకుంటూ చాలా అలసిపోయాను’ అని మారి నవలావరణాన్ని పాఠకుడికి సిద్ధం చేస్తుంది. పుణేలో భర్త దిలీప్‌తో కలిసివుంటున్న అంతర ఒక చిత్రకారిణి. మామూలుగా సాగిపోతున్న జీవితంలో తల్లి అలై్జ్జమర్స్‌కి గురికావడంతో అంతర జీవితంలో కుదుపులు, గతకాలాల పునశ్చరణ ప్రారంభమౌతాయి. అది ఎనభైలలో పుణేలో మొదలైన కథ. పెళ్లైన సంవత్సరం తర్వాత కూతురు అంతరని కన్న తార, సంసారచట్రంలో ఇమడలేక, ఒక ధిక్కారంతో పుణేలోనే ఉన్న ఆశ్రమానికి (ఆశ్రమమేదో ప్రత్యేకించి చెప్పకపోయినా, ఊహించగలిగిందే) కూతురుతో సహా చేరుకుంటుంది. కూతురిని పట్టించుకోవడం మానేసి బాబాకి ‘సహచరి’గా తార ఉన్నన్ని రోజులూ అంతర బాల్యం జైల్లో గడిపినట్టు ఛిద్రమైపోతుంది. కొన్నేళ్లయ్యాక బాబా కొత్తసహచరితో కుదురుకోవడాన్ని సహించలేక, ఏడేళ్ల కూతురితో కలిసి బయటికి వస్తుంది. ఎలాంటి ఆధారమూ లేని జీవితాలకి చివరికి అడుక్కోవడమే శరణ్యమవుతుంది. వీళ్ల దీనస్థితి గురించి విన్న తార భర్త ఆమెని ఆమె తల్లి దగ్గరికి చేర్చి, విడాకులు తీసుకుంటాడు. రెజా అనే ఒక ఆర్టిస్ట్‌తో తార పరిచయం అతనితో సహజీవనంగా కొనసాగిన కొన్నేళ్లకి అతను చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. ఆర్ట్ కోర్సుకని బాంబే చేరుకున్న అంతర, కోర్సు నచ్చక కాలేజీలో చేరదుకానీ అక్కడే కాలం గడుపుతూంటుంది. అక్కడ హఠాత్తుగా ప్రత్యక్షం అయిన రెజాతో ఈసారి అంతర సహజీవనం ప్రారంభిస్తుంది. రెజా తన సహజ ధోరణిలో కొన్నాళ్లకి అదృశ్యమైపోతాడు. పుణేకి తిరిగొచ్చిన అంతర, చివరికి దిలీప్ని పెళ్లిచేసుకుంటుంది. తల్లి అనారోగ్యం నేపథ్యంలో తల్లితో తనకున్న పోలికలు, పోటీ, వైరుధ్యాలు, శత్రుత్వాలు, అసంతృప్తులు అన్నీ తెరమీదకొచ్చి సంక్లిష్ట చిత్రంగా నవల విస్తరిస్తుంది. తల్లి జ్ఞాపకశక్తిని కోల్పోవడం వాస్తవమైతే, తన జ్ఞాపకాలలో మాత్రం నిజాయితీ ఎంతుంది (ఖ్ఛ్చ జ్టీy జీటటౌఝ్ఛ్టజిజీnజ ్టజ్చ్టి జీటఛి్చౌu్టజిౌట్ఛఛీ) అన్నది ప్రశ్నార్థకమవుతుంది అంతరకి. ఇంతలో ఒక కూతుర్ని ప్రసవించిన అంతర, ప్రసవానంతర డిప్రెష¯Œ కి గురై, చిక్కుముళ్లని విడదీస్తూపోయే ప్రయత్నంలో మరిన్ని చిక్కుముళ్ల బారినపడ్డట్టవుతుంది. మానవ మనస్తత్వాల మేళవింపుగా సాగే పతాక సన్నివేశంలో నవల హఠాత్తుగా ఒక షార్ట్‌స్టోరీలా ముగిసిపోతుంది. తనని తాను unఖ్చీట్చ చేసుకోవాలనుకున్న అంతర ప్రయత్నం గాల్లో దీపమవుతుంది. బహుశా unఅn్ట్చట్చ అయిన అనంతరమే అది సాధ్యపడుతుందేమో! నవలలో ప్రత్యేకంగా గమనించవలసిన అంశం– అపసవ్యమైన స్త్రీల జీవితాలకి మగవాళ్లే కారణం అనే రచనాత్మక సర్దుబాటు ధోరణికి రచయిత్రి పూనుకోకుండా, ఆయా స్త్రీలను అ¯Œ లైకబుల్ పాత్రలుగానే యథాతథంగా చిత్రించడం. స్త్రీల అవస్థలకి బాహ్యపరిస్థితులు కారణమైనట్టే, వారివారి ఆలోచనాపరిధుల పరిమితులూ కొంతవరకూ కారణాలవుతాయి. లైలా స్లిమానీ అనే రచయిత్రి చెప్పినట్టు – ‘‘మగవాళ్లకుండే లోపాలవంటివే ఆడవాళ్లకీ ఉంటాయని అందరూ అంగీకరిస్తేనే సమానత్వం సాధ్యమవుతుంది. ఆడవాళ్లు పువ్వులలాంటివారనీ, మృదుహృదయులనీ చెప్పే తీపికబుర్లన్నీ వాళ్లకీ చీకటి కోణాలుండగలవన్న సత్యాన్ని గుర్తించడాన్ని విస్మరించడమే! అలాంటి ఉపేక్ష కూడా ఆధిపత్య ధోరణిలో భాగమే!’’ ఇది అర్థం చేసుకోగలిగితేనే అలాంటి అ¯Œ లైకబుల్ పాత్రల పట్ల ఆలోచనాత్మకమైన అవగాహన కలుగుతుంది; చదువుతున్నదానికంటే ఎక్కువ స్ఫురిస్తూ ఉంటుంది! నవల: బర్ట్న్ శుగర్ రచన: ఆవ్నీ దోషీ ప్రచురణ: ఫోర్త్ ఎస్టేట్ ఇండియా; 2019 -ఎ.వి.రమణమూర్తి -
యుక్తకాల వైయక్తికాలు
నవల: ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్ రచయిత్రి: ఎలీనా ఫెరాంటె ఇటాలియన్ నుంచి ఆంగ్లానువాదం: ఆన్ గోల్డ్‌స్టైన్ ప్రచురణ: యూరోపా ఎడిషన్స్; 2020 ‘‘చిన్నప్పుడు నేను అబద్ధాలు చెప్పేదాన్ని, తరచూ శిక్షింపబడేదాన్ని కూడా! అబద్ధాలు చెప్పడాన్ని వ్యతిరేకించే పెద్దవాళ్లు మాత్రం ఇతరులకే కాదు, తమకి కూడా తేలికగా అబద్ధాలు చెప్పేసుకుంటారు. జీవితాలకో అర్థం, స్థిరత్వం, ఇతరులనెదుర్కునే శక్తి, తమ పిల్లల ముందు ఆదర్శప్రాయంగా నిలబడగలిగే సామర్థ్యం – వీటన్నిటికీ అబద్ధాలే ప్రాథమికావసరమైనట్టు! చిన్నప్పటి ఈ ఆలోచనే జొవానా కథకి ప్రేరణ అనుకోవచ్చు.’’ ఈనెల విడుదలయిన ‘ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్’ నవల రచయిత్రి ఎలీనా ఫెరాంటె ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలివి. ఈ నవల పెద్దవాళ్ల అబద్ధాల గురించీ, పన్నేండేళ్ల జొవానా చేసే ఉద్విగ్నభరిత సంతృప్త ప్రయాణం గురించీ. రాసిన నవలలన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందినా, తనెవ్వరో ప్రపంచానికి తెలియనివ్వని ఫెరాంటేని ప్రస్తావిస్తూ ‘‘ఎవరికీ తెలియని ప్రముఖ ఇటాలియన్ రచయిత్రి’’ అంటారు జేమ్స్ వుడ్. ఆవేదనల భావతీవ్రతలనీ, మేధోపరమైన విశ్లేషణలనూ ఇటాలియన్ నుంచి ఆంగ్లంలోకి సరళానువాదం చేసింది ఆన్ గోల్డ్‌స్టైన్. పేదరికంలో పెరిగిన ఆండ్రియా స్వయంకృషితో చదువుకుని, ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉంటాడు. భార్య నెల్లీ, ప్రేమించే కూతురు జొవానా, ఇదే అతని జీవితం. సమయం దొరికినప్పుడల్లా పుస్తకపఠనం, అప్పుడప్పుడూ స్నేహితుడు మేరియానోతో మార్క్సిజం, ఇతరత్రా విషయాలపై ఘాటైన చర్చలు ఆండ్రియాకి ఆటవిడుపులు. మేరియానో భార్య కాన్న్టాన్, వారిపిల్లలూ వీరి కుటుంబంతో కలిసిపోతారు. తోబుట్టువులతో సంబంధ బాంధవ్యాలు లేని ఆండ్రియాకి సోదరి విటోరియా అంటే అసహ్యం. తండ్రి మాటలనిబట్టి అత్తయ్య విటోరియా ద్వేషం, కుత్సితత్వం రూపుదాల్చిన అనాకారిగా జొవానాకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు తన చదువు గురించి ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు తండ్రి ‘‘జొవానా రోజురోజుకీ విటోరియాలా తయారౌతోంది,’’ అనటం వినిపిస్తుంది. అప్పుడప్పుడే మొదలయిన నెలసరీ, మారుతున్న శరీరాకృతీ, శారీరకమైన అపరిశుభ్ర భావనల మధ్య జరుగుతున్న మార్పులను పూర్తిగా స్వీకరించలేని సున్నితమైన మనఃస్థితిలో ఉన్న ఆమెకు తండ్రి మాటలు శరాఘాతాలై, తనరూపం గురించి మరిన్ని అనుమానాలు రేకెత్తించి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఎప్పుడూ అద్దంలో చూసుకుంటూ, లోపాలను వెతుక్కుంటూ, వాటిని సరిదిద్దుకునే తాపత్రయంలో పడిపోతుంది జొవానా. ఆమెలో న్యూనతతోబాటు ఎదురుతిరిగే ధోరణి మొదలవుతుంది. ఆదర్శవంతంగా ఆమెను తీర్చిదిద్దాలనుకున్న తల్లిదండ్రులకు జొవానా అర్థంకాని ప్రశ్నలా మారుతుంది. అత్తయ్య విటోరియాని కలిసిన జొవానాకి ఆమె జీవనవిధానం, మాటల్లో అనియంత్రితమైన స్వేచ్ఛ, సూటిదనం కొత్తగా అనిపిస్తాయిగానీ ఆకట్టుకుంటాయి. తల్లిదండ్రులపట్ల అత్తయ్యకున్న ద్వేషం అర్థమయినా ఆమె ప్రేమభావన జొవానాని కట్టిపడేస్తుంది. అప్పుడే ఉల్కాపాతంలా తన తండ్రికీ మేరియానో భార్య jlకీ మధ్య గత పదిహేనేళ్లుగా సంబంధం ఉందన్న నిజం జొవానాకి తెలుస్తుంది. తల్లిదండ్రుల మధ్య గొడవల అనంతరం తండ్రి తమను వదిలి కా¯Œ స్టా¯Œ ్స ఇంటికి వెళ్లిపోవటంతో జొవానా ప్రపంచం తలకిందులవుతుంది. పసితనాన్ని అంతమొందిస్తున్నట్టుగా కఠిన వాస్తవమేదో ఆమెను కమ్మేస్తుంది. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయి తనని పట్టించుకోని తల్లి, అప్పుడప్పుడు కలవడానికి వచ్చి తనకర్థంకాని కూతురితో మాట్లాడటానికేమీ తోచక మౌనంగా ఉండిపోయే తండ్రి– జొవానాలో ఒంటరితనాన్ని పెంచుతారు. ప్రేమరాహిత్యపు పరిణామంగా అసహనం, అందరినీ దూరంగా పెట్టడం, విచిత్రమైన వేషధారణ – ‘నేనింతే, నేనిదే,’ అని ప్రపంచానికి చాటిచెప్పే నిర్లక్ష్యపు ప్రకటన కనిపిస్తుంది ఆమెలో. సంస్కారయుతమైన విజ్ఞతనీ, ఆలోచనావగాహనల్లో స్పష్టతనీ పెంపొందించుకునే ప్రయత్నంలో జొవానాకి ‘ప్రేమంటే ద్వేషాన్ని మర్చిపోవటమే’ అని పోనుపోనూ అర్థమవుతుంది. సంఘర్షణలకతీతంగా అందరినుంచీ నేర్చుకుంటూ, స్వేచ్ఛని పునర్నిర్వచించుకుంటూ, తల్లిదండ్రులతో బంధాన్ని పునర్నిర్మించుకుంటూ అడుగులు వేస్తుంది. జరిగిపోయిన వాటిల్లో తప్పొప్పులని ఎంచడం గతజలసేతుబంధనం అన్నది ఆమె అంతస్సంఘర్షణ వెలువరించిన ఆవిష్కరణ. తల్లిదండ్రుల వివాహేతర సంబంధాలూ, మనస్పర్థలతో విడిపోవటాలూ పిల్లలని సంక్షోభానికి గురిచేస్తాయి. ఆత్మ, పరవంచనలకి పాల్పడే సగటు మనుషులు ఎదుగుతున్న వ్యక్తిత్వాలకి అవరోధాలుగా పరిణమిస్తారు. నవలలో చెప్పినట్టు, ‘‘ఒకోసారి మనుషులు ఇతరులకు కష్టాన్ని కలిగిస్తారు కానీ, వారి అభిమతం మాత్రం అదికాదు.’’ జొవానాలాగా ఈ విషయాన్ని గ్రహించగలిగితే, జీవితంలో చాలా సమస్యలని దూరం పెట్టవచ్చు. పద్మప్రియ -
‘కడలి మీద కోన్–టికి’
బాహ్య ప్రపంచానికి ఎంత మాత్రమూ సంబంధం లేకుండా ఉన్న స్థలాలను కూడా నివాసం కోసం మనిషి వెతుక్కుంటూ వెళ్లాడు. అట్లాంటి ఒక దుర్గమ స్థలం, దక్షిణ అమెరికా సముద్ర తీరానికి దాదాపు ఏడు వేల కిలోమీటర్ల దూరాన ఉన్న పాలినేషియన్ ద్వీపాలు. అట్లా అక్కడికి చేరుకున్న ఇంకాన్ జాతి వారు సముద్రమట్టానికి సుమారు పద్నాలుగు వేల అడుగుల ఎత్తుండే అండీస్ పర్వతపు లోయలలో వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యాలు ఏర్పాటు చేసి అద్భుతమైన నాగరికత సృష్టించారు. రాళ్లు తొలిచి మనుషుల విగ్రహాలు చెక్కారు. పిరమిడ్లు నిర్మించారు. క్రీ.శ. 500–1100 వరకూ ఇక్కడికి వలసలు కొనసాగాయి. అయితే, ఆధునిక శాస్త్రజ్ఞులకు అర్థంకాని ప్రశ్నేమిటంటే, వీళ్లందరూ ఆ కాలంలోనే పసిఫిక్ మహాసముద్రం మీద ఎలా ప్రయాణించగలిగారు? సముద్ర ప్రవాహ తోడ్పాటునే నమ్ముకుని వాళ్లు ప్రయాణించివుంటారా? ఆ ప్రాచీనుల సాహసాన్ని నిరూపించడానికి నార్వేకు చెందిన ఎత్నోగ్రాఫర్ (మానవజాతి శాస్త్రవేత్త) థార్ హెయెర్డ్‌హాల్ (1914–2002) ఒక ప్రయోగం చేశాడు. 1947 లో ఒక తెప్ప మీద ఐదుగురు స్నేహితులతో కలిసి 101 రోజులు ప్రయాణించి ఏడు వేల కిలోమీటర్ల దూరంలోని పాలినేషియన్ దీవులకు చేరుకున్నాడు. ఆ అనుభవాలను అనంతరం పుస్తకంగా తెచ్చాడు. అదే ‘కడలి మీద కోన్–టికి’. దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో ప్రేమ్‌చంద్ పబ్లికేషన్స్ 1957లో ప్రచురించిన ఈ పుస్తకాన్ని విద్వాన్ దేవరకొండ చిన్ని కృష్ణశర్మ తెలుగులోకి అనువదించారు. దానికి ముందుమాట రాసిన ఎ.ఆర్.ఐరావతి ఇలా అంటారు: 1950వ సంవత్సరం నాటి కోన్–టికి సముద్రయాన కథలో పూర్వకాలం నాటి పాలినేషియన్ సంస్కృతి మనకు గోచరమవుతున్నది. జన్మతః నార్వే దేశానికి చెందిన థార్ హెయెర్డ్‌హాల్ ప్రకృతి శాస్త్రాభిమాని. ఇతను పాలినేషియన్ల వలస విధానాన్ని మన దృష్టిపథానికి తెచ్చి అది ఒక సజీవసత్యంగా నిరూపించాడు. భౌతిక శాస్త్రజ్ఞుడు కావటం చేత తాను చెప్పదలచుకొన్న దానిని విశదంగా తెలియబరిచాడు. తన సిద్ధాంతాన్ని రుజువు పరచటం కోసం, సహచరులైదుగురినీ ప్రోత్సహించి యాత్ర సాగించాడు. ఈ మహాకార్యం అతన్ని చిరస్మరణీయుడుగా చేస్తున్నది. ఈ యువకుల సాహసం వల్ల చారిత్రకులకూ, భూగర్భ శాస్త్రజ్ఞులకూ అయోమయంగా కనబడుతున్న ఒక అద్భుత సమస్య సుపరిష్కృతమైంది. థార్ హెయెర్డ్‌హాల్ మేకులు ఉపయోగించకుండా ఇంకాన్ జాతివారి ప్రాచీన పద్ధతిని తొమ్మిది బాల్సా దుంగల తెప్పను నిర్మించి, దానినే సముద్రతరణ సాధనంగా చేసి, దానికి ఇంకాన్ జాతిలో ప్రాచీనుడైన కోన్–టికి పేరు పెట్టాడు. ఈ యువకుల ఉత్సాహశక్తికి అడుగడుగునా పరీక్షలు జరిగాయి. మనుషులను తినటానికి అలవాటుపడ్డ సొరచేపలతో కలసిమెలసి ఉండవలసిన పరిస్థితులున్నూ కలిగాయి. అయితే ఎట్టి పరిస్థితులలోనూ ఈ మిత్రమండలి స్థైర్యం చెక్కు చెదరకపోవటం, ఎంత విపత్తునైనా వినోదప్రాయంగా చూడటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే పరమసత్యాలు. వీటివల్ల ఈ కోన్–టికీ యాత్ర ఒక అద్భుత గాథ అయింది. ఈ సాహసయాత్రకు తగ్గ ప్రోత్సాహమూ, సహాయ సంపత్తీ, శ్రేయోభిలాషులూ కొరత పడలేదు. ఏదిఏమైనా దక్షిణ అమెరికా తీరం నుంచి సుదూరభూములకు కోన్–టికి బయలుదేరుతున్నప్పుడు అది ఒక అవివేకపు కుతూహలంగానే పరిగణితమైంది. అయితే నూట ఒకటవ రోజున ఆ పడవ నూతన భూమి చేరుకోగానే ఆ యత్నమంతా ఒక మహాకార్యంగా భావించగల విచిత్ర వాతావరణం కలిగింది. ఇంతకూ కోన్–టికి యాత్ర వల్ల ప్రాచీన ప్రజలు మహా సాహసికులనీ, ఈ యిరవయ్యో శతాబ్దంలోని మనకు అసాధ్యమనిపించే విధంగా తెప్పవంటి పడవ మీదనే పెద్దపెద్ద సముద్ర ప్రయాణాలు వారు చేశారనీ రుజువవుతున్నది. -
వాంఛ, విముక్తి
డెబ్భై ఏళ్ల వయసున్న ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయిత సెజర్ ఐరా గురించి పరిచయం చేయడం, అతని రచనాపద్ధతిని అర్థం చేసుకోవడమంత కష్టం. వాస్తవికత, అధివాస్తవికత, అసంబద్ధత, తాత్వికత, హాస్యచతురత కలగలిసిపోయి ఉండే ఇతని ఏ రచనా సాధారణంగా వందపేజీలకి మించదు. ఐరా రచనల్లో మలుపులు తిరుగుతూ సాగే చిక్కనైన ప్లాట్ కూడా చెప్పుకోదగ్గంతగా ఉండదు. నిజానికి చెప్పవలసిన నాలుగుముక్కల కథనీ మొదట్లోనే దాదాపుగా చెప్పేస్తాడు. మిగతాదంతా, ఆ అంశం చుట్టూ చేసే తాత్వికమైన ఆలోచనల పక్కదార్లూ, చిక్కుముళ్లూ, కొండొకచో శాఖాచంక్రమణాలు. ఐరాని అభిమానంగా చదివేవాళ్లు బహుశా ఇలాంటి వలలో చిక్కుబడిపోవడాన్నే ఆశించి ఆనందిస్తారు. నాలుగు దశాబ్దాల రచనాజీవితంలో ఐరా ఇప్పటివరకూ దాదాపు ఎనభై నవలలని స్పానిష్ భాషలో రాయగా, ఇంగ్లీష్‌లోకి అనువాదమయిన నవలల్లో ‘ఆర్ట్ఫోరమ్’ పద్దెనిమిదో పుస్తకం. ఇంగ్లిష్ అనువాదాలనన్నింటినీ ఇప్పటివరకూ ప్రముఖ ప్రచురణ సంస్థ న్యూ డైరెక్ష¯Œ ్స ప్రచురించింది. అర్జెంటీనాలోని బునోస్ ఐరీస్‌లో నివసించే కథకుడికి అమెరికాలో ప్రచురించబడే ఆర్ట్ పత్రిక ‘ఆర్ట్ఫోరమ్’ అంటే అమిత ఇష్టం. తనుంటున్న నగరంలో ఆ అమెరికన్ పత్రిక సరిగ్గా దొరకదు కాబట్టి, రకరకాల పద్ధతులలో దాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంత కష్టపడే బదులు చందా కట్టవచ్చు కదా అని మిత్రులు సలహా కూడా ఇస్తారు. క్రెడిట్ కార్డ్ లేని కారణంగా ఆ పనిచేయలేకపోయిన కథకుడికి అనూహ్యంగా ఒక బ్యాంక్ కార్డ్ ఇవ్వడం, ఇతను చందా కట్టేయడం జరుగుతుంది. చందా అందుకున్న పత్రికవాళ్లు ఆ విషయం తెలియబరుస్తూ, ‘‘అర్జెంటీనాలో ఉన్న మీకు మా శుభాకాంక్షలు,’’ అని ఈమెయిల్ కూడా పంపిస్తారు. ‘‘పాపం, మాదేశం అక్కడ అన్ని పత్రికల్లో మొదటిపేజీలో ఉంటుంది కాబోలు. ఇలాంటి సంక్షోభపరిస్థితుల్లో కూడా నేను ఇక్కడినుంచి చందా కట్టడం వాళ్లు గమనించినట్టున్నారు,’’ అనుకుంటాడు. వెనువెంటనే, పత్రిక కాపీని కూడా అందుకుంటాడు. ఆ సంచికను ముందునుంచి వెనక్కీ, వెనకనుంచి ముందుకీ అపురూపంగా చదువుకున్న కథకుడి ఆనందం వర్ణనాతీతం. అయితే, ఆనందాలన్నీ క్షణభంగురాలే అన్నట్టుగా, కథకుడి చేతికి పత్రిక అందటం ఆగిపోతుంది. ఇక అతని బాధ చెప్పనలవి కాదు. కారణాలని అన్వేషిస్తూ, పరిస్థితులని విశ్లేషిస్తూ ఉంటాడు. ఆవేదన పడుతూంటాడు. ఫలానాది జరిగితే పత్రిక వస్తుందని మూఢనమ్మకాలని పెంచుకుంటుంటాడు. ‘‘అతీతమైన శక్తుల విషయంలో, ఫలించగల సంభావ్యత ఉన్న విషయాలే మూఢనమ్మకాలంటే,’’ అంటాడు. అన్నింటికీ తార్కిక, తాత్విక వివరణలిస్తూంటాడు. ఒకచోట పాతపుస్తకాలని అమ్ముతున్నారని తెలుసుకుని ఆ పత్రిక పాతసంచికలు ఇరవైనాలుగు కొనుక్కుంటాడు. పత్రికలోని విషయమంతా దొరికినట్టయితే ఈ ఆవేదన తప్పుతుందా అని ప్రశ్నించుకుంటాడు. తప్పదని సమాధానమూ చెప్పుకుంటాడు. వస్తుభ్రాంతిలోనూ, అవి కలగజేసే రసభ్రాంతిలోనూ పడిపోతున్నాం అనుకుంటాడు. ‘‘బహుశా, మనకి నిజంగా అవసరం లేని విషయాల చేతిలో బందీలుగా మారిపోతున్నామా?’’ అన్న మీమాంసకి లోనవుతాడు. ఎన్నిరోజులుగా ఎన్ని సంచికలకోసం ఎదురుచూస్తున్నాడో లెక్కలేసి కొత్త క్యాలెండర్‌ని తయారుచేసుకుంటాడు. పత్రిక సంచికలు మాత్రం రావడంలేదు. పూర్తి నిరాశానిస్పహలకి లోనై ఒక దశలో ఆర్ట్‌వర్క్ వగైరా చేసి, వ్యాసాలు రాసేసి పత్రిక సంచికలనే స్వయంగా తయారుచేసుకుంటే పోలేదా అనీ ఆలోచిస్తాడు కానీ, అది కార్యరూపం ధరించదు. అనంతంగా ఇలా సాగిపోతుండే కథకుడి వేదన మొట్టమొదటి మానవుడు ఆడమ్ గురించిన ఒక అధ్యాయపు తలపోతలతో ముగుస్తుంది. ఒక పత్రిక కోసమో, ఒక పుస్తకం కోసమో ఎదురుచూడటం ప్రతి పాఠకుడి అనుభవంలో ఉండేవుంటుంది. పాఠకుడిని నవలతో కనెక్ట్ చేయగలిగిన అలాంటి సూక్ష్మాతిసూక్ష్మమైన అనుభవాన్ని పట్టుకుని, కథాంశాన్ని సైతం మరపించే స్థాయిలో మేధోపరమైన విషయవిస్తరణ చేయడం అందరికీ సాధ్యపడదు– ఆలోచనల్లోనూ, వాటిని వ్యక్తం చేయగలిగిన భాషలోనూ సూటిదనం, విరుపూ, ప్రతిభా ఉంటే తప్ప. కాథరిన్ సిల్వర్ చేసిన అనువాదంలో ఆ వస్తుశిల్పచాతుర్యమంతా సుస్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. పుస్తకం వెల కొద్దిగా ఎక్కువే అయినా, ఐరాని తెలుసుకోడానికి చదవదగ్గ పుస్తకం! ఎ.వి.రమణమూర్తి -
ఊరూరి సాంస్కృతిక దస్తూరి
ఈవెంట్ 60 యేళ్ల యాకూబ్: కవి, ‘కవి సంగమం’ స్థాపకుడు యాకూబ్ 60 ఏళ్ల సందర్భంగా వెలువడనున్న ప్రత్యేక సాహిత్య సంచిక కోసం వ్యాసాలను కోరుతున్నారు. సంచిక కమిటీ సభ్యులు: పలమనేరు బాలాజీ, చల్లపల్లి స్వరూపరాణి, నూకతోటి రవికుమార్, వంశీకృష్ణ, అన్వర్, గుడిపాటి. సెప్టెంబర్‌లోగా రచనలు పంపాల్సిన మెయిల్: yakoobkavi@gmail.com ఇది ఊరి దస్తూరి. ఇది ఒక ఊరి రాత. పట్టణాల, నగరాల రాతలు భ్రమలు గొల్పుతాయి. మనలో మరులు పుట్టిస్తాయి. అవి గుండెని చేరని కంటికింపు రాతలు. అన్నవరం దేవేందర్ మాటల్లోనే ‘ఊరు అంటే ఒగలకొగలు సుట్టాల్లెక్క. ఊరంటే శిన్నతనం యాది. ఊరంటే శిన్నప్పటి సోపతి. ఊరంటే పులకింత. ఊరంటే ఎవుసం ఎద్దు బాయి బంధం’. ఈ దస్తూరిలో ప్రజల ఆశా నిరాశలు, ఆహార విహారాలు, చావు పుట్టుకలు, పెండ్లిళ్లు, మన కళ్ళకు సహజంగా కన్పిస్తాయి. అన్నవరం కవి కావడం వల్లా, తెలంగాణ జీవద్భాషలో చక్కటి కవిత్వ రచన చేస్తున్న కారణంగా విషయ వివరణలో ఆ కవితాగంధం చాలాచోట్ల కనిపిస్తుంది. ఊరి సంతోషాల్నే కాదు, దుఃఖాన్ని సైతం సజీవంగా నిల్పుతాడు దేవేందర్. ‘ఎవరు మరణించినా ఊరంతా దుక్క సముద్రమైతది’. అంతేగాక సద్దుల బతుకమ్మనాడు కూడ బర్రెల్ని కొట్టుకపోతూ జీవితంలో సెలవులు ఎరగని బర్ల కాసెటాయన వేదనను లిఖిస్తాడు. మనుషుల్ని ‘ఆయన కొంచెపోడు, నడుమంత్రపోడు, పిసినారోడు’... ఇట్లా వాళ్ళ వాళ్ళ గుణకర్మల్ని బట్టి వర్గీకరిస్తాడు. మనుషుల వింగడింపుతో ఆగక గొర్రెల్ని వాటి రంగుల్ని, శరీరాకృతుల్ని బట్టి క్లాసిఫై చేసిన పల్లె ప్రజల మాటల మూటల్ని మనముందు విప్పుతాడు. ‘ఎలగాళ్ళ గొర్రె’, ‘అంబిగాళ్ళ గొర్రె’. ఎలగాళ్ళ అంటే తెల్లకాళ్ళ గొర్రె అట! అంటే ఏమిటి? బహుశా వెల్ల కాళ్ళు అయివుండాలి. అట్లాగే మేకల్లో, ఎడ్లల్లో వున్న రకాలు వివరిస్తాడు. ఈ వయ్యిలో కట్టె పలక బలపం నుంచి డిజిటల్ పాఠాల తరం వరకు మారుతున్న ప్రపంచం చూస్తే మార్పు అవసరమే, ఆధునికతా అవసరమే అన్పిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న మూలాల పట్ల కూడా ఒక దృష్టి, ఒక జ్ఞాపకం నెమరువేసుకోవచ్చు. ‘ఎంత ఎత్తుకు ఎదిగినా మానవ సంబంధాల పట్ల ప్రేమ దయ ఉండాల్సి వుంది. ఫక్తు పైసల సదువు కాకుండా జీవితపు కళ తెలిసిన చదువులు పెరగాల్సి వుంది’ అంటున్నాడు రచయిత. ఊరి దస్తూరి పేరుతో శతానేక విషయాలు ప్రస్తావిస్తాడు. ‘బతుకమ్మ అంటే సంగ సంగ ఎగురుడు కాదు’ అనేస్తాడు, ఈనాడు ఆడుతున్న బతుకమ్మను చూసి. ఊర్లల్ల మునుపు పెట్టుకున్న ‘వంకాయ తమాటల వరుగులు’ కుప్పబోస్తాడు. కొత్తగడ్డి మోపు నుండి అదోరకమైన వాసనతోపాటు పాతగడ్డిలోంచి వస్తున్న చీకిపోయిన ముక్క పట్టిన వాసనను సైతం మన ముక్కుపుటాలకు అందిస్తాడు. ‘కోడిపుంజు అంటేనే రంగురంగుల అందమైన ఈకలు– కొక్కొరోకో అనే జ్ఞాపకం వస్తది. ఇప్పుడన్ని తెల్ల కోళ్ళే’ అంటాడు. పల్లెల్లో ‘గ్యాసునూనె, ఉప్పు, బెల్లం మాత్రమే కొనుడు’ ఉండేదని గుర్తు చేస్తాడు. అటువంటి స్వయం ప్రకాశక గ్రామాన్ని ప్రపంచీకరణ పూర్తిగా ధ్వంసం చేసింది. ఊరికి సంబంధించిన సమస్త అంశాలను నమోదు చేసిన సామాజిక శాస్త్రం యిది. (ఊరి దస్తూరి సెప్టెంబర్ 11న పోతారం (ఎస్) ఊరిలో విడుదల కానుంది.) డాక్టర్ నలిమెల భాస్కర్ ఊరి దస్తూరి రచన: అన్నవరం దేవేందర్; పేజీలు: 352; వెల: 250; ప్రచురణ: సాహితీ సోపతి; రచయిత ఫోన్: 9440763479 -
ఆప్తమిత్రవాక్యం
కథలూ, నవలలూ ఆకర్షించినంత సహజంగా వ్యాసాలు పాఠకులను అలరించటం అరుదు. బ్రిటిష్ రచయిత్రి జేడీ స్మిత్ రాసిన ఆరు చిన్న వ్యాసాల నాజూకు సంపుటి ‘ఇంటిమేషన్స్’ జూలైలో విడుదలైన విశిష్ట రచన. ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా పరిస్థితుల తక్షణతే ఈ వ్యాసాల్లోని ప్రథమాకర్షణ. మనుషులనీ, ప్రపంచాన్నీ నిష్పక్షపాతంగా గమనిస్తున్న తలపోతలు, తీర్పులు కావు; ప్రవర్తకస్థాయి సమాలోచనలు. లాక్డౌన్లో అనూహ్యంగా దొరికిన సమయాన్ని రకరకాల పనులతో అందరూ నింపడాన్ని చర్చిస్తారు ‘సమ్‌థింగ్ టు డూ’ వ్యాసంలో. కానీ కాలహరణం కోసం రూపొందే కళ వేరు, అనుభూతుల్లోనుంచి సర్వోత్కృష్టమైన కళావిర్భావం జరగడం వేరు. ఆ రెండోరకానికి చెందిన సృజనకారులు అరుదు. ‘సఫరింగ్ లైక్ మెల్ గిబ్సన్’ ఆర్ద్రమైన వ్యాసం. మనోవేదన వ్యక్తిగతమే కాదు; వ్యక్తిస్థాయిలో అనియంత్రితం, చర్చాతీతం. లాక్డౌన్ సమయంలో స్నేహితులని కలవలేని బాధతో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి వేదన అలాంటిదే. ఎవరి బాధలూ వేరొకరితో పోల్చదగ్గవి కానప్పటికీ అవి మినుపుడములను ఆక్రమించి, చీకట్లను నింపకూడదని వ్యాసాంతరార్థం. లాక్డౌన్ ప్రకటించేలోగా న్యూయార్క్ విడిచి లండన్ వెళ్లాలనుకుంటున్న సమయంలో రచయిత్రిని ఓచోట విరిసిన తులిప్ పువ్వులు ఆపేస్తాయి. ఫలదీకరణని స్ఫురింపచేసిన ఆ మొక్కలూ పూలూ ఆమెకు అస్తిత్వంతో చేసిన స్వీయపోరాటాన్ని గుర్తుచేస్తాయి. శరీరంలో కలిగే మార్పులు, సామాజిక నిబంధనలు– రెండింటీకీ స్త్రీ బందీయే. మగవాడిలా కాకుండా బాహ్యాంతర ప్రభావాలకి ఆమె అస్తిత్వం– వివాహిత, అవివాహిత, తల్లి, గొడ్రాలుగా రూపాంతరం చెందుతుంటుంది. స్వీయనియంత్రణాపేక్షతో జీవితాన్ని నిర్దేశించుకోవాలనుకునే రచయిత్రిని తాను రాస్తున్న, జీవిస్తున్న విలువల మధ్య అంతరాలు కలవరపెడుతుంటాయి. నిజానికి, చుట్టూ వినిపిస్తున్న మానవవేదన ముందు ఇలాంటి భావసంఘర్షణలన్నీ అర్థరహితాలే అంటారు ‘పియొనీస్’ వ్యాసంలో. ‘‘చావు ఇంతలా సాధారణం కాని పాతకాలం తిరిగొస్తే బావుండు. అప్పటి జీవితమూ, దేశ ఆర్థికపరిస్థితి బావుండేవి,’’ అన్న ట్రంప్ మాటలలోని మొదటిభాగంతో మాత్రమే ఏకీభవిస్తానంటూ మొదలవుతుంది ‘ద అమెరికన్ ఎక్స్పెక్టేషన్’ వ్యాసం. ఈ ‘శోకభీకర తిమిరంపు’ మరణాల్లోనూ అసమానతలున్నాయి. వైద్యవిధానాలు జనబాహుళ్యానికి సమరీతిలో అందడంలేదు. ఇన్నిరకాలైన జీవనపోరాటాల అనంతరం ప్రజల ఆంతర్యాలు మునుపటిలా ఉండవు; జీవితానికి అవసరమైనదేదో అవగతమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా మాయాజాలాలు చేస్తున్న పాలకులను గమనించే ప్రజలు చూసినదాన్ని మర్చిపోతారనీ, నూతనాధ్యాయాల్లోకి ఆ పాలకులనే పునఃస్వాగతిస్తారనీ అనుకోలేం. ‘స్క్రీన్గ్రాబ్స్’ వ్యాసం నిజానికి వ్యాసమాలిక. చిరువ్యాపారుల నిస్సహాయమైన ఇక్కట్లు ఒకదాంట్లో ప్రతిఫలిస్తే, కరోనా నుంచి దూరంగా తొలగిపోతున్నవారిని చూసి ఏమీలేని అభాగ్యుడు ‘‘నేనిక్కడనుంచి పారిపోను, నేనింతకంటే దారుణమైన జీవితాన్నే చూశాను,’’ అని బిగ్గరగా నవ్వడం మరో జీవనచిత్రం. విద్యార్థుల భవిష్యత్తు తాత్కాలికంగా స్తంభించిపోవడం మరో ప్రస్తావన. చివరన వచ్చే ‘పోస్ట్‌స్క్రిప్ట్’ వ్యాసం– శ్వేతజాతీయుల్లో కరోనాకంటే భయంకరంగా జీర్ణించుకుపోయిన జాతివిద్వేషం ‘కంటెప్ట్ యాజ్ ఎ వైరస్’ గురించి. నల్లజాతి ఉనికినే గుర్తించడానికి ఇష్టపడనంత, శ్వాస ఆగిపోయేదాకా మెడపై బూటుకాలు తొక్కిపెట్టగలిగేంత జాతివిద్వేషం. పేదరికంలో, చాలీచాలని వేతనాలమధ్య, వైద్యసౌకర్యాలు అందక వ్యాధుల బారిన పడితే, వారిని జుగుప్సతో వ్యాధివ్యాప్తిదారులుగా చూడటం సబబేనా? వీరి జీవితాల్లో ఇప్పుడేకాదు, ఎప్పుడూ ఐసోలేషనే అంటారు స్మిత్. రాజ్యం బలమంతా అస్తిత్వాల వెతుకులాటలో సమూహాలుగా చీలి బలహీనపడ్డ ప్రజలే! ఏదోనాటికి ఈ జాతివిద్వేష వైరస్‌కి వ్యాక్సిన్ వస్తుందన్న ఆశ మృగ్యమైపోతోంది. చివరివ్యాసం ‘డెట్స్ అండ్ లెసన్స్’ రచయిత్రి జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులను, వారినుంచి నేర్చుకున్న విలువలనూ హృద్యంగా పరిచయం చేస్తుంది. ముగింపుగా రచయిత్రి మాటలు: ‘‘నేనెప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో అలాగే పుట్టాను– ఒక చారిత్రక ఘట్టంలో భాగాన్నై. నా శారీరక, మానసిక బలాలకిది పరీక్షాకాలం.’’ వ్యాసాలన్నీ స్వకీయ స్వగతాలైనప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోగల నిజాయితీ, విషయంలో గంభీరతా, వచనంలో సారళ్యతా, విరళంగా ఉటంకించిన వాస్తవ సంఘటనలూ రచయిత్రి చెప్పదలుచుకున్న విషయాన్ని సునాయాసంగా ఆవిష్కరించాయి. అమెరికన్ సందర్భానికి రాసిన వ్యాసాలే అయినా, చర్చించిన సమస్యలు మాత్రం మనందరివీ. పద్మప్రియ పుస్తకం: ఇంటిమేషన్స్ రచన: జేడీ స్మిత్ ప్రచురణ: పెంగ్విన్ బుక్స్; 2020 -
ఒకపరి భ్రమణం
ఆఫీసు నుంచి ట్యాక్సీలో ఇంటికి తిరిగివస్తూ, రోడ్డుకటువైపున తనలాగానే ఉన్న అమ్మాయిని చూసి ఆబెగేల్ ఉలిక్కిపడి ట్యాక్సీ ఆపేయించి దిగిపోతుంది. రోడ్డుదాటి దగ్గరనుంచి పరీక్షగా చూస్తే ఆ అమ్మాయి తనే, కచ్చితంగా తనే – సరిగ్గా ఇరవై రెండేళ్లప్పటి తను! ఆబెగేల్ విభ్రమంలోనుంచి తేరుకోకమునుపే ఆమె ఇంకొక యువకుడితో కలిసి వెళ్లిపోతుంది. ఆబెగేల్‌కి ఒక్క క్షణం అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. తనే, తనకి కనిపించటం ఏమిటి? నలభైఆరేళ్ల ఆబెగేల్ జీవితంలోకి ఇరవైరెండేళ్లప్పటి తన పూర్వరూప ప్రవేశంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆమెకి ‘ఏ’ అని పేరు పెట్టుకుంటుంది ఆబెగేల్. చిత్రకారిణి ఆబెగేల్, శిల్పకారుడు డెనిస్ వివాహానంతరం జీవికకోసం కళలను పక్కనపెట్టి ఉద్యోగాలు చేస్తూంటారు. ఇద్దరు టీనేజ్ పిల్లలతో హాయిగానే సాగిపోతూ ఉంటుంది వారి జీవితం. ‘ఏ’ తనకు కనిపించటం, పరిచయం కొనసాగటం, సంభాషించటం అసహజమనిపించినా అది పని ఒత్తిడి వల్ల కలిగిన భ్రమేనని తోసిపారేస్తుంది ఆబెగేల్. ఉద్యోగం కోల్పోయిన డెనిస్ శిల్పకళపట్ల దృష్టిపెట్టి ఎదుగుతుండగా, ఉద్యోగం చేస్తూనే అభిరుచిని మెరుగుపరుచుకోవడానికి ఆర్ట్క్లాసులో చేరుతుంది ఆబెగేల్. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపట్ల ఒకరికీ, పిల్లలపట్లా ప్రేమానురాగాలున్నా, జీవితంలో అస్పష్టమైన అసంతృప్తులు, స్తబ్దతల కారణంగా ఇద్దరూ వివాహేతర సంబంధాలపట్ల ఆకర్షితులౌతారు. ‘ఏ’ ప్రవేశంతో, తన గతజీవితంలో జరిగిన సంఘటనలు – ఈలైతో ప్రేమకథా జ్ఞాపకాలతో సహా – కొన్ని ఆబెగేల్‌కి గుర్తుకొచ్చి నిర్వచించలేని గందరగోళానికి గురిచేస్తాయి. జీవితంలో తను చేసిన తప్పులు ‘ఏ’ చేయకూడదని ఆబెగేల్ తాపత్రయపడినా, ఇరవైరెండేళ్లప్పడు తను జీవించదలచుకున్న, ఇప్పుడు జీవిస్తున్న పద్ధతుల మధ్యనున్న అంతరం గురించి ‘ఏ’ ఆమెను ప్రశ్నిస్తున్నట్టు ఉంటుందామెకి. తరచూ తలనొప్పీ, తలతిరగడంలాంటి సమస్యలతో బాధపడే ఆబెగేల్‌కి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆమెకు ఈలైతో జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తుంది. చిత్రకళకు సంబంధించి తన వివరాలున్న కవర్ని ఈలై అకారణంగా తగలబెట్టడానికి ప్రయత్నించటం, బాల్కనీలో జరిగిన పెనుగులాటలో తామిద్దరూ కొన్ని అంతస్తుల మీదనుంచి కిందపడిపోవటం, అతను చనిపోవటం, తానుమాత్రం తలకు బలమైన గాయాలతో బయటపడటం గుర్తొస్తుందామెకు. అస్వస్థత తీవ్రమై మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేశాక, ఆబెగేల్ కోమాలోకి వెళ్తుంది. తిరిగి మామూలయిన ఆమెకు ‘ఏ’ మళ్లీ కనిపించదు; భ్రాంతిమయమైన జీవితం నుంచి కాంతిమయమైన ఆవరణలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. పిల్లలు స్థిరపడటం, తనూ భర్తా తమ కళలలో నైపుణ్యతని పెంపొందించుకుంటూ, రాణించడంతోపాటు ఆర్థిక స్థిరత్వం కోసం ఆబెగేల్ తన ప్రతిభని ఉపయోగించగలిగిన ఉద్యోగంలో చేరి ముందుకు సాగడంతో నవల ముగుస్తుంది. ఆబెగేల్ ప్రస్తుత జీవితానికీ ఇరవైరెండేళ్లప్పటి గతానికీ మధ్య ఊగిసలాడుతూ ముందుకూ వెనక్కూ సాగే కథ రకరకాల జీవితఘట్టాలని పరిచయం చేస్తుంది. భ్రాంతుల్లో చిక్కుకున్న ఆమె చెప్పే పాక్షిక కథనం పూర్తిగా నమ్మటానికి వీలులేనట్టుంటే, మిగతా కథ ఆబెగేల్ జర్నల్ రూపంలో కొంతా, మానసిక వైద్యురాలి నోట్స్ ద్వారా కొంతా, ఒక ఫిజిసిస్ట్, న్యూరాలజిస్ట్ మధ్య మెయిల్స్ రూపంలో మరికొంతా చెప్పబడుతుంది. ఆబెగేల్ తలకు దాదాపు పాతికేళ్ల క్రితం తగిలిన దెబ్బ వల్ల ఆమె మెదడులో లోపం ఏర్పడిందనీ, అందువల్ల ఆమెకు భ్రాంతులు కలగవచ్చనీ న్యూరాలజిస్ట్ అంటే, క్వాంటం ఫిజిక్స్ సిద్ధాంతాల ప్రకారం కాలపు పొరలను చీల్చుకుని ఆబెగేల్ తన వర్తమాన భూతకాలాలని ఒకేసారి దర్శించగలుగుతోందన్నది ఫిజిసిస్ట్ ప్రతిపాదన. ఎవరి సిద్ధాంతాలు ఏవైనప్పటికీ, జీవితం వాటికి అతీతంగా తనదైన పద్ధతిలో సాగిపోతూనే ఉంటుంది. ‘‘రంగు అనేది వైయక్తిక దర్శనం. ఇది జీవితానికీ వర్తిస్తుంది. మనం చూసే ప్రతీదీ మనదైన ప్రత్యేక భావప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఏ ఇద్దరూ ఒకే ప్రపంచంలో ఉండరు. నువ్వుచూసే ఆకుపచ్చరంగు, నేను చూసే ఆకుపచ్చరంగు కాదు!’’ అన్న తన ప్రొఫెసర్ మాటలని ఆబెగేల్ గుర్తు చేసుకుంటుంది. నెరవేరని ఆశల గురించి, కాలవిన్యాసం గురించి తాత్వికమైన, మేధోపరమైన చర్చలను లేవదీసిన అమెరికన్ రచయిత్రి డెబ్రా జో ఎమెర్గట్ నవల యూ అగైన్ పాఠకుడిని ప్రభావితం చేసే దిశగా ఆలోచింపజేస్తుంది! పద్మప్రియ నవల: యు ఎగైన్ రచన: డెబ్రా జో ఎమెర్గట్ ప్రచురణ: ఎకో; 2020 -
శిథిల వారసత్వం
చేగువేరా ఒక సైకిల్ ఫాక్టరీ చూడటానికి వెళ్లాడట. ఫాక్టరీ అంతా చూపించిన ఫోర్మన్, చే గువేరా వెళ్లిపోబోయే సమయానికి ఒక సైకిల్ని బహుమతిగా ఇవ్వబోయాడట. ‘‘ఇదంతా ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. నీ సొంతం కాదు కాబట్టి అలా ఇవ్వడం సబబు కాదు,’’ అని బహుమతిని అతను నిరాకరించాడట. క్యూబాలోని హవానాలో నివసించే ఓ కుటుంబపెద్ద ఈ కథని అందరికీ చెబుతుంటాడు. క్యూబా విప్లవస్ఫూర్తి మీద వీరాభిమానమూ, కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అత్యంత విధేయతా ఉన్న ఆ యజమానితో బాటు భార్య, కూతురు, కొడుకు ఉండే చిన్నకుటుంబం అది. టీచర్‌గా పనిచేసిన భార్య ప్రస్తుతం మూర్ఛవ్యాధితో బాధ పడుతుండగా, అసహనంగా ఉండే కొడుకు తప్పనిసరైన మిలిటరీ ట్రైనింగ్‌కి వెళ్తాడు. తండ్రి పనిచేస్తున్న హోటల్లోనే పనిచేసే కూతురు, తండ్రికి తెలియకుండా హోటల్నుంచి అవీయివీ కాజేస్తూ కుటుంబ నిర్వహణలో తనవంతు పాత్ర నిర్వహిస్తూంటుంది. ఈ కుటుంబం పడే కడగండ్లని వివరించే నవల కార్లోస్ మాన్యుయెల్ అల్వారెజ్ రాసిన ‘ది ఫాలెన్’. నవలా సారాంశం చాలా సెంటిమెంటల్‌గా కనిపించే ఈ నవల వెనక క్యూబా చరిత్ర నేపథ్యం ఉంది.1952 నాటికి కొనసాగుతున్న బటీస్టా సైనిక పాలనకి వ్యతిరేకంగా చేసిన న్యాయపోరాటం విఫలమయ్యాక, ఫిడెల్ కాస్ట్రో సాయుధ పోరాటానికి దిగాడు. ఐదున్నర సంవత్సరాలపాటు సాగిన క్యూబా విప్లవం విజయవంతమై, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అమెరికాతో పొసగని సంబంధాల వల్ల సాటి కమ్యూనిస్ట్ దేశమైన సోవియట్ యూనియన్‌కి దగ్గరై, యుద్ధాలకి సహకరించడం వలనా, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వలనా సగటు జీవన ప్రమాణాలను పెంచడంలో విఫలమైంది. ఈ విషయాన్ని కాస్ట్రో స్వయంగా 1970లో ఒప్పుకున్నాడు కూడా. సోవియట్ యూనియన్ పతనం తర్వాత, వారు సంవత్సరానికి అందిస్తున్న 4–6 బిలియన్ డాలర్ల సహాయం ఆగిపోగానే క్యూబా ఆర్థిక పరిస్థితి 1991 నుంచి పూర్తిగా దిగజారడం ప్రారంభమైంది. ఆహారం, ఇంధనం విషయాలలో ఆ దేశ ప్రజలు పడ్డ కష్టాలు దాదాపు ఆ శతాబ్దం ఆఖరివరకూ కొనసాగాయి. స్పెషల్ పీరియడ్ అని వ్యవహరించే 1991–2000 దశాబ్దంలో సుమారు 1996 ప్రాంతం ఈ నవలాకాలం. విప్లవానంతర కాలంలో ప్రజలకి గొంతులేకపోవడం, అసంఖ్యాకమైన ఉరితీతలపట్ల కూడా చాలా కథనాలు ఉన్నాయి. ప్రజావాణిని అణిచేసి, గొంతు విప్పినవారిని రాజకీయ ఖైదీలను చేయడంలో క్యూబా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని ఈమధ్యనే న్యూయార్క్ టైమ్స్ పత్రికలో (జనవరి 13) ఎడెల్ గోంజాలెజ్ అనే మాజీ క్యూబా జడ్జి చెప్పిన వివరాల ప్రకారం పరిస్థితులు ఇప్పటికీ ఆశావహంగా లేవన్నది సుస్పష్టం. నేపథ్యం తెలిసాక చదివితే నవల అర్థమయ్యే తీరు వేరే తలంలో ఉంటుంది. పాతదే పూజ్యం, కొత్తదైతే త్యాజ్యం అన్న తరహాలో సాగే దేశ విధానాన్ని తండ్రి పాత్ర ప్రదర్శించడమే కాకుండా, దారిద్య్రాన్ని అనుభవిస్తూ కూడా దాని గురించి అతను మాట్లాడకపోవడం గమనార్హం. కష్టకాలాల్లో పిల్లలకి సరైన తిండికూడా పెట్టలేక నిస్సహాయురాలైన తల్లి చివరికి అపస్మారకాలలోకి కూరుకునిపోతుండగా, రాబోయే తరాలని రచించవలసిన పిల్లల పాత్రలు మాత్రం వైరుధ్యాలతో నిండివుంటాయి. విసుగు, అసహనాలతో కొడుకు లక్ష్యరహితంగా సాగటం సామాజిక పర్యవసానాల ఒకకోణం కాగా, తను పనిచేస్తున్న చోట చిల్లర దొంగతనాలు చేస్తూ ఏదోరకంగా బతకడమే ముఖ్యమనుకున్న కూతురు పాత్ర ఈ సామాజిక సంక్షోభానికి మరో పార్శ్వం. విప్లవం ముగిసిన ఐదారు దశాబ్దాల తర్వాత కూడా కొత్తతరాలకి వారసత్వంగా దక్కింది కేవలం సంప్రదాయపు శిథిలాలే. క్యూబాలో నెలకొన్న ఆందోళనకర స్థితిని నాలుగు పాత్రల అంతరంగాలుగా – పరోక్షంగానైనా సరే –రాసిన రచయిత వచన ప్రతిభ ఫ్రాంక్ విన్ చేసిన అనువాదం ద్వారా మనకి అర్థమవుతుంది. ప్రజాజీవితాన్ని ఇలాంటి వెలుగులో ప్రతీకాత్మకంగా చూపించడం, ముగింపులో కోళ్లఫారం పోలిక తీసుకురావడం చూస్తే, అక్కడి వాస్తవాలని బహిర్గతపరచి బాహ్య ప్రపంచాన్ని హెచ్చరించడం రచయిత తనవంతు సామాజిక బాధ్యతగా తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎ.వి.రమణమూర్తి నవల: ది ఫాలెన్ స్పానిష్ మూలం: కార్లోస్ మాన్యుయెల్ అల్వారెజ్ ఇంగ్లిష్ అనువాదం: ఫ్రాంక్ విన్ ప్రచురణ: గ్రేవూల్ఫ్; 2020 -
కమ్యూనిస్టు విప్లవోద్యమాలను చిత్రించిన రెబెల్
సాహిత్య పాఠకులకు హెచ్చార్కె ఒక కవిగా, జర్నలిస్టుగా, వ్యాసకర్తగా, విప్లవవాదిగా తెలుసు. ఈ నవల చదివిన వారికి ఆయనొక రెబెల్ అని అర్థం అవుతుంది. ఈ నవల మొత్తం పవన్ కుమార్ చుట్టూ తిరుగుతుంది. ఉపోద్ఘాతం మాత్రం ఒక సాయంత్రం వేళ అమెరికాలో తమ పిల్లల వద్ద నివసిస్తున్న ఇద్దరు ముసలాళ్ల మధ్య సంభాషణగా మొదలై, నవల చివర మళ్ళీ వారి సంభాషణతోనే ముగుస్తుంది. పవన్ తన కథను రచయితకు చెపితే, రచయిత మనకు పవన్ కథను నవరస భరితమైన రీతిలో చెప్పాడు. పవన్ పేరును వాళ్ల జేజి ఖరారు చేసింది. కుటుంబ ఆనవాయితీ ప్రకారం ఆంజనేయ స్వామిని స్ఫురణకు తెచ్చేలా ఆంజనేయులు, హనుమయ్య అని ఉండాలి. కానీ జేజి మోడ్రన్‌గా పవన్ కుమార్ అని పెట్టుకుంది. పవన్ ఎక్కడో గని అనే రాయలసీమ గ్రామంలో పేద రైతు కుటుంబంలో పుట్టాడు. నలుగురు అన్నదమ్ములకు కలిపి నాలుగు ఎకరాల నీళ్లవసతి లేని చేను. పవన్ చదువు సర్కారు బడుల్లో, బంధువుల ఇండ్లల్లో సాగుతుంది. సెలవు రోజుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి సంజీవయ్య తనకెన్ని అప్పులున్నా పవన్‌ను ఇంకా చదివిస్తే ఉద్యోగం చేసి బతుకుతాడు కదా అని ఆశపడతాడు. ఎమ్మెస్సీ చదివే అవకాశం ఉన్నా చిన్న వయసు నుంచి తెలుగు సాహిత్యంపై ఉన్న అభిమానం, తనకు పద్యాలు, కథలు రాసే ఆసక్తి మెండుగా ఉంది గనుక, విశాఖపట్నం వెళ్లి ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మే తెలుగులో చేరుతాడు. మహాప్రస్థానం చదివి ప్రభావితుడై, కమ్యూనిస్టు ఉద్యమ సాహిత్యం విపరీతంగా చదువుతాడు. ఉద్యమం పట్ల ఆకర్షితుడు కావటానికి మరో కారణం చండ్ర పుల్లారెడ్డి ఊరు అతని ఊరు పక్కనే. పవన్ కూడా తన గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి, పాటలు, ఉపన్యాసాల ద్వారా సంచలనం సృష్టిస్తాడు. కర్నూలులో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఓ పెద్ద ర్యాలీ నిర్వహించి నక్సల్ నేతగా పోలీసుల దృష్టిలో పడతాడు. కర్నూలు హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న మేనమరదలు విజయ కూడా తన మార్గంలో నడిచేందుకు సిద్ధమైన తర్వాత ఇద్దరూ స్టేజి మ్యారేజ్ చేసుకుంటారు. ఇంతలో 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించగానే, పోలీసులు పవన్‌ను అత్తగారింట్లో ఉండగా అరెస్టు చేసి, మీసా చట్టం కింద ముషీరాబాద్ జైల్లో పెడతారు. సెకండ్ క్లాస్ రాజకీయ ఖైదీ జీవితం తన ఊరి జీవితం కంటే మెరుగ్గా ఉందనుకుంటాడు. జైలులో ఉండగానే కూతురు పుడుతుంది. పెరోల్ దొరకదు. నక్సల్ పార్టీకి రాజీనామా చేసినట్లు అండర్ టేకింగ్ ఇస్తే పెరోల్ ఇస్తామని ఆశపెడతారు. కానీ ఒప్పుకోడు. అక్కడే యాదాటి కాశీపతి గురువై, గంటల కొద్దీ ఆంగ్ల సాహిత్యం బోధించిన వైనం పవన్‌కు మున్ముందు జర్నలిస్టు, రచయిత జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. జైలు నుంచి ఒక దినపత్రికలో చేరుతాడనగా చండ్ర పుల్లారెడ్డి పిలుపు మేరకు వారి పార్టీ పత్రిక ‘విమోచన’లో చేరి, భార్య విజయతో కలిసి 12 ఏండ్లు పార్టీలో, పత్రికలో ఫుల్ టైమర్‌గా పని చేస్తాడు. సైద్ధాంతిక విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి, పాత్రికేయుడిగా పనిచేస్తాడు. ఈ నవల మొదటి భాగాల్లో రాయలసీమ భాషను ఆర్తిగా చిత్రించాడు రచయిత. జాలాడి, తల్లె, బర్రె గొడ్లు, సద్ది, ఈదులు, లొట్లు, గరిసె లాంటి పదాలు వింటే ప్రాణం లేచొస్తుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా పవన్ జీవితం గడుస్తుంది. కుటుంబానికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అందరికీ దూరంగా ఉండిపోయి బాధపడుతుండగా ముగుస్తుంది. 11వ క్లాస్ వరకు కాళ్లకు చెప్పులు లేకుండా అతడి జీవితం గడిచింది. రైలు పెట్టెలో కండక్టర్ ఉంటాడు కదా, అప్పుడు టికెట్ తీసుకుందాంలే అనుకుంటాడు. మరి ఈ హెచ్చార్కే (హనుమంత రెడ్డి.కె), నవలా హీరో పవన్ ఒకరేనా? ఎందరో వాస్తవ నాయకులు, రచయితలు, ఎడిటర్లు, వాస్తవ చారిత్రక సంఘటనలు నవల నిండా ఉన్నాయి. 1968–1985 మధ్య కాలంలో జరిగిన విప్లవ ఉద్యమాలను వాటిలో పాల్గొన్న ఒక యువకుని కోణంలో ఇది ఆవిష్కరిస్తుంది. కర్ర ఎల్లారెడ్డి నవల: రెబెల్; రచన: హెచ్చార్కె ప్రచురణ: ఛాయ రిసోర్సెస్ సెంటర్ ప్రతులకు: అనల్ప బుక్ కంపెనీ. ఫోన్: 7093800678 -
అద్దంలోని ముడుపులు
2008 ప్రాంతంలో అమెరికాలో పాంజీ స్కీం రూపంలో అతిపెద్ద ఆర్థికనేరం బయటపడి పెనుసంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెట్టుబడులు ఆహ్వానించి, ఆ సొమ్మును వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెట్టి అధిక లాభాలను ఆర్జించి, తిరిగి చెల్లింపుల రూపంలో వారికే అందిస్తామని ప్రలోభపెట్టి, చివరికి ఒకరిచ్చిన సొమ్మునే మరొకరికి లాభాల పేరుతో ముట్టచెప్పే మోసపూరితమైన వ్యాపారమే పాంజీ స్కీం. కొన్ని వేలకోట్ల డాలర్లతో నడిచిన ఈ పాంజీ స్కీం బయటపడ్డాక దీనికి రూపకర్త అయిన బెర్నీ మెడాఫ్కి అమెరికా న్యాయస్థానం 150 యేళ్ల జైలుశిక్ష విధించింది. వైట్‌కాలర్ నేరం ఇతివృత్తంగా రాసిన ‘ద గ్లాస్ హోటల్’ నవలని ఈ కథతో ముడిపెట్టి రాశారు కెనడియన్ రచయిత్రి ఎమిలీ సెయింట్ జాన్ మెండేల్. దయ్యాల కథలన్నా తనకు చాలా ఇష్టమనే ఈ రచయిత్రి, దయ్యాలంటూ వేరే ఉండవనీ తాము జీవించలేకపోయిన జీవితం, తీసుకోలేకపోయిన నిర్ణయాలూ, ఓడిపోయిన పరిస్థితులే మనిషిని ఆ రూపంలో వెంటాడుతుంటాయని అంటారు. పట్టణపు వాసనలు లేని కయేట్ అనే ఊహాజనిత ప్రదేశంలో కథ మొదలవుతుంది. ఒకవైపు సముద్రమూ, మరోవైపు అడవీ, ఇరవై గడపలూ ఉన్న ఆ చిన్న ఊళ్లో అత్యంత ఆధునికమైన హంగులతో, చుట్టూ ఉన్న అడవి కనిపించేలా నిలువెత్తు గాజు పలకలతో ‘కయేట్ హోటల్’ నిర్మిస్తాడు వ్యాపారవేత్త జానథన్. అదే ఊరికి చెందిన విన్సెంట్ అనే మహిళ తన సోదరుడు పాల్‌తో కలిసి ఆ హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. భార్య మరణించడంతో ఒంటరిగా ఉన్న జానథన్, సహజీవనం చేసే ఒప్పందం మీద విన్సెంట్‌ని తనతోపాటు కనెక్టికట్‌కి తీసుకెళ్లిపోతాడు. అతిసామాన్యమైన జీవితంలో నుంచి ఐశ్వర్యంలోకి అడుగుపెట్టిన విన్సెంట్ సకల సౌకర్యాలను అనుభవిస్తున్నా, జరిగిన ప్రతి సంఘటనా వేరేలా జరిగుంటే జీవితం మరోలా ఉండేదని అనుకుంటుంది. జానథన్‌తో చేసుకున్న ఒప్పందం సరైనది కాదని అనిపించినా, తాననుభవిస్తున్న జీవితానికి ఆమాత్రం మూల్యం చెల్లించుకోవడం సబబే అని నచ్చజెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో జానథన్ చేసే పెట్టుబడుల వ్యాపారం మోసమనీ, పాంజీ స్కీం అనీ బయటపడి, ప్రభుత్వం అతన్ని జైల్లో పెడుతుంది. రెట్టింపు లాభాలకు ఆశపడి అతని దగ్గర పెట్టుబడి పెట్టిన కొన్ని వందలమంది జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. జైల్లో జానథన్ ఉన్నగది గోడలమీద ‘ఏ నక్షత్రమూ శాశ్వతంగా వెలుగులు చిమ్మదు,’ అని రాసివున్న వాక్యం అతని అప్పటి స్థితికి సూచిక. చేసిన తప్పుని సమర్థించుకోడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా కుదుటబడని అతని మనసు, అపరాధ భావనకి లోనై తనవల్ల మోసపోయినవారూ, తన గజిబిజి ఆలోచనలూ దయ్యాలై చుట్టుముడుతున్న విభ్రాంతికి లోనవుతుంది. జానథన్‌తో పనిచేసిన కొందరు తప్పొప్పుకొని జైలుపాలైతే, మరికొందరి వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమవుతాయి. శిక్ష తప్పించుకోటానికి దేశమే వదిలి పారిపోయిన ఒక ఉద్యోగి ఏదోనాడు పోలీసులు తనని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో మనశ్శాంతిని కోల్పోతాడు. పరిస్థితులని ఎదుర్కొని నిలదొక్కుకున్న విన్సెంట్ పేరూ, రూపం మార్చుకుని ఒక ఓడలో వంటమనిషిగా కుదురుకుని, అనూహ్యంగా సముద్రంలో పడి చనిపోతుంది. ఉద్యోగ విరమణ తరవాత వచ్చిన డబ్బంతా జానథన్ వల్ల కోల్పోయి రోడ్డున పడ్డ లియాన్ అనే వ్యక్తి భార్యతో కలిసి జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. ‘‘మంచీ చెడూ అని ద్వంద్వాలు నిర్దిష్టంగా ఉంటాయా? రెండు ఛాయలూ ఏకకాలంలో ఉండవచ్చు కదా?’’ అని ప్రశ్నించే పాల్ వీటన్నిటికీ దూరంగా సంగీతకారుడిగా ఎదుగుతున్నప్పటికీ మాదకద్రవ్యాలకు బానిసై జీవితంలో ఎత్తుపల్లాలను చూస్తూనే ఉంటాడు. దయ్యాల, ఆత్మల ప్రమేయాన్ని కొద్దిగా ప్రవేశపెట్టి, భిన్నమైన వ్యక్తిత్వాలని ఛిన్నాభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో, నాన్‌లీనియర్ పద్ధతిలో, సర్వసాక్షి కథనం ద్వారా పరిచయం చేస్తుంది రచయిత్రి. కథనం చురుగ్గా సాగడానికి సూటిగా సులువుగా ఉన్న భాష ప్రధాన కారణం అయింది. మార్చి నెలలో నాప్ఫ్ ప్రచురణ సంస్థ ద్వారా విడుదలయిన ఈ నవలకి పాఠకులు, విశ్లేషకుల స్పందన విశేషంగా ఉంది. -పద్మప్రియ -
గతానుగతికం
ముప్పై మూడేళ్ల కిమ్ జియాంగ్ ఓరోజు పొద్దున్నే లేచాక, వాళ్ల అమ్మలాగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఇది కాస్త తగ్గిందనుకున్నాక, కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన చిన్నప్పటి స్కూల్ స్నేహితురాల్లాగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. జియాంగ్కి తన శరీరంలో తను ఇమడలేని ఉక్కపోత ఎక్కువై, రూపాంతరావసరం ముందుకొస్తోందనేది డాక్టర్ చెప్పిన కారణం. కానీ ఇదిలా జరగడానికి స్త్రీగా జియాంగ్కి ముప్పై మూడేళ్ల గతం, అది సృష్టించిన కారణాలున్నాయి. దక్షిణ కొరియాలో సాధారణమైన కుటుంబంలో రెండో అమ్మాయిగా పుట్టిన జియాంగ్కి చిన్ననాటినుంచే లింగవివక్ష అంటే ఏమిటో తెలుసు. ఇంట్లో తల్లిదండ్రులు తమ్ముడిని చూసుకునే పద్ధతిలోనూ, స్కూల్లో మగపిల్లలు వేధించే విధానాల్లోనూ, వాటిని టీచర్లు చూసీచూడకుండా ఊరుకోవడాల్లోనూ, జీవితాలతో రాజీపడి చదువులు మానేసి తమ్ముడిని చదివించడం కోసం అక్కాచెల్లెళ్లు అనారోగ్యకరమైన పరిస్థితుల్లో కార్మికులుగా పనిచేయటంలోనూ– లోకవ్యవహారాల పట్ల అవగాహన కలుగుతూ వచ్చింది. వ్యవస్థీకృతమైన వివక్షనీ, పురుషాధిపత్యాలనీ అంగీకరించడం స్త్రీల జీవితాలలోకి అసంకల్పితంగానే ప్రవేశిస్తూ వచ్చింది. కుటుంబ పరిస్థితులు కాస్త మెరుగయ్యాక, కాలేజీ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాల్లోకి అడుగుపెడదామన్నా అదే వివక్ష (‘‘ఆడవాళ్లని ప్రత్యేకంగా చూడనక్కర్లేదు. సమానంగా చూస్తే చాలు’’). అభ్యర్థుల ఎంపిక, వేతనాలు(కొరియాలో మగవాళ్లకిచ్చే జీతాల్లో కేవలం అరవైమూడు శాతం మాత్రమే ఆడవాళ్లకిస్తారు) పదోన్నతులలోనూ అదే వివక్ష. మాటర్నిటీ సెలవుల మీద వెళ్తారనీ, చాలామంది తర్వాత ఉద్యోగాలు మానేస్తారనీ వీళ్లని ఉద్యోగాల్లో ప్రమోషన్లకి కూడా పరిశీలించరు (‘‘ఆడవాళ్లు ఉద్యోగాల్లో ఎందుకుండరూ అంటే, ఉండటం అసాధ్యమయ్యేలా మీరు చేస్తారు కాబట్టి.’’). ఉద్యోగం చేస్తున్నప్పుడే పెళ్లిచేసుకున్న జియాంగ్ కొన్నేళ్లకి అమ్మాయిని ప్రసవించాక, చివరికి అదే జరిగింది. అత్తామామలో, అమ్మానాన్నలో సహాయం అందించగల పరిస్థితులు లేనందువల్ల జియాంగ్ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది.‘‘ఎప్పుడో ఏదో పొందటం కోసం ఇప్పుడున్నదాన్ని ఎందుకు త్యాగం చేయాలి?’’అన్నది జియాంగ్ అంతర్వాణి అయినప్పటికీ, మరో ప్రత్యామ్నాయం లేదు. పిల్లని చూసుకోవడం, ఇంటి బాగోగులూ వంటావార్పులతోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. పిల్లని డేకేర్‌కి పంపించినప్పటికీ, సగటున మిగిలే ఖాళీ సమయం రోజుకి మూడు గంటలు! భర్త అర్థం చేసుకోగలడన్నది ఒక్కటే జియాంగ్కి ఊరట. కానీ, దానివల్ల ప్రత్యేకించి ఏ ప్రయోజనమూ లేదు– ఎందుకంటే, అతనికి ఏపనీ చేయడం రాదు. కాన్సర్లకీ, గుండెలకీ అధునాతనమైన పద్ధతుల్లో వైద్యమందించే ఈరోజుల్లో నెలసరి సమయాల కడుపునొప్పులకి మందు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే, ‘‘మందులతో కలుషితం కాని గర్భాశయాలు కావాలి వీళ్లకి– పచ్చటి అరణ్యాలలోని స్వచ్ఛమైన పచ్చికబయళ్లలాగా,’’ అంటుందొక పాత్ర. చిన్న తలనొప్పి వస్తేనే వెంటనే మాత్రలు వేసుకునేవాళ్లు, ఆడవాళ్లు మాత్రం ప్రసూతి వేదనలన్నీ మాతృత్వమనే అపురూపమైన హోదాని పొందడం కోసం ఆనందంగా భరించాలని సలహాలిస్తుంటారు. స్తీల సమస్యల పట్ల జియాంగ్ పడుతున్న వేదనగా సాగే కిమ్ జియాంగ్, బార్న్ 1982 నవల ఫెమినిస్ట్ సిద్ధాంత చర్చలతో విసిగించదు. కథకి ఎంచుకున్న అంశాలూ, సంఘటనలూ (ప్లాట్) దానికి ఒక కారణమైతే, క్లినికల్ స్టయిల్లో ఉద్వేగరహితంగా కథనం చేసిన తీరు మరో కారణం. రచయిత్రి చో నామ్ జూ 2016లో రాసిన ఈ తొలి నవల పదిలక్షల కాపీలకి పైగా అమ్ముడుపోయి సృష్టించిన సంచలనం అంతాయింతా కాదు. ఫెమినిస్ట్ భావజాలాలపట్ల సానుభూతితో ఈ నవలని సమర్థిస్తున్నవారిని ట్రోల్ చేసినవారి సంఖ్య అధికంగా ఉందంటే, ఆర్థిక ప్రగతిలో చాలా ముందున్న దక్షిణ కొరియా భావజాలాల విషయంలో మాత్రం ఎక్కడో పాతరోజుల్లోనే ఉండిపోయిందన్నది విదితమౌతుంది. గత సంవత్సరం ఈ నవల ఆధారంగా కొరియన్ సినిమా రాగా, నవలకి జేమీ చాంగ్ చేసిన ఇంగ్లీష్ అనువాదం ఈ సంవత్సరమే విడుదలయింది. ఇది కేవలం దక్షిణ కొరియాకి మాత్రమే పరిమితమైన కథ కాదు. మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల కుటుంబాల్లో ఈ కథలు కనిపిస్తూనే ఉంటాయి. స్త్రీలకి సమానావకాశాలు కల్పించడానికి పురుషాధిక్యపు భావజాలాల ప్రపంచం ప్రత్యేక దృష్టిని సారించకపోతే సార్వజనీనమైన ఇలాంటి కథలు సార్వకాలికం అయ్యే ప్రమాదం ఉంది. - ఎ.వి.రమణమూర్తి నవల : కిమ్ జియాంగ్, బర్న్ 1982 రచన : చో నామ్ జూ మూలం ప్రచురణ : 2016 కొరియన్ నుంచి ఇంగ్లిష్ అనువాదం : జేమీ చాంగ్ ప్రచురణ: లివ్రైట్ ; 2020 -
కబుర్లే మానవాసక్తి
మానవజాతి పరిణామ క్రమ చరిత్రను చెప్పే పుస్తకం ‘సేపియన్స్’. 2011లో హీబ్రూలో వెలువడి 2014 లో ఇంగ్లిషులోకి అనువాదమైన ఈ పుస్తక రచయిత ఇజ్రాయిల్‌కు చెందిన యువల్ నోఆ హరారీ. దీన్ని తెలుగులోకి ఆర్.శాంతసుందరి అనువదించారు. డెబ్బై వేల ఏళ్ల క్రితం ఆధునిక సేపియన్లు (‘తెలివైన’ మనుషులు) కొత్తగా భాషా నైపుణ్యం సాధించారనీ, ఇది గంటలకొద్దీ సన్నిహితులతో ఉబుసుపోని కబుర్లు చెప్పుకునేందుకు దోహదం చేసిందనీ, ఈ సాన్నిహిత్యం కోసమే మనుషులు పరిమిత సమూహాలుగా బతికారనీ అంటారు. సమూహంలోని మనుషుల సంఖ్య పెరిగితే సాన్నిహిత్యం తగ్గిపోతుంది. ‘‘ఈ కబుర్లు చెప్పుకోవటం అనే సిద్ధాంతం హాస్యంగా అనిపించవచ్చు, కానీ ఎన్నో అధ్యయనాలు దీన్ని సమర్థిస్తున్నాయి. ఈనాటికీ ఎక్కువశాతం మానవ వ్యక్తీకరణ ఈమెయిల్ ద్వారా అయినా, ఫోన్ ద్వారా అయినా లేక వార్తాపత్రికల్లో కాలమ్‌ల ద్వారా అయినా– అది పోచికోలు కబుర్లే. అది మనకి ఎంత సహజంగా అలవడిందంటే అసలు భాష పుట్టిందే ఇందుకా అనిపిస్తుంది. చరిత్ర పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు భోజన సమయంలో కలుసుకున్నప్పుడు మొదటి ప్రపంచయుద్ధం గురించి మాట్లాడుకుంటారనీ, అణు శాస్త్రవేత్తలు సమావేశాలకి హాజరైనప్పుడు విరామ సమయంలో కాఫీ తాగుతూ క్వార్క్(ఉపకణం)ల గురించి మాట్లాడుకుంటారనీ అనుకుంటున్నారా? ఎప్పుడైనా అలా జరగవచ్చు. కానీ సాధారణంగా వాళ్లు వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న మొగుణ్ణి పట్టుకున్న మరో ప్రొఫెసర్ గురించో, శాఖాధిపతికీ, డీన్కీ మధ్య జరుగుతున్న గొడవ గురించో, లేక ప్రయోగాలు చేసేందుకు ఇచ్చిన డబ్బుతో ఖరీదైన కారు కొనుక్కున్న తమ తోటి ఉద్యోగి గురించో పోచికోలు కబుర్లు చెప్పుకుంటారు. ఈ కబుర్లు సామాన్యంగా ఎవరో చేసిన తప్పులూ, నేరాల గురించే సాగుతాయి.’’ -
సాహిత్య సంచారం
బార్సిలోనాకి చెందిన అరవై యేళ్ల మాక్ నిర్మాణ వ్యాపారం కుప్పకూలిపోయింది. కొడుకులు వాళ్ల వాళ్ల జీవితాల్లో స్థిరపడి ఉన్నారు; భార్య ఫర్నిచర్ వ్యాపారంలో బిజీగా ఉంది. ఖాళీ సమయాన్ని ఎలా వెచ్చించాలా అని ఆలోచించిన మాక్ ఒక పుస్తకం రాయాలనుకుంటాడు. తన మరణానంతరం బయటపడి, అసంపూర్ణ రచనలా అనిపించే సంపూర్ణమైన రచన ఒకటి చేసిపెట్టుకోవాలని అతని ఉద్దేశం. అప్పటివరకూ చదువరిగానే తప్ప రచనానుభవం లేని మాక్కి సాహిత్యం పట్ల అభిప్రాయాలైతే ఉన్నాయి. సాహిత్యం మళ్లీ మళ్లీ పునరావృతమయ్యే ఒకే విశేషమనీ, సమస్యకి కారణాలు అన్వేషించే ప్రయాణాలే వివిధ రచనలుగా వెలువడుతున్నాయనేది అతని సిద్ధాంతం. రిపిటిషన్ అనేది సాహిత్యపు మౌలిక సూత్రం అన్నది అతని స్థిరాభిప్రాయం. ఈ ప్రయత్నాల్లో అతనుండగా, పొరుగున ఉండే సాంచెజ్ అనే ప్రముఖ రచయితని కలవడం తటస్థిస్తుంది. ఈ రచయిత తొలినాళ్లల్లో వ్యసనాలకి బానిసగా ఉన్నప్పుడు ‘వాల్టర్స్ ప్రాబ్లమ్’ అనే పది గొలుసు కథలున్న నవల రాసాడు. వాల్టర్ అనే వెంట్రిలాక్విస్ట్ కోల్పోయిన తన గొంతుని తిరిగిపొందడం, వివిధ రచయితల గొంతుల్లో ఆత్మకథని వినిపించడం నవల సారాంశం. సాంచెజ్ చేసింది మంచి ప్రయత్నమే కానీ, అప్పటికి అతనున్న మైకపు స్థితుల్లో ఒక్కోకథలో అర్థంలేని కొన్ని పేరాలు రాసుకుంటూ పోయాడు. ఇప్పుడా పుస్తకం కాపీలు ఎక్కడా దొరక్కపోవడం అతనికి కొంత ఊరట. మాక్ ఈ పుస్తకాన్ని కొన్నేళ్ల క్రితం సగం చదివి పక్కన పడేసాడు. సాహిత్యం ఎలానూ పునరావృతమయ్యేదే కాబట్టి దీన్నే తిరగరాసేస్తే సరిపోతుంది కదా అనుకుంటాడు. ఇప్పుడా పుస్తకాన్ని మాక్ మళ్లీ చదువుతుంటే, రచయిత సొంతగొంతుని సాధించడం కోసం చేసే ప్రతీకాత్మక ప్రయత్నంగా కథ అర్థమవుతూ పాత్రలు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. ఎంత సుపరిచితంగా అంటే– పుస్తకం మధ్యలో అతని భార్య పేరు శీర్షికగా ఒక కథ ఉంది! మాక్ కేవలం చదువరి అని మాత్రమే చెబితే చాలా తక్కువ చెప్పినట్టు. అతను చేసిన సాహిత్య శోధన అంతాయింతా కాదు. పుస్తకాలలోని వాక్యాలనీ, ఎపిగ్రాఫ్లనీ ఉదహరించగలిగినంత అపారమైన సాహిత్య పరిచయం ఉంది. ఈ పాండిత్యం నేపథ్యంగా తను సృష్టించబోతున్న నవలావరణంలోకి పూర్తిగా కూరుకుపోతున్న సమయంలోనే భార్య, సాంచెజ్ల మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానం కలిగాక అప్పటివరకూ సాహిత్య శిఖరాలని అందుకోవలని ప్రయత్నిస్తున్న మాక్, భ్రాంతుల లోతుల్లోకి జారిపోవడం ప్రారంభిస్తాడు. హెమింగ్వే అన్నట్టుగా ‘‘నో, ఐ కాన్ట్. ఐ యామ్ డన్ విత్ ఇట్,’’ లాంటి ఆత్మహత్యని ప్రేరేపించే వాక్యాలు మనసులో మెదులుతుంటాయి. కథకుడిగా మాక్ చెప్పినవన్నీ పూర్తి సత్యాలు కావనీ, కొన్ని అబద్ధాలూ ఉన్నాయనీ నెమ్మదిగా విశదమవుతూంటుంది. సాహిత్య నిర్మాణ యత్నంలో తనకు తానే సమస్య అయిపోయిన మాక్ రాసిన డైరీయే‘మాక్స్ ప్రాబ్లమ్’ నవల. ఇది కేవలం కథకోసం ఒకటిరెండు రోజుల్లో చదవాల్సిన నవల కాదు. రచయిత బెర్నార్డ్ మాలాముడ్ని మాక్ ఉదహరించినట్టుగా– ఠీజ్చ్టి’టn్ఛ్ఠ్ట జీటn’్ట ్టజ్ఛి ఞౌజీn్ట. ఈ నవల ఒక అరుదైన సాహిత్య పరామర్శ, ప్రశంసాత్మక విమర్శ. ఎన్నో కథల గురించీ, పుస్తకాల గురించీ, రచయితల గురించీ, ప్రహసనాల గురించీ, సినిమాల గురించీ మాక్ వివరణలు, వాటిల్లోనుంచి కొటేషన్లూ ఈ రెండువందల పేజీల నవలలో విస్తృతంగా పరుచుకునుంటాయి. ఉదహరించిన రచనలతోబాటుగా ఈ నవలని చదవగలిగితే అది మరోస్థాయి పఠనానుభవం. పాఠకుడికి కొత్తదారుల్ని చూపించి ప్రోత్సహించే ఈ మెటాఫిక్షనల్ నవల హాస్యంతోపాటుగా మెటాఫిజికల్ ఆలోచనలనీ అందిస్తుంది. ఎన్‌రికె విలా–మాతాస్ స్పెయిన్‌కి చెందిన ప్రముఖ రచయిత. నవలలో సాంచెజ్ రాసినట్టుగా చెప్పిన ‘వాల్టర్స్ ప్రాబ్లమ్’ నిజానికి ఈ రచయితే 1988లో రాసిన నవల. ఈ ఆధార నవల ఇంగ్లిష్‌లోకి అనువాదం అయితే కనక– హెమింగ్వే, బోర్హెస్, రేమండ్ కార్వర్, జాన్ చీవర్, జీన్ రీస్ లాంటి ప్రముఖ రచయితల గొంతులని విలా–మాతాస్ అనుకరించిన పద్ధతి తెలుసుకునే వీలుంటుంది. మార్గరెట్ జల్ కోస్టా, సోఫీ హ్యూస్ ద్వయం చేసిన ‘మాక్స్ ప్రాబ్లమ్’ ఇంగ్లిష్ అనువాదం సాఫీగానూ, ఫిలసాఫికల్గానూ సాగిపోతుంది. - ఎ.వి. రమణమూర్తి నవల : మాక్స్ ప్రాబ్లెమ్ (లేదా) మాక్ అండ్ హిజ్ ప్రాబ్లెమ్ రచయిత : ఎన్‌రికె విలా–మాతాస్ స్పానిష్‌లో ప్రచురణ: 2017 ఇంగ్లిష్ : మార్గరెట్ జల్ కోస్టా, సోఫీ హ్యూస్ ప్రచురణ : న్యూ డైరెక్షన్స్, 2019 -
ప్రజల మనిషికి బహువచనమే లోపలి మనిషి
ఏ సాహిత్య ప్రక్రియ అయినా శూన్యం నుంచి రాదు. అది చరిత్ర నుంచి ప్రేరణ పొందుతూనే, వర్తమానంతో ప్రభావితమవుతూ ఉంటుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ పీవీ నరసింహారావు ‘లోపలి మనిషి’ నవల (ఆంగ్లంలో ‘ది ఇన్సైడర్’, తెలుగు ‘లోపలి మనిషి’, అనువాదం: కల్లూరి భాస్కరం). గాఢమైన జీవితానుభవం, ఇతివృత్తంగా స్వీకరించిన చారిత్రక ఘటనల నుంచి ఉన్మీలనమైన తాత్త్విక కాంతిధార వెంటాడుతూ ఉంటే పీవీ ఈ నవల రాసి సాంత్వన పొందారనిపిస్తుంది. రాజకీయ సంస్థ పరిధిలో ఆయన లోపలి మనిషి. రాజకీయ వంచనతో, విలువల శైథిల్యంతో జాతి కన్న కల భగ్నమైపోతుంటే నిరసన గళం విప్పిన ప్రజల మనిషి కూడా. శతాబ్దాల పరాయి పాలన నుంచి విముక్తం కావడానికి ఎన్నో స్రవంతులనూ, పంథాలనూ కలుపుకుని పోరాడి గెలిచిన ఒక పురాతన జాతి తొలి అడుగులే తడబడుతుంటే, సంకెళ్లు తెగిపడ్డాయన్న స్పృహ లుప్తమై, కొత్త చరిత్ర నిర్మాణం వైపు కాకుండా, మళ్లీ బానిసత్వ చిహ్నాలను ముద్రించుకోవడానికి తహతహలాడుతూ ఉంటే సహించలేని లోపలి మనిషి, వాటి గురించి ప్రజల మనిషి చేత పలికించడమే ఈ నవల విశిష్ట శైలి. స్వేచ్ఛాభారతంలోనూ దగా పడుతున్న ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకున్న లోపలి మనిషి, ప్రజల మనిషికి బహువచనంలా వినిపిస్తాడు. లోపలి మనిషి పీవీ. ప్రజల మనిషి ఆనంద్, ఈ నవలానాయకుడు. ఆగస్ట్ 15, 1947 అనే ఆ ఒక్క తేదీతో సమాన చారిత్రక ప్రాధాన్యమున్న తేదీగా మరొకదానికి పట్టం కట్టడం అసాధ్యం. అదే, అఫ్రోజాబాద్ సంస్థానమైతే ‘1948’ కాలచక్రంలోని ఒకానొక సంవత్సరం కాదు, కొత్త ఉషోదయం. ఈ ఉషస్సుకు ముందుటి అంధకారంలోనే ‘లోపలి మనిషి’ ప్రస్థానం ఆరంభమవుతుంది. భారతదేశమంతటా గాంధీజీ అహింసా సిద్ధాంతంతో భారత జాతీయ కాంగ్రెస్ పరాయి పాలన పునాదులు కదిలిస్తున్నది. అఫ్రోజాబాద్ సముద్రంలో దీవిలా మిగిలింది (562 స్వదేశీ సంస్థానాలలో ఒకటైన హైదరాబాద్‌కు రచయిత పెట్టిన పేరు). అక్కడ నవాబు ప్రపంచ కోటీశ్వరుడు. కానీ ఒంటి నిండా గుడ్డ ఉన్న పౌరులు అతి తక్కువ. వార్తాపత్రిక, రేడియో నిషిద్ధం. అయినా కాంగ్రెస్ ఉద్యమ ప్రభావమే కాదు, ఆయుధాన్ని నమ్మిన తీవ్ర జాతీయోద్యమ సెగ సైతం సంస్థానంలోకి ప్రవేశించింది. హఫీజ్ అనే విప్లవకారుడు అందించిన విప్లవ సాహిత్యం, భగత్‌సింగ్ తండ్రికి రాసిన చరిత్రాత్మక లేఖ ఆనంద్‌ను అప్పటికే నిజాం మీద ఆరంభమైన సాయుధపోరు వైపు అడుగులు వేయించాయి. స్వతంత్ర భారతంలో తొలిపొద్దు సందేశం– దేశానికి స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయనే. ఆపై గాంధీజీ హత్య. తరువాత గొడ్డలి పిడి తత్త్వాన్ని గుర్తు చేస్తూ కశ్మీర్ కోసం పాకిస్తాన్ మొదటి దాడి. నలభై ఆరుశాతం భూభాగంలో విస్తరించి ఉన్న సంస్థానాల విలీనంతో విశాల భారత ఆవిష్కరణ... వరుసగా జరిగాయి. తరువాత– తొలి సార్వత్రిక ఎన్నికలు. ‘టికెట్లు కోరుకునేవారిలో చాలామందిని ఆకర్షించేది అధికారమే కానీ, మరొకటి కాదని సాధారణ పరిశీలకులకు సైతం తెలిసిన వాస్తవం’(పే 98) అనతికాలంలోనే ఆవిర్భవించింది. పాతికేళ్ల స్వతంత్ర భారత ఉత్థానపతనాల మీద వ్యాఖ్య ఈ నవల. అందులో ఎన్నికలకి ఇచ్చిన స్థానం చాలా పెద్దది. ఎన్నికలలో రచయిత మహా పతనమే చూశారు. దేని పతనం? ప్రజాస్వామ్య పతనం. ‘దేశ పరిపాలన విషయంలో ప్రజాభిమతాన్ని ప్రతిబింబించడమనే వాస్తవిక ప్రయోజనాన్ని క్రమంగా ఎన్నికలు కోల్పోతూ వస్తున్నాయ’ (పే. 324)ని నిర్ధారణకొస్తాడతడు. దేశంలో సగం ఉన్న మహిళ ఎన్నికలలో పోటీ చేయాలంటే, మొదట జాతీయ కాంగ్రెస్ శల్యపరీక్షలో, ‘నా పడకగదిలోంచి ఆమె నడవనప్పుడు ఎన్నికల్లో కూడా ముందుకు సాగలేదు’ (పే. 221) అని చెప్పే పరిశీలకుల దగ్గర ఎలా నెగ్గాలి? లాల్‌బహదూర్ శాస్త్రి వంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు కలగచేసుకోవడంతో పరిశీలకుడు అప్పటికి (ఆనంద్ సన్నిహితురాలు అరుణ టికెట్టు రగడ) ఓడిపోయాడు. ప్రథమ ప్రధాని నెహ్రూ గురించీ, వ్యక్తిత్వం గురించీ ఇంతటి సమదృష్టితో పరిశీలించిన రచన మరొకటి ఉండదేమో! నెహ్రూ అంటే ఒక మహావృక్షం. అలీనవాదం, మిశ్రమ ఆర్థికత, సోషలిజం, ప్రభుత్వ రంగం, పంచవర్ష ప్రణాళికలు, నిరాయుధీకరణ, అకాడమీల స్థాపన, ఫెడరలిజం, సెక్యులరిజం – ఆ మహావృక్షం శాఖలే. అయినా, ‘నెహ్రూ అనే దేవత లక్షల మంది దెయ్యాలున్న పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడన్నదే’ (పే 284) ఆనాటి అభిప్రాయం. నెహ్రూ ఆదర్శాలకీ, సమకాలిక సమాజానికీ మధ్య ఇంత దూరం! ‘ఎంతో తలపండిన రాజకీయవాదులు కూడా అలీన విధానాన్ని తేలికగా జీర్ణించుకోలేకపోయారు’ (పే 343). సోషలిజం నెహ్రూ స్వప్నం. కానీ అది వేదికలకీ, ఉపన్యాసాలకీ పరిమితం కావాలన్నదే కాంగ్రెస్ పెద్దల అభిమతం. లౌకికవాదం విషయంలో నెహ్రూ ఏకాకి. ‘భారతదేశంలో జాతీయవాది అనదగిన ఏకైక ముస్లిం ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ’ (పే 400) అని ఆయన వ్యతిరేకులు ఎత్తి పొడిచేవారు. 1962 నాటి చైనా యుద్ధంలో భారత్ ఓటమి దరిమిలా ఆయన తన ఈ పాత ప్రపంచం నుంచి తనను తానే బలవంతంగా బయటకు తెచ్చుకున్నారు. ఇక్కడ ఆనంద్ ఆరోపణ ఏమిటి? ‘నెహ్రూ మహాత్మా గాంధీని, ఆయన ఆదర్శాలను ముందుకు సాగించినట్టు నెహ్రూను, నెహ్రూ ఆదర్శాలను సాగించేవారు ఒక్కరూ లేరు’ (పే 386). ఆఖరికి నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కూడా అందుకు మినహాయింపు కాదన్నదే అతడి నిశ్చితాభిప్రాయం. ఇందిర పాత్ర చిత్రణ దగ్గర పీవీలోని స్వరాజ్య సమరయోధుడు, స్వతంత్ర భారత రాజకీయాల ప్రత్యక్ష సాక్షి మరింత కఠినంగా మారిపోవడం గమనిస్తాం. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక, అందులో ఇందిర పాత్ర (పార్టీ సమావేశంలో నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, లోపాయికారిగా ఉపరాష్ట్రపతి వివి గిరిని అభ్యర్థిగా నిలిపి గెలిపించారు, దానికి అంతరాత్మ ప్రబోధం అని పేరు పెట్టారు) భారతీయులు రెండుగా చీలిపోయారన్న అపోహకు బీజం వేశాయని (ప్రపంచం దృష్టిలో, ముఖ్యంగా పాక్ దృష్టిలో) ఆనంద్ అభిప్రాయపడతాడు. ఆమె హయాంలో సాగిన అసమ్మతి రాజకీయాలు, ముఖ్యమంత్రుల మార్పు దేశ ప్రతిష్టకే భంగకరమని ఆనంద్ బాధ. ‘ఎంతో గొప్పవాడైన తన తండ్రిని కూడా జనం మరచిపోయేంత ఘనకీర్తిని సంపాదించాలన్న తపనతో ఆమె వేగిపోతోంది’ (పే 454) అనుకుంటాడు లోపలి మనిషి. తన తరువాత ఈ వైభవం కొడుకు సంజయ్‌కి సంక్రమించాలన్న తపననూ ఆమెలో గమనిస్తాడు. భూమి సమస్య; ప్రాధాన్యం, రాష్ట్రాల పునర్విభజన,రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, భారత జాతీయ కాంగ్రెస్‌కు కాంగ్రెస్ (ఐ) అనే ‘తోక’, పత్రికారంగం పతనం, నక్సల్బరీ, పాక్, చైనా సంబంధాలు, కామరాజ్ పథకం, హిందూ ముస్లిం సమస్య .... ఇలా నవలలో ఆనంద్ చేత లోపలి మనిషి మాట్లాడించిన చారిత్రకాంశాల జాబితా విస్తారమైనది. ఆ జాబితా స్వతంత్ర భారతదేశ చరిత్ర పుటలలోని ప్రతి అధ్యాయపు ఛాయే. చరిత్రకు ఛాయ సాహిత్యమే. ‘లోపలి మనిషి’ నవలాకారుడు సాహిత్యం లోతులు తెలిసినవారు. బహుభాషా పండితుడు. అందుకే పత్రికారంగం, భాషా వివాదాలు ఆయన దృష్టిపథం నుంచి తప్పించుకోలేదు. స్కూప్, స్పెషల్ కరస్పాండెంట్లు, కొసన ప్రశ్నార్థకం ఉన్న శీర్షికలతో వెలువడే వార్తలు, అవి సృష్టించే కృతక వాతావరణం వంటి అంశాలను పీవీ చిత్రించారు. నెహ్రూ వారసులెవరు అంటూ డజన్ల కొద్దీ పుస్తకాలు వెలువడుతుంటే, కొన్ని ప్రమాదకర సమస్యలు దేశంలో ఉద్యమ రూపంలో వీధులకెక్కాయి. అవి ప్రాంతీయమైనవి, భాషాపరమైనవి, మతపరమైనవి. నిజానికి అంతా రాజకీయమే. అస్సాం సాహిత్య సభ 1959లో వారి భాషను అధికార భాషగా ప్రకటించాలని కోరింది. అక్కడ బెంగాలీ మాట్లాడేవారు ఉన్నారు. ఇది హింసాత్మకమైంది. ఇంతకంటే దారుణం– తమిళనాడు హిందీ వ్యతిరేకాందోళన. ‘తమిళతల్లి’ కోసం ఆత్మాహుతులు జరిగిపోతున్న కాలం. ఒక మంత్రి ఇంట జరిగిన పెళ్లిలో ఉత్తర భారత నర్తకుడు బిర్జూ మహరాజ్ కార్యక్రమం ఏర్పాటయిందని తెలిసి తెలుగుప్రాంతం నుంచి వెళ్లిన ఆనంద్ తదితర నేతలు కంగుతిన్నారు. ఈ హిందీ వ్యతిరేకోద్యమ ఘట్టానికి కొసమెరుపు– ఎంపీ అయిన ఓ హిందీ వ్యతిరేకోద్యమ నేత ఆనంద్‌కు పరిచయం. ఒక విమానాశ్రయంలో ఇద్దరూ తారసపడ్డారు. తమిళ ఎంపీ వెంట కొడుకు ఉన్నాడు. వారి మధ్య సంభాషణ ఇది. ‘మీకు తెలుసో లేదో, మావాడు ఢిల్లీలో చదువుతున్నాడు. హిందీలో వీడిక్లాసులో ఎప్పుడూ వీడే ఫస్టు’ అన్నాడు ఎంపీ. ‘మీకు హిందీ రాదు. పైగా ఆ భాషకు వ్యతిరేకం. ఎప్పుడూ ఆందోళన చేస్తూనే ఉంటారు’ విస్మయంతో అడిగాడు ఆనంద్. ఇందుకు మరింత విస్మయం కలిగించే జవాబు, ‘చూడండి, అవి రాజకీయాలు...’ (పే. 321). సమాఖ్య వ్యవస్థలో కేంద్రం బలహీనంగా ఉందన్న అభిప్రాయం బలపడినప్పుడూ, తమను పట్టించుకునే వెసులుబాటు ఢిల్లీకి లేదు కాబోలునని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు నిరాశ పడినప్పుడు నక్సలిజం వంటి సమస్యలు అనివార్యమనే పీవీ చెబుతారు. ‘భూస్వామ్య వ్యవస్థ వైఫల్యాలను మీ పార్టీ (కాంగ్రెస్) వాడుకుంటే, ఇప్పుడు నక్సలైట్లు మీ విధానంలోని వైఫల్యాలను వాడుకుంటున్నారు. అవి మరింత కొట్టొచ్చినట్టు కనిపించే వైఫల్యాలు’ అని బలరాం అనే పాత్ర (భూస్వామి) వ్యక్తం చేసిన అభిప్రాయంలో ప్రతిబింబించేది ఇదే. భూమి సమస్యకు కొనసాగింపుగానే పీవీ నక్సల్ సమస్యను చూశారు. అయినా ఆయన దృష్టిలో భారతీయతకు ఆకృతిని ఇచ్చినదే భూమి. సోషలిజం కాంగ్రెస్ పార్టీ నినాదం. కానీ భూసంస్కరణలు తేవడానికి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆనంద్ చేసిన ప్రయత్నం భంగపడింది. చివరికి అది అతడి పదవిని బలిగొన్నది(వాస్తవంలో ఇందుకు బలిపశువైనవారు పీవీయే). ఇదే ఈ నవలకు ముగింపు. ‘లోపలి మనిషి’ పీవీ ఆత్మకథాత్మక నవలగా చెబుతున్నారు. కానీ ఇది నాటి ఎందరో విజ్ఞుల ఆత్మావలోకనం. దానికి అక్షరరూపం ఇచ్చినవారు దాదాపు పీవీ ఒక్కరే. ఎంతటి చరిత్రపురుషులనైనా దేవుళ్లుగా ప్రతిష్టించవద్దంటుందీ నవల. చరిత్రను మింగే స్థాయిలో చరిత్ర పురుషులను ఆరాధించకూడదని ఘోషిస్తుంది. - డా‘‘ గోపరాజు నారాయణరావు -
గురి తప్పని కథలు
మల్లిపురం జగదీశ్ రచించిన 13 కథల సంపుటి ‘గురి’. గిరిజనుల జీవితాల్లోని ఆనందాలు, ఆవేశాలు, అవమానాలు, ఆక్రందనలు, సాహసాలు, బ్రతుకు పోరాటాలు, నీతి న్యాయాలు, ఆచార క్రమాలు, సాంస్కృతిక ధర్మాలు... ‘పరి ముళ్ళకంప మీద ఆరేసిన నారచీరను బయటకు తీసిన రీతిగా’ ముళ్ళు గుచ్చుకోకుండా, చీర చిరగకుండా జాగ్రత్తగా రాసిన కథలు ఇవి. ఆదివాసీ జీవితాలను నాలుగు దిక్కుల స్పృశించి, స్వీయ అనుభవంతో, బాధ్యతల బరువులో క్రుంగిన బాల్యాన్నీ, బంధాల కొంగులో దాగిన నిజాన్నీ, బ్రతుకు పరుగులో అలసిన అమాయకత్వాన్నీ కలిపి, భవిష్యత్తును ఊహించి రాసిన కథలు. ‘నేను మానవుణ్ణి, నేను ఆదివాసిని. గోచీ గుడ్డ, చేతిలో చుట్ట నాకు ఆనవాళ్లు. నాకు మతం లేదు, నాకు తల్లి ఉంది, ఆమె అడవి తల్లి.’ జగదీష్ కథలలో గట్టి రాజకీయ కంఠస్వరం వినిపిస్తుంది. విద్యా లోపాలను ఎలుగెత్తి చాటే నినాదం కనపడుతుంది. ఉత్తరాంధ్రలోని ఆదివాసీలను అభివృద్ధి పేరుతో తొలగించే విధ్వంసం ప్రతిబింబిస్తుంది. అడవితనాన్ని కోల్పోయిన గిరిపుత్రుల ఆవేదన కనిపిస్తుంది. మతమార్పిడి స్థావరంగా మారిపోయిన అడవి కనిపిస్తుంది. అభివృద్ధి అనే రాజకీయ ప్రహసనాన్ని ఈ కథలు ప్రశ్నిస్తాయి. స్థానికతను నిర్దిష్టంగా రచయిత ఉపయోగించాడు. కాలమేదైనా భూములు లాక్కోవడం, ఆదివాసీలను నిర్వాసితులుగా మార్చేయడం, ఇదే కదా చరిత్ర? ఇదే కదా వర్తమాన కథ? ఒకటి భూసేకరణ, రెండు భూ ఆక్రమణ. మా బతుకు, మా ఉనికి, మా చిరునామా మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి అంటాడు రచయిత. గత చరిత్రకు గుర్తు లాంటి మంగుల్ని సిల్లిగోడు అని చంపేశారు. ‘డోలి చేతపట్టిన’ సత్యాన్ని ఇన్ఫార్మర్ అని చంపేశారు. కానీ భవిష్యత్ తరమైన గీత, విల్లు ఎక్కుపెట్టింది. లక్ష్యం ఆమె ఎంచుకోగలదు. గీత గురి తప్పదు. - డా‘‘ చింతపల్లి ఉదయ జానకిలక్ష్మి -
ఆవిరైపోతున్న అస్తిత్వాలు
మాలర్డ్. అమెరికా దక్షిణాదిలో మాప్లో దొరకని ఒక కాల్పనిక గ్రామం. అక్కడున్న నల్లవాళ్లంతా తెల్లవాళ్లుగా చలామణీ కాగలిగినంత తెల్లగా, తగ్గితే కాస్త చామనఛాయగా ఉంటారు. వీళ్లటు పూర్తిగా నల్లవారూ కాదు, ఇటు తెల్లవాళ్లలో కలిసిపోనూలేరు. స్టెల్లా, డెజిరీ అనే ఇద్దరు అమ్మాయిలూ ఒకే పోలికతో ఉన్న కవలలు. తండ్రి చదువు రానివాడైనప్పటికీ అతను ఒక అమెరికన్ యువతికి అసభ్యకరమైన ఉత్తరం రాసాడన్న నెపం మీద అమెరికన్లు కొంతమంది అతన్ని కొడుతూ బయటకు ఈడ్చుకెళ్లి తుపాకీతో కాల్చేస్తారు. తలుపుచాటు నుండి ఈ లించింగ్ని చూసిన కవలలకి అప్పటిదాకా తమ అస్తిత్వాల గురించి అర్థంకాని విషయమేదో ఆ క్షణంలో అర్థమయినట్టు అనిపిస్తుంది. ఒకరికొకరు అన్నట్టుగా ఉండే ఈ అక్కచెల్లెళ్లు, తండ్రి చనిపోయాక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక అమెరికన్ ఇంట్లో పనిచేయటం మొదలుపెడతారు. ఉన్న ఊరిలో భవిష్యత్తు లేదనుకున్న కవలలు తల్లికి చెప్పకుండా ఊరొదిలి పారిపోతారు. న్యూ ఆర్లీన్స్కి చేరుకున్న కొద్దిరోజుల తరవాత డెజిరీని వదిలేసి వెళ్లిపోతుంది స్టెల్లా. ‘వైట్ ప్రివిలేజెస్’ కోసం స్టెల్లా అమెరికన్ యువతిగా చలామణి అవుతూ ఉన్నత కుటుంబీకుడైన ఒక అమెరికన్‌ని పెళ్లిచేసుకుని తాను కోరుకున్న స్వతంత్రతా, భద్రతా, సమాజంలో గౌరవం సంపాదించుకున్నప్పటికీ ఆమె జీవితం కత్తిమీద సాములా సాగుతుంది. భర్త ప్రేమను పూర్తిగా పొందినా, ఒంటరితనం ఆమెను వేధిస్తూ ఉంటుంది. ఇంకొకరిలా మారడమనే ప్రక్రియ అసంపూర్ణమనీ, తనది కాని ప్రపంచంలో తను ఎప్పుడూ ఒంటరేననీ ఆమె ఊహించలేదు. నిరంతరం చేసే నటనలో ఎప్పుడైనా తాను దొరికిపోతుందేమో, భర్త తనని వదిలేస్తాడేమో అన్న అనుమానం, తనగతాన్ని తనే తృణీకరించుకున్నానన్న నిజం ఆమెను వేధిస్తూనే ఉంటాయి. కూతురు కెన్నెడీకి ఆమె విషయమంతా తెలిసిపోవటంతో, అప్పటికే ఇద్దరి మధ్యా ఉన్న దూరం మరింత పెద్దదవుతుంది. జీవితంలో ఏం చేయాలో, తనకేం కావాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటుంది కూతురు కెన్నెడీ. ఇటు ఒంటరిగా జీవిస్తున్న డెజిరీ కొంతకాలానికి ఒక నల్ల జాతీయుడిని పెళ్లి చేసుకుంటుంది గానీ, అతను పెడుతున్న బాధల్ని తట్టుకోలేక కూతురు జూడ్ని తీసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చేస్తుంది. మాలర్డ్లో తనను ప్రేమించిన, తనకీ ఇష్టమైన వ్యక్తితో సహజీవనం ప్రారంభిస్తుంది. కూతురు జూడ్ మాత్రం తను ఎదుర్కొంటున్న వివక్షకి అతీతంగా అకుంఠిత ధ్యేయంతో మెడికల్ కాలేజ్‌లో చేరుతుంది. ఆడపిల్లగా పుట్టిన ట్రాన్స్ సెక్సువల్రీస్ పట్ల ఆమె ప్రేమా, అతనికి ఆసరానివ్వడం ఆమె స్థిర జీవిత దృక్పథాన్ని తెలియజేస్తాయి. నలభై యేళ్ల కథతో బాటు ఆ కథని జాతి వివక్ష, ఎల్జీబీటీక్యూ చరిత్రలతో అనుసంధానించే స్పష్టమైన కాలరేఖ నవలలో ఉంది. వానిషింగ్ హాఫ్ – అదృశ్యమైపోతున్న సగం అస్తిత్వం – అనేది నవలలోని కీలకాంశం. విడిపోయిన డెజిరీ, స్టెల్లాలు తమలోని చెరి సగాలనీ, గతాన్ని కోల్పోవడం వల్ల స్టెల్లా తనలోని సగాన్నీ, మానసిక దూరాల కారణంగా స్టెల్లా, కెన్నెడీలు తమలో చెరి సగాలనీ కోల్పోయారు. నవలంతా పరుచుకునున్న ఊపిరి సలపని అస్తిత్వాన్వేషణల సమస్యలకి భిన్నంగా జూడ్, రీస్ల మధ్య ప్రవహించే ప్రేమమాత్రం కొంత ఊరట కలిగిస్తుంది. నవలలో తప్పొప్పుల నైతిక బేరీజులు లేవు– జీవిత గతులను పరిచయం చేయటం తప్ప, ఆ జీవితాల గురించి మనకి ఆలోచనలు రేకెత్తించడం తప్ప. మరో టోనీ మారిసన్, జేమ్స్ బాల్డ్విన్ అని విశ్లేషకులచేత అభివర్ణించబడుతున్న అమెరికన్ రచయిత్రి బ్రిట్ బెన్నెట్ రాసిన ద వానిషింగ్ హాఫ్ నవల గత నెల రివర్‌హెడ్ ద్వారా విడుదలై అగ్రస్థానంలో ఉంది. హెచ్‌బివో వారు పెద్దమొత్తానికి సినిమా హక్కులు కొనటం రచయిత్రి సాధించిన మరో విజయం. ‘‘దూరమవడానికి వంద కారణాలుండవచ్చు, చేరువవవ్వటానికి కొన్ని చాలు,’’ అని నవలలోని ఒక పాత్ర అంటుంది. ఆ కారణాలని ఆప్యాయంగా భద్రపరచుకోకపోతే, ఉత్తరోత్తరా వివక్ష సృష్టించే ఉత్పాతాలకి మనమే ఉత్తరవాదులం అవుతాం. (నవల: ద వానిషింగ్ హాఫ్ రచన: బ్రిట్ బెన్నెట్ ప్రచురణ: రివర్ హెడ్, 2020) - పద్మప్రియ -
దందహ్యమాన వర్తమానము
స్కూల్లో చదువుతున్నప్పుడు ఆటల్లో మహాచురుగ్గా ఉండేది జివాన్. మంచి క్రీడాకారిణి అవుతుందనుకున్న పి.టి. సర్ ఆశలకి భిన్నంగా– స్కూల్ ఫైనల్ అయిపోగానే, ఇంటికి సాయపడదామని పాంటలూన్స్ షోరూమ్‌లో సేల్స్‌గర్ల్‌గా చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకుంది ఈ ముస్లిం అమ్మాయి. సొంతంగా ఒక స్మార్ట్ ఫోన్ కూడా కొనుక్కుని ఆశల మెట్లు ఎక్కడం ప్రారంభించింది. చదువురానివాళ్లకు సహాయపడాలని లవ్లీ అనే హిజ్డాకి ఇంగ్లీష్ పాఠాలు చెప్పడం, ఫేస్బుక్లో సామాజిక సమస్యల మీద స్పందించే చైతన్యశీలి జివాన్. కోల్‌కతాలో తనుంటున్న మురికివాడలకి దగ్గరగా ఉన్న రైల్వేస్టేషన్ దగ్గర ఒకరోజు నిలుచుని ఉన్నప్పుడు కొంతమంది తీవ్రవాదులు రైల్వే కంపార్ట్మెంట్స్ తలుపులు మూసేసి, లోపలున్నవారిని తగలబెట్టేస్తున్న ఘోరాన్ని చూస్తుంది. ఇది జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా మౌనంగా చూస్తూ వున్నారని తెలుసుకుని, ‘‘మనలాంటి వాళ్లకి సహాయం చేయకపోగా, చచ్చిపోతుంటే చూస్తూ వూరుకున్న ఈ ప్రభుత్వం కూడా టెర్రరిస్ట్ కాదా?’’అని ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంది. ఫలితంగా కొద్ది రోజుల్లోనే అర్ధరాత్రప్పుడు అరెస్ట్ కాబడి, తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో విచారణ ఖైదీగా జైలుకి చేరుతుంది. మధ్యతరగతి ఆర్థిక వర్గానికి చేరుకోవాలనే ఒక్క ‘దురాశ’తప్ప మరేమీ కోరికల్లేని జివాన్ భవిష్యత్తు అనిశ్చిత స్థితికి చేరుకుంది.జివాన్ది కేవలం తాత్కాలికావేశమే అనీ, దేశద్రోహ చింతన ఉన్న అమ్మాయి కాదనీ కోర్టులో చెప్పగలవారు ఇద్దరున్నారు. లవ్లీ, పి.టి. సర్. జివాన్ జైలులో మగ్గుతున్న కాలంలో వీరిద్దరి జీవితాలలోనూ పెనుమార్పులొస్తాయి. లవ్లీకి అనుకోకుండా సినిమా అవకాశాలు రావడంతో, జివాన్కి మద్దతిచ్చి భవిష్యత్తుని పాడు చేసుకోకూడదని శ్రేయోభిలాషులు హితవు చెబుతారు. అనుకోకుండా ఒక మతవాద రాజకీయ పార్టీ సభకి వెళ్లిన పి.టి. సర్ అక్కడివారి దృష్టిలో పడి, ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, ఎన్నికల తర్వాత ఆ మతతత్వపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, అందులో ఒక సెక్రటరీ అవుతాడు. హిందూత్వానికి వ్యతిరేకంగా జరిగే తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ప్రభుత్వంగా, రైలు దహనం కేసులో ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చే బాధ్యత తమమీద ఉంది కాబట్టి, జివాన్ కేసుని త్వరగా తేల్చేయడానికి పి.టి. సర్ చర్యలు తీసుకుంటాడు. సామాజికంగానూ, ఆర్థికంగానూ, చివరికి నైతికంగా కూడా ఎలాంటి మద్దతూ లేని జివాన్ ఎలాంటి ముగింపుకి చేరగలదో అక్కడికే చేరుతుంది. జివాన్, లవ్లీ, పి.టి. సర్– విభిన్న నేపథ్యాలున్న ముగ్గురూ జీవితాన్ని మొదటి మెట్టు దగ్గర్నుంచి ప్రారంభించినవారే. కానీ కొంతమందే నిప్పులు చిమ్మగలరు. కొంతమంది నెత్తురు మాత్రమే కక్కగలరు. కోల్‌కతాలో పుట్టి పెరిగి, అమెరికాలో స్థిరపడ్డ మేఘా మజుందార్ తొలిప్రయత్నం ఈ నెలే విడుదలయిన ‘ఎ బర్నింగ్’ నవల. కేవలం మూడే పాత్రల బహుళ కథనాలతో నడిచే నవలలో జివాన్, లవ్లీల కథనాలు ఉత్తమ పురుషలోనూ, పి.టి. సర్ కథనం ప్రథమ పురుషలోనూ చిన్నచిన్న అధ్యాయాలుగా ఉండటం వల్ల చదువరిని సూటిగానూ, వాడిగానూ తాకుతాయి. పాత్రలకి ఉపయోగించిన భాష (ఇండియన్ ఇంగ్లీష్) కూడా, పాత్రల నేపథ్యాలకి తగినట్టుగా మారుతూ ఉండటం మరో విశేషం. జివాన్ కథనం అభావంగా ఉంటే, లవ్లీ కథనం మౌఖికమైన భాషతో వ్యక్తీకరణే లక్ష్యంగా లైవ్లీగా ఉంటుంది. ప్రథమ ప్రయత్నంలోనే విలక్షణమైన గుర్తింపుని రచయిత్రి పొందడానికి కథనంలో చూపిన విచక్షణత ఒక కారణమైతే, తలెత్తుతున్న ఫాసిస్టు ధోరణుల సమకాలీనతని వస్తువుగా స్వీకరించడంలో ఉన్న తక్షణత మరో కారణం. రైల్వే కంపార్ట్మెంట్ లోపల అమాయక ప్రజల జీవితాలు కాలిపోవడం ఘోరమైన విషయమే. ఖండించి తీరాల్సిన అంశమే. అయితే, బాహ్యప్రపంచంలో మతరాజకీయాల్లో పడి జీవితాలు దగ్ధమవడం మరింత శోచనీయమైన విషయం– వీటి లెక్కలు ఎక్కడా కనిపించవు కూడా! ‘రోజులు మారాయి, నిజమే; చీకట్లు మారలేదు, అదీ నిజమే’ అని శ్రీశ్రీ ఒక బెంగాలీ కవితని నలభయ్యేళ్ల క్రితం అనువదించారు. దురదృష్టవశాత్తూ, ఆ మాటలు ఇప్పటికీ నిజమే. - ఎ.వి.రమణమూర్తి నవల: ఎ బర్నింగ్ రచన: మేఘా మజుందార్ ప్రచురణ: నాఫ్; జూన్ 2020 -
బద్దలు కొట్టాల్సిన లోపలి గోడలు
రెండో ప్రపంచ యుద్ధానంతరం కొన్నేళ్లకి జర్మనీ రెండుగా విడిపొయింది. తూర్పు జర్మనీ, రష్యా తదితరదేశాల కమ్యూనిస్ట్ ధోరణులతో ప్రభావితమవుతూండగా, పశ్చిమ జర్మనీ అమెరికావంటి దేశాల అండతో ఆర్థికంగా ఎదగటం మొదలుపెట్టింది. తమ ప్రభుత్వపు నియంతృత్వ ధోరణుల వల్ల పశ్చిమ జర్మనీ దిశగా జరుగుతున్న మేధోవలసలని గమనించిన తూర్పు జర్మనీ ఇరుదేశాల మధ్య బెర్లిన్ గోడని 1961లో నిర్మించింది. ముప్పై ఏళ్ల తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల వల్ల ఆ గోడను కూల్చేసి తూర్పు, పశ్చిమ జర్మనీలు కలిసిపోయాయి: ద ఫాల్ ఆఫ్ ద వాల్. ‘ద మాన్ హూ సా ఎవ్రీథింగ్’ బెర్లిన్ గోడ కూలగొట్టడానికి సంవత్సరం ముందు మొదలవుతుంది. లండన్‌లో ఉండే కథకుడూ, కథానాయకుడైన సాల్ ఆడ్లర్ చరిత్రకారుడు. తూర్పు జర్మనీలో అతను చేయబోయే పరిశోధనకు ప్రతిగా, వారు సాధించిన ప్రగతి గురించి సానుకూల వ్యాసం రాయాలన్న ఒప్పందం మీద సాల్ తూర్పు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉంటాడు. అతని వీలుకోసం వాల్టర్ ముల్లర్ అనే అనువాదకుడిని ఏర్పాటుచేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఫొటోగ్రఫీలో శిక్షణ పొందుతూ తనకంటూ ఒక మంచి భవిష్యత్తు çసృష్టించుకోవాలన్న ఆశయంతో ఉన్న జెనిఫర్, సాల్కి స్నేహితురాలు. మగవారిలో అరుదుగా కనిపించే విలక్షణమైన అందం, ఆకట్టుకునే విగ్రహం ఉన్న సాల్ ఆమె ఫోటోగ్రఫీకి వస్తువు కూడా! లండన్‌లోని అబీరోడ్డు దాటబోతుండగా సాల్కి ఒక చిన్న ఆక్సిడెంట్ అవుతుంది. తరవాత జెనిఫెర్ అతనినుంచి విడిపోవటం, సాల్ జెర్మనీ ప్రయాణం, వాల్టర్ ముల్లర్‌తో అతని ప్రేమవ్యవహారం, ఆ దేశంనుంచి పారిపోవాలనుకుంటున్న వాల్టర్ చెల్లెలు లూనా ఒక ఆయుధంగా సాల్ని వాడుకోవాలనుకోవటం, అనాలోచితంగా వాల్టర్, లూనాలను ఇబ్బందుల్లోకి నెట్టేసి సాల్ లండన్ తిరిగి రావటం జరుగుతుంది. తిరిగి 2016లో, అదే అబీరోడ్దుపైన, అదే ఉల్ఫ్‌గాంగ్ అన్న వ్యక్తి కార్ నడుపుతూ మళ్లీ సాల్ని ఢీకొంటాడు. సాల్కి ఈసారి బలమైన గాయాలవుతాయి. ఇక్కడినుంచీ సాల్ జీవితం హాస్పిటల్లో, మార్ఫిన్ మగతలో అంతరంగ మథనాలతో, జ్జాపకాల గజిబిజిలో గిజిగాడిగూడే అవుతుంది. అస్పష్టమైన నవల ముగింపులో మూడోసారి అబీరోడ్డు చేరుకున్న సాల్, రోడ్డుని క్షేమంగా దాటినట్టే కనిపిస్తుంది. బ్రిటిష్ రచయిత్రి డెబ్రా లెవీ 2019లో రాసిన ఈ నవల విశ్లేషకుల ప్రశంస పొందింది. కథకుడి వ్యక్తిగత చరిత్ర జర్మనీ దేశచరిత్రతో కలగలిసిపోయి– తన అంతరంగపు లోతులని నిజాయితీగా చూసుకుని, ప్రశ్నించుకుంటూ కదులుతుంది. మార్ఫిన్ మగతల్లో సాల్ చెప్పే కథ లీనియర్, నాన్ లీనియర్ గతుల్లో విచిత్రంగా సాగటంవల్ల కథకుడిని పూర్తిగా నమ్మలేని స్థితి. బెర్లిన్ వాల్ ఉన్న సమయంలోనే జర్మనీ వెళ్లి బీటిల్స్ సంగీతంపై నిషేధం, వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవటం, ప్రజలు దేశాన్ని వదిలి పారిపోవాలనుకోవటం, మనుషులపై ప్రభుత్వ నిఘాలు గమనించిన సాల్, కొద్దిరోజుల్లో ఆ గోడ కూలిపోతుందని చెప్పటం ఊహించని భవిష్యద్దర్శనం. రెండోసారి ప్రమాదం తరవాత సాల్ తన పురాజ్ఞాపకాలలో చిక్కుకుపోయి, వర్తమానానికి రావటానికి ఇబ్బందిపడుతూ ఉంటాడు. తను ఇన్నేళ్లూ పోషిస్తూ వచ్చిన ఆత్మవంచనల పొరలని చీల్చుకుంటూ బయటకొస్తున్న తనలోని చీకటి కోణాలని ఒప్పుకోటానికి కష్టపడతాడు. ‘‘సాల్, నీలో ప్రేమించే లక్షణం ఉందా? నిన్నెవరైనా ప్రేమించారా?’’ లాంటి ప్రాథమిక ప్రశ్నలు అతన్ని నిలదీస్తూ ఉంటాయి. తనను ప్రేమించినవారి పట్ల తను స్వార్థంతో, క్రూరంగా ప్రవర్తించానన్న సత్యాన్ని సాల్ గుర్తించవలసి వస్తుంది. జెనిఫర్ నిర్వహించిన ఒకానొక ఫొటో షోలో ‘ముక్కలైన మనిషి’ పేరున్న ఫొటోలో సాల్ అవయవాలన్నీ ముక్కలుముక్కలుగా, చెల్లాచెదురుగా, శూన్యంలోకి విసిరేసినట్టుగా ఉన్నట్టుగా – సాల్ కూడా ముక్కలైపోయిన మనిషేనా? ‘ప్రతి ఫొటో వెనక కనబడని మనిషి రూపం మరొకటుంటుంది’ అని సాల్ అన్నట్టు, మనుషులు తమలోని ఆ మరోమనిషితో నిజాయితీగా ఉండటం అవసరమంటుందీ నవల. అది సాధించగలిగితే, చివర్లో సాల్ అబీరోడ్డుని ప్రతీకాత్మకంగా, విజయవంతంగా దాటడం అనేది ఊహాత్మక వాస్తవం అయ్యేబదులు, వాస్తవమే అవుతుంది. బద్దలు కొట్టాల్సిన గోడలు మనిషి అంతరంగాల్లో కూడా ఉంటాయి! - పద్మప్రియ -
మెక్సికో స్త్రీల ఆర్తధ్వనులు
మెక్సికోలోని లామటోసా అనే చిన్న ఊర్లోని ఓ పంటకాలువ. దాని ఒడ్డున జీర్ణావస్థలో నీళ్లల్లో తేలుతూ ఉన్న మంత్రగత్తె శవాన్ని చూశారు అయిదుగురు పిల్లలు. మంత్రగత్తెని ఎవరు, ఎందుకు చంపారు? చేతబడులు చేస్తుందనీ మంత్రతంత్రాలను ప్రయోగిస్తుందనీ నమ్మే లామటోసా ఊరి ప్రజలకి మంత్రగత్తె అంటే భయమే కాదు, కొద్దిపాటి అసహ్యం కూడా. ఆ ఊరి స్త్రీలు మాత్రం తమ మానసిక, శారీరక సమస్యలను మూలికలూ మంత్రాలతో నయం చేసుకోవటానికి ఎవరికంటా పడకుండా రహస్యంగా ఆమె దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఎంతోమంది గల్లంతైపోయిన ఒక తుఫాను రాత్రి అనంతరం ఆ మంత్రగత్తె చనిపోయిందనుకుని, ఆమె కూతుర్నే మంత్రగత్తె అనడం మొదలుపెడతారు ఊరి జనం. వాళ్ల ఇంట్లో ఒక మూసేసిన గది ఉందనీ, అందులో బంగారు నాణాలున్నాయనీ ప్రజల అనుమానం. లూయిస్మీ, యేసేనియా అదే ఊరిలో తమ అమ్మమ్మ దగ్గర పెరుగుతుంటారు. చిన్నతనంలోనే మద్యం, డ్రగ్స్ లాంటి దురలవాట్లకు బానిసైన లూయిస్మీ బాధ్యతారాహిత్యం గురించి తెలిసిన యేసేనియాకి, మంత్రగత్తెని అతనే చంపాడేమో అన్న అనుమానం వస్తుంది. జరిగిన కథేమిటంటే– పెంపుడు తండ్రి వల్ల గర్భవతై ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పదమూడేళ్ల నోర్మా గతం గురించి తెలియని లూయిస్మీ ఆమెని భార్యగా స్వీకరిస్తాడు. అత్తగారి సలహా మేరకు అబార్షన్‌కి ఒప్పుకున్న నోర్మా, మంత్రగత్తె ఇచ్చిన పసర్లు మింగి ఆరోగ్యం విషమించి ఆస్పత్రి పాలౌతుంది. లూయిస్మీ ఉగ్రుడైపోయి తన స్నేహితుడితో కలిసి మంత్రగత్తె ఇంటిని దోచేద్దామని వెళ్లగా, అక్కడ డబ్బేమీ దొరకకపోగా ఊహించని పరిస్థితులలో స్నేహితులిద్దరూ మంత్రగత్తెని చంపి శవాన్ని కాలవలో పడేసి పారిపోతారు. మంత్రగత్తె చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఊరిజనం నిధి కోసం ఆ ఇంటిమీద పడతారు. అందరికంటే ముందుగానే ఆ డబ్బుకోసం అక్కడికి చేరుకున్న పోలీసులు మూసేసిన గదిని హడావుడిగా పగలగొట్టినప్పుడు తెలిసిన కొత్త నిజాలేమిటి? చివరికి మిగిలిందేమిటి? అది నవల ముగింపు. హరికేన్ సీజన్ – తుఫానులాగా కమ్మేసే ఈ నవల ప్రపంచ పాఠకులనుంచి ప్రత్యేకమైన ప్రశంసలను పొందుతోంది. ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయిత్రి ఫెర్నాండా మెల్చోర్ రాసిన స్పానిష్ నవలల్లో ఇంగ్లీషులోకి తొలిసారిగా అనువదింపబడి, బుకర్ ఇంటర్నేషనల్ అవార్డ్‌కి షార్ట్‌లిస్ట్ అయిన ఈ నవలని సోఫీ హ్యూస్ అనువదించారు. థర్డ్ పర్సన్ నెరేషన్‌తో కథనం పాత్రలు, కాలాల మీదుగా సాగుతూ మంత్రగత్తె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫుల్‌స్టాపులు లేని పొడుగైన వాక్యాలు జ్వరప్రకంపనాలుగా సాగుతూ పాత్రల జీవితాల్లోకి చదువరిని లాగేస్తాయి. చాప్టరంత పేరాగ్రాఫు ఒక్కోసారి పేజీల కొద్దీ సాగిపోయినా కథనంలో వేగం తగ్గదు; విసుగు పుట్టించదు. పేదరికంతో పాటు డ్రగ్స్, మద్యం, విశృంఖల శృంగారం, హోమోసెక్సువాలిటీ గురించి నవలలో వినిపించే పచ్చిదనం నగిషీలు చెక్కని వాస్తవం. స్పానిష్ భాషలో లావాలా ఎగజిమ్మిన క్రోధం, అశ్లీలత, హింస, తిట్లని ధ్వనింప చేయటానికి ఇంగ్లీష్ భాషలోని వివిధ మాండలికాలతో ఎంతో శ్రమించాల్సి వచ్చిందని అంటారు అనువాదకురాలు. జీవితాలలో ఉన్న హింసలకీ విషాదాలకీ అతీతంగా పాత్రలు చూపించే ప్రేమ కరుణ నవలకి విడిగా కనిపించని చోదకశక్తి. శవాలను ఖననం చేసేటప్పుడు వాటితో ప్రేమగా మాట్లాడటం తన బాధ్యత అనుకునే కాపరి, శవాలను పూడుస్తూ మాట్లాడే ముగింపు వాక్యాలు, ‘‘ఈ చీకట్లు ఇలా ఉండిపోవు. దూరంగా నక్షత్రంలా కనబడుతున్న వెలుగును చూశావా? ఆ వెలుగు దగ్గరకే నువ్వు వెళ్తోంది. వెతల కలుగులోంచి ఆ వెలుగులోకి వెళ్లే దారి ఇదే!’’ అనటం ముగిసిన ఆ జీవితాలకి ఆఖరి ఓదార్పు. మెక్సికోలో కనిపించే పేదరికం, లింగవివక్ష, ఫెమీసైడ్ (స్త్రీలు కాబట్టి చంపేయడం), మాఫియా, డ్రగ్స్, వ్యభిచారం, నిరక్షరాస్యతలతో మగ్గిపోతూ మార్పుకోసం ఎదురుచూసే జీవితాల్లోకి వెలుగు వచ్చేదెప్పుడనీ, వారు శ్వాసించే హింసకు నిజమైన అంతమెప్పుడనీ ఉగ్రస్వరంతో వేసిన ప్రశ్నే ఈ నవల. పద్మప్రియ నవల: హరికేన్ సీజన్ రచయిత్రి: ఫెర్నాండా మెల్చోర్ స్పానిష్ నుంచి ఇంగ్లిష్: సోఫీ హ్యూస్ మూల నవల ప్రచురణ: 2017 -
యుద్ధము – అశాంతి
థర్టీ ఇయర్స్ వార్‌గా చరిత్రలో నిలిచిపోయిన యూరప్ అంతర్యుద్ధం 1618–1648ల మధ్య ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగింది. కాథొలిక్స్, ప్రొటెస్టెంట్స్ మధ్య మతవిశ్వాసాల ఘర్షణగా మొదలైన యుద్ధం, వివిధ కారణాల మీదగా విస్తరించి, రోమన్ సామ్రాజ్యాన్ని రెండు పక్షాలుగా విభజించి, ఎనభై లక్షల మరణాలకి కారణమయింది. ఈ యుద్ధమే డానియల్ ఖిల్మన్ నవల ‘టిల్’కి నేపథ్యం. 2017లో ఖిల్మన్ రాసిన ఈ జర్మన్ నవల రోస్ బెంజమిన్ ఇంగ్లీష్ అనువాదంతో ఈ సంవత్సరమే విడుదలై, బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌కి షార్ట్‌లిస్ట్ అయింది. ఈ హిస్టారికల్ ఫిక్షన్లో ఇది హిస్టరీ తాలూకు ఒక భాగం. టిల్ ఉలెన్స్పిగల్ అనే విదూషకుడు 14వ శతాబ్దానికి చెందినవాడు. అతని గురించి 1515లో తొలిసారిగా కామిక్స్ వచ్చాయి. ప్రజల బలహీనతలను ఎత్తిచూపిస్తూ, అల్లరిచిల్లరి చేష్టలతో గొడవ చేస్తూ ఉండే ఆ టిల్, ప్రస్తుతం నవలలోని కథానాయకుడు. అతడిని పధ్నాలుగో శతాబ్దం నుంచి పట్టుకురావడం హిస్టరీ, అతన్ని పదిహేడో శతాబ్దంలోకి ప్రవేశపెట్టడం ఫిక్షన్! యుద్ధఛాయలు కమ్ముకుంటున్న ఒక ఊళ్లో టిల్ ఇచ్చే ప్రదర్శనతో నవల ప్రారంభం అవుతుంది. పాదరసం లాంటి టిల్ ఒకేసారి అయిదు బంతులతో జగ్లింగ్ చేయగలడు. వెంట్రిలాక్విజం చేయగలడు. ఎత్తుగా కట్టిన తాడు మీద చకచకా నడుస్తూ అబ్బురపరచే విన్యాసాలని ‘‘శరీరానికి బరువు, జీవితానికి విచారం అనేవి లేనట్టుగాం’’ చేయగలడు. జనాల మూర్ఖత్వాల మీద ప్రాక్టికల్ జోక్స్ వేయగలడు. ‘‘చావు గురించే ఆలోచిస్తూ కూచోవద్దు. దానికంటే మేలైన అవకాశం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది,’’ అనేది అతని సిద్ధాంతం. అన్నీ చేస్తూనే, మాట్లాడుతూనే అంతలోనే మాయమైపోగలడు. అతని వైదుష్యం అనంతరం,అతని బాల్యం మనకి పరిచయం అవుతుంది. మిల్లు నడుపుతుండే టిల్ తండ్రి క్లౌస్కి సృష్టిలోని రహస్యాల మీద ఆసక్తి ఎక్కువ. తెలియని విషయాలని శోధించాలనుకునే ఆయన్ని మంత్రగాడనే నెపంతో క్రైస్తవ మతాచార్యులు హింసించి మరణశిక్ష విధిస్తారు. ఇదంతా చూస్తున్న టిల్, తన స్నేహితురాలు నెలా అనే అమ్మాయితో ఊరు వదిలి పారిపోతాడు. ఊరూరా వినోద ప్రదర్శనలిచ్చే బృందాలతో కొన్నాళ్లు తిరిగి, అంచెలంచెలుగా పేరు సంపాదించి, ‘వింటర్ కింగ్’ఫ్రెడరిక్ ఆస్థానంలో విదూషకుడి స్థానంలో కుదురుకుంటాడు– తన స్నేహితురాలితో సహా. రాజుని వినోదపరచడమే కాదు– విమర్శించడమూ అతని పనిలో భాగమే, తాడుమీద నడకే! ఫ్రెడరిక్ భార్య ఎలిజబెత్, ఇంగ్లండ్ రాజు కూతురు. ఎలిజబెత్ ఇచ్చిన రాజకీయ సలహాని ఫ్రెడరిక్ పాటించడంతో ముప్పై ఏళ్ల యుద్ధానికి తెర తీసినట్టు అవుతుంది. యుద్ధాలతోనూ, దౌత్యాలతోనూ రాజులు తమ అధికారం కోసం శ్రమిస్తూ ఉండగా, అక్కణ్నుంచి బయటపడి రకరకాల ప్రస్థానాలు సాగించిన టిల్, చివరి సన్నివేశంలో మళ్లీ ఎలిజబెత్‌ని కలుసుకోవడంతో నవల ముగుస్తుంది. ‘‘హాయిగా మరణించాలనుకోవడం కంటే, మరణించకుండా ఉండగలగడం అనేది మేలైన విషయం,’’అనే ఆఖరి సందేశంతో మాయమైపోయిన టిల్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నామంటే, అతను దాన్ని పాక్షికంగా సాధించినట్టే! స్థూలంగా కథ ఇదే అయినా, ఇదంతా చాలా విస్తృతమైన అంశాల మధ్య నడుస్తుంది. నటనే నిజాయితీగానూ, గారడీయే వాస్తవంగానూ అనిపించే రోజులు అవి. నవలా సంవిధానం కాలంలో ముందుకీ వెనక్కీ వెళుతూ, అవే పాత్రలు మళ్లీ మళ్లీ ప్రత్యక్షం కావడాన్ని సంభ్రమంగా, సరికొత్తగా చూపిస్తుంది. సంక్షోభాలని వర్ణించడానికి ఉద్వేగరహితమైన కథనాన్ని ప్రదర్శించడం, మిగతా కథని సున్నితమైన హాస్యంతో నడపడం, పాదరసంలాంటి టిల్ నవలలో కనిపిస్తూ మాయమైపోతూండటం రచయిత చేసిన జగ్లింగ్. రచయిత చేసిన గారడీలతో గతం వర్తమానం కలగలిసిపోతాయి; చరిత్రా, కల్పనా వేరుచేయడానికి వీల్లేకుండా ఉంటాయి. ప్రతిభావంతమైన బెంజమిన్ అనువాదం ప్రతి పాత్రకీ విశిష్టమైన టోన్ అందిస్తుంది. హింసాపూరితమైన చీకటి గతానికి బలైనవారికి ఈ నవల ఒక నివాళి లాంటిది. నవలలో ఒక పాత్ర చెప్పినట్టు, ‘‘ఇదంతా నిజమే. ఒకవేళ కల్పన ఉన్నా, అది కూడా నిజమే!’’ ఎ.వి. రమణమూర్తి నవల: టిల్, రచన: డానియల్ ఖిల్మన్, తొలి ప్రచురణ: 2017 జర్మన్ నుంచి ఇంగ్లిష్: రోస్ బెంజమిన్ -
ఇరాన్ అశాంతివనాలు
సంక్షుభితమైన గతాన్నీ, అది నేర్పిన పాఠాల్నీ మర్చిపోవటం సబబేనా? కేవలం నలభై ఏళ్ల క్రితం జరిగిన ఇరాన్ సంఘర్షణా భరిత చరిత్రను అప్పుడే మర్చిపోయి, ఏమీ జరగనట్టు జీవిస్తున్న తరానికి ఆ చరిత్రను గుర్తుచేయటం అవసరమనుకుని రాసిన నవల ఇది అంటారు ‘ది ఎన్లైటెన్మెంట్ ఆఫ్ ద గ్రీన్‌గేజ్ ట్రీ’ రచయిత్రి షొకుఫే అజా. మనిషి తనలోపలికి ప్రయాణిస్తేనే సత్యం బోధపడుతుందని చెప్పే ఆమె తొలి నవలే బుకర్ ఇంటర్నేషనల్ అవార్డ్ షార్ట్‌లిస్ట్‌లో చోటుచేసుకోవటం విశేషం. టెహరాన్‌లోని సంపన్న కుటుంబానికి చెందిన హూషాంగ్, రోజాని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. వారి పిల్లలు –సోరాబ్, బీటా, బహార్. 1979లో ఇరాన్లో పాహ్లావీ సామ్రాజ్యపు ఆఖరి రాజుని, రాచరికపు వ్యవస్థని ఇస్లామిక్ రివల్యూషన్ కూల్చేసి ఆయతుల్లా ఖొమేనీ మతరాజ్య వ్యవస్థని ఏర్పాటు చేయడానికి సరీగ్గా రెండు రోజుల ముందు జరిగిన అల్లర్లలో తిరుగుబాటుదారులు వచ్చి హూషాంగ్ ఇంటిని తగలబెట్టేస్తారు. పుస్తకాలూ, సంగీత పరికరాలతో పాటు పదమూడేళ్ల కూతురు బహార్ కూడా ఆ మంటలకు ఆహుతైపోతుంది. ఆత్మ రూపంలో కుటుంబంతో కలిసి ఉండే బహార్ ఈ నవలలోని కథకురాలు. దేశాన్ని అలుముకున్న మతతత్వవాదం రుచించని హుషాంగ్, చుట్టూ ఉన్న అరాచకత్వానికి దూరంగా కుటుంబంతో సహా టెహరాన్ వదిలి వెళ్లిపోతాడు. తమని వ్యతిరేకించేవారు ద్రోహులని నమ్మే మతతత్వవాదులు కొడుకు సోరాబ్‌ని రాజకీయ ఖైదీని చేస్తారు. అణచివేతలూ, స్వేచ్ఛారహిత పరిస్థితులతో విరక్తి చెంది గ్రీన్‌గేజ్ అనే పళ్లచెట్టెక్కి కూర్చుని మూడు పగళ్లూ రాత్రులూ గడిపిన రోజా మనుషులు తమ వర్తమానపు క్షణాలని నిర్లక్ష్యంగా నాశనం చేసుకుంటూ ముందుకెళుతున్నారనుకుంటుంది. సరిగ్గా ఆ క్షణంలోనే సోరాబ్‌ని కాల్చి చంపేశారు అని మొదలవుతుంది నవల. కూతురు బీటా మత్స్యకన్యగా మారటం లాంటి వింత మలుపులు, ముగిసిన జీవితాలతో కథ నడిచి, ఆ కుటుంబంలోని అయిదుగురూ విచిత్రంగా గ్రీన్‌గేజ్ పళ్లచెట్టులోకి లీనమైపోవటంతో నవల ముగుస్తుంది. ఆత్మలూ బ్రతికున్నవారూ కలిసిమెలిసి ఉండటం, జీనీ భూతాలూ, మత్స్యకన్యలూ, మార్మిక వనాలూ – పర్షియన్ సాహిత్యంలో కనిపించే మాజిక్ రియలిజాల ప్రపంచం ఒకవైపు; ఇస్లామిక్ రివల్యూషన్, నియంతృత్వ ధోరణులూ, మారణహోమాలూ, విచ్ఛిన్నమైన జీవితాల బరువైన కథనమూ ఇంకో వైపు సమతుల్యం చేస్తూ కవితాత్మక శబ్దాన్ని జారవిడవకుండా రాసిన నవలలో ఇరానియన్ సాహిత్యమూ సంస్కృతితో బాటు, అరబ్బులకంటే ముందునాళ్ల జోరాష్ట్రియన్ సంస్కృతి కలగలసిపోయి ఉంటుంది. రచయిత్రి సామాజిక పరిస్థితులను చిత్రీకరించిన తీరూ, భాషామాధుర్యం, చిత్రమైన పరిస్థితులూ, పాత్రల మధ్య పరస్పర ప్రేమానురాగాల నేపథ్యంలో వాళ్లు చవిచూసిన విషాదాలూ– ఇవన్నీ కథకున్న బలాలు. మతానికి సంబంధించని సాహిత్యమంతా రాజ్యానికి వ్యతిరేకమనీ నమ్మే మతతత్వవాదులు హుషాంగ్ వాళ్లింట్లో పుస్తకాలన్నింటినీ తగలబెట్టినప్పుడు చుట్టూ ఉన్న జనాల మౌనాన్ని చూసి ‘‘మనుషులకి ప్రేమా, సత్యమూ, చరిత్రా, జ్ఞానమూ ఇవేమీ అవసరం లేదా? భద్రతనిచ్చే కాస్తంత చోటుంటే చాలా?’’అనే బహార్ ప్రశ్నలో విజ్ఞానం లేని జాతి ఎలా ఎదుగుతుంది అన్న వేదన ధ్వనిస్తుంది. ఇరానియన్ స్త్రీలు అనుభవించిన అణచివేత, స్వేచ్ఛకోసం వారు పడిన తపనని ప్రతిబింబించే బీటా మత్స్యకన్యగా నిస్సహాయంగా ఉన్నప్పుడు, ఆ మత్స్యకన్యను సైతం బలాత్కరించడానికి ప్రయత్నించి చంపేయడం సమాజపు దౌర్జన్యం. సంఘర్షణల నుంచి తప్పుకున్న పలాయనవాదినేమోనన్న మీమాంసతో హుషాంగ్ పడే బాధ సగటు మనిషి బాధ. నవల చివర్లో ‘‘మనకెవరికీ పిల్లలు లేకపోవడం అదృష్టం. ఎందుకంటే, ఈ ప్రపంచంలో పిల్లలకి రక్షణ లేదు,’’ అన్న సోరాబ్ మాటలు భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోందనడానికి సూచన. రచయిత్రి తన దేశాన్నుంచి రాజకీయ శరణార్థిగా ఆస్ట్రేలియాకి వెళ్లవలసి రావడం, అనువాదకుడు తన పేరు చెప్పడానికి నిరాకరించడం కూడా అలాంటి సూచనలే. కానీ– ఇలాంటి నవలలు ఎలాగోలా ప్రజల మధ్యకి రావడం మాత్రం వాంఛనీయం! నవల: ది ఎన్లైటెన్మెంట్ ఆఫ్ ద గ్రీన్‌గేజ్ ట్రీ రచయిత్రి: షొకుఫే అజా పార్సీ నుంచి ఇంగ్లిష్: ‘అనామకుడు’ ప్రచురణ: 2017 పద్మప్రియ -
ఆట ఆడించేది ఎవరు?
ఇరవైకి పైగా నవలలు రాసిన బ్రిటిష్ రచయిత్రి సారా పిన్‌బరో తాజా సైకలాజికల్ థ్రిల్లర్ ‘డెడ్ టు హర్’ ఫిబ్రవరిలో విలియమ్ మారో ప్రచురణ సంస్థ ద్వారా విడుదలయింది. మూడేళ్ల క్రితం ఆమె రాసిన ‘బిహైండ్ హర్ ఐస్’ స్థాయికి తగ్గకుండా, కేవలం థ్రిల్లర్ నవలకి ఉండే సాధారణాంశాలే కాకుండా ఆర్థిక స్థితిగతుల్నీ, మానవ బలహీనతల్నీ, ప్రేమకి సంబంధించిన వివిధ వర్ణాలనీ ఈ నవలలో పొందుపరచడం విశేషం. మనం ఆడే ఆటల్ని ఆడించే మహాశక్తి నిజానికి ఇంకేదో ఉంటుందని అందరూ అంటారు కానీ, ఈ నవలలో ఆ మహాశక్తి రూపం కొంత భిన్నంగా ఉంటుంది; ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది. కథలోకి వెళ్తే– చాలా ఏళ్ల క్రితం కొడుకునీ, ఈ మధ్యనే భార్యనీ కోల్పోయిన దాదాపు డెబ్భై ఏళ్ల విలియమ్ అనే సంపన్నుడి సంస్థలో జేసన్ భాగస్వామి. జేసన్ భార్యనుంచి అతని దృష్టి మరల్చి, అతన్ని విడాకులకి ప్రోత్సహించి, మర్సీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ల కాపురం బానే సాగుతున్న సమయంలో, వ్యాపార లావాదేవీల నుంచి బ్రేక్ కావాలని విలియమ్ ఒక సంవత్సరం పాటు యూరప్ అంతా తిరిగివస్తానని వెళ్లి, ఆరునెలల్లోనే ఇంగ్లండ్‌లో కెయీషా అనే ఇరవై రెండేళ్ల మెరుపుతీగని పెళ్లిచేసుకుని తిరిగివస్తాడు. అప్పటివరకూ కమ్యూనిటీలో అందమైన పిన్నవయస్కురాలి హోదాని అనుభవిస్తున్న ముప్పై అయిదేళ్ల మర్సీలో ఒక చిన్న అసూయ మొదలవుతుంది. దీనికి తోడు, జేసన్ చూపులు కెయీషాని పరిశీలించే పద్ధతి అనుమానాన్ని పుట్టిస్తుంది; జేసన్ అర్ధరాత్రి లేచి మాట్లాడే కాల్స్, పంపే మెసేజెస్ ఆ పెనుభూతాన్ని స్థిరపరుస్తాయి. మర్సీ, కెయీషా– ఇద్దరూ రెండో భార్యలే. ఇద్దరూ బీద నేపథ్యం గలవారే. ఇద్దరూ స్టేటస్ కోసం ఈ పెళ్లిళ్లు చేసుకున్నవారే. కానీ, అన్ని విషయాల్లోనూ కెయీషాదే పైచేయిగా ఉందిప్పుడు. విలియమ్ కంపెనీని తను కొనేసే ఉద్దేశంతో ఉన్న జేసన్, కెయీషాతో భార్యని స్నేహంగా ఉండమంటాడు. పుండు మీద కారం చల్లినట్టవుతుంది మర్సీకి. చివరికి మర్సీకి కెయీషా స్నేహితురాలు అవుతుంది. కానీ, విచిత్రమైన పరిస్థితుల్లోకి ఆ స్నేహం విస్తరిస్తుంది. ‘‘ఇతరులు మనగురించి ఇలా అనుకుంటారేమో అని మనం భయపడుతూ ఉండేది నిజంగా మనం మనగురించి అలా అనుకునేదే!’’ అని కెయీషా మర్సీకి ఆలంబన అవుతుంది. ఆ స్నేహపు సన్నిహితత్వంలో మరిన్ని విషయాలు తెలుస్తాయి. విలియమ్ తొందరగా చచ్చిపోతే బాగుండునని కెయీషా ఎదురుచూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడినుంచి కథ ఊహించినదానికి విరుద్ధంగా విచిత్రమైన మలుపులు తిరుగుతూ, మంత్రతంత్రాలూ, వూడూలు లాంటి పక్కదోవ పట్టించే విషయాలతో సాగుతూ, ఊహించని ఘట్టాలకి చేరుతూ ఉంటుంది. ముళ్లు బిగుసుకుపోయిన పరిస్థితుల్లో మర్సీ చాలా పరిశోధన చేసి చాలా ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకుంటుంది. ఈ ఆట రహస్యం మొత్తం తన గుప్పిట్లో ఉందనుకుంటున్న సమయంలో, ఆ ఆటలో తన పాత్ర ఏమిటో తెలుసుకునే పరిస్థితి వస్తుంది! ముందే చెప్పినట్టు, ఈ నవల కేవలం థ్రిల్స్‌కి మాత్రమే పరిమితం కాకుండా, చేరుకున్న ప్రతి దశా ఎన్ని ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుందో చూపిస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన స్నేహం ఎలా ఉంటుందో ఒకవైపూ, డబ్బాశ అంటుకున్న స్నేహం ఎలా ఉంటుందో మరో వైపూ చూపిస్తుంది. ప్రేమల్లో రకాలనీ, గాఢతల్నీ, పలచబారటాల్నీ చూపిస్తుంది. నవల మొదటి సగం కొంచెం నిదానంగా సాగినట్టు అనిపించినా, చకచకా నడిచే రెండో భాగానికి అది సరైన పునాదులు వేస్తుంది. అన్నీ మన అధీనంలో ఉన్నాయని ధీమాగా ఉండేవాళ్లు నిజానికి ఎలా పరాధీనంగా ఉండివుండే అవకాశం ఉందో చూపించిన తీరు మాత్రం నవల చదివి ఆశ్చర్యపడాల్సిన విషయం! (నవల: డెడ్ టు హర్, రచయిత్రి: సారా పిన్‌బరో, విడుదల: 2020 ఫిబ్రవరి) -ఎ.వి. రమణమూర్తి -
జీవిత చిత్రంలో ఖాళీలు
నవల : ఇన్‌డెలికసీ రచన : అమీనా కెయిన్ ‘‘మళ్లీ ఒంటరితనం– వింతగా ఉందిప్పుడు. నా మధ్యాహ్నాలన్నీ నాక్కావలసిన దానికంటే ఎక్కువ విస్తారంగా ఉన్నాయి. నాతో నాకు కావలసినంత ఏకాంత సమయం, తోడుగా ఉన్న రచనాన్వేషణలో నాలో నన్ను కనుక్కుంటూ నేను...’’ మనిషి తన చేతనతో మమేకమవడానికీ, తన అస్తిత్వాన్ని గుర్తెరగడానికీ చేసే ప్రయత్నాన్నీ, ప్రయాణాన్నీ ఒక కవితాత్మక కథగా చెప్పగలగటం అమెరికన్ రచయిత్రి అమీనా కెయిన్ రాసిన తొలి నవల ‘ఇన్‌డెలికసీ’లో సాధించడం చూస్తాం. గత నెలలోఎఫ్.ఎస్.జి. ద్వారా ప్రచురింపబడిందీ పుస్తకం. ఒక మ్యూజియమ్‌లోని ఆర్ట్ గాలరీలో పెయింటింగ్స్, గదులూ శుభ్రం చేసే చిరుద్యోగి విటోరియా. గతకాలాల ఇరుకుదనాన్ని పట్టించుకోకుండా, ఉన్నంతలో ఒంటరిగా ధైర్యంగా హాయిగా బ్రతుకుతున్న వ్యక్తి. ఉద్యోగమూ, సంపాదనా తృప్తినివ్వకపోయినా జీవితంలోని స్వేచ్ఛని ఆస్వాదిస్తూ ఉంటుంది. రచయిత్రి కావాలన్న కోరికకు డబ్బూ సమయమూ రెండూ కరువైనా, ప్రతిరోజూ చూసినవాటి గురించి రాసుకుంటూ ఏనాటికైనా ఒక పుస్తకం ప్రచురించాలన్న ఆశతో ఉంటుంది. ఇంతలో, ఆర్ట్ గాలరీ చూడటానికి వచ్చిన ఒక సంపన్నుడు విటోరియాని పెళ్లిచేసుకుంటాడు. వివాహమైన తరవాత విటోరియాకి ప్రేమగా చూసుకునే భర్తతో పాటు తనకంటూ గదీ, రాసుకోవటానికి సమయం, స్వేచ్ఛ దొరుకుతాయి. ఈత కొట్టడం, బాలెరీనాలు చూడటం నేర్చుకోవటం వగైరాలు చేస్తూంటుందామె. కళల పట్ల ఆసక్తీ, తనకేం కావాలో తెలుసుకోవాలన్న తపనా, చూసిన విషయాల గురించి రాసే అలవాటూ ఆమెని వదిలిపెట్టవు. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఏదో అసంతృప్తికి లోనవుతుంటుంది. రచయిత్రులంటేనే చిన్నచూపు ఉన్న భర్తకు తన రాతలపట్ల కూడా గౌరవం లేదని ఆమెకు తెలుసు. దీనికితోడు ఇంటి మెయిడ్ అయిన సొలాంజ్తో ఆమెకు సఖ్యత ఏర్పడదు. తనకున్న తపనకు ఇంటి బాధ్యతలు, భర్త స్నేహితులూ, వాళ్లతో పార్టీలూ అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆమెకు. ఇవన్నీ అర్థం చేసుకోని భర్త వల్ల విటోరియా ఒంటరితనానికి గురై, సంసార జీవితానికి కూడా దూరంగా ఉంటూ, భర్తనుంచి విడిపోవాలని అనుకుంటుంది. విడిపోయినా, మళ్లీ ఉద్యోగం చేసే అవసరం లేకుండా ఉంటే బావుండునని అనుకుంటున్నప్పుడే, భర్తకూ సొలాంజ్కూ మధ్య ఉన్న సంబంధం బయటపడుతుంది. వారి బంధానికి పరోక్షంగా కారణం తనే అయినా, భర్తనుంచి విడిపోవడానికే సుముఖత చూపిస్తుంది. మళ్లీ ఒంటరి జీవితం– కానీ, ఈసారి చాలినంత డబ్బు, రాసుకునే తీరికా, ఇతర బాధ్యతలేమీ లేని జీవితం మొదలవడంతో కథ ముగుస్తుంది. విటోరియా ఉద్యోగస్తురాలైనప్పుడూ, వివాహమైనప్పుడూ, భర్తనుంచి విడిపోయిన తరువాతా– ఎప్పూడూ తనదైన పద్ధతిలోనే స్వేచ్ఛామార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది. పెయింటింగ్స్ పరిశీలించటం, వాటిలో తన ఆలోచనలనూ ఆశలనూ వెతుక్కోవడం విటోరియాకి ఇష్టమైన వ్యాపకం. ‘‘నేను మ్యూజియంలో పనిచేస్తున్నప్పుడు ఒకోసారి కిటికీలోంచి బయటకి చూస్తూ నిలబడిపోయేదాన్ని. కిటికీ అద్దాల్లో నా వెనక ఉన్న పెయింటింగ్స్ ప్రతిఫలించేవి– నాతో సహా. వాటితోపాటు నన్నలా చూసుకోవటం ప్రత్యేకంగా అనిపించేది. ఇంకోలా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నట్టు, నన్ను నేను సరికొత్తగా చూసుకుంటున్నట్టు,’’ అంటుంది విటోరియా. పెయింటింగ్స్‌లో చిత్రంతో బాటు పక్కనే ఉన్న ఖాళీలూ, ఆ ఖాళీలను నింపిన వర్ణాలు కూడా ఏదో చెప్తున్నట్టే తోచేదామెకు. విటోరియా జీవిత చిత్రంలో పెయింటింగ్స్ ఒక వర్ణంలా కలిసిపోతే, రచనా జీవితంలోని పదాలు అంతరంగపుటావిష్కరణలు. తనలో ఉన్న అసంపూర్ణతల గురించి విటోరియాకి స్పృహ లేకపోలేదు. ఏకపక్షపు నిర్ణయాలతో భర్తని దూరం చేసుకోవడం, వివాహం అక్కర్లేకపోయినా దాన్నుంచి వచ్చే భరణాన్ని మాత్రం ఆశించడం లాంటివి విటోరియాని మరీ ఎక్కువగా ఆదర్శవంతం చేయకుండా, సగటు వ్యక్తి స్థాయిలో నిలిపే వాస్తవ ప్రయత్నం చేస్తుంది నవల. సౌజన్యం కొంతమేరకు కొరవడిన పాత్రతో నవలకి ‘ఇన్‌డెలికసీ’ అన్న పేరూ, వ్యక్తిత్వపు ఛాయల సమతూకం సాధించిందన్న పేరుకి నవలా ఒకదానికొకటి సరిపోయాయి! - పద్మప్రియ -
తెరిచిన తలుపులు
నవల : అండ్ ద బ్రైడ్ క్లోజ్డ్ ద డోర్ హీబ్రూ మూలం : రానిత్ మెటలోన్ ఇంగ్లిష్ అనువాదం : జెస్సికా కోహెన్ పెళ్లికూతురు మార్జీ గదిలోకి వెళ్లి తలుపు బిగించేసుకుని, అయిదు గంటల తరవాత ‘ఈ పెళ్లి చేసుకోను. చేసుకోను. చేసుకోను’ అని తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. అంతవరకూ ఆమె మాట కోసం ఆత్రంగా ఎదురుచూసిన వాళ్లందరూ, ఆమె చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుందేమో అన్న భయంతో ఒకరిని ఒకరు చూసుకోవడం కూడా మానేస్తారు. పచ్చగా ఉన్న పెళ్లింట్లో అసలు పెళ్లి జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇజ్రాయెల్ రచయిత్రి రానిత్ మెటలోన్ (1959–2017) రాసిన ‘అండ్ ద బ్రైడ్ క్లోజ్డ్ ద డోర్’ ఈ సంక్షోభంతో ప్రారంభమవుతుంది. ఇజ్రాయెల్ సాహితీ ప్రపంచంలో ప్రముఖమైన ‘బ్రెన్నెర్ అవార్డ్’ పొందిన ఈ హీబ్రూ నవలకి జెస్సికా కోహెన్ చేసిన ఇంగ్లిష్ అనువాదాన్ని న్యూ వెసెల్ ప్రెస్ 2019లో ప్రచురించింది. ఒక్కరోజు కథ ఇది. మార్జీ, మాటి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ సాయంత్రమే పెళ్లి. మార్జీతో మాట్లాడటానికి ఎవరు ప్రయత్నించినా, మౌనమే సమాధానం. కేంద్రబిందువు మార్జీ అయినప్పటికీ, కథను నడిపేది మిగతా పాత్రలే. హాస్యం, స్త్రీవాదం, ఇజ్రాయెల్‌లో పెళ్లిళ్లు, సామాజిక ఆర్థిక పరిస్థితులు, పాలెస్తీనియన్లు, వలస వచ్చిన యూదుల ఇబ్బందులు– ఇవన్నీ చదువరి గమనంలోకి వచ్చేలా నవలలో ప్రవేశపెట్టబడతాయి. తన అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పే అమ్మాయిలా, తనకు తనే బలం అని నమ్మిన వ్యక్తిలా మార్జీ వ్యక్తిత్వం ఆవిçష్కృతమౌతుంది. ఈ సంక్షోభం మొత్తంలో మార్జీ కేవలం ఒక్క కాగితాన్ని మాత్రం తలుపు కిందనుంచి బయటకు పంపుతుంది. ‘నీ అడుగులు బరువెక్కాయి, గమ్యాన్ని చేరగలవా? అని దారిలో రాళ్లు నన్ను ప్రశ్నించాయి,’ అని మొదలయ్యే కవిత, కట్టుబాట్లను ఛేదించటానికి ఆమె లోనవుతున్న అంతర్గత సంఘర్షణకి ప్రతిరూపంగా ఉంటుంది. కథ పరిధికి లోబడి డీటెయిలింగ్ చేసిన విధానం అనుపమానం. పెళ్లింటి వాతావరణంలోని వస్తువులూ, సెంటు పరిమళాలూ, వంటింటి వాసనలూ, మేకప్పులూ, అలంకరణలూ, కేటరర్సూ, ఫొటోగ్రాఫర్లూ, ఫోన్లూ ఓవైపు; పెళ్లికూతుర్ని ఒప్పించటమెలా, అతిథులకేం చెప్పాలీ, ఇంతవరకూ అయిన ఖర్చు ఎవరు భరించాలీ లాంటి మీమాంసలు మరోవైపు. వర్ణనలు, పోలికలు చాలావరకు స్త్రీ పరంగా ఉండటం కొత్త అందం. ఆలోచనలను స్పష్టంగా చెప్పలేని పెళ్లికొడుకు మాటీ, తనకి నచ్చని చెప్పులు మార్జీ కొన్నప్పుడు వద్దనికూడా చెప్పలేడు. అతనికీ మార్జీకి మధ్య ఏదో కనపడని గోడ ఉండేది. అసలు, మార్జీతో ఉన్న అనుబంధంలో అతనిలో అతనికే ఏదో అడ్డుగా ఉండేది. మార్జీ తీసుకున్న ఈ నిర్ణయం మాటీకి కూడా కొంతమేరకు ఉపశమనాన్ని కలిగించి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల స్థైర్యాన్ని అతనికీ ఇస్తుంది. మార్జీ పరంగా ఆలోచించగలిగిన అమ్మమ్మ మరో ముఖ్యమైన పాత్ర. ఆ రోజు ఆవిడ పాడిన ‘నేను నా మనసులో ఉన్నది చెప్పటానికి భయపడతాను, నీ హృదయం ఎక్కడ గాయపడుతుందోనని’ అన్న పాట మంద్రంగా సాగుతూ ఆవిడ గదిని దాటి, చుట్టూపరుచుకున్న నిశీథిలోని వేలవేల గొంతుకలతో కలిసి తెరలుతెరలుగా విశ్వమంతా వ్యాపించి, తరతరాలుగా స్త్రీలు మోస్తున్న భారాన్ని పెళ్లగిస్తున్నట్టుగా సాగుతుంది. ఈ పాట ప్రభావమా అన్నట్టు, పెళ్లికూతురి గది తలుపు తెరుచుకుంటూ ఉంటుంది నెమ్మదిగా! మార్జీ పెళ్లిని నిరాకరించడానికి కారణాలు కథ చివర్లో కూడా స్పష్టం కావు. కానీ స్త్రీ నిర్ణయాన్ని గౌరవించడం అనేది ముఖ్య విషయమనీ, కారణాలు తదనంతర విషయాలనీ నవల అన్యాపదేశంగా సూచిస్తుంది. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో స్త్రీకి ఎక్కడైనా ఈ స్థాయిలో స్వాతంత్య్రం ఉందా అన్నది పక్కనపెడితే, ఉండటం మాత్రం అభిలషణీయం! - పద్మప్రియ -
యాత్రికుడిగా కొత్త అనుభవం
కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు గైడ్లూ, టూరిస్టు బ్రోషర్లు భట్టీయం పట్టకపోయినా కనీసం గూగుల్‌ని సంప్రదించి ఆయా ప్రదేశాల మీద ఒక అవగాహన ఏర్పరచుకోవడం నాకు అలవాటు. థాయ్‌లాండ్ విషయంలో ఉదాసీనత వల్లే అనుకొంటాను, ఆ పని చెయ్యలేదు. అది చివరికి గొప్ప మేలు చేసిందని క్రమ క్రమంగా అర్థమయింది. అధ్యయనం చేసి వెళితే ఆ ప్రదేశం మీదా అక్కడి మనుషులూ సంస్కృతి మీదా ఒక పూర్వ నిర్ధారిత అభిప్రాయంతో వెళతాం. ఆ అభిప్రాయానికి అనుగుణంగానూ బలపరచేలానూ ఉండే వివరాలూ అనుభవాల కోసం తెలియకుండానే వెదుకుతాం. ఒక్క క్వాయ్ నది మీది వంతెన గురించి తప్ప థాయ్‌లాండ్‌లోని అయుత్తయ్య (అయోధ్య అన్నమాటకు అక్కడి స్థానిక రూపం)లూ, కాంచనబురిల గురించి ఏ మాత్రమూ తెలియకుండా, తెలుసుకోకుండా వెళ్లడం వల్ల అక్కడ కనిపించిన అన్ని వివరాలనూ, అన్ని అనుభవాలనూ తిన్నగా సూటిగా మనసులో ఇంకించుకోగలిగాను. ఒక యాత్రికుడిగా ఇది కొత్త అనుభవం. ఇంకా చెప్పాలంటే ఒక కనువిప్పు. అనగనగా ఒక రాజ్యం (థాయ్‌లాండ్ యాత్రాగాథ) రచన: దాసరి అమరేంద్ర; పేజీలు: 142; వెల: 140; ప్రచురణ: ఆలంబన ప్రచురణలు, హెచ్ఐజి 85, ఏపీహెచ్‌బీ కాలనీ, బాలాజీ నగర్, కూకట్పల్లి, హైదరాబాద్–72. ఫోన్: 040–23055904 -
వలస నుంచి వలసలోకి
ఈ జనవరిలో వచ్చిన ‘ఎ లాంగ్ పెటల్ ఆఫ్ ద సీ’ చరిత్ర నేపథ్యంగా సాగే ప్రేమకథ. స్పానిష్ రచయిత్రి ఇసబెల్ అయెండ్ మాటల్లో చెప్పాలంటే– ఆవిడ నవల చివరికి న్యూయార్కర్ పత్రిక నుంచి కూడా ప్రశంసలని పొందింది! ఈ చారిత్రక ఫిక్షన్ స్పెయిన్ సివిల్ వార్తో (1936–39) మొదలవుతుంది. ఎంతోమంది స్పెయిన్ దేశ; ఛీజలు శరణార్థులై ఫ్రాన్స్‌కు చేరగా, అయిష్టంగానే స్వీకరించిన ఫ్రాన్స్ వారిని కాన్సెన్ట్రేషన్ కాంప్స్లో దుర్భరమైన పరిస్థితుల్లో ఉంచుతుంది. చిలీలో అధికార హోదాలో ఉన్న కవి పాబ్లో నెరూడాకి, స్పెయిన్ పట్ల ఉన్న ప్రత్యేకమైన మమకారం కారణంగా– రెండువేలమంది శరణార్థులను చిలీకి రప్పించడానికి ప్రభుత్వాన్ని ఒప్పిస్తారు. శరణార్థులను వినీపెగ్ అనే కార్గో ఓడలో చిలీకి తరలిస్తారు. మేధావులు కాదు, పనిచేసేవారిని తీసుకోమన్న ప్రభుత్వ సూచనను పక్కనపెట్టి చిలీ పురోగతిని కాంక్షిస్తూ నెరూడా అన్ని వర్గాల వారికీ ఓడలో చోటు కల్పిస్తారు. అలా 1939లో చిలీ చేరిన శరణార్థులు చిలీ దేశస్తులుగా మారి జీవనం సాగిస్తున్న కొన్నేళ్ల తరవాత 1970లో సోషలిస్ట్ పార్టీకి చెందిన సాల్వడార్ అయెండ్ ప్రజల మద్దతుతో చిలీ దేశాధినేత అవుతారు. అతని అధికారాన్ని ఒప్పుకోని మిలటరీ తిరుగుబాటు సాగించడం, 1973లో సాల్వడార్ అయెండ్ ఆత్మహత్య చేసుకోవడం తదనంతర పరిణామాలు. అధికారంలోకి వచ్చాక అయెండ్ ప్రభుత్వానికి చెందిన విధేయులు అందరినీ మిలటరీ వేధించడంతో చాలామంది చిలీని వదిలి వెనెజువేలా వెళ్లిపోతారు. ఖండాలూ, సముద్రాలూ దాటిన చరిత్ర ఇది. పై చరిత్రకు బలమైన వ్యక్తిత్వాలనీ, ప్రేమలనీ, స్నేహాలనీ ముడివేసి వైవిధ్యమైన ప్రేమకథను వినిపిస్తారు రచయిత్రి. స్పెయిన్ దేశస్తులైన విక్టర్, రోసెర్ శరణార్థులుగా ఫ్రాన్స్ చేరుకుంటారు. విక్టర్ తమ్ముడిని ప్రేమించి అతనివల్ల గర్భవతైన రోసెర్, ఫ్రాన్స్‌లో కొడుక్కి జన్మనిస్తుంది. అప్పటికే యుద్ధంలో విక్టర్ తమ్ముడు మరణించిన సంగతి రోసెర్కి విక్టర్ ద్వారా ఆలస్యంగా తెలుస్తుంది. కొడుకు భవిష్యత్తు దృష్ట్యా చిలీకి వెళ్లడం కోసం ఓడలో స్థానం సంపాదించాలంటే దంపతులుగా మారడం అవసరమని రోసెర్ని ఒప్పించి, ఆమెని విక్టర్ వివాహం చేసుకున్న తర్వాత ముగ్గురూ చిలీ చేరుకుంటారు. అవసరార్థం చేసుకున్న వివాహమే అయినా, అది వారి మధ్య ఉన్న స్నేహాన్నీ ఆత్మీయతనూ బలపరుస్తుంది. స్నేహంలో నిజాయితీ ప్రేమగా మారి, వారి వైవాహిక జీవితంలో పరిణతి నిండిన ప్రశాంతత నెలకొంటుంది. విక్టర్ వైద్యుడిగా, రోసెర్ పియానో టీచర్‌గా పేరు సంపాదిస్తారు. విక్టర్‌కి చెస్ ఆటలో ఉన్న ప్రావీణ్యత వల్ల ప్రెసిడెంట్ సాల్వడార్ అయెండ్కి సన్నిహితుడౌతాడు. దాదాపు నలభై ఏళ్ల తరవాత స్పెయిన్‌కి వెళ్తారు విక్టర్, రోసెర్. తమదైన ఆ దేశంలో ఏదీ తమదిగా మిగలలేదు. మనుషులూ, పరిస్థితులూ అన్నీ మారిపోయి వుంటాయి. వైరాగ్యంతో తిరిగి చిలీ వెళ్లిపోతారు. సాల్వడార్ మరణం తర్వాత, అతనికి సన్నిహితుడైన కారణంగా విక్టర్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాడు. చరిత్ర పునరావృతమై విక్టర్, రోసెర్ వెనెజువేలాకి కట్టుబట్టలతో వెళ్లిపోవాల్సి వస్తుంది. జీవితాన్ని పునఃప్రారంభించి అక్కడ స్థిరపడతారు. చిలీలో పరిస్థితులు మెరుగయ్యాకే మళ్లీ చిలీకి చేరుకుంటారు. ఇన్ని వైపరీత్యాల మధ్య సంయమనాన్నీ, ఆశావహ దృక్పథాన్నీ కోల్పోకుండా విక్టర్, రోసెర్ జీవించిన తీరూ, వారి మధ్య ప్రేమా, వారి వ్యక్తిత్వం– ఇవన్నీ కథనం చేసిన తీరు బాగుంది. కథలో మిగతా పాత్రలు కూడా బలమైనవీ, సహజమైనవీ కావడంతో నవల నిండుదనాన్ని సంతరించుకుంది. ముగింపులో కొంత నాటకీయత ఉన్నా, చరిత్రనూ కల్పననూ కలగలిపి దృఢమైన సున్నితత్వంతో నవల సాగుతుంది. - పద్మప్రియ నవల: ఎ లాంగ్ పెటల్ ఆఫ్ ద సీ స్పానిష్ మూలం: ఇసబెల్ అయెండ్ ఇంగ్లిష్‌లోకి అనువాదం: నిక్ కైస్టర్, అమాంద హాప్కిన్సన్ -
నేటి స్త్రీ కథ కూడా పాతకథేనా?
ఇంతకుముందే చెప్పిన విషయాన్నే మళ్లీ చెప్పటంలో ఒక ఇబ్బంది ఉంది: కొత్తగా ఉంటే తప్ప ఆ రచన ఆకట్టుకోలేదు. ఫెమినిజం మీద ఇంత సాహిత్యం వచ్చాక, ఇంకో నవల రాయాలంటే ఒక కొత్త ఎత్తుగడ అవసరం. ఆ అవసరం దృష్ట్యా, కథ విస్తరణలో చూపిన నైపుణ్య విభవమే కెనడియన్ రచయిత్రి కర్మా బ్రౌన్ ఐదవ నవల రెసిపీ ఫర్ ఎ పెర్ఫెక్ట్ వైఫ్. ఆలిస్ దంపతులు మాన్హటన్ జీవితపు హడావుడికీ, హుషారుకూ దూరంగా ఉండే గ్రీన్విల్కి చేరతారు. ఎటూ తనకి ఉద్యోగం లేదు కదా అని అయిష్టంగానే ఆలిస్ ఒప్పుకుంటుంది కానీ– ఆ పాతకాలపు ఇల్లూ, పరిసరాలూ ఆమెకి నచ్చవు. వాటికి క్రమంగా అలవాటు పడుతున్నప్పుడు ఆ ఇంటి పాత యజమానురాలైన నెల్లీ వస్తువులు కొన్ని ఆలిస్‌కి తటస్థపడతాయి. 1950ల నాటి నెల్లీ వంటల పుస్తకం, పత్రికలూ, తన తల్లికి రాసి పోస్ట్ చేయని ఉత్తరాలూ కనిపించి ఆలిస్‌లో ఒక కుతూహలాన్ని కలిగిస్తాయి. ఇక్కడినుంచీ నవల నెల్లీ, ఆలిస్‌ల కథనాలతో రెండు పాయలుగా కదులుతుంది. నెల్లీ ఉత్తరాలూ, వంటల పుస్తకం ద్వారా ఆమె జీవితం ఆలిస్‌కి ఆవిష్కృతమవుతుంది. స్వతహాగా స్నేహశీలి అయిన నెల్లీ ఇంటి బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహించుకుంటూనే ఉంటుంది. కానీ శారీరకంగా మానసికంగా హింసిస్తూ, తనకి ఏ మాత్రం విలువనివ్వని భర్తతో ఆమె వైవాహిక జీవితం దుర్భరంగా ఉంటుంది. అతని దెబ్బల్ని డ్రెస్సుల మాటునా, దాష్టీకాన్ని మౌనం చాటునా దాచుకుని భరిస్తూ, అతని అక్రమ సంబంధాన్ని సైతం సహిస్తూ ఉంటుంది. పిల్లలు కావాలన్న కోరిక బలంగా ఉన్న భర్త ఆమె ఇష్టాయిష్టాలనూ, మానసిక పరిస్థితినీ గమనించుకోడు; ఆమె ఉనికికి ఒక గౌరవాన్నీ ఇవ్వడు. ఈ విషయాలన్నీ ఆలిస్‌ని కలవరపెడతాయి. ఉదాహరణకి పిల్లల విషయంలో తన అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకోడు భర్త. అన్ని విషయాలలోనూ అతని ఇష్టాల మేరకు సర్దుకుపోవలసిందేనా అన్నది ఆలిస్ ప్రశ్న. అప్పటి నెల్లీ పరిస్థితీ, ఇప్పటి తన పరిస్థితీ ఒకేలా ఉన్నాయనుకుంటుంది. నెల్లీ స్వతంత్రంగా నిలబడటానికి ఏం చేసింది? ఈ స్ఫూర్తితో ఆలిస్ జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి? ఈ విషయాల మీదుగా ఊహించని మలుపుతో ఇద్దరి కథా, నవలా ముగుస్తుంది. ఈ నవల రాయడానికి అరవై ఏళ్ల క్రితం ఉన్న స్త్రీ–పురుష సంబంధాల గురించీ, సాహిత్యంలో వాటి ప్రతిఫలనాల గురించీ రచయిత్రి చేసిన అధ్యయనం నవలలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి– నెల్లీ కథనంతో ఉన్న ప్రతి అధ్యాయమూ ఆనాటి వంటల రెసిపీలతో (చాకొలేట్ చిప్ కుకీస్, మింట్ సాస్ లాంటివి) మొదలవుతుంది. ఆనాటి పుస్తకాల్లో స్త్రీలు ఎలా ఉండాలో చెప్పిన పితృస్వామ్యపు సూక్తులతో (‘భర్త సమస్యలను జాగ్రత్తగా విను. వాటితో పోలిస్తే నీవి చాలా చిన్నవి...’, ‘నీ భర్త నిన్ను సంతోషపెడతాడని ఆశించవద్దు. అతన్ని సంతోషపెట్టు– అందులోనే నీ సంతోషం దాగుంది.’) ఆలిస్ అధ్యాయాలు ప్రారంభమవుతాయి. ‘‘ఆ రోజుల్లో పెళ్లయ్యీ, పిల్లలు లేకపోతే అదో సమస్య. సాంఘికమైన ఒత్తిళ్లు ఆ స్థాయిలో ఉండేవి,’’ అని నవలలో ఒక పాత్ర అంటుంది. ఈ రోజుల్లో కూడా ఒత్తిళ్లు అలానే ఉన్నాయి అనుకుంటుంది ఆలిస్. స్త్రీలు పురోగతి సాధించారనీ, సాధికారతని పొందారనీ అనుకుంటున్నాం కానీ– అలాంటి అపోహలకి లోనుకాకుండా, ఆ ప్రగతి కేవలం ఉపరితల దృశ్యమేనా అని బేరీజు వేసుకోవడం అవసరమని రచయిత్రి అభిప్రాయం. డటన్ పబ్లిషర్స్ ద్వారా గత సంవత్సరం విడుదలయిన ఈ పుస్తకం పాఠకులని బాగా ఆకర్షించింది. -పద్మప్రియ -
పుట్టుక వెక్కిరించినప్పుడు
డెబొరా జియాంగ్ స్టయన్ రాసిన, ‘ప్రిసన్ బేబీ: ఎ మెమోయిర్’లో, పన్నెండేళ్ళ డెబొరా– అమెరికా, సియాటెల్‌లో ఉండే యూదులైన ఇంగ్లిష్ ప్రొఫెసర్ల జంట దత్తత తీసుకున్న పిల్ల. నవలికకి కథకురాలు డెబొరాయే. ఆమె దత్తు తల్లిదండ్రులు తెల్లవారు. ఆమె చామనఛాయతో, బహుళజాతి రూపురేఖలున్నది. డెబొరా తన గతం గురించి ప్రశ్నించినప్పుడల్లా, తల్లిదండ్రులు సమాధానం ఇవ్వకుండా దాటవేసేవారు. ఆమె ఆరవ తరగతి చదువుతున్నప్పుడు, ఒకరోజు వారి పడగ్గదిలోకి వెళ్తుంది. ‘డెబొరా జనన ధృవీకరణ పత్రాన్ని మార్చేయండి. తను వర్జీనియా జైల్లో ఉన్న, హెరాయిన్ వ్యసనానికి లోనైన తల్లికి పుట్టిందని తెలియకూడదు. సియాటెల్‌లోనే పుట్టిందని రాయండి. ఆమె మా హృదయాల్లో పుట్టిన పిల్లే కదా! తనకు నిజం తెలిస్తే, తల్లి గురించీ, తను రెండు మూడేళ్ళున్న పెంపుడిళ్ళ గురించీ ప్రశ్నిస్తుంది’ అంటూ, దత్తు తల్లి తన లాయరుకు రాసిన ఉత్తరం కంటబడుతుంది. ‘నా తల్లిదండ్రుల పడగ్గదిలో టేబుల్ అరలో ఉన్న ఆ కాగితాన్ని చదివి, వెనక్కి తోసేశాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు, నా శరీరం అతిబరువుగా అనిపించింది’ అంటారు రచయిత్రి. ఆమె తనను తాను ద్వేషించుకుంటుంది. ‘జైల్లో ఉన్నవారిని ప్రేమించేదెవరు?’ అని ప్రశ్నించుకుంటుంది. ప్రతీ అవసరాన్నీ ప్రేమతో తీర్చే పెంపుడు తల్లి గానీ, తనకు రెండు సంవత్సరాల ముందట, తల్లిదండ్రులు దత్తత తీసుకున్న అన్న తెల్లరంగు జోనాథన్ తనను ముద్దుగా చూసుకుంటాడని గానీ గుర్తురాదు. పైగా, ఊచల వెనకున్న జీవసంబం«ధి అయిన తల్లిని కలుసుకోవాలన్న కోరిక హెచ్చవుతుంది. ‘1960ల వరకూ, వెయ్యి తెల్ల కుటుంబాలు కూడా నల్ల పిల్లలను దత్తు తీసుకోలేదని దత్తత పరిశోధన సర్వేక్షణలు సూచిస్తాయి. నా మార్గదర్శక తల్లిదండ్రులు నన్ను దత్తత తీసుకుని, ఆ పరిమితులను దాటారు. నా పంచదార పాకపు రంగు, బొత్తాం ముక్కు, బాదం ఆకారపు కళ్ళ గురించి అడిగినప్పుడల్లా– తను నన్ను ప్రేమిస్తోందనీ, నేను కుటుంబంలో భాగమే అనే చెప్పేది అమ్మ. నేనిప్పుడు, దేనికీ భాగం అనుకోవడం లేదని చెప్పాలంటే భయం వేసేది’ అంటారు. ఆ సంఘటన తరువాత, రక్తంలో హెరాయిన్నిండి పుట్టి, తొలి ఏడాది ఖైదులో ఆ వాతావరణంలోనే గడిపిన డెబొరా– తన సొంత తల్లిని అనుకరిస్తూ, సులభంగానే మాదక ద్రవ్యాలకు అలవాటుపడతారు. 19 ఏళ్ళొచ్చేటప్పటికి వాటిని సరఫరా కూడా చేసేవారు. దత్తు తల్లిదండ్రులతో సాన్నిహిత్యం కోల్పోతారు. ‘మాదక ద్రవ్యాలు సామాజిక వినోదం, మద్యం కేవలం పానీయం కావు నాకు. అవి నాకు మత్తు కలిగించే మాసికలా, మందులా అయి స్వస్థపరిచి– స్వేచ్ఛ కలిగించాయి. ఎడ్రినలిన్ వేగం మిగతా ప్రతీదాన్నీ ముంచేసేది.’ డెబొరా తన 30లకు చేరినప్పుడు, వ్యసనం వదిలిపెట్టడానికి అవసరమైన సహాయాన్ని పొందారు. పెంపుడు కుటుంబంతో తిరిగి సంబంధం పెంపొందించుకుని, తన జీవితపు ఉనికితో రాజీపడ్డారు. తను పుట్టిన జైలుకెళ్ళి– అక్కడ సహాయం అందించడం, ఉపన్యాసాలివ్వడం మొదలుపెట్టారు. అప్పటికి ఆమె సొంత తల్లి మరణించి ఉంటారు. పుస్తకపు చివర్న, తన కూతుళ్ళ గురించి ప్రస్తావిస్తారు రచయిత్రి. అయితే, పెళ్ళి గురించి గానీ, పిల్లలెప్పుడు పుట్టారో అన్న వివరాలు గానీ ఇవ్వరు. 2012లో– జైళ్ళలో ఉండే స్త్రీలకు అక్షరాస్యతను అందించే, ‘అన్ప్రిజన్ ప్రాజెక్ట్’ ప్రారంభించారు డెబొరా. ‘వారు జైలు నుండి బయట పడి, తిరిగి వెనక్కి వచ్చే అగత్యం లేకుండా, విజయవంతమైన జీవితం గడిపేందుకు– ఏదో ఒక ప్రావీణ్యత నేర్పే పనిది’. ఇప్పుడు పేరు పొందిన వక్తయిన యీ రచయిత్రి, తన ఉపన్యాసాలను అమెరికా జైళ్ళ సంస్కరణ, పట్టుదల, రెండవ అవకాశాలు, ఆశకుండే శక్తిపైన కేంద్రీకరిస్తారు. 176 పేజీలుండి, నిజాయితీగా రాసినదనిపించే, స్ఫూర్తినిచ్చే ఈ ఆశ్చర్యకరమైన సంస్మరణను బీకన్ ప్రెస్ 2014లో ప్రచురించింది. కృష్ణ వేణి -
మధురవాణిని మాట్లాడనిస్తే
విశ్వసాహిత్యంలో మధురవాణితో పోల్చగలిగిన పాత్ర మరొకటి లేదు. కాళిదాసు విక్రమోర్వశీయంలోని ఊర్వశి, శూద్రకుని మృచ్ఛకటికంలోని వసంతసేన కవితాకన్యలుగానే కన్పిస్తారు. షేక్స్పియర్ క్లియోపాత్రాగానీ, సోఫోక్లిస్ నాయికలుగానీ వేశ్యలు కారు. ఇందుకు భిన్నంగా గురజాడ సృష్టించిన పాత్ర మధురవాణి. ఆమె వేశ్యామణి కావొచ్చు. కానీ సంగీత, నాట్య, సాహిత్యాలలో విదుషీమణి. ‘మధురవాణి అంటూ ఓ వేశ్యశిఖామణి ఈ కళింగ రాజ్యంలో ఉండకపోతే భగవంతుడి సృష్టికి ఎంత లోపం వచ్చి ఉంటుందో’ అని కరటకశాస్త్రి అనుమానపడతాడు. ‘నువ్వు మంచిదానివి. ఎవరో కాలుజారిన సత్పురుషుడి పిల్లవై వుంటావు’ అని సౌజన్యారావు అభిప్రాయపడతాడు. రామప్పంతులును భర్తలా పూజిస్తుంది మధురవాణి. ‘నేనుండగా మీరెలా వెధవలౌతారు’ అంటుంది. వాక్చాతుర్యంలో ఆమెకు ఆమే సాటి. ఈ పాత్రకు మరింత వన్నె, ప్రాచుర్యం కల్పించేందుకు ప్రసిద్ధ సంపాదకుడు, రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ ‘మధురవాణి ఇంటర్వ్యూలు’ వెలువరించారు. ఇది 1997లో ముద్రితమైంది. సాహితీ దిగ్గజాలైన పలువురితో ఊహాజనిత సంభాషణలివి. ముందుగా గురజాడతో జరిపిన సంభాషణలో ‘మీరు వేగుచుక్క అయితే, మీకు తోకచుక్క కదా శ్రీశ్రీ’ అంటుంది మధురవాణి. ‘నువ్వు రామప్పంతులు, గిరీశంతో పిల్లి– ఎలుకలతో ఆడుకున్నట్టు ఆడుకున్నావు. నాతో మాత్రం ఆడుకోలేవు’ అని గురజాడ అన్నప్పుడు, మధురవాణి జవాబు చూడండి: ‘డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నారు కదా! అది గిరీశం గారికా లేక మీకేనా?’ అని చమత్కరిస్తుంది. కట్టమంచి రామలింగారెడ్డితో జరిపిన ముఖాముఖిలో ‘మైసూరు వచ్చివుంటే నీకు అర్థశాస్త్రం బోధించేవాణ్ని’ అని కట్టమంచి అన్నప్పుడు, నాకు అర్థంతో పనిగాని అర్థశాస్త్రంతో కాదని సరసమాడుతుంది. విశ్వనాథతో– జాషువా గూర్చి మీరేమంటారు అని ప్రశ్నించి ‘జాషువా వలె తెలుగు నుడికారంలో రచన చేయటం నాకు కూడా సాధ్యం కాదు’ అని ఒప్పిస్తుంది. ‘ఈనాడు మహాకవి అని చెప్పదగినవాడు ఈయనే’ అని శ్రీశ్రీ గురించి పలికిస్తుంది. మీరు మరో మధురవాణిని సృష్టించారట, నాకు పోటీగానా, గురజాడ వారికి పోటీగానా అని రావిశాస్త్రిని నిలదీస్తుంది. ‘అదా, రత్తాలు–రాంబాబులో ప్రోలిటేరియన్ మధురవాణిగా ‘ముత్యాలు’ అని ఉంది. ఈ ముత్యాలు పేదల మధురవాణి. గురజాడకు కృతజ్ఞతతోనే, పోటీ ఏం కాదు’ అని రావిశాస్త్రి జవాబిస్తారు. ఆరుద్రతో జరిపిన సంభాషణలో ‘నిజానికి మీరే శ్రీశ్రీకంటే గొప్పవారు. ఈ విషయం మీకూ నాకూ మాత్రమే తెలిసిన సీక్రెట్’ అంటుంది. ఇలా సాహితీవేత్తల అంతరంగాలను మధురవాణి నెపంతో అద్భుతంగా ఆవిష్కరించారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ. -వాండ్రంగి కొండలరావు -
చెస్ ఛాంపియన్‌కు ప్రేమ పరీక్ష
పుస్తకం : వెన్నల్లో ఆడపిల్ల రచయిత : యండమూరి వీరేంద్రనాథ్ కథ : రేవంత్ ప్రముఖ చెస్ ఛాంపియన్. అతడికి ఫోన్ కాల్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. పేరు చెప్పకుండా, నేరుగా కనిపించకుండా అతడితో పందేలు కాస్తూ ఉడికిస్తూ ఉంటుంది. ఓ రోజు రేవంత్‌కు ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తుంది. ఆ అమ్మాయి తెలివితేటలు, చురుకుదనం, చిలిపితనానికి ముగ్ధుడైన రేవంత్ కూడా ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడిపోతాడు. ఆమెను కలుసుకోవటానికి నానా తంటాలు పడుతుంటాడు. కానీ, ఎంత ప్రయత్నించినా ఆమె ఎవరో కనుక్కోలేకపోతాడు. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోగా తన ఫోన్ నెంబర్ కనిపెట్టాలని ఆమె పందెం కాస్తుంది. గడువులోపు అతడు ఆమె ఫోన్ నెంబర్ కనుక్కుంటాడా? వరల్డ్ చెస్ ఛాంపియన్ రేవంత్ ఆమె కాసిన పందెంలో గెలుస్తాడా? పందెంలో గెలిచి తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నేరుగా కలుస్తాడా? లేదా? అన్నదే మిగితా కథ. ‘హలో ఐ లవ్ యూ’ చిత్రంలోని ఓ దృశ్యం విళ్లేషణ : ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఫుల్ లెన్త్ సస్పెన్స్ రొమాంటిక్ నవల ఇది. ఎక్కడా బోరు కొట్టకుండా కొత్త కొత్త విషయాలను మనకు నేర్పిస్తూ కథ సాగుతుంది. క్షణం క్షణం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. వరల్డ్ చెస్ ఛాంపియన్ రేవంత్ తన ప్రేమను దక్కించుకోవటానికి పడే కష్టాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. క్లైమాక్స్ మనల్ని కంటతడి పెట్టించక మానదు. ఈ నవల ఆధారంగా 1997 ఓ సినిమా కూడా వచ్చింది. శ్రీకాంత్, సాధిక హీరో హీరోయిన్లుగా నటించిన ఆ సినిమా పేరు‘ హలో ఐ లవ్ యూ’. ప్రేమలో ఉన్న వాళ్లు తప్పక చదవాల్సిన నవల ఇది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
తొలిప్రేమను దక్కించుకోవటానికి..
పుస్తకం : హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ రచయిత : చేతన్ భగత్ భాష : ఇంగ్లీష్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ నవల ముఖచిత్రం కథ : మాధవ్ జా బీహార్‌కు చెందిన యువకుడు. డిగ్రీ చదవుల నిమిత్తం ఢిల్లీలోని సేయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చేరతాడు. అక్కడ రియా సోమని అనే డబ్బున్న అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ బాస్కెట్ బాల్ ప్లేయర్స్ కావటంతో సన్నిహితంగా మెలుగుతుంటారు. రియాను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిన మాధవ్ చాలా రోజుల తర్వాత ఆ విషయాన్ని ఆమెకు చెబుతాడు. ఆమె ప్రేమా, గీమా వద్దు ఫ్రెండ్స్‌గా ఉందాం అంటుంది. అతను మాత్రం తన ప్రయత్నాల్లో తను ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు వస్తాయి. అప్పటినుంచి రియా, మాధవ్‌ను దూరంగా ఉంచుతుంది. కొద్దిరోజులకే వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడుతుంది. రియాతో మాట్లాడటానికి పరితపిస్తున్న మాధవ్‌కు ఓ రోజు ఆమెతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఆ మాటల సందర్భంలోనే తనకు పెళ్లి నిశ్చయమైనట్లు, కాలేజీ మానేస్తున్నట్లు అతడికి చెబుతుంది. మాధవ్‌కు పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్లికి రమ్మంటుంది. దీంతో అతడు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసుకుని బీహార్ వెళ్లిపోతాడు. తమ కుటుంబం నడుపుతున్న స్కూల్లో పనిచేస్తూ తల్లికి తోడుగా ఉంటాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పాట్నాలోని ఓ హోటల్లో రియా అతడికి కన్పిస్తుంది. పెళ్లి అవటం, తర్వాత విడాకులు తీసుకోవటం గురించి అతడికి చెబుతుంది. ఇద్దరు మళ్లీ స్నేహంగా ఉండటం మొదలుపెడతారు. మాధవ్ తల్లికి ఇదంతా నచ్చదు. విడాకులు తీసుకున్న అమ్మాయితో కొడుకు సన్నిహితంగా ఉండటం, రాజవంశానికి చెందిన తన కుమారుడు వేరే కులం అమ్మాయితో తిరగటం సహించలేకపోతుంది. రోజులు గడుస్తున్న కొద్ది మాధవ్, రియాపై మరింత ఆశలు పెంచుకుంటాడు. అయితే ఈ సారైనా రియా, మాధవ్ ప్రేమను అంగీకరిస్తుందా? సున్నితంగా కుదరదని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుందా? ఒక వేళ అంగీకరిస్తే మాధవ్ తల్లి వీరి పెళ్లికి అడ్డుచెబుతుందా? లేక కొడుకు సంతోషం ముఖ్యమని అంగీకరిస్తుందా? అన్నదే మిగితా కథ. విళ్లేషణ : ప్రముఖ ఇంగ్లీష్ నవలల రచయిత చేతన్ భగత్ ఊహాల్లోంచి జాలువారిన ఓ అద్భుత ప్రేమ కావ్యం. తొలిప్రేమను దక్కించుకోవటానికి కష్టపడే మాధవ్ పాత్ర పాఠకుల(ప్రేమికుల) మనసులో ముద్రపడిపోతుంది. తెలిసీ తెలియని వయసులో తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఎలా జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తాయో రియా, మాధవ్‌ల పాత్రలు మనకు ఉదహరిస్తాయి. ఇంగ్లీష్ భాషపై పట్టులేని వాళ్లకు కూడా అర్థమయ్యేలా రచయిత ఈ పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ నవల ఆధారంగా బాలీవుడ్ ఇదే పేరుతో ఓ సినిమా కూడా తెరకెక్కింది. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్లు ఈ సినిమాలో జంటగా నటించారు. ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన నవల ఇది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
మార్కేజ్ ‘రావణాయణం’
కొలంబియన్లకు రామాయణం లాంటి ఇతిహాసం లేదు కాని, రావణుడు ఉన్నాడు. అతడే పాబ్లో ఎస్కోబార్. నల్లమందు ముఠా నాయకుడు. ఆ నల్ల మందును అమెరికాకు స్మగుల్ చేస్తాడు కాబట్టి, అగ్ర రాజ్యానికి అతడో రాక్షసుడు. ఎలాగైనా పట్టి నిర్జించాలన్నంతగా ఎస్కోబార్‌పై అమెరికా కత్తిగట్టింది. కొలంబియా పాలకులపై ఒత్తిడి తెచ్చి అన్నంత పనీ చేయించింది. పట్టలేదు కానీ మట్టుపెట్టించగలిగింది. అమెరికాకు దొరికిపోవటంకన్నా ప్రాణాలు విడవడమే సుఖం అనుకొన్న ఎస్కోబార్ కూడా తన పట్టుదలను నిలుపుకొన్నాడు. ఇలా విన్–విన్ పద్ధతుల్లో గాబ్రియెలా గార్షియా మార్కేజ్ రామాయణం ‘‘న్యూస్ ఆఫ్ ఎ కిడ్నాపింగ్’’ సుఖాంతమవుతుంది. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసి ఎస్కోబార్‌ను అప్పగింతలు కోరితే కొలంబియా కాదంటుందా? చచ్చినట్టు అమెరికాతో నేరస్తుల అప్పగింత ఒప్పందం చేసుకొంది. ఆ అప్పులేవో నేనే తీర్చేస్తా, ఒప్పందం రద్దు చేసుకోమని ఎస్కోబార్ ఆఫరిచ్చాడు. 1990ల నాటికి అతడు ప్రపంచంలోనే ఎనిమిదో కుబేరుడు. అయినా అతని మాట ప్రభుత్వం వినలా. రాయబారం నడిపాడు. అందుకు అమెరికా ప్రభావంలో ఉన్న సైన్యం ఒప్పుకోలా. చివరి అస్త్రంగా ఆ దేశ మీడియాను గుప్పిట్లో పెట్టుకొన్న బిగ్ షాట్స్‌ను కిడ్నాప్ చేయించాడు. దీంతో లోకం గగ్గోలు పెట్టింది. ఇప్పుడు నేరస్తుల అప్పగింత వ్యవహారంలో హాంకాంగ్‌లో కనిపిస్తున్న వాతావరణమే ఆనాడు కొలంబియాను ఆవరించింది. తన దేశంలో తాను కోరుకొన్న చోట, కోరుకొన్న పద్ధతుల్లో జైలును ఏర్పాటు చేసుకొన్న తర్వాతే బందీలను ఎస్కోబార్ వదిలేశాడు. అనంతర పరిణామాలలో నిరాయుధుడుగా ఉన్న ఎస్కోబార్‌ను సైన్యం కాల్చి చంపింది. ఈ వీరగాథను మెడిలిన్ అధోజగత్తు గానాల కొదిలేసి, మనమో ముఖ్యమైన అంశం వద్దకు వద్దాం. అదే కిడ్నాప్. సినిమాటిక్గానో, ఎ మోస్ట్ జస్టిసబుల్గానో కిడ్నాప్‌లను చూసే మన ఆలోచనలను మార్కేజ్ సమూలంగా మార్చివేస్తాడు. కిడ్నాప్ అంటే, అదేదో ఒక వైపు లావాదేవీ కాదు. అలాగని, కిడ్నాపర్లకో, బందీలకో, వారి ఆత్మీయులకో... లేదా గెరిల్లాలకో, ప్రభుత్వాలకో లేదా జాతి విముక్తికో, సరిహద్దు గొడవలకో సంబంధించిన వ్యవహారం కానే కాదు. కిడ్నాప్ అంటే లోపలా, బయటా తలుపులు బిగుసుకుపోయిన జీవి నిర్దయ పెనుగులాట! ఈ పెనుగులాటను మనలోనూ కలిగించడంలోనే మార్కేజ్ పనితనం అంతా దాగి ఉంది. లేదంటే న్యూస్ ఆఫ్ ఎ కిడ్నాపింగ్ అనే పేరుకు తగినట్టే ఇదొక ఫక్తు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టిక్ రచనగానే మిగిలిపోయేది. కుటిలో, చీకటిలో చిక్కుకున్న కన్నుకు గుహాంతరాన మిణికే స్వేచ్ఛ ఎలా ప్రాణ శక్తి అయిందనేది చిత్రీకరించడం వల్లనే ఈ పుస్తకమింత వెలుగు పోసుకొన్నదనిపిస్తోంది. (న్యూస్ ఆఫ్ ఎ కిడ్నాపింగ్ సంక్షిప్త పరిచయం) -రివేరా -
సంబంధాల దారపు ఉండ
వివేక్ షాన్‌బాగ్ కన్నడంలో రాసిన ‘ఘాచర్ ఘోచర్’ నవలికలో, పేరుండని కథకుడు– బెంగళూరులో ‘వందేళ్ళగా పేరు మారని కాఫీహౌస్’లో ‘లెమన్ సోడా’ తాగుతుంటాడు. అతను పాత గర్ల్ఫ్రెండును అక్కడే కలుసుకునేవాడు. ఇప్పుడతనికి పెళ్ళయి ఉంటుంది. ‘ఇంటి గొడవలను తప్పించుకోవడానికి ఇక్కడికి వస్తాను’ అని ఒప్పుకుంటాడు. ఇక్కడినుండీ, తన జీవితాన్ని ఏ క్రమం పాటించకుండా వర్ణిస్తాడు. అతని అప్పా (తండ్రి)సేల్స్‌మాన్. ‘ప్రతీ పొద్దూ తన జోళ్ళు పాలిష్ చేసుకుని, ఇస్త్రీ చేసిన చొక్కా తొడుక్కునేవాడు.’ తన కొద్దిపాటి ఆదాయంతోనే తమ్ముడైన వెంకటాచల (చిక్కప్ప)ని చదివిస్తాడు. అప్పుడు వారి కుటుంబం, ‘వరుసగా ఉండే రైలు కంపార్టుమెంట్ల వంటి, చీమలుపట్టిన నాలుగు గదుల్లో ఉండేది. సమస్త కుటుంబం కలిసుండి, ఒకే శరీరంలా– బిగుతు పరిస్థితుల తాడుపైన నడిచేది.’ తన ఉద్యోగం పోయిన తరువాత అందిన డబ్బుతో అప్పా– చిక్కప్ప సహాయంతో, ‘సోనా మసాలా’ కంపెనీ ప్రారంభిస్తాడు. కలిమిలోకి అడుగు పెట్టిన ఇంటి సభ్యులందరికీ తమతమ గదులు ఏర్పడతాయి. చిక్కప్ప, కథకుడిని కంపెనీ సీఓవో నియమిస్తాడు. అయితే, బాబాయే మొత్తం వ్యాపారం నడుపుతుండటంతో కథకుడికే కాక మరెవరికీ కూడా పని చేసే అవసరం పడదు. ‘అత్యవసర వంటలే చేస్తే గ్యాస్ సిలిండర్ రెండు నెలలు వచ్చేది. గ్యాస్ అయిపోయాక, సిలిండర్‌ను బోర్లా పడుకోబెడితే మరి కొన్ని రోజులు.’ తమ పేదరికపు రోజుల ‘అమ్మ’ మాటలను గుర్తు చేసుకుంటాడు కథకుడు. ‘డబ్బుని అదుపులో ఉంచేది మనం కాదు. డబ్బే మనల్ని నియంత్రిస్తుంది. కొద్దిపాటి డబ్బే ఉన్నప్పుడు అది వినయంగా మసులుకుంటుంది. అది హెచ్చయినప్పుడు, మొండిధైర్యంతో మనమీద హక్కు చూపించుకుంటుందని జనాలనే మాటలు నిజమే... పేదరికం అనుభవిస్తున్నప్పుడు, పూర్తి కుటుంబం కలిసే భోంచేసేది. ఇప్పుడు, మేము భోజనాలప్పుడు కలుసుకున్నాగానీ ధ్యాస మరెక్కడో ఉంటుంది’ అంటాడు. ఇంటివారు అతనికి, ఒక ప్రొఫెసర్ కూతురైన అనితతో పెళ్ళి చేస్తారు. ఆమె బాగా చదువుకున్నది. హనీమూనప్పుడు, కథకుడు అనిత లంగా బొందు విప్పడానికి ప్రయత్నిస్తాడు. అది మరిన్ని ముళ్ళు పడుతుంది. అది‘ఘాచర్ ఘోచర్’ అయిందంటుంది అనిత. దాని అర్థం, ‘విడలేకపోయేంతగా ముళ్ళు పడటం’ అని వివరిస్తుంది. భర్త ఏ పనీ చేయడని తెలిసి అనిత కోపం తెచ్చుకుంటుంది. అలాకాదని నిరూపించేందుకు అతను మళ్ళీ రోజూ కాఫీహౌస్‌కు వెళ్ళడం మొదలుపెడతాడు. హఠాత్తుగా వచ్చిపడిన డబ్బు కుటుంబ సమీకరణాలను మార్చివేసి, వారి నైతిక ధైర్యాన్నీ, మనశ్శాంతినీ పోగొడుతుంది. ఇంటి సభ్యులు బయటివారితో పెట్టుకున్న సంబంధాలన్నీ విఫలమే అవుతాయి. కథకుని అక్క మాలతి పెళ్ళికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా, అత్తగారింట్లో ఇమడలేక పుట్టింటికి వచ్చేస్తుంది. అనితకు– అత్తగారితోనూ, ఆడపడుచుతోనూ పోట్లాటలవుతుంటాయి. అనిత, తన బొందుకు పడిన ముళ్ళను ‘ఎంత జాగ్రత్తగా విడతీసిందో’ కథకుడూ అంతే పదిలంగా, తను చిక్కుకున్న కుటుంబపు దారాలని విప్పుకోవాలిప్పుడు. కథకుడి నిరుత్సాహం, అనిత కోపం, మాలతి అల్పత్వం, అప్పా నిస్సహాయత, చిక్కప్పకుండే నైతిక అస్పష్టతవంటి బలహీనతలన్నిటినీ, యీ 118 పేజీల నవలికలో చూపుతారు రచయిత. దీని కన్నడ ముద్రణ 2013లో. శ్రీనాథ్ పెరూర్ ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్ బుక్స్ 2017లోప్రచురించింది. తెలుగులోకి రంగనాథ రామచంద్రరావు అనువదించారు. కృష్ణ వేణి -
బాల్యపు స్మృతుల ప్రతిరూపం-రెక్కలపిల్ల
1980, 90, ఈ శతాబ్ది ఆరంభ దశకాల్లోని పిల్లలు ఎంతైనా అదృష్టవంతులని చెప్పాలి. వారి జీవితాల్లో ఆటలున్నాయి. పాటలున్నాయి. అందమైన స్నేహాలున్నాయి. ప్రకృతితో పెనవేసుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. ఎన్నో అనుభూతులు ఉన్నాయి. బాల్యపు మధురిమలను అందంగా అమాయకంగా తమలోకి ఒంపుకున్న రోజులున్నాయి. బడిలోని విద్యతోపాటు సమాజంలో తోటి పిల్లలతో ఆడిపాడి- కులమత వివక్షలకు అతీతంగా పెనవేసుపోయి.. మనిషిలో సంకుచిత్వాన్ని నాటి బాల్యం ఎద్దేవా చేసింది. అమాయకంగా అందరినీ కలుపుకొనిపోయింది. మనుషులకు గీతల్లేవన్నది. మతాల్లేవన్నది. ధనిక-బీద భేదాల్లేవన్నది. దోస్తులతో గుంపులుకట్టి.. అప్పటి బచ్‌పనా తనవారి కోసం ఒక చిన్నసైజు గ్యాంగ్‌వారే చేసింది. మరీ అప్పటి పిల్లలు ఇప్పటి జనరేషన్‌లా ట్రెండీ కాదు. వారికి సెల్‌ఫోన్ తెలియదు. టీవీతో పరిచయం అంతంతమాత్రమే. స్కూలు అయిపోగానే ఇంటికి పరిమితమైపోయి.. ఐదంగుళాల తెరలోకి తల దూర్చి అదే లోకమనుకునే చెడ్డలవాటు అప్పటి పిల్లలకు తెలియదు. అందుకే స్కూలు అయిపోగానే అప్పటి పిల్లలు బ్యాగులు ఇంటిలో పడేసి.. స్వేచ్ఛాగా రెక్కలు విడిచిన పక్షుల్లా వీధుల్లోకి పరిగెత్తుకువచ్చేవారు. తోటి పక్షులతో కలిసి కిచకిచమంటూ అలా స్వేచ్ఛగా విహారానికి వెళ్లేవారు. ఆడేవారు. పాడేవారు. కథలు చెప్పుకునేవారు. అందులో దెయ్యాల కథలు, రాకుమారుల కథలు ఉండేవి. అమ్మలు-నాన్నలు, అమ్మలక్కలు చెప్పుకునే విషయాలుండేవి. ఆటలుండేవి. ఆటల్లో దెబ్బలుండేవి. ఆ ఆటల్లో తాకిన దెబ్బలు దాచుకొని.. దాచుకొని అమ్మకు తెలియకుండా ఇంట్లో నక్కి పండుకునే రోజులుండేవి. ఎంత విచిత్రమైనది బాల్యం. అదొక మాయాలమరాఠీ. ఎన్నో విచిత్రాలు చూపించి.. అమాంతం కరిగిపోయింది. మంత్రదండంలా, ఇంద్రజాలికుడిలా ఎన్నో అద్భుతాలను చూపించి మాయమైంది. స్వచ్ఛమైన అమాయకత్వం బాల్యం. లోకం తెలుసుకోవాలన్న తపన బాల్యం. నిరంతరం ఏదో కొత్త విషయం కోసం ఆరాటపడి ఏది తెల్సినా అదో వింతలా అబ్బురపడే సంచార సహజనైజం బాల్యం. అదొక వజ్రాలగని. తవ్వి చూడండి ఎన్నో అద్భుతమైన మణులు దొరుకుతాయి. జీవితంలోకి మరెంతో వెలుగు వస్తోంది ఆ రంగురంగుల మణుల నుంచి.. అలా బాల్యాన్ని తవ్వితీసి.. అందులోని రంగురంగు మణులను, అద్భుతాలను, చెణుకులను, అల్లరిని, ఆటపాటలను, అమ్మనాన్న, స్నేహితులు, చుట్టు ఉన్న సమాజాన్ని అప్పటి కళ్లతో అంతేగా అమాయకంగా, అంతే స్వచ్ఛంగా అందిస్తే అది రెక్కలపిల్ల పుస్తకమవుతుంది. 56 కథలు, 260 పేజీలు.. ఓ అమాయకపు బాల్యం. ఏ కల్మషమెరుగని పసితనం స్వచ్ఛమైన రెక్కలు తొడిగే ఆకాశమంతా విహరిస్తే.. ఈ రెక్కలపిల్ల అవుతుందేమో. బాల్యం రెక్కలు తొడుగుతూ తొలి అడుగులు వేస్తున్న దశలో మూడో తరగతి నుంచి ఐదో తరగతి మధ్య ఓ చిన్నారి తన దోస్తులతో ఒక గ్యాంగ్‌లా ఏర్పడి చేసిన విన్యాసాలు, మనషుల పట్ల ప్రేమతో కూడిన బాల్యపు స్మృతులు, చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకుంటూ.. దానిపట్ల స్పందించే తీరు.. దాని ప్రశ్నలు.. అన్నింటికీ మించి స్వచ్చమైన అమాయకత్వం.. ఇది రెక్కలపిల్లలోని కథల వరుస. ఈ పుస్తకంలోని అన్ని కథల్లోనూ బాల్యపు ఫ్లేవర్ ఉంటుంది. అన్ని చదివింపజేస్తాయి. చాలావరకు కథలు కథనాత్మకంగా ఉండి చివరివరకూ ఏం జరుగుతుందా? అన్నంత ఆసక్తి రేపుతాయి. గడుసుతనం, పెంకితనం, అనుకుంటే ఏదైనా చేసే బాల్యపు మొండితనం ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ కథల్లో చాలాచోట్ల ప్రశ్నలు చిత్రంగా ఉంటాయి. బాల్యపు ప్రశ్నలు. అమాయకపు ప్రశ్నలు. వాటికి లభించే సమాధానాలు కూడా చిత్రమైనవే అనిపిస్తాయి. పున్నాగ పూలు, వీరబాబు, పడవ ప్రయాణం, వాన కోసం తపస్సు, యాది-జారుడుబండ, ఓ స్త్రీ రేపు రా, జ్వాలాతోరణం కథలు నాకు బాగా నచ్చాయి. యాదగిరి-చిల్లర, రంగ-కలువపూలు, ఓకులు-బెచ్చాలు, అవ్వా-దీపావళి కూడా మంచి కథలు. పిల్లలు అన్ని మతాలను, దేవుళ్లను సమానంగా చూస్తారనడానికి ఇందులో హిందు, ముస్లిం, క్రైస్తవ నేపథ్యాలతో ఉన్న కథలు చాటుతాయి. ఓ స్త్రీ రేపు రా కథలో తన ఇంటి మీద రాయకుండా, తన ఫ్రెండ్ పద్మ ఇంటి మీద రాసి ఉన్న `ఓ స్త్రీ రేపు రా` అన్నది చెరిపేయడం.. దానివెనుక ఉన్న కారణం, జ్వాలాతోరణం కథలో గుడ్డివాడిగా చెప్పి అడుక్కుంటున్న తాతతో జ్వాలాతోరణం కింద నడిపించడం వంటి ట్విస్టులు, లారీ- ఇల్లు కథలో తండ్రికి ఇంటికి రాకపోతే.. రాత్రిపూట ఒంటరిగా బజారు వరకు ధైర్యంగా వెళ్లిరావడం వంటివి కొసమెరుపులు ఆహ్లాదపరుస్తాయి. మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపడానికి, ఆనాటి మధురాతిమధురమైన స్నేహపు స్మృతులను నెమరువేసుకోవడానికి ఈ పుస్తకాన్ని ఓసారి చదివితీరాల్సిందే. - శ్రీకాంత్ కాంటేకర్ ‘రెక్కలపిల్ల’ కథల పుస్తకం. కవయిత్రి, రచయిత్రి శ్రీసుధ మోదుగు రెండో పుస్తకమిది. ఆమె ఇంతకుముందు రాసిన ‘అమోహం’ కవితాసంపుటి పాఠకుల మన్ననను పొందింది. రచయిత్రి ప్రస్తుతం జమైకాలో నివాసముంటున్నారు. వైద్యరంగంలో స్థిరపడ్డారు. -
యుద్ధము – శాంతి
మానవ చరిత్రలోనే ఉత్తమ కళాఖండాలుగా వర్ణింపబడిన లియో టాల్‌స్టాయ్(1828–1910) రచనలు తిరిగి తిరిగి ముద్రణ పొందుతూనే ఉన్నాయి. ఎప్పటికీ నిలిచిపోయే పది గొప్ప పుస్తకాలలో ‘యుద్ధము–శాంతి’ ఒకటి అనిపించుకుంది. రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు తెలుగులోకి అనువదించిన ఈ నవల, టాల్‌స్టాయ్ 190వ జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ‘సాహితి ప్రచురణలు’(ఫోన్: 0866–2436642) ద్వారా మరోమారు అందుబాటులోకి వచ్చింది. పేజీలు: 960; వెల: 600. అనువాదకులు పుస్తకానికి రాసిన అవతారిక సంక్షిప్తంగా. యుద్ధము–శాంతి రాసేనాటికి టాల్‌స్టాయ్‌కి 36 సంవత్సరాల వయస్సు. అనగా ఒక రచయిత సృజనాత్మక శక్తి పరిపక్వత పొందివుండే వయస్సు. ఆ తరువాత ఆరు సంవత్సరాలకు కాని అతనీ నవల పూర్తి చేయలేకపోయాడు. ఈ నవలకు అతను ఎన్నుకున్న కాలం నెపోలియానిక్ యుద్ధాలు జరిగిన కాలం. నెపోలియన్ రష్యాపై దండయాత్ర చేయడం, మాస్కో నగరాన్ని మంటల్లో ముంచెత్తి తుదకు సేనంతా మంచులో పూడుకుని నాశనమైపోగా, పరాజితుడై పలాయనం చేయడం ఈ నవలలో ఉత్కర్ష. ఈ నవలను ప్రారంభించే సమయంలో టాల్‌స్టాయ్ ఉద్దేశం ఆనాటి అభిజాత కుటుంబాల జీవితాన్ని చిత్రించడమే. దానికి చారిత్రక సంఘటనలను ఒక రంగస్థలంగా మాత్రమే వినియోగించుకున్నాడు. ఈ నవలలో ఇంచుమించు అయిదువందలకు పైగా పాత్రలున్నాయి. ప్రతి పాత్రకూ రచయిత ఒక స్పష్టమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. ఇది సాధించడం సామాన్యమైన పని కాదు. అనేక నవలల్లోవలె ఇతివృత్తం ఇరువురు, ముగ్గురు వ్యక్తుల మీదనో, ఏ ఒక కుటుంబంపైననో ఆధారపడి ఉండదు. అభిజాత వర్గానికి సంబంధించిన నాలుగు కుటుంబాలపై ఆధారపడివుంది– వారు బోల్కోనిస్కీలు, రోస్టోవ్‌లు, కారగైన్లు, బెష్కోవులు. ఇలాంటి ఇతివృత్తాన్ని చిత్రించడంలో ఉన్న నేర్పు, ఒక కుటుంబం నుంచి మరో కుటుంబం కథవైపు పాఠకుని సులువుగా లాక్కొని వెళ్లగలగడమే. అనేక నవలా రచయితల్లాగానే టాల్‌స్టాయ్ తన పాత్రలను తన పరిచితుల నుంచి ఎన్నుకున్నాడు. కానీ ఆయన భావనలో ఆ పాత్రలు ఆయన కనిపెట్టినట్లు ఒక కొత్త స్వరూపాన్ని పొందాయి. కౌంట్ రోస్టోవ్ ఆయన తాతగారనీ, నికోలస్ రోస్టోవ్ ఆయన తండ్రిగారనీ, మేరియా రాకుమారి ఆయన తల్లిని పోలినదనీ అనుకుంటారు. ఈ నవలకు నాయకులుగా కనిపించే ఆండ్రూ రాకుమారుడు, పీటర్– ఈ ఇరువురినీ చిత్రించే సందర్భంలో టాల్‌స్టాయ్ తనను తానే మనస్సులో పెట్టుకున్నాడని అనుకుంటారు. ఇలా పరస్పర వైరుధ్యం కల రెండు పాత్రలను చిత్రించడం ద్వారా టాల్‌స్టాయ్ తనను తానే అర్థం చేసుకోగలిగాడు. ఈ ఇరువురికీ ఒక్క విషయంలో మాత్రమే సామ్యం ఉన్నది. ఇరువురూ మనశ్శాంతినీ, జీవన్మరణ రహస్యాన్నీ అన్వేషిస్తారు. కానీ అది ఇరువురికీ దొరకదు. వీరిరువురూ నటాషాను ప్రేమిస్తారు. ఈ నవల అంతటిలోకీ నటాషా ఎంతో ముచ్చటైన పాత్ర. ఈ నవల కడపట టాల్‌స్టాయ్‌కి తన పాత్రలలో కొంతవరకు శ్రద్ధ సన్నగిల్లినట్లు మనకు కనిపిస్తుంది. చరిత్రను గురించి ఒక తత్వదృష్టిని ఆయన కనిపెట్టాడు. చరిత్రను నడిపింది మహాపురుషులు కాదనీ, సాధారణ ప్రజలను జయాపజయాల వైపునకు నడిపిన ఒక అవ్యక్త శక్తి అనీ ఆయన ఊహించాడు. సిద్ధాంతాలన్నిట్లో వలెనే ఇందులో కూడా కొంత సత్యమూ, కొంత అసత్యమూ లేకపోలేదు. పాశ్చాత్య సాహిత్యంలో మహాభారతాన్ని పోలిన ఈ నవలను చదివినప్పుడు ఒక వైపున సమరము– మరోవైపున శాంతి. ఈ రెంటికీ మధ్య అనేక ఉత్తమ కుటుంబాలు, ఆ కుటుంబాలకు చెందిన మానవ మర్యాదలు ఏ విధంగా ఊగిసలాడినవో మనకు గోచరిస్తుంది. యుద్ధకారణంగా పరస్పర మానవ సంబంధాలు ఏ విధంగా తెగిపోవడము, మరల చిత్రమైన పరిణామము చెంది సమ్మేళనము పొందడము మనకు ద్యోతకమవుతుంది. ఈ సందర్భంలో జీవితం నుంచి దూరమైపోవడం వల్ల కాక, జీవితాన్ని అవగతం చేసుకోవడం వల్లనే మనం సత్యం దర్శించినవారమవుతామని ఆండ్రూ రాకుమారుని ద్వారా టాల్‌స్టాయ్ చెప్పించిన మాటలు నవలకు సందేశంగానూ, పరమార్థంగానూ కనిపిస్తాయి. -
డబ్బు అక్కరలేని చివరి మనిషి
ముంబయిలో, విమానాశ్రయం దగ్గరే ఉన్న ‘వకోలా’ అన్న ప్రాంతంలో ఉన్న ‘విశ్రామ్ టవర్స్ సొసైటీ’లో రెండు బిల్డింగులుంటాయి. అవి శిథిలమవుతున్నప్పటికీ ‘పక్కా’వే. రోజుకి రెండుసార్లు నీళ్ళొస్తాయి. వాటిల్లో ఉండేది, వివిధ వర్గాలకు చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబాలు. చుట్టుపక్కలుండేవి గుడిసెలు. అరవింద్ అడిగా రాసిన, ‘లాస్ట్ మాన్ ఇన్ టవర్’లో ‘ఇతరుల వద్దనున్నవాటి గురించీ, నీ వద్ద లేకపోయిన వాటి గురించీ కలలు కను. అదే నిన్ను ధనవంతుడిని చేస్తుంది’ అని నమ్మే– ధర్మేష్ షా, ‘వంటినిండా బంగారం, ఉబ్బసం’ ఉన్న వ్యక్తి. ఆ బిల్డింగులను పడగొట్టి, ‘షాంఘై’ అన్న ఆకాశహార్మాన్ని కడదామనుకుంటాడు. ప్రతీ అపార్టుమెంటు యజమానికీ 1.52 కోట్ల రూపాయలు ఇస్తాననీ, సెప్టెంబర్ చివరికల్లా ఇళ్ళు ఖాళీ చేయాలనీ, మే నెలలోనే ప్రకటిస్తాడు. ఏ వొక్కరు ఒప్పుకోకపోయినా, తన ప్రతిపాదన వెనక్కి తీసుకుంటానని, తన సహాయకుడైన షణ్ముగం ద్వారా వారికి చెప్పిస్తాడు. అంత సొమ్ముకి రెండు అపార్టుమెంట్లు కొనుక్కోవచ్చుననుకున్న బిల్డింగ్ నివాసులలో కొందరు, వెంటనే ఒప్పేసుకుంటారు. అయితే ‘పింటో’లు, శ్రీమతి రేగో, శ్రీ కుడ్వా లాంటివారు తమతమ కారణాలవల్ల నిరాకరిస్తారు. అందరికన్నా ఎక్కువ బలంగా నిలుచుని, ఆ డబ్బుని తోసిపుచ్చిన వ్యక్తి, ‘మాస్టర్జీ’ అని అందరూ పిలిచే, ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన యోగేశ్ మూర్తి. చనిపోయిన తన భార్యా, కూతురి జ్ఞాపకాలతో బతుకుతున్నవాడు. ‘అతను ముంబయిలో 44 ఏళ్ళు గడిపాడు. నాస్తికుడయినప్పటికీ, ‘మురికి చెరువులో కమలంలా లోకంలో ఉండు కానీ, దానిలో భాగం అవకు’ అని బోధించిన హిందూ తత్వవేత్తల మాటలను తు.చ. తప్పకుండా పాటించేవాడు.’ ‘నా ఇల్లు అమ్మకపోవడం నా ఇష్టం అయి ఉండాలి’ అని నమ్మే వ్యక్తి. అయితే, దీని తరువాత, మాస్టర్జీ–భార్య చనిపోయిన తరువాత మొట్టమొదటిసారి, లోకంలో తను ఒంటరివాడిని కాననుకుంటాడు. అపార్టుమెంట్ల అమ్మకాన్ని ఆపేందుకు– సామాజిక సంస్థలనూ, పోలీసులనూ, వకీలునూ, వార్తాపత్రిలనూ, పాత విద్యార్థులనూ సమీపిస్తాడు కానీ ఫలితం ఉండదు. అతని నిర్ణయాన్ని మార్చడానికి మొదట్లో షా బతిమాలతాడు, సున్నితంగా ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, మాస్టర్జీ ఆదర్శవాదాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. ‘డబ్బవసరం లేని వ్యక్తి తన హృదయంలో రహస్య అరలు లేనివాడు. ఎటువంటివాడితను! బేరసారాల విధానాలన్నిటినీ చూశాను. ఇలా ‘వద్దు’ అని స్థిరంగా చెప్పే ఎత్తుగడని ఎప్పుడూ చూడలేదు’ అనుకుంటాడు. సొసైటీ ప్రెసిడెంట్, సెక్రెటరీ ఒత్తిడికి లోనై, మొదట ప్రతిఘటించినవారు తమ నిర్ణయం మార్చుకుంటారు. ఈ లోపల, సెప్టెంబర్ వస్తుంది, పోతుంది. షా నుండి ఏ స్పందనా రాకపోవడంతో ఆదుర్దాపడిన కొందరు సొసైటీ సభ్యులు, మాస్టర్జీని సుత్తితో కొట్టి స్పృహ తప్పించి, డాబా మీదినుంచి కిందకి తోసేస్తారు. అతని మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటిస్తారు. షా అందరి డబ్బూ చెల్లిస్తాడు. రెండు నెల్ల తరువాత, మిగతావారు కొత్త చోట్లలో నివాసం ఏర్పరచుకుంటారు. కొందరు మాస్టర్జీ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, షా ఇచ్చిన డబ్బు తీసుకోరు. తమ అపరాధ భావాన్ని తొలగించుకునేందుకు, పేదపిల్లలకు చదువు చెప్పడం ప్రారంభిస్తారు. మాస్టర్జీ పోరాటం విజయవంతం అవనప్పటికీ, అర్థవంతమైనదిగా అయితే మారుతుంది. నవల చివర్న, విశ్రామ్ సొసైటీ బయటున్న మర్రిచెట్టు, మాస్టర్జీ ఆత్మలాగే– కూల్చివేతను, ముళ్ళకంచెలను, గాజుపెంకులను తట్టుకొని, కొత్తగా వేళ్ళూనుతుంది. రచయిత రాస్తారు: ‘స్వేచ్ఛ పొందాలనుకున్న దేన్నీకూడా, ఆపేదేదీ ఉండదు’. దురాశా, కలలూ– మనిషిని ఎలా నిర్బంధిస్తాయో చెబుతుందీ నవల. అయితే, ఉన్నదాని కన్నా ఎక్కువ కావాలనుకోవడం పాపమా? అని కూడా ప్రశ్నిస్తుంది. షా కన్నా మాస్టర్జీ తక్కువ స్వార్థపరుడా? అన్న సందేహమూ కలిగిస్తుంది. ఈ పుస్తకాన్ని 2011లో ప్రచురించినది అట్లాంటిక్ బుక్స్. చెన్నైలో పుట్టిన కన్నడిగుడు అరివింద్ అడిగా. ప్రస్తుతం ఆస్ట్రేలియా పౌరుడు. వృత్తి రీత్యా పాత్రికేయుడు. 2008లో తన తొలి నవల ‘వైట్ టైగర్’కుగానూ మ్యాన్ బుకర్ బహుమతి పొందారు. -కృష్ణ వేణి -
మార్చుకోలేని గుర్తింపు
యషికా దత్ నిదానియా రాసిన ‘కమింగ్ అవుట్ యాజ్ ఎ దళిత్’– దత్, తాను దళితురాలినని బయటపడిన కారణంతో మొదలవుతుంది. ‘‘ఇండియాలో, నేను నా దళిత ఉనికిని రుద్దిరుద్ది వదిలించుకున్నాను. రోహిత్ వేముల ఆత్మహత్యకు రెండు వారాలముందు అతను నాకు ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపినప్పుడు, నేను దాన్ని డిలీట్ చేశాను. నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు, వైరల్ అయిన అతని ఆత్మహత్య లేఖ చదివి, ‘ఆ జీవితం నాదే అయి ఉండేది. సరైన కారణాల కోసం పోరాడేందుకు రెండో ఆలోచన కూడా చేయని అతని ధైర్యం– సంవత్సరాలుగా, నా దళిత ఉనికిని దాచుకుంటూ బతికిన నన్ను బయటకి లాగి, ఫేస్బుక్లో దళితురాలినని ప్రకటించుకునే నిర్ణయానికి చేర్చింది. అణచివేత గురించి సిగ్గు పడాలి. కులం గురించి కాదు’ అన్న గుర్తింపును అతను నాకు కలుగజేశాడు. దేశానికి దూరంగా ఉండటం వల్ల, వెల్లడించడం నాకు సులభం అయింది.’’ ‘‘నేను రాజస్తాన్ అజ్మీర్‌లో దళిత కుటుంబంలో పుట్టాను. కులం దాచడం నేర్చుకుంటూనే పెరిగాను. నా కాన్వెంట్ స్కూల్ చదువు, ‘చామనచాయగా ఉన్నా మురికిగా లేని నా చర్మపు రంగు’ వల్ల, ఉన్నత కులందానిగానే చలామణీ అయ్యాను. సోఫియా బోర్డింగ్ స్కూల్లో ఏడేళ్ళప్పుడు చేరి, పై కులాల అలవాట్లు నేర్చుకున్నాక, తక్కిన జీవితమంతా వాళ్ళతో కలిసిపోగలనని అనుకున్నాను’’ అంటారు దత్. ‘‘మంచి విద్య (ఇంగ్లిష్ మీడియం) మాత్రమే మనల్ని సమాజం అంగీకరించేట్టుగా చేస్తుందని, దాన్ని పొందేందుకున్న ఒకే దారి, కులాన్ని దాచుకోవడం అనేవారు మా తాతగారు. ఆయన 60 ఏళ్ళ కిందట వదిలేసిన ‘నిదానియా’ అన్న ఇంటిపేరుని మరచిపోయాను.’’ ‘‘ఎవరైనా ‘ఏమ్మా, మీదే కులం?’ అనడిగినప్పుడు, ‘పరాశర్ బ్రాహ్మిణ్’ అనడం, ఎంత తరచుగా, నమ్మకంగా చెప్పే అబద్ధం అయుండేదంటే, వాళ్ళనేకాక నన్ను నేనే మోసగించుకోగలిగాను. అయితే, ఎవరైనా ‘కులం కేటాయింపు’, ‘భంగీ’ (నా కులం అయిన పాకీవృత్తి) లాంటి మాటలు అన్నప్పుడల్లా అసౌకర్యం కలిగేది.’’ దత్ కుటుంబంలో ముత్తాతతో సహా, మూడు తరాలు చదువుకున్నవారే. తల్లి చదువుకున్నదే అయినప్పటికీ ఇంగ్లిష్ మీడియంలో కాకపోవడం వల్ల, భర్త అవమానపరుస్తుంటాడు. ఆమె ఐపీఎస్ కావాలనుకున్నా పడదు. చిన్న ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని ఆదుకుంటుంది. ప్రభుత్వాధికారైన ఆమె తండ్రి, తాగుడు అలవాటువల్ల ఉద్యోగం పోగొట్టుకుంటారు. రచయిత్రి తమ సమాజంలోని స్త్రీలు తమ పురుషులనుండే ఎదుర్కునే అణచివేత గురించి కూడా రాస్తారు. ఆమె తల్లీ, అమ్మమ్మా చర్మపు రంగు మార్చుకునేందుకు వాడే నలుగుపిళ్ళ వివరాలుంటాయి పుస్తకంలో. ఆమె కథనంలో స్పష్టంగా కనపడేది తల్లికి తన పిల్లలకు ఉన్నత కులపు చదువు, మధ్య తరగతి పెంపకం అందించాలన్న నిశ్చయం. రచయిత్రి సెయింట్ స్టీఫెన్స్ కళాశాల (ఢిల్లీ)లో మూడు వేల విద్యార్థి వేతనం పొంది చదువుకున్నారు. తరువాత, హిందుస్తాన్ టైమ్స్, ఏషియన్ ఏజ్ పత్రికల్లో ఉద్యోగం చేసినప్పుడు, తన కులం బయటపడకుండా– ఉన్నత వర్గాలకు సంబంధం కలిగుండే ఫాషన్, జీవనశైలి వంటి విషయాలే ఎన్నుకునేవారు. కథలో– ఆమె జీవితపు సంస్మరణ, సామాజిక వ్యాఖ్యానంతో పాటు దళిత ఉద్యమాల క్లుప్తమైన చారిత్రక శకలాలూ కనిపిస్తాయి. ‘మన దేశంలో ఇంచుమించు ప్రతీ వ్యవస్థలోనూ గేర్లు మార్చే అగోచరమైన చెయ్యి’ వంటి పరిశీలనలు ఉంటాయి. అమెరికా–కొలంబియా యూనివర్సిటీ నుండి జర్నలిజంలో మాస్టర్స్ చేశారు దత్. ‘‘రోహిత్‌ను అనుకరించాలనుకున్నాను. దళిత హక్కుల కోసం అతను వెలిగించిన బాటను అనుసరిస్తూ, ‘డాక్యుమెంట్స్ ఫర్ దళిత్ డిస్క్రిమినేషన్’ మొదలెట్టాను. అక్కడ నాలాంటి వారు తమ తమ కథలను చర్చించుకుంటూ, వారూ బయటకొచ్చే అవకాశం ఉంది’’ అంటారు. కులవ్యవస్థను– అంబేద్కర్, మహాత్మా గాంధీలు సమీపించిన విధానాల్లో ఉన్న కీలకమైన తేడాలను ఎత్తి చూపిన ఈ పుస్తకాన్ని ‘ఆలెఫ్ బుక్ కంపెనీ’ 2019 ఫిబ్రవరిలో ప్రచురించింది. _కృష్ణ వేణి -
రాజిగాడు రాజయ్యాడు
సామాజిక న్యాయ సాధన కోసం ఉవ్వెత్తున వీస్తున్న అంశాన్ని ముందుకు తెస్తున్న నాటకం ‘రాజిగాడు రాజయ్యాడు’. ఉత్తరాంధ్ర సాహిత్య సుసంపన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రచన ఇది. శ్రామిక వర్గాలకు చెందిన దళిత బహుజనులు పాలకులుగా ఎదగాలని, రాజ్యాధికారం ద్వారానే వారి సమస్యలు పరిష్కారమవుతాయనే లక్ష్యంతో డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ ఈ నాటకాన్ని రాశారు. రాజిగాడుగా పిలిచే శ్రామిక వర్గానికి (మంగలి) చెందిన వ్యక్తి తనపై వర్ణ వివక్ష, దౌర్జన్యం భరించలేక రాజ్యాధికారంతోనే విముక్తి కలుగుతుందని గ్రహిస్తాడు. జనాలను సమీకరించి తిరుగుబాటు బావుటా ఎగరేసి గ్రామసర్పంచి కావడమే ఇందలి ఇతివృత్తం. అది నైమిశారణ్యం. ఆ అరణ్యంలోనే సూతుడు శౌనకాది మహామునులకు పురాణం చెబుతుంటాడు. తన ప్రవచనాన్ని కొనసాగిస్తూ భరతఖండంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంలో– ‘‘ఏ భూమిపై తూర్పు వాకిట బలిదానాల తోరణం అమరివుందో! ఏ నేలపై నూరు కొత్త ఉదయాలకై ఉద్యమం ఉప్పెనైందో! ఏ గడ్డపై సమభావం కోసం సమరం సాగిందో! ఏ మట్టిపై సాయుధులు నేలకొరిగి నింగికెగిశారో! ఆ గడ్డపై గడ్డిపోచవంటివాడు, గరుత్మంతుడై, గరళ కంఠుడై, సంప్రదాయ సర్పపు కోరలు పీకాడు. సామాన్యుని సామ్రాజ్యానికి పునాదులు వేశాడు’’ అని చెప్పినప్పుడు, ఎవరా వీరుడని మునులంతా ఆత్రుతతో ప్రశ్నిస్తారు. అందుకు సూతుడు శ్రామిక వర్గానికి చెందిన రాజిగానిలో క్షాత్రగుణం ఎలా వీరవిహారం చేసిందో చెబుతానంటాడు. ఇలా ప్రారంభమౌతుంది నాటకం. సమాజంలో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఈ వర్గాల్లో కొన్ని సామాజిక వర్గాల వారే ఆధిపత్యం వహిస్తున్నారు. మిగిలిన అణగారిన వర్గాలను అణచివేస్తున్నారు. ఈ నాటకంలో నాయుడు బీసీ వర్గీయుడే. బలవంతుడు కావడం వల్ల ఏళ్ల తరబడి సర్పంచి పదవి ఈయన గుప్పిట్లోనే ఉంది. ఫ్యూడలిస్టు దృక్పథంతో వ్యవహరిస్తుంటాడు. ఈ నేపథ్యంలో రాజయ్య ‘‘నాయుడూ! మీ బోటి కులాలన్నీ మావల్లే గెలిచి రాజ్యమేలుతున్నాయి. ఇకనుంచీ రాజ్యాధికారంలో మా వాటా మాకివ్వకపోతే ఊరుకొనేది లే’’దంటాడు. మరో సన్నివేశంలో ‘‘నీకన్నా ఎన్నోరెట్లు అధమ స్థితిలో ఉన్న వాళ్లతో సమానంగా నువ్వు రిజర్వేషన్లు అనుభవించడం మంచి పనా?’’ అని సూటిగా ప్రశ్నిస్తాడు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొన్ని బడావర్గాలకే అందుతున్నాయనీ, అత్యంత పీడిత తాడిత వర్గాలకు అవి అందని ద్రాక్షగా మారుతున్నాయనీ రచయిత ఈ పాత్రద్వారా చెప్పిస్తాడు. ఆ పల్లెలోని అణగారిన వర్గాలన్నీ ఏకతాటిపై నిలుస్తాయి. నాయుడు నిరంకుశ పాలనను ప్రతిఘటిస్తాయి. నాయుడులో మార్పు వస్తుంది. రాజయ్య గ్రామ సర్పంచవుతాడు. అప్పటివరకు రాజిగాడుగా పిలిచినవారే రాజయ్య, సర్పంచిగారు అని సహజంగానే పిలవడం మొదలుపెడతారు. సాంస్కృతిక రంగంలో సరికొత్త చైతన్యం ‘రాజిగాడు రాజయ్యాడు’. -వాండ్రంగి కొండలరావు -
పురిపండా పులిపంజా
పురిపండా అంటేనే పులిపంజా. పులిపంజా అంటేనే పురిపండా అని సాహితీవేత్తలు వ్యాఖ్యానిస్తుంటారు. అభ్యుదయ కవితోద్యమ తొలి దశ నుంచి యువకవులకు తోడు నిలిచినవాడు పురిపండా అప్పలస్వామి. నవీన సాహిత్య యుగోదయానికి, నవ కవులకు ‘దివిటీ నవుతా’ అంటూ ఎలుగెత్తి చాటిన దార్శనికుడు. వాడుకభాషా పితామహుడైన గిడుగు రామ్మూర్తికి శిష్యులై వ్యావహారిక భాషను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టేందుకు కృషి చేసి సఫలీకృతులయ్యారు. పురిపండా మొత్తం అరవై రచనలు చేశారు. వీటిలో పులిపంజా కవితాసంపుటి ఓ విస్ఫులింగం. లండన్ నుంచి విదేశాంధ్ర ప్రచురణగా ఇది వెలువడింది. 41 కవితల సమాహారమిది. సాంఘిక దురన్యాయాలపై పంజా విప్పిన కవి బెబ్బులి పురిపండా. జాతీయోద్యమంలో కార్యకర్తగా పనిచేయడం వల్ల బూజులా వేళ్లాడుతున్న సనాతన భావాలపై తిరుగుబాటు చేశారు. ‘నా గేయం/ మీ కవనం/ మీ ఖడ్గం నా గేయం/ కుబుసం వొదిలిన సర్పం/ నా గీతం పులిపంజా’ అంటూ సమాజానికి ప్రగతి కవితా సందేశాన్నిచ్చారు. ‘గుడిలోని దైవమా! ఆలింపవోయి/ గుడిలోని దయ్యమా! పైకి రావోయి/ నీ పాదపూజకై/ వెదకి తెచ్చిన పూలు/ నీ పాదసేవకై/ నింపి తెచ్చిన నీళ్లు/ పనికి రావంటారు/ మైలపడెనంటారు’ ఇలా సాగుతుందీ ‘గుడిలోని దైవమా’ గేయ కవిత. ఆనాటి సమాజంలో బుసలు కొడుతున్న అస్పృశ్యతపై తీవ్రంగా చలించి రాసిన ఈ కవిత నాటి సాహితీ సభల్లో అందరినీ కదిలింపజేసింది. హరిజనోద్ధరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపునకు స్పందించి రాసిన ఈ కవితను ఆంగ్లంలో అనువదించి గాంధీజీకి వినిపిస్తే ఎంతో మెచ్చుకున్నారు. ‘ఇక్కడ అడుగు పెడితే/ ఎందుకో నా వొళ్లు/ కంపరమెత్తుతుంది/ ఖద్దరు వొదిలేసి/ కత్తి పట్టాలనిపిస్తుంది/ అహింస అబద్ధమనిపిస్తుంది... భగత్సింగులాగ/ విప్లవకారుణ్ణయి/ ఎర్రజెండా ఎత్తాలనిపిస్తుంది/... పద్మనాభం గాలి నిండా/ వీరగాథ వినిపిస్తుంది/ పద్మనాభం ధూళినిండా/ వీరరక్తం కనిపిస్తున్నది’ అనే ఖండికను ఎంతో భావోద్వేగంతో రాశారు. కుంఫిణీ దొరల కుతంత్రాలను ప్రతిఘటించి పూసపాటి విజయ రామరాజు పద్మనాభం (విశాఖ జిల్లా) వద్ద యుద్ధం చేసి వీరమరణం పొందారు. ఈ ఉదంతం పురిపండా మనసును ద్రవింపజేసింది. అమరవీరుని త్యాగానికి నివాళిగా రాసిన స్మృతిగీతం అది. ‘మానవ శవాల మంటపాలపై/ ప్రభువుల పతాక రెగిలే భువిలో/ రాతి విగ్రహం రక్షిస్తుందా? పూజామంత్రం బువ్వెడుతుందా?’ ఇదీ పురిపండా భవ్య కవితావేశం. ‘తొలినాటి సంద్రాలు/ తుహినగిరి శిఖరాలు/ ఇంకిపోతున్నాయిలే/ కుంగిపోతున్నాయిలే’ అంటూ సుడిగాలి కవితలో ఛాందస భావాలను ఖండించారు. ఆధునిక భావజాలానికి ఆహ్వానం పలికారు. – వాండ్రంగి కొండలరావు -
ఎడారి కాయని జీవితం
సౌదీలో భవన నిర్మాణంలో కూలీగా పని చేస్తానని ఊహించుకున్న నజీబ్ ఆశలను తలకిందులు చేస్తూ అక్కడ మసారా (మేకల శాల)కి కాపరిగా నియమిస్తాడు అర్బాబ్. మానవ సహవాసం లేక, మేకలకి తన బంధువుల పేర్లు పెట్టి, వాటితో మాట్లాడటం మొదలెడతాడు నజీబ్. బెన్యామిన్ రాసిన మలయాళీ నవల ‘గోట్ డేస్’లో, కేరళ యువకుడైన నజీబ్ చిరకాల వాంఛ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం. ‘బంగారం వాచ్, గొలుసు, ఫ్రిజ్, టీవీ, వీసీఆర్, ఏసీ’లతో కూడిన జీవితం వంటి చిన్న కోరికలే అతనివి. బయటి ప్రపంచం గురించి తెలియక, ‘అమ్మకానికున్న వీసా’ తీసుకుని ఇల్లు తాకట్టు పెడతాడు. గర్భవతైన భార్యని వదిలి, 1992లో సౌదీ అరేబియా రాజధాని రియాద్ వెళ్తాడు. అక్కడ ‘తన కలల సంరక్షకుడు, తన లక్ష్యాలను నెరవేర్చే’ అర్బాబ్ (యజమాని) అతన్ని విమానం నుండి దించుకుంటాడు. నజీబ్‌ను ట్రక్కులో ఎడారికి తీసుకెళ్తాడు అర్బాబ్. భవన నిర్మాణంలో కూలీగా పని చేస్తానని ఊహించుకున్న నజీబ్ ఆశలను తలకిందులు చేస్తూ అక్కడ మసారా(మేకల శాల)కి కాపరిగా నియమిస్తాడు. నజీబ్ ‘అనవసరమైన ఆరోగ్య అవసరాలకని నీరు వృథా చేయకూడదు’. మూడు పూటలా బ్రెడ్డు, పాలే భోజనం. మేకలకి మేత వేస్తూ, పాలు పితుకుతూ, వాటిని ఇసుక దిబ్బల మీద తిప్పుతూ– అర్బాబ్ తిట్లూ, దెబ్బలూ తింటుంటాడు. మానవ సహవాసం లేక, మేకలకి తన బంధువుల, స్నేహితుల పేర్లు పెట్టి, వాటితో మాట్లాడటం మొదలెడతాడు. అతని పాస్‌పోర్ట్ యజమాని దగ్గర పెట్టుకుంటాడు. జీతం ఇవ్వడు. ‘ఈ పరిస్థితి నేను కన్న కలల నుండి ఎంత దూరమో గుర్తించాను. దూరం నుండి మాత్రమే ఆకర్షణీయంగా కనిపించే పరాయి చోట్ల గురించి కలలు కనకూడదు. అవి యధార్థం అవనప్పుడు, రాజీ పడటం ఇంచుమించు అసాధ్యం’ అనుకున్న నజీబ్, అల్లా చిత్తంపైన ఉన్న విశ్వాసంతో– తన ఒంటరితనాన్నీ, పరాయీకరణనీ ఎదురుకోగలుగుతాడు. మరుసటి మూడేళ్ళల్లో ‘పేలు పట్టి, అట్టలు కట్టిన జుత్తు, పొడుగు గడ్డంతో కంపు గొడ్తున్న ఆటవికుడి’గా మారతాడు. ఒక పిల్లాడిని చూస్తూ తనకి పుట్టిన కొడుకుని తలచుకుంటుంటాడు. ఆ పిల్లవాడి అంగచ్ఛేదానికీ, మరణానికీ సాక్షి అవుతాడు. తన జాగాలో, తనకిముందు అక్కడ పని చేసిన వ్యక్తి ఎముకలు ఇసుకలో కనబడినప్పుడు గానీ తనెంత దారుణమైన పరిస్థితిలో ఇరుక్కున్నాడో అర్థం చేసుకోలేకపోతాడు. తప్పించుకునే అవకాశం దొరికినప్పుడు ఇక తాత్సారం చేయడు. ఎడారిలో అతని ప్రయాణం బాధాకరమైన రీతిలో వర్ణించబడుతుంది. అతనితో పాటు బయల్దేరిన ఇద్దరిలో ఒకడు మరణిస్తాడు. మరొకతను మాయం అవుతాడు. ఏ గుర్తింపు పత్రాలూ లేకుండా ఒక్కడే నాగరికతలోకి అడుగు పెడతాడు. ‘చావకుండా మిగిలి ఉండాలంటే ఇదొక్కటే నాకున్న దారి’ అనుకుంటూ, జైలు అధికారులకి లొంగిపోతాడు. అక్కడ నుండి అతన్ని ఇంటికి పంపుతుంది ప్రభుత్వం. ‘రచయితలు ఎడారులను జ్ఞానోదయ స్థలాలంటారు. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కలిగిస్తాయంటారు. నాకైతే, ఎడారి ఏ విధంగానూ ప్రాణం పోయలేదు. అక్కడ నేను మూడేళ్ళకి పైగానే ఉన్నాను’ అంటాడు నజీబ్. ‘ఇది నాకు నిజజీవితంలో తెలిసిన మనిషి అనుభవాల గురించిన పుస్తకం’ అంటారు రచయిత బెన్యామిన్(ఇది కలంపేరు. అసలు పేరు బెన్నీ డెనియల్). మేకల వివరాలు నిండి ఉన్న ఈ పుస్తకం– శరీరాన్నీ, మనస్సునూ కూడా తీవ్రంగా అణచివేసే, వణుకు పుట్టించే వృత్తాంతం. దేవుని మీద నమ్మకం అండగా లేకపోతే, నజీబ్ పరిస్థితి– ఓటమికీ, స్వీయ నిర్మూలనకీ దారి తీసి ఉండేది. నాలుగు భాగాలుగా ఉన్న పుస్తకం ఉత్తమ పురుష కథనం. సంభాషణా శైలితో ఉండి, డైరీలా అనిపిస్తుంది. అలంకార ప్రాయమైన భాష ఉండదు. ఈ నవలను సౌదీ అరేబియాలోనూ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ నిషేధించారు. జోసెఫ్ కోయిపల్లి ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ నవలను 2012లో పెంగ్విన్ బుక్స్ ప్రచురించింది. ‘ద మ్యాన్, ఏషియన్ లిటరరీ అవార్డ్’ కోసం లాంగ్‌లిస్ట్ అయింది. -కృష్ణ వేణి -
తొందరే అన్ని పన్లనీ నాశనం చేసేస్తోంది
అబ్బాయీ, మన డేరా ఇవాళ ఇక్కడుంది. పశువులు ఇక్కడి గడ్డిని మేస్తాయి. ఈ చుట్టుప్రక్కల మనుష్యులవీ పశువులవీ మలమూత్రాలు కనపడ్డం మొదలెడతాయి. అప్పుడు ఈ చోటు వదలి మరో చోటుకి వెళ్లిపోతాం. అక్కడ కొత్తగా మొలిచిన పచ్చిక ఎక్కువగా ఉంటుంది. రాహుల్ సాంకృత్యాయన్ రచన ‘ఓల్గా నుంచి గంగకు’లో క్రీ.పూ. 2500 ఏళ్ల కింద జరిగిన కథగా చెప్పే ‘పురుహూతుడు’లో తాతకూ, పురుహూతుడికీ మధ్య జరిగే సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. దీని అనువాదం చాగంటి తులసి. అది ఇక్కడ: ‘‘ఈ రాగిని చూసినా, వ్యవసాయపు పొలాల్ని చూసినా నా గుండె మండుతుంది. ఈ రెండూ వక్షునదీ తీరానికి వచ్చిన్నాటినుంచీ అంతటా పాపం అధర్మం పెరిగిపోయేయి. దేవతలూ కోపగించేరు. అంటువ్యాధులు ఎక్కువైపోయేయి. కొట్టుకోడాలు నరుక్కోడాలు ఎక్కువైపోయేయి’’ అన్నాడు తాత. ‘‘ఇంతకు పూర్వం ఈ రెండూ లేవా తాత?’’ పురుహూతుడు అడిగేడు. ‘‘లేవురా అబ్బాయీ! ఇవి నా చిన్ననాటి రోజుల్లో కొద్దికొద్దిగా అప్పుడప్పుడే వచ్చేయి. మా తాతైతే వీటిపేరన్నా వినలేదు. ఆ కాలంలో రాతితో చేసినవీ, ఎముకలతో చేసినవీ, కర్రతో చేసినవీ ఆయుధాలు ఉండేవి.’’ ‘‘అలాగా! అయితే కలప నెలా కోసేవారు తాతా?’’ ‘‘రాతి గొడ్డలితో.’’ ‘‘చాలాసేపు పడుతూ ఉండి ఉంటుంది. ఇంతబాగానూ తెగి ఉండి ఉండదు.’’ ‘‘ఇదిగో ఈ తొందరే అన్నిపన్లనీ నాశనం చేసేస్తోంది. ఇప్పుడు రెణ్నెల్లకి సరిపడే గ్రాసాన్నో సగం బతుక్కి ఉపయోగపడే స్వారీ గుర్రాన్నో ఇచ్చి ఓ రాగి గొడ్డలి తీసుకో. ఆ తర్వాత అడవులకి అడవులు నరికేసి ధ్వంసం చేసెయ్యి. ఊళ్లకి ఊళ్లు చంపేసి నాశనం చేసెయ్యి. అయితే ఊళ్లు అడవిలో చెట్లలా ఆయుధాలు లేకుండా లేవు. వాటిదగ్గరా అంత పదును గొడ్డలీ ఉంది. ఇదిగో ఈ రాగి గొడ్డలి యుద్ధాల్ని మరింత క్రూరంగా మార్చేసింది. దీనితోగాని గాయం అయిందా విషపూరితమైపోతుంది. పూర్వం అయితే బాణపు ములుకులు రాతివి ఉండేవి. అవింత పదునుగా ఉండేవి కావు కాబట్టి సరిపోయేది. అయితే నేర్పరుల చేతుల్లో అవీ ఉపయోగపడేవి. ఇప్పుడీ రాగి ములుకులతో ముక్కుపచ్చలారని పిల్లకాయలూ పులిని వేటాడేద్దామనుకుంటున్నారు. ఇప్పుడిహ ఎవరైనా గొప్ప విలుకాణ్ణవాలని ఎందుకనుకుంటాడు?’’ ‘‘తాతా! నువ్వు చెప్పేవాటిల్లో ఓ దానిని నేను ఒప్పుకుంటున్నాను. మనిషి ఓ దగ్గరే కట్టిపడి ఉండటానికి పుట్టలేదు. నిజం.’’ ‘‘అవున్రా అబ్బాయీ! రోజూ చేసినచోటే దానిమీద దానిమీదే మల విసర్జన చెయ్యడం ఎంత అసహ్యకరం! మన డేరా ఇవాళ ఇక్కడుంది. పశువులు ఇక్కడి గడ్డిని మేస్తాయి. ఈ చుట్టుప్రక్కల మనుష్యులవీ పశువులవీ మలమూత్రాలు కనపడ్డం మొదలెడతాయి. అప్పుడు ఈ చోటు వదలి మరో చోటుకి వెళ్లిపోతాం. అక్కడ కొత్తగా మొలిచిన పచ్చిక ఎక్కువగా ఉంటుంది. అక్కడ నేలా నీరూ గాలీ ఎక్కువ పరిశుద్ధంగా ఉంటాయి.’’ ‘‘అవున్తాతా! నాకూ అలాంటి నేలంటేనే ఇష్టం. అలాంటిచోట నా పిల్లంగోవి ఇంకా తియ్యగా పలుకుతుంది.’’ -
మాటలు మార్చిన మనిషి
ఒక్క మాట కూడా మాట్లాడటంలేని ఒక వృద్ధుడి కథ ఇది. ఆయనో చిన్న పట్టణంలో ఏ వీధి చివరో ఉంటుంటాడు. ఆయన్ని గురించి వర్ణించడానికి, మరొకరితో విడదీసి చూపేంత ప్రత్యేకమైన విశేషణాలేం లేవు. ఆయన గది, పై అంతస్తులో ఉంది. ఆయనకు ఒకప్పుడు పెళ్లయి ఉండొచ్చు, పిల్లలు కూడా ఉండిండొచ్చు, వాళ్లు వేరే పట్టణంలో ఉంటుండవచ్చు. ఆయన గదిలో రెండు కుర్చీలు, ఒక టేబుల్, ఒక కంబళి, ఒక మంచం, ఒక బీరువా ఉన్నాయి. చిన్న టేబుల్ మీద అలారం గడియారం, దాని పక్కన పాత న్యూస్‌పేపర్లు, ఒక ఫొటో ఆల్బమ్ ఉన్నాయి. గోడకు వేలాడుతూ ఒక అద్దం, ఒక పటం. ముసలాయన ఉదయం, మధ్యాహ్నం నడకకు వెళ్తాడు, దారిలో ఇరుగుపొరుగుతో పొడిగా మాట్లాడుతాడు, సాయంత్రం టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఈ దినచర్యలో ఏ మార్పూ ఉండదు. ఆదివారాలు కూడా మారదు. ఆయన టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు గడియారపు టిక్‌టిక్ శబ్దం వినబడుతుంది. గడియారం ఎల్లప్పుడూ టిక్‌టిక్‌మంటూనే ఉంటుంది. ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది. చక్కటి పొద్దుపొడుపు, పక్షుల కిలకిలారావాలు, స్నేహపూరిత మనుషులు, ఆడుకునే పిల్లలు– ఉన్నట్టుండి ముసలాయన వీటన్నింటినీ ఇష్టపడటం మొదలుపెడతాడు. ఆయన నవ్వుతాడు. ఇక అంతా మారిపోతుందని తలపోస్తాడు. చొక్కా పై గుండీ తీసి, టోపీ చేత పట్టుకుని, వేగం పెంచి ఉత్సాహంగా నడుస్తూ సంతోషంగా కనబడతాడు. ఆయనుండే వీధిలోకి మళ్లి, పిల్లలకు అభివాదం చేసి, ఇంటి ముందుకొచ్చి, మెట్లు ఎక్కి, జేబులోంచి తాళంచెవి తీసి, గది తలుపు తెరుస్తాడు. కానీ గదిలో ఏమీ మారలేదు. అదే టేబుల్, అవే రెండు కుర్చీలు, అదే మంచం, కూర్చుంటే అదే టిక్‌టిక్ ధ్వని. ఆయన సంతోషం ఆవిరైపోతుంది. ఏమీ మారలేదు. ఆయనకు కోపం వస్తుంది. అద్దంలో చూసుకుంటాడు, ముఖం ఎర్రబారి ఉంటుంది. పిడికిలి బిగించి టేబుల్ మీద గుద్దుతాడు. ముందొకటే గుద్దు, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకా ఇంకా గుద్దుతూ అరుస్తాడు, ‘ఇది మారి తీరాలి, ఇది మారి తీరాలి’. ఆ కాసేపు మాత్రం గడియారం టిక్ టిక్ శబ్దం వినిపించదు. చేయి నొప్పెట్టి, గొంతు పోయి ఆగినప్పుడు, మళ్లీ గడియారం శబ్దం వినిపిస్తుంది. ఏమీ మారలేదు. ‘ఎప్పుడూ అదే టేబుల్, అవే కుర్చీలు, అదే మంచం, అదే పటం. నేను టేబుల్‌ను టేబుల్ అనే అంటాను, మంచాన్ని మంచం అనే అంటాను, కుర్చీని కుర్చీ. ఇలాగే ఎందుకు? ఫ్రెంచ్‌వాళ్లు టేబుల్‌ను తబ్లే అంటారు, కుర్చీని షెజ్ అంటారు, అయినా ఒకరిది ఒకరికి అర్థమవుతుంది. మంచాన్ని పటం అని ఎందుకు అనకూడదు?’ ఈ ఆలోచన రాగానే ముసలాయన చిన్నగా నవ్వుతాడు, తర్వాత బిగ్గరగా, ఇంకా పెద్దగా నవ్వుతూనే ఉన్నాడు, పక్కనున్నవాళ్లు తలుపు కొట్టి, ‘నిశ్శబ్దం’ అని చెప్పేదాకా. ‘ఇప్పుడు మారుతుంది, ఇప్పటినుంచీ మంచం, పటం అవుతుంది’ అని అరిచాడు. ‘నేను అలసిపోయాను, పటంలో పడుకోవాలి’ అనుకుంటాడు. ఉదయాలు ఆయన చాలాసేపు అలా పటంలో పడుకునివుండేవాడు. పేరు మార్చుకున్న కుర్చీలో ముఖం చూసుకునేవాడు. ఇక కుర్చీకి ఆయన గడియారం అని పేరుపెట్టాడు. అతడు మంచంలోంచి లేచి, బట్టలు వేసుకుని, గడియారం మీద కూర్చుని, చేతుల్ని టేబుల్ మీద ఆన్చుతాడు. కానీ టేబుల్‌ను ఇప్పుడాయన టేబుల్ అనడం లేదు, కంబళి అంటున్నాడు. అంటే, ఉదయాన్నే అతడు పటంమీంచి లేచి, బట్టలు వేసుకుని, కంబళి దగ్గర గడియారం మీద కూర్చుని, మార్చాల్సిన పేర్ల గురించి ఆలోచిస్తాడు. అద్దానికి ఆయన కుర్చీ అని పెట్టాడు. వార్తాపత్రికను ఆయన మంచం అన్నాడు. గడియారాన్ని ఫొటో ఆల్బమ్ అంటున్నాడు. బీరువాను వార్తాపత్రిక అంటున్నాడు. కంబళిని బీరువా అంటున్నాడు. పటాన్ని టేబుల్ అంటున్నాడు. ఫొటో ఆల్బమ్‌ను అద్దం అంటున్నాడు. అంటే: ఉదయం కాగానే ముసలాయన చాలాసేపు పటంలో పడుకునివుంటాడు, తొమ్మిదింటికి ఫొటో ఆల్బమ్ మోగుతుంది, ఈయన లేచి కాళ్లకు చలేయకుండా బీరువా మీద కాళ్లు ఆన్చుతాడు, తర్వాత వార్తాపత్రికలోంచి బట్టలు తీసి వేసుకుంటాడు, గోడ మీద ఉన్న కుర్చీలో ముఖాన్ని చూసుకుంటాడు, కంబళి దగ్గర గడియారం మీద కూర్చుని అద్దాన్ని తిరగేస్తూ వాళ్లమ్మ టేబుల్ దగ్గర ఆగుతాడు. ముసలాయనకు ఇది సరదా అనిపించింది. ఈ మాటల్ని రోజంతా కంఠస్థం చేస్తాడు. ప్రతిదీ పేరు మార్చుకుంది. ఇంక ఆయన మనిషి కాదు, కాలు. కాలు అంటే ఉదయం. ఉదయం అంటే మనిషి. ఇంక ఈ కథను మీకు మీరే రాసుకోవచ్చు. ముసలాయన లాగే మీరు కూడా పదాల్ని మార్చుకోవచ్చు. మోగడం అంటే ఎక్కడం. చలేయడం అంటే చూడటం. పడుకోవడం అంటే మోగడం. నిల్చోవడం అంటే చలేయడం. ఎక్కడం అంటే తిరగేయడం. అప్పుడు కథ ఇలా సాగుతుంది: మనిషి అయినా, ముసలి కాలు పటంలో చాలాసేపు మోగుతాడు. తొమ్మిదింటికి ఫొటో ఆల్బమ్ ఎక్కుతుంది. కాలు చల్లబడి, ఉదయం చూడకుండా ఉండటానికి బీరువాను తిరగేస్తాడు. ముసలాయన తనకోసం కొన్ని నీలిరంగు స్కూలు నోటు పుస్తకాలు కొని, ఈ కొత్త పదాలన్నింటినీ రాస్తూపోయాడు. ఇదింక ఆయనకు తీరికనేది లేకుండా చేసింది. ఇప్పుడాయన వీధుల్లో ఎప్పుడోగానీ కనబడటం లేదు. ఆయన ప్రతి కొత్త పదాన్ని కంఠస్తం చేస్తూ పోయాడు. ఈ కొత్త పదాలు నేర్చుకున్నకొద్దీ అసలు మాటలు మర్చిపోవడం మొదలైంది. దాంతో ఆయన ఒక్కడికే చెందిన ఒక ప్రత్యేకమైన భాష రూపొందింది. కొన్నిసార్లు ఆయన ఈ కొత్త భాషలోనే తన కలలు కనేవాడు, తను విద్యార్థిగా చదువుకున్న ∙పాటలను ఈ కొత్తభాషలోకి అనువదించేవాడు, వాటిని తనకోసం తాను నెమ్మదిగా పాడుకునేవాడు. కానీ త్వరలోనే ఈ అనువదించడం కూడా కష్టమైపోయింది. తన పాత భాషను దాదాపుగా మర్చిపోయాడు. ఒక్కోసారి సరైన మాట కోసం తన పాత నీలిరంగు నోటు పుస్తకాల్లో వెతకాల్సి వచ్చేది. ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినా ఇబ్బంది పడేవాడు. వాళ్ల మాటల్ని పోల్చుకోవడానికి చాలాసేపు ఆలోచించాల్సి వచ్చేది. ఆయన పటాన్ని జనం మంచం అంటున్నారు. ఆయన కంబళిని జనం టేబుల్ అంటున్నారు. ఆయన అలారం గడియారాన్ని జనం కుర్చీ అంటున్నారు. ఆయన మంచాన్ని జనం వార్తాపత్రిక అంటున్నారు. ఆయన కుర్చీని జనం అద్దం అంటున్నారు. ఆయన ఫొటో ఆల్బమ్‌ను జనం అలారం గడియారం అంటున్నారు. ఆయన వార్తాపత్రికను జనం బీరువా అంటున్నారు. ఆయన బీరువాను జనం కంబళి అంటున్నారు. ఆయన టేబుల్‌ను జనం పటం అంటున్నారు. ఆయన అద్దాన్ని జనం ఫొటో ఆల్బమ్ అంటున్నారు. దీంతో ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే, జనం మాట్లాడేది వింటే ఆయనకు నవ్వు రావడం మొదలైంది. ఎవరైనా, ‘నువ్వూ రేపు ఫుట్‌బాల్ చూడటానికి వస్తున్నావా?’ అంటే నవ్వొచ్చేది. ‘రెండు నెలలుగా వానలు పడుతూనే ఉన్నాయి’ అన్నా, ‘అమెరికాలో మా అంకుల్ ఉన్నాడు’ అన్నా ఆయనకు నవ్వాగేది కాదు. వాళ్లు మాట్లాడేది ఏదీ అర్థం కాక ఆయనకు నవ్వు వచ్చేది. కానీ ఇది సరదా కథ కాదు. ఇది విషాదంగా మొదలై విషాదంగానే ముగుస్తుంది. జనం మాట్లాడేది ముసలాయనకు ఏమీ అర్థమయ్యేది కాదు. ఇందులో అంత బాధపడవలసింది ఏమీలేదు, కానీ ఈయన మాట్లాడేది కూడా జనానికి అర్థమయ్యేది కాదు. దాంతో ఆయన ఏమీ మాట్లాడేవాడు కాదు. అతడు మౌని అయిపోయాడు, తనతో తానే మాట్లాడుకుంటూ. పెద్దవాళ్లను ఉద్దేశించినట్టుగా కనబడే పిల్లల కథలు రాయడం పీటర్ బిక్సెల్ ప్రత్యేకత. ఈయన 1935లో స్విట్జర్లాండ్‌లో జన్మించారు. ఉపాధ్యాయుడిగానూ, పాత్రికేయుడిగానూ పనిచేశారు. ఆధునిక జర్మన్ సాహిత్యానికి ప్రతినిధి. పైది, ఆయన 1969లో రాసిన ‘ఎ టేబుల్ ఈజ్ ఎ టేబుల్’ కథాసారం. పీటర్ బిక్సెల్ -
దుర్మార్గపు దయ
మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరి మధ్యా ఏదో ఉందనిపిస్తుంది, కానీ మీరు దాన్ని దాస్తున్నారు అని గనక ఎవరైనా అంటే... ఇద్దరూ ఏకగొంతుతో అలాంటిదేమీ లేదని బదులిస్తారు, అది నిజం కూడా. ఒక నెలకు పైగా వాళ్లు కలిసి తింటున్నారు, కలిసి చదువుతున్నారు, కలిసి పనిచేస్తున్నారు– గోరంతలు కొండంతలు చేసే స్వభావం ఉన్నవాళ్లు ఎవరైనా వీళ్లు ఒకరి కొకరు చెప్పుకుంటున్న మాటలు గమనించినా, ఒకరిమీద పడ్డట్టుగా మరొకరు ఉంటున్న తీరును చూసినా, వీళ్లు కచ్చితంగా ప్రేమించుకుంటున్నారని చెబుతారు. ఆమెది అర్జెంటీనా, అతడిది చిలీ. వాళ్లిద్దరూ దూరపు నడకలంటే ఇష్టం ఉన్నవాళ్లే, నడుస్తూ దూర ప్రయాణాలు చేయడం ఎంత బాగుంటుందో అని మాట్లాడుకున్నవాళ్లే, అసలు ప్రపంచాన్ని దూరపు నడకలు ఇష్టపడేవాళ్లూ, ఇష్టపడనివాళ్లూ అని విభజించేంతగా వాళ్ల సంభాషణ కొనసాగింది కూడా. అయినప్పటికీ ఏదో చపలచిత్తంతో వాళ్లు టాక్సీ ఎక్కారు, ఆ టాక్సీలు ఎక్కకూడదని వాళ్లకు మెక్సికో సిటీలో అడుగు పెట్టడానికి నెలలకు ముందే హెచ్చరికలు వచ్చివున్నప్పటికీ, ప్రత్యేకించి వీధుల్లోవి, వాళ్లకు కూడా ఇన్నిరోజులూ టాక్సీ తీసుకోవాలన్న ఆలోచనే రాలేదు, కానీ ఈ రోజు ఏదో చపలచిత్తంతో టాక్సీ తీసుకోవడమూ, డ్రైవరు రాంగ్ రూట్లో పోతున్నాడని ఆమె గ్రహించడమూ, చిలీ అబ్బాయితో ఆమె ఏదో గొణగడమూ, అతడు ఏం కాదన్నట్టుగా భరోసా ఇవ్వడమూ జరిగింది. కానీ అతడి మాటలకు ఏ ప్రభావమూ లేనట్టుగా టాక్సీ ఆగింది, ఇద్దరు మనుషులు టాక్సీలోకి వచ్చారు. చిలియన్ ధైర్యంగా, నిర్లక్ష్యంగా, కంగారుగా, పిల్లతనంతో, మూర్ఖత్వంతో స్పందించాడు, ఒక దోపిడీదారు ముక్కు మీద గుద్దాడు, ఆమె అప్పటికే ఆపండి, ఆపండి అని అరుస్తూనే ఉంది. చిలీ అబ్బాయి ఆగాడు, దోపిడీదారులు చిలియన్ను ఆడుకున్నారు, వాళ్లు ఏ కనికరమూ చూపలేదు, లోపల ఏమైనా విరిగివుండొచ్చు కూడా. కానీ ఇదంతా జరిగి అప్పటికే పది నిమిషాలైంది, అప్పటికే వీళ్ల డబ్బులూ, క్రెడిట్ కార్డులూ లాక్కున్నారు, ఏటీఎం పిన్ నంబర్లు కంఠస్తం చేశారు. ఇప్పుడు వాళ్లు ముగ్గురయ్యారు, కారు ఆగిన వెంటనే డ్రైవరు దిగిపోయాడు, ఆ కారునే మరో ట్రక్కుతో ఫాలో అవుతున్న ఇంకో దొంగ కారెక్కి స్టీరింగ్ తీసుకున్నాడు, ఈ కొత్త దొంగ మరోసారి చిలియన్ను కొట్టాడు, అమ్మాయిని తినేసేలా చూశాడు, ఆ దెబ్బలనీ, దగ్గరికి లాక్కోవడాన్నీ ఇంక చేసేదేమీ లేదన్నట్టుగా వాళ్లు అంగీకరించారు. దొంగలు ఎంతో దయగా వీళ్లు ఎక్కడికి వెళ్తున్నారని అడిగి, లా కొందేస వెళ్తున్నారని తెలుసుకుని, మేము దగ్గరలో మిమ్మల్ని డ్రాప్ చేస్తామనీ, మేము మరీ అంత చెడ్డవాళ్లమేమీ కాదనీ చెప్పారు. వాళ్లని దింపెయ్యడానికి ముందు నమ్మశక్యంకానట్టుగా వాళ్లకు నూరు పెసోలు ఇచ్చారు కూడా, తిరిగి మళ్లీ ఇంటికి టాక్సీలో వెళ్లమని చెప్పి, కానీ వీళ్లు టాక్సీ తీసుకోలేదు, సబ్వే వైపు బయల్దేరారు, మధ్యమధ్యలో ఆమె ఏడుస్తూ ఉంది, అతడు ఆమెను ఓదార్పుగా దగ్గరకు తీసుకున్నాడు, ఒక్కోసారి అతడు అయోమయంగా కన్నీరును ఆపుకున్నాడు. మెక్సికో సిటీ సబ్వేలో తరచూ ట్రెయిన్ చాలాసేపు ఆగుతుంది, ఒక మధ్య స్టేషన్లో ఒక ఆరేడు నిమిషాలపాటు, ఆ అతిసాధారణ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగినట్టుగా వాళ్లను హింస పెట్టింది, ఆ ట్రెయిన్ డోర్లు మూసుకుని, ట్రెయిన్ కదిలి, చివరికి వాళ్ల స్టేషన్లో దిగి, నడుచుకుంటూ ఆమె ఉంటున్న ఇల్లు చేరేదాకా. ఈ అర్జెంటైన్, చిలియన్ ఒక దగ్గర ఉండరు. చిలియన్ ఒక ఈక్వెడార్ రచయితతోనూ అర్జెంటైన్ ఇద్దరు స్నేహితులతోనూ ఉంటారు– ఒక స్పానియార్డ్, ఒక చిలియన్, మరో చిలియన్– నిజానికి వాళ్లు స్నేహితులు కూడా కారు, వాళ్లంతా రచయితలు, మెక్సికో ప్రభుత్వం ఇస్తున్న ఒక గ్రాంటు వల్ల మెక్సికో వచ్చారు, వాళ్లు చేసే పనులన్నింట్లోకీ రాయడం తక్కువైనప్పటికీ. వాళ్లు వచ్చి తలుపు తెరిచేప్పటికి, స్పానియార్డ్, బక్కపలుచటి స్నేహశీలి ఏదో రాసుకుంటున్నాడు, రెండో చిలియన్ అక్కడ లేడు. మొదటి చిలియన్, రెండో చిలియన్ స్నేహితులు కారు, చెప్పాలంటే వాళ్లు శత్రువుల లాంటివారు, కనీసం చిలీలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు మెక్సికోలో ఉన్నప్పుడు కూడా పోట్లాడుకోవడం అనుచితమని ఇద్దరికీ తెలుసు. వీళ్లు ఇద్దరు వెళ్లేప్పటికి లివింగ్ రూములో శ్రద్ధగా రాసుకుంటున్న స్పానియార్డ్ జరిగింది విని దాదాపుగా కదిలిపోయాడు, వీళ్లను ఓదార్చడానికి ప్రయత్నించాడు, ఉల్లాసపరిచే సందర్భోచిత జోకొకటి చెప్పాడు, క్రెడిట్ కార్డులు బ్లాక్ చేయడానికి అవసరమైన నంబర్ సంపాదించి ఇవ్వడంలో సాయపడ్డాడు– దొంగలు 3000 పెసోలు తీసుకున్నారు, రెండు క్రెడిట్ కార్డులు, రెండు సెల్ఫోన్లు, రెండు లెదర్ జాకెట్లు, ఒక వెండి గొలుసు, ఒక కెమెరా కూడా, ఈ చిలియన్ కెమెరా తేవడానికి మళ్లీ తిరిగి వెళ్లాడు, ఎందుకంటే అతడు అర్జెంటైన్ ఫొటోలు తీద్దామనుకున్నాడు, ఆమె నిజంగా అందంగా ఉంటుంది, ఇది పడికట్టు మాటే, కానీ ఏం చేయగలం, నిజంగా కూడా ఆమె అందంగా ఉంటుంది, అతడు అది కూడా ఆలోచించాడు, ఆ కెమెరా తేవడానికి గనక తిరిగి ఇంటికి వెళ్లకపోయుంటే వాళ్లు అదే టాక్సీని ఎక్కకపోయేవాళ్లు, కానీ చాలా విషయాలు అలాగే జరుగుతాయి, వాళ్లు కొంచెం ముందు వెళ్లినా కొంచెం వెనక వెళ్లినా ఆ కిడ్నాప్ బారి నుంచి కాపాడుకోగలిగేవాళ్లు. అర్జెంటైన్, చిలియన్ జరిగిందేమిటో రెండోసారి, మూడోసారి స్పానియార్డ్కు చెబుతూ ఉపశమనం పొందుతున్నప్పుడు, రెండో చిలియన్ వచ్చాడు, అతడో పార్టీ నుంచి తిరిగొస్తున్నాడు, కూర్చుని తన చికెన్ ముక్క తినబోతూ, ఏం జరిగిందో చూసుకోకుండా ఉన్నపళంగా మాట్లాడటం మొదలుపెట్టాడు, అప్పుడుగానీ మొదటి చిలియన్ ముఖం ఉబ్బివుండటం, దానికి అతడు ఐస్‌బ్యాగ్ పెట్టుకోవడం గమనించలేదు, ముందైతే అతడికి అది సహజంగానే కనబడింది, అతడిదైన కవి ప్రపంచంలో ఎవరైనా ఒకరు ముఖానికి మంచుగడ్డలు పెట్టుకుని అలా రాత్రంతా గడపడం సాధారణమే కదా అనిపించింది, కానీ ఏం జరిగిందో తెలుసుకున్నాక, ‘ఘోరం, ఇవ్వాళ మధ్యాహ్నం నాకూ దాదాపు ఇలాగే జరగబోయింది’ అన్నాడు, అతడు ఒక్క లిప్తకాలంలో ఆ టాక్సీ నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకోవడం వల్ల బచాయించాడు. మళ్లీ ఎవరో వచ్చారు, ఆ స్పానియార్డ్ స్నేహితుడై ఉండాలి, మళ్లీ వీళ్లు కథంతా చెప్పారు, ముఖ్యంగా చివరి భాగం, టాక్సీలోని తుది అరగంట, ఇది వాళ్లకు రెండో భాగం లాంటిది. అపహరణ వ్యవహారం మొత్తం గంటసేపు సాగింది, మొదటి అరగంట వీళ్లు ప్రాణాల కోసం భయపడ్డారు, రెండో అరగంటలో భయం ఉన్నప్పటికీ ఆ దొంగలు తమను కచ్చితంగా చంపరని వాళ్లకు నమ్మకం కుదిరింది, ఎందుకంటే వాళ్ల మాటలు అంత భయంకరంగా లేవనిపించింది: ‘అర్జెంటైన్లను పట్టుకున్నాంగానీ ఒక్క చిలియన్ను కూడా ఇంతకుముందు పట్టుకోలేదు’ అన్నాడు సీట్లో కూర్చున్న వ్యక్తి, ఇంకా ముందుకెళ్లి చిలీ దేశ పరిస్థితి ఏంటని కూడా విచారించాడు, వాళ్లేదో రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా. ఇంతలో వెనకసీట్లో కూర్చుని చేతిలో గన్ పట్టుకున్న వ్యక్తి, ‘మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరి మధ్యా ఏదో ఉందనిపిస్తుంది, కానీ మీరు దాన్ని దాస్తున్నారు’ అన్నాడు, దానికి వాళ్లు ఏకస్వరంతో లేదులేదన్నారు. ఏం అతడు బాగానే ఉన్నాడు కదా అని అర్జెంటైన్ను ఉద్దేశించి అని, నువ్వా 70ల పొడుగు జుట్టు కత్తిరిస్తే ఇంకా బాగుంటావని చిలియన్కు సలహా ఇచ్చి, పెద్ద కళ్లద్దాలు అతడి ముఖం మీంచి తీయించి కిటికీలోంచి పారేశాడు. ‘ఈసారొచ్చినప్పుడు కత్తెర వెంట తెచ్చుకోవాలి’ అన్నాడు గన్‌మాన్, మళ్లీ చిలియన్ను పట్టుకున్నప్పుడు ఈ జుట్టు కత్తిరించాలని చెబుతూ, ముందుముందు మనం చిలియన్లనే, ప్రత్యేకించి పొడువు జుట్టు ఉన్నవాళ్లనే పట్టుకోవాలనీ, అర్జెంటైన్లను ఇంతకుముందు పట్టుకున్నాంగానీ మొదటిసారి మనకు ఈ కుక్కలకొడుకు దొరికాడనీ అన్నాడు. నా దగ్గరో కత్తివుందిగానీ దానితో జుట్టు కత్తిరించలేననీ, కాకపోతే వృషణాలు కోయగలననీ, కానీ అవి తీసేస్తే వీడి గర్ల్‌ఫ్రెండుకు కష్టమైపోతుందనీ బాధపడ్డాడు, పైగా అర్జెంటైన్ అమ్మాయి సెక్సీగా కూడా ఉందాయె, అంత అందగత్తెను ఏమీ చేయకుండా వదిలేయడం కష్టంగానే ఉన్నప్పటికీ ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను కాబట్టి ఆ పని చేయనన్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడు అమ్మాయిని మారడోనా గురించి అడిగాడు, ఆమె ఏదో బదులిస్తుండగానే వాడు తమాషాగా మెస్సీ కంటే చిచారిటో హెర్నాండెజ్ మంచి ఆటగాడని చెబుతూ, మెక్సికోలో ఏ ఫుట్‌బాల్ క్లబ్ నీ ఫేవరేట్ అని అడిగాడు, ఆమె తనకు తెలియదంది, అది పచ్చి అబద్ధం, వాడికంటే కచ్చితంగా ఆ అమ్మాయికి సాకర్ గురించి ఎక్కువ తెలుసు. దీని గురించే చిలియన్ కూడా ఆలోచించాడు, ఎలా అబద్ధం చెప్పాలో తెలియక, ప్యూమా, షివాస్, క్రూజ్ అజుల్ క్లబ్బుల్లో దొంగలు దేని ఫ్యాన్సో అంచనా వేయలేక, మాంటెరీ అన్నాడు, అక్కడ చుపెటె సువాజో ఆడతాడు కాబట్టి. ఈ మాంటెరీ అంటే ఆ దొంగకు ఇష్టం లేకపోయినా చుపెటె సువాజోకు అతడు ఫ్యాన్ కాబట్టి, చుపెటె సువాజో గౌరవార్థం వాళ్లను చంపకుండా వదిలేయాలని తీర్మానించాడు. ఈ చుపెటె సువాజో ఎవరని అడిగాడు రెండో చిలియన్, తనకు కచ్చితంగా తెలిసినా, తాను సాకర్‌ను అంత పట్టించుకోనని బిల్డప్ ఇచ్చేందుకు. మొదటి చిలియన్ జవాబు ఇచ్చేలోగా స్పానియార్డ్ అందుకుని అతడు చిలీ సెంటర్ ఫార్వర్డ్ ఆటగాడని బదులిచ్చాడు. అర్జెంటైన్, మొదటి చిలియన్ ఇంకా అలాగే దగ్గరగా కూర్చుని ఉన్నారు. ఈ అన్ని వివరాలతో కూడిన కిడ్నాప్ డ్రామా గురించి చెప్పీ చెప్పీ అలసి, నిజంగా వాళ్లకు ఒంటరిగా ఉండాలనిపించింది. చివరకు బాత్రూమ్కు వెళ్తున్నానని చెప్పి అర్జెంటైన్ బెడ్రూములోకి వెళ్లాడు చిలియన్. కాసేపుండి అర్జెంటైన్ కూడా లేచి బాత్రూములోకి వెళ్లి కిడ్నాపును కడుక్కునేలా స్నానం చేసింది, ఇంకా నయం ఆమెకు జరిగింది తక్కువే కాబట్టి, ఈ రోజంతా ఆమె అందరికీ కృతజ్ఞతతో ‘థేంక్యూ, థేంక్యూ’ అని చెబుతూనేవుంది, ఏం చేయకుండా వదిలేసిన కిడ్నాపర్లకూ, తనను ఓదార్చిన స్పానియార్డ్కూ, పట్టించుకోకుండా వదిలేసి కూడా సాంత్వన ఇచ్చిన రెండో చిలియన్కూ, ఇంకా ముఖ్యంగా మొదటి చిలియన్కూ. ఇప్పుడు అర్జెంటైన్నూ చిలియన్నూ చూసేవాళ్లెవరైనా, ప్రేమంటే ఏమిటో తెలిసిన వాళ్లెవరైనా వీళ్లిద్దరూ చాలాకాలం కలిసివుంటారని అనుకుంటారు. అలెజాండ్రో జాంబ్రా అలెజాండ్రో జాంబ్రా, చిలీ రచయిత. 1975లో జన్మించారు. బోన్సాయ్ నవల ఆయనకు పేరు తెచ్చింది. ఆయన ‘థేంక్ యూ’ కథకు పైది సంక్షిప్త రూపం. అలెజాండ్రో తెంపు లేకుండా వాక్యాలు రాస్తూపోతాడు. స్పానిష్‌లో రాసిన ఈ కథ ఆంగ్లానువాదాన్ని ఈ లింకులో చదవొచ్చు. https://www.vice.com/ en_us/article/dpwv8w/thank-you-0000146-v20n11 -
పదమూడు రోజుల కిడ్నాప్ ముందూ, వెనుకా
కొత్త బంగారం ‘ఒకానొకప్పుడు నా జీవితం అద్భుత కథ. ఆ తరువాత, నేను ప్రేమించిన ప్రతీదాన్నుంచీ దొంగిలించబడ్డాను... మరణిస్తూ మరణిస్తూ గడిపిన ఎన్నో రోజుల తరువాత, నేనిప్పుడు మృతురాలిని’ అని ప్రారంభించిన ‘ఎన్ అన్టేమ్డ్ స్టేట్’, రాక్సీన్ గే తొలి నవల. నవలకున్న రెండు భాగాల్లో మొదటిదైన, ‘తర్వాత కలకాలం సుఖంగా’, ‘మిరీ’ అనబడే మిరయ్య జువ్వాల్ జామిసన్ దృష్టికోణంతో కొనసాగుతుంది. అమెరికాలో లాయర్‌గా ఉండి, హైతీలో ఉన్న పుట్టింటికి– అమెరికన్ భర్త మైకెల్‌తోనూ, పసికందైన కొడుకుతోపాటూ వచ్చిన మిరీ జీవితం సవ్యంగా సాగుతుంటుంది. ధనికులైన తల్లితండ్రుల ఇంట్లో అడుగు పెట్టినప్పుడే– ద్వీపంలో ఉన్న పేదవారికీ, ధనిక వర్గానికీ మధ్యనున్న ఉద్రిక్తతలను గమనిస్తుంది. ఒక రోజు, తల్లిదండ్రుల ఇంటినుండి బయటకి వస్తుండగా, భారీ ఆయుధాలు పట్టుకున్న గుంపొకటి ఆమెని అపహరిస్తుంది. తన్ని తాను ‘కమాండర్’ అని పిలుచుకునే వ్యక్తి ఆమెని బందీగా ఉంచి, విడుదల చేయడానికి ఆమె తండ్రిని, పది లక్షల యూఎస్ డాలర్లు అడుగుతాడు. డబ్బు చెల్లించిన తరువాత కూడా, కిడ్నాపర్లు తిరిగి మరింత డబ్బు కావాలంటారేమో అనుకున్న తండ్రి నిరాకరించినప్పుడు, గ్రహిస్తుంది: ‘కోపంతో గడిపే దేశంలో మనం నమ్మేవాళ్ళెవరూ ఉండరు.’ ఒక గదిలో నీళ్ళూ, తిండీ కూడా ఎక్కువ లేకుండా గడిపిన దృఢచిత్తం ఉన్న యీ యువతి, 13 రోజులు– దెబ్బలూ, హింసా, సామూహిక అత్యాచారాన్నీ ఎదుర్కుంటుంది. నవల రెండవ భాగం (ఒకానొకప్పుడు)లో– చెరనుంచి బయటకి వచ్చిన మిరీ, ‘స్వేచ్ఛ పొందినప్పటికీ, నేనింకా నిర్బంధంలోనే ఉన్నాను... హైతీ ఆశ్చర్యకరమైన వ్యత్యాసాలున్న దేశం. ఎంత అందంగా ఉంటుందో, అంతే కఠోరమైనది’ అనుకుంటుంది. విడుదల తరువాత, తన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి మిరీ చేసే ప్రయత్నాల ప్రయాణాన్ని నవల అనుసరిస్తుంది. చిందరవందరగా అయిన మిరీ మనఃస్థితి వల్ల– గతం, వర్తమానం, కొత్త సంఘటనలు మసగ్గా అవుతాయి. అపహరింపు వరకూ తిరిగి వెళ్ళిన మిరీ జ్ఞాపకం అక్కడే తిష్ట వేసుకుంటుంది. ఆమె తిరిగి యూఎస్‌కు వెళ్ళినప్పుడు, అత్తగారు లొరైన్ ఆమెకి శుశ్రూష చేసి, పూర్వస్థితికి తీసుకు వస్తుంది. ‘నాకు ఏడుపు రాలేదు... నేనూ ఆవిడా కూడా మాట్లాడుకోలేదు. కూర్చున్నాం అంతే. భద్రంగా ఉండటం అంటే ఏమిటో అర్థం అయింది’ అంటుంది. ఎల్లవేళలా భయపడుతూ ఉండటం మాని, మిరీ జీవితాన్ని య«థావిధిగా కొనసాగిస్తుంది. తిరిగి భర్తతో కాపురం చేయడం నేర్చుకుంటుంది. అప్పుడే హైతీలో 2010లో వచ్చిన భూకంపాల వల్ల తండ్రి మీద పగతో, మళ్ళీ పుట్టింటికి తిరిగి వస్తుంది. అయితే, ఆమె మానవత్వం, ఆమె ప్రతీకారాన్ని జయించినప్పుడు, ‘నేను ఆయన మొహం చూసినప్పుడు, నాకు కనిపించినదల్లా తను చేసిన ఘోరమైన తప్పువల్ల జీవితాంతం కుములుతూ గడిపే ఒక ముసలి వ్యక్తి మాత్రమే’ అంటూ, ‘తనలో ఇంకా మంచితనం’ మిగిలే ఉందని గుర్తిస్తుంది. గతానికీ, వర్తమానానికీ అద్భుతంగా మార్చి రాసిన నవల ఏ సంబంధాన్నీ విశ్లేషించకుండా వదిలిపెట్టదు. నవల, ‘అపహరింపు’ అన్న అంశం మీదనే కాక, ఆ సంఘటన పరిణామాల గురించినది కూడా. రచయిత్రి శైలి స్పష్టంగా, సరళంగా, బిగుతుగా ఉంటుంది. పాఠకులకు మానసిక అలసట కలిగించినప్పటికీ, బలవంతంగా ముందుకి నెట్టి మరీ చదివించే పుస్తకం ఇది. హైతీలో ఆచరణలో ఉండే– ‘గుర్తింపు, ప్రత్యేకాధికారం’ అన్న జఠిలమైన అంశాలని నిలదీస్తారు గే. గ్యాంగ్ రేప్ సీన్ల, చిత్రహింస నడుమ– అనేకమైన కథనాత్మకాలని అల్లుతారు. పుస్తకం మొదట 2014లో ‘గ్రోవ్ అట్లాంటిక్’ పబ్లిష్ చేసింది. ఆడియో పుస్తకం ఉంది. సినిమాగా కూడా తీస్తున్నారు. -కృష్ణ వేణి -
యాంత్రికంగా బతకడమూ అవసరమైనప్పుడు
కాథరిన్ లేసీ రాసిన ప్రప్రథమ నవల ‘నోబడీ ఈజ్ ఎవర్ మిస్సింగ్’లో 28 ఏళ్ళ వయసున్న కథకురాలైన ఎలిరియ రయిలీది ప్రధాన పాత్ర. బెనార్డ్ గ్రేడ్యుయేట్. టీవీ సీరియళ్ళు రాస్తుంటుంది. మనహాటన్లో ఉంటుంది. న్యూయార్క్ నుండీ న్యూజెర్సీకి వన్ వే టికెట్టు కొనుక్కుని ఆరేళ్ళ కిందట పెళ్ళి చేసుకున్న ప్రొఫెసర్ అయిన భర్తకు కూడా ఒక్క ముక్కా చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఎవరికీ ఫోన్ చేయదు, మెయిల్ చేయదు. భర్తని ‘భర్త’ అని, లేక ‘ప్రొఫెసర్’ అని తప్ప, పేరుతో ప్రస్తావించదు. న్యూయార్కులో జరిగిన ఒక కవి సమ్మేళనంలో వర్నర్ అనే పేరున్న కవి ఆమెకు తన న్యూజెలాండ్ చిరునామా కాగితం మీద రాసిస్తాడు. న్యూజెలాండ్లో ఎలిరియ వీపు మీద బ్యాగ్ తగిలించుకుని అపరిచితులని లిఫ్టు అడుగుతూ, తల దాచుకోడానికీ, తినడానికీ చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదించుకుంటుంది. లేనప్పుడు పొలాల్లో, అడవుల్లో, పార్కుల్లో పడుకుంటుంది. భయప్రమాదాలని ఎదుర్కుంటూ దేశం తిరుగుతుంటుంది. తన్ని తాను ‘అడవి మృగం’ అనుకుంటుంది. నిజానికి ఇలా తిరగడానికి కారణం ఆమె తన నుంచి తానే పారిపోవడమే కాక, తనకున్న భయానికి గల మూలకారణాన్ని వెతుక్కోవడం కూడా. తను ‘ప్రతీదీ తప్పుగా చేసింది’ అన్న భయం. ఎలిరియ మనసులో జరిగే అంతర్గత పోరాటం గురించి పాఠకులకి అర్థం అవుతూనే ఉంటుంది. వర్నర్ ఇంటికి ఆమె చేరేటప్పటికే ఈ చిన్న నవలలో వంద పేజీలు దాటతాయి. అప్పటికే, పాఠకులకు ఆమె గురించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. వయస్సు తేడా ఉన్న భర్తతో ఆమెకి పెళ్ళి జరిగిన అసాధారణమైన పరిస్థితులు, తను పొరపాటు చేసినప్పుడల్లా తనేదో చిన్నపిల్లయినట్టు, ‘ఏం? నోరు పెగలడం లేదా!’ అని మందలించే భర్త, తను గడిపే జీవితం తనదే అనిపించని భావన... తల్లి దత్తత తీసుకున్న కొరియా అమ్మాయి రూబీ ఆత్మహత్య, తనకన్నా రూబీని ఎక్కువ ప్రేమించే మద్యానికి బానిస అయిన తల్లితో తనకున్న సంతోషం లోపించిన సంబంధం... వర్నర్ ఆమెకొక గది కేటాయించి మొదట ఆమె పట్ల ఆకర్షితుడైనప్పటికీ, కొన్నాళ్ళ తరువాత ఆమెని భరించడం చాలా బాధాకరం అనుకుని ఆమెని రోడ్డుమీద వదిలేస్తాడు. ఆఖర్న ఏ ప్రేరణా, యోచనా, పరిష్కారమూ లేకుండానే ఇంటికి తిరిగి వెళ్తుంది. నెమ్మది నెమ్మదిగా ఏఏ పరిస్థితుల్లో, ఎంత యాంత్రికంగా ప్రవర్తించాలో అని నేర్చుకుంటుంది. చైతన్య స్రవంతిలో నడిచే ఈ నవల ఎలిరియ తనలో తను పడే తర్జన భర్జన గురించినది. సంభాషణలని సూచించడానికి కొటేషన్ మార్క్స్ చోట ఇటాలిక్స్ ఉపయోగిస్తారు రచయిత్రి. నవలలో కనబరిచిన హాస్యం వ్యంగ్యంగా ఉండి, బాధ కలిగిస్తుంది. శైలి స్ఫుటంగా, కచ్చితంగా ఉంటుంది. కథ ప్రారంభం పాఠకులు కథకురాలితో సంభాషిస్తూ ఉండి, వారికి ముందే సగం కథ తెలిసినట్టు అనిపించేలా ఉంటుంది. వ్యక్తిగత సంక్షోభం అనుభవిస్తున్న ఒక యువతి యొక్క అధివాస్తవిక చిత్రం ఈ పుస్తకం. నవల శీర్షిక, జాన్ బెరీమాన్ కవిత ‘డ్రీమ్ సాంగ్ 29’ నుంచి తీసుకోబడినది. ఫర్రార్, స్ట్రౌస్ మరియు జిరూ కంపనీ ఈ నవలని 2014లో ప్రచురించింది. 2016లో రచయిత్రి కాథరీన్ లేసీ ‘వైటిన్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిక్షన్’ అవార్డు గెలుచుకున్నారు. కాథరిన్ లేసీ, రచయిత్రి -కృష్ణ వేణి -
భూమంత లోతైన సమస్య
♦ కొత్త బంగారం ఒడిశా జిల్లా తాంబాపుర్లో ఉన్న ‘భారత్ కాపర్ లిమిటెడ్’ సంస్థ ప్రైవేటీకరణ అవడంతో, ఉద్యోగం పోయిన ప్లంబర్ గిరీశ్ పని వెతుక్కుంటూ దిల్లీ వెళ్తాడు. అక్కడ ఒక వ్యాపారవేత్త గిరీశ్‌ను పనిలో పెట్టుకుంటాడు. పని ఏమిటంటే– వేదాల్లో పేర్కొనబడి, కాల్పనిక భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలన్నింటినీ అంతం చేసి, శాంతి నెలకొలిపే– ఉనికిలో లేని సరస్వతి నదిని కనుక్కునేటంత లోతుగా నేలను తవ్వడం! నదిని వెతికే ప్రక్రియలో– నీళ్ళని దురుపయోగించిన నేరానికి భూమినుండి బహిష్కరించబడిన కల్నల్ గంభీర్ అవస్థీ, ఫిలిప్పా కారీ జోన్స్ కనిపిస్తారతనికి. సారనాథ్ బెనర్జీ రాసిన గ్రాఫిక్ నవల ఇది. మన దేశంలో ఇంకా ఎక్కువ గుర్తింపు రాని సాహిత్య ప్రక్రియ. 150 పేజీలున్న ఈ పుస్తకం– మాటల, రేఖా చిత్రాల మిశ్రమం. నీటి కొరతతో ఎండిపోయిన దిల్లీ పట్టణపు నేపథ్యంతో, మధ్యతరగతి వికాస్పురి కాలనీని ఆధారంగా చేసుకుని రాసిన నీటి కష్టాల, హాస్య నవల. డబ్బున్న కుటుంబాలు వసతులున్న గుర్గావ్కు తరలిపోగా, మధ్య తరగతివారూ,పేదవారూ నీటికోసం చేసే యుద్ధాలు పరమ భీకరమైనవి. కథనం కథాంశం ఆధారంగా కాక, పాత్రల ఆధారంగా నడుస్తుంది. దిల్లీ స్థానిక సంఘాల పైన రాజకీయ వ్యంగ్యమూ, చమత్కారమైన ఉదాహరణలూ, వ్యాఖ్యానాలూ ఉంటాయి. పుస్తకం కల్పిత యుద్ధాలు, నదుల గురించినది కనుక, కథనం కల్పిత కథారూపంలో ఉంటుంది. ఉపదేశాలేమీ లేకుండా హాస్యం, వ్యంగ్యంతో జోడించి ఇచ్చిన సమాచారంలా ఉంటుంది. అయితే సమస్యలు మాత్రం నేటి కాలానికి సంబంధించినవి. పక్కనే ఉన్న దిల్లీలో నీటికొరత ఉండగా, గుర్గావ్ ధనికుల గేటెడ్ ఇళ్ళకి అందే నిరంతర నీటి, విద్యుత్ సరఫరా గురించీ, వారికి సామాజిక హోదా కల్పించే గాల్ఫ్ ఆట గురించీ చెప్తూ, ‘ఇంత అసమానత్వాన్ని సమాజం ఎంతకాలం సహించగలదు?’ అని ప్రశ్నిస్తారు రచయిత. మొదటి పేజీలో పాస్‌పోర్ట్ ఆఫీసులో క్యూలు కట్టే మధ్య తరగతి కనిపిస్తుంది. ఇందులోని రేడియో ప్రెజెంటర్ నవీన్ సయానీ పాత్రను ‘బినాకా గీత్ మాలా’కు ఒకానొకప్పుడు ప్రస్తుతకర్త అయిన అమీన్ సయానీ మీదే మలిచారని స్పష్టంగా తెలుస్తుంది. ఒక హాస్యభరితమైన సన్నివేశంలో–‘‘భారతదేశంలో 80 శాతం పట్టణాలు ‘తమకి నీరూ, విద్యుత్తూ పంపిణీ చేసేది తాము ఉంటున్న బిల్డింగే’’నని నమ్మే గుర్గావ్‌లాగే తయారవుతాయి’ అని రాస్తారు బెనర్జీ. తిత్తర బిత్తరగా ఉన్న పట్టణ ప్రణాళిక, భూగర్భ జలాన్ని తవ్వి తీయడానికి అవసరం అయిన శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోవడం, పేదలపైన ప్రైవేటీకరణ ప్రభావం గురించిన రచయిత పరిశీలనలే ఈ నవల. ‘షార్ట్ టెర్మిజం’ అన్న మొదటి అధ్యాయం సమాంతర కథాంశం. తాలిబన్ నుంచి లైంగిక వేధింపుల వరకూ ఏ సమస్యనీ విడిచిపెట్టరు రచయిత. పాత వాటిని బాగు చేయకుండా కొత్త బిల్డింగులు కట్టడం, చిన్నపాటి అనారోగ్యాలకి కూడా బలమైన యాంటీబయాటిక్స్ వాడటం వంటి అంశాలన్నిటినీ ఈ చిన్న పుస్తకంలో కూరడం వల్ల కొంచెం కిక్కిరిసి ఉన్నట్టుగా కనబడినప్పటికీ కథాంశం ఆసక్తికరమైనది. సారనాథ్ బెనర్జీ ఇతర గ్రాఫిక్ పుస్తకాలు: ‘కారిడార్’ (2004), ‘ద బార్న్ అవుల్స్ వండ్రస్ కేపర్స్’ (2007), ‘ద హరప్పా ఫైల్స్’ (2011). (తాంబాపుర్లో ఉన్న ‘తాంబా’ కి అర్థం రాగి.) ⇒♦ క్రిష్ణవేణి -
తీతువగొంతును తియ్యగజేసింది
వాగ్గేయకారునిగా గోరటి వెంకన్న విశిష్టతకు ప్రధాన కారణాలలో వస్తు వైవిధ్యం ఒకటి. వస్తువు దృష్ట్యా వెంకన్న గేయాలను– విప్లవోద్యమ గేయాలు, దళిత చైతన్య గేయాలు, ప్రపంచీకరణ నిరసన గేయాలు, స్మృతి గేయాలు, వర్ణనాత్మక గేయాలు... మొదలైన విధంగా విభజించుకోవచ్చు. సంత, వాన, కొంగ, నల్లతుమ్మ, సంచారం, జలచక్రం, వేకువహాయి, రాత్రి, వెన్నెల, అడవి మొదలైన గేయాలు వర్ణనాత్మకమైనవి. ‘వర్ణనాత్మకమైనవి’ అంటే ‘ఏకవస్తు వర్ణన’ ప్రధానమైనవని ఇక్కడ నా ఉద్దేశం. ‘వాన’ పాటలో వర్షరుతు ఆరంభంలోని అందమైన పల్లె దృశ్యాలు ప్రత్యక్షంగా, శ్రమజీవుల ఆనందం పరోక్షంగా వర్ణింపబడినాయి. ఈ పాటకు ప్రాణి లక్షణారోహణ సౌందర్యాన్ని సమకూర్చింది. ‘‘గద్దగూటిలోని గడ్డిని తడిపింది గువ్వగూటి గులకరాళ్లను జరిపింది తీతువగొంతును తియ్యగజేసింది పరికిపిట్ట ముక్కు పాసిని కడిగింది ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది ముల్లుగర్ర వొల్లు సల్లగ జేసింది’’ – ఉత్ప్రేక్షా వాచకాలు లేకుండా, నిర్ధారణ వాక్యాలలోనే వర్ణన ఆసాంతం సాగింది. కాని, ఇవన్నీ అందమైన ఉత్ప్రేక్షలే. ‘ముల్లుగర్ర వొల్లు సల్లగ జెయ్యడం’, ‘ఎగిరె దట్టీలకు వెండి మెరుపులద్దడం’ లాంటి వాక్యాలు వెంకన్న పరిశీలనాసక్తినీ, పరిశీలనాశక్తినీ పట్టిస్తాయి. వెంకన్న చాలా పాటలలో ఎక్కడో ఒకచోట ఆ«ధ్యాత్మిక అంశాల ప్రస్తావనలు ఉంటాయి. ఈ పాటలోని ‘తులశమ్మ దీపం’, ‘సాధుల సమాధులు’, ‘సూఫీ దర్గా’ల ప్రస్తావనలు అలాంటివే. ‘తాను రాకముందె తూనీగలను లేపి, తన పాటకే తాను దరువేసి ఆడింది’– తూనీగలు ఎగిరి తిరుగుతూ ఉండటం, వర్షాగమన సంకేతమన్న భావనను తెలుపుతుంది. గానం చేస్తూ, తన గానానికి తానే వాద్య సహకారాన్ని సమకూర్చుకొంటూ నాట్యం చేస్తున్న నర్తకిగా వర్షాన్ని వర్ణించడం విశేషం. సుందరమైన దృశ్యభావచిత్రాల ద్వారా, అంతటా పేరుకున్న ధూళీ, మలినాలూ, వర్షం వల్ల తొలగిపోయి ఒక వినిర్మల కాంతిని సమకూర్చుకోవడమూ, మనుషులతోపాటు సర్వప్రాణులూ ఆనందంలో తేలియాడడమూ సూచింపబడినాయి. వర్షం చేసే వివిధానేక ప్రక్షాళన క్రియలను అందమైన ఊహలతో జోడించి ‘లఘు చలనచిత్రాలు’గా తీర్చిదిద్దడం ఈ గీతంలోని ప్రత్యేకత. (పెన్నా శివరామకృష్ణ ‘గోరటి వెంకన్న కవితాపరామర్శ’ పుస్తకంలోంచి...) గోరటి వెంకన్న కవితాపరామర్శ రచన: పెన్నా శివరామకృష్ణ పేజీలు: 128; వెల: 80 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు. రచయిత ఫోన్: 9440437200 -
తెలుగు భాష పరాయీకరణపై ప్రశ్నలు
భాషా శాస్త్రవేత్తలు భాష పుట్టుక, కాలమాన మార్పులు తదితర భౌతిక విషయాలను విశ్లేషించగలరేమోగాని, ఇతర భాషల ఆధిపత్యంలో ఒక భాష ఎలా చిన్నాభిన్నమవుతుందో భాషా, సమాజ ప్రేమికులు మాత్రమే పసిగట్టగలరు. ఈ నేపథ్యంలో తెలుగు భాషా పరిస్థితిని పరామర్శిస్తూ జయధీర్ తిరుమలరావు రాసిన వ్యాస పరంపర ‘భాషావరణం’. ఇందులోని 46 వ్యాసాలు ఏప్రిల్ 2008 నుండి డిసెంబర్ 2012 వరకు చూపు శీర్షికన ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రికలో వచ్చినవి. శీర్షిక పరిమితులకు లోబడినట్లు కాకుండా రచయిత ఎత్తుకున్న అంశంపై సర్వస్వతంత్రంగా వ్యవహరించారు. అందువల్ల ఇవి పత్రికా వ్యాసాలుగా కాకుండా రచయిత భాష పట్ల సమర్పించిన ఒక పరిశోధక గ్రంథంగా కనిపిస్తాయి. జన సామాన్య భాషగా బతికిన తెలుగును ఆర్య భాష అయిన సంస్కృతంతో నింపి, దాని సహజ రూపాన్ని దూరం చేశారనీ, ఇలా వాడుక తెలుగును సామాన్యుడికి అర్థంకాని స్థాయికి తీసుకెళ్లి పండితులు తెలుగు సాహిత్యాన్ని తమ గుప్పిట్లో ఉంచేసుకున్నారనీ, జనం కళలు, భాష, సాహిత్యాన్ని న్యూనతా భావంలోకి నెట్టేశారనీ ఈ వ్యాసాలు ఆరోపిస్తాయి. ఆంగ్లం విషయ పరిజ్ఞాన సముపార్జనకు పరిమితం కాకుండా యావత్ తెలుగు జాతి జీవన రీతుల్నీ, వాటి మూలాల్నీ ధ్వంసం చేస్తున్న విధానాన్ని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ఈ వ్యాసాలు గుర్తు చేస్తాయి. భూస్వామ్య రాచరిక మత వ్యవస్థకు సంకేతమైన సంస్కృతాన్ని, సామ్రాజ్యవాద సంస్కృతిని విస్తరింపజేస్తున్న ఆంగ్ల భాషాదిపత్యాన్ని ప్రశ్నిస్తూ, తెలుగు భాష మనుగడ కోసం ప్రజలను ఆలోచించేలా చేయాలనేది తన వ్యాసాల ప్రధాన ఉద్దేశమని రచయిత పరిచయ వాక్యాల్లో పేర్కొన్నారు. పరభాషల దాడుల వల్ల తెలుగువారు స్వాభావికంగా తెలుగువానిగా లేడు. వాడు పాళీపండితుడు, వాడు నిరంతరం సంస్కృత పండితుడు. నివసిస్తున్న సమాజం సంస్కృత భూయిష్ట సమాజం. ఇంత జరిగినా భాషా శాస్త్రవేత్తలు భాషా పరిణామానికి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు దోహదపడుతాయన్న దృష్టికోణాన్ని విస్మరించారని రచయిత ‘మన నాలుకపై పరభాష పొరలా!’ అని ప్రశ్నించారు. అన్ని రకాల యాసలు, మాండలికాలు, వ్యవహార భాషలు, వృత్తుల భాషలు భాషా వ్యవస్థలో అనివార్య విభాగాలనీ వాటిని ‘అపభ్రంశాలు’గా భ్రమ పడకూడదనీ హితవు పలికారు. 1963లో తెలుగు నానుడి కూటమి వారు అచ్చేసిన ‘తెలుగా, ఆంధ్రమా?’ అనే 68 పేజీల పుస్తకం, అదే రచయిత రాసిన 340 పేజీల ‘నుడి, నానుడి’ ప్రస్తావన ఈ వ్యాసాలకు వన్నె తెచ్చింది. ఈ రెండు పుస్తకాల రచయిత ‘వాగరి’. 1992లో చనిపోయిన వాగరి అసలు పేరు బి.సత్యానందం. అది సంస్కృత పదం కాబట్టి బంగారయ్యగా పేరు మార్చుకున్నట్టు తిరుమలరావు రాశారు. బంగారయ్య తెలుగును చుట్టేసిన సంస్కృతాన్ని తూర్పార బట్టారు. ‘తెలుగు చరితాకారులు పరిసోదకులు కారు, వారు చాటింపుదారులు. వారు చేసేపని నారు ఒక చోట నుండి తీసి మరి ఒక చోట నాటడము. తెలుగును తీసి ఆంధ్రమును నాటాలి. తెలుగు నాడును ఆంధ్రప్రదేశమును మొల ఎయ్యాలి. తెలుగు జాతిని ఆంధ్ర జాతిగా మార్చాలి. ఇంతకు మించి ఏమీ చేయలేదు’. ‘తెలుగునాటిలోని బడులలో తెలుగు అనే పేరున పిల్లలకు నేర్పింపబడుతూ ఉండినది తెలుగు లిపిలోని సమస్క్రుతము’ అని పలికిన బంగారయ్య వాదన మూడు వ్యాసాల్లో వివరించబడింది. ‘భాషావరణం’ పద బంధంలోనే విస్తృత అర్థం ఉంది. భాష అనగానే అక్షరమాల, లిపి, శాస్త్రాల గిరిగీసుకోక– భాషతో సమాజానికీ జీవనానికీ ఉన్న లెంకలన్నీ ఇందులో చర్చించబడ్డాయి. సాంప్రదాయ వాదుల నుండి, కార్పొరేట్ శక్తుల నుండి, తల్లినుడి కాపాడుకోవాలని ఉద్బోధించాయి. వ్యాసాలు కొనసాగించేందుకు రచయిత భాషతో బంధం గల పత్రికారంగం, పాఠశాల వ్యవస్థ విద్యాహక్కులను కూడా తడమక తప్పలేదు. కొన్ని వ్యాసాలు పేరుకు భాషతో మొదలై సాహిత్య చర్చలోకి జారిపోయాయి. ఈ సంపుటి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడింది. రూపకల్పన ఆకర్షణీయంగా ఉంది. - బి.నర్సన్ 9440128169 భాషావరణం (వ్యాసాలు); రచన: జయధీర్ తిరుమలరావు; పేజీలు: 310; వెల: 200; ప్రచురణ: సాహితీ సర్కిల్, 402, ఘరోండా అపార్ట్మెంట్స్, ఓ.యూ. మెయిన్ గేట్ దగ్గర, లేన్ –1, డీడీ కాలనీ, హైదరాబాద్–7. ఫోన్: 9951942242 -
అంటరాని దేవతలు
(అనువాదం) చరిత్రలో కనీవినీ ఎరుగనంతటి ఒక సంక్షోభంలో భారతదేశం నలిగిపోతున్న సమయానికి సంబంధించిన ఇతివృత్తంతో సాగే నవల ‘అంటరాని దేవతలు’. క్విట్ ఇండియా ఉద్యమం, ప్రపంచాన్ని కుదిపివేస్తున్న రెండో ప్రపంచ యుద్ధం చివరి అంకం కూడా ఇతివృత్తానికి తోడయ్యాయి. అలాంటి సమయంలో దళితుల స్థితిగతులపై రాసిన నవల ఇది. ‘అన్‌టచబుల్ ‘నిర్భయాస్’ ఆఫ్ ఇండియా అండ్ ఒన్ బిలియన్ రైజింగ్’ పేరుతో శామ్ పసుమర్తి రాసిన ఆంగ్ల నవలకు ఇది స్వేచ్ఛానువాదం. ఇది రచయిత జీవితానుభవమని ప్రొఫెసర్ ఎ.ప్రసన్నకుమార్ రాసిన ముందమాట వల్ల అర్థమవుతుంది. విశాఖపట్నం మీద బాంబుదాడి జరుగుతుందని జనమంతా చుట్టుపక్కల ఊళ్లకు తరలి వెళ్లడంతో నవల ఆరంభమవుతుంది. శివ, నూకి ప్రధాన పాత్రలు. నూకి పారిశుధ్య పనివారి ఇంటిలో పుట్టిన పిల్ల. యుద్ధం నాటి పరిస్థితులు, అప్పటికి విశాఖతో పాటు యలమంచిలి ప్రాంతంలో భయానకంగా ఉన్న అంటరానితనం గురించి బాగా చిత్రించారు. అగ్రకులంలో పుట్టిన శివ, నూకి మధ్య జరిగే శృంగారం మరొక అంశం. మొత్తంగా చూస్తే కులాధిపత్యం మీద తిరుగుబాటుగా ఈ నవల అర్థమవుతుంది. ఇళ్లలోని పాయఖానాల పరిస్థితి, ఆ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత జీవితాలు, శివ తాతగారు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంగతి విని ప్రశాంతంగా కన్నుమూయడం వంటివి నవలకు ప్రత్యేకతను తెచ్చాయి. శివ జీవితంలో జరిగినట్టు చెప్పిన కొన్ని శృంగార సన్నివేశాలను వడగట్టి ఉండవలసింది. స్వేచ్ఛానువాదం బావుంది. - కల్హణ అంటరాని దేవతలు; ఆంగ్లమూలం: డాక్టర్ శామ్ పసుమర్తి; తెలుగు: ద్విభాష్యం రాజేశ్వరరావు; పేజీలు: 272; వెల: 200; ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్. విజయవాడ; ఫోన్: 0866–2430302 -
ఒక అరుదైన ఆత్మకథ
పుస్తక సమీక్ష మనోవైజ్ఞానిక శాస్త్ర రచనలు తెలుగులో తగినన్ని రాలేదు. మానసిక వ్యాధుల గురించో, వాటితో సతమతమయ్యే వాళ్లను గురించో, ఆ వ్యాధుల నివారణ మార్గాల గురించో తెలుగు పత్రికలు, ప్రచురణకర్తలు, స్వచ్ఛంద సంస్థలు కొన్ని రచనలను అందించక పోలేదు. ఇప్పుడు ఇవి చాలవు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చదువుల పోటీ పెరిగింది. నిరుద్యోగమూ విజృంభించింది. హింస పెరిగింది. సమాజంలో అసహనం పెచ్చరిల్లింది. ఇమడలేనితనం పెరిగింది. పరాయితనం వెంటాడుతోంది. జన్యులోపాలు లేకపోలేదు. వెంపర్లాటలో మానసికమైన ఒత్తిళ్లు పెరిగాయి. రుగ్మతలూ పెరిగాయి. ఈ అన్నిటిని గురించి, అవి తెస్తున్న విపరిణామాల గురించి విశ్లేషణలు, మానసిక వ్యాధుల విముక్తి మార్గాలనూ తెలిపే రచనలు విరివిగా రావలసిన అవసరం ఎంతో ఉంది. మానసిక వ్యాధుల్లో మనిషిని పీడించే స్కీజోఫ్రెనియా వ్యాధి ఒకటి. ఈ వ్యాధి తమకుందని కూడా చాలామంది గుర్తించలేని మానసిక రుగ్మత ఇది. స్కీజోఫ్రెనియా నియంత్రణకు మానసిక వైద్యనిపుణుల అవసరం ఎంత ఉందో, ఆ వ్యాధి విముక్తి కోసం పోరాడి గెలిచిన వ్యక్తుల కథనాలూ మనకు అంతే అవసరం. ఈ అవసరాన్ని తీర్చడంలో వెలువడిన సరికొత్త రచన ‘ఓడి గెలిచిన మనిషి: ఒక స్కీజోఫ్రెనిక్ ఆత్మకథ’. ఈ ఆత్మకథ మహామహుల స్వీయ చరిత్రల కంటే భిన్నమైంది. ఒక సామాన్యుడి నిజ కథ ఇది. వ్యాధినపడ్డ తన జీవిత కథను తెల్పుతూ, మానసిక వ్యాధిగ్రస్తులకూ, వాళ్ల సంరక్షులకూ ఒక సందేశాత్మక మార్గాన్ని చూపాలన్న ఆర్తితో రాసిన కథ ఇది. చిత్తశుద్ధికి గీటురాయి లాంటి రచన ఇది. అందువల్లనే భిన్నమైంది అనడం! మల్లారెడ్డి 17 సంవత్సరాల కాలంలో 5 సార్లు స్కీజోఫ్రెనియా వ్యాధి బారిన పడ్డాడు. నాలుగుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. మరొక సమయంలో కుటుంబ కలహాల కారణంగా జైలుపాలయ్యాడు. 17 సంవత్సరాల్లో తన సున్నిత మనస్తత్వం వల్ల ఆలోచనలు అదుపు తప్పిపోవడం, వింత వింత భావావేశాలకు గురికావడం, వాస్తవం నుండి దూరం కావడం, విపరీతమైన ప్రవర్తనకూ, మానసికమైన ఒత్తిడికీ, ఘర్షణకూ గురికావడం, తరచూ కుంగిపోవడం, భ్రాంతులకు లోనుకావడం, సమాజం తనను పూర్తిగా ఇముడ్చుకోలేదని బాధపడటం, భరించలేని మానసిక క్షోభ తనను వెంటాడటం- వీటినన్నిటినీ వివిధ సంఘటనలు, సన్నివేశాల ద్వారా తన ఆత్మకథలో వెల్లడించాడు. తన మానసిక ప్రపంచంలో చిన్నతనం నుంచీ, చదువుకొనే రోజులనుంచీ, తర్వాతి తర్వాతి దశల్లో జరిగిన పరిణామాలనూ, తన అలవాట్లనూ, స్వేచ్ఛగా, నిర్భయంగా దాపరికం లేకుండా మానసిక వైద్యుల ముందు ఎట్లా ముందుంచాడో అట్లాగే పాఠకుల ముందుంచాడు. తన వ్యాధి దశల్లో తన మామ, క్లిష్ట సమయాల్లో తనకు చేదోడువాదోడుగా నిల్చిన భార్య ఉమ తెల్పిన విశేషాలను పొందుపరిచాడు. పాఠకులకు తను పడ్డ వేదనను తెల్పడమే కాదు, స్కీజోఫ్రెనిక్ వ్యాధిగ్రస్తులకు వ్యాధిని జయించాలనే ఇచ్ఛ ఉండాలనీ, చికిత్స దశల్లో సరైన మందులు సకాలంలో వాడటం మాత్రమే కాకుండా, సంకల్ప బలంతో వ్యాధిని జయించగలగాలనీ ఇందుకు లక్ష్యం, వ్యాపకం, ఆపేక్షలు తోడవ్వాలనీ తన అనుభవసారాన్ని అందించాడు. మనదేశంలో కోటి మందికి పైగా మానసికమైన జబ్బుల బారిన పడ్డవాళ్లున్నారు. పట్టణ నగర ప్రాంతాల్లోని ఆర్థిక స్తోమత, ఇంగితజ్ఞానం ఉండే విద్యావంతులైన మానసిక వ్యాధిగ్రస్తులకు అవసరమైన మానసిక వైద్యనిపుణుల సహాయం అంతో ఇంతో అందుబాటులో ఉంటుంది. పల్లెపట్టుల్లో తమ మనసును ఏ దయ్యం పట్టుకుందో, ఎవరు చేతబడి చేశారో అనుకుంటూ మూఢనమ్మకాలతో మంత్రగాళ్లు, తంత్రగాళ్లు, సాధులు, సన్యాసుల బారినపడేవాళ్లు లక్షలకు లక్షలున్నారు. పల్లెపట్టుల్లో సరైన శారీరక రోగాలకే సరైన వైద్యం అందడం లేదు. మానసిక జబ్బుల నివారణకు దిక్కూ దివాణం లేదు. ఇట్లాంటి తరుణంలో ‘వెలకట్టలేని ఈ రచన’ను, నవలలాగా సాగిన ఈ రచనను ఎవరైనా డాక్యుమెంటరీగా తీస్తే, దాన్ని తెలుగునేల నలుమూలలా చూపించగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. వైద్యుడు లేనిచోట ఇలాంటి విలువైన పుస్తకాల అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి విలువైన పుస్తకాన్ని హైదరాబాదు బుక్ ట్రస్ట్ వెలువరించడం ఎంతైనా హర్షణీయం. కేతు విశ్వనాథరెడ్డి 9866713647 ఓడి గెలిచిన మనిషి: ఒక స్కీజోఫ్రెనిక్ ఆత్మకథ; రచన: మల్లారెడ్డి; సంపాదకురాలు: శోభాదేవి; పేజీలు: 148; వెల: 120; ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్; ఫోన్: 23521849 -
నీలవేణి
- పుస్తక సమీక్ష స్త్రీల సాహిత్యం, దళిత సాహిత్యం ఆధిపత్యపు సార్వత్రిక జ్ఞానాన్ని చెదరగొడతాయి. కొత్త సార్వత్రిక జ్ఞానాన్ని యిస్తాయి. అటువంటి జ్ఞానాన్ని సునీల్‌కుమార్ 15 కథల సంపుటి ‘నీలవేణి’ అందిస్తోంది. ఇందులో ఎక్కువ కథలు దళిత జీవిత నేపథ్యంలో రాసినవి. వ్యంగ్యం, హాస్యం, ఆగ్రహం, ఆర్తి యీ కథలని నెలబెడతాయి. ‘దభేల్ మని యెగిరిపడ్డాడు రంగ’ అని మొదలయ్యే ‘దెయ్యం’ కథ, దేవుళ్లూ దెయ్యాలూ యెవరి ప్రయోజనం కోసం ముందుకు వస్తాయో నెత్తిమీద దభేల్మని మొట్టి మరీ చెపుతుంది. నవ్వుతూ వుండగానే, యెప్పుడో యెక్కడో జరిగిపోయిన, అందరూ మర్చిపోయిన విషయం తెరమీదకు వస్తుంది. అధర్మం పట్ల అదుపులో పెట్టుకున్న రచయిత ఆగ్రహం కళ్లెం బిగించిన గుర్రాల్లాగా మాటల్ని కవాతు చేయిస్తుంది. ‘థూ’ అనిపిస్తుంది. చుండూరు దళితుల మారణకాండ దుఃఖాన్ని కలిగించిన సంఘటన. అన్యాయం జరిగినప్పుడు న్యాయమనేది వొకటుందని మనసును వోదార్చుకోవటానికి ప్రయత్నిస్తాం. న్యాయం అన్యాయంగా సాక్షాత్కరించినప్పుడు జోసెప్ప ధిక్కారం, క్రోధం మనలోపలివే అనిపించి నిరసనాగ్రహంతో గొంతు కలుపుతాం. చీకటి అని దిగులు పడుతుంటే ‘సముద్రం మీద నక్కిన చీకటి నది మీదగా, కాలవ మీదగా దారి చేసుకుని ఆమెని కమ్మేసింది’ అని ‘చీకటి’ని జీవితానికే ప్రతీకగా చూపిస్తుంది. ‘ఆర్థిక తెలివి వాకిట్లోకి రాగానే ప్రేమ కిటికీలోంచి దూకేస్తుంది’ అంటూ చంటి మన మందుకి వస్తాడు. చంటిలాంటి వ్యక్తులు యీ సమాజంలో ఎందరున్నారో అనిపిస్తుంది. దళిత జీవితపు పార్శ్వాలలో జరుగుతున్న కల్లోల పరిణామాల్నీ, అగ్రవర్ణ ఆధిపత్యం వివిధ రూపాల్లో యెలా కొనసాగుతుందో ఆయా మార్పులనీ ‘దేవదాసు 2015’, ‘పరిశుద్ధ వివాహము- మూడవ ప్రకటన’ కథల్లో రచయిత వొడిసి పట్టుకున్నారు. దేవదాసు, జరుగుతున్న విషయాలని తాగుడు యిచ్చే అప్పటిశక్తితో ‘మతంలోకి వచ్చినా మా పేర్లల్లో హిందూ వాసన పోదు. మీ పేరు చివర కులం పోదు. మా జనం పరిస్థితి ఏటల్లకాలం మీ ఎనకమాల తిరగటమేనా?’ అని దులపరిస్తాడు. ‘తండ్రి అనేవాడు పూర్తిగా ఉంటే ఒక రకం, లేకపోతే ఒక రకం... ఉండి లేకపోతే నరకం’ అని ‘నీలవేణి’ సూక్ష్మమైన శరీర రాజకీయాలని చక్కగా చూపిస్తుంది. ‘నా జీవితం ఓ పరీక్షా నాళిక అయిపోయింది’ అని చెప్పిన నీలవేణి ‘మన జీవితం మీద మనకి కంట్రోల్ లేకపోతే ఇలా ప్రతి కుక్కా మన జీవితంతో ప్రయోగం చేస్తుంది’ అని అంటూ వుంటే కథా వస్తువుకీ, కథా సమయానికీ జీవం పోయటానికి కావలసిన సామగ్రిని వోపికగా అమర్చుకోవటం యీ కథకునికే చెల్లింది అనిపిస్తుంది. ఇటువంటి అనుభవాలను వెలుగులోకి తీసుకురావటం వలన యీరోజు సార్వత్రిక జ్ఞానం అనుకుంటున్న ఆధిపత్య జ్ఞానం చెదిరిపోతుంది. అలా చెదరగొట్టటం సమాజానికి చాలా అవసరం. - కుప్పిలి పద్మ నీలవేణి (కథల సంపుటి); కథకుడు: పి.వి.సునీల్ కుమార్; పేజీలు: 188; వెల: 125; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్-68; ఫోన్: 040-24224453 -
కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు
పుస్తక సమీక్ష ఈ కథలనిండా అపరిమితమైన దుఃఖం పరచుకొని వుంది. విమల ఏళ్ళకేళ్ళుగా గడ్డకట్టుకొనిపోయిన తనలోని వేదననీ బాధనీ అక్షరాలుగా మలచి మనతో పంచుకున్నారా అనిపిస్తోంది. అంతగా ఆకట్టుకోలేని ముఖపత్రంతో వెలుపడిన విమల కథలు చదవటం మొదలుపెట్టాక విడిచిపెట్టలేనంతగా కట్టిపడేస్తాయి. ఈ పుస్తకంలో 13 కథలు వున్నాయి. ‘వదిలేయ్’ తప్ప మిగిలినవన్నీ 2011 నించి 2015 వరకూ వివిధ పత్రికలలో వచ్చినవే. ఈ కథలనిండా అపరిమితమైన దుఃఖం పరచుకొని వుంది. విమల ఏళ్ళకేళ్ళుగా గడ్డకట్టుకొనిపోయిన తనలోని వేదననీ బాధనీ అక్షరాలుగా మలచి మనతో పంచుకున్నారా అనిపిస్తోంది. నల్లపిల్ల నవ్వు, నీలావాళ్ళమ్మ మరికొందరు, వాళ్ళు ముగ్గురేనా?, దౌత్య, చుక్కలకింద రాత్రి కథలలో మగవాళ్ళ మోసానికి గురైన మహిళలు కనిపిస్తారు. నల్లపిల్ల నవ్వులోని మధురిమ, నీలా వాళ్ళమ్మ కథలోని శ్యామల, వాళ్ళు ముగ్గురేనా? కథలోని యాదమ్మ ఏదో ఒకవిధంగా నిలదొక్కుకుని తమ జీవితాలను కొనసాగించడాన్ని చూస్తాం. కానీ దౌత్య కథలో తనని అర్థం చేసుకుని, తన అభిప్రాయాలకు విలువనిచ్చే తల్లిదండ్రులూ, చదువూ, ఆస్తీ, ఉద్యోగం అన్నీ వున్న దౌత్య తనను ప్రేమించి, కొంతకాలం సహజీవనం కూడా చేసి వదిలిపోయిన వ్యక్తిపై ప్రేమను వదులుకోలేక, తనను ప్రేమించే తల్లిదండ్రుల గురించి కొంచమైనా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటుంది. కనకలత కథలో హింసని ఎదిరించి, బతకటమే ముఖ్యంగా భావించి, సంఘాలలో పనిచేసి, జీవితంలో ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆశతో జీవన పోరాటం చేసిన కనకలత ఆ క్రమంలో అనేక సంబంధాలలోకి వెళ్తుంది. అయినా ఆమెకు ఎక్కడా హింస తప్పలేదు. చుక్కల కింద రాత్రి కథ పదిహేడేళ్లయినా నిండకుండానే ఏడాదిన్నర బిడ్డకు తల్లై, మత్తుమందులు పీల్చడానికి అలవాటుపడి, వీధులే ఇల్లుగా జీవించే సల్మా, ఆమె తల్లీ అక్కల కథ. మార్తా ప్రేమ కథ, కొన్ని నక్షత్రాలు కాసిని కన్నీళ్లు ఉద్యమ నేపథ్యం కలిగిన కథలు. ఉద్యమంతో కలిసి నడవటం మార్తాలో సున్నితత్వాన్ని పెంచటమే కాక ఆమెని గట్టిపరుస్తుంది కూడా. ఆ గట్టితనం వల్లనే సహచరుడి వియోగంతో విషాదంలో కూరుకుపోకుండా తన జీవితాన్ని కొనసాగించగలుగుతుంది. పుస్తకం శీర్షికగా ఉన్న కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు ఉద్యమాలను అణచివెయ్యడానికి రాజ్యం, ఎంత గుడ్డిగా, అమానుషంగా మనుషుల జీవితాలను ఛిద్రం చేసెయ్యగలదో చూపించిన కథ. మాధవ అనే అనాథ యువకుడు ఉద్యమంలో పనిచేయడానికి వస్తాడు. తనగురించీ, తన ప్రేమ గురించీ, దాన్ని విఫలం చేయడానికి అమ్మాయి వైపు వాళ్లు ఆమెను బాధపెడుతుండటం గురించీ, భావి జీవితం గురించిన తన ఆశలూ కలల గురించీ రాజకీయ కార్యకర్తగా పనిచేస్తున్న కథకురాలితో చెప్పుకున్న తెల్లవారే తన జట్టుతో రాజకీయ ప్రచారంకోసం గ్రామాలకు వెళ్తూ మరొకరితోపాటు అనామకంగా పోలీసుల చేతుల్లో హత్యకు గురవుతాడు. కొన్ని రోజులకు అతడు ప్రేమించిన జ్యోతి అనే అమ్మాయి కథకురాలిని కలిసి మాట్లాడుతుంది. అప్పటి కలచివేసిన సంఘటనలను కథకురాలు గుర్తు చేసుకునే కథ ఇది. ఈ కథలో చిన్న తప్పు ఉందనిపిస్తోంది. కథకురాలితో మాట్లాడిన తెల్లవారే మాధవ హత్యచేయబడతాడు. సిరిసిల్ల దగ్గర గ్రామాల్లో ఉన్న ఇతను సిద్ధిపేటలో ఉన్న జ్యోతిని కలిసి తాను కథకురాలితో మాట్లాడినట్టుగా ఆమెకు చెప్పే అవకాశం లేదు. అయితే కథకురాలిని కలిసి మాట్లాడటానికి వచ్చిన జ్యోతి ‘మీరు మాట్లాడతానన్నారని చెప్పిండు’ అంటుంది. ఈ రచనల్లో ఇదీ కథ అని నిర్దిష్టంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అయినా ఒక కథనించి ఇంకో కథకీ అందులోంచి మరోదాన్లోకి ఎక్కడా లంకె చెడకుండా పకడ్బందీగా పేర్చారు విమల. అనేక పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి. వాతావరణ వివరణ, పాత్రల ఇష్టాయిష్టాల్లాంటి వివరాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే అవేవీ అతిగా కాక కథను నడిపించటంలో సరిగ్గా పనిచేశాయనిపించింది. మరికాస్త శ్రద్ధగా ప్రూఫ్ రీడింగ్ చేసివుంటే ఆ వచ్చిన కాసిన్ని అక్షరదోషాలూ, అనవసర ఖాళీలూ ఉండివుండేవి కావు. కొన్నిచోట్ల ప్రింటింగ్ సరిగ్గా లేదు. సగంసగం అక్షరాలు ఒకదాని పక్కనే ఒకటి ఇరికినట్లుగా వచ్చాయి. - అమృత -
హైద్రాబాద్ విషాదం
విమర్శ ప్రపంచ చరిత్రలోనే అఖండ భారత విభజన అత్యంత విషాదకర, హింసాత్మక సంఘటన. హిందూ-ముస్లిం సమాజాలకే కాదు, కొందరికి వ్యక్తిగతంగా కూడా ఆ విభజన చేదు అనుభవాలను మిగిల్చింది. అందుకే ఆ అంశం మీద ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వచ్చాయి. భీష్మ సహానీ, అమృతా ప్రీతమ్, గుల్జార్, కుష్వంత్ సింగ్, సాదత్ హసన్ మంటో వంటి ఎందరో విభజన విషాదం గురించి గొప్ప రచనలు చేశారు. ఇవికాక డామినిక్ లాపిరె, ల్యారీ కోలిన్స్ వంటి విదేశీయుల ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ వంటి పుస్తకాలు కూడా కోకొల్లలు. ఈ విభజన విషాదంలో హైదరాబాద్ పాత్ర ప్రత్యేకమైనది. ఆ అంశాన్ని చర్చించేదే ‘హైదరాబాద్ విషాదం’. పుస్తక రచయిత మీర్ లాయక్ అలీ (అను: ఏనుగు నరసింహారెడ్డి) ఆ ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షి. ఆయన హైదరాబాద్ సంస్థానానికి ప్రధాని. జిన్నా, నిజాం సంబంధాల గురించి పూర్తిగా తెలిసినవారు. పుస్తకంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలన చివరి రెండేళ్లు, భారత విభజన, శరణార్థులు, విభజన తరువాత మహ్మదలీ జిన్నా (ఖాయిద్ ఏ ఆజమ్) వైఖరి, ఆఖరి నిజాం, రజాకార్లు వంటి కీలక అంశాలు ఇందులో చర్చకు వస్తాయి. గాంధీ హత్య, నిజాం లొంగుబాటు వంటి అంశాలను ఈ చరిత్ర నుంచి మినహాయించడం సాధ్యంకాదు. కాబట్టి రచయిత ఆ అంశాలను కూడా విశేషంగా చర్చించారు. చరిత్ర రచన పద్ధతికీ, చరిత్ర ఇతివృత్తంగా వచ్చిన సృజనాత్మక రచనా విధానానికీ మధ్య సాగే లాయక్ అలీ శైలి గురించి మొదట ఎవరైనా చెప్పుకోవాలి. గొప్ప భాషతో, గొప్ప శైలితో నడిచినా, చరిత్ర రచనలో వాస్తవాలదే ప్రధాన పాత్ర కావాలి. ఆ విధంగా చూసినప్పుడు అలీ కొన్నిచోట్ల పాక్షిక దృష్టి బారిన పడ్డారని (చాలామంది ఇతర రచయితల మాదిరిగానే) అనుకోవలసివస్తుంది. హైదరాబాద్ సంస్థానంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ పాలకులు మహమ్మదీయులు. ఈ రాజ్యం స్వతంత్రంగా ఉండదలిచింది. అయినా ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఆయన అనుమానపడటం గమనార్హం. ముస్లింలీగ్‌లో కంటే ఎక్కువ మంది ముస్లిం సభ్యులను కలిగి ఉన్న జాతీయ కాంగ్రెస్‌ను ఆయన హిందూమత సంస్థగానే పేర్కొనడం మరొకటి. అలాగే ఖాయిద్ ఏ ఆజమ్ (జాతిపిత) జిన్నా జీవితంలోని దశలను గురించి చెప్పి ఉంటే ఆయన మొత్తం వ్యక్తిత్వం ఆవిష్కృతమై ఉండేది. ఈ పుస్తకంలో (264వ పేజీ, మరికొన్ని చోట్ల) ‘జిన్నా శ్రీమతి’ అని పేర్కొన్నారు. 1947-48 నాటి కాలానికి సంబంధించిన చరిత్రలో ఆమెకు స్థానం లేదు. జిన్నా భార్య రతన్‌బాయి పెటిట్ 1929లోనే మరణించారు. ముంబై నుంచి జిన్నా వెంట పాకిస్తాన్ వెళ్లి, అక్కడే చివరి వరకు ఆయనను వెన్నంటి ఉన్న మహిళ ఫాతిమా. ఆమె జిన్నా చెల్లెలు. ‘మై బ్రదర్’ పేరుతో జిన్నా జీవిత చరిత్ర కూడా రాశారు. ఆమె దంత వైద్యురాలు. ఇక్కడ లాయక్ అలీ పొరబడి ఉంటాడని అనుకోలేం. తరువాతి ముద్రణలో ఇది సరిచూడడం అవసరం. ఈ పుస్తకంలోని అంశాలతో విభేదించడానికి చాలా ఆధారాలు దొరుకుతాయి. హైదరాబాద్‌లో ముస్లింలు, హిందువుల మనస్తత్వాల గురించి అలీ ప్రతిపాదించిన వాదన సంపూర్ణం కాదు. ఇది పీవీ నరసింహారావు ‘ఇన్సైడర్’ స్పష్టం చేస్తుంది కూడా. కానీ విభజన, పాక్-హైదరాబాద్ సంబంధాలు, విలీనం వంటి చారిత్రక చిత్రాలు ఎంతో అద్భుతంగా కళ్లకు కట్టారు రచయిత. అనువాదం కూడా అంతే రమణీయంగా ఉంది. -కల్హణ -
ఎగువ మధ్యతరగతి రియాల్టీ
పుస్తక సమీక్ష ముఖపత్రాన్ని తాకి చూడగానే కొనాలనిపించిన పుస్తకం, కుప్పిలి పద్మ ‘ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్’! నునుపైన భాగం యిన్నోసెన్స్ దశకూ, ఇసుక రజను కలిసిన రంగులద్దినట్టున్న భాగం యిన్నోసెన్స్ కోల్పోయిన దశకూ సూచికగా అనిపించింది. జనవరి 2011 నించి జూలై 2015 వరకూ వివిధ పత్రికలలో అచ్చయిన 11 కథల సంపుటి ఇది. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఎగువ మధ్యతరగతి జీవితాలలో చోటుచేసుకుంటోన్న మార్పులకు సంబంధించిన కథలివి. ఈ మార్పులు కింది, మధ్యతరగతి జీవితాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కొంత ప్రభావాన్ని వేస్తుండటంలో ఆయా జీవితాల్లోకి అమిత వేగంగా చొచ్చుకువచ్చిన ప్రసార మాధ్యమాల పాత్ర కూడా తక్కువేమీ కాదు. మొత్తంగా సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులపై నిశితమైన గమనింపు ఉన్నపుడే ఒకదానికొకటి భిన్నమైన ఇన్నిరకాల ఇతివృత్తాలను తీసుకుని కథలుగా మలచటం సాధ్యమవుతుంది. అందుకు పద్మ అభినందనీయులు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు పునాది పరస్పర నమ్మకం అనే భావనకు బదులుగా తమ తమ కెరియర్ను సౌకర్యవంతంగా మలచుకోడానికి ఏమైనా వదులుకోగలగడం, ఎన్ని సర్దుబాట్లనైనా చేసుకోగలగటాన్ని చిత్రిస్తోంది ఈ పుస్తకానికి శీర్షికగా వున్న మొదటి కథ, ‘ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్’! జరుగుబాటు బాగావుండే కుటుంబాలలో కూతురికి వుండే స్థానం, అదే పరిస్థితుల్లో పెరిగి దాదాపు అదే వయసులో వుండి, ఆ కుటుంబంలోనికి కోడలిగా అడుగుపెట్టిన అమ్మాయికి లేకపోవడాన్ని ప్రశ్నించే కథ, ‘ఫ్రంట్ సీట్’. అద్దె గర్భాలు (సరోగసీ) ఒక వ్యాపారంగా మారిపోయిన పరిస్థితుల్ని చూపించిన కథ, ‘మదర్‌హుడ్ రియాల్టీ చెక్!’ సమానత్వ విలువలూ, సామాజిక ఆందోళనలూ కూడా యువతరం ఎగతాళికి, చిన్నచూపుకూ గురవుతున్న పరిస్థితులను చూపించిన కథ ‘సహస్ర’! పెళ్ళి గురించి ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న అమ్మాయి తన కింది వర్గాలకు చెందిన స్త్రీల (జిమ్ ట్రెయినర్, వంటావిడ) అనుభవాలనూ ఆలోచనలనూ తన ఆలోచనలతో పోల్చుకుని చూసుకునే కథ, ‘మాన్వి’! ఎదుటివారి ప్రేమని సాధించడానికి తన భావాలని ఎంతో సున్నితంగా, ఆర్ద్రంగా పూల బొకేల భాషలో వ్యక్తీకరించినా, అవసరం తీరాక ఎంతో బండగా అదే భాషలో తన తిరస్కారాన్నీ ప్రకటించాలనే ప్రయత్నం చేసిన ఒక కస్టమర్కీ; మనసులో మిగుల్చుకున్న కాస్త చెమ్మనూ ఆ బొకేలతోపాటు అందించే సందేశం రూపంలో వ్యక్తం చేసే ఒక బొకేల దుకాణం యజమానురాలికీ మధ్య జరిగిన సంఘటనల సమాహారమే పూల ముఖంగా అందించిన కథ, ‘బ్రేకప్ బొకే’! చిక్కని ఆత్మీయతానుబంధాల మధ్య అల్లుకున్న జీవితాన్ని వదలలేక వదిలి, ఎప్పటికైనా తిరిగిరావాలనే ఆశను మూటగట్టుకుని అమెరికా వెళ్ళి, అక్కడ అలవాటుపడలేక చివరకు భర్త ఆలోచనల మేరకే ఇంటికి తిరిగివచ్చిన ఒక స్త్రీ సున్నితమైన మానసిక సంఘర్షణాచిత్రమే ‘పున్నమిలా వచ్చిపొమ్మని..!’. సమాజపు ఆమోదాన్ని పొందలేని అనుబంధాల పట్ల సమాజం ఎంత క్రూరంగా హింసాత్మకంగా ఉండగలదో చెప్పిన కథ, ‘మౌన’! ఈ కథలన్నీ సమాజంలోని అత్యల్ప వర్గాల జీవితాల గురించే చెప్పినవైనా తప్పనిసరిగా ఈ మార్పులని గుర్తించవలసిన అవసరాన్ని వివరించేవే. అయితే, కథల్లోని పరిసరాల్ని, వాతావరణాన్ని పరిచయం చేయడానికి పద్మ వాడే భాష చాలాచోట్ల కృతకంగా అనిపిస్తోంది. పాత్రలకు ఇచ్చిన పేర్లు కూడా ఫ్యాన్సీగా ఉన్నాయి. పుస్తకం అందంగా కనిపించటానికి తీసుకున్న శ్రద్ధలో, కొంచమైనా ప్రూఫ్ రీడింగ్‌పై పెట్టినట్లైతే బాగుండేది. కొన్నిచోట్ల వాక్యాలు మిస్సయ్యాయి. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియలేదు రెండుమూడుచోట్ల. - అమృత -
పడావు పడిన నేల పడే తన్లాట
పుస్తక సమీక్ష ఈ పద్నాలుగు కథలు అనేక సారూప్యతలనూ, పరస్పర విభిన్నతలనూ వొదిగించుకొని ఏడేడు పద్నాలుగు లోకాలను చూపిన అనుభవాన్నిస్తాయి. ఈ సంకలనంలోని చాలా కథలకూ నేపథ్యం సుదీర్ఘ చరిత్ర. ‘దుఃఖాగ్ని’, ’ సంపుడుపంజెం’, ’పూర్తికాని కథ’, ‘అమ్మ’ గత చరిత్ర రగిల్చిన దుఃఖాలు. వర్తమానంలో ప్రతిఫలిస్తున్న నిఘ్ఠర గాయాలు. ‘తమ్ముడి మరణం’, ‘థర్డ డిగ్రీ’, ‘అలికిన చేతులు’ ఆ గాయాలకు పూసిన రక్తపుష్పాలు. వెరసి ఈ కథలన్నీ తెలంగాణ రక్తమాంసాలు. కవితాత్మకమైన వుద్వేగంతో ప్రారంభమై ప్రతీకాత్మక పాత్రల్ని తలదన్నే పాత్రల్ని రూపొందించుకొని నడిచిన ‘దుఃఖాగ్ని’ తెలంగాణ వుద్యమాన్నీ , వుద్యమానికి మూలమైన దైన్యాన్నీ చిత్రించడంతోనే ఆగకుండా ఒక కార్యాచరణ వైపుకు ముగింపు నిచ్చింది. ‘సంపుడుపంజెం’ దళిత వరస మరణాల దగ్గర ప్రారంభమై, తరతరాలుగా సంస్కృతిని నిలబెడుతున్న వాళ్లని రికార్డు చేయలేక పోవడంలోని వైయక్తిక అసహాయతను చిత్రించింది. ‘అమ్మ’ చరిత్ర మలుపులో ఒక అనివార్యతలో కనుమరుగైపోయిన కొడుకును ఎదురు చూసే తెలంగాణను గుర్తుచేస్తుంది. ఉద్యమమది ఏదైనా, అదెంత ప్రజాస్వామికమైనదైనా, దానిలోని ‘అతి’ కొందరు కార్యకర్తల్లో వ్యక్తీకరింపబడుతుంది. ప్రతి వుద్యమంలోని కార్యకర్తయినా ‘పూర్తికాని కథ’లోని పాత్రలాగే వుండొచ్చు. ఇక, ఐడెంటిటీ క్రైసిస్‌తో, వ్యకిగత సంక్షోభంతో సతమతమయ్యే వ్యక్తులు వర్తమాన చరిత్రలో కొల్లలు. ఈ సంక్లిష్ట స్థితికి ఉప ఫలితాలుగా వచ్చినవే ‘తమ్ముడి మరణం’ లోని ‘థర్డ డిగ్రీ’లోని, ‘అలికిన చేతులు’లోని మృత్యు దుఃఖాలు. ఈ సంకలనంలోని దుఃఖ దృశ్యాలు అక్కడితోనే ఆగలేదు. ఆధునిక అభివృద్ధి ప్రతిఫలనాలైన రహదారుల మీద మృత్యు కోరలు చాస్తున్న టోల్ గేట్లను చిత్రిస్తూ, ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా వుండాల్సిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాల్లో తెల్లకోట్లు జరిపే విశృంఖల ఆపరేషన్లు స్త్రీలను పెడుతున్న హింసలను వివరిస్తూ, స్త్రీని ఆస్తిగా చూసే ‘ఇండియాస్ సన్ ’లోని రేపిస్టు మగ యిగో స్వగత దుఃఖాల మీదుగా, ‘2047’లోని ఆత్మలు చెప్పే అసమ అభివృద్ధి ఆత్మకథలుగా కొనసాగినాయి. ఇన్ని కథలూ మృత్యు చిత్రాలుగా వుండి పాఠకుడి అంతరంగాన్ని కలవరపరుస్తాయి. తెలంగాణ కథలంటే పొక్కిలి నేల మీద పారాడే అమాయక కోడిపిల్లలనిపిస్తాయి. వీటికి భిన్నంగా ‘చౌరస్తా’ ‘ఇల్లు’ ఇంకో విరుద్ధ కోణాన్ని పట్టి చూపుతున్నాయి. ఆశ్చర్యకరంగా చౌరస్తాలోని ప్రొటాగనిస్ట్ ‘బతుకుడంటే లోకమ్మీద పడి అందినకాడికి దొబ్బుకు తినుడే’ అనే తత్త్వాన్ని కథ ఆద్యంతమూ నిరూపించి నిలబెడతాడు. ‘ఇల్లు’లో త్యాగానికి ప్రతీకగా వుండాల్సిన తెలంగాణ తాత, కొడుకుల మీది కోపంతో మనవడి భవిష్యత్తును కాంక్షించని వికారాన్ని ప్రదర్శిస్తాడు. మృత్యువుతో పొక్కిలైన నేల ఈ కొత్త వికారాల్ని ఎలా పొందిందని ఆలోచిస్తే, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సలో భాగంగా పొందిందా, దీనికి వేర్లు ‘పూర్తికాని కథ’లో చెప్పిన మేధావుల వైయక్తిక విధ్వంసంలోంచి బయలుదేరాయా అన్నది పరిశోధించాల్సిన అంశం. అయితే ఇవి ఇంగిలీసు విద్యామాయలో పడ్డ తెలంగాణ గ్రామీణుల్లోనూ వ్యాపించాయని ‘చుక్కలురాని ఆకాశం’లోనూ కథనం చేయబడింది. 25 సంవత్సరాలుగా వెలువడుతున్న వార్షిక కథా సంకలనాల కంటే భిన్నమైన కథా సంకలనాల పరంపరను వెలువరించే బాధ్యతను నెత్తికెత్తుకున్న సంపాదకులు ఒక ట్రెండు కథల ఎంపికలోనూ, చాలా కథ ల్లో దొర్లిన అచ్చుతప్పుల మీదనూ మరింత శ్రద్ధ పెట్టివుంటే బావుండేది. తన్లాట-తెలంగాణ కథ 2014 సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, వెల్దండి శ్రీధర్; పేజీలు: 160; వెల: 60 ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలు; సంగిశెట్టి ఫోన్: 9849220321 జి.వెంకటకృష్ణ, 8985034894 -
పి.రామకృష్ణ రచనా సర్వస్వం
పుస్తక సమీక్ష పి.రామకృష్ణ సమగ్ర సాహిత్య సంపుటి ఇది. ఇందులో మూడు నవలలూ, ముప్పయి ఐదు కథలూ, వ్యాసాలూ, పుస్తక సమీక్షలూ, కాలమ్స్ రాతలూ, కవితలతో పాటు, ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టిన ‘పెన్నేటి కత’లూ ఉన్నాయి. ఆయన యాభై ఏళ్ల సాహిత్య కృషినంతా ఈ సమగ్ర సంపుటి ద్వారా పాఠకుడికి అందించే ప్రయత్నం ఇది! పెన్నానది ఒడ్డున ఉన్న ఒకప్పటి పల్లె జీవితాన్ని గురించి, నిసర్గమైన ఆ ప్రాంతపు మాండలీకంలో, సహజమైన వాస్తవికమైన పాత్రలతో, నిర్దిష్ట స్థలకాలాల స్పృహతో చిత్రిక పట్టిన ‘పెన్నేటి కతలు’ ఇప్పుడు కూడా చదివి, ఆనందించటమే గాదు, గుండెల్లో నింపుకోవచ్చు! ఈ కతలే గాక, ఆయన రాసిన మరో 35 కథల్లో కూడా, ప్రాంతీయ ముద్ర, ప్రాదేశిక చిత్రణ కలిగిన ‘నీళ్లు’, ‘తేడా’, ‘కర్రోడు చచ్చిపోయినాడు’, ‘ఎలిగే పెద్దోళ్లు నలిగే సిన్నోళ్లు’ ‘మనిషీ - పశువూ’, ‘కరువు పీల్చిన మనుషులు’ ‘బండ కోడెలూ- బక్కెద్దులూ’ లాంటివి రాయలసీమ ప్రాంతపు జీవితాన్ని రికార్డు చేసిన సాంఘిక చరిత్రల్లాంటివే! ఆయన తొలి రోజుల్లో ‘తులసీకృష్ణ’ కలం పేరుతో రాసిన ‘రుతుపవనాలు’ మాత్రం పేలవమైన నవల! పేరుకు రుతుపవనాలే అయినా, అందులో రుతువులూ లేవూ, పవనాలూ లేవూ. ఆయన ఈ నవల రాసిన కాలంలో వచ్చిన చచ్చు ప్రేమ నవలల బలహీనతలన్నీ ఈ నవలలో కనిపిస్తాయి. ఏడు జంటల ప్రేమలు ఉన్నాయి మరి! ఆయన ‘లోకవృత్త పరిశీలన’కు నిదర్శనం లాంటి మంచి నవల ‘నత్తగుల్లలు’! సగటు మధ్యతరగతి జీవన విలాసాల్నీ, గమనాల్నీ, మిధ్యా విలువల్నీ నిర్మమకారంగా నిర్దాక్షిణ్యంగా విమర్శకు పెట్టిన ఈ నవలకు సాహిత్య చరిత్రలో సముచిత స్థానం ఎప్పటికీ ఉంటుంది. ‘‘ప్రపంచం పది కిలోమీటర్ల దూరం ముందుకు నడిస్తే, నత్తగుల్ల నాలుగడుగులు వెయ్యడానికి భయపడుతుంది’’ అని మధ్యతరగతిని పరిహసించిన నవల ఇది! ‘ఉదయమూ- సాయంకాలమూ’ వృద్ధాప్య సమస్యను కొత్తకోణంలో చూపెట్టాలని రాసిన నవల. ‘‘సుదీర్ఘ జీవితం ముందున్నవారి కన్నా కొద్దిపాటి జీవితం మిగిలివున్న వాళ్లకు జీవితం ఇంకా వాంఛనీయంగా ఉండాలి’’ అని చెప్పిన నవల! వృద్ధాప్యం ఒక సామాజిక సమస్యగా మారిన వర్తమానంలో ఈ నవల చాలా అంశాల్ని, సామాజిక ఆర్థిక కోణాలలో చర్చకు పెట్టింది. ఇందులో అంగీకరించే అంశాలే గాక, విభేదించే అంశాలు కూడా లేకపోలేదు. కథా నవలా రచయితే కాదు, రామకృష్ణ మంచి సాహిత్య విమర్శకుడు కూడా అనటానికి ఈ సంపుటిలోని సమీక్షలూ, వ్యాసాలూ సాక్ష్యమిస్తాయి. నిర్మొహమాటమూ, నిర్భీకతా, నిజాయితీ గల వీరి సాహిత్య వ్యాసాలూ, పుస్తక సమీక్షలూ ఇప్పటి విమర్శకులు జాగ్రత్తగా పరిశీలించదగ్గవి. చలం, రావిశాస్త్రి, చాసో, కేశవరెడ్డి, గోపీచంద్, రా.రా. లాంటి ప్రముఖుల గురించి రాసిన సాహిత్య వ్యాసాలూ, భాషా వ్యాసాలూ కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. కథ గురించి రామకృష్ణ ఇంటర్వ్యూ చాలా చర్చలు చేసింది. కథకులు గమనించాల్సిన అంశాలెన్నో ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి. - సింగమనేని నారాయణ -
అలా ఉందామా?
‘రామాయణ విషవృక్షం’ తర్వాత అదే తరహాలో ఉన్న విమర్శతో ‘ఇదండీ మహాభారతం’ అన్న గ్రంథాన్ని ఇటీవల ప్రచురించారు రంగనాయకమ్మగారు. ‘ఇది మరో విషవృక్షం’ అని కూడా అన్నారు. ఏ అంశం మీద విమర్శ రాయాలనుకున్నా, దాని మూలాన్ని పూర్తిగా తెలుసుకొని రాసే ఆమె పద్ధతి ఇందులోనూ కనిపిస్తుంది. సంస్కృత భారతాన్నీ, పురిపండా వచన భారతాన్నీ, గంగూలీ ఆంగ్లానువాదాన్నీ, అలాగే కవిత్రయ భారతాన్నీ చదివే ఈ విమర్శ చేశారు. దాన్తో విభేదం లేదు కానీ విభేదం విమర్శను గురించే ఉంటుంది. నిజానికి, రంగనాయకమ్మగారు అనుసరించిన పద్ధతికి ‘విమర్శ’ అనే పదం సరైనది కాదనాలి. విమర్శలో విమర్శకుల స్వీయాభిప్రాయాలు కనిపించరాదనేది విమర్శకు సంబంధించిన ఒక విలువ. స్వీయాభిప్రాయాలు లేని విమర్శ ఉంటుందా అన్నది వేరే చర్చ. అది సూక్ష్మ దృష్టికి మాత్రమే కనిపించేది. రంగనాయకమ్మగారి పద్ధతి వేరు; వేరు కాదు అందుకు వ్యతిరేకం. స్థూల దృష్టికే కనిపించేది. సాక్షాత్తూ ఆమె బడితె చేత ధరించి, భారతాన్నీ, అందులోని పాత్రల్నీ కీలుకీలునా విరగ్గొట్టి, చెత్తకుప్పలో పడవేసినట్టు కనిపించే విమర్శ! ఆ కుప్ప మీద ‘భారతం చదవడం వ్యర్థం’ అన్న తీర్పును కూడా రాశారు. వ్యర్థమని తెలిశాక, అంత శ్రమపడి పుస్తకం రాయడమూ, నష్టం భరించి ప్రచురించడమూ అవసరమా అన్న ప్రశ్నలకు మనకే సమాధానాలూ దొరుకుతాయి. వ్యర్థం అని ఆమెకు తెలిస్తే చాలా, అందరికీ తెలియాలి కదా! అందుకూ పుస్తకం తేవడం. అందులోనూ భారతం కథ అంతా ఎవరికీ తెలీదు. ‘‘మీకు భారతం కథ తెలుసా?’’ అని ఆమె చాలామందిని అడిగి చూశారు. వాళ్లు సినిమా చూశామనీ, అందులో ద్రౌపదికి బట్టలు విప్పుతారనీ చెప్పారు. ‘ఎలాంటివాళ్లను అడిగారో..’ అని అనిపిస్తుంది కానీ, మనకు మాత్రం భారతం అంతా తెలుసా? ఈ పనిలో దిగబడేవరకూ రంగనాయకమ్మగారికీ తెలీదు. తెలిశాక, రాయాలనుకోకుండానే, భరించలేక రాసేశారు. భరించలేకపోవడానికి గల కారణాలను, పుస్తకం టైటిల్ కింద నాలుగు లైన్ల మేరకు వివరించారు. నిజమే, ఆమె చెప్పినవన్నీ భారతంలో ఉన్నవే. అందులో రంగనాయకమ్మగారి కల్పనలు కానీ, వక్రీకరణలు కానీ లేనేలేవు. ఆయా సందర్భాలను పురస్కరించుకొని, చేసిన వ్యాఖ్యలూ, తర్కమూ, చెప్పిన అభిప్రాయాలూ మాత్రమే ఆమెవి. భారతం గురించి తను చెప్పిన ఏ మాటా, ఏ అభివర్ణనా నిరాధారంగా అన్నవి కావనీ, ఆ సంగతి పుస్తకం చదివితే అర్థమవుతుందనీ కూడా హామీ ఇచ్చారు. ‘ఇదండీ మహాభారతం’ చదివాక, ఇందులో ఉన్నవి భారతంలో ఉన్నవే అని అనుకున్నప్పటికీ, రంగనాయకమ్మగారు అన్న ‘వ్యర్థం’ అన్న మాటతో ఏకీభవించలేము. ఎందుకు? ‘రామాయణ విషవృక్షం’ తర్వాత, భారతం మీద కూడా రాయండి. అనడిగినవాళ్లకు ‘ఒక మత గ్రంథాన్ని మార్క్సిస్టు దృక్పథంతో అర్థం చేసుకున్న తర్వాత, ఏ మత గ్రంథాన్నయినా అలాగే అర్థం చేసుకోవచ్చు’ అని చెబుతూ వచ్చినట్టు, రంగనాయకమ్మగారే అన్నారు. ఈ సందర్భంగా రామాయణాన్నీ భారతాన్నీ పూర్తిగా మత గ్రంథాలుగా భావించవచ్చా, కావ్యాలుగా భావించరాదా అన్న చిన్న ప్రశ్నలు పుట్టుకొస్తాయి. వాటి సంగతి తర్వాత చూద్దాం. ఆరెస్సెస్ వాళ్లో, వీహెచ్‌పీ వాళ్లో అయితే, ‘ఇతర మత గ్రంథాల మీద కూడా ఇలా రాయగలరా?’’ అనడుగుతారు. రామాయణం మీద, భారతం మీద విమర్శ రాయకూడదని మనం అనం. కనుక, దాన్నీ అలా ఉంచుదాం. కేవలం సందేహాలను వ్యక్తం చేద్దాం. భారతం కాలం నాటికి బ్రాహ్మణులూ, శూద్రులూ అలా ఉండేవారని సరిపెట్టుకోవచ్చు, అని రంగనాయకమ్మగారు అన్నదే. ఈ కాలంలో కూడా అలా ఉండటమేమిటి? బహుశా, ఈ ప్రశ్నే ఆమె ఈ పుస్తకం రాయడానికి కారణమై ఉండొచ్చు. బ్రాహ్మణులూ, శూద్రులూ అనేవాళ్లు ఇప్పటికీ ఉన్నారంటేనే ఆనాటి భావజాలం అంతో ఇంతో మార్పులతో ఇప్పటికీ ఉన్నట్టే కదా! పదిహేనేళ్ల పాటు మార్క్సిజం నేర్చుకుంటూ, నేర్పుతూ ఉండిన ఆమెకు ఈ సంగతి తెలీదా? ఆ నాటికి బ్రాహ్మణులూ, శూద్రులూ అలా ఉండేవారని సరిపెట్టుకున్నట్టే, ఆనాటి ఆ మూఢనమ్మకాలు నమ్మకాలుగా ఉండేవనో, నమ్మేందుకు వీలైన పరిస్థితులు ఉండేవనో ఎందుకు సరిపెట్టుకోకూడదు? గణేశుడి విగ్రహాలు పాలు తాగడమూ, ఉత్తి చేతుల్లోంచి బంగారు గొలుసులు తీయడమూ, కక్కుకుంటూ నోట్లోంచి లింగాలు తీయడమూ, తన్ని కొట్టి రోగాలు నయం చేయడమూ, ఇప్పటికీ ఉండటమే కాక, నమ్ముతున్నవాళ్లూ ఉన్నారు కదా! ఈ నమ్మకాలే భారతంలోనూ కనిపించేవి. అయితే, వీటిని నమ్మాలనీ, విమర్శించరాదనీ కాదు. వాటిని ప్రధానంగా, ఆధారంగా చూసి, ‘భారతం చదవడం వ్యర్థం’ అన్న తీర్మానం చెయ్యవచ్చా? అవికాక, భారతంలో ఇంకేమీ లేవా? ఇవీ సందేహాలు. భారతం ఒక కావ్యం. రామాయణమూ కావ్యమే. వాటిలో ఆధిపత్య వర్గం భావాలు అధికంగా కనిపిస్తాయి. వాటితో పాటు వాటికి ఎదురు తిరిగి చేసిన చిన్న చిన్న పోరాటాలూ, ప్రతిఘటనలూ తక్కువగానైనా కనిపిస్తాయి. వాటిని మొత్తంగా మతగ్రంథాలుగా భావించవచ్చా మార్క్సిస్టులు? వాటిని కావ్య దృష్టితో కనీసంగానైనా చూడలేదు రంగనాయకమ్మగారు. నన్నయ కవిత్వాన్నో, తిక్కన కవిత్వాన్నో ఇష్టపడుతున్నవాళ్లు భారతంలో ఉన్న వరాలనీ, శాపాలనీ జరగడానికి వీల్లేని సంఘటనల్నీ నమ్ముతున్నట్టా? ఆ మాటకొస్తే, నన్నయ తిక్కనలు కూడా నమ్మి రాశారని నమ్మలేం. ఎందుకంటే వాళ్లు మనుషులు. దేవతల్నీ, రాక్షసుల్నీ వాళ్లెప్పుడూ చూసి ఉండరు. నమ్మని వాటిని రాయడమెందుకు అన్న ప్రశ్న మళ్లీ మొదటికి తెస్తుంది. ‘‘కవిత్వం కుల భేదాల్ని తీసివెయ్యలేదు’’ అని రంగనాయకమ్మగారు అనడం మరింత ఆశ్చర్యకరం. కవిత్వమే కాదు, మొత్తం ప్రపంచ సాహిత్యమంతా కలిసినా సమాజంలో ఉన్న అంతరాలను తొలగించలేదు. మార్క్సిజం తెలీనివాళ్లు కూడా కవిత్వం ఆ పని చెయ్యగలదని అనుకోరు. అది చెయ్యగల పని వేరు. కర్ణుడి కవచంలాగా (ఇదీ మూఢనమ్మకమేనండోయ్) రంగనాయకమ్మగారి హృదయం కవిత్వం చొరరాని కవచంగా ఉంటే తప్ప అటువంటి అభిప్రాయం ఏర్పడి ఉండదనీ, కవిత్రయాన్ని కడగంటనైనా చూడకపోవడం జరిగేది కాదనీ అనిపిస్తుంది. చివరగా చెప్పవలసింది ఇదీ. రంగనాయకమ్మ గారి ‘విమర్శ’ను అన్వయించి చూస్తే, మనకు ప్రాచీన సాహిత్యమంటూ మిగలదు. వేల ఏళ్లుగా ఉన్న సాహితీ వృక్షాలను విష వృక్షాలని నరికేస్తే ఏమవుతుంది? భారతం గురించి రంగనాయకమ్మ గారే చేసిన అభివర్ణనల్లో ఒక్కటైన ‘మొగ్గా పువ్వూ లేని, కాయా పండూ లేని మోడు’లుగా మనం మిగిలి ఉంటాం. అలా ఉందామా? - పి.రామకృష్ణ -
సమీక్షణం: దేశీయ కతాసరిత్సాగరం
పుస్తకం : 13 భారతీయ భాషల తొలికతలు సంకలనం : స.వెం.రమేశ్, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు పేజీలు: 152 వెల: 150 ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు మరియు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు 20-3-131/ఎ1, శివజ్యోతి నగర్, తిరుపతి - 517 507 విషయం : ‘తొండనాడు తెలుగు రచయితల సంగం’ ప్రచురించిన పదమూడు దేశ భాషల్లోని తొలి కతల సంకలనం ఇది. తొలికత 1870లో రాయబడిన ఉర్దూ కత అయితే, 1955లో వచ్చిన కశ్మీరి కత చివరిది. ఈ మధ్య కాలక్రమానుసారం వచ్చిన బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఒడియా, కన్నడ, గుజరాతీ, హిందీ, తమిళ, కొంకణి, తుళు భాషల తొలి కతలు ఇందులో ఉన్నాయి. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయ సాహిత్యపు మూలమొక్కటే. కత ఒక ప్రత్యేక ప్రక్రియగా, ఏయే భాషలో ఎప్పుడు ఆవిర్భవించిందో తెల్సుకోవడం మనల్ని మనం రీ-రీడ్ చేసుకోవడం లాంటిది. గతం పునాది మీద భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపకరించే విశిష్ట ప్రయోగం ఇది. ఒక్క కశ్మీరి కత తప్ప మిగిలిన కతలన్నీ ఆయా భాషల నుంచి నేరుగా తెలుగులోకి తీసుకురావడం ప్రత్యేకంగా చెప్పవలసిన అంశం. పదేళ్ల పిల్లవాడు ఆలోచనల జర్నీలో జీవితాన్ని చుట్టి రావడం, మానవత్వం మాత్రమే చివరి వరకు మిగిలేది అనే సత్యం తెల్సుకోవడం ఉర్దూ కత ‘గుజారుహా జమాన’. టాగూరు రాసిన రేవు కథలో గంగమ్మ ఒడ్డున కూచుని పాత సంగతులు నెమరేసుకునే కతకుడు నదిలో ఆడి పాడి, నదిలోనే మునిగిపోయి ముగిసిపోయిన కుసుమ్ కత చెప్తాడు. ఈ బెంగాలీ కతను పోలినదే తమిళ కత ‘గుంటకట్ట రాగిమాను’. తొంభయ్యో నూరో ఏళ్లు ఉన్న రాగిమాను రుక్మిణి కత చెప్తుంది. తన్ను పెళ్లి చేసుకోవాల్సిన నాగరాజన్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడని భావించి, నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకుంటుంది రుక్మిణి. తొలి తెలుగు రెండు కతల్లో (ఏది అనే ప్రశ్నని వదిలేద్దాం)నూ పోలిక కనిపిస్తుంది. ‘ధన త్రయోదశి’లో విజయలక్ష్మి భర్త వేంకటరత్నంను విశ్వాస ద్రోహం చెయ్యకుండా దిద్దుతుంది. ‘దిద్దుబాటు’లో తిరుగుళ్ల గోపాలరావుకి బుద్ధి వచ్చేట్టు చేస్తుంది భార్య కమలిని. సమకాలిక సమస్యలు, కత నడిపించే తీరులో వైవిధ్యం, సంఘటనలు, సంభాషణలు, మెలో డ్రామా ట్విస్టులు తొలి కతల్లోనే కనబడతాయి. వివిధ భాషల కతలని తెలుగు కతలుగా మలచడానికి అసాధారణమైన కృషి చేశారు అనువాదకులు. - చింతపట్ల సుదర్శన్ మంచి సంగతులు పుస్తకం : మీడియా సంగతులు రచన : గోవిందరాజు చక్రధర్ పేజీలు: 255; వెల: 150 ప్రతులకు: అని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ. విషయం : రేపటి చరిత్రకి దినుసును అందిస్తున్న పత్రికారంగ చరిత్ర మీద మనకి ఆసక్తి తక్కువే. నిజానికి పత్రికారంగంలో వచ్చిన పరిణామాలను గమనించడమూ అవసరమే. ఆ ప్రయత్నంలో భాగమే ‘మీడియా సంగతులు’. ప్రముఖ జర్నలిస్ట్, జర్నలిజం పాఠాలు చెప్పిన మాస్టారు గోవిందరాజు చక్రధర్ ఈ పుస్తకం రాశారు. కాబట్టే పత్రికల నేపథ్యం, పత్రికల నాటి స్థానం, వర్తమానంలో ఉన్న స్థానాల గురించి చాలా లోతుగానే చర్చించారు. చక్రధర్ ప్రతికారంగంలోని వెలుగునే కాదు, చీకటిని తడమడానికి కూడా ప్రయత్నం చేశారు. ప్రింట్ మీడియా తరువాత జరిగిన ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం, ఇంటర్నెట్ గురించి కూడా ఇందులో చదవవచ్చు. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పతనంలో కూడా పెరిగిన పోటీని ఇందులో రచయిత నిభాయింపుతోనే అయినా చర్చించారు. ఏ రంగంలో అయినా మార్పు సహజమే. కానీ మార్పునీ పతనాన్నీ వేర్వేరుగా చూడలేకపోతున్న చానెళ్ల, పత్రికాప్రచురణ సంస్థల మీద చ క్రధర్ ప్రదర్శించిన నిరసనను అర్థం చేసుకోవలసిందే. పుస్తకం చివర తెలుగు పత్రికా రచయితల ఫోటోలు ఇవ్వడం రచయిత ఉత్తమ అభిరుచికి నిదర్శనం. - కల్హణ కొత్త పుస్తకాలు అండమాన్ జైలులో స్వాతంత్య్ర వీరులు మూలం: సుధాంశుదాసు గుప్తా తెలుగు: పాటూరి రామయ్య పేజీలు: 130; వెల: 60 2. ముజఫర్ అహ్మద్ ఓ తొలి కమ్యూనిస్టు రచన: సుచేతన చటోపాధ్యాయ పేజీలు: 344; వెల: 150 3.నాదమే యోగమని (ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారులు) తమిళం: కృష్ణా డావిన్సి తెలుగు: ఎజి యతిరాజులు పేజీలు: 108; వెల: 50 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107 నాణాలు- నోట్లు (పుట్టు పూర్వోత్తరాలు) రచన: కొల్లు మధుసూదనరావు పేజీలు: 136; వెల: 100 ప్రతులకు: స్వెస్ పబ్లికేషన్స్, 1-6-141/19, విద్యానగర్, సూర్యాపేట-508213. ఫోన్: 9848420070 ఆరుపదుల అనంతర జీవితం రచన: తెలగరెడ్డి సత్యానందమ్ పేజీలు: 40; వెల: 30 ప్రతులకు: రేవతీ క్రియేటివ్ కమ్యూనికేషన్స్ ప్రై. లి., ఫ్లాట్ 301, మొఘల్ మేన్షన్, ఖైరతాబాద్, హైదరాబాద్-4. ఫోన్: 040-23310670 గురి (వ్యాసాలు) రచన: గుండెబోయిన శ్రీనివాస్ పేజీలు: 48; వెల: 50 ప్రతులకు: రచయిత, 3-1-74/1/ఎ, కాకతీయ కాలనీ, హన్మకొండ-506011. వరంగల్ జిల్లా. ఫోన్: 9985194697 -
సమీక్షణం: సాఫల్య జీవన దృశ్యాలు
పుస్తకం : చెరగని ముద్రలు (వ్యాసాలు) రచన : ఆకెళ్ల రాఘవేంద్ర పేజీలు: 168 (హార్డ్‌బౌండ్); వెల: 249 ప్రతులకు: నవోదయా, ఇతర ప్రధాన పుస్తకకేంద్రాలు విషయం : సాక్షి ఫన్డేలో ‘రాలిన మొగ్గలు’ పేర ధారావాహికంగా ప్రచురింపబడిన యాభై రెండు జీవితాల చెరగని ముద్రలు ఈ వ్యాసాలు. జీవితం ఎంత చిన్నదైనా దానికొక అర్థం, పరమార్థం, లక్ష్యం ఉన్నవాళ్లు మరణానంతరం కూడా జీవిస్తారు. ఈ సంపుటిలో మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచంలో జీవితాన్ని ఆదర్శవంతంగా, స్ఫూర్తిప్రదాయకంగా గడిపినవారి జీవన దృశ్యాలు కనిపిస్తయి. సాహిత్యం, సంగీతం, చిత్రకళ నటనా రంగాలకు చెందినవారితో పాటు, సుప్రసిద్ధులైన ఆధ్యాత్మిక, తాత్విక వేత్తలు, చారిత్రక వ్యక్తులు, దేశభక్తులు ఈ సంపుటిలో ఉన్నారు. పదహారు సంవత్సరాల వయసులోనే ఈ విశ్వం మీద చెరగని సంతకం చేసి వెళ్లిపోయిన జోన్ ఆఫ్ ఆర్క్, యాన్ ఫ్రాంక్‌లతో పాటు మనకు పేర్లు మాత్రమే తెలిసిన ధన్యజీవుల జీవన గమనాన్ని చదువుతూ మన జీవితాన్ని యే విధంగా ఉపయోగిస్తున్నామని ప్రశ్నించుకుంటాం. ప్రతి వ్యాసంలో ఒక రాలిన మొగ్గ ఫొటో, ఆ వ్యక్తి గడిపిన కాలం, భౌతికంగా మరణించిన వయసుతో పాటు, పరిచయం, ప్రభావం, ఘనత, వేషభాషలు తెలిపే సంక్షిప్త వ్యాసాలున్నాయి. కవయిత్రి తోరుదత్ జీవితం ‘ముహుర్తా జ్వలితం శ్రేయో, నతు ధూమాయితం చిరం’ (పే.73)తో మొదలైతే, విప్లవ వనిత ప్రీతిలత వడేదార్ జీవితం క్లైమాక్స్‌తో మొదలవుతుంది. స్వామి వివేకానంద జీవిత చిత్రం ‘స్వామీ! ఈ దేశంలోని యువతీ యువకుల కండరాల్లోని ప్రతి కణంలోనూ నీ దేహపు ప్రత్యణువునీ ప్రవహించనీ. నిప్పుకణికలై ప్రజ్వరిల్లనీ’ (పే.38) అనే వాక్యాలతో పూర్తయితే, ఇరవై నాలుగేళ్ల వయసులో ఉరితీయబడ్డ భగత్‌సింగ్ జీవితం ‘ఈ వయసువాళ్లు ఈనాడు ఏం చేస్తున్నారు?’ అన్న వాక్యంతో పూర్తవుతుంది. వైవిధ్యం ఉన్న ప్రారంభం, ముగింపుల మధ్య ఆయా జీవితాలలో మలుపులు, సంఘటనలు వివరించిన విధానం ఆసక్తిని, కుతూహలాన్ని కలిగిస్తుంది. - చింతపట్ల సుదర్శన్ కథకుడు చెప్పిన చరిత్ర పుస్తకం : తొలి తెలుగు శాసనం రచన : డా. వేంపల్లి గంగాధర్ విషయం : తెలుగు భాష ప్రాచీనతను తెలియచేసే శాసనం కాబట్టి ఒక కథా రచయితను ఈ అంశం ఆకర్షించి ఉంటుందని ఈ పుస్తకం చూడగానే అనిపిస్తుంది. కానీ పుస్తకం తెరిచిన తరువాత చెప్పదలుచుకున్న ప్రతి అంశం మనకి కూడా ఆసక్తి కలిగిస్తుంది. డాక్టర్ వేంపల్లి గంగాధర్ ఈ చక్కని పుస్తకాన్ని అందించారు. రేనాటి చోళులు కడప జిల్లా కలమళ్ల గ్రామంలోని చెన్నకేశవాలయంలో వేయించిన శాసనమిది. చారిత్రకాధారాలను చరిత్రకారుడు పలికించినపుడే చరిత్ర రూపొందుతుందని చెబుతుంది చరిత్ర రచన పద్ధతి. కానీ ఒక కథకుడు చారిత్రకాధారాలను పలకరిస్తే ఆ కథ వేరుగా ఉంటుంది. చరిత్రలో, భాషా చరిత్రలో, సంస్కృతిలో ఈ శాసనం స్థానం గురించి చాలా ఆసక్తిగా రచయిత ఆవిష్కరించారు. ప్రతి రచయిత ఇలాంటి అభిరుచిని పెంచుకుంటే చరిత్ర రచనకు జరిగే ఉపకారం ఎంతో ఉంటుంది. ఈ శాసనం వివరాలు సేకరించడానికి జరిగిన కృషి వివరాలు, చోటు కల్పించిన ఫోటోలు విశిష్టంగా ఉన్నాయి. - కల్హణ రెక్కల్లో గీతాంజలి పుస్తకం : రెక్కల్లో టాగోర్ గీతాంజలి అనుసృజన : డి.హనుమంతరావు విషయం : అక్షరాల్ని అమృత పుష్పాలుగా మార్చిన విశ్వకవి టాగోర్. ‘గీతాంజలి’కి అనువాదాలు అనుసృజనల్ని పద్య, గేయ, వచన కవితా రూపాల్లో ఎందరో కవులు తెలుగులో వెలువరించారు. డి.హనుమంతరావు ‘గీతాంజలి’ని రెక్కల ప్రక్రియలో అనుసృజన చేశారు. నాలుగు లైన్లు ఒక స్టేట్మెంటును, చివరి రెండు లైన్లు వాటికి తగిన తాత్వికతను చెప్పే ప్రక్రియ ఇది. చివరి రెండు లైన్లు ‘రెక్కలు’గా చెప్పుకోవచ్చు. పేజీలు: 102; వెల: 60 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో. ‘ఏదో ఆనందం నాలో తెలియని అలజడి నాలో - నీ సమక్షం ఓ మధుర పరిమళం!’ భగవంతుణ్ని ప్రియునిగా భావించి ఆయన ఎదురుపడ్డప్పుడు ఆనందంతో కూడిన అలజడిని ఎంతో గొప్పగా కవి రెక్కల మూసలో ఒదిగిస్తాడు రచయిత. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి పేజీలు: 104; వెల: 100 ప్రతులకు: కవి, జి-2, పోలీస్ మంగారెడ్డి రెసిడెన్సీ, సూరారం గ్రా., కుత్బుల్లాపూర్ మం., హైదరాబాద్-55. ఫోన్: 8186915342 కొత్త పుస్తకాలు పొడిచే పొద్దు (కథానికలు) రచన: కన్నెగంటి అనసూయ పేజీలు: 152; వెల: 150 ప్రతులకు: రచయిత్రి, విల్లా నం.17ఎ, వెర్టెక్స్ లేక్‌వ్యూ, నిజాంపేట్, హైదరాబాద్-90. ఫోన్: 9246541249 నేలకు దిగిన నక్షత్రం (కథలు) రచన: డా.ఎమ్.సుగుణరావు పేజీలు: 280; వెల: 150 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు కాలుతున్న కట్టెలు (కథలు) రచన: కూతురు రాంరెడ్డి పేజీలు: 188; వెల: 120 ప్రతులకు: రచయిత, ప్లాట్ నం.11, ఇం.నం. 6-67, సుప్రభాత్ వెంచర్-2, కాచవానిసింగారం పోస్టు, ఘట్కేసర్ మం. రంగారెడ్డి జిల్లా-500088. ఫోన్: 9000415353 జ్ఞానసుధ రచన: వి.శ్రీరామరెడ్డి పేజీలు: 120; వెల: 80 ప్రతులకు: రచయిత, మర్రిపల్లి, ఓబుళరెడ్డిపల్లి పోస్టు, వి.ఎన్.పల్లి మండలం, వైఎస్ఆర్ జిల్లా- 516321. ఫోన్: 8008372218 ప్రథమ బాలశిక్ష-2 (ఆరోగ్య సూక్తిసుధ) రచన: భాగవతుల శ్రీనివాసరావు పేజీలు: 144; వెల: 90 ప్రతులకు: భాగవతుల సామ్రాజ్యలక్ష్మి, 23-23-52, శివరావు వీధి, సత్యనారాయణపురం, విజయవాడ-11. ఫోన్: 9618165402 గ్లోబల్ వార్మింగ్ రచన: టి వి సుబ్బయ్య పేజీలు: 134; వెల: 75 ప్రతులకు: దీప్తి బుక్ హౌజ్, మ్యూజియం రోడ్, విజయవాడ-2 -
సమీక్షణం: శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని కళ్లకు కట్టించే వ్యాసాలు
పుస్తకం : సాహితీ సమరాంగణ సార్వభౌమ (వ్యాససంపుటి) సంపాదకుడు : మోదుగుల రవికృష్ణ పేజీలు: 240; వెల: 180 ప్రతులకు: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్. ఫోన్: 9848065658 విషయం : తెలుగు గ్రామీణ జన జీవన అంశాలను కళ్లకు కట్టించిన ‘ఆముక్తమాల్యద’ను రచించిన కవిరేడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన్ని దక్షిణ భారతదేశపు సాంస్కృతిక చిహ్నంగా పేర్కొనవచ్చు. ఐదు వందల ఏళ్ల నాడు, సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య విశ్లేషణకు ఆధారభూతములైన గ్రంథరాజములు వెలువడటానికి విజయ నగర సామ్రాజ్యాధిపతిగా ఆయన చేసిన సాహిత్య సేవ ఎంతగానో దోహదపడింది. 1914 నుండి 2013 వరకు నూరేళ్ల వ్యవధిలో రాయల వారి గురించి వచ్చిన వ్యాసాలలో ముఖ్యమైనవాటిని ప్రచురించాలనే ఆశయంతో ‘సాహితీ సమరాంగణ సార్వభౌమ’ శీర్షికతో ‘మిత్రమండలి ప్రచురణలు’ ద్వారా ఈ వ్యాస సంపుటి వెలుగు చూసింది. నేలటూరి వెంకటరమణయ్య, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, దివాకర్ల వెంకటావధాని, దేవులపల్లి కృష్ణశాస్త్రిలాంటి వారు రాసిన ఈ 27 వ్యాసాలు రాయల కాలపు రాజవీధుల్లో తిరుగుతున్న అనుభూతిని ఇస్తాయి. ఇందు ప్రచురించిన 102 ఛాయాచిత్రాలు ఆ కాలపు శిల్ప సౌందర్యాన్ని, కోటల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి. గత చరిత్రను నేటి పాఠకుల కళ్లకు కట్టించే పుస్తకమిది. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ‘ఆదుర్తి’ పై అందమైన సంకలనం పుస్తకం : దర్శక చక్రవర్తి ఆదుర్తి సుబ్బారావు సంకలనం : హెచ్.రమేష్‌బాబు విషయం : ‘మూగ మనసులు’ గుర్తుందా? అసలు మన తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే సినిమానా అది! అదొక్కటే కాదు... తోడికోడళ్లు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, నమ్మిన బంటు... ఇలాంటి సినిమాలన్నీ... చూసిన ప్రతిసారీ బోలెడన్ని జ్ఞాపకాలు పంచే గనులు. ఈ కళాఖండాల సృష్టికర్త ఆదుర్తి సుబ్బారావు. సూపర్‌స్టార్ కృష్ణకు సినీ జన్మనిచ్చిన వ్యక్తి. సాంఘిక సినిమాల రూపురేఖలు మార్చిన దర్శకుడు. తెలుగు సినిమా షూటింగ్‌ని ప్రకృతికి దగ్గర చేసినవాడు. అంటే అవుడ్డోర్ షూటింగ్స్‌కి ఓ చక్కటి రహదారి వేసినవాడు. ఆదుర్తి కెరీర్లో ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి. ఈ తరమే కాదు, రాబోయే తరాలు కూడా ఆయన గురించి తెలుసుకోవాలి. కానీ వికీపీడియాలో కూడా సరైన సమాచారం లేదు. ఆ లోటు తీరుస్తుందీ పుస్తకం. సంకలనం అయినా కూడా రమేష్‌బాబు చాలా శ్రమించారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల డబ్బు కన్నా కాలమే ఎక్కువ ఖర్చవుతుంది. ఎందరెందరి దగ్గరికో, ఎన్నెన్నో ఊళ్లు తిరిగి ఫొటోలు, సమాచారం సేకరించాలి. ఈ పుస్తకంలో చాలా మంచి డీటైల్స్, వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి. ఆదుర్తి అభిమానులనే కాకుండా సినీ ప్రియులనూ ఈ పుస్తకం అలరిస్తుంది. - శ్రీబాబు తుపాకి గుళ్ల లాంటి కథలు తెల్లజాగాను వీలైనంతగా వాడుకున్న ఈ రెండు అనువాద కథా సంకలనాల ప్రాథమిక గుణం- వేగంగా చదివింపజేయడం. వివిధ భాషల్నుంచి అనువాదం చేసిన ‘పరాయి సిరా’లో 21 కథలున్నాయి. రుచిగల ‘లసగ్నా’తో ప్రియుడి మనసు గెలుచుకోవాలనుకుని, దాన్ని ఉప్పుమయం చేసిన ప్రియురాలి తొలి విఫల వంట ప్రయత్నం- ‘మగాడి హృదయానికి దారి’ (ఇటాలియన్; క్రిస్టినీ డిక్సన్). ‘ఎల్ జెఫే’ ఆవిష్కరించబోయే తపాలా బిళ్ల అంచు నీలంకు బదులుగా నలుపు రంగు రావడంతో- కచ్చితంగా తమకు ఉరిశిక్ష తప్పదనుకున్న ముగ్గురు అధికారులు చావోరేవో ఎలా తిరుగుబాటు తెచ్చారో ‘నియంత’(కొలంబియన్; ఎడ్వర్వ్ వెల్లెన్) కథ చక్కగా చెబుతుంది. ఇక, సంక్షిప్తం చేసిన 68 మినీ క్రైమ్ కథలన్నింటికీ వర్తించే సూత్రం: ‘పేల్చిన తుపాకి గుండు ఎలా తక్షణం గమ్యాన్ని తాకుతుందో అలా ఈ కథలన్నీ త్వరగా, అంటే విసుగు పుట్టించకుండా క్లయిమేక్స్కి చేరుకుంటాయి.’ - రాజు పరాయి సిరా (అనువాద కథలు); పేజీలు: 142; వెల: 120 మినీ క్రైమ్ కథలు; పేజీలు: 142; వెల: 120 అనువాదం: మల్లాది వెంకట కృష్ణమూర్తి, ప్రతులకు: లిపి పబ్లికేషన్స్, గాంధీనగర్, హైదరాబాద్-80. ఫోన్: 9849022344 కొత్త పుస్తకాలు నన్ను సాయిబును చేసింది వాళ్లే (వ్యాసాలు) రచన: షేక్ కరీముల్లా పేజీలు: 100; వెల: 50 ప్రతులకు: రచయిత, 21-55, పెద్దమసీదు బజారు, వినుకొండ-522647, గుంటూరు. ఫోన్: 9441502990 నేలతీపి, అజ్ఞాతం (కథారూపకాలు) రచన: డా.వి.ఆర్.రాసాని పేజీలు: 106; వెల: 60 ప్రతులకు: అన్ని విశాలాంధ్ర బ్రాంచీలు. -
సమీక్షణం: వ్యక్తిత్వ వికాసం కోసం
పుస్తకం : విజయోస్తు (వ్యక్తిత్వ వికాసం) రచన : శ్రీనివాస్ మిర్తిపాటి పేజీలు: 188 వెల: 89 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ. విషయం : వ్యక్తిత్వ వికాసం మీద కొత్తగా మార్కెట్లోకి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. నిజం చెప్పే ధైర్యం నాకుంది, మరి చదివే ధైర్యం మీకుందా? అని చెప్పి, ఒక ఛాలెంజ్ చేసి మరీ ఈ పుస్తకం చదివిస్తాడు రచయిత. ప్రతి మనిషికీ ఒక సిద్ధాంతం ఉండాలంటాడు రచయిత. సిద్ధాంతం అంటేనే ఎన్ని పేజీలు అయినా సరిపోవు. కానీ సింపుల్‌గా ఒక్కొక్క పేజీలో చెప్పడం, చెయ్యి తిరిగినవారికే సాధ్యం. బహుశా జర్నలిజమ్‌లో అపారమైన అనుభవం ఇందుకు ఉపయోగపడి ఉండాలి. గాంధీ సిద్ధాంతం, మోడి, సోక్రటిస్... వీరందరివీ రాయడం గొప్ప విషయం. టీవీలు ఎందుకు చూడకూడదు - ఆసక్తికరంగా ఉంటుంది. జాతకాలు... 120 కోట్లమంది ప్రజలకు 12 రాశులు... అంటే ప్రతి 10 కోట్ల మందికీ ఒకేలా జరగడం సాధ్యమేనా? సచిన్, కాంబ్లీ మధ్య వ్యత్యాసం ఏమిటి? మార్పు సాధించిన అశోకుడు, సాధించలేని ఔరంగజేబు... ఇలా ఎన్నో విషయాలతో ఈ పుస్తక రచన సాగింది. - జగదీష్ హాస్య శృంగార సందేశాత్మకం పేజీలు: 140 వెల: 75 ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు పుస్తకం : మైత్రీవనం (కథలు) రచన : జిల్లేళ్ల బాలాజీ, రాచపూటి రమేష్, పేరూరు బాలసుబ్రమణ్యం విషయం : మిత్ర కథకత్రయం... ఒక్కొక్కరివి ఆరేసి చొప్పున 18 కథలతో ‘మైత్రీవనం’గా సంపుటీకరించి కథా భారతికి కంఠహారంగా సమర్పించారు. బాలాజీ ‘ఏకాంబరం ఎక్స్ట్రా ఏడుపు’ వస్తు వైవిధ్యంతో నవ్వులు పూయిస్తుంది. రమేష్ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రహసనాన్ని అధిక్షేపాత్మకంగా ‘ఏడుకొండలు - ఎలక్షన్ డ్యూటీ’లో ఆవిష్కరించాడు. బాలసుబ్రహ్మణ్యం ‘సుబ్బు ఐడియా’లో అమాయకపు ఇల్లాలు అతి తెలివితో భర్త పడే భంగపాట్లు హాస్యస్ఫోరకంగా చిత్రించాడు. బాలాజీ ‘అమ్మ డైరీ’లో రవిచంద్ర తన తల్లి వద్దని ప్రాధేయపడినా పట్టుదలతో మాతృదేశ రక్షణ కోసం మిలటరీలో చేరేందుకు వెళ్లాడు. రవిచంద్ర పాత్రను ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ సిద్ధాంతానికి అక్షర లక్ష్యంగా తీర్చిదిద్దాడు రచయిత. ‘నీడలు-నిజాలు’ కథలో మతోన్మాదాన్ని నిరసిస్తాడు రమేష్. ‘శిశిర స్వప్నం’ కథలో వృద్ధుల దయనీయ స్థితిని వర్ణించాడు సుబ్రమణ్యం. - డా॥పి.వి.సుబ్బారావు పిల్లలు గీసిన వన్నెల చిత్రం! పేజీలు: 54 వెల: 70 పుస్తకం : ఎ పొయెట్ ఇన్ హైదరాబాద్ (కవిత్వం) రచన : ఆశారాజు ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 040-24642387 విషయం : లేటెస్ట్ స్టడీ ఒకటి చెబుతుంది: ‘జ్ఞాపకాల్లోకి వెళ్లిన వాళ్లు తాజాగా ఉంటారు. మనసును పరిమళభరితం చేసుకుంటా’రని. పురాతన నగరం హైదరాబాద్‌తో పెన వేసుకున్న బంధాన్ని జ్ఞాపకాల్లో నుంచి తీసుకువస్తున్నాడు ఆశారాజు. యవ్వనానికి ఊదు పొగలేసిన సుల్తాన్ బజారులో నడిచినప్పుడు, లాడ్‌బజార్‌లో మెరిసే గాజుల పూలసవ్వడి విన్నప్పుడు, గోలుకొండెక్కి మబ్బుల సొగసును ముద్దాడినప్పుడు, పంచమహల్ ముషాయిరాలో శ్రోత అయినప్పుడు కవితో పాటు మనమూ ఉంటాం. హైదరాబాద్ సౌందర్యాన్ని మనసు కాన్వాసుపై బొమ్మలేసుకొని ‘ఇది మా హైదరాబాద్’ అని మురిసిపోతాం. నిద్రపోయిన జ్ఞాపకాలను నగరం తట్టిలేపి, ‘ఫిర్సే షురూ కరెంగే జిందగీ’ అనేలా చేస్తుందని చెప్పడానికి ఈ పుస్తకం విశ్వసనీయ సాక్ష్యం. చదువుతున్నంతసేపు రంజాన్ సాయంత్రాల్లో పాతబస్తీ గల్లీ గల్లీ తిరుగుతున్నట్లు ఉంటుంది. - యాకుబ్ పాషా కొత్త పుస్తకాలు మైల (శుద్ధాత్మక నవల) రచన: వరకుమార్ గుండెపంగు పేజీలు: 168; వెల: 100 ప్రతులకు: రచయిత, సన్నాఫ్ భిక్షం, 5-94, అంబేద్కర్ విగ్రహం దగ్గర, బేతవోలు, చిలుకూరు మం. నల్గొండ జిల్లా. ఫోన్: 9948541711 శాలువా (కథలు) రచన: పిడుగు పాపిరెడ్డి పేజీలు: 152; వెల: 100 ప్రతులకు: రచయిత, 8/137, అప్పయ్యగారి వీధి, కొత్తపేట, కనిగిరి-523230. ఫోన్: 9490227114 1.గ్రేట్ అలెగ్జాండర్ తమిళ మూలం: ఆత్మారవి తెలుగు: ఎజి.యతిరాజులు పేజీలు: 96; వెల: 50 2. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ రచన: గురజాడ అప్పారావు బుర్రకథగా అనుసరణ: కమ్మ నరసింహారావు పేజీలు: 32; వెల: 25 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌజ్, 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107 డయాబెటిస్తో ఆరోగ్యంగా జీవించడం ఎలా? (‘మన ఆహారం’ బుక్‌లెట్‌తో) రచన: డా.టి.ఎం.బషీర్ పేజీలు: 232; వెల: 180 ప్రతులకు: స్పందన హాస్పిటల్, ధర్మవరం-515671. ఫోన్: 9908708880 తాత చెప్పిన కథలు రచన: బి.మధుసూదనరాజు పేజీలు: 60; వెల: 60 ప్రతులకు: జి.రామకృష్ణ, లైబ్రేరియన్, శాఖాగ్రంథాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. -
ఫన్ డే.. పుస్తక సమీక్షణం
అక్షరాలా ఆకట్టుకునే వ్యాసాలు పేజీలు: 162 ధర: 150 ప్రతులకు: జి. సుబ్బారావు, 16-131, గరల్స్ హైస్కూల్, పాతస్టేట్బ్యాంకు కాలనీ వద్ద, కొత్తపేట- 533223, తూ.గో.జిల్లా. పుస్తకం : ఆక్షరావిష్కరణం (సమీక్ష-విమర్శ) రచన : గిడ్డి సుబ్బారావు ‘విమర్శకుడైన వాడు కవి అయితే ఒక ప్రయోజనం...’ అన్నారు అద్దెపల్లి రామ్మోనరావు. ఆ ప్రయోజనం ఏమిటో ఈ పుస్తకం చదివిన వారికి సులభంగా అర్థమవుతుంది. కవిత్వం రాసి మెప్పించి అదే చేతితో విమర్శ రాసి ‘అయ్యో!’ అనిపించిన వారు ఉన్నారు. ప్రపంచ సాహిత్యాన్ని కాచి వడపోసి ఉద్దండ విమర్శకులుగా ప్రసిద్ధి చెందిన వారు...కవిత్వమో, మరో ఇతర సృజన ప్రక్రియ జోలికో వెళ్లి పూర్తిగా విఫలమైనవారు ఉన్నారు. విమర్శను, సృజనను ఏకకాలంలో సమన్వయం చేసి మెప్పు పొందిన రచయితలు అరుదుగా ఉంటారు. ఆ కోవకు చెందిన రచయిత గిడ్డి సుబ్బారావు. పుస్తకాలను చదివే క్రమంలో పాఠకుడిగా తాను అనుభవించిన అనుభూతులను, ఆ పుస్తకాలతో పరిచయం లేని పాఠకులకు సైతం చదివిన అనుభవాన్ని, అనుభూతులను సొంతం చేయడంలో సుబ్బారావు సఫలం అయ్యారు. శిఖామణిలాంటి సుపరిచిత కవుల పరిచయంతో పాటు ఎప్పుడు, ఎక్కడా వినని కవుల కవిత్వ విశ్లేషణ కూడా ఇందులో ఉంది. సుపరిచితులు, అపరిచితులు అనే తేడా లేకుండా ఒకే రకమైన శ్రద్ధ, ఆసక్తులతో సాహిత్య విమర్శ చేశారు. సాహిత్యంలో వివిధ ధోరణులను సాధికారికంగా విశ్లేషించారు. కవిత్వ ప్రేమికులను ఆకట్టుకునే పుస్తకం ఇది. - బి.రేవతి కొత్త పుస్తకాలు చాణక్య నీతి మాలికలు అనుసృజన: యల్లాప్రగడ ప్రభాకరరావు పేజీలు: 128; వెల: 120 ప్రతులకు: పంగులూరి హనుమంతరావు,16-11-511.జి/7, శాలివాహననగర్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-36. ఫోన్: 040-24141560 సత్యశోధన (బాల- ఉత్తరకాండలు అవాల్మీకీయములు) రచన: యర్రగుంట సుబ్బారావు; పేజీలు: 116; వెల: 60 ప్రతులకు: వై.సుబ్బారావు, ఐ.ఎల్.టి.డి. కాలనీ, 4-109, చీరాల, ప్రకాశం జిల్లా-523157. ఆయుర్వేదంతో ఆరోగ్యంగా ఉండండి (మూలసూత్రాలు- ఆరోగ్య నియమాలు) రచన: డా.ఎస్.రాంరెడ్డి; పేజీలు: 498; వెల: 360 ప్రతులకు: అమృతం హెల్త్‌కేర్ సిరీస్, 13-9-6, లలితా నగర్, కోణార్క్ థియేటర్ దగ్గర, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-60. ఫోన్: 040-24062243 -
పుస్తక సమీక్షణం
పుస్తకం : వెన్నెల్లో మంచుపూలు (కవిత్వం) రచన : తిరువాయపాటి రాజగోపాల్ పేజీలు: 100 వెల: 60 ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు విషయం : నువ్వు ఇప్పటికీ చిగురు వేస్తున్నావా? జీవన సాఫల్యం జుర్రుకుంటున్నావా? అవునో కాదో తేల్చుకోవాలంటే రాజగోపాల్ ‘వెన్నెల్లో మంచుపూలు’ పరిమళాన్ని ఆస్వాదించాల్సిందే. ‘అంతర్ముఖత్వం అన్ని ఔన్నత్యాలకూ ఆది మూలం’ అని విశ్వసిస్తారు కవి. ‘నా అనామకత్వానికి, నేను విసిరే సవాలు, నా కవిత్వం’ అంటారు. మనం ‘అభినయిస్తున్న విజయాలన్నీ, అప్రకటిత పరాజయాలు’ అని ఆక్షేపిస్తారు. బాల్యజ్ఞాపకాల్లోంచి ‘బతికున్న క్షణాలు’ ఏరుకుంటారు. గాలిసవ్వడిలో గాంధర్వం వింటారు. అధికారాంతం, వాడూ నేనూ, ఇలా కూడా వీలౌతుంది... ప్రతి కవితా దేనికదే ప్రత్యేకం. స్ఫూర్జితశరం, అక్షతగాత్రయోధుడు, నక్షత్ర వృక్షజాలం, దీర్ఘచతురస్రీకరణ... రాజగోపాల్ సొంత పదసామగ్రిని సృష్టించుకుంటారు. ‘రాసిన పంక్తులు, జవనాశ్వాలై, జగత్తును రంగస్థలి చేసుకుని, కవాతు చెయ్యాలి’ అన్న కవి కల నెరవేరాలని ఆశిద్దాం. - ఎమ్వీ రామిరెడ్డి లోతుగా వెంటాడే కలలు పుస్తకం : ఊదారంగు మధ్యాహ్నం (కథలు) రచన : ఎమ్మెస్ సూర్యనారాయణ పేజీలు: 98 వెల: 50 ప్రతులకు: ఎం.రత్నమాల, ఆదిత్య కుటీర్, పొదలాడ, రాజోలు, తూ.గో. -533 242 9298950941 విషయం : కవిత్వం, కథలు వేర్వేరు కావచ్చు. కానీ సూర్యనారాయణ కథలు చదివితే, కవిత్వం మారువేషంలో వచ్చినట్టుగా అనిపిస్తుంది. కోనసీమ కొబ్బరినీళ్లంత స్వచ్ఛమైన, చిక్కనైన కవిత్వం ఎమ్మెస్‌ది. అదే తరహా మ్యాగ్నటిజమ్ ఈ కథల్లోనూ టచ్ అవుతుంది. ఓ పట్టాన అర్థం కాని మోడ్రన్ ఆర్ట్లాంటి కథలివి. ఆయన కన్న కలలు, మెలకువలు, కలవర పాటలు, కలత నిదురలో రాసుకున్న స్వర్ణాక్షరాలు... వీటన్నిటి కలగలపుతో పుట్టిన కథలివి. గోదావరి నదిలో ఉండే గాంభీర్యంతో పాటు గలగల పారే చమత్కారం కూడా ఆవిష్కృతమవుతాయి. ఏదో భావజాలం, అంతర్మథనం వెంటాడీ వెంటాడనట్టుగా అనిపిస్తాయి. జన్మాంతరం, పడమటి ఉత్తరం, చిదంబర స్వప్నం, ఊదారంగు మధ్యాహ్నం, ఆత్మవస్త్రం... చదువుతుంటే, మనసుకున్న కొత్త లోతులు తెలుసుకోవాలనే తహతహ పెరుగుతుంది. ఒక్క ముక్కలో, ఇది స్లో మోషన్లో వెంటాడే కల. - శ్రీబాబు ఆలోచింపజేయటం ఒక సవాలు పుస్తకం : సవాళ్లతో సంఘర్షణ (ఉపన్యాసాలు) రచన : సీతారాం ఏచూరి పేజీలు: 228; వెల: 100 ప్రతులకు: రాష్ట్రంలోని అన్ని ప్రజాశక్తి బ్రాంచీలు విషయం : ఒకప్పటి ప్రజానాయకుల ఉపన్యాసాలు విని, ఉద్యమ కారులుగా మారినవారు ఎందరో! ఇప్పటికీ ప్రజా ఉద్యమాల్లో పనిచేసేవారు కొందరు మాట్లాడితే జనం కదలిపోతారు. ఉపన్యాసాల ద్వారా తమ రాజకీయ భావజాలాలను వారు విస్తృతంగా ప్రచారం చేస్తారు. వామపక్ష ఉద్యమాల్లో జాతీయ నాయకుడిగా ఎదిగిన సీతారాం ఏచూరి మంచి వక్త. ఆయన తాత్విక భావజాలాన్ని, రాజకీయ అంశాలను అందరూ ఒప్పుకోవచ్చును లేదా వ్యతిరేకించవచ్చును. కానీ ఏచూరి తమ పార్టీ విధానాన్ని చెప్పేటప్పుడు, జాతీయ అంతర్జాతీయ అంశాలను విశ్లేషించేటప్పుడు ఇతరులను ఆకట్టుకునే శక్తి ఉంది. అందుకే చాలామంది మాట్లాడిన ఉపన్యాసాలు అప్పటికప్పుడు విని చప్పట్లు కొట్టి వదిలేయవచ్చును. కానీ ఏచూరి మాటలు ఆలోచింపజేసే దశకు తీసుకుపోతాయి. వామపక్ష దారిలో దేశానికి సోషలిజం వస్తుందా అన్నది సవాలక్షల సవాళ్ల ప్రశ్న అనుకోకండి. ఈ పుస్తకం ద్వారా వామపక్ష ఉద్యమదారి ఎటు పోతుందో తెలుస్తుంది. - జూలూరు గౌరీశంకర్ కొత్త పుస్తకాలు అక్షరమాల కథలు రచన: తల్లాప్రగడ రవికుమార్ పేజీలు: 134; వెల: 80 ప్రతులకు: రచయిత, 21-10-87, శ్రీనగర్ మొదటివీధి, సత్యనారాయణపురం, విజయవాడ-520011. ఫోన్: 9397831065 అంతర్భ్రమణం రచన: శ్రీ అరుణం పేజీలు: 214; వెల: 100 ప్రతులకు: విక్టరీ పబ్లిషర్స్, 30-17-18, వారణాశివారి వీధి, సీతారాంపురం, విజయవాడ-2. ఫోన్: 0866-2444156 1.వియోగి నాటికలు రచన: కోపల్లె విజయప్రసాదు పేజీలు: 200; వెల: 150 2. ఆత్మావలోకనం (నవల) రచన: శ్రీరాగి పేజీలు: 154; వెల: 120 3. సగటు ఉద్యోగి (నవల) రచన: శ్రీరాగి పేజీలు: 346; వెల: 200 ప్రతులకు: టి కె విశాలాక్షిదేవి, 87/395, కమలానగరు, బి క్యాంపు, కర్నూలు-518002. ఫోన్: 9502629095 శ్రీ గాయత్రీ శంకర భాష్యము (ఆంధ్ర వివరణ సహితము) రచన: శ్రీ శ్రీ చిదానంద భారతీ స్వామి పేజీలు: 112; వెల: 100 ప్రతులకు: బండారు శివరామకృష్ణశర్మ, శ్రీ చిదానంద భారతీస్వామి ఫౌండేషన్, 11-17-32/1, రామిరెడ్డిపేట, నరసరావుపేట. ఫోన్: 9247897994 ముక్తకములు రచన: డా.వై.బాలరాజు పేజీలు: 96; వెల: 90 ప్రతులకు: రచయిత, 2-9-12, బస్టాండ్ రోడ్, జనగాం, వరంగల్-506167. ఫోన్: 8500040827 -
సమీక్షణం: పుస్తక సమీక్షణం
సమాజ పునర్నిర్మాణానికి ఏకైక మార్గం పేజీలు: 150 వెల: 80 ప్రతులకు: 5-4-1413, శారదానగర్, వనస్థలిపురం, హైదరాబాద్-70. ఫోన్: 9866681927 పుస్తకం : హేతువాదం - అపోహలు, అపార్థాలు రచన : గుమ్మా వీరన్న విషయం : సమాజం మూఢ విశ్వాసాల నుండి బయటపడి అభ్యుదయానికి అడ్డుగోడలు తొలగించుకోవాలంటే, హేతువాదంతో కూడిన భావ విప్లవమే శరణ్యం అంటారు గుమ్మా వీరన్న. ఈ వ్యాససంపుటిలో ఆధునిక విజ్ఞానం అందించే శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకుంటే మన సామాజిక సాంస్కృతిక జీవనంలో సరైన మార్పులు వస్తాయంటారు. సత్యాన్వేషణ శ్రమతో కూడినది. శాస్త్రీయమైన పరిశోధనల ద్వారానే దాన్ని పొందగలం. శ్రమలేని సుఖాన్ని అందించేది విశ్వాసం. అందుకే ఏ శ్రమ లేకుండా దేవుణ్ని నమ్ముతుంటాం. అజ్ఞానంలో సుఖాన్ని వెతుక్కుంటుంటాం. జ్ఞానమనేది భౌతిక వాస్తవికత మీద ఆధారపడి మాత్రమే లభ్యమవుతుంది. నూతన సత్యాలు సైన్స్ ద్వారానే వెలుగు చూస్తాయి, మూఢ భక్తి వలన కాదు అని చెబుతారు. వాస్తవిక సత్యాన్ని గ్రహించినట్లయితే, సుఖశాంతులతో సమాజాన్ని ముందుకు తీసుకుపోవచ్చునంటారు. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి జిడ్డు కృష్ణమూర్తితో అనుభవాలు పేజీలు: 258 వెల: 150 ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాద్-27. ఫోన్:040- 24652337 పుస్తకం : జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా? జానర్ : నాన్ ఫిక్షన్/అనుభవాలు రచన : నీలంరాజు లక్ష్మీప్రసాద్ విషయం : ‘ఆధ్యాత్మిక రంగంలో ఒకరి ఆధిపత్యం, అధికారం, పెత్తనం పనికిరావు. ప్రతిమనిషీ తనకుతానే గురువుగానూ, శిష్యుడిగానూ రూపొందాలి’ అని ప్రకటించిన ఆధ్యాత్మిక విప్లవకారుడు జిడ్డు కృష్ణమూర్తి. ఆయన భావనలు చాలా పుస్తకాలుగా వ్యాప్తిలో ఉన్నాయి. ఈ పుస్తక లక్ష్యమూ అదే! అయితే, దీని భిన్నత్వం ఏమిటంటే, సీనియర్ రచయిత లక్ష్మీప్రసాద్ 1980 ప్రాంతంలో కృష్ణమూర్తిని చేసిన ఇంటర్వ్యూలు, అప్పటి అనుభవాలను కూడా మేళవించడం! ‘నా జీవితంలో జిడ్డు కృష్ణమూర్తిగారు తటస్థపడటం గొప్ప అదృష్టం’ అంటారు రచయిత. ఆ అదృష్టాన్ని ఇలా పుస్తకంగా పంచుకున్నారు. ‘మన సాధారణ చైతన్యం ఆవలనున్న ఏ మహా కరుణను వీరు దర్శించారో’ అంటూ ఇటీవలి వరకు రాసిన వ్యాసాలను కూడా జతపరిచారు. ‘కృ’ తత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ సులభంగా అర్థం చేయించే పుస్తకం! మరొక కొత్త నిఘంటువు పుస్తకం : విజేతకాంపిటీషన్స్ ‘ఇంగ్లీష్- తెలుగు నిఘంటువు’ సంపాదకత్వం : డా.ఎ.వి.పద్మాకరరెడ్డి విషయం : నిరంతర పరిణామం సమాజ లక్షణం. అదే భాషకూ వర్తిస్తుంది. తదనుగుణంగా కొత్త పదజాలం పుడుతుంది. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా నిఘంటువును సరిచేసుకోవాల్సిన అవసరమూ పడుతుంది. అయితే, ‘బండ్ల పబ్లికేషన్స్’ సాయిబాబు ఏకంగా కొత్త నిఘంటువునే నిర్మించ తలపెట్టారు. నిఘంటు నిర్మాణమంటే, ‘మహాయజ్ఞం’. ‘బ్రహ్మ ప్రళయమైన పని’. ‘పుష్కర కాల శ్రమ’. ప్రపంచంలో కరడుగట్టిన నేరస్తునికి విధించాల్సిన సరైన శిక్ష ఏమిటంటే, ఏదైనా నిఘంటువును సంకలనం చేయమని ఆదేశించడమట! అలా నైఘంటికుడు పద్మాకరరెడ్డి తన భాషా ప్రేమకు తగిన శిక్ష అనుభవించారు. ఇటీవలే కన్నుమూసిన సొదుం రామ్మోహన్ కూడా సహసంపాదకుడిగా ఆ శిక్షను పంచుకున్నారు. డీటీపీ చేసిన రాఘవస్వామి సరేసరి! అలా ‘లక్షకు పైగా ఆరోపాలతో’ కూడిన ఈ సరికొత్త ఆంగ్ల-తెలుగు డిక్షనరీ భాషాప్రేమికులకు అందుబాటులోకి వచ్చింది. కొత్త పుస్తకాలు నేలపై నిండు చంద్రుడు (మహమ్మద్ ప్రవక్త జీవన దృశ్యాలు) రచన: మర్దిజా ఆల్డ్రిచ్ టారింటినో తెలుగు: బా మేరాజ్ పేజీలు: 116; వెల: 40 ప్రతులకు: శాంతిమార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, 16-2-867/10, అక్బర్‌బాగ్, సయీదాబాద్, హైదరాబాద్-59. ఫోన్: 9676144697 మిఠాయిపొట్లం (పొడుపు కథలు) రచన: కందేపి రాణీప్రసాద్ పేజీలు: 112; వెల: 50 ప్రతులకు: స్వాప్నిక్ పబ్లికేషన్స్, సృజన్ చిల్డ్రెన్ హాస్పిటల్, సిరిసిల్లా, కరీంనగర్. ఫోన్: 08723-233514 ముద్రలు, బంధాలు (ఆనందానికి, ఆరోగ్యానికి సాధనలు) రచన: ధరణీప్రగడ ప్రకాశరావు పేజీలు: 304(హార్డ్‌బౌండ్); వెల: 300 ప్రతులకు: రచయిత, 7-1-309/76, బి.కె.గూడ, సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్-38. ఫోన్: 9849066765 1.భారతీయ మహిళా పారిశ్రామికవేత్తలు పేజీలు: 400; వెల: 225 2.అపురూపమైన తండ్రీకూతుళ్ల అనుబంధం పేజీలు: 400; వెల: 225 రచన: శ్రీవాసవ్య ప్రతులకు: కృష్ణవేణి పబ్లికేషన్స్, 27-20-46, మ్యూజియం రోడ్, విజయవాడ-2. ఫోన్: 0866-2576864 ఖండిత స్వప్నాలు (కవిత్వం) రచన: డా. కొండెపోగు బి.డేవిడ్ లివింగ్స్టన్ పేజీలు: 152; వెల: 100 ప్రతులకు: రచయిత, రాజగృహ, తర్లుపాడు రోడ్, మార్కాపురం, ప్రకాశం-523316. ప్రతులకు: బండ్ల పబ్లికేషన్స్, 2-2-1130/24/1/డి/1, ఇండియన్ బ్యాంక్ వెనుక, శివం రోడ్డు, న్యూ నల్లకుంట, హైదరాబాద్-44. ఫోన్: 040-27673494 -
పుస్తక సమీక్షణం
పేజీలు: 200 వెల: 125 ప్రతులకు: ప్రజాశక్తి, విశాలాంధ్ర బుక్ హౌస్‌లు ఊతం కోల్పోతున్న జీవితాలు పుస్తకం : ఊతకర్రలు (కథలు) రచన : శిరంశెట్టి కాంతారావు విషయం : కుదేలవుతున్న కులవృత్తులు, అంగలారుస్తున్న వ్యవసాయం, పగుళ్లిస్తున్న పల్లె సంస్కృతి... ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న జీవన నేపథ్యాలను గుదిగుచ్చిన 18 కథల సంపుటిది. కుమ్మరి అయోధ్య నుంచి ఆ వృత్తిని వారసత్వంగా స్వీకరించేందుకు నిరాకరిస్తాడు కొడుకు వీరన్న. పొలం కౌలుకు తీసుకుని, డక్కాముక్కీలు తిని, ఉత్తమ రైతు అవార్డు అందుకోగలుగుతాడు. ఈ పురోగతిని భూస్వామ్యవర్గం ఆమోదించని తీరును ‘ప్రయాస’లో చిత్రించారు. ఫార్మా కంపెనీలు జంతువులపై చేయాల్సిన ప్రయోగాలను గిరిజనులపై చేస్తున్న వైనాన్ని ‘గంధపు చెక్కలు’లో చిత్రీకరించారు. మైదాన ప్రాంతపు సంపన్నులు, విప్లవకారులు, పోలీసుల నడుమ ఖమ్మం సరిహద్దుల్లోని గిరిజనుల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో ‘సమిధలు’, ‘మూగజీవాలు’ కథల్లో బొమ్మ కట్టించారు. కాంతారావు మాత్రమే రాయగలిగిన కథ ‘పూసుగూడెం రాజులు’. గట్టు తెగిన ఊరు, నాన్న పోయిన తర్వాత, అంతులేని పయనం ఆకట్టుకుంటాయి. గూనపెంకుల ఇల్లు, రాతెండి సర్వ, వర్రగాలి, పారుటాకుల విస్తళ్లు, తాటితోపులు, బ్రహ్మంగారి తత్వాలు, మెట్ట తాబేళ్లు, ఆరగట్టిన నాటుపొగాకు, చల్లకవ్వాలు... ఈ తరం విస్మరిస్తున్న ఎన్నో పల్లెపదాల సౌకుమార్యం ఈ కథలకు అదనపు సొగసు. - భాస్వంత్ సస్పెన్స్ కథలు పేజీలు: 48 వెల: 50 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ. పుస్తకం : థ్రిల్లర్స్ (కథలు); రచన : రేణిగుంట ఉత్తమ్ విషయం : పది థ్రిల్లింగ్ కథల చిన్న సంపుటమిది. తెలుగులో ఈ రకమైన కథలు రాసినవాళ్లు తక్కువ. ప్రతి కథా ఉత్కంఠతో నడుస్తుంది. సంపుటిలో ఒకటి రెండు దెయ్యాల కథలున్నాయి, భయపెట్టడానికి. ‘ద్రోహం’, ‘ఖలుడు’ కథల్లో ఎక్కడా బిగి సడలదు. ‘కుట్ర’ కథావస్తువు కృష్ణదేవరాయల కాలం నాటిది. రాజమందిరాల్లో జరిగే కుట్రలను తెలియజేస్తుంది. ఇలాంటి కథలను రాయాలంటే క్రిమినల్ సైకాలజీతో పాటు, సైన్స్‌కి సంబంధించిన విషయాలు కూడా తెలియాలి. రచయితకి ఆ పరిజ్ఞానం పుష్కలంగా ఉంది. - రామాంజనేయులు విలువలకు ఊపిరిలూదే కథలు పేజీలు: 112 వెల: 60 పుస్తకం : నేనున్నాగా (కథలు) రచన : రంగనాథ రామచంద్రరావు విషయం : కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు, టీవీ నటుడు రంగనాథ రామచంద్రరావు కలం నుండి జాలువారిన మూడో కథాసంపుటిది. మొత్తం పది కథలున్నాయి. వాస్తవికతకు ప్రాధాన్యతనిస్తూ, సన్నివేశాలను దృశ్యమానం చేస్తూ కాల్పనిక శక్తితో కథల్లో రీడబిలిటీని పెంచుకుంటూ పాఠకుణ్ని తీయని అనుభూతిలోకి లాక్కుపోయే తత్వమున్నవి వీరి కథలు. ఉత్పత్తి సంబంధాల్లో తీవ్రమైన మార్పులు కలుగుతున్నాయి. కథాశిల్పంలో తగిన విధంగా మార్పులు చోటు చేసుకోవడం లేదనే చెప్పొచ్చు. రామచంద్రరావు కథలు ఆత్మీయ సంబంధాలకు అద్దం పట్టే విధంగా నడిచాయి. ‘థామస్ మన్రో మళ్లీ చచ్చిపోయాడు’ కథ తెల్లవాండ్ల పాలన దగ్గర నుంచి నల్లవాళ్ల పాలనలో జరుగుతున్న దోపిడీ దౌర్జన్యాలనూ చర్చించింది. వృద్ధులు ఇంట్లో నిరాదరణకు గురవుతున్న రోజుల్లో కోడలు మామ మంచం దగ్గరకు వెళ్లి ‘నేనున్నాగా’ అంటూ తల్లిలా ఒడిలోకి తీసుకోవడం హృదయాల్ని కదిలిస్తుంది. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి కొత్త పుస్తకాలు క్రికెట్ అండ్ లవ్ (నవల) రచన: బి.ఎస్.జగదీశ్ పేజీలు: 136; వెల: 100 ప్రతులకు: రచయిత, 2-2-18/17, డిడి కాలనీ, బాగ్ అంబర్పేట్, హైదరాబాద్-13. ఫోన్: 040-27426521 నందికొటుకూరి సిద్ధ యోగి ప్రణీత యోగీశ్వర విలాసము (ద్విపద) పరిష్కర్త: వైద్యం వేంకటేశ్వరాచార్యులు పేజీలు: 260; వెల: 120 ప్రతులకు: పరిష్కర్త, ప్లాట్ 167, ఇం.నం. 87/1246, శ్రీకృష్ణ నిలయం, మేడపైన, రెవెన్యూ కాలనీ, కర్నూలు-2; ఫోన్: 9989679681 నా తిరుపతి యాత్ర రచన: తెల్లమేకల శ్రీనివాసరావు పేజీలు: 108; వెల: 70 ప్రతులకు: రచయిత, ఎన్ఎస్పి కాలనీ మెయిన్ రోడ్, 29-829/2, వినుకొండ, గుంటూరు. ఫోన్: 9030637270 తెలంగాణ ఆత్మఘోష (వ్యాసాలు) రచన: గడ్డం కేశవమూర్తి పేజీలు: 204; వెల: అమూల్యం ప్రతులకు: 4-7-138/1, కుమార్‌పల్లి, హన్మకొండ-1. ఫోన్: 8008794162 సత్యాన్వేషణ రచన: మల్లవరపు విజయ పేజీలు: 142; వెల: 250 ప్రతులకు: రచయిత్రి, కేరాఫ్ డి.భీమన్న, ఏపీఎస్ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్, షాప్ నం.24, నిజామాబాద్ బస్‌స్టేషన్, నిజామాబాద్; ఫోన్: 9989326248 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట్, హైదరాబాద్-36; ఫోన్: 040-27678430 -
పుస్తక సమీక్షణం
అయిదు పదుల సినీ సంగీత ప్రయాణం పుస్తకం : స్వర్ణయుగ సంగీత దర్శకులు (1932-82) జానర్ : నాన్ ఫిక్షన్ రచన : పులగం చిన్నారాయణ పేజీలు: 760 వెల: రూ.500 ప్రతులకు: రచయిత, ప్లాట్ నం.89, ఎఫ్-2, రాధా సదన్, బాలాజీ స్వర్ణపురి కాలనీ, మోతీనగర్ దగ్గర, హైదరాబాద్-18 సినీ జర్నలిస్టుగా పనిచేస్తూ, ఎన్నో మజిలీల మధ్య పద్నాలుగేళ్ల కాలంలో చిన్నారాయణ చేసిన నాలుగో పుస్తక రచన ఇది. అనుభవజ్ఞులను అడగడానికీ, తప్పొప్పులు తెలుసుకోవడానికీ, తానే అడిగి మరీ దిద్దించుకోవడానికీ, మొహమాట పెట్టయినా సరే ఆ విషయంలో తనకు కావాల్సిన పని చేయించుకోవడానికీ చిన్నారాయణ ఎప్పుడూ చిన్నతనంగా భావించలేదు. ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ అందుకు తాజా సాక్ష్యం. టాకీల తొలినాళ్ల నాటి హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి, గాలి పెంచల నరసింహారావుల నుంచి సుసర్ల దక్షిణామూర్తి, ఘంటసాల, పెండ్యాల మీదుగా నిన్నటి చక్రవర్తి, ఇళయరాజాల దాకా ప్రసిద్ధ సంగీత దర్శకుల జీవితాన్ని ఈ పుస్తకంలో ఇమిడ్చారు. వాళ్ల ప్రయాణంలోని మేలి మలుపులను కళ్లముందు నిలిపేందుకు ప్రయత్నించారు. వారి చిరస్మరణీయ గీతాల చిట్టా ఇచ్చారు. అపూర్వమైన ఛాయాచిత్రాలను పొందుపరిచారు. వెరసి, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ విడుదలై 1932 (ఫిబ్రవరి 6) నుంచి 1982 వరకు యాభై ఏళ్ల తెలుగు సినీ సంగీతానికి ఓ రిఫరెన్స్ గ్రంథం చేశారు. మొదటి ముద్రణలో ఉన్న 30 మంది సంగీత దర్శకులకు సరికొత్తగా వివరాలు కలిపారు. లేని మరో 30 మంది గురించి కొత్తగా అందించారు. ఆర్.సుదర్శన్ - గోవర్ధనం, బి.శంకర్ లాంటి దర్శకుల గురించి వివరంగా రాశారు. పేర్లే తప్ప సినీ సంగీత ప్రియుల్లో కూడా చాలామందికి వివరాలు తెలియని ప్రభల సత్యనారాయణ, అద్దేపల్లి రామారావు, వింజమూరి అనసూయ - సీత, టి.జి.లింగప్ప, ఎ.ఎ.రాజ్ తదితరుల గురించి ఈ మలి ముద్రణలో అచ్చేశారు. - డా॥రెంటాల జయదేవ మరోసారి చైనా... పుస్తకం : చైనా- వంద ప్రశ్నలు జవాబులు జానర్ : నాన్ ఫిక్షన్ అనువాదం : జి.సత్యనారాయణరెడ్డి పేజీలు: 190 వెల: 75 ప్రతులకు: పోరునేల, వినమ్రత క్లాసిక్స్, ఫ్లాట్ 201, రోడ్ 1, అల్కాపురి, హైదరాబాద్-35. ఫోన్: 9912072601 విషయం : ‘అక్కడెక్కడో చైనాలో వర్షం కురిస్తే, ఇక్కడ మన కమ్యూనిస్టులు గొడుగులెత్తుతారు’; ‘చైనా ఛైర్మన్‌కు జలుబు చేస్తే మన కమ్యూనిస్టులకు తుమ్ములొస్తాయి’; ఇలాంటి సరదా అనధికార సామెతలు ఎన్నో విని నవ్వుకున్నవాళ్లం. ఒకానొక కాలంలో రష్యా, చైనాలతో మనకు బీరకాయ పీచు సంబంధం కాదు; రక్తబంధం లాంటిదేదో ఉండేది. అక్కడి మనుషులు, భౌగోళిక స్థితిగతులు, రాజకీయ వ్యూహాలు, సాహిత్యం...ఇలా సమస్త విషయాలు మన ఆసక్తికర జాబితాలో పెద్ద పీట వేసుకొని కూర్చునేవి. రష్యా, చైనాల్లో సోషలిజం బిక్కముఖం వేశాక, ఆ తరువాత గల్లంతయ్యాక, ఇక ఆ ఆసక్తి ఆచూకి లేకుండా పోయింది. అయినా సరే, రష్యా మీదో చైనా మీదో ఎవరైనా ఏదైనా రాస్తే సరికొత్త ఆసక్తేదో మొలకలెత్తుతుంది. ‘చైనా వంద ప్రశ్నలు జవాబులు’ పుస్తకం చూస్తే కూడా. ‘ఈరోజు చైనా ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. గత 30 సంవత్సరాల కాలంలో, అది సాధించిన అపూర్వమైన ఆర్థికాభివృద్ధి ఆ చర్చలో కేంద్రబిందువుగా ఉంటున్నది’ అంటున్న రచయిత చైనాలోని ప్రస్తుత స్థితి గతులను పుస్తకంలో వివరించారు. దీనికి ఆయన ‘చైనా అధికారిక సమాచారం’ మీద మాత్రమే ఆధారపడ్డారు. నిజానికి పేచీ ఇక్కడే వస్తుంది. గణాంకాలకు ఎలాగైతే వక్రీకరణ తెలివితేటలు ఉంటాయో ప్రభుత్వ అధికారిక సమాచారానికీ అంతే ఉంటుంది. ‘ప్రామాణికత’ ‘వాస్తవాలు’ సంగతి పక్కన పెడితే ప్రస్తుత చైనా తన గురించి తాను (వ్యవసాయం నుంచి ద్రవ్య వ్యవస్థలో సంస్కరణల వరకు) ఏమి చెప్పుకుంటుందో ఈ పుస్తకంలో చదువుకోవచ్చు, చర్చ చేయవచ్చు. - యాకుబ్ పాషా కొత్త పుస్తకాలు ఏకలవ్య ప్రబంధం రచన: డా.ఆమళ్లదిన్నె వేంకటరమణ ప్రసాద్ పేజీలు: 128; వెల: 40 ప్రతులకు: రచయిత, 3/696, రామాలయం దగ్గర, సోమనాథ నగర్, అనంతపురం-4. ఫోన్: 9440596127 శకుంతల (పద్యకావ్యం) రచన: డా. అయాచితం నటేశ్వరశర్మ పేజీలు: 152; వెల: 200 ప్రతులకు: రచయిత, 7-136/9, నిజాంసాగర్ రోడ్, కామారెడ్డి-503111. ఫోన్: 9440468557 స్కాంద పురాణాంతర్గత శ్రీ శివలీలా విలాసము రచన: డా. మంగళగిరి వేణుగోపాలాచార్యులు పేజీలు: 326; వెల: 500 ప్రతులకు: రచయిత, ఆర్/ఒ బాలినేపల్లి, మొల్కచర్ల పోస్టు, నల్లగొండ. ఫోన్: 9963955454 ఆమె అతడిని మార్చుకుంది (నవల) రచన: అంగులూరి అంజనీదేవి పేజీలు: 286; వెల: 100 ప్రతులకు: మధుప్రియ పబ్లికేషన్స్, మాచవరం, విజయవాడ-4. ఫోన్: 0866-2431969 నవ్వుతున్న నేలతల్లి (కథలు) రచన: కటుకోజ్వల మనోహరాచారి పేజీలు: 114; వెల: 80 ప్రతులకు: వసుధ, 5-3-190, సాయిరాం నగర్, కోరుట్ల, కరీంనగర్-505326. ఫోన్: 9441023599 ఆలోచింపజేసే కథలు రచన: మొండెపు ప్రసాద్ పేజీలు: 112; వెల: 60 ప్రతులకు: విక్టరీ పబ్లిషర్స్, 30-17-18, వారణాశి వారి వీధి, సీతారాంపురం, విజయవాడ-2. ఫోన్: 0866-2444156 -
మొక్కక తప్పని చిల్లర దేవుళ్లు
లంబాడోళ్లు ఊరి మీద పడ్డారు. పెద్ద పెద్ద బాణాకర్రలు పట్టుకుని, జొన్నపిండి మూట గట్టుకుని, పిల్లా జల్లా ముసలీ ముతకా అంతా ఊరి మీద పడ్డారు. కరణం ఇంటి ముందు బైఠాయించారు. కరణం తండ్రి గతంలో వాళ్లకు ఠస్సా ఇచ్చాడు. డబ్బు తీసుకొని భూమి ఎగ్గొట్టాడు. కరణం చేతిలో ఇప్పుడు అధికారం ఉంది. తలుచుకుంటే భూమి ఇవ్వగలడు. కాని లంబాడోళ్లకు న్యాయంగా రావల్సిన భూమిని అతడు ఊరి పెద్ద నారయ్యకు అమ్ముకున్నాడు. దాని రాబడి అంతా నారయ్యే తింటున్నాడు. పాపం నోరులేని లంబాడోళ్లు. డబ్బూ పోయి భూమీ పోయి. అందుకే ఐసల్ ఫైసల్ తేల్చుకుందామని ఉగ్రంగా ఊరి మీద పడ్డారు. ఇది తెలిసి కరణం గడగడా వొణికి ఇంట్లో దబ్కాయించాడు. ఊరి జనం తలుపులు బిడాయించుకుని సందుల్లో నుంచి భయం భయంగా మిర్రిమిర్రి చూస్తున్నారు. ఏ క్షణాన ఏదైనా జరగొచ్చు. కరణం ప్రాణాలు తీయడం ఖాయం. కాని ఆశ్చర్యం. తలుపు తీసుకుని కరణం ధైర్యంగా బయటకు వచ్చాడు. ‘ఏంరా లంజకొడుకుల్లారా. ఇంటి మీదకి హమ్ల చేయడానికి వస్తార్రా’ అని మీసం దువ్వాడు. ‘అదిగో కరణం’ అని లేచారు లంబాడోళ్లు. ఢాం. పిస్తోలు పేలింది. లంబాడోళ్లు అదిరిపడ్డారు. అమీన్ సాబ్. పోలీసులు. ఢాం... ఢాం... పేల్చుకుంటూ ఊడిపడ్డారు. దొరికినవాణ్ణి దొరికినట్టు తన్నారు. ఆడవాళ్ల సిగలు పట్టుకొని గుంజారు. చెట్లకు కట్టేశారు. కరణం అమీన్ సాబ్‌కు సారాయి పోయించి, విషం ఎక్కించి, చూపు ఆడవాళ్ల మీదకు పోనిచ్చాడు. ఒక లంబాడాది. మంచి వయసు మీద ఉన్నది. చచ్చింది. దాని మొగుడు? చచ్చాడు. అమీన్ సాబ్ ఇదంతా ఊహించలేదు. ఊరి మీదకు లంబాడోళ్లు వచ్చారు... ఇంటికొక రూపాయి ఇప్పిస్తాను... రక్షణగా రండి అని కరణం అంటే వచ్చాడు. ఆ చిల్లర ఇక్కడి దాకా తెచ్చింది. పోతే పోయాయి దిక్కులేని ప్రాణాలు. చిల్లరైతే చేతికి దక్కింది. ఇదీ- చిల్లర దేవుళ్లు నవలలో ఒక భయానక సన్నివేశం. ఏం బతుకులు అవి. నైజాం పాలకుని కాలంలో బతుకులు. పటేళ్లు, పట్వారీలు, దేశ్‌ముఖ్‌లు, దేశ్ పాండ్యాలు, భూస్వాములు.... అంతా పీక్కు తింటున్నారు. మూలవిరాట్టు- నైజాం నవాబు- పేరు చెప్పి ఈ చిల్లర దేవుళ్లందరూ ఊరేగుతున్నారు. వీరితో పోలీసులు మిలాఖాత్. దొర రామారెడ్డి తక్కువ తినలేదు. ఆ ఊరికి పేరు లేని దేవుడతడు. గడి కట్టుకొని, చేతిలో కొరడా పట్టుకొని, మదార్ సాబ్ వంటి కిరాతకులను రక్షణగా ఉంచుకొని, కరణం వంటి గుంటనక్కను పక్కన పెట్టుకొని... ఊరి మనుషులు బానిసలు. నీ బాంచన్ అని మోకాళ్ల మీదకు వొంగి, అరి చేతులను నేల మీద ఆనించి, ఆ మట్టిని ముఖానికి రాసుకుంటే తప్ప దొర దర్శనం ఇవ్వడు. రెండు కుండల గింజలు కావాలంటే దొరకు మొక్కాలి. సర్కారు తోపులో నాలుగు చింతకాయలు తెంపాలంటే దొరకు మొక్కాలి. పిల్లకు లగ్గం చేయాలంటే మొక్కాలి. ఏదైనా తకరారు వస్తే మొక్కాలి. భార్య, ఎదిగి ఏపుగా తయారైన కుమార్తె మూడో కంటికి కనపడరు. కాని ఊరి ఆడవాళ్లందరూ దొర కంట్లో పడాలి. వారు చల్లంగుండాలంటే దొరను చల్లబరచాలి. ఎక్కువ నచ్చితే గడిలో ఉంచుకుంటాడు. లేదంటే ఆడబాపను చేస్తాడు. ఆడబాప అంటే దాసి. అతిథుల శరీర సౌఖ్యాలను కూడా చూడాల్సిన బానిస. వనజ! ఎంత చక్కనిది. ఆ గడిలో ఆడబాప. పాపం దాని తల్లి ఎవరో. దొరే చెరబట్టాడు. కూతురు పుడితే కనికరం లేకుండా ఆడబాపను చేశాడు. అందరికీ తెలిసిన పాపాలు ఇవి. కాని ఎవరూ ఏమనకుండా నోరు కుట్టుకుని ఉండాలి. కరణం మాత్రం తక్కువా? మొగుణ్ణే బొందల పెట్టి వాని భార్యను ఇంట్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ హైద్రాబాద్ దాకా పోతాయా? దర్బార్ వరకూ చేరుతాయా? ఆలా హజ్రత్- నిజామ్ ఉల్ ముల్క్- సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు తెలుస్తాయా? ఈ గొడవ ఇలా ఉండగా అసలు దేవుళ్ల గొడవ ఇంకొకటి. ఇంత పెద్ద హైద్రాబాద్ స్టేట్, ఇంత పెద్ద ‘తురక’ పాలన, కాని రాష్ట్రంలో ఇంకా హిందువులు కనిపిస్తున్నారే. బ్రాహ్మణులు, వెలమలు, రెడ్లు, యాదవులు, గౌండ్లు... కడాన మాలలు, మాదిగలు. అల్లాహ్ పర్వర్దిగార్ వెలుగు వీరిని చేరదా? ఇస్లాం అజాన్ వీరికి వినిపించదా? తమ సరసన కూచోబెట్టుకోకుండా తాకితే మైల అని, చదువుకుంటే చెవుల్లో సీసం పోస్తామని, ఎదురు తిరిగితే కోసి పాతరేస్తామని హిందువులు అణచి ఉంచిన దళితులను కదా మొదట విముక్తం చేయాల్సింది. నిజాం తలపోత ఏదైనా చుట్టూ ఉండే చిల్లర దేవుళ్లు ఇస్లాం మార్పిడులు మొదలుపెట్టారు. మగాళ్ల మొలతాళ్లు తెంచి, తలలు గొరిగి, ఆడవాళ్ల మంగళ సూత్రాలు తెంచి, బొట్టు చెరిపి, వాళ్లను ఇస్లాంలోకి తెచ్చే పని. రెండు మంచి నీటి బావులు, నాలుగు కొత్త బట్టలు ఇస్తే దరిద్రులకు ఏ మతమైతే ఏంటి? ఇది క్రియ. దానికి ప్రతిక్రియ? చాలా సులభం. రాత్రికి రాత్రి రావడం. సీసాలో నుంచి కాసింత గంగా జలం మీద చిలకరించడం. మళ్లీ హిందువులను చేయడం. మన అల్లాహ్ గొప్పవాడు. మన హిందూమతానికి వేల ఏళ్లు. ఏ దేవుడు ఎలాగున్నా డబ్బున్న ముస్లిం మాసిన గడ్డాం వాణ్ణి కావలించుకోడు. పై కులంవాడు మాదిగ సరసన కూచుని ముద్ద ముట్టడు. చిల్లర బతుకులు ఎప్పటికీ చిల్లర బతుకులే. ఇత్తహాదుల్ ముస్లమీన్ పుట్టింది. ప్రతిగా ఆర్య సమాజ్ ఆవిర్భవించింది. హిందూ మతానికి ఆలంబనగా తెలుగు భాష పేరున ఆంధ్ర జన సంఘం ఊపిరిపోసుకుంది. దేవుళ్ల హస్తముద్రల కింద, చిల్లర దేవుళ్ల ఇనప పాదాల కింద పుటపుటమని నలిగిపోతున్న జనం హాహాకారాలు. ఇదంతా ఈ నవల కళ్లకు కట్టినట్టు చూపుతుంది. పాత తెలంగాణ పల్లెల్లోకి చేయి పట్టుకుని నడిపించుకుని- వారి వేష, భాష, రీతి, రివాజు, మోటు మనుషుల మానవత్వం, మెత్తనివాళ్ల దుర్మార్గ స్వభావం, అధికారం పేరు చెప్పి పీల్చి పిప్పి చేసే వ్యవస్థ, మిగిలిన అరా కొరా దేవుడి హుండీలో. ఇదంతా కళ్లకు కట్టినట్టు చూపుతుంది. ఈ దుర్మార్గం నుంచి విముక్తి ఎప్పుడు? తమసోమా జ్యోతిర్గమయ ఎప్పుడు? అని వేదనతో చేసిన అక్షర ఆక్రందన ఈ నవల. ఏళ్లు గడిచిపోయాయి. ఇవాళ పాలనలో ఆంధ్ర పెత్తనం ఎక్కువైందని తెలంగాణ ఉద్యమం వచ్చింది. గతంలో హైద్రాబాద్ పాలనలో ముస్లింల పెత్తనం ఎక్కువైందనే ముఖ్యకారణాన నిజాం వ్యతిరేకత ఊపిరిపోసుకుంది. రాష్ట్రాలు విడిపోవచ్చు. కొత్త రాజధానులు ఏర్పడవచ్చు. కాని ఏలికలు మారరు. పాలకులు మారరు. చిల్లర దేవుళ్లూ మారరు. ఇవాళ బీదా బిక్కీ దేశాలను, వారి ఖనిజాలను, వారి ఇంధనాన్ని పీల్చి పిప్పి చేసి బెదిరించి అవసరమైతే అభయ హస్తం చూపించి ఆ చిల్లర మీద బతికే అతిపెద్ద మెగా చిల్లర దేవుడిగా అమెరికా ఆవిర్భవించింది. దీనిని కాచుకోవడం ఒకవైపు. మరోవైపు ఈ ప్రపంచంలో ఇంకా వేరే మతాలు ఉన్నాయా ఇది ఎలా సాధ్యం అని డాలర్లు కుమ్మరించే అగ్రరాజ్యాల క్రిస్టియన్ ఆసాములూ, రాత్రికి రాత్రి అంతా ఇస్లాంలోకి మారిపోలేదేమిటబ్బా అని దినార్లను ముష్టి రాల్చే అరబ్బు పెద్దలూ, మన హిందూ మతానికి ఈ గతి ఏమిరా అని బోరోమని ఏడ్చి, చానెళ్లతో కలిసి అక్కడా ఇక్కడా ఉన్న బీదాబిక్కీలను తిరిగి తమ పవిత్ర గంగాజల పరంపరలోకి తెచ్చే సరికొత్త స్వామీజీలూ... వీరిని కాచుకోవడం ఇంకో వైపు. ఎవరు ఏం చేసినా కథ మాత్రం అంతే. నోరులేనోళ్ల బతుకులంతే. మనిషికి చదువు కావాలని, వికాసం కావాలని, వాడు జ్ఞానం తెచ్చుకుని, ఒకరికి లొంగని బతుకు బతుకుతూ, నలుగురి హితం కోరుతూ, తనలోని దైవాన్ని- తాను తెలుసుకోదగ్గ దైవాన్ని- తెలుసుకునే రోజూ సమాజమూ ఏర్పడనంత కాలమూ ‘చిల్లర దేవుళ్లు’ చిరంజీవి. -
సమీక్షణం: ప్రవాహ పదధ్వని విందాం...
పేజీలు: 202; వెల: 150 ప్రతులకు: లిఖిత ప్రెస్, కేరాఫ్ వై.నిర్మల, హెచ్ఐజి-2, బ్లాక్-12, ఫ్లాట్-1, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-44; ఫోన్: 040-27660000 పుస్తకం : {పవాహం జానర్ : నాన్ఫిక్షన్/వ్యాసాలు రచన : సజయ విషయం : మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే?! ‘మౌనం’ అర్థంగీకారం కాదు. అనర్థదాయకం. ఈ పుస్తకంలో మనకు అలాంటి ‘మౌనం’ ఎక్కడా తారసపడదు. ఒక ప్రవాహ శబ్దం నలుదిశలా వినిపిస్తుంది. మనల్ని మనలోకి, లోకాన్ని మనలోకి తీసుకెళుతుంది. స్త్రీవాద ఉద్యమాల్లో పని చేస్తున్న సజయ వివిధ సందర్భాలలో సామాజిక విషయాలపై చేసిన చర్చలు, ఆలోచనలు, కార్యచరణ... ఈ పుస్తకానికి పునాది. పడికట్టు సైద్ధాంతిక పదాలు లేకుండా స్పష్టమైన వాక్యాలతో రాయడం బాగుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న కథలు చదివిననట్లుగా ఉంటుంది. ఈ పుస్తకంలో ఆయా సందర్భాలకు చెందిన వ్యాసాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భాలేవి గతం కాదు. వర్తమానంలోనూ వాటి ‘కాలం’ తీరిపోయేది కాదు. రచయిత్రి వ్యక్తిగత అనుభవాలు కూడా ఆసక్తి దాయకంగా ఉన్నాయి. ఉదా: ఏది ప్రధానం? ఏది అప్రధానం? (పే:7) నాటకాల దగ్గరి నుంచి చట్టాల వరకు ఎన్నో సామాజిక విషయాల వరకు చర్చించిన వ్యాసాలివి. రోజు వారి జీవితంలో మనకు కనిపించని చీకటిని ఈ అక్షరాల వెలుగులో చూడొచ్చు. - వై.పి. సందేశాత్మక కథాసుగంధం పేజీలు: 108; వెల: 60 ప్రతులకు: రచయిత, 9-59, రవినగర్, వేపగుంట పోస్ట్, విశాఖపట్నం-47ఫోన్: 9437581728 పుస్తకం : గంధం చెట్టు జానర్ : ఫిక్షన్/ కథలు రచన : గన్నవరపు నరసింహమూర్తి విషయం : సమకాలీన సమస్యల సందేశాత్మక 15 కథల సంపుటి ‘గంధం చెట్టు’. వీటిలో నక్సలైట్ ఉద్యమాల మూలాలు సామాజిక రుగ్మతల్లో ఉన్నాయని ‘మోదుగు పూలు’, ‘పులి చంపిన లేడి నెత్తురు’ల్లో చిత్రించాడు. పోలీస్ అధికారి తొందరపాటు వల్ల చనిపోయిన వ్యక్తి సోదరుడి చదువును బాధ్యతగా భావించడం చక్కని పరిష్కారంతో కూడిన ముగింపు. సాఫ్ట్వేర్ భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాల కథనం ‘మంచు గోడలు’. భార్య పదోన్నతి వల్ల దంపతుల్లో తారాస్థాయికి చేరిన మనస్పర్థలు, భర్త సంయమనంతో మంచు గోడల్లా కరిగిపోయాయన్న ముగింపు సందేశాత్మకంగా ఉంది. ‘ఊబి’ కథలో అమెరికా ఆర్థిక మాంద్యం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో వచ్చిన అభద్రతాభావాన్ని చిత్రించాడు. శీర్షిక కథ ‘గంధం చెట్టు’లో అయ్యర్ పాత్రను మానవతకు నిలువెత్తు నిదర్శనంగా చిత్రించాడు. కథలన్నింటా మానవ సంబంధాల గుణాత్మక మార్పులు గుబాళిస్తున్నాయి. - డా॥పి.వి.సుబ్బారావు నిత్యజీవితంలో భారతం పేజీలు: 136 వెల: 150 పుస్తకం : మనస్సాక్షి మహాభారతం జానర్ : నాన్ఫిక్షన్/వ్యాసాలు రచన : డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ విషయం : ‘మహాభారతంలో ఉన్నదే మానవలోకంలో ఉంది. మానవలోకంలో ఉన్నదే మహాభారతంలో ఉంది’ అంటూ నిత్యజీవితానికి పనికొచ్చే సందేశాలను మూడేళ్లపాటు సాక్షి పాఠకులకు అందించారు రచయిత. తానెంచుకున్న ఇతివృత్తాలన్నీ భారతంలోనుంచే కాబట్టి, ‘మనస్సాక్షి మహాభారతం’గా పుస్తక రూపమిచ్చారు. ‘జీవన భారతం’తో ఆరంభించిన ఈ పుస్తకంలో 90కి పైగా భారతేతర అంశాలున్నాయి. తొలేకాదశి, వినాయకచవితి, విజయదశమి లాంటి పర్వదినాల ఆసక్తికర విశేషాలు పొందుపరిచారు. - డి.వి.ఆర్. కొత్త పుస్తకాలు గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు రచన, కూర్పు: సి.హెచ్.హరిబాబు పేజీలు: 642; వెల: 300 ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌజ్, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107 అంతటి నరసింహం నవలలు - సంఘ సంస్కరణ దృక్పథం రచన: డా.పోతిరెడ్డి చెన్నకేశవులు పేజీలు: 132; వెల: 100 ప్రతులకు: సి.ఇందిర, 34/బి, పి.ఎస్.నగర్, హైదరాబాద్-57. ఫోన్: 040-23347433 1. అమ్మా నాన్న పిల్లలు (వ్యాసాలు) పేజీలు: 42; వెల: 50 2. నా మినీ కథలు పేజీలు: 50; వెల: 50 రచన: ఎనుగంటి వేణుగోపాల్ ప్రతులకు: ఎ.అంజలి, ఇం.నం. 1-3-168/1, కృష్ణానగర్, జగిత్యాల, కరీంనగర్-505327 శ్రీ సాధన కవిత్వం (1926-1947) సంకలనం: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి పేజీలు: 112; వెల: 40 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు ప్రతులకు: శ్రీ లలితా త్రిపురసుందరీ ధార్మిక పరిషత్, 76-8/1-28, లలితానగర్, భవానీపురం, విజయవాడ-12. ఫోన్: 0866-2414322. -
సమీక్షణం: ప్రవాహ పదధ్వని విందాం...
పేజీలు: 202; వెల: 150 ప్రతులకు: లిఖిత ప్రెస్, కేరాఫ్ వై.నిర్మల, హెచ్ఐజి-2, బ్లాక్-12, ఫ్లాట్-1, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-44; ఫోన్: 040-27660000 పుస్తకం : {పవాహం జానర్ : నాన్ఫిక్షన్/వ్యాసాలు రచన : సజయ విషయం : మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే?! ‘మౌనం’ అర్థంగీకారం కాదు. అనర్థదాయకం. ఈ పుస్తకంలో మనకు అలాంటి ‘మౌనం’ ఎక్కడా తారసపడదు. ఒక ప్రవాహ శబ్దం నలుదిశలా వినిపిస్తుంది. మనల్ని మనలోకి, లోకాన్ని మనలోకి తీసుకెళుతుంది. స్త్రీవాద ఉద్యమాల్లో పని చేస్తున్న సజయ వివిధ సందర్భాలలో సామాజిక విషయాలపై చేసిన చర్చలు, ఆలోచనలు, కార్యచరణ... ఈ పుస్తకానికి పునాది. పడికట్టు సైద్ధాంతిక పదాలు లేకుండా స్పష్టమైన వాక్యాలతో రాయడం బాగుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న కథలు చదివిననట్లుగా ఉంటుంది. ఈ పుస్తకంలో ఆయా సందర్భాలకు చెందిన వ్యాసాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భాలేవి గతం కాదు. వర్తమానంలోనూ వాటి ‘కాలం’ తీరిపోయేది కాదు. రచయిత్రి వ్యక్తిగత అనుభవాలు కూడా ఆసక్తి దాయకంగా ఉన్నాయి. ఉదా: ఏది ప్రధానం? ఏది అప్రధానం? (పే:7) నాటకాల దగ్గరి నుంచి చట్టాల వరకు ఎన్నో సామాజిక విషయాల వరకు చర్చించిన వ్యాసాలివి. రోజు వారి జీవితంలో మనకు కనిపించని చీకటిని ఈ అక్షరాల వెలుగులో చూడొచ్చు. - వై.పి. సందేశాత్మక కథాసుగంధం పేజీలు: 108; వెల: 60 ప్రతులకు: రచయిత, 9-59, రవినగర్, వేపగుంట పోస్ట్, విశాఖపట్నం-47ఫోన్: 9437581728 పుస్తకం : గంధం చెట్టు జానర్ : ఫిక్షన్/ కథలు రచన : గన్నవరపు నరసింహమూర్తి విషయం : సమకాలీన సమస్యల సందేశాత్మక 15 కథల సంపుటి ‘గంధం చెట్టు’. వీటిలో నక్సలైట్ ఉద్యమాల మూలాలు సామాజిక రుగ్మతల్లో ఉన్నాయని ‘మోదుగు పూలు’, ‘పులి చంపిన లేడి నెత్తురు’ల్లో చిత్రించాడు. పోలీస్ అధికారి తొందరపాటు వల్ల చనిపోయిన వ్యక్తి సోదరుడి చదువును బాధ్యతగా భావించడం చక్కని పరిష్కారంతో కూడిన ముగింపు. సాఫ్ట్వేర్ భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాల కథనం ‘మంచు గోడలు’. భార్య పదోన్నతి వల్ల దంపతుల్లో తారాస్థాయికి చేరిన మనస్పర్థలు, భర్త సంయమనంతో మంచు గోడల్లా కరిగిపోయాయన్న ముగింపు సందేశాత్మకంగా ఉంది. ‘ఊబి’ కథలో అమెరికా ఆర్థిక మాంద్యం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో వచ్చిన అభద్రతాభావాన్ని చిత్రించాడు. శీర్షిక కథ ‘గంధం చెట్టు’లో అయ్యర్ పాత్రను మానవతకు నిలువెత్తు నిదర్శనంగా చిత్రించాడు. కథలన్నింటా మానవ సంబంధాల గుణాత్మక మార్పులు గుబాళిస్తున్నాయి. - డా॥పి.వి.సుబ్బారావు నిత్యజీవితంలో భారతం పేజీలు: 136 వెల: 150 పుస్తకం : మనస్సాక్షి మహాభారతం జానర్ : నాన్ఫిక్షన్/వ్యాసాలు రచన : డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ విషయం : ‘మహాభారతంలో ఉన్నదే మానవలోకంలో ఉంది. మానవలోకంలో ఉన్నదే మహాభారతంలో ఉంది’ అంటూ నిత్యజీవితానికి పనికొచ్చే సందేశాలను మూడేళ్లపాటు సాక్షి పాఠకులకు అందించారు రచయిత. తానెంచుకున్న ఇతివృత్తాలన్నీ భారతంలోనుంచే కాబట్టి, ‘మనస్సాక్షి మహాభారతం’గా పుస్తక రూపమిచ్చారు. ‘జీవన భారతం’తో ఆరంభించిన ఈ పుస్తకంలో 90కి పైగా భారతేతర అంశాలున్నాయి. తొలేకాదశి, వినాయకచవితి, విజయదశమి లాంటి పర్వదినాల ఆసక్తికర విశేషాలు పొందుపరిచారు. - డి.వి.ఆర్. కొత్త పుస్తకాలు గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు రచన, కూర్పు: సి.హెచ్.హరిబాబు పేజీలు: 642; వెల: 300 ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌజ్, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107 అంతటి నరసింహం నవలలు - సంఘ సంస్కరణ దృక్పథం రచన: డా.పోతిరెడ్డి చెన్నకేశవులు పేజీలు: 132; వెల: 100 ప్రతులకు: సి.ఇందిర, 34/బి, పి.ఎస్.నగర్, హైదరాబాద్-57. ఫోన్: 040-23347433 1. అమ్మా నాన్న పిల్లలు (వ్యాసాలు) పేజీలు: 42; వెల: 50 2. నా మినీ కథలు పేజీలు: 50; వెల: 50 రచన: ఎనుగంటి వేణుగోపాల్ ప్రతులకు: ఎ.అంజలి, ఇం.నం. 1-3-168/1, కృష్ణానగర్, జగిత్యాల, కరీంనగర్-505327 శ్రీ సాధన కవిత్వం (1926-1947) సంకలనం: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి పేజీలు: 112; వెల: 40 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు ప్రతులకు: శ్రీ లలితా త్రిపురసుందరీ ధార్మిక పరిషత్, 76-8/1-28, లలితానగర్, భవానీపురం, విజయవాడ-12. ఫోన్: 0866-2414322. -
కొత్త పుస్తకాలు: కస్తూరి పంచే మనిషి
శాఖమూరు రామగోపాల్ తెలుగు రచయితలకు తెలియడు. కన్నడ రచయితలకు కూడా తెలియడు. ఆయన తెలంగాణ వాళ్లకు తెలియడు. సీమాంధ్ర వాళ్లకూ తెలియడు. ఆయన ప్రవాస తెలుగువాడని ఇక్కడి వాళ్లనుకుంటారు. మనకేం సంబంధం అని కన్నడవాళ్లనుకుంటారు. ఎవరు ఎలా అనుకున్నా రామగోపాల్‌కు తెలిసింది మాత్రం ఒక్కటే. తెలుగు అంటే ప్రేమ. కన్నడం అంటే వెర్రి. కన్నడంలో ఉన్న ఉత్కృష్ట సాహిత్యాన్ని తెలుగుకు అనువాదం చేసి ఇవ్వాలని తపన. ‘భూమిలో పడ్డ విత్తనం హృదయంలో పడ్డ అక్షరం వృథాపోవు’ అని వాళ్ల అమ్మ అనేదట. తెనాలి నుంచి వాళ్ల కుటుంబం చాలా ఏళ్ల క్రితం రాయచూరు వెళ్లి వ్యవసాయం మొదలెట్టింది. రామగోపాల్ ఇక్కడే చదువుకున్నా, చదువు పూర్తయ్యాక ఉద్యమాలు గిద్యమాలంటూ కొడుకు పట్టకుండా పోతాడేమోనని రాయచూరు తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అక్కడ కన్నడ కస్తూరి పరిమళం మొదటిసారిగా తెలిసింది రామగోపాల్‌కు. హైద్రాబాద్ తిరిగి వచ్చి ఇక్కడే ఉండిపోయినా కన్నడ భాషను, లిపిని, సాహిత్యాన్ని వదల్లేదు. ఇన్నాళ్ల తర్వాత ఖాళీ దొరికి 60 ఏళ్ల వయసులో గత మూడేళ్లుగా కన్నడ కథల అనువాదం మొదలుపెట్టారు. మూడేళ్లు. ఇప్పటికి ఎనిమిది మంచి మంచి పుస్తకాలు వచ్చాయి. శ్రేష్ఠ కన్నడ కథలు, చినరాపూరులోని గయ్యాళులు, కృష్ణారెడ్డి ఏనుగు, పర్యావరణ కథలు, మాట తీరు... వీటిలో దాదాపుగా ప్రఖ్యాత కన్నడ రచయిత పూర్ణచంద్ర తేజస్వి కథలే ఎక్కువ. ‘కన్నడ నాట రచయితలకు గౌరవం ఎక్కువ. కువెంపు వంటి వారి పుస్తకాలను దేవుడి మందిరంలో పెట్టుకుంటారు’ అంటాడాయన. ‘ఒక కథ చదివితే మన జీవిత దృక్పథమే మారిపోవాలి. ఒక గొప్ప కథ పుట్టాలంటే ఒక గొప్ప రచయితకు పుష్కరకాలం పడుతుంది. కన్నడలో అలా కృషి చేసి రాస్తారు. తెలుగులో వందల కొద్దీ కథలు రాశామని కొందరంటుంటారు. అన్ని కథలు ఎలా రాశారా అని నాకు ఆశ్చర్యం.’ అంటాడాయన చకితుడవుతూ. రామగోపాల్ తెస్తున్న పుస్తకాలను పాఠకులు ఆదరిస్తున్నారు. ‘ఆ అమ్మకాలు కూడా నామ్ కే వాస్తే. ఇక్కడ పుస్తకాలు పెద్దగా కొనరు. న్యూస్ పేపర్లు చదివి తెలుగుకు సేవ చేస్తున్నారనుకుంటారు. పత్రికలు చదివితే వార్తలు తెలుస్తాయి. పుస్తకాలు చదివితే జీవితం మారుతుంది. కన్నడిగులకు ఈ సంగతి తెలుసు. అందుకే అక్కడ రచయితలు రాసి ఘనంగా బతుకుతున్నారు. ఇక్కడ రాసి చెడిపోతున్నారు. నేను కూడా ఈ పుస్తకాలు అచ్చు వేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది’ అని బాధ పడతాడాయన. అలాగని రామగోపాల్ ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్ కాకపోవచ్చు. ఆయన అనువాదంలోని భాష ఒక విధమైన మిశ్రమ సొగసుతో ఉండవచ్చు. కన్నడ ప్రభావంతో కూడా ఉండవచ్చు. అయితే మాత్రం? ఒక అనువాద అకాడెమీ చేయాల్సిన పనిని చేస్తున్నాడు. ‘ఇంకో రెండేళ్లు. అంతటితో నేను రాయాల్సిన పుస్తకాలు ముగుస్తాయి. అంతటితో ఈ వ్యసనాన్ని కట్టిపెడతాను’ అని నవ్వాడాయన. ఇలాంటి వాళ్ల వల్లే సాహిత్యం ఇంకా ‘ప్రయోజనం ఆశించని’ విధంగా స్వచ్ఛంగా కొనసాగుతోంది. ఇలాంటి వాళ్ల వల్లే వానలు కూడా వేరే ఏమీ ఆశించకుండా సకాలానికి కురుస్తూ ఉన్నాయి. ఆయన్ను మెచ్చుకోవాలంటే: 09052563666 ఒక కథకుడు నూరుగురు విమర్శకులు.... తెలుగులో సుదీర్ఘ చర్చలు జరిగిన కథలు ఏవి? కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’. తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘పని పిల్ల’. స్త్రీ- పురుషుల మధ్య, ఆదివాసీ - మైదాన ప్రాంతాల వారి మధ్య ఉన్న వైరుధ్యాల లోతులను చర్చించిన కథ ‘పని పిల్ల’. అయితే దీని మీద ఎవరి దృష్టికోణం నుంచి వారు సుదీర్ఘమైన చర్చ చేశారు. కొన్ని వందల పేజీల చర్చ జరగడం విశేషమే. అలాగే తుమ్మేటి రాసిన ‘నల్లవజ్రం’ నవల మీద, ‘శత్రువు’, ‘బండకింది బతుకులు’ వంటి కథల మీద కూడా చాలా చర్చలు జరిగాయి. ఇక ఇటీవల ‘సెజ్’ల కేటాయింపు, వాటిని ప్రజలు ఎలా చూస్తున్నారు, ‘సెజ్’లను ఏ వైపు నుంచి అర్థం చేసుకోవాలి వ్యాఖ్యానిస్తూ రాసిన ‘సెజ్’ కథ మీద కూడా బోలెడంత చర్చ జరిగింది. ఇలా అనేక సందర్భాలలో తన రచనల మీద జరిగిన చర్చలన్నింటినీ కలిపి ‘ఒక కథకుడు నూరుగురు విమర్శకులు’ పేరుతో పుస్తకం వెలువరించారు. 576 పేజీల ఈ పుస్తకం రచయితలకు, విమర్శకులకు, భవిష్యత్తులో యువ కథకులకు, సాహిత్య విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. ఒక రచయితను, ఒక కాలాన్ని అర్థం చేసుకోవడానికి పలు దృష్టి కోణాల నుంచి సాహిత్యాన్ని విశ్లేషించడానికి ఇటువంటి ప్రయత్నాలు స్వాగతించదగ్గవి. ఒక కథకుడు నూరుగురు విమర్శకులు; తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథల చర్చా సర్వస్వం వెల: 400; ప్రతులకు: 9000184107 గురుభక్తుల జీవిత దర్శనం డాక్టర్ బిరుదురాజు రామరాజు రాసిన ‘ఆంధ్రయోగులు’ సంపుటాలు సుప్రసిద్ధం. ఆంధ్ర రాష్ట్రంలోని నలుమూలల్లో ప్రజల ఆదరణ పొందిన 50 మంది యోగుల కథలను ఆయన 1998లో మొదటిసారి అచ్చు వేశారు. ఆ తరువాత ఇతర భాగాలు వచ్చాయి. అయితే అంతకు నలభై ఏళ్ల ముందే గుంటూరుకు చెందిన పంగులూరి వీరరాఘవుడు 1957లో ‘శ్రీమదాంధ్ర మహాభక్త విజయము’ పేరుతో 67 మంది గురుభక్తుల జీవిత చిత్రణను పుస్తకంగా వెలువరించారు. ఆనాటికి పాఠకులకు అందుబాటులో లేని యోగుల చరిత్రను తన శక్తిమేరకు సేకరించి రాసి ఎనలేని సేవ చేశారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఆయన ఆత్మీయులు సరళీకరించి కొత్తగా తీసుకొని వచ్చారు. ఇందులో బమ్మెర పోతన దగ్గరి నుంచి అమరవాది కామళ్ల వెంకట రామానుజాచార్యులవారి వరకు చాలా మంది యోగుల చరిత్రలు ఉన్నాయి. బందా పరదేశి, పోతులూరి బ్రహ్మంగారు, దూదేకుల సిద్దయ్య, రంగారాయుడు, సయ్యద్ అహ్మద్ అలీషా ఖాదర్ వలీ, నల్ల మస్తానయ్య, మాల ఓబులు, మాల పిచ్చమ్మ, బెల్లంకొండ రామరాయకవి, డొక్కా సీతమ్మ, ముమ్మడివరం బాలయోగి, సత్యసాయిబాబా... ఇలా ఎందరో యోగులు ఇందులో కనిపిస్తారు. చారిత్రక ప్రమాణాల కన్నా భక్తులు చెప్పుకునే గాథలనే స్వీకరించి వాటిని లిఖించారు. ఏమైనా ఒక కాలంనాటి యోగులు, ఆ కాలపు వివరాలు కూడా పరోక్షంగా ఇందులో తెలుస్తాయి. అరుదైన పుస్తకం. శ్రీ మదాంధ్ర మహాభక్త విజయము; వెల: రూ.150; ప్రతులకు: 99086 48474 -
సమీక్షణం: రాయలవారు ఏం చేసేవారంటే...
పేజీలు: 136 వెల: 120 ప్రతులకు: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్; ఫోన్: 9848065658 పుస్తకం : రాయవాచకము జానర్ : నాన్ఫిక్షన్ రచన : విశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి నేపథ్యం : తండ్రి నాగమనాయుని ఓడించే కొడుకని వీరగాథ ప్రచారంలో ఉన్న విశ్వనాథ నాయకుడి కొలువులో ఒక ఉద్యోగం ఈ స్థానాపతి. పేరు తెలియని ఈ స్థానాపతి ‘విజయనగరం’లో ఉండి, (కృష్ణదేవరాయల మీద) తన ప్రభువుకు అందించిన ‘నివేదిక’ ఈ రాయవాచకం. ‘రమారమి 1520 నాటిది కావొచ్చు.’ విషయం: రాయల పట్టాభిషేకం, అప్పాజీ లాంటి మంత్రులు ‘రాజనీతి యుపదేశిం’చడం, పొద్దుటి రాజు దినచర్య, రాత్రి పట్టణ శోధన, అధికారులు మాట విననప్పుడు అలిగైనా పనులు సాధించుకోవడం, గజపతి మీదకు దండెత్తడం, అప్పాజీ చాతుర్యం, తిరుమలలో మొక్కు తీర్చుకోవడం లాంటి ఘట్టాలన్నీ రాయల నైజాన్నీ, చరిత్రనూ చెబుతాయి. కథా గమనాన్ని బట్టి స్థానాపతి విషయం చెప్పగలవాడే తప్ప, ‘రచయిత’ కాదని అర్థమవుతుంది. ఇదే విషయాన్ని పుస్తకం కూడా ప్రకటిస్తుంది. విరామచిహ్నాలు పాటించని తెంపులేని వాక్యాలు చదవాలంటే, ‘శ్రీకృష్ణదేవరాయల మీద రక్తి’ ఏదో ఉండాల్సిందే! అయితే, ‘యెరుక శాయగా ఆగ్రహబడి’ ‘బ్రాంహ్మణ’, ‘వింద్దురు’, ‘సరి వుంన్నదా’, ‘ముంద్దుగానే’, ‘అంద్దుండ్డి’, ‘నడిపించ్చమని’, ‘కాకితములు అంప్పి’ లాంటి మాటల్లో వినబడే వత్తుల తెలుగు ముచ్చటేస్తుంది. అలాగే, ఐదువందల ఏళ్ల నాటి రచన కాబట్టి దీనికి కచ్చితమైన చారిత్రక విలువ ఉంది. నగరి కట్టము (యుద్ధంలో గెలిచినవాళ్లు చేసే లూటీ), బోనకత్తె (రాజు భోజన అవసరాలు చూసే పరిచారిక), కొత్తళం (కోట బురుజు), సంప్రతి (పెద్ద కరణం), కుంద్దకం (బాకీ) లాంటి సుమారు రెండు వందల తెలియని మాటల్ని ఫుట్‌నోట్స్‌లో వివరించాడు సంపాదకుడు. ముందుకూ, వెనక్కీ, లోతుగా చూస్తూ, సంపాదక ధర్మాలు చక్కగా నిర్వర్తిస్తూ, నిబద్ధతతో పాత పుస్తకాలను పునర్ముద్రిస్తున్న మోదుగుల రవికృష్ణ నిక్కమైన ప్రశంసార్హుడు. - ఆర్.ఆర్. జానపద కళల వైశిష్ట్యం పేజీలు: 272 వెల: 200 ప్రతులకు: తాతా జానకి, 14/161-2, స్టేషన్ రోడ్, గుడివాడ; ఫోన్: 9441518715 పుస్తకం : తెలుగు జానపద కళ సంపాదకుడు : తాతా రమేశ్‌బాబు విషయం : అంతరించిపోతున్న జానపద కళలపై వెలుతురు పువ్వులు జల్లడానికి, ఈ ప్రజాకళారూపాలపై కుర్రకారులో ఆసక్తి అంకురింపజేయడానికి ఆ మధ్య ఓ మహత్తర ప్రయత్నం జరిగింది. వివిధ జానపద కళాప్రదర్శన సంఘాలతో కలిసి గుడివాడ నుంచి అద్దంకి వరకూ తాతా రమేశ్‌బాబు బృందం ‘జానపద కళాయాత్ర’ నిర్వహించింది. ఆ యాత్ర తాలూకు విశేషాలు, ప్రముఖుల వ్యాసాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ముఖ్యంగా ప్రముఖ రచయిత ఆరుద్ర ఎంతో పరిశోధించి రాసిన ‘తెలుగు ప్రజల కళారూపాలు’ ఆర్టికల్ ఈ పుస్తకానికి సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చింది. శ్రమలోంచి, శ్రమ కోసం పుట్టిన కళల గురించి, ఆ కళలపై ఆధారపడిన రకరకాల జాతుల గురించి విశ్లేషణ ఆసక్తికరంగా అనిపిస్తుంది. - శ్రీబాబు వినుడి వినుడి శౌర్యచరితం! పేజీలు: 176 వెల: 80 ప్రతులకు: రచయిత, 9-14/1, రవీంద్ర నగర్ కాలనీ, హబ్సిగూడ, హైదరాబాద్-7 పుస్తకం : రుద్రమదేవి జానర్ : చరిత్ర ఆధారిత నవల రచన : ఎస్ ఎమ్ ప్రాణ్‌రావు విషయం : ‘రుద్రమ’ పేరులోనే శౌర్యం ప్రతిధ్వనిస్తుంది. ‘స్ఫూర్తి’ కాంతి వెల్లివెరుస్తుంది. ఆమెను గురించి వినడమైనా, చదవడమైనా గొప్ప ఉత్తేజాన్ని నింపుకోవడమే. ప్రాణ్‌రావ్ నవల అలాంటి అనుభవాన్ని ఇస్తుంది. చారిత్రక నవలకు ‘కల్పనే’ ముడిసరుకు కాదు. చరిత్ర అధ్యయనమూ ముఖ్యమే. ‘కల్పన’ ఎక్కువై ‘చరిత్ర’ తక్కువైనా, ‘చరిత్ర’ ఎక్కువై ‘కల్పన’ తక్కువైనా కష్టమే. ఇందులో అలాంటి కష్టమేది కనిపించదు. జనశృతులు, ఊహలు, వాస్తవాలను ఆధారం చేసుకొని రాసిన ఈ నవల ఆకట్టుకునేలా ఉంది. ‘రుద్రమదేవి నవల యథాతథంగా చరిత్ర కాదు’ అన్నారు రచయిత. చారిత్రక దృష్టిని పక్కన పెడితే తప్పక మనల్ని మెప్పిస్తుంది. - డి. చారులత కొత్త పుస్తకాలు రాష్ట్రంలో నదీజలాలు రచన: సారంపల్లి మల్లారెడ్డి పేజీలు: 232; వెల: 100 ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌజ్, హైదరాబాద్ చాణక్య నీతి మాలికలు అనుసృజన: యల్లాప్రగడ ప్రభాకరరావు భావార్థం: పంగులూరి హనుమంతరావు పేజీలు: 128; వెల: 120; ప్రతులకు: పంగులూరి హనుమంతరావు, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-36; 040-24141560 ఆమె వేకువ (కవిత్వం) డా. ఎ.వి.వీరభద్రాచారి పేజీలు: 124 వెల: 100 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు -
'బియాండ్ కాఫీ’ ఆవిష్కరణ
మహమ్మద్ ఖదీర్‌బాబు కథాసంపుటి ‘బియాండ్ కాఫీ’ ఆవిష్కరణ నేడు (ఆగస్టు 5, సోమవారం) హైద్రాబాద్ లక్డీకా పూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో సాయంత్రం ఆరున్నరకు జరగనుంది. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరిస్తారు. నాటక రచయిత డి.విజయభాస్కర్ అధ్యక్షత వహిస్తారు. ఎ.గాంధీ, ముక్తవరం పార్థసారథి, ఆడెపు లక్ష్మిపతి, జి.ఆర్.మహర్షి, అనిల్ అట్లూరి తదితరులు పాల్గొంటారు. -
సాహిత్యం- కొత్త పుస్తకాలు
మావో కుహనా మార్క్సిస్టు! మేం మళ్లీ వస్తాం..... కొందరు టేబుల్‌ను తిరగేస్తారు. నాలుగు కాళ్లు తిరగబడి అడుగు కనపడుతూ... అదీ టేబులే! కాని చూడాల్సిన పద్ధతి వాడాల్సిన పద్ధతి అదేనా? కాని ఒకోసారి అదీ తప్పు కాదు అంటారు తోలేటి జగన్మోహనరావు వంటి అన్వేషకులు. ఇవాళ్టి ఈ పెట్టుబడిదారి ప్రపంచంలో, అమెరికా కేంద్రక ప్రపంచంలో, ‘స్పాన్సర్డ్’ ప్రజాస్వామ్య ఉద్యమాల/ రబ్బర్‌స్టాంప్ ప్రభుత్వ ఏర్పాటుల ప్రపంచంలో భవిష్యత్తు మార్క్సిజానిదే అని చెప్పడానికి సాహసిస్తున్నారు తోలేటి జగన్మోహనరావు. మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడానికి దాని ఉత్థానాన్ని, పతనాన్ని విశ్లేషించడానికి ఆయన వెనక్కు వెనక్కు ప్రయాణిస్తూ అధ్యయనం చేస్తూ ‘తప్పులు ఎన్ని చేసినా’ స్టాలిన్‌ను గొప్ప మార్క్సిస్టు- లెనినిస్టుగా గుర్తిస్తూ, ఒప్పులు ఎలా ఉన్నా మావో మార్క్సిజానికి తీవ్ర నష్టం కలుగచేశాడని భావిస్తూ నిర్ధారణలకు వచ్చినట్టుగా కనిపిస్తారు. ఇలాంటి మాటలు సాధారణంగా చాలామంది మావో భక్తుల గుండెలవిసి పోయేలా చేస్తాయి. ఈ పుస్తకాన్ని దూరంగా పుల్లతో నెట్టేయాలని భావిస్తారు కూడా. కాని రచయితకు ఈ సంగతి తెలుసు. అందుకే ఓపెన్ మైండ్‌తో చదవమని కోరుతున్నారు. ఈ ప్రపంచం మార్క్సిజం వెలుతురులో కళకళలాడాలని ఆయన కోరిక. అయితే అందుకు పాత దేవుళ్లను గుడ్డిగా పూజించకుండా కొత్త భూమికలను ఏర్పాటు చేసుకోవాలనేదే కామన. ఏమైనా ఇది పేజీల కొద్దీ చర్చకు తావు ఇచ్చే పుస్తకం. ఆస్తికులు, నాస్తికులు కూడా తప్పక చదవాలి. చర్చించాలి. తోలేటి వంటి సీరియస్/సీనియర్ రచయిత ఏడేళ్ల పాటు శ్రమకోర్చి రాశారంటే ఇది పైపైన చూసి నాలుగు రాళ్లు విసిరే పని ఎంత మాత్రం కాదు. మేం మళ్లీ వస్తాం- తోలేటి జగన్మోహన రావు; వెల: రూ.150; ప్రతులకు: 99082 36747 నిఖిలేశ్వర్ విమర్శ కవిత్వ శోధన నిఖిలేశ్వర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. దిగంబర కవిగా మాత్రమే గాక కథా రచయితగా (నిఖిలేశ్వర్ కథలు), తెలుగు/హిందీ అనువాదకుడిగా (మరో భారత దేశం - వివిధ), జైలు జ్ఞాపకాలు మిగుల్చుకున్న ఉద్యమకారుడిగా (గోడల వెనుక) ఆయన రచనలు పాఠకులను విస్తృతంగా చేరాయి. మండుతున్న స్వరం, ఈనాటికీ వంటి కవిత్వ సంపుటులతో ఆయన తన వ్యక్తిగత ఉనికిని కవిగా చాటుకున్నారు కూడా. అయితే కవిత్వం పట్ల తనకున్న ఆసక్తిని ఆర్తిని విశ్లేషణాదృష్టిని ఆయన వృథా పోనివ్వలేదు. అనేక సందర్భాల్లో కవులను, వారి కవిత్వాలను, కవితా ధోరణులను, కవిత్వ పరిణామాలను తన వ్యాసాలలో రికార్డు చేస్తూ వచ్చారు. వాటన్నింటినీ కలిపి ఇప్పుడు ‘కవిత్వ శోధన’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు. ఇందులో ఉన్న వ్యాసాలలో ‘తెలుగులో ఒక్క ఆధునిక మహాకావ్యం కూడా రాలేదు’, ‘భావ దారిద్య్రమా? కవిత్వ లోపమా?’, ‘శ్రీశ్రీకి ముందు అంతా శూన్యమా?’ మంచి ఆలోచింపదగ్గవి. నిజమైన ప్రజాపోరాటాలు సాహిత్యానికి సక్రమమైన రూపు ఇస్తాయి అని విశ్వసించే నిఖిలేశ్వర్ భావధారను ఈ పుస్తకం పట్టి చూపుతుంది. కవులు, విమర్శకులు తప్పక చదవదగ్గ పుస్తకం. కవిత్వ శోధన- నిఖిలేశ్వర్; వెల: రూ.75; ఎమెస్కో ప్రచురణ; ప్రతులకు: 0866 2436643 గొల్ల రామవ్వ.... కెటిల్... కరీంనగర్ జిల్లా కథలు.... కరీంనగర్ అంటే అందరికీ తెలిసింది అది విప్లవభూమి అనే. కాని అక్కడ ఉద్యమాలతో సమానంగా కథ కూడా వికసించింది. రజాకార్ ఉద్యమకాలంలో సాక్షాత్తు పి.వి.నరసింహారావే ప్రజల పక్షాన నిలబడి ‘గొల్ల రామవ్వ’ వంటి శక్తిమంతమైన కథను రాశారు. గూడూరి సీతారాం, తాడిగిరి పోతరాజు, అల్లం రాజయ్య, బి.ఎస్. రాములు.... కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద పెద్ద కథలు బయలుదేరి వచ్చి తెలుగు కథను సంపద్వంతం చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా విశాల సాహిత్య అకాడమి ‘ఆధునిక కథా సరిత్సాగరం’ పేరుతో కరీంనగర్ జిల్లా కథలను వివిధ సంకలనాలుగా వెలువరిస్తోంది. ఇప్పటికి మూడు సంకలనాలు వచ్చాయి. ప్రస్తుతం నాలుగోది వచ్చింది. మొత్తం 20 మంది కథకుల కథలు ఉన్న ఈ సంకలనంలో కొక్కుల పద్మావతి, గుండెడప్పు కనకయ్య, కూతురు రాంరెడ్డి, వేముల ప్రభాకర్ వంటి వర్తమాన కథకులతో పాటు బిఎస్ రాములు, గూడూరి సీతారాం, పివి నరసింహారావు, తాడిగిరి పోతరాజు వంటి సీనియర్ రచయితల కథలు కూడా ఉన్నాయి. మరో విశేషం ఇవాళ ‘గణపతి’గా అందరికీ తెలిసిన మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణరావు రాసిన ‘ఎత్తున్రి పిడికిళ్లు’ కథ కూడా ఇందులో ఉంది. కరీంనగర్ జీవన పరిణామాలకు అద్దం ఈ సంకలనం. కరీంనగర్ జిల్లా కథలు (నాల్గవ సంపుటి)- సంపాదకులు: బిఎస్ రాములు, వనమాల చంద్రశేఖర్; వెల: రూ.100; ప్రతులకు: 83319 66987, 97047 08980