ముప్పై మూడేళ్ల కిమ్ జియాంగ్ ఓరోజు పొద్దున్నే లేచాక, వాళ్ల అమ్మలాగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఇది కాస్త తగ్గిందనుకున్నాక, కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన చిన్నప్పటి స్కూల్ స్నేహితురాల్లాగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. జియాంగ్‌కి తన శరీరంలో తను ఇమడలేని ఉక్కపోత ఎక్కువై, రూపాంతరావసరం ముందుకొస్తోందనేది డాక్టర్ చెప్పిన కారణం. కానీ ఇదిలా జరగడానికి స్త్రీగా జియాంగ్‌కి ముప్పై మూడేళ్ల గతం, అది సృష్టించిన కారణాలున్నాయి.
దక్షిణ కొరియాలో సాధారణమైన కుటుంబంలో రెండో అమ్మాయిగా పుట్టిన జియాంగ్‌కి చిన్ననాటినుంచే లింగవివక్ష అంటే ఏమిటో తెలుసు. ఇంట్లో తల్లిదండ్రులు తమ్ముడిని చూసుకునే పద్ధతిలోనూ, స్కూల్లో మగపిల్లలు వేధించే విధానాల్లోనూ, వాటిని టీచర్లు చూసీచూడకుండా ఊరుకోవడాల్లోనూ, జీవితాలతో రాజీపడి చదువులు మానేసి తమ్ముడిని చదివించడం కోసం అక్కాచెల్లెళ్లు అనారోగ్యకరమైన పరిస్థితుల్లో కార్మికులుగా పనిచేయటంలోనూ– లోకవ్యవహారాల పట్ల అవగాహన కలుగుతూ వచ్చింది. వ్యవస్థీకృతమైన వివక్షనీ, పురుషాధిపత్యాలనీ అంగీకరించడం స్త్రీల జీవితాలలోకి అసంకల్పితంగానే ప్రవేశిస్తూ వచ్చింది.
కుటుంబ పరిస్థితులు కాస్త మెరుగయ్యాక, కాలేజీ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాల్లోకి అడుగుపెడదామన్నా అదే వివక్ష (‘‘ఆడవాళ్లని ప్రత్యేకంగా చూడనక్కర్లేదు. సమానంగా చూస్తే చాలు’’). అభ్యర్థుల ఎంపిక, వేతనాలు(కొరియాలో మగవాళ్లకిచ్చే జీతాల్లో కేవలం అరవైమూడు శాతం మాత్రమే ఆడవాళ్లకిస్తారు) పదోన్నతులలోనూ అదే వివక్ష. మాటర్నిటీ సెలవుల మీద వెళ్తారనీ, చాలామంది తర్వాత ఉద్యోగాలు మానేస్తారనీ వీళ్లని ఉద్యోగాల్లో ప్రమోషన్లకి కూడా పరిశీలించరు (‘‘ఆడవాళ్లు ఉద్యోగాల్లో ఎందుకుండరూ అంటే, ఉండటం అసాధ్యమయ్యేలా మీరు చేస్తారు కాబట్టి.’’).
ఉద్యోగం చేస్తున్నప్పుడే పెళ్లిచేసుకున్న జియాంగ్ కొన్నేళ్లకి అమ్మాయిని ప్రసవించాక, చివరికి అదే జరిగింది. అత్తామామలో, అమ్మానాన్నలో సహాయం అందించగల పరిస్థితులు లేనందువల్ల జియాంగ్ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది.‘‘ఎప్పుడో ఏదో పొందటం కోసం ఇప్పుడున్నదాన్ని ఎందుకు త్యాగం చేయాలి?’’అన్నది జియాంగ్ అంతర్వాణి అయినప్పటికీ, మరో ప్రత్యామ్నాయం లేదు. పిల్లని చూసుకోవడం, ఇంటి బాగోగులూ వంటావార్పులతోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. పిల్లని డేకేర్‌కి పంపించినప్పటికీ, సగటున మిగిలే ఖాళీ సమయం రోజుకి మూడు గంటలు! భర్త అర్థం చేసుకోగలడన్నది ఒక్కటే జియాంగ్‌కి ఊరట. కానీ, దానివల్ల ప్రత్యేకించి ఏ ప్రయోజనమూ లేదు– ఎందుకంటే, అతనికి ఏపనీ చేయడం రాదు.
కాన్సర్లకీ, గుండెలకీ అధునాతనమైన పద్ధతుల్లో వైద్యమందించే ఈరోజుల్లో నెలసరి సమయాల కడుపునొప్పులకి మందు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే, ‘‘మందులతో కలుషితం కాని గర్భాశయాలు కావాలి వీళ్లకి– పచ్చటి అరణ్యాలలోని స్వచ్ఛమైన పచ్చికబయళ్లలాగా,’’ అంటుందొక పాత్ర. చిన్న తలనొప్పి వస్తేనే వెంటనే మాత్రలు వేసుకునేవాళ్లు, ఆడవాళ్లు మాత్రం ప్రసూతి వేదనలన్నీ మాతృత్వమనే అపురూపమైన హోదాని పొందడం కోసం ఆనందంగా భరించాలని సలహాలిస్తుంటారు.
స్తీల సమస్యల పట్ల జియాంగ్ పడుతున్న వేదనగా సాగే కిమ్ జియాంగ్, బార్న్ 1982 నవల ఫెమినిస్ట్ సిద్ధాంత చర్చలతో విసిగించదు. కథకి ఎంచుకున్న అంశాలూ, సంఘటనలూ (ప్లాట్) దానికి ఒక కారణమైతే, క్లినికల్ స్టయిల్‌లో ఉద్వేగరహితంగా కథనం చేసిన తీరు మరో కారణం.
రచయిత్రి చో నామ్ జూ 2016లో రాసిన ఈ తొలి నవల పదిలక్షల కాపీలకి పైగా అమ్ముడుపోయి సృష్టించిన సంచలనం అంతాయింతా కాదు. ఫెమినిస్ట్ భావజాలాలపట్ల సానుభూతితో ఈ నవలని సమర్థిస్తున్నవారిని ట్రోల్ చేసినవారి సంఖ్య అధికంగా ఉందంటే, ఆర్థిక ప్రగతిలో చాలా ముందున్న దక్షిణ కొరియా భావజాలాల విషయంలో మాత్రం ఎక్కడో పాతరోజుల్లోనే ఉండిపోయిందన్నది విదితమౌతుంది. గత సంవత్సరం ఈ నవల ఆధారంగా కొరియన్ సినిమా రాగా, నవలకి జేమీ చాంగ్ చేసిన ఇంగ్లీష్ అనువాదం ఈ సంవత్సరమే విడుదలయింది.
ఇది కేవలం దక్షిణ కొరియాకి మాత్రమే పరిమితమైన కథ కాదు. మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల కుటుంబాల్లో ఈ కథలు కనిపిస్తూనే ఉంటాయి. స్త్రీలకి సమానావకాశాలు కల్పించడానికి పురుషాధిక్యపు భావజాలాల ప్రపంచం ప్రత్యేక దృష్టిని సారించకపోతే సార్వజనీనమైన ఇలాంటి కథలు సార్వకాలికం అయ్యే ప్రమాదం ఉంది.
- ఎ.వి.రమణమూర్తి
నవల : కిమ్ జియాంగ్, బర్న్ 1982
రచన : చో నామ్ జూ
మూలం ప్రచురణ : 2016
కొరియన్ నుంచి ఇంగ్లిష్ అనువాదం : జేమీ చాంగ్
ప్రచురణ: లివ్‌రైట్ ; 2020
Comments
Please login to add a commentAdd a comment