AV Ramanamurthy
-
నాటకాంతరంగం
ఇంగ్లండ్‌లోని స్ట్రాట్ఫర్డ్లో నివసిస్తున్న దంపతుల అబ్బాయి హామ్నెట్ పదకొండేళ్ల వయసులో 1596లో చనిపోయాడు. అటుతర్వాత నాలుగేళ్లకి వాళ్ల నాన్న ఒక నాటకం రాశాడు. నాటకం పేరు ‘హామ్లెట్’. రాసింది షేక్స్పియర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేనంత ప్రసిద్ధనాటకం! ఆన్యిస్ తమ్ముళ్లకి లాటిన్ పాఠాలు చెప్పటానికి గ్రామర్ స్కూల్లో చదువుకున్న విలియం కుదురుకున్నప్పుడు వాళ్ల తొలిపరిచయం. ప్రకృతి వైద్యురాలూ, మనుషుల అంతరంగాల్లోకి తొంగిచూడగల శక్తిమంతురాలూ, తనకంటే వయసెక్కువున్న ఆన్యిస్తో ప్రేమలో పడిపోతాడు విలియం. పెళ్లికి పెద్దవాళ్లు ఒప్పుకునేనాటికి ఆమె మూడునెలల గర్భవతి. పెళ్లయ్యాక, విలియం తల్లిదండ్రుల ఇంటిపక్కనే నివాసం ఏర్పరచుకున్న దంపతులకి పెద్దమ్మాయి పుట్టాక, సృజనపట్ల ఆసక్తులున్న విలియం, తండ్రి వ్యాపారంలోనూ ఆగ్రహాలలోనూ ఇమడలేక అసహనానికి గురవుతుంటాడు. దాన్ని గుర్తించిన ఆన్యిస్ అతన్ని అక్కణ్ణుంచి తప్పించేసి లండన్ కి పంపించేస్తుంది. అప్పటికే మళ్లీ గర్భవతిగా ఉన్న ఆమెకి అనంతరకాలంలో కవలలు – అబ్బాయి హామ్నెట్, అమ్మాయి జూడిత్ – పుడతారు. ఇంటిపనులతోనూ, పిల్లలని పెంచడంలోనూ, మూలికావైద్యాలతోనూ ఆన్యిస్ జీవితం యాంత్రికంగా సాగిపోతుంటుంది. తదనంతర పరిణామాల్లో విలియం సొంతవూరికి రావడం బాగా తగ్గిపోతుంది. చివరికి జూడిత్ ప్లేగువ్యాధి బారిన పడ్డప్పుడు, ఆమె బాధని చూడలేక వ్యాధిని స్వీకరించిన హామ్నెట్ మరణించాకే విలియం ఊరికి చేరుకోగలుగుతాడు. ఆన్యిస్ అనుభవిస్తున్న శూన్యాన్ని నింపడం విలియంకి చేతకాదు. కొన్నిరోజులుండి, తన నాటకాల వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవాలని లండన్ కి వెళ్లిపోతాడు. నాటకరంగంలో స్థిరపడ్డ విలియం, సొంతఊరిలో మంచి బంగళా కూడా కొంటాడు. విలియం విజయాల గురించి అక్కడక్కడా వింటున్న ఆన్యిస్ విలియం రాసిన తాజా నాటకం పేరు ‘ద ట్రాజెడీ ఆఫ్ హామ్లెట్’ అని తెలుసుకుని తట్టుకోలేకపోతుంది. ఆ పేరుని అతను ఏ అధికారంతో ఉపయోగించగలడు? తననుంచి హామ్నెట్ని ఎవరో రెండోసారి లాక్కెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఆన్యిస్కి. ఆవేశంలో లండన్ కి ప్రయాణమవుతుంది. అక్కడ ఆమె చూసిందీ, తెలుసుకున్నదీ నవల ముగింపు సన్నివేశం. చరిత్ర తక్కువ తెలిసినచోట కల్పనకి ఎక్కువ అవకాశం ఉంటుందంటారు. షేక్స్పియర్ వ్యక్తిగత జీవిత వివరాలు చాలావరకు అలభ్యం. హామ్నెట్ మరణ కారణం గురించీ, షేక్స్పియర్ భార్య ‘ఆన్’ గురించీ వివరాలు ఇంతవరకూ దొరకలేదు. వాటిని పూరించడానికన్నట్టు రచయిత్రి మాగీ ఓ’ఫారెల్ నవల ప్రారంభించగా, అది షేక్స్పియర్ భార్య ఆన్ (నవలలో ‘ఆన్యిస్’) ప్రధానపాత్రగా ‘హామ్నెట్’ నవలైంది. నిజజీవితంలోనూ అతనికంటే పెద్దదైన ఆమే అతన్ని వలలో వేసిందనే అపవాదొకటుండగా, షేక్స్పియర్ తన విల్లులో ఆమెకి కేవలం ఒక మంచం మాత్రమే (‘మై సెకండ్ బెస్ట్ బెడ్’) రాయడం వారి వైవాహిక జీవితానికి సంబంధించిన ఊహాపోహలకి తావిచ్చింది. వాటన్నింటినీ పూర్వపక్షం చేస్తూ ఆన్యిస్ పాత్రచిత్రణ జరగడమే కాకుండా నవలలో ఎక్కడా షేక్స్పియర్ పాత్రకి పేరుండదు. నవల ‘హామ్నెట్’ అని శ్రీకారం చుట్టుకున్నప్పటికీ ఇది ఆన్యిస్ ప్రేమ, సంవేదనల మీదుగా చేసిన బాధ్యతాయుతమైన ప్రయాణం గురించి. కవలలు ప్లేగుబారిన పడటానికి ముందు కథ, తరువాతి కథగా సమాంతర కథనం– జరుగుతున్న కథనేమో వేగంగానూ, జరిగినకథని మాత్రం వివరణాత్మకంగా చెప్తూ రెంటినీ వర్తమానకాలపు కథనం చేసి తక్షణతని సృష్టిస్తుంది. విలియం, ఆన్యిస్ల తొలి శృంగార కలయికని అత్యంత కవితాత్మకంగా చెప్పినటువంటి పుష్టికరమైన వచనఘట్టాలు నవలలో పుష్కలంగా ఉండగా, ముగింపు సన్నివేశం పాఠకుడిలో భావావేశాన్ని ఉవ్వెత్తున రగిలించగలిగిన రచయిత్రి భాషామనీషకి పరాకాష్ఠ. నాలుగువందల యేళ్లు గడిచిపోయినా, షేక్స్పియర్ ‘గ్లోబ్ థియేటర్’లో స్వయంగా నటిస్తున్న అప్పటి హామ్లెట్ నాటకాన్ని మనం వీక్షిస్తున్న ఉద్రేకం, షేక్స్పియర్ మీద ప్రసరింపజేసే వినూత్నకాంతి, పాత్రల అబలత, రచయిత్రి భావశబలతల మధ్య పాఠకుడు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. భావప్రధానంగా దుఃఖం ఒకటే అయినప్పటికీ, వైయక్తికస్థాయిలో అభివ్యక్తి రూపాలు విభిన్నంగా ఉంటాయి. కవల సోదరుణ్ణి కోల్పోయి సగం శరీరం కోల్పోయినట్టనిపిస్తున్న జూడిత్, శారీరంలో దాన్ని చూపించగలిగిన ఆన్యిస్, సృజన ద్వారా మాత్రమే ఆ రసాన్ని నిష్పన్నం చేయగలిగిన షేక్స్పియర్ – వీరందరి దుఃఖపు వర్ణచ్ఛాయలన్నీ వేరే వేరే! ఎ.వి.రమణమూర్తి నవల: హామ్నెట్ రచన: మాగీ ఓ’ఫారెల్ ప్రచురణ: టిండర్ ప్రెస్; 2020 -
గతానుగతికం
ముప్పై మూడేళ్ల కిమ్ జియాంగ్ ఓరోజు పొద్దున్నే లేచాక, వాళ్ల అమ్మలాగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఇది కాస్త తగ్గిందనుకున్నాక, కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన చిన్నప్పటి స్కూల్ స్నేహితురాల్లాగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. జియాంగ్కి తన శరీరంలో తను ఇమడలేని ఉక్కపోత ఎక్కువై, రూపాంతరావసరం ముందుకొస్తోందనేది డాక్టర్ చెప్పిన కారణం. కానీ ఇదిలా జరగడానికి స్త్రీగా జియాంగ్కి ముప్పై మూడేళ్ల గతం, అది సృష్టించిన కారణాలున్నాయి. దక్షిణ కొరియాలో సాధారణమైన కుటుంబంలో రెండో అమ్మాయిగా పుట్టిన జియాంగ్కి చిన్ననాటినుంచే లింగవివక్ష అంటే ఏమిటో తెలుసు. ఇంట్లో తల్లిదండ్రులు తమ్ముడిని చూసుకునే పద్ధతిలోనూ, స్కూల్లో మగపిల్లలు వేధించే విధానాల్లోనూ, వాటిని టీచర్లు చూసీచూడకుండా ఊరుకోవడాల్లోనూ, జీవితాలతో రాజీపడి చదువులు మానేసి తమ్ముడిని చదివించడం కోసం అక్కాచెల్లెళ్లు అనారోగ్యకరమైన పరిస్థితుల్లో కార్మికులుగా పనిచేయటంలోనూ– లోకవ్యవహారాల పట్ల అవగాహన కలుగుతూ వచ్చింది. వ్యవస్థీకృతమైన వివక్షనీ, పురుషాధిపత్యాలనీ అంగీకరించడం స్త్రీల జీవితాలలోకి అసంకల్పితంగానే ప్రవేశిస్తూ వచ్చింది. కుటుంబ పరిస్థితులు కాస్త మెరుగయ్యాక, కాలేజీ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాల్లోకి అడుగుపెడదామన్నా అదే వివక్ష (‘‘ఆడవాళ్లని ప్రత్యేకంగా చూడనక్కర్లేదు. సమానంగా చూస్తే చాలు’’). అభ్యర్థుల ఎంపిక, వేతనాలు(కొరియాలో మగవాళ్లకిచ్చే జీతాల్లో కేవలం అరవైమూడు శాతం మాత్రమే ఆడవాళ్లకిస్తారు) పదోన్నతులలోనూ అదే వివక్ష. మాటర్నిటీ సెలవుల మీద వెళ్తారనీ, చాలామంది తర్వాత ఉద్యోగాలు మానేస్తారనీ వీళ్లని ఉద్యోగాల్లో ప్రమోషన్లకి కూడా పరిశీలించరు (‘‘ఆడవాళ్లు ఉద్యోగాల్లో ఎందుకుండరూ అంటే, ఉండటం అసాధ్యమయ్యేలా మీరు చేస్తారు కాబట్టి.’’). ఉద్యోగం చేస్తున్నప్పుడే పెళ్లిచేసుకున్న జియాంగ్ కొన్నేళ్లకి అమ్మాయిని ప్రసవించాక, చివరికి అదే జరిగింది. అత్తామామలో, అమ్మానాన్నలో సహాయం అందించగల పరిస్థితులు లేనందువల్ల జియాంగ్ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది.‘‘ఎప్పుడో ఏదో పొందటం కోసం ఇప్పుడున్నదాన్ని ఎందుకు త్యాగం చేయాలి?’’అన్నది జియాంగ్ అంతర్వాణి అయినప్పటికీ, మరో ప్రత్యామ్నాయం లేదు. పిల్లని చూసుకోవడం, ఇంటి బాగోగులూ వంటావార్పులతోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. పిల్లని డేకేర్‌కి పంపించినప్పటికీ, సగటున మిగిలే ఖాళీ సమయం రోజుకి మూడు గంటలు! భర్త అర్థం చేసుకోగలడన్నది ఒక్కటే జియాంగ్కి ఊరట. కానీ, దానివల్ల ప్రత్యేకించి ఏ ప్రయోజనమూ లేదు– ఎందుకంటే, అతనికి ఏపనీ చేయడం రాదు. కాన్సర్లకీ, గుండెలకీ అధునాతనమైన పద్ధతుల్లో వైద్యమందించే ఈరోజుల్లో నెలసరి సమయాల కడుపునొప్పులకి మందు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే, ‘‘మందులతో కలుషితం కాని గర్భాశయాలు కావాలి వీళ్లకి– పచ్చటి అరణ్యాలలోని స్వచ్ఛమైన పచ్చికబయళ్లలాగా,’’ అంటుందొక పాత్ర. చిన్న తలనొప్పి వస్తేనే వెంటనే మాత్రలు వేసుకునేవాళ్లు, ఆడవాళ్లు మాత్రం ప్రసూతి వేదనలన్నీ మాతృత్వమనే అపురూపమైన హోదాని పొందడం కోసం ఆనందంగా భరించాలని సలహాలిస్తుంటారు. స్తీల సమస్యల పట్ల జియాంగ్ పడుతున్న వేదనగా సాగే కిమ్ జియాంగ్, బార్న్ 1982 నవల ఫెమినిస్ట్ సిద్ధాంత చర్చలతో విసిగించదు. కథకి ఎంచుకున్న అంశాలూ, సంఘటనలూ (ప్లాట్) దానికి ఒక కారణమైతే, క్లినికల్ స్టయిల్లో ఉద్వేగరహితంగా కథనం చేసిన తీరు మరో కారణం. రచయిత్రి చో నామ్ జూ 2016లో రాసిన ఈ తొలి నవల పదిలక్షల కాపీలకి పైగా అమ్ముడుపోయి సృష్టించిన సంచలనం అంతాయింతా కాదు. ఫెమినిస్ట్ భావజాలాలపట్ల సానుభూతితో ఈ నవలని సమర్థిస్తున్నవారిని ట్రోల్ చేసినవారి సంఖ్య అధికంగా ఉందంటే, ఆర్థిక ప్రగతిలో చాలా ముందున్న దక్షిణ కొరియా భావజాలాల విషయంలో మాత్రం ఎక్కడో పాతరోజుల్లోనే ఉండిపోయిందన్నది విదితమౌతుంది. గత సంవత్సరం ఈ నవల ఆధారంగా కొరియన్ సినిమా రాగా, నవలకి జేమీ చాంగ్ చేసిన ఇంగ్లీష్ అనువాదం ఈ సంవత్సరమే విడుదలయింది. ఇది కేవలం దక్షిణ కొరియాకి మాత్రమే పరిమితమైన కథ కాదు. మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల కుటుంబాల్లో ఈ కథలు కనిపిస్తూనే ఉంటాయి. స్త్రీలకి సమానావకాశాలు కల్పించడానికి పురుషాధిక్యపు భావజాలాల ప్రపంచం ప్రత్యేక దృష్టిని సారించకపోతే సార్వజనీనమైన ఇలాంటి కథలు సార్వకాలికం అయ్యే ప్రమాదం ఉంది. - ఎ.వి.రమణమూర్తి నవల : కిమ్ జియాంగ్, బర్న్ 1982 రచన : చో నామ్ జూ మూలం ప్రచురణ : 2016 కొరియన్ నుంచి ఇంగ్లిష్ అనువాదం : జేమీ చాంగ్ ప్రచురణ: లివ్రైట్ ; 2020 -
సాహిత్య సంచారం
బార్సిలోనాకి చెందిన అరవై యేళ్ల మాక్ నిర్మాణ వ్యాపారం కుప్పకూలిపోయింది. కొడుకులు వాళ్ల వాళ్ల జీవితాల్లో స్థిరపడి ఉన్నారు; భార్య ఫర్నిచర్ వ్యాపారంలో బిజీగా ఉంది. ఖాళీ సమయాన్ని ఎలా వెచ్చించాలా అని ఆలోచించిన మాక్ ఒక పుస్తకం రాయాలనుకుంటాడు. తన మరణానంతరం బయటపడి, అసంపూర్ణ రచనలా అనిపించే సంపూర్ణమైన రచన ఒకటి చేసిపెట్టుకోవాలని అతని ఉద్దేశం. అప్పటివరకూ చదువరిగానే తప్ప రచనానుభవం లేని మాక్కి సాహిత్యం పట్ల అభిప్రాయాలైతే ఉన్నాయి. సాహిత్యం మళ్లీ మళ్లీ పునరావృతమయ్యే ఒకే విశేషమనీ, సమస్యకి కారణాలు అన్వేషించే ప్రయాణాలే వివిధ రచనలుగా వెలువడుతున్నాయనేది అతని సిద్ధాంతం. రిపిటిషన్ అనేది సాహిత్యపు మౌలిక సూత్రం అన్నది అతని స్థిరాభిప్రాయం. ఈ ప్రయత్నాల్లో అతనుండగా, పొరుగున ఉండే సాంచెజ్ అనే ప్రముఖ రచయితని కలవడం తటస్థిస్తుంది. ఈ రచయిత తొలినాళ్లల్లో వ్యసనాలకి బానిసగా ఉన్నప్పుడు ‘వాల్టర్స్ ప్రాబ్లమ్’ అనే పది గొలుసు కథలున్న నవల రాసాడు. వాల్టర్ అనే వెంట్రిలాక్విస్ట్ కోల్పోయిన తన గొంతుని తిరిగిపొందడం, వివిధ రచయితల గొంతుల్లో ఆత్మకథని వినిపించడం నవల సారాంశం. సాంచెజ్ చేసింది మంచి ప్రయత్నమే కానీ, అప్పటికి అతనున్న మైకపు స్థితుల్లో ఒక్కోకథలో అర్థంలేని కొన్ని పేరాలు రాసుకుంటూ పోయాడు. ఇప్పుడా పుస్తకం కాపీలు ఎక్కడా దొరక్కపోవడం అతనికి కొంత ఊరట. మాక్ ఈ పుస్తకాన్ని కొన్నేళ్ల క్రితం సగం చదివి పక్కన పడేసాడు. సాహిత్యం ఎలానూ పునరావృతమయ్యేదే కాబట్టి దీన్నే తిరగరాసేస్తే సరిపోతుంది కదా అనుకుంటాడు. ఇప్పుడా పుస్తకాన్ని మాక్ మళ్లీ చదువుతుంటే, రచయిత సొంతగొంతుని సాధించడం కోసం చేసే ప్రతీకాత్మక ప్రయత్నంగా కథ అర్థమవుతూ పాత్రలు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. ఎంత సుపరిచితంగా అంటే– పుస్తకం మధ్యలో అతని భార్య పేరు శీర్షికగా ఒక కథ ఉంది! మాక్ కేవలం చదువరి అని మాత్రమే చెబితే చాలా తక్కువ చెప్పినట్టు. అతను చేసిన సాహిత్య శోధన అంతాయింతా కాదు. పుస్తకాలలోని వాక్యాలనీ, ఎపిగ్రాఫ్లనీ ఉదహరించగలిగినంత అపారమైన సాహిత్య పరిచయం ఉంది. ఈ పాండిత్యం నేపథ్యంగా తను సృష్టించబోతున్న నవలావరణంలోకి పూర్తిగా కూరుకుపోతున్న సమయంలోనే భార్య, సాంచెజ్ల మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానం కలిగాక అప్పటివరకూ సాహిత్య శిఖరాలని అందుకోవలని ప్రయత్నిస్తున్న మాక్, భ్రాంతుల లోతుల్లోకి జారిపోవడం ప్రారంభిస్తాడు. హెమింగ్వే అన్నట్టుగా ‘‘నో, ఐ కాన్ట్. ఐ యామ్ డన్ విత్ ఇట్,’’ లాంటి ఆత్మహత్యని ప్రేరేపించే వాక్యాలు మనసులో మెదులుతుంటాయి. కథకుడిగా మాక్ చెప్పినవన్నీ పూర్తి సత్యాలు కావనీ, కొన్ని అబద్ధాలూ ఉన్నాయనీ నెమ్మదిగా విశదమవుతూంటుంది. సాహిత్య నిర్మాణ యత్నంలో తనకు తానే సమస్య అయిపోయిన మాక్ రాసిన డైరీయే‘మాక్స్ ప్రాబ్లమ్’ నవల. ఇది కేవలం కథకోసం ఒకటిరెండు రోజుల్లో చదవాల్సిన నవల కాదు. రచయిత బెర్నార్డ్ మాలాముడ్ని మాక్ ఉదహరించినట్టుగా– ఠీజ్చ్టి’టn్ఛ్ఠ్ట జీటn’్ట ్టజ్ఛి ఞౌజీn్ట. ఈ నవల ఒక అరుదైన సాహిత్య పరామర్శ, ప్రశంసాత్మక విమర్శ. ఎన్నో కథల గురించీ, పుస్తకాల గురించీ, రచయితల గురించీ, ప్రహసనాల గురించీ, సినిమాల గురించీ మాక్ వివరణలు, వాటిల్లోనుంచి కొటేషన్లూ ఈ రెండువందల పేజీల నవలలో విస్తృతంగా పరుచుకునుంటాయి. ఉదహరించిన రచనలతోబాటుగా ఈ నవలని చదవగలిగితే అది మరోస్థాయి పఠనానుభవం. పాఠకుడికి కొత్తదారుల్ని చూపించి ప్రోత్సహించే ఈ మెటాఫిక్షనల్ నవల హాస్యంతోపాటుగా మెటాఫిజికల్ ఆలోచనలనీ అందిస్తుంది. ఎన్‌రికె విలా–మాతాస్ స్పెయిన్‌కి చెందిన ప్రముఖ రచయిత. నవలలో సాంచెజ్ రాసినట్టుగా చెప్పిన ‘వాల్టర్స్ ప్రాబ్లమ్’ నిజానికి ఈ రచయితే 1988లో రాసిన నవల. ఈ ఆధార నవల ఇంగ్లిష్‌లోకి అనువాదం అయితే కనక– హెమింగ్వే, బోర్హెస్, రేమండ్ కార్వర్, జాన్ చీవర్, జీన్ రీస్ లాంటి ప్రముఖ రచయితల గొంతులని విలా–మాతాస్ అనుకరించిన పద్ధతి తెలుసుకునే వీలుంటుంది. మార్గరెట్ జల్ కోస్టా, సోఫీ హ్యూస్ ద్వయం చేసిన ‘మాక్స్ ప్రాబ్లమ్’ ఇంగ్లిష్ అనువాదం సాఫీగానూ, ఫిలసాఫికల్గానూ సాగిపోతుంది. - ఎ.వి. రమణమూర్తి నవల : మాక్స్ ప్రాబ్లెమ్ (లేదా) మాక్ అండ్ హిజ్ ప్రాబ్లెమ్ రచయిత : ఎన్‌రికె విలా–మాతాస్ స్పానిష్‌లో ప్రచురణ: 2017 ఇంగ్లిష్ : మార్గరెట్ జల్ కోస్టా, సోఫీ హ్యూస్ ప్రచురణ : న్యూ డైరెక్షన్స్, 2019 -
చితికిన నవ్వుకు బుకర్
అన్నిసార్లూ సరిగా ఉండటం అందరికీ సాధ్యం కాకపోయినా, అలా ఒక్కసారైనా సరీగ్గా లేకపోతే ఆ అపరాధభావన ఎలా కొందరిని వెంటాడగలదో, ‘చేదు విషం... జీవఫలం’ అనుకునేలా ఎలా దారితీస్తుందో డోవాలే కథ చెబుతుంది. ‘ఒక నవలని రాస్తూ ఉన్నప్పుడు, ఆ నవల తన ప్రపంచాన్ని తను సృష్టించుకున్నాక అక్కడితో రచయిత పని పూర్తయిపోయినట్టే. అక్కణ్ణుంచి రచయిత తప్పుకుని నవలని ముగించాలి’ అనే డేవిడ్ గ్రాస్మన్ ఇజ్రాయెల్‌కు చెందిన అరవై మూడేళ్ల ప్రసిద్ధ లెఫ్ట్ వింగ్ రచయిత. ఈయన తాజాపుస్తకం A Horse Walks into a Bar ఈ సంవత్సరం మాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌ని గెలుచుకుంది. అనువాదకురాలు జెస్సికా కోహెన్‌తో కలిసి ఆయన పురస్కారాన్ని అందుకుంటారు. బ్రూనో షుల్జ్, కాఫ్కాల ప్రభావం తనమీద ఎక్కువగా ఉందనే గ్రాస్మన్, తన రచనలు కేవలం ఇజ్రాయెల్–పాలెస్తీనా సంఘర్షణలకి మాత్రమే పరిమితం కాదు అంటారు. నిజానికి ఆయన ప్రక్రియ(genre)ల సరిహద్దుల్ని అధిగమించిన రచయితగా ఇప్పటికే పేరు సంపాదించుకున్నారు. నెటాన్యా అనే పట్టణంలోని ఒక కామెడీ క్లబ్లో కథానాయకుడు డోవాలే అనే స్టాండ్–అప్ కమెడియన్ ప్రదర్శనతో కథ ప్రారంభం. ఈ ప్రదర్శనకి అతను తన చిన్ననాటి స్నేహితుడు, రిటైర్డ్ జడ్జ్ అయిన అవిషై లేజర్ని కూడా ఆహ్వానిస్తాడు. ‘నేనొచ్చి ఏం చేయాలి?’ అంటాడు ఆ స్నేహితుడు. ‘వచ్చి నీ కళ్ళతో చూసి చెప్పు’ అంటాడు డోవాలే. ‘ఏం చెప్పాలి?’ అనడుగుతాడు జడ్జ్. ‘నువ్వు చూసింది...’ అంటాడు డోవాలే. ఈకథ అంతా ఆ జడ్జ్ మనకి చెబుతాడు. ఈ ప్రదర్శనకి అనుకోకుండా అతని చిన్ననాటి పరిచయస్తురాలు, మానిక్యూరిస్ట్, ఆత్మలతో సంభాషించే మీడియం కూడా వస్తుంది. తనని తనకు అర్థం చేయించే మాధ్యమం అవుతాడనుకున్న స్నేహితుడితో బాటు ఇప్పుడొక ‘మేడమ్ మీడియమ్’ కూడా! ప్రదర్శన ప్రారంభం అవుతుంది. అయితే, మొదట్నుంచీ హాస్యం పాలు సన్నగిల్లుతూ, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు షోలో ఎక్కువవడంతో ప్రేక్షకులు క్రమక్రమంగా నీరసిస్తూ ఉంటారు. డోవాలే తల్లి రెండవ ప్రపంచయుద్ధం కాలంనాటి హోలోకాస్ట్ బాధితురాలు. చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తండ్రికి ఒక బార్బర్ షాప్ ఉంటుంది. అయినా, జీవనోపాధికోసం రకరకాల వ్యాపారాలు చేస్తూవుంటాడు. ప్రతి చిన్నవిషయానికీ క్రూరంగా హింసించే తండ్రికన్నా, తన తల్లిదగ్గరే అతనికి చనువు. అతని ఆటా పాటా అన్నీ అమ్మతోనే. అలాంటి హైస్కూల్ రోజుల్లో ఒక సంవత్సరం పాటు లేజర్ (జడ్జ్)తో స్నేహం. క్షణంపాటు నిలకడగా ఉండకుండా ‘గాలి తాకిడికే కితకితలు పుట్టి తెగమెలికలు తిరుగుతూ...’ ఉండే డోవాలేకి లేజర్‌తో మంచి స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత కొద్దికాలానికే లేజర్ వేరే ఊరికి మారిపోతాడు. అనంతర జీవితంలో డోవాలే చేసుకున్న మూడు పెళ్లిళ్లూ, కన్న ఐదుగురు పిల్లలూ అతనికి ఏమాత్రం సంతోషం కలిగించలేకపోయాయి. ‘నా కుటుంబం మొత్తం ఏకతాటిమీద – నాకు వ్యతిరేకంగా – నడిచేలా చేసుకున్న ఘనత మాత్రం నాకు దక్కింది!’ అని చెప్పుకుంటాడు. చేదు జ్ఞాపకాలూ, ప్రదర్శనలోని చేదు అనుభవాలూ అన్నీ కలిసి అతన్ని అశక్తతలోకీ, అందులోంచి తనని తాను హింసించుకునే విషాదంలోకి దారితీస్తూ ఉంటాయి. ఈ విషాదం వెనకాల ఉన్న మౌలికమైన అంశం ఏమిటి? అన్న కథనంతో నవల చివరిభాగం మొదలవుతుంది. నవలలోని ఈ భాగం నడిపిన తీరు çహృద్యంగా ఉంటుంది. తన హైస్కూల్ రోజుల్లో లేజర్‌తో కలిసి, మిలిటరీ ఎడ్యుకేషన్ ఇచ్చే గాడ్నా కాంప్కి డోవాలే వెళతాడు. పదిగంటల ప్రయాణం. అక్కడికి వెళ్లాక తోటి పిల్లల దాష్టీకాలకి – లేజర్ని వాటినుంచి తప్పించడం కోసం – గురవుతుంటాడు. వెళ్లిన మూడోరోజో, నాలుగోరోజో అందరూ కాంప్‌లో కూచుని ఉన్నప్పుడు డోవాలేకి పై అధికారుల నుంచి పిలుపు వస్తుంది. తనేదో తప్పు చేసాడని ఇప్పుడు వాళ్లు ఏదో పనిష్మెంట్ ఇస్తారు కాబోలు అనుకుని వెళ్తే అక్కడ తెలిసిన విషయం – తన తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయారని. ఆ విషయం తీవ్రతని అతను అర్థంచేసుకునేలోగా – అసలు విషయం కూడా పూర్తిగా చెప్పకుండా – సాయంత్రం నాలుగు గంటలకల్లా దహన సంస్కారాల దగ్గరకి అతన్ని చేర్చాలి అని హడావుడిగా అతన్ని ప్రయాణం కట్టిస్తారు. అతను తన బరువైన బాక్పాక్ని మోసుకుంటూ వెళ్తుంటే పిల్లలందరూ చూస్తారు – జడ్జ్ లేజర్‌తో సహా. ఎవ్వరూ ఏమీ కనుక్కోరు, ఎవరికీ ఏమీ తెలియదు. మిలిటరీవాళ్లు ఏర్పాటు చేసిన వాహనంలో ఒక్క డ్రైవర్‌తో అన్నిగంటల తిరుగుప్రయాణం. ఆ డ్రైవర్ తనకు తెలిసిన జోకులన్నీ బలవంతంగా చెప్తూ డోవాలేని కొంత తేలికపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పోయింది ఎవరై ఉంటారు? తను ఎంతో ఆనందంగా రోజుకి కొన్ని గంటలు గడిపిన అమ్మా? తన ప్రేమని ఏమాత్రం పంచకుండా మిగిలిపోయిన నాన్నా? ఎవరైతే బాగుంటుంది? ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి? ఎకౌంటింగ్... ఎకౌంటింగ్. ప్రతి చిన్నవిషయాన్నీ లెక్కల్లోకి తీసుకొని కాష్ ఎకౌంట్ టాలీ చేసేసి, ఎవరైతే బాగుంటుందో నిర్ణయం తీసుకోవడానికి అతనికి బహుశా అరక్షణం పట్టిందేమో! కానీ అప్పుడు తనమీదే తనకు వేసిన అసహ్యం, ఆ తరువాతి పరిణామాలలో మిగిలిన పశ్చాత్తాపం అతన్ని ఈ ప్రదర్శన రోజు వరకూ వెంటాడుతూనే ఉన్నాయి. ముందే చెప్పినట్టు, చాలా బాగా రాయబడ్డ ఈ భాగం మొత్తం ఎవరికి వారు చదువుకోవాల్సిందే. ప్రదర్శన పూర్తయింది. ప్రదర్శన మధ్యలో ‘నువ్వు మంచివాడివే, డోవాలే!’ అని ఉద్వేగంగా చెప్పిన మేడమ్ మీడియమ్ వెళ్లిపోతుంది. ఆ అమ్మాయి గురించి షో టైమ్‌లో తేలిగ్గా మాట్లాడిన డోవాలే ఆమె వెళ్లిపోతున్నప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా ముద్దుపెట్టుకుని పంపిస్తాడు. ఇక మిగిలింది అతనూ, అతని స్నేహితుడూ. I sentence you now to death by drowning! అన్న కాఫ్కా వాక్యం గుర్తొచ్చిన డోవాలే దాన్ని పైకే అంటాడు. అది తనమీద తను ఇచ్చుకున్న తీర్పా? లేజర్ పరిస్థితి మరోలా ఉంటుంది. To be whole, it is enough to exist అని చనిపోయిన తన భార్య చెవుల్లో గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తున్నా, ఆరోజున బాక్పాక్ వేసుకుని వెళ్లిపోతున్న కుర్రవాణ్ని స్నేహపూర్వకంగా పలకరించి ఏమైందో కనుక్కోలేనితనం అతన్ని వెంటాడుతోంది ఇప్పుడు. డోవాలే చూడమంది ఏమిటి? అతన్నా? తనని తానా? వదిలేసినవాటిని సరిచేసే పని ఎప్పుడో ఒకప్పుడు మొదలెట్టాలి. ‘‘ఇంటిదాకా నిన్ను డ్రాప్ చేయనా?’’ అని అడుగుతాడు జడ్జ్. ··· ప్రదర్శన మధ్యలో డోవాలే ప్రేక్షకులని ఉద్దేశించి సరదాగా అంటూ ఉంటాడు: Am I right or am I right? అని. అన్నిసార్లూ సరిగా ఉండటం అందరికీ సాధ్యం కాకపోయినా, అలా ఒక్కసారైనా సరీగ్గా లేకపోతే ఆ అపరాధభావన ఎలా కొందరిని వెంటాడగలదో, ‘చేదు విషం... జీవఫలం’ అనుకునేలా ఎలా దారితీస్తుందో డోవాలే కథ చెబుతుంది. అసంపూర్ణ సాఫల్యత అంత అరుదైన విషయమేమీ కాదు. బహుశా ఆ విషయం చెప్పటం కోసమే ఏమో – డోవాలే ప్రదర్శన మధ్యలో మొదలుపెట్టిన A horse walks into a bar జోక్‌ని పూర్తిగా చెప్పడం పూర్తిచేయలేకపోతాడు! ··· గతంలోంచి వర్తమానంలోకీ, మళ్లీ గతంలోకీ కథనం సాగించే ప్రయాణాలు ఈ నవలలో చాలా నేర్పుగా తీర్చబడ్డాయి. ఉద్వేగాలనీ, ఆలోచనలనీ సమపాళ్లల్లో కలగజేసే ఈ రెండువందల పేజీల నవలని మొదలుపెట్టాక ఏకబిగిన పూర్తిచేయకుండా ఉండలేం! - ఎ.వి.రమణమూర్తి 9866022150