చితికిన నవ్వుకు బుకర్
అన్నిసార్లూ సరిగా ఉండటం అందరికీ సాధ్యం కాకపోయినా, అలా ఒక్కసారైనా సరీగ్గా లేకపోతే ఆ అపరాధభావన ఎలా కొందరిని వెంటాడగలదో, ‘చేదు విషం... జీవఫలం’ అనుకునేలా ఎలా దారితీస్తుందో డోవాలే కథ చెబుతుంది.
‘ఒక నవలని రాస్తూ ఉన్నప్పుడు, ఆ నవల తన ప్రపంచాన్ని తను సృష్టించుకున్నాక అక్కడితో రచయిత పని పూర్తయిపోయినట్టే. అక్కణ్ణుంచి రచయిత తప్పుకుని నవలని ముగించాలి’ అనే డేవిడ్ గ్రాస్‌మన్ ఇజ్రాయెల్‌కు చెందిన అరవై మూడేళ్ల ప్రసిద్ధ లెఫ్ట్ వింగ్ రచయిత. ఈయన తాజాపుస్తకం A Horse Walks into a Bar ఈ సంవత్సరం మాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌ని గెలుచుకుంది. అనువాదకురాలు జెస్సికా కోహెన్‌తో కలిసి ఆయన పురస్కారాన్ని అందుకుంటారు. బ్రూనో షుల్జ్, కాఫ్కాల ప్రభావం తనమీద ఎక్కువగా ఉందనే గ్రాస్‌మన్, తన రచనలు కేవలం ఇజ్రాయెల్–పాలెస్తీనా సంఘర్షణలకి మాత్రమే పరిమితం కాదు అంటారు. నిజానికి ఆయన ప్రక్రియ(genre)ల సరిహద్దుల్ని అధిగమించిన రచయితగా ఇప్పటికే పేరు సంపాదించుకున్నారు.
నెటాన్యా అనే పట్టణంలోని ఒక కామెడీ క్లబ్‌లో కథానాయకుడు డోవాలే అనే స్టాండ్–అప్ కమెడియన్ ప్రదర్శనతో కథ ప్రారంభం. ఈ ప్రదర్శనకి అతను తన చిన్ననాటి స్నేహితుడు, రిటైర్డ్ జడ్జ్ అయిన అవిషై లేజర్‌ని కూడా ఆహ్వానిస్తాడు. ‘నేనొచ్చి ఏం చేయాలి?’ అంటాడు ఆ స్నేహితుడు. ‘వచ్చి నీ కళ్ళతో చూసి చెప్పు’ అంటాడు డోవాలే. ‘ఏం చెప్పాలి?’ అనడుగుతాడు జడ్జ్. ‘నువ్వు చూసింది...’ అంటాడు డోవాలే. ఈకథ అంతా ఆ జడ్జ్ మనకి చెబుతాడు. ఈ ప్రదర్శనకి అనుకోకుండా అతని చిన్ననాటి పరిచయస్తురాలు, మానిక్యూరిస్ట్, ఆత్మలతో సంభాషించే మీడియం కూడా వస్తుంది. తనని తనకు అర్థం చేయించే మాధ్యమం అవుతాడనుకున్న స్నేహితుడితో బాటు ఇప్పుడొక ‘మేడమ్ మీడియమ్’ కూడా!
ప్రదర్శన ప్రారంభం అవుతుంది. అయితే, మొదట్నుంచీ హాస్యం పాలు సన్నగిల్లుతూ, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు షోలో ఎక్కువవడంతో ప్రేక్షకులు క్రమక్రమంగా నీరసిస్తూ ఉంటారు. డోవాలే తల్లి రెండవ ప్రపంచయుద్ధం కాలంనాటి హోలోకాస్ట్ బాధితురాలు. చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తండ్రికి ఒక బార్బర్ షాప్ ఉంటుంది. అయినా, జీవనోపాధికోసం రకరకాల వ్యాపారాలు చేస్తూవుంటాడు. ప్రతి చిన్నవిషయానికీ క్రూరంగా హింసించే తండ్రికన్నా, తన తల్లిదగ్గరే అతనికి చనువు. అతని ఆటా పాటా అన్నీ అమ్మతోనే. అలాంటి హైస్కూల్ రోజుల్లో ఒక సంవత్సరం పాటు లేజర్ (జడ్జ్)తో స్నేహం. క్షణంపాటు నిలకడగా ఉండకుండా ‘గాలి తాకిడికే కితకితలు పుట్టి తెగమెలికలు తిరుగుతూ...’ ఉండే డోవాలేకి లేజర్‌తో మంచి స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత కొద్దికాలానికే లేజర్ వేరే ఊరికి మారిపోతాడు. అనంతర జీవితంలో డోవాలే చేసుకున్న మూడు పెళ్లిళ్లూ, కన్న ఐదుగురు పిల్లలూ అతనికి ఏమాత్రం సంతోషం కలిగించలేకపోయాయి. ‘నా కుటుంబం మొత్తం ఏకతాటిమీద – నాకు వ్యతిరేకంగా – నడిచేలా చేసుకున్న ఘనత మాత్రం నాకు దక్కింది!’ అని చెప్పుకుంటాడు. చేదు జ్ఞాపకాలూ, ప్రదర్శనలోని చేదు అనుభవాలూ అన్నీ కలిసి అతన్ని అశక్తతలోకీ, అందులోంచి తనని తాను హింసించుకునే విషాదంలోకి దారితీస్తూ ఉంటాయి.
ఈ విషాదం వెనకాల ఉన్న మౌలికమైన అంశం ఏమిటి? అన్న కథనంతో నవల చివరిభాగం మొదలవుతుంది. నవలలోని ఈ భాగం నడిపిన తీరు çహృద్యంగా ఉంటుంది. తన హైస్కూల్ రోజుల్లో లేజర్‌తో కలిసి, మిలిటరీ ఎడ్యుకేషన్ ఇచ్చే గాడ్నా కాంప్‌కి డోవాలే వెళతాడు. పదిగంటల ప్రయాణం. అక్కడికి వెళ్లాక తోటి పిల్లల దాష్టీకాలకి – లేజర్‌ని వాటినుంచి తప్పించడం కోసం – గురవుతుంటాడు. వెళ్లిన మూడోరోజో, నాలుగోరోజో అందరూ కాంప్‌లో కూచుని ఉన్నప్పుడు డోవాలేకి పై అధికారుల నుంచి పిలుపు వస్తుంది. తనేదో తప్పు చేసాడని ఇప్పుడు వాళ్లు ఏదో పనిష్మెంట్ ఇస్తారు కాబోలు అనుకుని వెళ్తే అక్కడ తెలిసిన విషయం – తన తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయారని.
ఆ విషయం తీవ్రతని అతను అర్థంచేసుకునేలోగా – అసలు విషయం కూడా పూర్తిగా చెప్పకుండా – సాయంత్రం నాలుగు గంటలకల్లా దహన సంస్కారాల దగ్గరకి అతన్ని చేర్చాలి అని హడావుడిగా అతన్ని ప్రయాణం కట్టిస్తారు. అతను తన బరువైన బాక్‌పాక్‌ని మోసుకుంటూ వెళ్తుంటే పిల్లలందరూ చూస్తారు – జడ్జ్ లేజర్‌తో సహా. ఎవ్వరూ ఏమీ కనుక్కోరు, ఎవరికీ ఏమీ తెలియదు. మిలిటరీవాళ్లు ఏర్పాటు చేసిన వాహనంలో ఒక్క డ్రైవర్‌తో అన్నిగంటల తిరుగుప్రయాణం. ఆ డ్రైవర్ తనకు తెలిసిన జోకులన్నీ బలవంతంగా చెప్తూ డోవాలేని కొంత తేలికపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
పోయింది ఎవరై ఉంటారు? తను ఎంతో ఆనందంగా రోజుకి కొన్ని గంటలు గడిపిన అమ్మా? తన ప్రేమని ఏమాత్రం పంచకుండా మిగిలిపోయిన నాన్నా? ఎవరైతే బాగుంటుంది? ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి? ఎకౌంటింగ్... ఎకౌంటింగ్. ప్రతి చిన్నవిషయాన్నీ లెక్కల్లోకి తీసుకొని కాష్ ఎకౌంట్ టాలీ చేసేసి, ఎవరైతే బాగుంటుందో నిర్ణయం తీసుకోవడానికి అతనికి బహుశా అరక్షణం పట్టిందేమో! కానీ అప్పుడు తనమీదే తనకు వేసిన అసహ్యం, ఆ తరువాతి పరిణామాలలో మిగిలిన పశ్చాత్తాపం అతన్ని ఈ ప్రదర్శన రోజు వరకూ వెంటాడుతూనే ఉన్నాయి. ముందే చెప్పినట్టు, చాలా బాగా రాయబడ్డ ఈ భాగం మొత్తం ఎవరికి వారు చదువుకోవాల్సిందే.
ప్రదర్శన పూర్తయింది. ప్రదర్శన మధ్యలో ‘నువ్వు మంచివాడివే, డోవాలే!’ అని ఉద్వేగంగా చెప్పిన మేడమ్ మీడియమ్ వెళ్లిపోతుంది. ఆ అమ్మాయి గురించి షో టైమ్‌లో తేలిగ్గా మాట్లాడిన డోవాలే ఆమె వెళ్లిపోతున్నప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా ముద్దుపెట్టుకుని పంపిస్తాడు.
ఇక మిగిలింది అతనూ, అతని స్నేహితుడూ. I sentence you now to death by drowning! అన్న కాఫ్కా వాక్యం గుర్తొచ్చిన డోవాలే దాన్ని పైకే అంటాడు. అది తనమీద తను ఇచ్చుకున్న తీర్పా?
లేజర్ పరిస్థితి మరోలా ఉంటుంది. To be whole, it is enough to exist అని చనిపోయిన తన భార్య చెవుల్లో గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తున్నా, ఆరోజున బాక్‌పాక్ వేసుకుని వెళ్లిపోతున్న కుర్రవాణ్ని స్నేహపూర్వకంగా పలకరించి ఏమైందో కనుక్కోలేనితనం అతన్ని వెంటాడుతోంది ఇప్పుడు. డోవాలే చూడమంది ఏమిటి? అతన్నా? తనని తానా? వదిలేసినవాటిని సరిచేసే పని ఎప్పుడో ఒకప్పుడు మొదలెట్టాలి. ‘‘ఇంటిదాకా నిన్ను డ్రాప్ చేయనా?’’ అని అడుగుతాడు జడ్జ్.
···
ప్రదర్శన మధ్యలో డోవాలే ప్రేక్షకులని ఉద్దేశించి సరదాగా అంటూ ఉంటాడు: Am I right or am I right? అని. అన్నిసార్లూ సరిగా ఉండటం అందరికీ సాధ్యం కాకపోయినా, అలా ఒక్కసారైనా సరీగ్గా లేకపోతే ఆ అపరాధభావన ఎలా కొందరిని వెంటాడగలదో, ‘చేదు విషం... జీవఫలం’ అనుకునేలా ఎలా దారితీస్తుందో డోవాలే కథ చెబుతుంది. అసంపూర్ణ సాఫల్యత అంత అరుదైన విషయమేమీ కాదు. బహుశా ఆ విషయం చెప్పటం కోసమే ఏమో – డోవాలే ప్రదర్శన మధ్యలో మొదలుపెట్టిన A horse walks into a bar జోక్‌ని పూర్తిగా చెప్పడం పూర్తిచేయలేకపోతాడు!
···
గతంలోంచి వర్తమానంలోకీ, మళ్లీ గతంలోకీ కథనం సాగించే ప్రయాణాలు ఈ నవలలో చాలా నేర్పుగా తీర్చబడ్డాయి. ఉద్వేగాలనీ, ఆలోచనలనీ సమపాళ్లల్లో కలగజేసే ఈ రెండువందల పేజీల నవలని మొదలుపెట్టాక ఏకబిగిన పూర్తిచేయకుండా ఉండలేం!
- ఎ.వి.రమణమూర్తి
9866022150