డోర్తే నోర్స్
41 ఏళ్ళ సోన్యా స్వీడిష్ క్రైమ్ నవళ్ళ డానిష్ అనువాదకురాలు. కోపెన్‌హేగెన్‌లో ఉంటుంది. ఆమె సహచరుడు, ఇరవై ఏళ్ళ ‘ఫ్రెంచ్ జడలు వేసుకునే’యువతి కోసం సోన్యాను వదిలిపెడతాడు. డానిష్ నవలయిన ‘మిర్రర్, షోల్డర్, సిగ్నల్’లో సోన్యా– డెన్మార్క్‌లో ఉండే తన జట్లండ్ పల్లెటూరుని వదిలిపెట్టి అప్పటికి 20 ఏళ్ళు దాటుతుంది. అయినా, అక్కడి మనుష్యులను గుర్తు చేసుకుంటూ, వరిపొలాల మధ్య తిరిగిన తన బాల్య జ్ఞాపకాలను పదిలపరచుకుంటుంది. తనకీ, అక్క కేట్‌కీ ఉండిన అన్యోన్యతను తలచుకుంటుంటుంది.
‘పాశ్చాత్య సంస్కృతి యొక్క బ్రహ్మాండమైన శవం మీద, నేనొక పరాన్నజీవిని’ అనుకుంటుంది.
‘నా జీవితపు యీ దశలో, నేనుండవల్సిన స్థితిలోనే ఉన్నానా!’ అన్న సందేహం తలెత్తినప్పుడు, జీవితంలో మార్పును ఆశించి డ్రైవింగ్ లైసెన్స్ కోసం పాఠాలు నేర్చుకోవడం మొదలెడుతుంది. తనకు డ్రైవింగ్ నేర్పించే యూటై చెప్పే, ‘అద్దం చూడు, భుజం తిప్పు, సిగ్నల్ వెయ్యి’ అన్న పాఠాలను మంత్రంలా జపిస్తుంది. అయితే, హఠాత్తుగా మెడ తిప్పినప్పుడు, తల తిరిగే ‘వర్టిగో’ సమస్య ఉంటుంది సోన్యాకు. దాన్ని నయం చేసుకోడానికి, ఆధ్యాత్మిక మర్దనలు చేసే ఎలెన్ వద్దకి వెళ్తుంది.
అన్నిటినీ తప్పించుకునే అలవాటు ఆమెకు. బాత్రూమ్‌కు వెళ్ళాలన్న నెపంతో ఎలెన్ క్లాసుల నుండి పారిపోతుంది. యూటై వెకిలితనం నచ్చక, డ్రైవింగ్ టీచర్‌ని మారుస్తుంది. అక్క కేట్‌కి ఫోన్ చేస్తే ఆమె ఎత్తకపోయినప్పుడు, ఉత్తరాలు రాసి, చెత్తబుట్టలో పడేస్తుంది. ‘నా అంతట నేను గేర్లు మార్చలేను’ అని యూటైకు చెప్పిన సోన్యా– నిజ జీవితంలో కూడా ఏదీ మార్చుకోలేకపోయిన ‘మూఢవిశ్వాసం, అనిశ్చితి’ నిండి ఉన్న మహిళ. అయితే, తమ అక్కచెల్లెళ్ళ గత అన్యోన్యత గురించిన సోన్యా కథనం, ఆమె ఊహించుకున్న పరిపూర్ణమైన బంధం కాదనీ, నిజానికి వాళ్ళిద్దరికీ పడేది కాదనీ పాఠకులకు తెలుస్తుంది. గతంలో బోయ్‌ఫ్రెండ్‌తో ఉండే సంబంధం కూడా బలవంతంగా ఏర్పరచుకున్నదే తప్ప, సోన్యాకి లైంగిక భావనలు కలగవన్నదీ స్పష్టమే.
‘నాతో ఏ సంబంధం పెట్టుకోవాలనుకోని రాజధాని నగరపు వీధి అంచుల్లో నిలబడ్డాను’ అనే సోన్యా కోపెన్‌హేగెన్‌లో ఉంటున్నప్పటికీ, దానిలో భాగం అవలేకపోతుంది. నవల ఆఖరున ఆమె గుర్తిస్తుంది: ‘నీవు వచ్చిన చోటు నీవు తిరిగి వెళ్లలేకపోయేది. నీవే పరాయిదానివయావు’.
సోన్యాకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా? ప్రేమ దొరుకుతుందా? లేదు. భవిష్యత్తులో ఏ మంచో జరుగుతుందన్న అస్పష్టమైన సూచన తప్ప, సోన్యా ఏమీ సాధించదు. కథ టైటిల్, కథనంలో అనేకసార్లు కనిపిస్తుంది. నవల్లో అధికభాగం– డ్రైవింగ్ పాఠాలూ, ఎలెన్ మాలిష్ బల్ల వివరాలూ ఉన్నదే. ఇతరులు తనని చూసే విధానంలో తనని తాను చూసుకోలేని సోన్యా గురించి పాఠకులు తమ సొంత అభిప్రాయాలను ఏర్పరచుకునే వీలు కలిపిస్తారు రచయిత్రి డోర్తే నోర్స్.
ఉత్తమ పురుషలో ఉండే పుస్తకంలో స్పష్టమైన కథాంశం ఉండదు. జరిగే సంఘటనలే వరుసగా కనిపిస్తాయి. ప్రేమ, సస్పెన్స్, చమత్కార సంభాషణలు ఉండవు. తన ప్రత్యక్షత కోసం ఒక స్త్రీ చేసే పోరాటం మాత్రమే కనిపిస్తుంది. నెమ్మదిగా సాగే కథనంలో వచనం ఎంత సరళంగా ఉన్నప్పటికీ, రచయిత్రి పదాలు ఉపయోగించే తీరు మాత్రం ఆసక్తికరమైనది. ‘ఆమెయందు, ఆకాశం తన్ని తాను పరిష్కారం లేని రీతిలో ఖాళీ చేసుకుంటోంది... ఫ్రిజ్‌లో పేరు పెట్టేంత విలువైనది ఏదీ లేదు.’ కథనం– వర్తమానానికీ, బాల్య జ్ఞాపకాలకీ మధ్య ఊగిసలాడుతుంది. దీన్ని మీకా హుక్స్‌ట్రా ఇంగ్లిష్‌లోకి అనువదించారు. పుష్కిన్స్ ప్రెస్ ప్రచురించింది. ‘మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఇంటర్నేషనల్, 2017’ కోసం షార్ట్‌లిస్ట్ అయింది.
-కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment