ముత్తాతను ముద్దాడిన చరిత్ర | Story Of Krishna Gubili Viriah | Sakshi
Sakshi News home page

ముత్తాతను ముద్దాడిన చరిత్ర

Published Mon, Feb 11 2019 12:17 AM | Last Updated on Mon, Feb 11 2019 12:17 AM

Story Of Krishna Gubili Viriah - Sakshi

కృష్ణ గుబిలి 

1970ల చివర్న. హైదరాబాదులో ఉండే కృష్ణ– దక్షిణాఫ్రికాలో పని చేసిన తన ముత్తాత వీరయ్య గురించి, నాయనమ్మ చెప్పే కథలు వింటూ పెరుగుతాడు. ముత్తాత– తన భార్యా, ఆరుగురు కొడుకులూ, కూతురు చెంగమ్మతో దిగిన ఫొటో దొరికినప్పుడు, తమ వంశవృక్షం గీయడం ప్రారంభిస్తాడు. ఇంటర్నెట్‌ వచ్చిన తరువాత– వీరయ్య వివరాల కోసం దౌత్య కార్యాలయాలకూ, పరిశోధకులకూ మెయిల్‌ చేసినా ఫలితం కనబడదు. సౌత్‌ ఆఫ్రికాలో ముత్తాత ఉండిన డర్బన్‌లో ఉన్న నటాల్‌ వెళ్ళి, అక్కడున్న దూరపు బంధువులని కలుసుకుంటాడు. ఆఫ్రికా నేషనల్‌ ఆర్కైవ్స్‌ వెతికినప్పుడు, వీరయ్య వలస కూలీగా వచ్చినవాడని తెలుస్తుంది.

వీరయ్య తన స్వగ్రామం కొర్లపాడు(కృష్ణా జిల్లా) నుండి బెజవాడ పారిపోతాడు. సౌత్‌ ఆఫ్రికాలో కూలీల ఉద్యోగాలిప్పించే కంపెనీ, అతనితోపాటు మరికొందరిని మద్రాస్‌ తీసుకెళ్ళి, డర్బన్‌ వెళ్ళే ఓడెక్కెస్తుంది. ఆ ప్రయాణంలో షేక్, వెంకటస్వామితో స్నేహం కుదురుతుంది. ఓడ దిగిన కూలీలు తమకి తోచిన పేర్లనీ, కులాన్నీ రెజిస్టర్‌ చేయించుకున్నప్పటికీ– అక్కడా కుల వ్యవస్థ ఉండేది. తమ వారసులు మెరుగైన జీవితం గడిపేందుకు కూలీలు అమానవీయమైన పరిస్థితులను ఎదురుకుంటూ, చెరుగ్గడల తోటల్లో పని చేసేవారు. తిట్లూ, కొరడా దెబ్బలూ భరించేవారు.

జీతం, భోజనపు సరుకులూ– సమయానికి అందివ్వడం ఇండియన్‌ సిర్దార్ల్ల(సర్దార్ల) మనఃస్థితి మీద ఆధారపడేది. పాస్‌ లేకుండా కూలీలు తోట బయటకి వెళ్ళకూడదు. ఆడకూలీల సంఖ్య తక్కువ అయినందున, పెళ్ళిళ్ళలో ఎదురు కట్నం ఇచ్చేవారు. ఒకసారి– జబ్బు పడిన తోటి కూలీని బయటకి తీసుకెళ్ళినప్పుడు, గాంధీజీని కలుసుకుంటాడు వీరయ్య. అలా, ఏళ్ళ కష్టం తరువాత హ్యూలెట్‌ పొలాలకి సర్దార్‌ అవుతాడు. ఇతరుల పట్ల సానుభూతి, మర్యాద ఉండే అతనంటే అందరికీ ఇష్టం. రాజమ్మని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటాడు. కొర్లపాడు చుట్టాలకి రాసిన ఉత్తరాలకి సమాధానం రాదు. అప్పటికి ఆఫ్రికా వాసులే దాస్యంలో చిక్కుకోవడంతో, వలస కూలీల గిరాకీ తక్కువవుతుంది.

1904లో తన 22వ ఏట ఆఫ్రికా వెళ్ళిన వీరయ్య, 1932లో కుటుంబంతో ఇండియా తిరిగి వస్తూ– కూతుర్నీ, అల్లుడినీ కూడా వెంటబెట్టుకొస్తాడు. వీరయ్య ఓడ దిగుతున్నప్పుడు, ‘ఆరుగురు కొడుకులున్నారు. బంగారపు గోడలతో ఇల్లు కడతావు’ అంటాడు కెప్టెన్‌. అప్పటికే వీరయ్య తల్లిదండ్రులు మరణిస్తారు. ఎవరెవరో వీరయ్య ఆస్తి కోసం చుట్టరికాలు కలుపుకుని– ఇంట్లో ఉన్న డబ్బూ, నగలూ దొంగిలించి– అతన్ని మళ్ళీ పేదరికంలోకి నెడతారు. చెంగమ్మ భర్తతో పాటు డర్బన్‌ తిరిగి వెళ్ళిపోతుంది. కొడుకులు ఉద్యోగాలు చేపడతారు. అక్కలైన దుర్గ, సరస్వతిని కలుసుకున్న తరువాత, ‘గణేశ్‌ చతుర్థి’ నాడు, తన 70వ ఏట వీరయ్య చనిపోతాడు.

‘నా ముత్తాత అనుభవాలు కథనంలో ఇమిడేలా, కొన్ని చారిత్రక ఘటనలను కాల్పనికం చేయవల్సి వచ్చింది’ అంటూ రచయిత కృష్ణ గుబిలి– పున:సృష్టించిన వృత్తాంతమే యీ ‘వీరయ్య’. తన మూలాలను కనుక్కోవాలని బయల్దేరిన కృష్ణ– ఏ దేశంలోనూ, ఇన్నేళ్ళ తరువాత కూడా వలస కూలీల జీవితాల్లో మార్పు రాలేదని గుర్తించి, ‘అప్పటి చెరుగ్గడల పొలాలకీ, యీనాటి ఆకాశ హార్మ్యాలకీ ఏ తేడా లేదు’ అంటాడు. ‘చరిత్రలో నిర్లక్ష్యపెట్టబడిన యీ అధ్యాయాన్ని లోకానికి పరిచయం చేయాలనుకున్నాను. పారిశ్రామిక ప్రపంచంలో భారతదేశపు కూలీల గురించినదీ పుస్తకం’ అని చెబుతాడు.

ఆఖరి పేజీల్లో– ఎన్ని దేశాలకు, ఏ ఏ ప్రాంతాల నుండి ఎంతమంది కూలీలుగా వెళ్ళారు, అన్న గణాంకాలుంటాయి. కథనం, ప్ర«థమ పురుష నుంచి ఉత్తమ పురుషకు మారుతుంటుంది. ఫొటోలూ, గ్రాఫులూ, చేతిరాతలూ– అనేకమైన పేజీలు ఆక్రమించిన యీ పుస్తకాన్ని నోషన్‌ ప్రెస్, 2018 డిసెంబర్‌లో ప్రచురించింది.
-కృష్ణ వేణి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement