‘నేనంటూ ఉన్నానా, లేనా!’ అని సందేహపడే ఎలినర్ వయస్సు 29. తన చుట్టూ ఒంటరితనాన్ని కూడగట్టుకున్న యువతి ఆమె. గ్లాస్గో (స్కాట్లాండ్) ఆఫీసులో తొమ్మిదేళ్ళగా పని చేస్తుంటుంది. వారంలో అయిదు రోజులు పనితో, వారాంతాలు– పిజ్జాలు, రెండు వోడ్కాలు, ‘మమ్మీ’ తనని కించపరుస్తూ సలహాలిచ్చే ఫోన్ సంభాషణలతోనూ గడుస్తాయి. ‘ఎలినర్ ఒలిఫంట్ ఈజ్ కంప్లీట్లీ ఫైన్’ నవలకు ప్రధాన పాత్రా, కథకురాలూ అయిన ఎలినర్ నిజానికి ‘ఫైన్’గా ఏమీ ఉండదని త్వరలోనే తెలుస్తుంది. ‘నిశ్శబ్దం, ఒంటరితనం నన్ను నలిపివేస్తున్నప్పుడు, జీవించే ఉన్నానన్న సాక్ష్యం కోసమైనా కొన్నిసార్లు బిగ్గరగా మాట్లాడవలసి వస్తుంది’ అనుకునే ఎలినర్ తెలివైనదే. కాకపోతే, తను మనస్సులో అనుకునేది బయటకు చెప్పేసే సామాజిక మర్యాదలు తెలియని యువతి. ట్రెయిన్లో వినిపించే అనౌన్సుమెంట్లని విన్నప్పుడు, ‘యీ యంత్ర ప్రకటనల ముత్యాలని ఎవరికోసం పంచుతున్నారో! గ్రహాంతర వాసుల కోసం కాబోలు’ అంటుంది. ఆఫీసులో హేళనకు గురవుతుంటుంది. ఆమె పెరిగినది పెంపుడు తల్లిదండ్రుల ఇంట్లో.
‘నాకు 30 ఏళ్ళు వస్తున్నాయి. మగవాడి చేతిలో చేయి వేసుకుని నడవడం ఎరగను’ అనే ఎలినర్ సగం మొహం బాల్యంలోనే కాలిపోయుంటుంది. ఏనాడూ బ్యూటీ పార్లర్‌లోకి అడుగు పెట్టినది కాదామె. ఎత్తు మడమల జోళ్ళు తొడుక్కోలేదెప్పుడూ. ఒకరోజు ఆఫీసునుండి బయటకు వస్తుండగా, ఐటీ విభాగంలో పని చేస్తుండే రేమండ్ ఎదురవుతాడామెకి. రోడ్డుమీద పడిపోయిన ముసలాయన సామ్యూల్‌ని ఇద్దరూ కలిసి కాపాడినప్పుడు, వంటరివాళ్ళైన ముగ్గురికీ స్నేహం కుదురుతుంది. సరైన సమయాన జరిగిన ఆ సంఘటన, ఎలినార్ జీవితాన్నే మార్చేస్తుంది. ‘అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఒక వయస్సంటూ ఉండదు’ అంటారు రచయిత్రి గెయిల్ హనీమాన్.
ఆఫీసు లాటరీలో ఎలినర్ సంగీత కచేరీ టికెట్లు గెలుచుకుంటుంది. అక్కడి గాయకుడైన జానీయే తన జీవితంలో ప్రవేశించబోయే వ్యక్తనుకుని, పార్లర్లకి వెళ్ళడం ప్రారంభించి, కొత్త బట్టలు కొనుక్కుంటుంది. అతను తననుకున్న పెద్దమనిషి కాడని గ్రహించినప్పుడు, ఆత్మహత్య చేసుకుందామన్న ప్రయత్నంలో– నొప్పి మాత్రలు కలుపుకుని, పీకలకొద్దీ తాగి, తన ఫ్లాట్లో కింద పడిపోతుంది. ఆమె ఆఫీసుకి రాలేదని గుర్తించిన రేమండ్ ఆమెని తెలివిలోకి తెచ్చి, కొన్ని రోజుల తరువాత సైకియాట్రిస్ట్ వద్దకి తీసుకెళ్తాడు.
ఎలినర్ తన అస్పష్టమైన బాల్య జ్ఞాపకాల/అనుభవాల గురించి, ‘మమ్మీ’తో తనకుండే సంబంధం గురించీ థెరపిస్టుతో మాట్లాడుతుంది. తన బాల్యంలో ఇంటికి నిప్పంటించినది తల్లే అనీ, ఆమె అక్కడే చనిపోయిందనీ గ్రహించినప్పుడు, తను తల్లితో జరిపే సంభాషణలు ఏకపక్షమైనవని అర్థం చేసుకుంటుంది. ‘జీవితం సరిగ్గా ఉంటే సరిపోదు, జీవితం మెరుగ్గా ఉండాలి’ అని రేమండ్ చెప్తాడామెకు. అలా ఉండాలంటే– తన అపార్టుమెంటు గోడల వెనుకా, వోడ్కా వెనుకా దాక్కోడం సరిపోదని తెలుసుకుని, తను తప్పించుకున్న లోకాన్ని పరిచయం చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఆఫీసుకు తిరిగి వెళ్ళినప్పుడు, అందరూ ఆమెని ఆదరిస్తారు.
‘నా జీవితమంతా చావు కోసమే ఎదురుచూస్తూ గడిపాను. నిజమైన మరణం అని కాదు కానీ సజీవంగా ఉండాల్సిన అవసరం లేని మృత్యువు’ అని పుస్తకం మొదట్లో చెప్పిన ఎలినర్– ఆఖర్న, ‘ఇంకా బతికే ఉన్నాను. అదే ముఖ్యం’ అనే స్థితికి చేరుకుంటుంది. లాంఛనప్రాయమైన భాషతో రాసిన నవలలో విశదమైన వర్ణనలుంటాయి. ఎలినర్ ఎదుగుదలని చూడటం వల్ల పాఠకులకు కలుగుతుండే విచారం దూరం అవుతుంది. ఉన్న కొద్ది పాత్రలనీ నేర్పుతో తీర్చిదిద్దిన రచయిత్రి యీ తొలి నవలని, వైకింగ్– పామెలా డొమన్ బుక్స్, 2017లో ప్రచురించింది.
- కృష్ణ వేణి
పూర్తిగా ఎప్పుడు బాగుంటాం!
Published Mon, Sep 24 2018 3:37 AM | Last Updated on Mon, Sep 24 2018 3:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment