Man Booker Prize
-
అల్‌హార్తికి మాన్ బుకర్ బహుమతి
లండన్: సాహిత్యరంగంలో అందించే ప్రఖ్యాత మాన్‌బుకర్ ప్రైజ్ 2019కిగానూ ఓ అరబ్ మహిళను వరించింది. ఒమన్‌కు చెందిన రచయిత్రి జోఖా అల్హార్తి(40) రాసిన ‘సెలస్టియల్ బాడీ’ నవలకు ఈసారి మాన్ బుకర్ ప్రైజ్ దక్కింది. లండన్‌లోని రౌండ్‌హౌస్‌లో బుకర్ప్రైజ్ను అందుకున్న అల్హార్తి.. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్ మహిళగా చరిత్ర సృష్టించారు. బ్రిటన్ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్‌లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వం పరిస్థితులను ఈ నవలలో అల్హార్తి వర్ణించారు. ఈ అవార్డు కింద అందే రూ.44.60 లక్షల(64,000 డాలర్ల)ను అల్హార్తి, అనువాదకురాలు మార్లిన్ చెరిసగం పంచుకోనున్నారు. -
గేర్లు మార్చుకోలేని జీవితం
41 ఏళ్ళ సోన్యా స్వీడిష్ క్రైమ్ నవళ్ళ డానిష్ అనువాదకురాలు. కోపెన్‌హేగెన్‌లో ఉంటుంది. ఆమె సహచరుడు, ఇరవై ఏళ్ళ ‘ఫ్రెంచ్ జడలు వేసుకునే’యువతి కోసం సోన్యాను వదిలిపెడతాడు. డానిష్ నవలయిన ‘మిర్రర్, షోల్డర్, సిగ్నల్’లో సోన్యా– డెన్మార్క్‌లో ఉండే తన జట్లండ్ పల్లెటూరుని వదిలిపెట్టి అప్పటికి 20 ఏళ్ళు దాటుతుంది. అయినా, అక్కడి మనుష్యులను గుర్తు చేసుకుంటూ, వరిపొలాల మధ్య తిరిగిన తన బాల్య జ్ఞాపకాలను పదిలపరచుకుంటుంది. తనకీ, అక్క కేట్కీ ఉండిన అన్యోన్యతను తలచుకుంటుంటుంది. ‘పాశ్చాత్య సంస్కృతి యొక్క బ్రహ్మాండమైన శవం మీద, నేనొక పరాన్నజీవిని’ అనుకుంటుంది. ‘నా జీవితపు యీ దశలో, నేనుండవల్సిన స్థితిలోనే ఉన్నానా!’ అన్న సందేహం తలెత్తినప్పుడు, జీవితంలో మార్పును ఆశించి డ్రైవింగ్ లైసెన్స్ కోసం పాఠాలు నేర్చుకోవడం మొదలెడుతుంది. తనకు డ్రైవింగ్ నేర్పించే యూటై చెప్పే, ‘అద్దం చూడు, భుజం తిప్పు, సిగ్నల్ వెయ్యి’ అన్న పాఠాలను మంత్రంలా జపిస్తుంది. అయితే, హఠాత్తుగా మెడ తిప్పినప్పుడు, తల తిరిగే ‘వర్టిగో’ సమస్య ఉంటుంది సోన్యాకు. దాన్ని నయం చేసుకోడానికి, ఆధ్యాత్మిక మర్దనలు చేసే ఎలెన్ వద్దకి వెళ్తుంది. అన్నిటినీ తప్పించుకునే అలవాటు ఆమెకు. బాత్రూమ్కు వెళ్ళాలన్న నెపంతో ఎలెన్ క్లాసుల నుండి పారిపోతుంది. యూటై వెకిలితనం నచ్చక, డ్రైవింగ్ టీచర్ని మారుస్తుంది. అక్క కేట్కి ఫోన్ చేస్తే ఆమె ఎత్తకపోయినప్పుడు, ఉత్తరాలు రాసి, చెత్తబుట్టలో పడేస్తుంది. ‘నా అంతట నేను గేర్లు మార్చలేను’ అని యూటైకు చెప్పిన సోన్యా– నిజ జీవితంలో కూడా ఏదీ మార్చుకోలేకపోయిన ‘మూఢవిశ్వాసం, అనిశ్చితి’ నిండి ఉన్న మహిళ. అయితే, తమ అక్కచెల్లెళ్ళ గత అన్యోన్యత గురించిన సోన్యా కథనం, ఆమె ఊహించుకున్న పరిపూర్ణమైన బంధం కాదనీ, నిజానికి వాళ్ళిద్దరికీ పడేది కాదనీ పాఠకులకు తెలుస్తుంది. గతంలో బోయ్‌ఫ్రెండ్‌తో ఉండే సంబంధం కూడా బలవంతంగా ఏర్పరచుకున్నదే తప్ప, సోన్యాకి లైంగిక భావనలు కలగవన్నదీ స్పష్టమే. ‘నాతో ఏ సంబంధం పెట్టుకోవాలనుకోని రాజధాని నగరపు వీధి అంచుల్లో నిలబడ్డాను’ అనే సోన్యా కోపెన్‌హేగెన్‌లో ఉంటున్నప్పటికీ, దానిలో భాగం అవలేకపోతుంది. నవల ఆఖరున ఆమె గుర్తిస్తుంది: ‘నీవు వచ్చిన చోటు నీవు తిరిగి వెళ్లలేకపోయేది. నీవే పరాయిదానివయావు’. సోన్యాకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా? ప్రేమ దొరుకుతుందా? లేదు. భవిష్యత్తులో ఏ మంచో జరుగుతుందన్న అస్పష్టమైన సూచన తప్ప, సోన్యా ఏమీ సాధించదు. కథ టైటిల్, కథనంలో అనేకసార్లు కనిపిస్తుంది. నవల్లో అధికభాగం– డ్రైవింగ్ పాఠాలూ, ఎలెన్ మాలిష్ బల్ల వివరాలూ ఉన్నదే. ఇతరులు తనని చూసే విధానంలో తనని తాను చూసుకోలేని సోన్యా గురించి పాఠకులు తమ సొంత అభిప్రాయాలను ఏర్పరచుకునే వీలు కలిపిస్తారు రచయిత్రి డోర్తే నోర్స్. ఉత్తమ పురుషలో ఉండే పుస్తకంలో స్పష్టమైన కథాంశం ఉండదు. జరిగే సంఘటనలే వరుసగా కనిపిస్తాయి. ప్రేమ, సస్పెన్స్, చమత్కార సంభాషణలు ఉండవు. తన ప్రత్యక్షత కోసం ఒక స్త్రీ చేసే పోరాటం మాత్రమే కనిపిస్తుంది. నెమ్మదిగా సాగే కథనంలో వచనం ఎంత సరళంగా ఉన్నప్పటికీ, రచయిత్రి పదాలు ఉపయోగించే తీరు మాత్రం ఆసక్తికరమైనది. ‘ఆమెయందు, ఆకాశం తన్ని తాను పరిష్కారం లేని రీతిలో ఖాళీ చేసుకుంటోంది... ఫ్రిజ్‌లో పేరు పెట్టేంత విలువైనది ఏదీ లేదు.’ కథనం– వర్తమానానికీ, బాల్య జ్ఞాపకాలకీ మధ్య ఊగిసలాడుతుంది. దీన్ని మీకా హుక్స్ట్రా ఇంగ్లిష్‌లోకి అనువదించారు. పుష్కిన్స్ ప్రెస్ ప్రచురించింది. ‘మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఇంటర్నేషనల్, 2017’ కోసం షార్ట్‌లిస్ట్ అయింది. -కృష్ణ వేణి -
బుకర్ ప్రైజ్’కు మ్యాన్ గ్రూప్ గుడ్‌బై
లండన్: ఆంగ్ల నవలారంగంలో బ్రిటన్ అందించే అత్యున్నత పురస్కారం ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’ పేరు మారనుంది. బుకర్ ప్రైజ్‌కు 18 ఏళ్లుగా స్పాన్సర్ కొనసాగుతున్న హెడ్జ్ సంస్థ ‘మ్యాన్ గ్రూప్’ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. అత్యుత్తమ ఆంగ్ల నవలలకు ఏటా ఈ అవార్డు కింద 50వేల బ్రిటిష్ పౌండ్లు(రూ.46.79 లక్షలు) బహుమతిగా అందజేస్తున్నారు. బ్రిటన్ రచయిత సెబాస్టియన్ ఫాల్క్స్ గతేడాది మ్యాన్ గ్రూప్‌ను ప్రజలకు శత్రువుగా అభివర్ణించారు. అంతేకాకుండా కామన్వెల్త్ దేశాల రచయితలకే పరిమితమైన ఈ అవార్డును 2014లో మిగిలిన దేశాలకు విస్తరించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పాన్సర్ బాధ్యతల నుంచి తప్పుకోవా లని నిర్ణయించింది. దీనివల్ల ఏటా రూ.14.97 కోట్ల ఆర్థిక సాయాన్ని బుకర్ సంస్థ కోల్పోనుంది. 1969 నుంచి 2002 వరకూ బుకర్ అవార్డుకు మెక్‌కెన్నెల్ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అప్పట్లో 21 వేల పౌండ్లుగా ఉన్న బహుమతిని 2002లో మ్యాన్ గ్రూప్ 50 వేల పౌండ్లకు పెంచింది. -
‘ద ఇంగ్లిష్ పేషంట్’కు గోల్డెన్ బుకర్
లండన్: శ్రీలంక మూలాలు కలిగిన కెనడా రచయిత, సాంస్కృతిక దిగ్గజం మైకేల్ ఆందాజీ రచన ‘ద ఇంగ్లిష్ పేషంట్’ గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. ఇది గత యాభై ఏళ్లలో బుకర్ ప్రైజ్ సాధించిన పుస్తకాల్లో అత్యుత్తమమైందిగా ఎంపికైంది. బుకర్ ప్రైజ్ స్థాపించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఓటింగ్ నిర్వహించి దీన్ని ఎంపిక చేశారు. గతంలో మ్యాన్ బుకర్ ప్రైజ్ సాధించిన భారతీయ మూలాలు కలిగిన రచయితలు వీఎస్ నైపాల్ (ఇన్ ఎ ఫ్రీ స్టేట్–1971), సల్మాన్ రష్దీ (మిడ్నైట్స్ చిల్డ్రన్–1981), అరుంధతీరాయ్ (ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్–1997), కిరణ్ దేశాయ్ (ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్–2006), అరవింద్ అడిగ (ద వైట్ టైగర్–2008)లతో సహా విజేతలందరినీ ఓడించి 74 ఏళ్ల ఆందాజీ ఈ ఘనత సాధించారు. ‘ద ఇంగ్లిష్ పేషంట్’ నవల బేరీ ఉన్స్‌వర్త్ రచన ‘సేక్రెడ్ హంగర్’తో కలిసి 1992లో బుకర్ ప్రైజ్ గెల్చుకుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రేమ, సంఘర్షణకు సంబంధించిన కథను ఆందాజీ ఆ నవలలో అత్యద్భుత వర్ణనలతో అందరినీ ఆకట్టుకునేలా రచించారు. మ్యాన్ బుకర్ ప్రైజ్ 50వ వార్షికోత్సవం సందర్భంగా గతంలో ఈ ప్రైజ్ సాధించిన 51 మంది విజేతలను జడ్జీల ప్యానెల్‌గా ఎంపిక చేశారు. వారు ప్రతి దశాబ్దానికీ ఓ నవలను ఎంపిక చేయగా.. ఆ ఐదు నవలల్లో ప్రజలు ఓట్ల ద్వారా ఆందాజీ యుద్ధ కాలపు ప్రేమ కథకు పట్టం కట్టారు. ఈ సందర్భంగా లండన్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆందాజీ మాట్లాడుతూ జాబితాలో ఇదే అత్యుత్తమ పుస్తకమని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ చైర్మన్ హెలెనా కెన్నెడీ ఆందాజీ రచన గురించి మాట్లాడుతూ ‘ఇది కవితాత్మక, తాత్విక అంశాలతో కూడిన సమగ్ర రచనా సృష్టి. ఇది ముమ్మాటికీ గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్‌కు అర్హత కలిగింది’ అని అన్నారు. జడ్జి కమిలా షంసీ మాట్లాడుతూ ఇది అరుదైన నవలని, అందరినీ భావోద్వేగానికి గురిచేస్తుందని అన్నారు. 2008లో బుకర్ ప్రైజ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఓటింగ్ నిర్వహించగా ప్రజలు సల్మాన్ రష్దీ ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’కు పట్టం కట్టారు. -
చితికిన నవ్వుకు బుకర్
అన్నిసార్లూ సరిగా ఉండటం అందరికీ సాధ్యం కాకపోయినా, అలా ఒక్కసారైనా సరీగ్గా లేకపోతే ఆ అపరాధభావన ఎలా కొందరిని వెంటాడగలదో, ‘చేదు విషం... జీవఫలం’ అనుకునేలా ఎలా దారితీస్తుందో డోవాలే కథ చెబుతుంది. ‘ఒక నవలని రాస్తూ ఉన్నప్పుడు, ఆ నవల తన ప్రపంచాన్ని తను సృష్టించుకున్నాక అక్కడితో రచయిత పని పూర్తయిపోయినట్టే. అక్కణ్ణుంచి రచయిత తప్పుకుని నవలని ముగించాలి’ అనే డేవిడ్ గ్రాస్మన్ ఇజ్రాయెల్‌కు చెందిన అరవై మూడేళ్ల ప్రసిద్ధ లెఫ్ట్ వింగ్ రచయిత. ఈయన తాజాపుస్తకం A Horse Walks into a Bar ఈ సంవత్సరం మాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌ని గెలుచుకుంది. అనువాదకురాలు జెస్సికా కోహెన్‌తో కలిసి ఆయన పురస్కారాన్ని అందుకుంటారు. బ్రూనో షుల్జ్, కాఫ్కాల ప్రభావం తనమీద ఎక్కువగా ఉందనే గ్రాస్మన్, తన రచనలు కేవలం ఇజ్రాయెల్–పాలెస్తీనా సంఘర్షణలకి మాత్రమే పరిమితం కాదు అంటారు. నిజానికి ఆయన ప్రక్రియ(genre)ల సరిహద్దుల్ని అధిగమించిన రచయితగా ఇప్పటికే పేరు సంపాదించుకున్నారు. నెటాన్యా అనే పట్టణంలోని ఒక కామెడీ క్లబ్లో కథానాయకుడు డోవాలే అనే స్టాండ్–అప్ కమెడియన్ ప్రదర్శనతో కథ ప్రారంభం. ఈ ప్రదర్శనకి అతను తన చిన్ననాటి స్నేహితుడు, రిటైర్డ్ జడ్జ్ అయిన అవిషై లేజర్ని కూడా ఆహ్వానిస్తాడు. ‘నేనొచ్చి ఏం చేయాలి?’ అంటాడు ఆ స్నేహితుడు. ‘వచ్చి నీ కళ్ళతో చూసి చెప్పు’ అంటాడు డోవాలే. ‘ఏం చెప్పాలి?’ అనడుగుతాడు జడ్జ్. ‘నువ్వు చూసింది...’ అంటాడు డోవాలే. ఈకథ అంతా ఆ జడ్జ్ మనకి చెబుతాడు. ఈ ప్రదర్శనకి అనుకోకుండా అతని చిన్ననాటి పరిచయస్తురాలు, మానిక్యూరిస్ట్, ఆత్మలతో సంభాషించే మీడియం కూడా వస్తుంది. తనని తనకు అర్థం చేయించే మాధ్యమం అవుతాడనుకున్న స్నేహితుడితో బాటు ఇప్పుడొక ‘మేడమ్ మీడియమ్’ కూడా! ప్రదర్శన ప్రారంభం అవుతుంది. అయితే, మొదట్నుంచీ హాస్యం పాలు సన్నగిల్లుతూ, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు షోలో ఎక్కువవడంతో ప్రేక్షకులు క్రమక్రమంగా నీరసిస్తూ ఉంటారు. డోవాలే తల్లి రెండవ ప్రపంచయుద్ధం కాలంనాటి హోలోకాస్ట్ బాధితురాలు. చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తండ్రికి ఒక బార్బర్ షాప్ ఉంటుంది. అయినా, జీవనోపాధికోసం రకరకాల వ్యాపారాలు చేస్తూవుంటాడు. ప్రతి చిన్నవిషయానికీ క్రూరంగా హింసించే తండ్రికన్నా, తన తల్లిదగ్గరే అతనికి చనువు. అతని ఆటా పాటా అన్నీ అమ్మతోనే. అలాంటి హైస్కూల్ రోజుల్లో ఒక సంవత్సరం పాటు లేజర్ (జడ్జ్)తో స్నేహం. క్షణంపాటు నిలకడగా ఉండకుండా ‘గాలి తాకిడికే కితకితలు పుట్టి తెగమెలికలు తిరుగుతూ...’ ఉండే డోవాలేకి లేజర్‌తో మంచి స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత కొద్దికాలానికే లేజర్ వేరే ఊరికి మారిపోతాడు. అనంతర జీవితంలో డోవాలే చేసుకున్న మూడు పెళ్లిళ్లూ, కన్న ఐదుగురు పిల్లలూ అతనికి ఏమాత్రం సంతోషం కలిగించలేకపోయాయి. ‘నా కుటుంబం మొత్తం ఏకతాటిమీద – నాకు వ్యతిరేకంగా – నడిచేలా చేసుకున్న ఘనత మాత్రం నాకు దక్కింది!’ అని చెప్పుకుంటాడు. చేదు జ్ఞాపకాలూ, ప్రదర్శనలోని చేదు అనుభవాలూ అన్నీ కలిసి అతన్ని అశక్తతలోకీ, అందులోంచి తనని తాను హింసించుకునే విషాదంలోకి దారితీస్తూ ఉంటాయి. ఈ విషాదం వెనకాల ఉన్న మౌలికమైన అంశం ఏమిటి? అన్న కథనంతో నవల చివరిభాగం మొదలవుతుంది. నవలలోని ఈ భాగం నడిపిన తీరు çహృద్యంగా ఉంటుంది. తన హైస్కూల్ రోజుల్లో లేజర్‌తో కలిసి, మిలిటరీ ఎడ్యుకేషన్ ఇచ్చే గాడ్నా కాంప్కి డోవాలే వెళతాడు. పదిగంటల ప్రయాణం. అక్కడికి వెళ్లాక తోటి పిల్లల దాష్టీకాలకి – లేజర్ని వాటినుంచి తప్పించడం కోసం – గురవుతుంటాడు. వెళ్లిన మూడోరోజో, నాలుగోరోజో అందరూ కాంప్‌లో కూచుని ఉన్నప్పుడు డోవాలేకి పై అధికారుల నుంచి పిలుపు వస్తుంది. తనేదో తప్పు చేసాడని ఇప్పుడు వాళ్లు ఏదో పనిష్మెంట్ ఇస్తారు కాబోలు అనుకుని వెళ్తే అక్కడ తెలిసిన విషయం – తన తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయారని. ఆ విషయం తీవ్రతని అతను అర్థంచేసుకునేలోగా – అసలు విషయం కూడా పూర్తిగా చెప్పకుండా – సాయంత్రం నాలుగు గంటలకల్లా దహన సంస్కారాల దగ్గరకి అతన్ని చేర్చాలి అని హడావుడిగా అతన్ని ప్రయాణం కట్టిస్తారు. అతను తన బరువైన బాక్పాక్ని మోసుకుంటూ వెళ్తుంటే పిల్లలందరూ చూస్తారు – జడ్జ్ లేజర్‌తో సహా. ఎవ్వరూ ఏమీ కనుక్కోరు, ఎవరికీ ఏమీ తెలియదు. మిలిటరీవాళ్లు ఏర్పాటు చేసిన వాహనంలో ఒక్క డ్రైవర్‌తో అన్నిగంటల తిరుగుప్రయాణం. ఆ డ్రైవర్ తనకు తెలిసిన జోకులన్నీ బలవంతంగా చెప్తూ డోవాలేని కొంత తేలికపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పోయింది ఎవరై ఉంటారు? తను ఎంతో ఆనందంగా రోజుకి కొన్ని గంటలు గడిపిన అమ్మా? తన ప్రేమని ఏమాత్రం పంచకుండా మిగిలిపోయిన నాన్నా? ఎవరైతే బాగుంటుంది? ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి? ఎకౌంటింగ్... ఎకౌంటింగ్. ప్రతి చిన్నవిషయాన్నీ లెక్కల్లోకి తీసుకొని కాష్ ఎకౌంట్ టాలీ చేసేసి, ఎవరైతే బాగుంటుందో నిర్ణయం తీసుకోవడానికి అతనికి బహుశా అరక్షణం పట్టిందేమో! కానీ అప్పుడు తనమీదే తనకు వేసిన అసహ్యం, ఆ తరువాతి పరిణామాలలో మిగిలిన పశ్చాత్తాపం అతన్ని ఈ ప్రదర్శన రోజు వరకూ వెంటాడుతూనే ఉన్నాయి. ముందే చెప్పినట్టు, చాలా బాగా రాయబడ్డ ఈ భాగం మొత్తం ఎవరికి వారు చదువుకోవాల్సిందే. ప్రదర్శన పూర్తయింది. ప్రదర్శన మధ్యలో ‘నువ్వు మంచివాడివే, డోవాలే!’ అని ఉద్వేగంగా చెప్పిన మేడమ్ మీడియమ్ వెళ్లిపోతుంది. ఆ అమ్మాయి గురించి షో టైమ్‌లో తేలిగ్గా మాట్లాడిన డోవాలే ఆమె వెళ్లిపోతున్నప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా ముద్దుపెట్టుకుని పంపిస్తాడు. ఇక మిగిలింది అతనూ, అతని స్నేహితుడూ. I sentence you now to death by drowning! అన్న కాఫ్కా వాక్యం గుర్తొచ్చిన డోవాలే దాన్ని పైకే అంటాడు. అది తనమీద తను ఇచ్చుకున్న తీర్పా? లేజర్ పరిస్థితి మరోలా ఉంటుంది. To be whole, it is enough to exist అని చనిపోయిన తన భార్య చెవుల్లో గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తున్నా, ఆరోజున బాక్పాక్ వేసుకుని వెళ్లిపోతున్న కుర్రవాణ్ని స్నేహపూర్వకంగా పలకరించి ఏమైందో కనుక్కోలేనితనం అతన్ని వెంటాడుతోంది ఇప్పుడు. డోవాలే చూడమంది ఏమిటి? అతన్నా? తనని తానా? వదిలేసినవాటిని సరిచేసే పని ఎప్పుడో ఒకప్పుడు మొదలెట్టాలి. ‘‘ఇంటిదాకా నిన్ను డ్రాప్ చేయనా?’’ అని అడుగుతాడు జడ్జ్. ··· ప్రదర్శన మధ్యలో డోవాలే ప్రేక్షకులని ఉద్దేశించి సరదాగా అంటూ ఉంటాడు: Am I right or am I right? అని. అన్నిసార్లూ సరిగా ఉండటం అందరికీ సాధ్యం కాకపోయినా, అలా ఒక్కసారైనా సరీగ్గా లేకపోతే ఆ అపరాధభావన ఎలా కొందరిని వెంటాడగలదో, ‘చేదు విషం... జీవఫలం’ అనుకునేలా ఎలా దారితీస్తుందో డోవాలే కథ చెబుతుంది. అసంపూర్ణ సాఫల్యత అంత అరుదైన విషయమేమీ కాదు. బహుశా ఆ విషయం చెప్పటం కోసమే ఏమో – డోవాలే ప్రదర్శన మధ్యలో మొదలుపెట్టిన A horse walks into a bar జోక్‌ని పూర్తిగా చెప్పడం పూర్తిచేయలేకపోతాడు! ··· గతంలోంచి వర్తమానంలోకీ, మళ్లీ గతంలోకీ కథనం సాగించే ప్రయాణాలు ఈ నవలలో చాలా నేర్పుగా తీర్చబడ్డాయి. ఉద్వేగాలనీ, ఆలోచనలనీ సమపాళ్లల్లో కలగజేసే ఈ రెండువందల పేజీల నవలని మొదలుపెట్టాక ఏకబిగిన పూర్తిచేయకుండా ఉండలేం! - ఎ.వి.రమణమూర్తి 9866022150 -
తొలిసారిగా అమెరికన్‌కు ‘బుకర్’
‘ది సెల్అవుట్’ నవలకు పురస్కారం అందుకున్న పాల్ బెయిటీ లండన్: ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం మాన్ బుకర్ ప్రైజ్‌ను అందుకున్న తొలి అమెరికన్‌గా పాల్ బెయిటీ చరిత్ర పుటలకెక్కారు. అమెరికాలోని జాతి వివక్ష రాజకీయాల నేపథ్యంగా ఆయన రచించిన ‘ది సెల్అవుట్’ నవల 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపికైంది. లాస్ ఏంజెలిస్ నగర శివారులోని ఒక ఆఫ్రికన్-అమెరికన్ తన ఉనికిని కాపాడుకోవడం, తిరిగి బానిసత్వంలోకి వెళ్లడాన్ని ఇందులో చిత్రీకరించారు. ఈ వ్యంగ్య రచనపై జ్యూరీ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. లండన్‌లోని గిల్డ్ హాల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లాస్ఏంజెల్స్కు చెందిన 54 ఏళ్ల బెయిటీ యాభైవేల పౌండ్ల విలువైన సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆనందం, ఉద్వేగం ముంచెత్తినట్టుగా కన్పించిన బెయిటీ అవార్డు స్వీకార ప్రసంగం ప్రారంభంలో మాటల కోసం తడుముకున్నారు. ‘రాయడం నాకసహ్యం. ఇదో కష్టతరమైన పుస్తకం. ఎంతో కష్టంతో రాశా. దీన్ని చదవడమూ కష్టమే’ అని అన్నారు. ది సెల్ అవుట్‌ను.. దిగ్భ్రాంతికర, అనూహ్య రచనగా జ్యూరీ సభ్యులు అభివర్ణించారు. విఖ్యాత రచయితలు మార్క్ టై్వన్, జోనథాన్ స్విఫ్ట్ వంటివారి సరసన బెయిటీని నిలబెట్టిందని కొనియాడారు. వ్యంగ్యరచన బహు క్లిష్టమైనదని, వ్యంగ్యాన్ని బాగా పండించిన అతి అరుదైన పుస్తకాల్లో సెల్ అవుట్ ఒకటని జ్యూరీ చైర్మన్ ఆమండా ఫోర్మాన్ అన్నారు. సమకాలీన అమెరికా సమాజాన్ని ఇది తాకిందని చెప్పారు. స్విఫ్ట్, మార్క్ టై్వన్ల తర్వాత ఇలాంటి రచనలను తాను చూడలేదన్నారు. ఒకవైపు హాస్యాన్ని, అదే సమయంలో వేదనను ఈ నవల పండించిందన్నారు. బెయిటీ గతంలో స్లంబర్‌ల్యాండ్, టఫ్, ది వైట్ బాయ్ షపుల్ అనే నవలలు రాశారు. -
చరిత్రలో మొట్టమొదటిసారిగా అమెరికాకు..
లండన్: ఇంగ్లిష్ భాషకు సంబంధించి అత్యున్నత సాహిత్య పురస్కారమైన ’మ్యాన్ బుకర్ ప్రైజ్’ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అమెరికన్ రచయితను వరించింది. ’ద సెల్‌ఔట్’ నవలకుగాను అమెరికన్ రచయిత పాల్ బీటీకి ఈ పురస్కారాన్ని దక్కింది. తన స్వస్థలమైన లాస్ ఏంజిల్స్ నేపథ్యంగా తీసుకొని జాతుల మధ్య సమానత్వం కోసం వ్యంగ్యంగా పాల్ బీటీ ఈ రచన చేశారని, ఈ నవల దిగ్భ్రాంతికరంగా ఊహించనిరీతిలో హాస్యాన్ని పండించిందని జ్యూరీ కొనియాడింది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ సతీమణి కెమిల్లా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న రచయిత పాల్ భావోద్వేగపూరితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సాహిత్య ప్రస్థానం ఈ స్థాయి వరకు వస్తుందని అనుకోలేదని పేర్కొన్నారు. కల్పిత పరిసరాలను ఇతివృత్తంగా తీసుకొని జాతుల మధ్య చారిత్రకంగా కొనసాగుతున్న సంబంధాలు, సంఘర్షణలు, వాటి పరిష్కారాలు తదితర అంశాల్ని చేదునిజాలతో వ్యంగ్యాత్మకంగా, హృద్యంగా ఈ నవలలో రచయిత చిత్రీకరించారని జ్యూరీ పేర్కొంది. 'మ్యాన్ బుకర్ ప్రైజ్' సంప్రదాయబద్ధంగా కామన్వెల్త్ దేశాల రచయితలకు ప్రదానం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 2013లో ఈ సంప్రదాయాన్ని మార్చి.. ఇంగ్లిష్ మాట్లాడే దేశాల రచయితలకు ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో అమెరికా రచయితకు తొలిసారి ఈ గౌరవం దక్కింది. -
‘బుకర్’ షార్ట్‌లిస్టులో యువ రచయిత్రికి చోటు
లండన్: బోస్టన్ కు చెందిన 35 ఏళ్ల రచయిత్రి ఒట్టెస్సా మొష్ఫెగ్ తన ఈలీన్ నవల ద్వారా మొదటిసారి బుకర్‌ప్రైజ్ షార్ట్‌లిస్టులో చోటు సంపాదించారు. ఒక మహిళ తను చేస్తున్న ఉద్యోగానికి, తాగుబోతు తండ్రికి మధ్య ఎలా నలిగిపోయిందనే కథాంశంతో ఈలీన్ నవలను రచయిత్రి రూపొందించారు. ప్రఖ్యాత బుకర్‌ప్రైజ్ కోసం ఆరుగురి పేర్లను మంగళవారం షార్ట్‌లిస్ట్ చేశారు. కాగా నోబెల్ బహుమతి విజేత జెఎం కేత్జీ రచించిన నవల ఇందులో చోటు సంపాదించలేకపోయింది. దక్షిణాఫ్రికా రచయిత్రి డెబోరా లెవీ తాజా నవల ‘హాట్ మిల్క్’ కూడా స్థానం సంపాదించింది. తద్వారా ఆమె రెండోసారి బుకర్‌ప్రైజ్ షార్ట్‌లిస్టులో చోటు సంపాదించినట్లైంది. స్పానిష్లోని ఓ చిన్న గ్రామంలో నివసించే రోగగ్రస్తురాలైన తల్లి, ఆమె కూతురు మధ్య అనుబంధం ఆధారంగా హాట్ మిల్క్‌ను రచయిత్రి మలి చారు. అలాగే స్కాటిష్ హైల్యాండ్స్లో ఉన్న ఓ చిన్న కమ్యూనిటీకి సంబంధించిన పేదరికానికి వాస్తవ రూపమిస్తూ స్కాటిష్ రచయిత గ్రేమ్ మెక్ రే బర్నెట్ నవల ‘హిజ్ బ్లడీ ప్రాజెక్టు’ థ్రిల్లర్ కూడా స్థానం సంపాదించింది. వీటితో పాటు మరోమూడు నవలలు షార్ట్‌లిస్టులోకి చేరాయి.