చరిత్రలో మొట్టమొదటిసారిగా అమెరికాకు..
లండన్: ఇంగ్లిష్ భాషకు సంబంధించి అత్యున్నత సాహిత్య పురస్కారమైన ’మ్యాన్ బుకర్ ప్రైజ్’ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అమెరికన్ రచయితను వరించింది. ’ద సెల్‌ఔట్’ నవలకుగాను అమెరికన్ రచయిత పాల్ బీటీకి ఈ పురస్కారాన్ని దక్కింది. తన స్వస్థలమైన లాస్ ఏంజిల్స్ నేపథ్యంగా తీసుకొని జాతుల మధ్య సమానత్వం కోసం వ్యంగ్యంగా పాల్ బీటీ ఈ రచన చేశారని, ఈ నవల దిగ్భ్రాంతికరంగా ఊహించనిరీతిలో హాస్యాన్ని పండించిందని జ్యూరీ కొనియాడింది.
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ సతీమణి కెమిల్లా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న రచయిత పాల్ భావోద్వేగపూరితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సాహిత్య ప్రస్థానం ఈ స్థాయి వరకు వస్తుందని అనుకోలేదని పేర్కొన్నారు. కల్పిత పరిసరాలను ఇతివృత్తంగా తీసుకొని జాతుల మధ్య చారిత్రకంగా కొనసాగుతున్న సంబంధాలు, సంఘర్షణలు, వాటి పరిష్కారాలు తదితర అంశాల్ని చేదునిజాలతో వ్యంగ్యాత్మకంగా, హృద్యంగా ఈ నవలలో రచయిత చిత్రీకరించారని జ్యూరీ పేర్కొంది. 'మ్యాన్ బుకర్ ప్రైజ్' సంప్రదాయబద్ధంగా కామన్‌వెల్త్ దేశాల రచయితలకు ప్రదానం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 2013లో ఈ సంప్రదాయాన్ని మార్చి.. ఇంగ్లిష్ మాట్లాడే దేశాల రచయితలకు ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో అమెరికా రచయితకు తొలిసారి ఈ గౌరవం దక్కింది.