తొలిసారిగా అమెరికన్‌కు ‘బుకర్’ | As the first American 'Booker' | Sakshi
Sakshi News home page

తొలిసారిగా అమెరికన్‌కు ‘బుకర్’

Published Thu, Oct 27 2016 2:18 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

తొలిసారిగా అమెరికన్‌కు ‘బుకర్’ - Sakshi

తొలిసారిగా అమెరికన్‌కు ‘బుకర్’

‘ది సెల్‌అవుట్’ నవలకు పురస్కారం అందుకున్న పాల్ బెయిటీ
 
 లండన్: ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం మాన్ బుకర్ ప్రైజ్‌ను అందుకున్న తొలి అమెరికన్‌గా పాల్ బెయిటీ చరిత్ర పుటలకెక్కారు. అమెరికాలోని జాతి వివక్ష రాజకీయాల నేపథ్యంగా ఆయన రచించిన ‘ది సెల్‌అవుట్’ నవల 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపికైంది. లాస్ ఏంజెలిస్ నగర శివారులోని ఒక ఆఫ్రికన్-అమెరికన్ తన ఉనికిని కాపాడుకోవడం, తిరిగి బానిసత్వంలోకి వెళ్లడాన్ని ఇందులో చిత్రీకరించారు.  ఈ వ్యంగ్య రచనపై జ్యూరీ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. లండన్‌లోని గిల్డ్ హాల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లాస్‌ఏంజెల్స్‌కు చెందిన 54 ఏళ్ల బెయిటీ యాభైవేల పౌండ్ల విలువైన సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు.

ఆనందం, ఉద్వేగం ముంచెత్తినట్టుగా కన్పించిన బెయిటీ అవార్డు స్వీకార ప్రసంగం ప్రారంభంలో మాటల కోసం తడుముకున్నారు. ‘రాయడం నాకసహ్యం. ఇదో కష్టతరమైన పుస్తకం. ఎంతో కష్టంతో రాశా. దీన్ని చదవడమూ కష్టమే’ అని అన్నారు. ది సెల్ అవుట్‌ను.. దిగ్భ్రాంతికర, అనూహ్య రచనగా జ్యూరీ సభ్యులు అభివర్ణించారు. విఖ్యాత రచయితలు మార్క్ టై్వన్, జోనథాన్ స్విఫ్ట్ వంటివారి సరసన బెయిటీని నిలబెట్టిందని కొనియాడారు.  వ్యంగ్యరచన బహు క్లిష్టమైనదని, వ్యంగ్యాన్ని బాగా పండించిన అతి అరుదైన పుస్తకాల్లో సెల్ అవుట్ ఒకటని జ్యూరీ చైర్మన్ ఆమండా ఫోర్‌మాన్ అన్నారు. సమకాలీన అమెరికా సమాజాన్ని ఇది తాకిందని చెప్పారు. స్విఫ్ట్, మార్క్ టై్వన్‌ల తర్వాత ఇలాంటి రచనలను తాను చూడలేదన్నారు. ఒకవైపు హాస్యాన్ని, అదే సమయంలో వేదనను ఈ నవల పండించిందన్నారు.  బెయిటీ గతంలో స్లంబర్‌ల్యాండ్, టఫ్, ది వైట్ బాయ్ షపుల్ అనే నవలలు రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement