సీన్‌ పెరిగింది | Anora director Sean Baker makes Oscars history with 4 wins for the same movie | Sakshi
Sakshi News home page

సీన్‌ పెరిగింది

Published Tue, Mar 4 2025 6:27 AM | Last Updated on Tue, Mar 4 2025 6:27 AM

Anora director Sean Baker makes Oscars history with 4 wins for the same movie

అమెరికన్‌ ఫిల్మ్‌ మేకర్‌ సీన్‌ బేకర్‌ సీన్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ‘అనోరా’ సినిమాకు గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, ఫిల్మ్‌ ఎడిటింగ్‌ విభాగాల్లో సీన్‌ బేకర్‌కు నాలుగు అవార్డులు దక్కాయి. ఆస్కార్‌ చరిత్రలో ఒకే సినిమాకి నాలుగు అవార్డులు సాధించిన ఒకే ఒక్కడు సీన్‌ బేకర్‌ కావడం విశేషం. 

హాలీవుడ్‌ సమాచారం ప్రకారం... 1954లో వాల్ట్‌ డిస్నీ (అమెరికన్‌ యానిమేటర్, వాయిస్‌ యాక్టర్, ప్రొడ్యూసర్‌)కు నాలుగు ఆస్కార్‌ అవార్డులు వచ్చాయట. కానీ ఇవి ఒకే సినిమాకి రాలేదు. అలాగే 1974లో అమెరికన్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొ΄్పోల ‘ది గాడ్‌ ఫాదర్‌ 2’ చిత్రానికి మూడు ఆస్కార్‌ అవార్డులు (బెస్ట్‌ పిక్చర్, డైరెక్టర్, అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే విభాగాల్లో) గెలుచుకున్నారు. 

దయచేసి థియేటర్లలోనే సినిమా చూడండి    
 – సీన్‌ బేకర్‌ 
‘‘సెక్స్‌ వర్కర్స్‌ (వేశ్యల నేపథ్యంలో ‘అనోరా’ని రూపొందించారు) కమ్యూనిటీకి థ్యాంక్స్‌ చెబుతున్నాను. ఈ ఆస్కార్‌ అవార్డును వారితో షేర్‌ చేసుకుంటున్నట్లుగా ఫీలవుతున్నాను’’ అన్నారు సీన్‌ బేకర్‌. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘థియేటర్స్‌లో సినిమా చూడటం ఓ గొప్ప అనుభూతి. మనందరం కలిసి నవ్వుతాం... ఏడుస్తాం... ఉత్సాహంగా అరుస్తాం. ప్రపంచమంతా వివిధ భాగాలుగా విడిపోతున్నట్లు కనిపిస్తున్న ఇలాంటి తరుణంలో థియేటర్స్‌లో అందరం కలిసి సినిమా చూడటం అనేది ఓ ముఖ్యమైన అంశం కావొచ్చు. ప్రస్తుతం థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్్స ప్రమాదంలో ఉంది. 

సినిమా థియేటర్స్, మరీ ముఖ్యంగా స్వంతంత్రంగా రన్ చేస్తున్న థియేటర్స్‌ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. మనందరం సపోర్ట్‌ చేయాలి. సినిమాలను థియేటర్స్‌లో చూడటం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను థియేటర్స్‌లో సినిమాలు చూసే విధంగా ప్రోత్సహించాలి. అద్భుతమైన ఆర్టిస్టుల రక్తం, కన్నీళ్లు, చెమటలతో ‘అనోరా’ను నిర్మించడం జరిగింది. ఇండిపెండెంట్‌ సినిమాలు కలకాలం జీవించాలి’’ అని పేర్కొన్నారు సీన్‌ బేకర్‌. మరో హైలెట్‌ ఏంటంటే... సీన్ బేకర్‌ తల్లి పుట్టిన రోజునే ఆయనకు నాలుగు ఆస్కార్‌ అవార్డులు వచ్చాయి. తన అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో తన తల్లికి సీన్ బేకర్‌ థ్యాంక్స్‌ చెప్పారు.

→ ‘‘అనోరా’ను మేం తక్కువ డబ్బుతోనే చేశాం. యంగ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ మీరు చెప్పాలనుకుంటున్న కథలను చెప్పండి. మీరు ఏ మాత్రం పశ్చాత్తాపపడరనడానికి మాకు దక్కిన ఈ అవార్డు ఓ ఉదాహరణ’’ అని ‘అనోరా’ నిర్మాతలు అలెక్స్‌ కోకో,  సమంత క్వాన్‌ అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement