Oscar Awards 2025: భావోద్వేగాలకు జీవం | Anora sweeps the board as Mikey Madison wins best actress at Oscars 2025 | Sakshi
Sakshi News home page

Oscar Awards 2025: భావోద్వేగాలకు జీవం

Published Tue, Mar 4 2025 12:41 AM | Last Updated on Tue, Mar 4 2025 12:41 AM

Anora sweeps the board as Mikey Madison wins best actress at Oscars 2025

న్యూస్‌మేకర్‌ – మైకీ

2024 సంవత్సరానికి ఆస్కార్‌ ఉత్తమ నటిగా నిలిచారు మైకీ మ్యాడిసన్ . సినిమా పేరు ‘అనోరా’. ధరించిన పాత్ర ‘వేశ్య’. హాలీవుడ్‌ కాని, ఇండియన్  సినిమాల్లోకాని
వేశ్య పాత్ర పోషించడం పట్ల తారలకు కొన్ని అభ్యంతరాలుంటాయి. అలాగే ఆ పాత్రలు పోషించిన వారందరూ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వేశ్య పాత్ర వార్తల్లోకి వచ్చింది. ‘అనోరా’ గురించి, మైకీ మ్యాడిసన్  గురించి కథనం.

వారికి ఆదివారం రాత్రి. మనకు సోమవారం తెల్లవారుజాము. కాని తారలకు, తారలను ప్రేమించే ప్రేక్షకులకు ఇది పడుతుందా?
అమెరికా లాస్‌ ఏంజెలెస్‌లో జరిగిన 97వ అకాడమీ అవార్డ్స్‌ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు నిద్ర మానుకొని, మేల్కొని, వివిధ స్థానిక సమయాల ప్రకారం వీక్షించారు. విజేతలకు చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేశారు. 

తాము ఊహించిన సినిమాకో నటికో వస్తే తెగ ఉత్సాహం ప్రదర్శించారు. అయితే వీరందరూ కొంత ఊహించినా ఇంతగా ఎక్స్‌పెక్ట్‌ చేయని ఒక సినిమా ఆశ్చర్యపరిచింది. ‘ఉత్తమ చిత్రం’ పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో ఐదు పురస్కారాలను సొంతం చేసుకుని హోరెత్తించింది. ఆ సినిమాయే ‘అనోరా’. 2024లో విడుదలైన ఈ చిత్రం అటు విమర్శకుల ప్రశంసలను, ఇటు బాక్సాఫీసు కాసుల రికార్డులనూ కొల్లగొట్టింది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవంలో సైతం అదే పంథా కొనసాగించింది.

ఎవరీ ‘అనోరా’?:
నిజానికి ఇలాంటి కథలు మనకు ‘మొఘల్‌–ఏ–ఆజమ్‌’ నుంచి ఉన్నాయి. కథానాయకుడు వేశ్యను ప్రేమిస్తే సంఘం/పెద్దమనుషులు ఓర్వలేక విడగొట్టడం. కాని మొఘల్‌–ఏ–ఆజమ్‌లో కథానాయకుడి ప్రేమ నిజమైనది అయితే ‘అనోరా’లో కపటమైనది. అందుకే ఆ ప్రేమకు విక్టిమ్‌ అవుతుంది అనోరా. 23 ఏళ్ల ఈ అమ్మాయి న్యూయార్క్‌లోని ఓ క్లబ్‌లో స్ట్రిప్పర్‌గా పని చేస్తూ ఉంటుంది.  

ఒకరోజు ఈమెను క్లబ్‌ యజమాని రష్యాకు చెందిన ఇవాన్‌ అనే శ్రీమంతుల కుర్రవాడికి పరిచయం చేస్తాడు.  చదువుకోవడానికి అమెరికాకు వచ్చిన ఈ కుర్రాడు బాధ్యత లేకుండా  పార్టీల్లో, వీడియో గేమ్స్‌లో సమయం గడుపుతూ ఉంటాడు.  అనోరా సాంగత్యం ఇష్టపడ్డ ఇవాన్‌ తరచూ ఆమెను తన బంగ్లాకు ఒక రాత్రి కోసం తీసుకువెళుతూ ఉంటాడు. ఆ తర్వాత హఠాత్తుగా ‘నాకు వారం రోజుల పాటు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండు. 15 వేల డాలర్లు ఇస్తాను’ అని క్లబ్‌కు వెళ్లకుండా ఆపేస్తాడు. ఆ వారంలో ఆమె మీద ప్రేమ పుట్టిందని చెప్పి, ఉక్కిరిబిక్కిరి చేసి, ఉరుకుల పరుగుల మీద పెళ్లి చేసుకుంటాడు.

కష్టాలు మొదలు
అయితే ఇది పిల్లల ఆట కాదు. ఇద్దరు కలవడం వెనుక, కలిసి జీవించడం వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఇన్‌వాల్వ్‌ అయి ఉంటుందో మెల్లగా అనోరాకు తెలిసి వస్తుంది. ఇది క్లబ్‌లో తన ఇష్టానికి స్ట్రిప్పర్‌గా ఉండటం కాదని ‘పెళ్లి’ అనే వ్యవస్థ చుట్టూ అంతస్తు, సంఘ మర్యాద, వంశం... ఇలాంటివి అన్నీ ఉంటాయని అర్థమై హడలిపోతుంది. ఇవాన్‌ను ఈ పెళ్లి నుంచి బయటపడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు ఈ యువ జంటను బెదిరిస్తారు. ‘గ్రీన్‌ కార్డు పొందడం కోసమే ఆమె నిన్ను పెళ్లి చేసుకుంది. ఆమె వేశ్య’ అని ఇవాన్‌ మనసును మార్చేస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి బెదిరి అనోరాను వదిలి ఇవాన్‌ పారిపోతాడు. ఇవాన్‌ను వదిలి పెడితే 10 వేల డాలర్లు ఇస్తామనే బేరం పెడతారు రష్యా మనుషులు. ఈ పరిస్థితులు మానసికంగా అనోరాను బాధిస్తాయి.

ఊరడించే బంధం
అయితే ఈ మొత్తం కథలో ఒక వ్యక్తి అనోరా పట్ల సానుభూతిగా ఉంటాడు. అతను ఇవాన్‌ను పెళ్లి నుంచి బయట పడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇగోర్‌. అనోరాకి అన్యాయం జరుగుతోందని ఆమె తన మానాన తాను బతుకుతుంటే ఇవాన్‌ డిస్ట్రబ్‌ చేశాడని అతనికి అనిపిస్తుంది. చివరకు అతను ఆమెకు స్నేహితుడిగా మారతాడు. అతనికి అనోరా తన సర్వస్వం అర్పించడానికి దగ్గరయ్యి ఆ కాస్త ఓదార్పుకు వెక్కివెక్కి ఏడ్వడంతో సినిమా ముగుస్తుంది. ఈ కథ మొత్తాన్ని తన భుజస్కందాల మీద అద్భుతంగా పోషించడం వల్ల, వివిధ భావోద్వేగాలను పలికించడం వల్ల ‘అనోరా’ పాత్ర పోషించిన మైకీ మాడిసన్‌కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అవార్డు అందుకుంటూ ఆమె ‘సెక్స్‌ వర్కర్‌ కమ్యూనిటీకి కృతజ్ఞతలు’ అని చెప్పడం విశేషం.

సినిమా విశేషాలు
→ ఇది కల్పిత కథ కాదు, అలాగని పూర్తి వాస్తవ కథ కూడా కాదు. దర్శకుడు సీన్‌ బేకర్‌కి తన స్నేహితుడు చెప్పిన ఒక రష్యన్‌–అమెరికన్‌ జంట  కథ ఆధారంగా పుట్టిందే ఈ కథ.  2000–2001 సమయంలో న్యూయార్క్‌లో సీన్‌ బేకర్‌ వీడియో ఎడిటర్‌గా పని చేస్తూ అనేక రష్యన్‌–అమెరికన్‌ జంటల పెళ్లి వీడియోలను ఎడిట్‌ చేశాడు. ఇవన్నీ కలిసి అతని మనసులో చెరగని ముద్ర వేశాయి. ఈ సినిమాకు రచనా సహకారం  కోసం కెనెడియన్‌ రచయిత్రి, నటి ఆండ్రియా వెరన్‌ను సంప్రదించాడు దర్శకుడు. అందుకు కారణం  ఆమె గతంలో సెక్స్‌ వర్కర్‌గా పని చేసి, ఆ అనుభవాలతో ‘మోడ్రన్‌ వోర్‌’ అనే స్వీయచరిత్ర రాసింది. బార్లలో ఆడిపాడే వారికి, వేశ్యావృత్తిలో ఉన్నవారికీ మనసుంటుందనీ, అదీ ఒక తోడు కోరుకుంటుందని చెప్పడానికే తాను ఈ సినిమా తీసినట్లు ఆయన వివరించారు. 

→ కథలో ప్రధానమైన పాత్రను ధరించిన మైకీ మాడిసన్‌ ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది.  25 ఏళ్ల  మైకీ మాడిసన్‌ లాస్‌ ఏంజెలెస్‌లో పుట్టి శాన్‌ ఫెర్నాండ్‌ వ్యాలీలో పెరిగింది. యూదు కుటుంబానికి చెందిన మైకీ తల్లిదండ్రులిద్దరూ సైకాలజిస్టులు. ఈమెకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు.

→ 2013లో తొలిసారి ‘రిటైర్‌మెంట్‌ అండ్‌ పనిష్‌ బాక్స్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించే నాటికి మైకీ మాడిసన్‌ ఏడో తరగతి చదువుతోంది. సినిమాల వల్ల స్కూలుకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ఆ తర్వాత ఆమె చదువంతా ఇంట్లోనే సాగింది.  2017లో హీరోయిన్‌గా తొలి చిత్రం ‘లిజా లిజా స్కైస్‌ ఆర్‌ గ్రే’ విడుదలైంది. అంతకుముందే 2016లో ‘బెటర్‌ థింగ్స్‌’ అనే కామెడీ డ్రామా సిరీస్‌లో టీనేజ్‌ యువతి పాత్ర పోషించింది. ఆ సిరీస్‌ విజయవంతమై 2022 దాకా నడిచింది. ఈ మధ్యలో ‘ఇంపోస్టర్స్‌’, ‘మాన్ స్టర్‌’, ‘నోస్టాల్జియా’ వంటి సిరీస్‌లలోనూ నటించి, మెప్పించింది. 

→ 2019లో వచ్చిన ‘వన్స్ అపాన్‌ ఎ టైం ఇన్‌ హాలీవుడ్‌’ అనే సినిమా మైకీకి గుర్తింపు తెచ్చింది. అందులో ‘సూసన్‌’ పాత్రలో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. 77వ కాన్స్ అంతర్జాతీయ చలన  చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రశంసలు పొందింది.  ఆ పై ‘స్క్రీమ్‌’, ‘లేడీ ఇన్‌ ది లేక్‌’ సినిమాల్లో నటించింది. 

→ తెలుగులో  అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘ప్రేమమందిరం’ కథ ‘అనోరా’ పోలికలతోనే ఉంటుంది. అందులో జయప్రద దేవదాసీల ఇంట్లోనే పుట్టిన అమ్మాయి పాత్ర పోషించగా అక్కినేని జమీందారు బిడ్డ పాత్ర పోషించారు.

‘వన్స్ అపాన్‌ ఎ టైం ఇన్‌ హాలీవుడ్‌’, ‘స్క్రీమ్‌’ సినిమాలో మైకీ నటన చూసి తాను తీస్తున్న ‘అనోరా’లో ఈ అమ్మాయి బాగుంటుందని సీన్‌ బేకర్‌ భావించారు. అలా ఈప్రాజెక్టులోకి అడుగుపెట్టిన మైకీ సినిమాను తన భుజాల మీద మోసింది. వేశ్యగా, ప్రేమికురాలిగా, పెళ్లయిన మహిళగా, ప్రియుడి చేత మోసగింపబడ్డ యువతిగా... ఇన్ని రకాల హావభావాలను ఆ పాత్రలో పలికించి అందర్నీ మెప్పించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement