10 వేల ఇళ్లు బుగ్గి | Los Angeles wildfires devour thousands of homes, death toll rises | Sakshi
Sakshi News home page

10 వేల ఇళ్లు బుగ్గి

Published Sat, Jan 11 2025 4:46 AM | Last Updated on Sat, Jan 11 2025 6:09 AM

Los Angeles wildfires devour thousands of homes, death toll rises

లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చులో పదికి చేరిన మృతుల సంఖ్య  

రూ.12.92 లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం   

లాస్‌ ఏంజెలెస్‌: కార్చిచ్చుల ధాటికి అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ నగరం అగ్ని కీలలకు ఆహూతవుతోంది. ఏకంగా 10 వేల ఇళ్లు బూడిద కుప్పలుగా మారిపోయాయి. మృతుల సంఖ్య శుక్రవారం నాటికి పదికి చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కేవలం పసిఫిక్‌ పాలిసేడ్స్‌ ప్రాంతంలోనే 5 వేల నివాసాలు ధ్వంసమయ్యాయి. లాస్‌ ఏంజెలెస్‌ చరిత్రలో ఈ స్థాయిలో కార్చిచ్చులు రగలడం ఇదే మొదటిసారి. 

కోస్తా తీర ప్రాంతంలో 70 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం మంటల్లో చిక్కుకుంది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ స్థానిక కాలమానం ప్రకారం గురువారం నాటికి 1.80 లక్షల మందికి ఆదేశాలు అందాయి. కలాబాసాస్, శాంటా మోనికా, వెస్ట్‌ హిల్స్‌ తదితర ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. హలీవుడ్‌ నటులు మార్క్‌ హమిల్, మాండీ మూర్, పారిస్‌ హిల్టన్‌ తదితరులు ఇప్పటికే లాస్‌ ఏంజెలెస్‌ విడిచి వెళ్లిపోయారు. 

లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీలో మొత్తం 117 చదరపు కిలోమీటర్ల మేర భూభాగంలో మంటలు వ్యాపించాయి. ఇది శాన్‌ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణంతో సమానం. ఇక్కడ ఎవరైనా అణుబాంబు ప్రయోగించారా? అనే అనుమానం కలుగుతోందని కౌంటీ సీఈఓ రాబర్ట్‌ లూనా చెప్పారు. కార్చిచ్చును అదుపు చేయడానికి 7,500 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, అధికారులు శ్రమిస్తున్నారు. 

ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తగినన్ని నిధులు, వనరులు సమకూర్చాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్చిచ్చు కారణంగా 150 బిలియన్‌ డాలర్ల(రూ.12.92 లక్షల కోట్లు) మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఓ ప్రైవేట్‌ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వ అధికారిక గణాంకాలు ఇంకా బహిర్గతం కాలేదు.  

రగిలిన మరో కార్చిచ్చు    
లాస్‌ ఏంజెలెస్‌ సమీపంలో తాజాగా మరో కార్చిచ్చు మొదలైంది. వెంచురా కైంటీ సమీపంలోని శాన్‌ ఫెర్నాండో వ్యాలీలో మంటలు ప్రారంభమయ్యాయని స్థానిక అధికారులు చెప్పారు. కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

ఇక్కడ బలమైన ఈదురు గాలులు వీస్తుండడంలో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, అరికట్టడం కష్టంగా మారిందని అంటున్నారు. ఇదిలా ఉండగా, కార్చిచ్చు బాధితులను ఆదుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ‘ఫండ్‌ ఆఫ్‌ సపోర్ట్‌’కు మిలియన్‌ డాలర్లు ఇవ్వనున్నట్లు హాలీవుడ్‌ నటి జేమీ లీ కర్టీస్‌ చెప్పారు.    

దక్షిణాదిన వణికిస్తున్న మంచు తుపాను  
లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇళ్లను దహనం చేస్తుండగా, అమెరికా దక్షిణాది రాష్ట్రాలైన టెక్సాస్, ఒక్లహోమాలో మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోతుండడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోతున్నాయి. సాధారణ జనజీనవం స్తంభిస్తోంది. స్థానిక గవర్నర్లు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పాఠశాలలు మూసివేశారు. 

చల్లటి గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. అర్కన్సాస్, టెక్సాస్, జార్జియా, టెన్నెస్సీ, దక్షిణ కరోలినా వంటి రాష్ట్రాల్లోనూ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లూసియానా, మిసిసిపీ, అలబామా రాష్ట్రాల్లో మంచు తుపానుకు తోడు వర్షాలు కురుస్తున్నాయి. అమెరికాలో గురువారం 4,500కుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 2 వేల విమానాలు రద్దయ్యాయి.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement