
దాదాపు 120 దేశాల సుందరీమణులు. రకరకాల దేశాల శీతోష్ణస్థితులు... రకరకాల స్కిన్‌టోన్‌లు. వివిధ రకాల ఆకృతులు. వారందరికీ ఒక్కొక్కరిది ఒక్కో కథ! ఆత్మవిశ్వాసమే ఆభరణంగా.. ప్రతిభ, బ్యూటీ విత్ పర్సస్ ప్రధాన అర్హతలుగా తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆ సుందరీమణుల్లో రొజుకొకరి పరిచయం ఇక్కడ. ఈరోజు మిస్ జపాన్ కియానా తుమీత గురించి ఆమె మాటల్లోనే..
నేను ప్రకృతి వైపరీత్యాల మీద పీహెచ్‌డీ చేస్తున్నాను. అంతకుముందు కేంబ్రిడ్జ్, ఎడింబరో యూనివర్సిటీల్లో విమెన్ లీడర్ షిప్ మాస్టర్ డిగ్రీ చేశాను. ఒక బిజినెస్ చానల్‌లోఎకనమిక్ న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నాను. నా టాలెంట్ విషయాలకు వస్తే నేను జపనీస్ కాలిగ్రాఫర్‌ని. అందులో నాకు మంచి పేరుంది. ఎలక్ట్రిక్ ఫ్లూట్ కూడా వాయిస్తాను.
ఈ పోటీల్లో టాలెంట్ రౌండ్‌లో ఎలక్ట్రిక్ ఫ్లూట్‌నే పెర్‌ఫార్మ్ చేయబోతున్నాను. ప్రకృతి గౌరవిస్తూ వైపరీత్యాలు రాకుండా జాగ్రత్తపడటం, ఒకవేళ ప్రకృతివైపరీత్యాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. నా అందంతో ఈ ప్రయోజనాన్ని సాధించాలనుకుంటున్నా! ప్రకృతి వైపరీత్యాల పట్ల పిల్లలకు అవేర్‌నెస్ కల్పించడం! స్త్రీ, పురుష వివక్ష విషయానికి వస్తే.. దానికి జపాన్ కూడా అతీతమేమీ కాదు. చదువుకు సంబంధించి అమ్మాయి, అబ్బాయిలకు సమాన అవకాశాలున్నప్పటికీ.. లీడర్‌షిప్ విషయంలో మాత్రం పురుషులదే ఆధిపత్యం.
ఆ అంతరం చాలా ఎక్కువ. వేతనాల్లో కూడా ఆ గ్యాప్ కనపడుతుంది. సమానమైన పనికి మహిళలకన్నా పురుషులకే వేతనాలు ఎక్కువ. డిసిప్లిన్, పని విషయాల్లో ప్రపంచంలోని ప్రతిదేశం జపాన్ వైపు చూస్తుందేమో కానీ.. టెక్నికల్ జాబ్స్ విషయంలో మాత్రం మేము ఇండియాను అప్రిషియేట్ చేస్తాం. కొత్తగా వచ్చిన ఏ టెక్నికల్ చేంజ్‌ను అయినా ఇట్టే గ్రహించి, అడాప్ట్ చేసుకుని రాణిస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న క్రైమ్ గురించి వార్తల్లో విన్నప్పుడు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కానీ ఈ పోటీల కోసం ఇక్కడ ల్యాండ్ అయ్యి, ఇక్కడి మనుషులు, వాళ్లిచ్చే మర్యాద అవన్నీ చూశాక ఆ నెర్వస్‌నెస్, భయాలు అన్నీ పటాపంచలయ్యాయి.
ఇక్కడికి రావడానికి నాకు దుబాయ్‌లో కనెక్టింగ్ ఫ్లయిట్ ఉండింది. అక్కడ బోర్డింగ్‌లో నా లగేజ్‌తో అవస్థపడుతుంటే ఒక ఇండియన్ జెంటిల్‌మన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడే నాకు ఇండియా మీద గౌరవం రెట్టింపయింది. ఈ దేశానికి సంబంధించి నాకు ఇష్టమైన మరోవిషయం.. ఎర్రటి బొట్టు. ఈ పాజెంట్‌లో ఒకరోజు నేను చీర కట్టుకుని, ఎర్రటి బిందీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇండియాకు, జపాన్‌కున్న మరో సామ్యం.. బౌద్ధం. మేము ఫాలో అవుతున్న బౌద్ధానికి, ఇక్కడికి వ్యత్యాసమున్నప్పటికీ బౌద్ధం ఈ దేశంతో మాకో కనెక్టివిటీని పెంచింది.
ఇక్కడి ఆధ్యాత్మికతకు నేను ఫిదా అయ్యాను. బ్యూటీ పాజెంట్ విషయానికి వస్తే చాలా దేశాల్లో ఉన్నట్టే జపాన్‌లోనూ.. అందాల పోటీలు అంటే స్కిన్ షో తప్ప మరోటి కాదనే అభిప్రాయం, అపోహా ఉన్నాయి. కానీ బ్యూటీ విత్ పర్పస్ అనే ఐడియా నాకు నచ్చి.. పోటీల్లో పాల్గొంటున్నాను. సిస్టర్‌హుడ్ క్రియేట్ చేయడానికి ఇదొక వేదిక. సన్నగా ఉన్నామా.. లావుగా ఉన్నామా.. తెల్లగా ఉన్నామా.. నల్లగా ఉన్నామా అని కాదు.. అదసలు విషయమే కాదు. డజంట్ మ్యాటర్. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నదే మ్యాటర్. అందుకే నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం!
జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాలనుంది..
నాటు నాటు పాట జపాన్‌లో చాలా ఫేమస్. ఆ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించడానికి నేను సిద్ధం. బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్‌కి వీర ఫ్యాన్‌ని. ఇండియాది రిచ్ కల్చర్. ఇక్కడి రైతా చాలా డెలీషియస్‌గా ఉంటుంది.
– కియానా తుమీత
– సరస్వతి రమ