
నేడు పాతబస్తీకి ప్రపంచ సుందరాంగులు
చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్
చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్
కొనసాగనున్న ట్రాఫిక్ ఆంక్షలు
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
హైదరాబాద్: మిస్ వరల్డ్–2025 పోటీదారులతో చార్మినార్నుంచి లాడ్ బజార్ వరకు మంగళవారం నిర్వహించనున్న హెరిటేజ్ వాక్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పాతబస్తీలో కొన్ని ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే చిరు వ్యాపారులను కట్టడి చేసే దిశగా అందరికీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఒకరోజు తమ వ్యాపారాలకు సెలవు ఇవ్వాలని సూచించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. చార్మినార్‌కు నాలుగు వైపులా ఉన్న దారుల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు.
అణువణువూ తనిఖీ చేసిన అనంతరమే చార్మినార్ (Charminar) వరకు అనుమతించనున్నారు. ఇప్పటికే బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో చార్మినార్, లాడ్ బజార్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ రూట్లో రహదారులను అందంగా తీర్చిదిద్ది..ఇరువైపులా తాత్కాలిక విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. చార్మినార్నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ అనంతరం అందాల పోటీదారులు ఇక్కడ షాపింగ్ చేయనున్నారు. అంతరం అక్కడి నుంచి వాహనాల ద్వారా చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకొని డిన్నర్ చేయనున్నారు. ఈ డిన్నర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొననున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్‌లో పాల్గొననున్నారు. చార్మినా ర్నుంచి లాడ్ బజార్ వరకు నిర్వహించే వాక్‌లో ప్రపంచ సుందరాంగులు పాల్గొని ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటారు. అనంతరం షాపింగ్ చేయనున్నారు.
తెలంగాణ జరూర్ ఆనా.. అనే టైటిల్‌తో చూడముచ్చటగా తయారు చేయించిన ప్రత్యేక ఏసీ బస్సులో మిస్ వరల్డ్ పోటీదారులు పాతబస్తీకి వస్తారు. శివారు ప్రాంతమైన ఆరాంఘర్ నుంచి డాక్టర్ మన్‌మోహన్ సింగ్ ఫ్లై ఓవర్ ద్వారా పాతబస్తీలోకి ప్రవేశిస్తారు. అనంతరం బహదూర్‌పురా, పురానాపూల్, పేట్లబురుజు, మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ మీదుగా చారి్మనార్‌కు చేరుకుంటారు. డిన్నర్ (Dinner) అనంతరం తిరిగివచ్చిన రూట్‌లోనే వెళ్లనున్నారు.
హెరిటేజ్ వాక్ (Heritage Walk) కోసం పాతబస్తీలో దాదాపు 10 కిలో మీటర్ల రేడియస్‌లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని జీహెచ్‌ఎంసీ (GHMC) చార్మినార్ జోనల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. వీధి దీపాల ఏర్పాటుతో పాటు తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ, బీటీ రోడ్లు, డివైడర్ల మరమ్మతులు చేయించామన్నారు. దాదాపు 250 మంది కారి్మకులు పారిశుధ్య పనుల్లో పాలుపంచుకున్నారని తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
మదీనా నుండి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ, శాలిబండ (రాజేష్ మెడికల్ హాల్) నుండి వోల్గా జంక్షన్, వోల్గా జంక్షన్ నుండి మూసబౌలి వయా ఖిల్వత్ రోడ్డుకు వెళ్లే రోడ్లలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకల్ని నియంత్రించనున్నారు. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు నగర పోలీస్ (ట్రాఫిక్) జాయింట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
మదీనా జంక్షన్: నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు.
హిమ్మత్‌పుర: నాగల్‌చింత/శాలిబండ ప్రాంతాల నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమ్మత్‌పురా జంక్షన్, హరి బౌలి మరియు వోల్గా జంక్షన్ వైపు ఫతే దర్వాజా రోడ్డు వరకు తరలిస్తారు.
వోల్గా జంక్షన్: హిమ్మత్‌పురా నుండి వచ్చే ట్రాఫిక్‌ను చౌమొహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు. వీటిని వోల్గా జంక్షన్ ఫతే దర్వాజా వైపు మళ్లిస్తారు. ఫతే దర్వాజా నుండి వచ్చే ట్రాఫిక్‌ను హిమ్మిత్‌పురా వైపు మళ్లిస్తారు.
మూసబౌలి: పురానాపూల్ (గుడ్ విల్ కేఫ్) నుండి వచ్చే ట్రాఫిక్‌ను చారి్మనార్/చౌమహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు మరియు మూసబౌలి వద్ద సిటీ కాలేజ్ మరియు ఫతే దర్వాజా వైపు దూద్‌బౌలి ద్వారా మళ్లిస్తారు.
చౌక్ మైదాన్ కమాన్: చౌక్ మైదాన్ నుండి చార్మినార్వైపు వచ్చే ట్రాఫిక్‌ను చౌక్ మైదాన్ వద్ద కోట్ల అలిజా లేదా మొఘల్‌పురా వైపు మళ్లిస్తారు.
ఎతేబార్ చౌక్: ఎతేబార్ చౌక్ ప్రాంతం నుండి గుల్జార్‌హౌస్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎతేబార్ చౌక్ వద్ద మండి మిరాలం మార్కెట్ లేదా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు.
షేర్ ఎ బైతుల్ కమాన్: మిట్టి కా షేర్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను గుల్జార్ హౌస్ వైపు అనుమతించరు మరియు మిట్టి–కే–షేర్ జంక్షన్ వద్ద ఘాన్సీ బజార్ వైపు మళ్లించి హైకోర్టు రోడ్డుకు చేరుకుంటారు.
లక్కడ్ కోట్ (పాత సీపీ ఆఫీస్ జంక్షన్): అపాట్ వైపు నుండి చార్మినార్వైపు వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్ కోట్ వద్ద (ఓల్డ్ సీపీ ఆఫీస్ లేన్) మరియు మిరాలం మండి మార్కెట్ వైపు మళ్లిస్తారు (అవసరమైతే) ఈ పరిమితులు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి.