దుస్తుల్లో రసాయన రహితానికి పెరుగుతున్న ప్రాధాన్యం
సస్టెయినబుల్ ఫ్యాషన్‌కి జై కొడుతున్న ఆధునికులు
సిటీలో ఫ్యాబ్ ఇండియాతో శ్రీకారం.. అనేక బ్రాండ్స్‌ది అదేబాట
సహజమైన రంగులు, చేనేతలతో ప్రయోగాలు చేస్తున్న డిజైనర్లు
సాక్షి, సిటీబ్యూరో: తినే తిండిలో మాత్రమే కాదు మనం ధరించే దుస్తుల్లోనూ రసాయనాల వినియోగం మితిమీరుతోంది. స్వచ్ఛంగా మెరిసిపోయే తెల్లని కాటన్ వస్త్రం తయారీలో కూడా ఆ రంగు కోసం కెమికల్స్ వాడతారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఆహారం తరహాలోనే ఆహార్యంపై కూడా పెరుగుతున్న శ్రద్ధ.. నగరవాసుల్లో ఆర్గానిక్ దుస్తుల పట్ల ఆసక్తికి కారణమవుతోంది.
తిరిగే ప్రదేశం సహజమైన ప్రకృతి అందాలతో ఉండాలి తినే తిండి కూడా సహజమైనదే అయి ఉండాలి.. ధరించే దుస్తులు కూడా సహజసిద్ధమైన రీతిలో రూపొందించినవి కావాలి. లేకపోతే అనారోగ్యాలు ఎటు నుంచి దాడిచేస్తాయో తెలీదు.. ఈ స్పహ ఆధునికుల్లో పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని బ్రాండెడ్ దుస్తులు మార్కెట్లో కనిపిస్తుండగా.. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగాæ డిజైనర్లు కూడా ఆర్గానిక్ దుస్తులకు అడ్రస్‌గా మారుతున్నారు. అలాంటివారిలో సిటీ డిజైనర్ సంతోష్ ఒకరు. గతంలో పూణె ఫ్యాషన్ వీక్‌లో వీటిని ప్రదర్శించారాయన.
కాస్ట్ లీ కాదు..
ధనవంతులు మాత్రమే సస్టెయినబుల్ ఫ్యాషన్ ను కొనుగోలు చేయగలరని అభిప్రాయం ఏర్పడింది. అయితే తెలివిగా షాపింగ్ చేయాలనుకునే ఎవరికైనా ఈ తరహా దుస్తులు అందుబాటులోనే ఉంటాయని అంటున్నారు డిజైనర్లు. ‘అందరూ అనుకున్నట్టు ఆర్గానిక్ ఫ్యాషన్ దుస్తులు మరీ
ఖరీదైనవి ఏమీ కాదు. ఉత్పత్తి వ్యయం కూడా మీటర్‌కి రూ.వెయ్యిలోపే అవుతుంది. అయితే వీటి వాడకంపై ఫ్యాషన్ ప్రియుల్లో మరింత
అవగాహన పెరగాల్సి ఉంది’ అంటూ చెప్పారు నగరానికి చెందిన డిజైనర్ నయన్.
సేంద్రియ పద్ధతిలో తయారు..
ఆధునిక వినియోగదారులు పర్యావరణ అనుకూల డిజైన్ ట్రెండ్‌లను అనుసరిస్తుండటంతో హానికరమైన రసాయనాలు, పురుగు మందులు లేకుండా ఉంటాయి సేంద్రియ పద్ధతిలో తయారైన వ్రస్తాలకు డిమాండ్ విస్తరిస్తోంది. ఉత్పత్తిదారులు సరళమైన, తటస్థ–రంగు దుస్తులు రూపొందిస్తున్నారు. వీటిలో తెలుపు, నలుపు క్రీం రంగులు కీలకమైనవి. కార్క్, వెదురు, జనపనార, ఆర్గానిక్ కాటన్, రీసైకిల్ కాటన్ లినెన్ సస్టెయినబుల్ ఫ్యాషన్ ఉత్పత్తిలో కీలకమైన ముడి పదార్థాలుగా మారాయి. సేంద్రియ పద్ధతిలో పత్తి లేదా జనపనార వంటి పర్యావరణ అనుకూల పదార్థాలతో రూపొందించిన జీన్స్ దుస్తులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించే స్వెటర్ల కోసం, ఉన్ని లేదా అల్పాకాతో తయారు చేసినవి అందుబాటులోకి వచ్చాయి.
వ్యర్థాల రీసైక్లింగ్..
ఫ్యాషన్ పరిశ్రమలో వ్యర్థాలను తగ్గించడానికి అప్‌సైక్లింగ్ రీసైక్లింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. డిజైనర్లు కొత్త ప్రత్యేకమైన దుస్తుల వెరైటీల సృష్టి కోసం పాత వ్రస్తాలు, స్క్రాప్‌లు, దుస్తుల తయారీలో వాడగా మిగిలిపోయిన వాటిని సృజనాత్మకంగా పునర్నిరి్మస్తున్నారు. ఇది వ్రస్తాల జీవితచక్రాన్ని పొడిగించడంలో, వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతోంది. అలాగే స్లో ఫ్యాషన్ మూవ్‌మెంట్.. స్లో ఫ్యాషన్ అనే భావన పెరిగింది. వినియోగదారులు తమ ఫ్యాషన్ ఎంపికల విషయంలో కంటికి ఇంపుగా ఉండే దుస్తుల కన్నా ఒంటికి మేలు చేసేవే మిన్న అనే భావనకు వస్తున్నారు. ఎక్కువ కాలం ధరించగలిగే శాశ్వతమైన, మన్నికైన దుస్తులను ఎంచుకుంటున్నారు. మరో వైపు ఇది సంప్రదాయ హస్తకళ స్థానిక కళాకారులకు ఇది ఊతమిస్తోంది. సంప్రదాయ నేయడం, అద్దకం, ఎంబ్రాయిడరీ పద్ధతులను సంరక్షించడానికి ప్రోత్సహించడానికి బ్రాండ్‌లు కళాకారులతో కలిసి పనిచేస్తున్నాయి. ఇది సంప్రదాయ కళలను పునరుజ్జీవింపజేయడమే కాకుండా హస్తకళాకారుల పురోభివృద్ధి అవకాశాలను కూడా పెంచుతోంది.
"రసాయన రహితంగా పూర్తి ఆర్గానిక్ దుస్తుల తయారీ అనేది ఇప్పటికీ కొంత సాహసంతో కూడిన ప్రయోగమే అని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, డైతో తయారు చేసినవి తక్కువ షేడ్స్‌లో మాత్రమే లభ్యమవుతాయి. దేశంలో ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ నాచురల్ డైస్‌తో చేసిన దుస్తులు విక్రయిస్తున్నప్పటికీ.. అవి కూడా పూర్తిగా 100శాతం ఆర్గానిక్ అని చెప్పలేం. ఆర్గానిక్ దుస్తులకు కాటన్, లినెన్, పట్టు.. ఫ్యాబ్రిక్స్ మాత్రమే నప్పుతాయి. అలాగే ఈ దుస్తుల తయారీకి మిగిలిన వాటి తయారీతో పోలిస్తే పట్టే సమయం కూడా బాగా ఎక్కువ.
‘నేను రూపొందించిన ఆర్గానిక్ దుస్తుల తయారీలో ఫ్యాబ్రిక్ మొత్తం చేనేతలనే వినియోగించాను. సిద్ధిపేటలోని ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ సునంద ఈ ఫ్యాబ్రిక్స్ తయారీ చేయించారు. అదేవిధంగా ఉల్లిపాయ, పసుపు వంటి దినుసులతో పాటు చెట్ల ఆకులు, కాండం, వేర్లు.. వీటిని ఉపయోగించి ఆకుపచ్చ, విభిన్న రకాల బ్లూషేడ్స్, ఎల్లో, బ్రిక్ షేడ్స్‌తో కలర్స్ సృష్టించాం. కొంచెం డల్ ఫినిష్ ఉండే ఫ్యాబ్రిక్‌కి అత్యాధునిక డిజైనింగ్ వర్క్ జత చేసి ఆకట్టుకునేలా డ్రెసెస్ క్రియేట్ చేశాం. మొత్తం 20 డ్రెస్సెస్ క్రియేట్ చేస్తే.. 16 రకాల డిజైన్లను ఈ షోలో ప్రజెంట్ చేశాను’ అంటూ చెప్పారు సిటీ డిజైనర్ సంతోష్."
నేచురల్ డై తయారీ యూనిట్ స్థాపించి..
సింథటిక్ వంటి వ్రస్తాలు ఎంచుకుంటే అది పర్యావరణానికి హానికరమని, మన ఆరోగ్యానికి కూడా చేటు చేస్తుందనే స్పృహ నగరవాసుల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. అలాగే దుస్తుల తయారీలో వాడే కొన్ని మెటీరియల్స్ ఆక్సిజన్ నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కెమికల్ డైలను నివారించాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఆకులు తదితర సహజోత్పత్తుల ద్వారా తయారైన రంగుల వినియోగం పెంచాలి. నేచురల్ డైతో తయారైన.. పూర్తి సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్‌ను అందించేందుకు సిటీ శివార్లలో మా సొంత డైయింగ్ యూనిట్‌ను ప్రారంభించాం. – మమత తుళ్లూరి, డిజైనర్
ఇవి చదవండి: ఇది.. మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ డివైస్!
Comments
Please login to add a commentAdd a comment