వారసత్వ క్రీడపై యువత ఆసక్తి..
నేషనల్స్‌లో పతకాలతో రాణిస్తున్న వైనం..
ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణా కేంద్రాల్లో ఆర్చర్స్ సన్నద్ధం..
భవిష్యత్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున పాల్గొనడమే లక్ష్యం..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో హైదరాబాద్‌కు ఒలింపియన్స్ సిటీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి పీవీ సింధూ, సైనా నెహా్వల్, గుత్తా జ్వాల, నగరంతో అనుబంధమున్న గగన్ నారంగ్ వంటి వారు ఒలింపిక్స్ మెడల్స్ సాధించడమే కారణం. అంతేకాకుండా పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో ఒలింపియన్స్ సన్నద్ధమైంది కూడా ఇక్కడే. ఇలా నగరం నుంచి బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, హాకీ, చెస్, రైఫిల్ షూటింగ్ వంటి పలు అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించి నగర ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేశారు. ఇదే కోవలో ఆర్చరీ క్రీడ కూడా భవిష్యత్‌లో రాణించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్చరీకి ప్రాధాన్యత చాలా పెరుగుతోంది. ఈ సారి ఒలింపిక్స్‌లో తెలుగు క్రీడా కారుడు ధీరజ్ 4వ స్థానంలో నిలిచిన సంగతి విధితమే. భారతీయ క్రీడా చరిత్రలో తమకంటూ ఒక పేజీ రాసుకోవాలనుకునే నగర క్రీడాకారులు విల్లంబులు చేతబట్టి ఒలింపిక్ వేటకు సిద్ధమవుతున్నారు.
ఆర్చరీపై భాగ్యనగర వాసుల గురి..
జాతీయ స్థాయి టాప్ 2లో నగర అమ్మాయిలు, టాప్ 8లో అబ్బాయిలు..ఏ క్రీడ ఆడాలన్నా, శిక్షణ పొందాలన్నా మరో క్రీడాకారుడు ఉండాల్సిందే. ఇలా కాకుండా ఇండివీడ్యువల్ గేమ్ (వ్యక్తిగత క్రీడ) విభాగంలో ఆర్చరీ ఒకటి. గత కొన్ని ఏళ్లుగా ఈ గ్లామర్ గేమ్‌పై నగర క్రీడా అభిలాషకులు ఫోకస్ పెట్టారు. నగరం నుంచి ఇప్పటికే పలు క్రీడల్లో చాలా మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంతో తమను తాము నిరూపించుకోవడానికి ఆర్చరీని ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ఇతర క్రీడల్లో కొనసాగుతున్న పోటీని తప్పించుకోవడానికి కూడా ఆర్చరీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో నేషనల్స్‌లో నగర ఆర్చరీ క్రీడాకారులు రాణిస్తుండటం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణలో ఆర్చరీ శిక్షణ అందించే ‘సాయ్’ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్, గచి్చబౌలి), హకీం పేట్ స్పోర్ట్స్ స్కూల్ రెండూ నగరానికి అనుబంధమున్నవే. వీటితో పాటు నగరంలో దాదాపు ఎనిమిది ప్రైవేటు
శిక్షణా కేంద్రాలున్నాయి. ఈ అంశాల దృష్ట్యా ఇక్కడ ఆర్చరీ క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది.
నేషనల్స్‌లో వెయ్యి మంది రాణింపు..
జాతీయ స్థాయిలో టాప్ 2లో నా విద్యార్థులు ఉన్నారు. 2000 సంవత్సరంలో ఆర్చరీ ప్రారంభించిన నేను ఏడేళ్ల పాటు 23 విభాగాల్లో నేషనల్స్, ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్ ఛాంపియన్స్ ఆడాను. 7 నేషనల్స్‌లో పతకాలు సాధించాను. ఆల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్‌గా నిలిచాను. అనంతరం మేటి ఆర్చర్స్‌ను తయారు చేయడమే లక్ష్యంగా 2008 నుంచి శిక్షణ ప్రారంభించాను. ఇప్పటి వరకూ నా శిక్షణలో వెయ్యి మందికి పైగా నేషనల్స్ ఆడారు. కొందరు యూత్ ఒలింపిక్స్ ఇండియా క్యాంపుకు వెళ్లారు.
దాదాపు 3 వేల మందికి పైగా శిక్షణ అందించాను. ఫ్రెండ్స్ అండ్ ఆర్చర్స్ ట్రైనింగ్ సెంటర్ పేరుతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఖైరతాబాద్, ప్రగతి నగర్, నార్సింగిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అథ్లెట్లను తయారు చేస్తున్నాను. 2028 ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా అద్భుతమైన నైపుణ్యాలున్న ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను సన్నద్ధం చేస్తున్నాను. ఆర్చరీ శిక్షణతో పాటు వీరికి అవసరమైన ఫిట్నెస్, ఫిజియోథెరపీ, సైకాలజీ కౌన్సిలింగ్, స్పెషల్ ట్యూనింగ్ అందిస్తున్నాం. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్చరీకి మంచి భవిష్యత్ ఉంది. రీకర్వ్, కాంపౌండ్ విభాగాల్లో మన ఆర్చర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు.
ప్రభుత్వం తరపున మంచి భద్రతా ప్రమాణాలతో మరిన్ని ఆర్చరీ గ్రౌండ్స్ నిర్మిస్తే వందల మంది ఆర్చర్స్‌కు అవకాశం ఉంటుంది. ఎక్విప్‌మెంట్ అందించగలిగితే ఆర్చరీ మరింత రాణిస్తుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో అద్భుతమైన కోచ్‌లు ఉన్నారు. నా అకాడమీ తరపున చాలా మంది పేద పిల్లలకు ఆర్చరీలో సహకారం అందిస్తున్నాను. వారిలో రాజ్‌భవన్ స్కూల్‌కు చెందిన వైభవ్ నేషనల్స్ మెడల్ సాధించాడు. మరో అమ్మాయి లలితా రాణి నేషనల్స్ ఆడి సత్తా చాటింది. – రాజు, ఆర్చరీ నేషనల్స్ ఛాంపియన్, ప్రముఖ కోచ్, ఫ్రెండ్స్ అండ్ ఆర్చెర్స్ ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్.
నగర వేదికగా..
నగరం వేదికగా దాదాపు 150 మంది ఆర్చరీ అథ్లెట్స్ ఉన్నారని అంచనా. జాతీయ స్థాయిలో హైదరాబాద్ టీం రెండో స్థానంలో ఉన్నట్లు క్రీడా నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయి సీనియర్స్, జూనియర్స్ విభాగంలో నగరానికి చెందిన అమ్మాయిలు ఇద్దరూ సిల్వర్ మెడల్స్ సాధించగా, అబ్బాయిలు ఎనిమిదో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు.
ఆరు కేటగిరీల్లో..
ఆర్చరీకి సంబంధించి నేషనల్స్‌లో అండర్ 10, 13, 15, 17, 19, అబౌ 19 విభాగాలు ఉంటాయి. ఒలింపిక్స్‌కు అయితే ఎలాంటి ప్రమాణాలూ ఉండవు. ఎవరైనా పోటీ పడొచ్చు. ఆరు కేటగిరీల్లో ఈ ఎంపిక కొనసాగుతోంది. మెదటి దశ ఓపెన్ కేటగిరీలో దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడొచ్చు. ఇందులోంచి టాప్ 32, టాప్ 16, టాప్ 8, టాప్ 6 ఇలా ఎంపిక చేసి చివరగా ముగ్గురిని ఒలింపిక్స్‌కు పంపిస్తారు.
2028 ఒలింపిక్స్ లక్ష్యంగా..
12 ఏళ్ల వయస్సు నుంచి ఆర్చరీలో రాణిస్తున్నాను. ఇప్పటి వరకూ ఎనిమిది నేషనల్స్ ఆడాను. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నేషనల్స్‌లో ఒక గోల్డ్, మరో సిల్వర్ మెడల్ సాధించాను. 2028 ఒలింపిక్స్‌లో ఆడి పతకం సాధించడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం మోయినాబాద్ కాలేజ్‌లో పీజీ చదువుతున్నాను. – హర్షవర్ధన్
నాలుగు నేషనల్స్ ఆడాను..
కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాను. ఇప్పటి వరకూ గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు వంటి ప్రాంతాల్లో నాలుగు నేషనల్స్ ఆడాను. అసోసియేషన్ నేషనల్స్, ఫుల్ నేషనల్స్‌లో పోటీ పడ్డాను. భారతీయ ఆర్చర్‌గా ఒలింపిక్స్‌లో సత్తా చాటి దేశ ఖ్యాతిని మరింత పెంచడమే లక్ష్యం. – లలితా రాణి
Comments
Please login to add a commentAdd a comment