ఆధునికులనూ ఆకట్టుకునేలా చీరకట్టు.
అంతకంతకూ పెరుగుతున్న ఆదరణ.
ఆకర్షణతోపాటు హుందాతనానికి ప్రతీక
ట్రెండ్ మారుతున్నా మారని ట్రెడిషన్
రేపు ప్రపంచ చీరకట్టు దినోత్సవం.
స్కిన్‌టైట్ జీన్సులు, ట్యునీక్సూ, కుర్తీస్, నీలెంగ్త్ స్కర్టులు, పొట్టి నిక్కర్లూ.. లాంటి మోడ్రన్ ట్యూన్స్‌తో ఓ వైపు మమేకమైన నగర మహిళలు మరోవైపు ఇంకా పాత రాగంలో ‘శారీ’గమ పాడేస్తోందంటే.. చీర కట్టు మహిమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.. ఆధునిక కట్టుబాట్లు ఎలా ఉన్నా అప్పుడప్పుడూ సొగసిరి చీరకట్టి అన్న రీతిలో నగర మహిళలు తమ హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. డిసెంబర్ 21న శారీ దినోత్సవం నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం..
– సాక్షి, సిటీబ్యూరో
‘చీర కట్టుకుంటే ఆ డిగ్నిటియే వేరు. నెలకోసారన్నా.. వార్డ్‌రోబ్‌లో నుంచి శారీ తీయాల్సిందే’ అంటోంది ఓ పీఆర్ కంపెనీలో పనిచేసే వాణి. సిటీలో విభిన్న వృత్తి ఉద్యోగాలు చేసే మహిళలు, యువతులు వృత్తి, బాధ్యతల కారణంగా రోజువారీ వినియోగం అంత సులభం కాకపోవడంతో ‘చీరకట్టు’ వీరికి మరింత అపురూపంగా మారిపోయింది. దీంతో సెలవు దినాల్లో, కుటుంబ వేడుకల్లో ఇలా వీలైనన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఎంచుకునే వస్త్రధారణగా మారింది. ప్రత్యేక సందర్భం వస్తే చీరకట్టాలి అనే రోజుల నుంచి చీరకట్టు కోసం సందర్భాన్ని సృష్టించుకునేంత ఆసక్తి నగరమహిళల్లో పెరిగిపోతోంది.
కట్టు తప్పుతోంది..
రోజుల తరబడి టాప్‌లూ, ట్రౌజర్లతో కాలక్షేపం చేస్తూ వచ్చి ఒక్కసారిగా చీర కట్టుకోవాలంటే ఇబ్బందే కదా. అందుకే చీరకట్టడంలో నేర్పరితనం ఉన్నవారి సేవల మీద నగర మహిళలు ఆధారపడుతున్నారు. ‘ఫంక్షన్స్‌కి శారీ కాకుండా డ్రెస్సులతో వెళితే గిల్టీ ఫీలింగ్ వస్తోంది. అలాగని చీరకట్టాలని ప్రయత్నిస్తే సరిగా కుదరడం లేదు. అందుకే నేను అవసరమైనప్పుడల్లా చీరకట్టే వారిని పిలిపించుకుంటాను’ అని జూబ్లీహిల్స్‌లో నివసించే ఉమ చెబుతున్నారు. ఈ ‘కట్టు’ ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికి నిపుణులకు రూ.500 వరకూ చెల్లించడానికి పెద్దగా ఇబ్బంది పడడంలేదంటున్నారు ఆధునిక మహిళలు. ‘ఇటీవల చీర కట్టుకోవాలని ఆసక్తి బాగా పెరిగింది. అయితే మోడ్రన్ డ్రెస్సుల్లా నిమిషాల మీద వేసుకుని వెళ్లిపోడానికి కుదిరేది కాదు కదా. అందుకే అమ్మాయిలు మాత్రమే కాదు పెద్ద వయసు మహిళలు కూడా చీర కట్టుకోవడానికి మా సహకారం కోరుతున్నారు. అవసరమైన వారికి మేం ఇంటికే వెళ్లి సేవలు అందిస్తున్నాం’ అని చెబుతున్నారు శారీ డ్రేపర్‌గా రాణిస్తున్న సునీల.
విభిన్న శైలిలో...
చీరకట్టు విభిన్నరకాల శైలులు నగరంలో రాజ్యం ఏలుతున్నాయి. ‘జయప్రద స్టైల్, నూపుర్ స్టైల్, తానిదార్ స్టైల్.. ఇలా దాదాపు 35 రకాల శారీడ్రేపింగ్ స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. నా దగ్గరకు వచ్చే వారిలో అత్యధికులు నూపుర్‌స్టైల్ అడుగుతారు’ అని చెప్పారు శారీడ్రేపింగ్‌కు పేరొందిన సికింద్రాబాద్ వాసి జానీనులియా. నగరం విభిన్న సంస్కృతుల నిలయం కావడం, విభిన్న ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి నివసిస్తుండడం, ఈ కుటుంబాల మధ్య రాకపోకలు పెరగడంతో.. ఇతర ప్రాంతాల కట్టు బొట్టూ నేర్చుకోవాల్సి రావడం తప్పడం లేదు. ఆ క్రమంలోనే మార్వాడి, గుజరాతీ, బెంగాలీ.. తదితర చీరకట్టు శైలిని స్థానిక మహిళలు అనుసరిస్తుండడం సాధారణంగా మారింది. విభిన్న శైలులను అనుసరించాలనుకునేవారికి స్టైల్‌ను బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకూ రుసుముతో సేవలు అందించేవారు సైతం పుట్టుకొచ్చేశారు.
బ్యూటీ విత్ డిగ్నిటీ..
‘రెగ్యులర్ డ్రెస్సులంటే మొహం మొత్తేస్తోంది. మా కంపెనీలో ఏ చిన్న వేడుకైనా అందరూ చీరలు కట్టుకునే వస్తాం. ప్రత్యేకంగా ట్రెడిషనల్ డే వంటివి క్రియేట్ చేసుకుని మరీ చీరలు కడుతున్నాం’ అంటోంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ. మోడ్రన్ డ్రెస్సుల దగ్గర ఆచితూచి ఖర్చుపెట్టే అమ్మాయిలు చీర విషయానికి వచ్చేసరికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారని నగరానికి చెందిన డిజైనర్ అవని చెబుతున్నారు.
హఫ్ శారికే డిమాండ్..
ఎన్ని రకాలు వచ్చినా నగరంలో అత్యధికుల్ని ఆకర్షిస్తున్నది మాత్రం హాఫ్‘శారీ’.. అంటే లంగా వోణి కాదు. లంగా వోణి లాంటి చీర అని అర్థం. అచ్చం హాఫ్‌శారీలా కనబడే శారీలు నగర మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వయసు తక్కువలా అనిపించేలా ఉండే వీటి పట్ల నగర మహిళలు ఆదరణ చూపుతున్నారని కలర్జ్ బ్యూటీ స్టూడియో నిర్వాహకురాలు శ్రావణీరెడ్డి చెప్పారు. అలాగే ధోతీ స్టైల్, గోచీ స్టైల్, లెహంగా స్టైల్.. ఇలా అనేక రకాల స్టైల్స్ నగరంలో సందడి చేస్తున్నాయి.
ప్రొఫెషనల్ స్టెప్స్.. స్టైల్ టిప్స్
విభిన్న రంగాల్లో ఉంటున్నవారు అందుకు తగ్గట్టుగా ఉండేందుకు చీరకట్టు కూడా ప్రత్యేకంగా ఉండేలా డిజైనర్లు సూచిస్తున్నారు.
చీర మీద కొంగును సింగిల్‌స్టెప్ వేసే స్టైల్‌ని టీచర్ వృత్తిలో ఉన్నవారు ఎంచుకోవచ్చు. ఇదే స్టైల్‌లో పల్లు కొసని కుడి చేత్తో పట్టుకోవడం వల్ల డిజైన్ కొట్టొచి్చనట్టు కనబడుతుంది.
హుందాగా కనిపించాలనుకున్నవారు డబుల్‌స్టెప్‌ను అనుసరించవచ్చు.
ఇక అత్యధికులకు నప్పేది త్రీస్టెప్స్. పనులకు ఎలాంటి అడ్డంకీ రాకూడదనుకునే ఉద్యోగినులు, గృహిణులు.. అందరికీ ఇది ఓకె.
కాస్త స్పైసీగా కనపడాలనుకుంటే మాత్రం ఫోర్‌స్టెప్స్, ఫైవ్‌స్టెప్స్.. ఇలా ఎంచుకోవాలి.
పట్టు చీరలకు తప్పనిసరిగా ఆరు స్టెప్స్ ఉండాల్సిందే. అప్పుడే దానికి ఆకర్షణ.
స్కూల్ డేస్ నుంచే కడుతున్నా..
శారీ కట్టడం స్కూల్ డేస్ నుంచే అలవాటు. అందుకే చీరకట్టు నాకు చాలా కంఫర్ట్‌బుల్ అనిపిస్తుంది. ఒక యాంకర్‌గా రకరకాల ప్రోగ్రామ్స్ కోసం రకరకాలుగా రెడీ అవుతుంటాను. అన్ని రకాల స్టైల్స్ ధరించడం అవసరం కూడా. అయితే నా మనసు ఎప్పటికీ చీరమీదే ఉంటుంది. రకరకాల బ్లౌజ్‌లు, జ్యువెలరీస్ జత చేసి వెరైటీ స్టైల్స్‌లో డ్రేప్ చేసుకోవచ్చు..
– మంజూష, యాంకర్
Comments
Please login to add a commentAdd a comment