ఆకట్టుకుంటున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం
సమీపంలో మరికొన్ని పుణ్య క్షేత్రాలు
అందుబాటులో రైలు, రోడ్డు మార్గాలు
సాక్షి, సిటీబ్యూరో, యాదాద్రి: హైదరాబాద్ తూర్పున టెంపుల్ టూరిజానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల భువనగిరి పట్టణ శివారులో నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్యాతి్మక భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు, యాత్రికులు క్యూ కడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం విశేషం. దీంతో పాటు దేవాలయం పరిసర ప్రాంతాల్లో అనేక ఇతర ఆధ్యాత్మిక మందిరాలు సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి..
భువనగిరిలోని స్వర్ణగిరితోపాటు కొలనుపాకలో వెలసిన జైన మందిరం, జగద్గురు రేణుకాచార్యులు ఉద్భవించిన చండికాండ సహిత సోమేశ్వరాలయాలకు సైతం భక్తుల తాకిడి కనిపిస్తోంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇదే ప్రాంతంలో ఉండనే ఉంది. ఒక్క రోజులో దేవాలయాలన్నీ చుట్టి రావచ్చు. వారాంతం, సెలవు రోజుల్లో ఆధ్యాతి్మక పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతోంది.
భక్తులతో కిటకిట..
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు గడిచిన నాలుగు నెలలుగా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదగిరిగుట్టకు రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు సందర్శించుకుంటుండగా, తాజాగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరాలయంలోనూ సుమారు 25 వేల మంది భక్తులు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. వారాంతం, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను పోలి ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం భక్తులు దేవాలయాలను దర్శించుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలియనివారుండరు. తాజాగా స్వర్ణగిరి ఆదే స్థాయిలో గుర్తింపు పొందుతోంది. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఆలయాలు రూపుదిద్దుకోవడం, బస్సు, రైళ్ల సదుపాయాలూ ఉండటంతో ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. అదే సమయంలో విశాలమైన రహదారి సదుపాయాలు ఉన్నాయి. దీంతో సొంత వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.
ప్రయాణం ఇలా..
హైదరాబాద్ నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో స్వర్ణగిరి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు వెళ్లేందుకు వరంగల్ జాతీయ రహదారి ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యం వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర రవాణా వాహనాలు ఆ మార్గంలో నడుస్తున్నాయి. ఉప్పల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది. కొలనుపాక వెళ్లాలనుకునే జైన భక్తులు ఆలేరు నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట మార్గంలో వెళ్లే కృష్ణా, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, పుషు్పల్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు భువనగిరి, యాదాద్రి, ఆలేరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. అక్కడి నుంచి ఆటో, బస్సులో వెళ్లవచ్చు.
మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, స్వర్ణగిరి ఆలయంతో పాటు తెలంగాణలో పేరొందిన పది దేవాలయాలు ఉన్నాయి.. ఆ వివరాలు...
– అలంపూర్ జోగులాంబ దేవాలయం
– బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం
– వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం
– కొండగట్టు వీరాంజనేయస్వామి దేవాలయం
– యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
– చిలుకూరు బాలాజీ దేవాలయం
– ఖర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం
– ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
తిరుపతి ఫీల్ ఉంది..
కుటుంబ సభ్యులతో కలసి స్వర్ణగిరి, యాదగిరి గుట్ట, ఆ చుట్టూ ఉన్న టెంపుల్స్ వెళ్లాము. స్వర్ణగిరి కొత్తగా కడుతున్నారు. అక్కడికి వెళ్లగానే తిరుపతి ఫీల్ ఉంటది. యాదగిరి గుట్ట కొత్తగా కట్టిన తరువాత తప్పనిసరిగా ప్రతిఒక్కరూ చూడాలి. ఒక్క రోజులో దేవాలయాలన్నీ దర్శనం చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేశాం. ఆధ్యాత్మిక టూర్ ప్లాన్ చేసుకున్నవారికి ఇది బాగుంది. – జలజా రెడ్డి, మణికొండ
Comments
Please login to add a commentAdd a comment