ట్రావెల్స్, హోటల్స్, టూర్ ఆపరేటర్ల కోసం మాస్టర్ క్లాస్
మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ రోడ్ షో..
పర్యాటకుల సంఖ్య 3 రెట్లు పెరుగుదల
సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాతిగాంచిన జ్యోతిర్లింగాలలో ఒక్కటైన ఉజ్జయిని మహకాళి దేవాలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. అదే సమయంలో దేవి లోక్ శక్తిపీఠం, ఓంకారేశ్వరలోని 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, ఇతర దేవాలయాలు మధ్యప్రదేశ్‌లో ఆధ్యాతి్మక పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
ప్రాణ్పూర్ చందేరి సమీపంలో భారతదేశపు మొదటి క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ గ్రామం, చందేరి ఫెస్టివల్, కునో ఫారెస్ట్ ఫెస్టివల్, గాం«దీసాగర్ ఫారెస్ట్ రిట్రీట్, జల్ మహోత్సవ్ వంటి పండగలు, అక్కడి సంస్కృతి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 785 పులులతో ‘టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా’ టైటిల్‌ను సొంతం చేసుకున్న వన్యప్రాణి అటవీ ప్రాంతం, 14 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లతో సహా హెరిటేజ్ టూరిజం స్పాట్లు మహారాష్త్ర సొంతం. ఎనిమిది నగరాలను కలుపుతూ భారతదేశంలోనే మొదటి ఇంట్రా స్టేట్ ఎయిర్ ట్యాక్సీ సేవలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న మధ్యప్రదేశ్‌లో పర్యాటక రంగం ఇటీవలి కాలంలో గణనీయంగా వృద్ధి చెందుతోంది.
పెరిగిన పర్యాటకులు..
అధికారిక లెక్కల ప్రకారం 2022లో పర్యాటకుల సంఖ్య 34.1 మిలియన్లుగా ఉండగా.. 2023లో ఆ సంఖ్య 112.1 మిలియన్లకు చేరింది. గణనీయమైన పెరుగులతో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు వివిధ రాష్ట్రాల్లో రోడ్‌షోలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ‘గ్రీన్, క్లీన్, సేఫ్ మధ్యప్రదేశ్’ అనే థీమ్‌తో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ స్థానిక ఓ స్టార్ హోటల్‌లో రోడ్ షో నిర్వహించింది. ట్రావెల్ ఏజన్సీలు, టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక అవగాహన కల్పించారు.
సాంస్కృతిక కళలు..
ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్, లోక్రంగ్, తాన్సేన్ సమారో (2025లో 100వ ఎడిషన్), అల్లావుద్దీన్ ఖాన్ సంగీత్ సమారో, అఖిల భారతీయ కాళిదాస్ సమారోహ్ తో సహా ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలను అందిస్తోంది. ‘హార్ట్ ఆఫ్ ఇన్‌క్రెడిబుల్ ఇండియాను సందర్శించడానికి ఔత్సాహికులను ఆహా్వనిస్తున్నారు.
సత్సంబంధాల కోసం..
హైదరాబాద్‌లో రోడ్ షో విజయవంతమైంది. పలు సంస్థలతో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ చేసుకున్న అవగాహన ఒప్పందాలు పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య బలమైన బంధాలు ఏర్పాటు చేస్తుంది. ట్రావెల్ ఏజన్సీలు, టూర్ ఆపరేటర్లు ఈ వర్క్ షాప్‌లో తమ అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉంది. పర్యాటకంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నవారిని రాయితీలతో ఆహ్వానిస్తున్నాం. – బిదిషా ముఖర్జీ, అదనపు మేనేజింగ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment