మరణానంతరం.. మరో చరిత్ర | A step forward for the welfare of society For donating Organs | Sakshi
Sakshi News home page

మరణానంతరం.. మరో చరిత్ర

Published Fri, Dec 6 2024 7:00 AM | Last Updated on Fri, Dec 6 2024 3:04 PM

A step forward for the welfare of society For donating Organs
  • సమాజహితం కోసం ముందడుగు
  • దేహాన్ని దానం చేస్తున్న పలువురు పరిశోధనలకు అనుకూలంగా నిర్ణయం
  • అవయవదానంతో నలుగురి ప్రాణాలు నిలబెడుతూ మానవ మనుగడకు దోహదపడేలా
  • పుట్టుక పరమార్థాన్ని గ్రహించిన వారై..  

మనిషి జన్మ వింతే.. అది తెలియకుంటే చింతే.. నీ నిర్మాణమే తెలుసుకోవా.. బతుకు  అర్థం ఉంది. అది తెలియకుంటే వ్యర్థం..  జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ..  తస్మాదపరిహార్యే అర్థేన త్వం శోచితుమర్హసి.. (పుట్టినవానికి మరణం తప్పదు.. మరణించినవానికి పుట్టుక తప్పదు.. తప్పించుకోడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు.) 
– సాక్షి, సిటీబ్యూరో 

మనిషికి ప్రాణం పై ఉన్న మక్కువ లెక్క కట్టలేనిది.. మరణం అనేదే లేకుండా చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు.. దేవుడు రాసిన తలరాతను ఎవరూ మార్చలేరు. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అయితే అమరులుగా ఉండాలనే ఆశ మనిíÙలో ఎప్పటికీ తగ్గదు. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే.. అందరూ స్వార్థంగా ఉండరు. సమాజంలో ఎంతో నిస్వార్థంగా జీవించే వారూ ఉంటారు. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. చిన్న సహాయం చేస్తేనే ఏదో గొప్ప పని చేశాం అని చెప్పుకునే ఈ రోజుల్లో... అవయవదానం చేసే గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి మొత్తం శరీరాన్ని దానం చేసే వారిని ఏమనాలో.. ఇలా నగరంలో ఎంతో మంది మరణానంతరం తమ భౌతికదేహాలను పరిశోధనల కోసం  దానం చేసేందుకు ముందుకు వచ్చారు. 

మానవతా దృక్పథంతో..  
దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది అంటారు.. కానీ అన్నింటి కన్నా దేహాన్ని దానం చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం చేయడం అంత సులువైన విషయం కాదు. సామాజిక, సంప్రదాయ, ఆర్థిక, మానసిక సమస్యలు ఇందులో ముడిపడి ఉంటాయి. కుటుంబంతో పాటు.. బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ముందుగా దేహాన్ని దానం చేయాలంటే పెద్ద మానసిక సంఘర్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ దాటుకుని ముందడుగు వేయడం చాలా పెద్ద విషయం. కుటుంబ సభ్యులను ఒప్పించడం కూడా పెద్ద టాస్క్‌ అనే చెప్పొచ్చు

.  

ఎన్జీవోల పాత్ర మరువలేనిది..  
సాధారణంగా అవయవదానం, మృత దేహాలను దానం చేసే విషయంలో ఎన్జీవోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నగరంలోని పలు సంస్థలు ఈ దిశగా ప్రజలకు అవగాహన కలి్పస్తున్నాయి. ఎంతో మంది తమ అవయావాలు దానం చేసేందుకు కృషి చేస్తున్నాయి. దీంతో పాటు కడవర్‌ దానం చేయించడం అంత సులువైన పని కాదని పలువురు ఎన్జీవోల నిర్వాహకులు చెబుతున్నారు. చాలా వరకూ కనీసం పోస్ట్‌ మార్టం చేయించేందుకే విముఖత చూపిస్తారని.. అలాంటి సమాజంలో ఉన్న వారిని ఒప్పించడం ఇబ్బందికరమేనని పేర్కొంటున్నారు.  

చదువుకున్న వాళ్లలో ఎక్కువగా..
దానం చేసిన దేహాన్ని కడవర్‌ అంటారు. దేహం దానం చేయడం ఎక్కువగా చదువుకున్న వారిలో కనిపిస్తుంది. సమాజంపై అవగాహన ఉండటం వల్ల కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు..  

పరిశోధనల కోసం..
మాములుగా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి శరీరాల నుంచి అవయవదానం చేస్తుంటారు. కానీ చనిపోయిన తర్వాత శరీరం అవయవ దానాలకు పనికి రాదు. అప్పుడు శరీరాన్ని మెడికల్‌ కాలేజీలకు దానం చేస్తారు. ఆ శరీరాన్ని ప్రయోగాలు చేసుకునేందుకు, పరిశోధనలు చేసేందుకు వినియోగిస్తారు. శరీరాన్ని దానం చేయాలంటే.. మరణానికి ముందు స్థానిక వైద్య కళాశాల, ఆస్పత్రి లేదా ఎన్జీవోతో ముందస్తు ఒప్పందం చేసుకోవాలి. సంబంధిత పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. మరణించిన తర్వాత వారికి సమాచారం అందిస్తే అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తారు.. అయితే చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు అందరూ.. ఒప్పుకుని సంతకాలు చేసి దానం చేయొచ్చు.

అమ్మ కోరిక మేరకు..
మరణానంతరం తన శరీరాన్ని ప్రయోగాల కోసం దానం ఇవ్వాలని అమ్మ అనుకునేది. కుటుంబ సభ్యులమంతా కలసి ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నాం. ఆమె మరణించిన తర్వాత ఓ ఎన్జీవోకు ఫోన్‌ చేసి.. విషయం చెప్పాం. అయితే మా నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. కర్మకాండలు జరిపించకపోతే పాపం అని చాలా మంది అన్నారు. కానీ ప్రయోగాల కోసం ఇస్తే ఎంతో మందికి జ్ఞానం వస్తుందని మేం నమ్మాం. ఎంతమంది ఏం అనుకున్నా ముందుకు వెళ్లాం. ఒకానొక సందర్భంలో మమ్మల్ని వేలేసినంత పని చేశారు. కానీ కొందరు మాత్రం మా నిర్ణయాన్ని స్వాగతించారు. అమ్మ ఎప్పుడూ దైవ చింతనలో ఉండేవారు. అధ్యాత్మికతలో మునిగిపోయేవారు. అయినా కూడా సంప్రదాయాలను పక్కన పెట్టి శరీర దానానికి ముందుకు వచ్చారు. ఆమెకు ఆమెనే గొప్ప బిరుదు సంపాదించుకున్నారు.. అదే కడవర్‌.. 
– మునిసురేశ్‌ పిళ్ళై, కడవర్‌ భారతమ్మ కుమారుడు  

అవగాహన పెరగడం వల్లే.. 
ఇటీవల సమాజంలో అవగాహన పెరగడంతో అవయవదానం చేసేందుకే చాలా మంది ముందుకు వస్తున్నారు. చదువుకుని.. సమాజంపై అవగాహన ఉన్న వాళ్లు అవయవ దానాన్ని అర్థం చేసుకుంటున్నారు. అలాగే సరైన కౌన్సెలింగ్‌ ఇచ్చి నలుగురికీ సహాయపడొచ్చని చెప్పడం వల్లే ఒప్పుకుంటున్నారు. అవయవ దానంతో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం వదులుకోవద్దు. ఇదే అసలైన సమాజ సేవ. 
– డాక్టర్‌ సందీప్‌ దవళ్ల, హెచ్‌వోడీ యూరాలజీ విభాగం, ఈఎస్‌ఐసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement