పెట్.. బ్యూటీ సెట్! | Pet Parlors And Grooming Services In Hyderabad City | Sakshi
Sakshi News home page

పెట్.. బ్యూటీ సెట్!

Published Fri, Sep 13 2024 8:42 AM | Last Updated on Fri, Sep 13 2024 8:42 AM

Pet Parlors And Grooming Services In Hyderabad City

సౌందర్య పిపాసలో మనుషులతో శునకాల పోటీ..

అడుగడుగునా పెట్‌ పార్లర్స్, పోటాపోటీగా గ్రూమింగ్‌ సేవలు..

వాకిట్లో మొబైల్‌ పార్లర్లు, డ్రెస్సులేస్తున్న స్టైలిస్ట్స్‌..

నగరవాసుల స్టేటస్‌ సింబల్స్‌గా..

వ్యయ ప్రయాసలకు రెడీ అంటున్న సెలబ్స్‌..

సాక్షి, సిటీబ్యూరో: మనం బాగుంటే చాలదు.. మనవి అన్న ప్రతిదీ బాగుండాలి. మనం ఎక్కి తిరిగే కారు నుంచి మన వెనుకే తిరిగే శునకం, పెంపుడు జంతువు దాకా..అన్నీ బాగుండాలి. గ్లామర్‌ మేనియా నానాటికీ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో పెద్దలూ, పిల్లలూ దాటి చివరకు పెట్స్‌ వరకూ వచ్చేసింది. మై పెట్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ అంటూ సగర్వంగా చెప్పుకోవాలనే ఆరాటం పెరుగుతుండడంతో పెట్స్‌కు అందాలను అద్దే పార్లర్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీని కోసం నగరంలో మొబైల్‌ పార్లర్లు, గ్రూమింగ్‌ సేవలను అందించే పార్లర్స్, బ్యూటీ సెలూన్స్‌ ఇలా ఒక్కటేమిటి.. మనుషులకు ఎన్ని రకాల సౌందర్య సాధనాలు ఉన్నాయో.. అవన్నీ పెంపుడు జంతువులకూ అందుతున్నాయి..

స్నానం నుంచి.. హెయిర్‌ డై వరకూ..
ఈ పెట్స్‌ పార్లర్ల సేవల జాబితాలో ఔషధ స్నానం, జుట్టు కత్తిరించడం, నెయిల్‌ క్లిప్పింగ్, చెవి శుభ్రపరచడం, హెయిర్‌ క్లీనింగ్, డై.. వంటివి ఉన్నాయి. ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తున్నామని పార్లర్ల నిర్వాహకులు అంటున్నారు. పెంపుడు జంతువులకు, మొత్తం గ్రూమింగ్‌ ప్రక్రియ దాదాపు ఒక గంట పడుతుందనీ పొడవాటి బొచ్చు కలిగిన శునకాలు, లేదా హస్కీలు వంటి వాటికి 90 నిమిషాల వరకూ పడుతుందని గ్రూమర్లు చెబుతున్నారు. తమ సెలూన్‌లలో పనిచేసే గ్రూమర్లందరూ వెటర్నరీ కళాశాల డిప్లొమా హోల్డర్లు. ఉద్యోగంలో భాగంగా తొలుత వారు మూడు నెలల పాటు శిక్షణ పొందుతారని జస్ట్‌ గ్రూమ్‌ నిర్వాహకులు అంటున్నారు.

శునకాలు చూపే ఆప్యాయత ఎలా ఉంటుందో వాటి యజమానులకు మాత్రమే అర్థం అవుతుంది. అవి అలవాటైన మనుషులతో అల్లుకుపోతుంటాయి. కాబట్టి పెట్స్‌ ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని పరిశుభ్రంగా ఉంచడం వాటికి మాత్రమే కాదు వాటి యజమా నులకు కూడా అత్యవసరం. రోజు వారీ స్నానం చేయించడం, నులిపురుగుల నిర్మూలన, జుట్టు కత్తిరించడం, పళ్లను పాలిష్‌ చేయడం, గోళ్లను కత్తిరించడం ఇలాంటివెన్నో చేయడం అవసరం. అయితే పెట్‌ను ఇంటికి తెచ్చుకున్నంత సులభం కాదు వాటికి ఈ సేవలన్నీ చేయడం.. ఇందుకు సమయంతో పాటు అనుభవం, నైపుణ్యం కూడా కావాలి. సరిగ్గా చేయలేకపోతే, అలర్జీలు ఇన్ఫెక్షన్లతో ఇంటిల్లిపాదికీ సమస్యలు తప్పవు.

గ్రూమింగ్‌ దారి.. ఆర్గానిక్‌ మరి..
నగరంలో ఇలాంటి పెట్‌ యజమానుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రకాల సేవలను అందించే వ్యక్తులు, సంస్థలు వచ్చాయి. వీటి మధ్య పోటీ తత్వం కూడా పెరిగింది. పెట్స్‌కు మసాజ్‌ చేయడం, బబుల్‌ బాత్‌ తదితర సదుపాయాలు మనుషుల స్పా మాదిరిగానే రొటీన్‌ భౌ¿ౌలకు కూడా విస్తరించాయి. వీటికి తూడో మరిన్ని వెరైటీలు కూడా జతయ్యాయి.

అదిరే డ్రెస్సింగ్‌ స్టైల్‌.. 
పెళ్లికి వెళుతూ పిల్లిని చంకనబెట్టుకుపోవడం నామోషీ అనే పరిస్థితి ఇప్పుడు లేదు. అది పిల్లి అయినా కుక్కపిల్లయినా.. సరే దర్జాగా తమ పెట్‌ని కూడా వేడుకల్లో భాగం చేస్తున్నారు. పైగా అదే తమ స్టేటస్‌ సింబల్‌గానే భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫంక్షన్‌ లేదా ఫొటోషూట్‌కు తీసుకెళ్లాల్సి ఉంటే, తగిన దుస్తులు ధరింపజేయడం, ప్రత్యేకంగా హెయిర్‌ను సెట్‌ చేయడం వంటివి కూడా పెట్‌ స్టైలిస్ట్స్‌ చేస్తున్నారు. అలాగే పిల్లులను పెంచుకునేవారికి వీరు సేవలు అందిస్తున్నారు.

వ్యాధుల వ్యయంతో పోలిస్తే నయమే..
శుభ్రత పాటిస్తే పెట్స్‌ ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి సరైన విధంగా స్నానం చేయించడం అన్ని వేళలా సాధ్యం కాక చర్మవ్యాధులు వంటివి రావచ్చు. గ్రూమింగ్‌ లేకపోయినా ఆరోగ్య సమస్యలే. అందుకే నా పెట్‌కి నెలకోసారి స్పాలో స్నానం, మూడు నెలలకు ఒకసారి గ్రూమింగ్‌ చేయిస్తాను. నెలవారీగా రూ.3వేలు ఖర్చు అవుతుంది. అయితే వ్యాధులు వస్తే అంతకన్నా  ఎక్కువే ఖర్చు చేయాలి. మొబైల్‌ సేవల వల్ల పెట్‌ స్పా కోసం దూరభారం ప్రయాణించే అవసరం పోయింది. – పరిమళ, సికింద్రాబాద్‌

తరలివచ్చి.. తళుకులద్దగ..
గతంలో ఈ తరహా పెట్‌ గ్రూమింగ్‌ సేవల్ని నగరంలో కొన్ని సంస్థలు తమ ఆవరణలో అందించేవి. అయితే కరోనా సమయంలో తమ పెట్స్‌ని గ్రూమింగ్‌ పార్లర్స్‌కు  తీసుకెళ్లలేక పడిన ఇబ్బందులు మొబైల్‌ పార్లర్స్‌కు  ఆజ్యం పోశాయి. ప్రస్తుతం నగరంలో దాదాపు వందకు పైగా మొబైల్‌ వ్యాన్లు ఈ పెట్‌ స్పాలను ఇంటింటికీ మోసుకొస్తున్నాయి. తమకు ఏడు వ్యాన్ల దాకా ఉన్నాయని, నగరవ్యాప్తంగా పెట్స్‌కు మొబైల్‌ స్పా సేవల్ని అందిస్తున్నాయని పెట్‌ గల్లీ సిబ్బంది సాక్షికి వివరించారు. జూబ్లీహిల్స్‌లోని పెట్‌ స్పాలో ప్రొఫెషనల్‌ గ్రూమర్‌ అయిన డి.సౌమ్య మాట్లాడుతూ, ‘ఇంతకుముందు, పెంపుడు జంతువును అలంకరించేందుకు ఇళ్లను సందర్శించేవాళ్లం. అయితే ఇళ్ల దగ్గరకు వెళ్లడం, అక్కడ సరైన ప్రైవసీ లేకపోవడం సహా అనేక రకాల ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోగ్రూమింగ్‌ వ్యాన్‌ ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారింది’ అని చెప్పారు.

  • నగరానికి చెందిన ప్రొఫెషనల్‌ పెట్‌ కేర్‌ సంస్థ పెట్‌ఫోక్‌కు చెందిన నిపుణులైన గ్రూమర్‌ల బృందం ఇప్పుడు పెంపుడు జంతువులకు ఇంటి దగ్గరే వారి వస్త్రధారణ సేవలను సైతం అందజేస్తుంది, అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించిన వ్యాన్‌లను ఈ సంస్థ ఉపయోగిస్తోంది. యూజర్‌ ఫ్రెండ్లీ ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా, వెబ్‌ యాప్‌ మొబైల్‌ యాప్‌గా కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుంది.

  • మెకానికల్‌ ఇంజనీర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేసిన చైత్ర సాయి దాసరి ప్రారంభించిన డోర్‌స్టెప్‌ సర్వీస్‌ జస్ట్‌ గ్రూమ్‌. ‘పెంపుడు జంతువులకు రిలాక్సేషన్‌ ఇచ్చి విశ్రాంతి తీసుకునేలా చేసే గ్రూమింగ్‌ సరీ్వస్‌ అవసరం. వీటికి వస్త్రధారణ కేవలం సౌందర్య సాధనం కాదు. ఇది పెంపుడు జంతువు మానసిక ఆరోగ్యానికి దారి కూడా. సరైన విధంగా లేని స్నానం చర్మ వ్యాధులు కలిగించి అవి వస్త్రధారణకు భయపడేలా చేస్తుంది’ అంటున్నారు చైత్ర. తమ జస్ట్‌ గ్రూమ్‌ ప్రస్తుతం జంటనగరాల వ్యాప్తంగా సంచరిస్తున్న తమ వ్యాన్స్‌ ద్వారా ప్రతిరోజూ కనీసం 50 పెట్స్‌కు సేవలు అందిస్తున్నారు.  

సొంత బిడ్డల్లాగే.. పెట్స్‌ కూడా..
పెట్స్‌ను పెంచుకుంటున్న నగరవాసులు వాటిని సొంత పిల్లల్లాగే భావిస్తున్నారు. వాటి ఆరోగ్య సంరక్షణతో పాటు వాటికి అవసరమైన అన్ని రకాల అలంకరణలూ చేస్తున్నారు. తమతో పాటు వాటిని టూర్లు, షికార్లు, ఈవెంట్స్‌కు తీసుకువెళుతున్నారు. వీటన్నింటి వల్లే పెట్‌ గ్రూమింగ్‌ అత్యంత ప్రధానమైన అంశంగా మారింది. పెట్స్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేఫ్‌ను నిత్యం సందర్శిస్తుంటారంటే.. పెట్స్‌ పట్ల యజమానుల ప్రేమను అర్థం చేసుకోవచ్చు. – రుచిర, పెట్‌ కేఫ్‌ నిర్వాహకులు

ఇవి చదవండి: Fashion: మై వార్డ్‌రోబ్‌: క్రియేటివ్‌గా.. హుందాగా..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement