అంతర్జాతీయ క్రీడలకు అడ్డాగా హైదరాబాద్
ఇప్పటికే క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి క్రీడల్లో గ్లోబల్ మెడల్స్
ఆర్చరీ, స్కేటింగ్, సెయిలింగ్ వంటి క్రీడాంశాలపై దృష్టి సారించిన ఈ తరం
ఒలింపిక్సే లక్ష్యంగా శిక్షణ, వినూత్న క్రీడాంశాలే ఆకర్షణ
హైదరాబాద్ అంటే బిర్యానీ, బాహుబలి, బ్యాడ్మింటన్..!! గతంలో అప్పటి రాష్ట్రపతి నగరానికి విచ్చేసిన సందర్భంలో అన్న మాటలివి. అంటే నగరంలో అంతర్జాతీయ క్రీడలు అంతటి ప్రశస్తిని సాధించుకున్నాయి. బ్యాడ్మింటన్ మాత్రమే కాదు హాకీ, టెన్నిస్, క్రికెట్, చెస్, రన్నింగ్ ఈ మధ్య కాలంలో రెజ్లింగ్ వంటి విభిన్న క్రీడాంశాల్లో హైదరాబాద్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అనాదిగా కొనసాగుతున్న ఈ ఆనవాయితీని ప్రస్తుత తరం క్రీడాకారులు కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గుర్తింపు పొందిన క్రీడల్లోనే కాకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందేందుకు వినూత్న క్రీడలు, అథ్లెటిక్స్‌ను ఎంచుకుని ఆయా విభాగాల్లో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు తరం దృష్టి సారించిన క్రీడలు, అందులోని ప్రత్యేకతలను ఓసారి తెలుసుకుందామా..!!
అంతర్జాతీయ క్రీడలకు హైదరాబాద్ నగరానికి ఆనాటి నుంచే అవినాభావ సంబంధముంది. దేశ ఖ్యాతిని ప్రపంచదేశాల సరసన అగ్ర స్థానంలో నిలబెట్టిన హైదరాబాదీయులు, ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. క్రికెట్‌లో అజహరుద్దిన్, వెంకటపతిరాజు, వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీరాజ్ ప్రస్తుతం మహ్మద్ సిరాజ్, టెన్నిస్‌లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధూ, సైనా నేహ్వాల్, రన్నింగ్‌లో పీటీ ఉష, చెస్‌లో ద్రోణవ్లలి హారిక, రెజ్లింగ్‌లో నిఖత్ జరీనా ఇలా ఒక్కొక్కరూ ఒక్కో క్రీడలో అత్యత్తమ నైపుణ్యాలను కనబర్చి ఆయా క్రీడాంశాల్లో భారత్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. అదే విధంగా వ్యక్తిగతంగానూ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను రాసుకుని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇదే తరహాలో ఈ తరం క్రీడాకారులు ఇప్పటికే గుర్తింపు పొందిన క్రీడలు కాకుండా వినూత్నంగా ఎంపిక చేసుకుని ఒలింపిక్స్ స్థాయిలో క్రీడా నైపుణ్యాలను కనబరుస్తున్నారు.
సెయిలింగ్ టాప్.. స్కేటింగ్ రాక్..
ప్రస్తుత తరం.. హైదరాబాదీ క్రీడాకారులు ఆర్చరీ పై ప్రత్యేక దృష్టి సారించారు. నగరం వేదికగా ఈ వారసత్వ క్రీడపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా ఈ సారి జరిగిన ఒలింపిక్స్‌లో తెలుగు కుర్రాడు ధీరజ్ ఆర్చరీలో నాలుగో స్థానంలో నిలిచి భవిష్యత్ ఆర్చరీని శాసించేది మేమేనని హింట్ ఇచ్చాడు. నగరం వేదికగా 150 మంది ఆర్చరీ అథ్లెట్లు ఉన్నారని ఓ అంచనా. జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఆర్చరీ టీం ద్వితీయ స్థానంలో ఉందని క్రీడారంగ నిపుణులు పేర్కొన్నారు. 2028 ఒలింపిక్సే లక్ష్యంగా ఈ క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు.
రోయింగ్‌లోనూ రాణిస్తూ..
ఇదే కోవలో రోయింగ్ కూడా రాణిస్తుంది. రోయింగ్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. అంతాగా ప్రచారంలోకి రాకపోయినప్పటికీ.. స్కేటింగ్‌లో కూడా హైదరాబాదీలు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తున్నారు. వీటితో పాటు రైఫిల్ షూటింగ్‌లో కూడా నగరవాసులు గురి పెట్టారు. ఇప్పటికే నేషనల్స్‌లో పతకాలు సాధించడమే కాకుండా గ్లోబల్ వేదికపై మరోసారి గురి చూసి షూట్ చేయడానికి సన్నద్ధమౌతున్నారు. మరో వైపు స్విమ్మింగ్‌లోనూ మనం ముందంజలో ఉన్నాం. గత ఐదేళ్లలో నగరానికి చెందిన స్విమ్మర్లు జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నారు. అయితే వినూత్నంగా పికిల్ బాల్ వంటి సరికొత్త క్రీడలను నగరవాసులు తెరపైకి తీసుకొస్తున్నారు.
సెయిలింగ్‌లోనూ..
దీంతో పాటు సెయిలింగ్‌లోనూ హైదరాబాద్ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తుంది. ఈ ఏడాది నేషనల్స్‌లో హైదరాబాదీ సెయిలర్స్ గోవర్ధన్, దీక్షిత కొమురవెళ్లి వంటి సెయిలర్స్ టాప్–1లో కొనసాగుతుండటం విశేషం. అంతేకాకుండా ప్రతీ కొంగర వంటి నావికులు ఒలింపిక్సే లక్ష్యంగా శిక్షణ పొందుతున్నారు.
నూతనోత్సాహంతో గుర్తింపు..
క్రీడలో రాణించాలనే తపనకు నూతనోత్సాహాన్ని, అంతకు మించిన గుర్తింపును తెస్తున్నారు. ఇందులో భాగంగానే సెయిలింగ్‌లో ఎంతో శ్రమించి జాతీయ. అంతర్జాతీయ స్థాయిలో రాణించాను. వైఏఐ జూనియర్ నేషనల్స్ 2022 ఆప్టిమిస్టిక్ బాలికల విభాగంలో కాంస్యం, మాన్‌సూన్ రేగట్టా 2023 ఇదే విభాగంలో బంగారు పతకంతో వివిధ జాతీయ స్థాయి పోటీల్లో పతకాలను సాధించాను. పీవీ సింధూ, సానిమా మీర్జాలాగే నేను అంతర్జాతీయ స్థాయి పతకాలను సాధించి దేశానికి, నగరానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నాను.
:::దీక్షిత కొమురవెళ్లి
నా విద్యార్థులే నిదర్శనం..
రానున్న కాలంలో ఆర్చరీలో హైదరాబాద్ క్రీడాకారులు టాప్‌లో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం నా విద్యార్థులే.. నా వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్ 2లో ఉన్నారు. 2028 ఒలింపిక్సే లక్ష్యంగా ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను సన్నద్ధం చేస్తున్నాను.
:::రాజు, ప్రముఖ కోచ్, ఆర్చరీ నేషనల్ చాంపియన్
:::సాక్షి, సిటీబ్యూరో
Comments
Please login to add a commentAdd a comment