ఇంటి నుంచి కదలకుండా కొలతలు..
డోర్ డెలివరీ ఆఫ్టర్ స్టిచ్ వెసులుబాటు..
నగరంలో పెరుగుతున్న ఆన్‌లైన్ టైలరింగ్..
కరోనా తర్వాత వెల్లువలా నయా ట్రెండ్
సాక్షి, సిటీబ్యూరో: స్టిచ్ ఆన్‌లైన్.. ఇప్పుడు ఇదే నగరంలో నడుస్తున్న నయా ట్రెండ్.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదీ ఆన్‌లైన్ మయమైంది. కరోనా తర్వాత ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోయింది. ఫుడ్‌తో పాటు మనకు కావాల్సిన వస్తువు ఏదైనా.. ఒక్క క్లిక్‌తో ఇంటికే డెలివరీ ఇస్తున్నారు. నిత్యావసర సరుకులు మొదలుకుని.. ఎలక్ట్రానిక్స్ వరకూ.. టూవీలర్స్ మొదలుకుని.. ఫోర్ వీలర్స్ వరకూ.. ఆఖరికి మెడికల్ సపోర్ట్ కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేసింది.. దీంతో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అన్ని పనులూ చక్కబెట్టేసుకుంటున్నారు. ఇది బిజీబిజీగా ఉండేవారికి ఎంతో వెసులుబాటుగా మారింది. బట్టలు కూడా దాదాపు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. అయితే మనకు నచ్చిన, మన శరీరానికి నప్పే బట్టలు, కొలతల విషయంలో ఇబ్బంది తలెత్తుతోంది. దీనికి పరిష్కారంగానే స్టిచ్ ఆన్‌లైన్ ట్రెండ్ అవుతోంది. దీంతో మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న సమయానికి ఇంటికి వచ్చి కొలతలు తీసుకుని, నచ్చిన మెటీరియల్‌తో నచ్చిన మోడల్‌తో స్టిచ్చింగ్ చేసి, ఇంటికే డెలివరీ ఇస్తున్నారు. దీని గురించిన మరిన్ని విశేషాలు..
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అనే సామెత టైలరింగ్‌కు సరిగ్గా నప్పుతుంది. ఒకప్పుడు బట్టలు కుట్టించుకోవాలంటే.. టైలరింగ్ షాపుకు వెళ్లి కొలతలు ఇచ్చి కుట్టించుకునేవారు. ఆ తర్వాత రెడీమేడ్స్ రాకతో టైలరింగ్ మరుగునపడిపోయింది.. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే సరిగ్గా ఇదే కాన్సెప్‌్టని ఉపయోగించి ఆన్‌లైన్ స్టిచ్చింగ్ పేరుతో టైలరింగ్‌కి నూతన హంగులు అద్దారు. అంతేకాదు.. ఇదే ప్రస్తుతం నగరంలో ట్రెండ్‌గా నడుస్తోంది.. అసలేంటీ ఆన్‌లైన్ స్టిచ్చింగ్? అనుకుంటున్నారా.. అదేనండి.. మనకు వెసులుబాటు ఉన్న సమయంలో మనం బుక్ చేసుకున్న ప్రాంతానికే వచ్చి కొలతలు తీసుకుని నచ్చిన మోడల్స్‌లో స్టిచ్ చేసి ఇంటికే డెలివరీ ఇస్తారన్నమాట!
కరోనా తర్వాత..
మన అవసరాలే ఆవిష్కరణలకు మూలం అన్నట్లు.. కరోనా సమయంలో ఎంతోమందికి కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో అవసరాల ద్వారా కలిగిన.. అవకాశాలను పలువురు అందిపుచ్చుకున్నారు. ఆ ఆలోచనలను స్టార్టప్స్‌గా మలచి వ్యాపారంలో రాణిస్తున్నారు. చాలామందికి టైలరింగ్ అనగానే ఓ కుట్టు మెషీన్ పెట్టుకుని వచ్చిన వారికి బట్టలు కుట్టడం. కానీ కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రాలేని వారు, గర్భిణులకు బట్టలు కుట్టించుకోవడం కష్టం అవుతుంది. అందుకే వారి కోసం ఆన్‌లైన్ టైలరింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కమాటలో సింపుల్‌గా చెప్పాలంటే క్లౌడ్ టైలరింగ్ అన్నమాట. దీనికే రకరకాల పేర్లు కూడా ఉన్నాయి.. ఆన్‌లైన్ స్టిచ్, కాల్ దర్జీ, మై టైలర్ ఇలా చాలా వరకూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ వినియోగదారులకు తమ సేవలను అందిస్తున్నాయి.
అభిరుచికి అనుగుణంగా..
మోడ్రన్, ట్రెండీ ఫ్యాషన్ డిజైన్స్‌ను ఈ తరం యువత ఎంతగానో ఇష్టపడుతోంది. సోషల్ మీడియాలో నిత్యం వైరల్‌గా మారే వినూత్న డిజైన్లను సైతం వ్యక్తిగతంగా రూపొందించుకోవడానికి ఈ క్లౌడ్ టైలరింగ్ వారధిగా మారింది. తమకు నచ్చిన డిజైన్‌ల ఫొటోలు లేదా సోషల్ మీడియా లింక్స్ ఈ ఆన్‌లైన్ టైలర్లకు షేర్ చేస్తే చాలు.. వారి సైజులకు తగినట్టుగా వారు కోరుకున్న ఫ్యాషన్ వేర్ ఇంటికొచ్చేస్తున్నాయి. అంతేకాకుండా అభిమాన సెలబ్రిటీలు ధరించినటువంటి ఫ్యాషన్ హంగులను అనుకరించాలనుకునే ఔత్సాహికులకు కూడా ఈ ఆన్‌లైన్ వేదిక స్వర్గధామంలా మారింది. ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ లాయర్ మాదిరిగా.. సెలబ్రిటీలకు పర్సనల్ డిజైనర్ మాదిరిగా.. మనకూ ఓ పర్సనల్ టైలర్ అనే చెప్పొచ్చు. అందుకే ఈ ఆన్‌లైన్ టైలరింగ్ ట్రెండ్‌గా మారుతోంది.
సెలబ్రిటీలకు సౌలభ్యంగా..
సినీతారలు, బుల్లితెర సెలబ్రిటీలు మొదలు ఈ మధ్య ఫేమస్ అవుతున్న సోషల్‌మీడియా సెలబ్రిటీలు ఎందరో. వీరు షాపింగ్ వెళ్లాలన్నా, బొటిక్స్‌లో స్టిచ్చింగ్ కోసం వెళ్లాలన్నా అక్కడి పరిస్థితులు సందడిగా మారతాయి. అంతేకాకుండా వారికి కూడా అభిమానుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదురౌతోంది. ఇలాంటి తరుణంలో ఈ ఆన్‌లైన్ స్టిచ్చింగ్ సెలబ్రిటీలకు సౌలభ్యంగా మారిందని పలువురు తారలు అభిప్రాయపడుతున్నారు. పేజ్ త్రీ పీపుల్ సైతం ఈ ఒరవడికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
డిజైనర్ డ్రెస్సులు సైతం..
సోషల్ మీడియాలోనో లేదా సినిమాలోనో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంలోనో.. లేదా నచ్చిన హీరో, హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కావాలనిపిస్తే.. ఆ క్లిప్ తీసి ఆన్‌లైన్ టైలరింగ్‌కి పంపిస్తే.. సరిగ్గా అదే తరహాలో డెలివరీ ఇస్తారు. అయితే.. అలాంటి డ్రెస్ కావాలని దగ్గర్లోని టైలర్ దగ్గరికి వెళ్తే.. వారికి ఆ తరహా స్టిచ్చింగ్ రాకపోవచ్చు.. మరీ పెద్ద పెద్ద బొటిక్‌లకు వెళ్తే కాస్త డబ్బులు ఎక్కువ చెల్లించుకోవాల్సి రావచ్చు.. అసలు అలాంటివి ఎక్కడ ఉంటాయో కూడా తెలియకపోవచ్చు.. తెలిసినా దూరాభారం అవ్వొచ్చు.. అందుకే వీటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం ఆన్‌లైన్ టైలరింగ్. మనకు నచ్చిన డిజైన్.. మనకు నప్పేలా.. మనకు ఫిట్ అయ్యేలా కుట్టిస్తారు.
ఆన్‌లైన్‌లో ఎలా సాధ్యం?
టైలరింగ్ అంటే మన శరీర కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆన్‌లైన్ ద్వారా ఎలా సాధ్యం అనే కదా డౌటు. ఆన్‌లైన్‌లో మనకు కావాల్సిన డిజైన్ డ్రెస్, జాకెట్, కుర్తా ఇలా ఇంకేదైనా సరే.. ఆర్డర్ పెడితే చాలు. మన ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ల స్టోర్ నుంచి ఓ వ్యక్తి వచ్చి కొలతలు తీసుకుంటారు. ఆ తర్వాత అన్ని పనులు చకచకా చేసేస్తారు. మనకు నచ్చిన డ్రెస్.. చెప్పిన టైంలో మన ఇంటికి వచ్చేస్తుంది. ఇందు కోసం కొలతలు తీసుకునేందుకు లోకల్ టైలర్స్‌తో ఒప్పందం చేసుకోవడం.. లేదా సిబ్బందిని నియమించుకోవడం చేస్తారు. లేని పక్షంలో కస్టమర్లు అందించిన సైజులకు అనుగుణంగా వారు కోరుకున్న డిజైన్లను రూపొందించి పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment