![handball association giving coaching at medchal districtfor poor players](/styles/webp/s3/article_images/2025/01/29/handball.jpg.webp?itok=85viGRlG)
సనత్ నగర్ గ్రౌండ్ వేదికగా శిక్షణ
అసోసియేషన్‌గా ఏర్పడి క్రీడాకారులకు తర్ఫీదు
ఇక్కడి నుంచే జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక
క్రికెట్.. ఫుట్‌బాల్.. బ్యాడ్మింటన్.. ఈ సరసన హ్యాండ్‌బాల్‌కూ ఎనలేని ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఇక్కడి కోచ్‌లు నిరి్వరామంగా కృషి చేస్తున్నారు. క్రీడలపై ఉన్న ప్రీతితో నేటి తరం వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు చిన్ననాటి నుంచే బీజాలు వేస్తున్నారు. ఇందు కోసం స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహిస్తూ హ్యాండ్‌బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. వారే సనత్‌నగర్ కార్మిక సంక్షేమ మైదానం కేంద్రంగా దశాబ్దాల కాలంగా హ్యాండ్‌బాల్ శిక్షణ ఇస్తున్న అసోసియేషన్ సభ్యులు. – సనత్‌నగర్
సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ హ్యాండ్‌బాల్ క్రీడలో ఎందరో ఆణిముత్యాలను అందించింది. పారిశ్రామికవాడగా కార్మికుల ఆవాసంగా ఉన్న సనత్‌నగర్‌లో పలువురు హ్యాండ్‌బాల్ ఆటలో ఆసక్తి చూపిస్తున్న క్రమంలో 1975లో స్థానిక ఎస్‌ఆర్‌టీ కాలనీలోని కార్మిక సంక్షేమ సంఘం భవనం ఆవరణలో ప్రత్యేక క్రీడా శిబిరం నిర్వహించారు. అలా మొదలైన శిబిరం క్రీడాకారుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని రగిలించారు. వారిలో సనత్‌నగర్ మాజీ కార్పొరేటర్ అయూబ్‌ఖాన్, మక్సూద్, జగన్నాథం, సుబోద్ విల్సన్, ప్రబోద్ విల్సన్, డాక్టర్ నగేశ్, విద్య, ఏఎస్ మునవర్, పీవీ నాగార్జున, ధన్‌రాజ్ తదితరులు హ్యాండ్‌బాల్ క్రీడాకారులుగా వెలుగులోకి వచ్చినవారే.
అలాగే సనత్‌నగర్‌కు చెందిన ఎంఏ అజీజ్ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న ఘనతను దక్కించుకున్నారు. మరో క్రీడాకారుడు బాసిత్ ఆసియా క్రీడల ప్రొబబుల్స్‌లో స్థానం కైవసం చేసుకున్నాడు. వీరంతా వృత్తిపరంగా వేర్వేరు రంగాల్లో ఉన్నప్పటికీ హ్యాండ్‌బాల్ క్రీడపై అభిమానాన్ని విడవలేదు. ఇక్కడే శిక్షణ తీసుకుని కోచ్‌లుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు.
నిరంతర శిక్షణనిస్తూ..
జాతీయ స్థాయిలో రాణించిన ఆనాటి మేటి క్రీడాకారులంతా సంఘటితమై 1980లో అప్పటి రంగారెడ్డి జిల్లా (ప్రస్తుత మేడ్చెల్ జిల్లా) హ్యాండ్‌బాల్ అసోసియేషన్ (రిజిస్టర్డ్ నెంబర్: 1859)ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల మంది హ్యాండ్‌బాల్ క్రీడాకారులను తీర్చిదిద్దారు. ఎక్కడ ఏ పోటీ జరిగినా జిల్లా నుంచి పాల్గొనే టీమ్‌ను సన్నద్ధం చేసేది ఈ అసోసియేషనే సభ్యులే. ఇక్కడ శిక్షణ పొందేవారు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక అవుతున్నారు. అండర్–12, అండర్–16, అండర్–19, సీనియర్స్ విభాగాల్లో ఇక్కడ శిక్షణ అందిస్తున్నారు. మొదట స్కూల్ లెవల్ క్యాంపులు నిర్వహించి హ్యాండ్‌బాల్ క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తారు. ఆ తరువాత వారిలో నుంచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి క్రీడలో మెళకువలు నేర్పిస్తారు. ఆ తరువాత వారి ప్రతిభ ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తగిన ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు.
వారే కోచ్‌లుగా, ఇక్కడి గ్రౌండ్‌లోనే శిక్షణ పొందిన వారే కోచ్‌లుగా వ్యవహరిస్తూ ఉచిత శిక్షణ అందిస్తుండడం గమనార్హం.
స్పోర్ట్స్ కోటాలో సీట్లు సాధించిన వారు ఎందరో.. జనరల్ కోటాలో సీటు రానివారికి హ్యాండ్‌బాల్ క్రీడే ఆపన్నహస్తంగా మారుతోంది. ఈ క్రీడలో గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆడినవారు పదుల సంఖ్యలో స్పోర్ట్స్ కోటాలో సులభంగా సీట్లు సాధించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment