క్షేత్ర స్థాయిలో హెచ్‌ఏఎంఆర్‌ఎల్ అధ్యయనం
సాంకేతిక అంశాలపై అధికారుల దృష్టి
రెండు రూట్లలో డబుల్ డెక్కర్ మెట్రోలకే మొగ్గు
హెచ్‌ఎండీఏతో హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సమన్వయం
మార్చి నాటికి డీపీఆర్‌కు కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: నార్త్‌సిటీ మెట్రో కారిడార్‌లపై హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) దృష్టి సారించింది. మార్చి నాటికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించే దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఈమేరకు రెండు కారిడార్‌లలో క్షేత్రస్థాయిలో అధ్యయనం మొదలైంది. కారిడార్‌ల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎదురు కానున్న సమస్యలు తదితర అంశాల ఆధారంగా అధికారులు సర్వే చేపట్టారు. ఈ రెండు రూట్లలో ఇప్పటికే హెచ్‌ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణానికి సన్నాహాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ మార్గాల్లోనే మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో డబుల్ డెక్కర్ కారిడార్‌ల కోసం పియర్స్ ఎత్తును ఏమేరకు పెంచాల్సి ఉంటుంది, ఈ క్రమంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే అంశాలను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు కారిడార్‌లు సైతం డబుల్ డెక్కర్ (Double Deccar) పద్ధతిలో చేపట్టనున్న దృష్ట్యా ఇతర ఎలివేటెడ్ మెట్రోల కంటే నార్త్‌సిటీ మెట్రో (North City Metro) భిన్నంగా ఉండనుంది. ఇందుకనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. 3 నెలల్లో డీపీఆర్ రెడీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోసం కసరత్తు చేపట్టారు.
హెచ్‌ఎండీఏతో సమన్వయం..
రెండు రూట్లలో ఎలివేటెడ్ కారిడార్‌ల కోసం నిర్మించే పియర్స్‌పైనే మెట్రో కారిడార్ రానుంది. దీంతో నార్త్‌సిటీ మెట్రోకు పియర్స్ ఎత్తు, మెట్రో స్టేషన్‌ల నిర్మాణం కీలకం కానున్నాయి.
ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్‌కు, శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్‌లకు హెచ్‌ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. దీంతో మెట్రో నిర్మాణంపై హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సంస్థ హెచ్‌ఎండీఏతో కలిసి పని చేయనుంది. పియర్స్, కారిడార్‌ల నిర్మాణం తదితర అంశాల్లో రెండు సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి. డబుల్ డెక్కర్ వల్ల నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు నగర వాసులకు ఒకే రూట్‌లో రోడ్డు, మెట్రో సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కి.మీ. మెట్రో కారిడార్‌లో డెయిరీఫామ్ వరకు అంటే 5.32 కి.మీ డబుల్‌డెక్కర్ ఉంటుంది. మిగతా 17.68 కి.మీ ఎలివేటెడ్ పద్ధతిలోనే నిర్మించనున్నారు.
మరోవైపు జేబీఎస్ (JBS) నుంచి శామీర్‌పేట్ వరకు 22 కి.మీ. మార్గంలో ఇంచుమించు పూర్తిగా డబుల్‌డెక్కర్ నిర్మాణమే. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు దాదాపు 23 కి.మీ, జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూంకుంట, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు 22 కి.మీ. పొడవుతో మెట్రో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కారిడార్‌లను మెట్రో రెండో దశ ‘బి’ విభాగం కింద చేర్చనున్నారు.
ఇదీ చదవండి: చర్లపల్లి తరహాలో మరిన్ని రైల్వే స్టేషన్లు
డబుల్‌డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ల వల్ల సికింద్రాబాద్ నుంచి ఉత్తరం వైపు వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్ధులు, వివిధ రంగాల్లో పని చేసే అసంఘటిత కారి్మక వర్గాలు సిటీ బస్సులు, సెవెన్ సీటర్ ఆటోలు, సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వాహనాల రద్దీ, గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు.
అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు
మెట్రో రెండో దశపై కేంద్రం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మెట్రో నిర్మాణానికి నిధుల కొరత ఏ మాత్రం సమస్య కాదని, కేంద్రం నుంచి సావరిన్ గ్యారంటీ లభిస్తే అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెన్నై, బెంగళూర్‌లలో మెట్రో విస్తరణకు గత బడ్జెట్‌లలో నిధులు కేటాయించినట్లుగానే హైదరాబాద్ మెట్రోకు కూడా ఈసారి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment