తెలంగాణ రైల్వే స్టేషన్లకు ఆధునిక రూపు
రూ.2,737 కోట్లతో 40 స్టేషన్లకు ఆధునిక కొత్త భవనాలు
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృద్ధి
నాంపల్లి స్టేషన్ పనులు మొదలు
సాక్షి, హైదరాబాద్: ఆధునిక రైళ్లను పట్టాలెక్కిస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు రైల్వే స్టేషన్లకు ఆధునిక రూపు కల్పిం చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఉన్న భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగర శివారులోని చర్లపల్లి స్టేషన్‌కు ఆధునిక భవనాన్ని నిర్మించిన తరహాలో.. రాష్ట్రంలోని ముఖ్య స్టేషన్లను సమూలంగా మార్చనుంది. రాష్ట్రంలో 40 స్టేషన్లకు కొత్త ఆధునిక భవనాలను నిర్మించేందుకు రూ.2,737 కోట్లను మంజూరు చేసింది. అమృత్ భారత్ స్టేషన్లుగా వీటిని గుర్తించిన రైల్వే శాఖ ఈమేరకు ఇటీవల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం దేశంలోనే పెద్ద స్టేషన్‌లలో ఒకటైన సికింద్రాబాద్ లాంటి స్టేషన్లలో కూడా సరైన వసతులు లేవు.
వాటిని ఆధునీకరించకపోవటం, క్రమంగా రద్దీ విపరీతంగా పెరిగిపోవటంతో ప్రయాణికులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి నాలుగైదు ముఖ్య రైళ్లు వచ్చిన సమయంలో, వాటిల్లోంచి ఎక్కి దిగే ప్రయాణికులతో పరిసరాలు కిక్కిరిసిపోయి సకాలంలో రైళ్ల వద్దకు చేరుకోలేక అవి వెళ్లిపోతున్న సందర్భాలు నిత్యకృత్యంగా మారాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై ఆ సమయంలో ప్రయాణికులు ఎక్కడివారక్కడ నిలిచిపోయేంత రద్దీ ఉంటోంది. చూస్తుండగానే రైళ్లు వెళ్లిపోయి ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. ఇక టికెట్ల జారీ, నిరీక్షణ సమయం, వీల్ చైర్లు, టాయిలెట్లు, ప్లాట్‌ఫామ్స్ మారే సమయం.. ఇలా అన్నీ ఇబ్బందులే.
పెద్ద స్టేషన్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, చిన్నవాటిల్లో సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించటంతోపాటు కొత్త వసతులు కల్పిం చటమే ఈ పథకం ఉద్దేశం. సాధారణ మరమ్మతులు కాకుండా, విమానాశ్రయ తరహాలో ఆకృతి ఇస్తూ ఆధునిక రూపు కల్పించాలన్నది ప్రధాని మోదీ ఆదేశం. విశాలమైన పార్కింగ్ ప్రాంతం, హైలెవల్ ప్లాట్‌ఫామ్స్, ఆధునిక వెయిటింగ్ హాల్స్, అవసరమైన చోట్ల ఎస్కలేటర్లు, వేగంగా టికెట్లు జారీ అయ్యేలా కౌంటర్లు, సరికొత్త అనౌన్స్‌మెంట్ వ్యవస్థ, సోలార్ విద్యుత్ ఏర్పాట్లు, విశాలమైన పార్కింగ్ లాట్స్, విశాలమైన అప్రోచ్ రోడ్లు, భద్రతా స్కానింగ్ సెంటర్లు, ఆకర్షణీయమైన భవనం.. ఇలా అన్ని వసతులతో ఇవి ఆకట్టుకుంటాయి.
14 స్టేషన్లకు ఆధునిక హంగులు
అమృత్‌భారత్‌లో చోటు దక్కించుకున్న స్టేషన్లలో 14 హైదరాబాద్‌కు చెందినవే కావటం విశేషం. అమృత్‌భారత్‌లో భాగమైనప్పటికీ, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్లను భారీ ప్రాజెక్టుల కోటాలో ఉంచారు. వీటికి భారీ నిధులు కేటాయించారు. రూ.430 కోట్లతో మినీ ఎయిర్‌పోర్టు తరహాలో రూపుదిద్దుకున్న చర్లపల్లి టెర్మినల్‌ను ఇటీవలే ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తు తం వేగంగా పనులు జరుపుకొంటున్న సికింద్రాబాద్, ఇటీవలే పనులు మొదలైన నాంపల్లి, త్వరలో పనులు ప్రారంభించుకోనున్న కాచిగూడ స్టేషన్లకు భారీగా నిధులు కేటాయించారు.
ఇప్పటికే రూ.700 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్‌కు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరో ఏడాదిన్నరలో ఇది పూర్తి కానుంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి కొత్త భవనం అందుబాటులోకి రావాల్సి ఉన్నా, సకాలంలో పనులు పూర్తయ్యేలా లేవు. దీంతో వచ్చే ఏడాది జూలై నాటికి సిద్ధమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని పనులు కొలిక్కి వస్తున్న తరుణంలో, నగరంలో మరో ముఖ్య స్టేషన్ అయిన నాంపల్లి (హైదరాబాద్) స్టేషన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. పాత క్వార్టర్ భవనాలు, చుట్టూ గోడలు కూల్చి వేశారు. ప్రధాన నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ స్టేషన్ భవనానికి రూ.327.27 కోట్లు కేటాయించారు.
కొత్త రూపు సంతరించుకోనున్న స్టేషన్లు ఇవే..
చర్లపల్లితోపాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, మలక్‌పేట, మల్కాజిగిరి, బేగంపేట, మేడ్చల్, యాకుత్‌పురా, ఉందానగర్, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, తాండూరు, జహీరాబాద్, యాదాద్రి, బాసర, గద్వాల, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దపల్లి, షాద్‌నగర్, వికారాబాద్, వరంగల్, జోగుళాంబ.
Comments
Please login to add a commentAdd a comment