సృజనాత్మక నైపుణ్యాల ఆవిష్కరణ వేదికగా మెట్రో
‘మి టైమ్ ఆన్ మెట్రో’ ప్రారంభోత్సవంలో ఎన్వీఎస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ కారిడార్లలో మెగా జంక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశలోని పార్ట్ ‘బి ’ప్రతిపాదిత జేబీఎస్– శామీర్‌పేట్ (22 కి.మీ.), ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ.) మార్గాలకు ఉమ్మడిగా ఒక మెగా జంక్షన్ (Mega Junction) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రెండో దశలోని పార్ట్ ‘ఏ’లో ఉన్న 5 కారిడార్ల డీపీఆర్‌లకు కేంద్రం నుంచి త్వరలో ఆమెదం లభించే అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్రం అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. అప్పటివరకు పాతబస్తీలో భూసేకరణ, రోడ్ల విస్తరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
సంక్రాంతి సందర్భంగా ఎల్‌అండ్ టీ మెట్రో, హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) సంస్థలు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించిన ‘మి టైం ఆన్ మెట్రో’ (Me Time On My Metro) మూడు రోజుల వినూత్న ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్‌అండ్ టీ హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మెట్రో సృజనాత్మక వేదిక..
ప్రయాణికులు సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించుకొనేందుకు మెట్రోస్టేషన్లు చక్కటి వేదికలుగా నిలుస్తాయని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎంజీబీఎస్ స్టేషన్‌తోపాటు అన్ని ప్రధాన స్టేషన్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిత్యం లక్షలాది మందికి ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న మెట్రో ఇప్పుడు ప్రయాణికులకు సరికొత్త అనుభూతులను అందజేయనుందని తెలిపారు. కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాల పట్ల అభిరుచి ఉన్న ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో తమ సృజనాత్మక కళా రూపాలను ఆవిష్కరించుకోవచ్చని అన్నారు.
‘మెట్రో అంటే కేవలం కాంక్రీట్, గోడల నిర్మాణాలతో కూడిన ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు. అది హైదరాబాద్ జనజీవితాలతో ముడిపడి ఉన్న ఆత్మ వంటిది’అని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మెట్రో ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన స్టేషన్ల జంక్షన్లను, విశాలమైన స్థలాలను ప్రత్యేక హబ్‌లుగా, అంతర్జాతీయ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
చదవండి: కూల్చి'వెతలు' లేని హైవే!
ఎల్ అండ్‌టీ మెట్రోరైల్ ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్డర్ ఇచ్చిన తరువాత 18 నెలల్లో కొత్త రైళ్లు రానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ‘మి టైం ఆన్ మెట్రో’ప్రచారంలో భాగంగా లఘు చిత్రాలను, నృత్యాలను పలువురు ప్రదర్శించారు. ‘సంక్రాంతి సంబురాలు’గా చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమం రూపొందించిన మెట్రో రైలును ఎన్వీఎస్ రెడ్డి, కేవీబీరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment