కొంత కాలంగా కనుమరుగవుతున్న జాతి
జీవ వైవిధ్యం దెబ్బతినడంతో తగ్గుదల
కాలుష్యం, రసాయనాలు, నగరీకరణే అవరోధాలు
చెరువులు క్షీణించడం, మానవ నివాసాల్లో ఇబ్బంది
గూళ్లకు అవకాశం లేకపోవడమూ కారణమే
పక్షిజాతుల మనుగడకు కేంద్ర బింధువులు కొలనులు, సరస్సులు, చెరువులు. గతంలో హైదరాబాద్ నగరంలో ఈ నీటి స్థావరాలకు కొదువలేకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి విభిన్న జాతుల పక్షులు సైతం వలస వచ్చేవి. కానీ ప్రస్తుత పట్టణీకరణ నేపథ్యంలో ఈ చెరువులు, కుంటలు మాయమవ్వడంతో పక్షి జాతుల మనుగడ పై తవ్ర ప్రభావం పడుతోంది. పిచ్చుకలను హౌస్ స్పారోస్ అంటారు. అంటే ఇవి మనుషుల ఇళ్ల వద్దే చిన్న గూడు నిర్మించుకుని వాటి సంతతిని పెంచుకుంటాయి.
పరోక్షంగా పిచ్చుకలను సాదు జంతువులుగానే పరిగణించవచ్చు. అయితే కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ఈ పిచ్చుకలను ఆదరించే వారు తక్కువయ్యారు. చెట్లపైన, అడవుల్లో కన్నా ఇంటి ఆవాసాల్లో, బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, పార్కుల్లో, బాల్కనీల్లో ఇతర సురక్షిత ప్రాంతాల్లో ఇవి గూడు కట్టుకుంటాయి. ఆ అవకాశం నగరవాసులు ఇవ్వకపోవడంతో ఈ పిచ్చుకులు నగరాన్ని బహిష్కరిస్తున్నాయి. అక్కడక్కడ ఏసీ సందుల్లోనో, పార్కింగ్ ఏరియాలోనో గూళ్లు పెట్టుకున్నా సౌకర్యంగా లేవని నగరవాసులు వాటిని తొలగిస్తుండటం వీటి క్షీణతకు మరో కారణం.
పరిరక్షించాల్సిన జాబితాలో..
పర్యావరణ పరిస్థితులను అంచనా వేయడంలో పక్షి జాతుల మనుగడను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో నగర జీవవైవిధ్యం పూర్తిగా దెబ్బతింటోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పిచ్చుకల సంఖ్య భారీగా తగ్గపోయిందని ఆ రాష్ట్ర పక్షిగా పిచ్చుకను ఎంపిక చేసి వాటి సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. నాసిక్‌లోని మొహమ్ముద్ దిలావర్ అనే పక్షి ప్రేమికుడు పిచ్చుకల సంరక్షణ కోసం చేసిన కార్యక్రమాల ఫలితంగా ప్రతి ఏడాదీ మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఐరోపాలోని పట్టణాలు, నగరాల్లో పిచ్చుకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక సర్వేలో భాగంగా యూకేలో గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం, పట్టణ ప్రాంతాల్లో 60 శాతం పిచ్చుకలు తగ్గాయని వెల్లడించారు. ఈ కారణాలతో ఈ జాతిని పరిరక్షించాల్సిన జాబితాలో చేర్చబడింది. యూరోపియన్ కన్జర్వేషన్ కన్సర్న్ జాతుల జాబితాలో చేర్చారు.
‘బ్రింగ్ బ్యాక్ స్పారోస్’..
నగరంలో యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పిచ్చుకల సంరక్షణ కోసం ఏడేళ్లుగా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ‘బ్రింగ్ బ్యాక్ స్పారోస్’ కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 4 వేల పక్షి గూళ్లను పంపిణీ చేశాం. మా అంచనా ప్రకారం ఓ 30 వేల వరకూ పిచ్చుకలను మళ్లీ నగరంలోని ఇళ్లలోకి రప్పించగలిగాం. ముఖ్యంగా అమీన్‌పూర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పిచ్చుకలను సంరక్షించగలిగాం. ఇందులో భాగంగా నగరంలోని పార్కులతో కూడా కలసి పనిచేయనున్నాం. వీటికి ప్రాణాధారాలైన చెరువులను, కుంటలను నగరవాసులు కలుషితం చేయడం ఇప్పటికైనా మానేయాలి. పూజా సామాగ్రి పేరుతో ప్లాస్టిక్, ఇతర కలుషితాలను చెరువుల్లో వేయడం పరిపాటిగా మారింది.
– ప్రదీప్, సొసైటీ వ్యవస్థాపకులు.
ఆహార కొరత కూడా..
నగర వాతావరణంలో వాటి ఆహార లభ్యత తగ్గిపోయింది. భారత దేశంలో అత్యంత సాధారణ పట్టణ పక్షులలో పిచ్చుక ఒకటి.. కానీ అంతరించిపోతున్నాయి. గ్రామీణ వాతావరణంలోనూ వీటి మనుగడ ప్రశ్నార్థకంగానే మారింది. పంటపొలాల కోసం వినియోగించే క్రిమిసంహారకాలూ ఈ పిచ్చుకలను బలిగొంటున్నాయి. గతంలో ఈ పిచ్చుకల ఉనికిని అంచనా వేయడానికి తెలుగురాష్ట్రాలతో పాటు, ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడులో సర్వే చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని యెల్లాంపేటలో బోన్‌ఫెరోని కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ విధానంలో చేసిన సర్వేలో భాగంగా వివిధ ట్రాన్సెక్ట్‌లలో పిచ్చుకల సాంద్రత హెక్టారుకు 15 నుంచి 335 వరకూ ఉందని నిర్ధారించారు. కానీ ఈ సంఖ్య ఇప్పటికి ఇంకా తగ్గిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment