- వింటర్‌లో రాష్ట్రానికి విహంగాల జోరు
- నగరంలోని బర్డ్ వాచర్స్ హుషారు
- ఈ సీజన్‌లో అరుదైన పక్షుల వీక్షణకు ఛాన్స్
- రాష్ట్రంలో 430కిపైగా పక్షి వెరైటీల గుర్తింపు
- జనవరి నుంచి బర్డ్ అట్లాస్ పేరిట పక్షుల గుర్తింపు
రాష్ట్రానికి, నగరానికి ఏడాది పొడవునా వలస పక్షుల రాకపోకలు ఉంటాయి. సమ్మర్‌లో కొద్దిగా మాత్రమే వస్తాయి. అయితే వర్షాకాలం నుంచి పెరుగుతూ.. వింటర్‌లో బాగా ఎక్కువగా 2, 3 రెట్లు ఎక్కువగా పక్షులు వలస వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి వలస పక్షులకు నగరంలో చాలా స్పాట్స్ ఉన్నాయి. కానీ కాలక్రమంలో లేక్స్ కనుమరుగవుతుండడం వల్ల వీటికి ఆవాసాలు దొరకడం లేదు.
చిరునామాలివే..
నగరం చుట్టు పక్కల పక్షుల వీక్షణకు వీలు కల్పించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు అమీన్‌పూర్‌లేక్, జనవాడ వైపు గండిపేట్‌లేక్, మోకిలా వంటి ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేవి. ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఇప్పటికీ కాలుష్య కాసారాలుగా మారిన లేక్స్‌లో కూడా పక్షలు కనిపిస్తున్నాయి. వాటిని కాలుష్యరహితంగా మారిస్తే మరింత బాగా పెరుగుతాయి. సంజీవయ్య పార్క్ దగ్గర కూడా బోలెడు పక్షులు, డక్స్ ఉంటాయి. నగరంలో ప్రస్తుతం పక్షులు చూడాలంటే కెబిఆర్ పార్క్, బొటానికల్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్‌లలో చూడొచ్చు.
చుట్టుపక్కల చెరువుల్లో..
నగరం చుట్టుపక్కల అయితే.. అనంతగిరి హిల్స్ బెస్ట్. అక్కడకు వెళ్లినప్పుడల్లా ఒక్కోసారి ఒక్కో ఆశ్చర్యకరమైన పక్షి కనబడుతుందని పక్షి ప్రేమికులు అంటున్నారు. అదే కాక ఉస్మాన్‌సాగర్, కొడకంచి లేక్, కృష్ణారెడ్డి పేట్ చెరువు.. మంజీరా వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్, సింగూర్ డ్యామ్ కూడా బర్డ్స్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా చెప్పొచ్చు. ఇటీవల సిటీలోని కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లోని కాలనీ పార్క్స్‌లో కూడా బాగా పెరుగుతున్నాయి.
సీజన్ స్పెషల్స్ ఇవే..
వానాకాలం మన సమీపానికి వచ్చే పక్షుల్లో రెయిన్ క్వాయిల్, పెయింటెడ్ ఫ్రాంకొలిన్, జాకొబిన్ కుకూ (దీనినే మాన్‌సూన్ బర్డ్ అని కూడా పిలుస్తారు. ఇది రుతుపవనాల ప్రారంభ సమయంలో వస్తుంది) వంటివి ఉన్నాయి. ఇవి మంజీరాలేక్, యంకతల.. వంటి సరస్సులు, పచ్చని పచి్చక బయళ్లలో కనిపిస్తాయి. ఇక శీతాకాలంలో వచ్చేవాటిలో వర్డియర్ ఫ్లై క్యాచర్, ఇండియన్ బ్లూ రాబిన్, బార్ హెడెడ్ గూస్ (ఇది సరస్సుల దగ్గర బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం మంజీరాలేక్ దగ్గర దీనిని చూడొచ్చు. విదేశాల నుంచి హిమాలయాల మీదుగా ఈ పక్షి నగరానికి చేరుతుందట)
తొలిసారిగా బర్డ్స్ పై బుక్..
మనకి చాలా చోట్ల పక్షులు కనిపిస్తాయి. కానీ అవేంటో వాటి ప్రత్యేకతలేమిటో తెలీదు. ఈ నేపథ్యంలో కొన్ని కామన్ బర్డ్స్ తీసి ఒక గైడ్‌లాగా ఇస్తే బాగుంటుందనీ, స్టూడెంట్స్‌కి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్స్ వాళ్లకి ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో తొలిసారిగా మన రాష్ట్రంలో పక్షుల వెరైటీలపై ఒక పుస్తకం రూపొందింది. రాష్ట్రంలో 430పైగా వెరైటీ పక్షులు ఉంటాయి. ఇందులో 252 రకాల పక్షుల ఫొటోలు, వాటి పేర్లు, విశేషాలు ఉంటాయి. రెగ్యులర్‌గా అనంతగిరికి ట్రెక్కింగ్‌కి వెళ్తుంటారు. అలాంటివారికి ఇవి ఇస్తే ఉపయుక్తం. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలల విద్యార్థులకు లక్ష కాపీల వరకూ ఉచితంగా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు.
అమెరికా నేర్పిన అలవాటు
గతంలో ఒకసారి అమెరికాలో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నేనున్న ప్రాంతానికి దగ్గరలో పెద్ద అడవి ఉండేది. అక్కడ రంగు రంగుల పక్షుల్ని కళ్లార్పకుండా చూడడం అలవాటైంది. ఇక్కడకు వచ్చాక సిటీలో పక్షులును అన్వేషిస్తూ.. సంజీవయ్య పార్క్‌కు తరచూ వెళ్లేవాడిని. ప్రస్తుతం విభిన్న ప్రాంతాలకు వెళ్లి పక్షుల్ని చూడడం ఒక నిత్యకృత్యం. ఈ అభిరుచితోనే హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రారంభించాం. తాజాగా బర్డ్స్ మీద బుక్ లాంచ్ చేశాం. అంతేకాకుండా జనవరి నుంచి బర్డ్ అట్లాస్ పేరుతో వైవిధ్యభరిత కార్యక్రమం చేపడుతున్నాం. నగరం చుట్టుపక్కల విభిన్న ప్రాంతాల నుంచి దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏ పక్షి ఎప్పుడు ఎలా కనిపిస్తుంది? అనేది రికార్డ్ చేసి ఒక మ్యాప్ తయారు చేయాలని ఆలోచన. అయితే దీన్ని పూర్తి చేయడానికి కనీసం ఏడాది పడుతుంది.
– హరికృష్ణ, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్
Comments
Please login to add a commentAdd a comment