![Birds watching in Hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/birds.jpg.webp?itok=riPqGr5i)
కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్‌లో బర్డ్స్ వాక్
రెండు రోజులపాటు ఉల్లాసంగా కార్యక్రమం
55 మంది వీక్షకులు, 62 రకాల పక్షి జాతుల గుర్తింపు
కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి.. అన్నట్లు కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన బర్డ్స్ వాక్ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఇందులో 55 మంది వీక్షకులు భాగస్వామ్యం కాగా.. 62 రకాల పక్షి జాతులను గుర్తించారు. ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్, మేనేజర్ సుమల్ పర్యవేక్షణలో వివిధ రకాల థీమ్ పార్కులు, వృక్షపరిచయ క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ సఫారీ గురించి వీక్షకులకు వివరించారు.. – గచ్చిబౌలి
పికిలిపిట్ట, షిక్రా, లొట్టకన్నుజిట్ట, నల్ల ఎట్రింత, అడవిరామదాసు, మగ నెమలి, ఆడ నెమలి, లకుముకి పిట్ట, టైగర్ స్వాలోటైల్ సీతాకోకచిలుక వంటి పక్షులను సందర్శకులు వీక్షించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ‘బర్డ్స్‌వాక్’ లో 62 రకాల పక్షి జాతులను సందర్శకులు గుర్తించారు. కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్స్ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్, మేనేజర్ సుమల్ పర్యవేక్షణలో 55 మంది వీక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పక్షిజాతుల పేర్లు, వాటి శాస్త్రీయ నామాలు, సహజమైన పేర్లు, వాటి అలవాట్లు, ప్రవర్తన గురించి పక్షుల నిపుణులు అపరంజని, ప్రవర్తన, మనోజ్ థామ్సన్, అబ్దుల్ వివరించారు. పాకెట్ గైడ్ ద్వారా పక్షులను ఎలా గుర్తించాలో, అవి ఎలాంటి శబ్దాలు చేస్తాయో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పక్షులను తమ కెమెరాల్లో బంధించారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/birds.jpg)
జీవావరణ పరిరక్షణకు..
ప్రకృతి, జీవావరణ వ్యవస్థలో పక్షులు ప్రధాన భూమిక పోషిస్తాయని పక్షుల నిపుణులు సందర్శకులకు వివరించారు. విత్తనాల వ్యాప్తి, పర్యావరణ సమతుల్యతలో పక్షుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అందుకే ఆయా జాతుల మనుగడ మానవ మనుగడకు, ప్రకృతి మనుగడకు కీలకమన్నారు.
ఎకో టూరిజమ్‌లో భాగంగా..
బొటానికల్ గార్డెల్స్‌లో బర్డ్స్‌వాక్ కార్యక్రమంలో భాగంగా అడవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పక్షుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 23న వికారాబాద్‌లో, మార్చి 2న గజ్వేల్ ఫారెస్ట్‌లో బర్డ్స్ వాక్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం.
– రంజిత్‌నాయక్, ఎకో టూరిజమ్ ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment