వేల మైళ్ల నుంచి హైదరాబాద్‌కు విచ్చేస్తున్న విశిష్ట అతిథులు
తూర్పు ఐరోపా నుంచి నగరానికి వస్తున్న బుల్లి పిట్ట ‘ఫ్లైక్యాచర్’
ఇటీవల చెరువుల పునరుద్ధరణ, జీవవైవిధ్యం మెరుగవడంతో సానుకూల పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఆయా దేశాల్లో జీవించే పక్షులు అక్కడి ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వివిధ దేశాలకు వలస వెళుతుంటాయి. కేవలం 12 సెం.మీ సైజు ఉండే ‘రెడ్–బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్’పేరుతో పిలిచే ఈ పక్షిది అద్భుత ప్రయాణం. ఈ పక్షులు వివిధ ఖండాలు, సముద్రాల మీదుగా ఎగురుతూ, వేలాది మైళ్లు ప్రయాణం చేసి హైదరాబాద్ మహానగరానికి వలస వస్తున్నాయి. ప్రస్తుతం తూర్పు ఐరోపా దేశాల్లో తీవ్రస్థాయిలో చలి పెరిగి, మంచుమయమై పోతున్న సమయంలో సమశీతోష్ణస్థితి ఉన్న దక్షిణాసియాలోని మనదేశానికి.. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు ఈ పక్షులు చేరుకుంటున్నాయి.
ప్రతి ఏడాది నవంబర్ నుంచి మార్చి దాకా విదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పక్షులు నగరానికి వలస వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు సత్ఫలితాలు ఇస్తోందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా...గతంలో వివిధ రకాల పక్షులకు, ప్రధానంగా వలస పక్షులకు ఆవాసంగా ఉన్న అమీన్‌పూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ పక్షి దర్శనమిచ్చి పక్షి ప్రేమికులను ఆనందపరిచింది. సాధారణంగా పక్షులు ఎక్కడ గూడును ఏర్పాటుచేసుకుని పిల్లలి్నకంటాయో అక్కడికే మళ్లీ వలస వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
తాము గతంలో ఉన్న ప్రదేశంలో గూడు చెదిరినా, చెట్లు, నీళ్లు, పరిసరాల్లో మార్పులు సంభవించినా మళ్లీ అవి అక్కడకు రావని వెల్లడించారు. సాధారణంగా ఇది ‘బ్రీడింగ్ టైమ్’కాబట్టి ఇక్కడకు వచ్చి గూడు ఏర్పాటు చేసుకుని పిల్లల్ని పెడుతుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధితో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అధ్యక్షుడు ఆడేపు హరికృష్ణ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వలస
పక్షుల రాకపై ఆయన మాటల్లోనే...
‘ప్రస్తుతం నగరంలో ‘రెడ్–బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్’పక్షి కనువిందు చేస్తోంది. మనదేశానికి వలస రావడానికి కొన్నిరోజుల ముందు నుంచే బాగా ఆహారం తీసుకుని, శరీరంలో పెద్దమొత్తంలో కొవ్వు నిల్వ అయ్యేలా చూసుకుంటుంది. సముద్రాల మీదుగా ప్రయాణం సాగిస్తున్నపుడు ఈ కొవ్వునే ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. మరే దేశంలో లేని విధంగా మనదేశంలో 1,300 రకాల పక్షిజాతులున్నాయి. వీటిలో అత్యధికశాతం అంటే 70 శాతం దాకా వలస పక్షులు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంటాయి. – ఆడేపు హరికృష్ణ ,అధ్యక్షుడు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్
Comments
Please login to add a commentAdd a comment