
‘న్యాయవాది కావడం అనేది కేవలం వృత్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం... సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కూడా’ అనే ప్రసిద్ధ మాటను న్యాయవాదుల గురించి చెబుతుంటారు.నిజామాబాద్‌కు చెందిన కాటిపల్లి సరళ మహేందర్‌రెడ్డి న్యాయవాదిగా పేదలకు అండగా ఉండటమే కాదు...‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే ఎరుకతో తన పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తోంది. పిల్లలు వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తోంది.
డిగ్రీ చదువుతున్నప్పుడే వివాహం అయినప్పటికీ భర్త, హైకోర్ట్ న్యాయవాది మహేందర్‌రెడ్డి(Sarala Mahender Reddy) ప్రోత్సాహంతో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన సరళ నిజామాబాద్ జిల్లా కోర్టులో ఎన్ రోల్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసింది. ఉమ్మడి ఏపీ హైకోర్టులో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు చూసింది.
రోడ్డు ప్రమాదంలో మరణించిన తన బావగారు (భర్త అన్న) కాటిపల్లి రవీందర్‌రెడ్డి పేరుమీద ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 300 మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యనందించారు. ఈ ఏడాది నుంచి ‘బాలసదన్ ’లో ఉంటున్న 30 మంది అనాథ పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. ‘బాలసదన్ ’ చిన్నారుల కోసం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భవిష్య జ్యోతి’ ట్రస్ట్‌కు చైర్‌పర్సన్ గా సరళ మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.
ఆటల్లో మెరిసేలా...
గ్రామీణ విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాలు పాఠశాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఖోఖో ఆటలను స్పాన్సర్ చేస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు హాకీలో జాతీయ స్థాయిలో అడారు. రెండుసార్లు రాష్ట్రస్థాయి జూడో మీట్ నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు జూడోలో రాష్ట్రస్థాయిలో అండర్–17 విభాగంలో 3 కాంస్య పతకాలు సాధించారు. జూనియర్స్, సబ్ జూనియర్స్ సైతం జూడో రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నారు. – తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
సామాజిక సేవే... విలువైన సంపద
న్యాయవాదిగా పేదలకు అండగా నిలవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాల్లో భాగం కావాలనుకుంటున్నాను. – సరళ మహేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment