
మన దేశంలో జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఏటా మార్చి 4న నిర్వహిస్తారు. పర్యావరణం, కార్యాలయ భద్రత, ఆరోగ్య, నియమాలు, ట్రాఫిక్ నియమాలు, మానవ ఆరోగ్య విషయాలతో సహా అన్ని రకాల భద్రతా నిబంధనల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది భారతదేశం 54వ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి ఏడాది ఓ థీమ్‌తో దీన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోంది. అలానే ఈ ఏడాది విక్షిత్ భారత్ భద్రత, సంక్షేమం కీలకం అనే థీమ్‌తో ప్రజలను చైతన్యపరిచేలా అవగాహన కల్పించనుంది. ఈ సందర్భంగా మన దేశంలోని భద్రత ఏ విధంగా ఉందో చూద్దాం. నిజంగా మహిళలు, పిల్లలు భద్రంగా ఉంటున్నారా..? . మనమంత సేఫ్టీకి చేరువలో ఉన్నామా..? అంటే..
మన దేశంలో భద్రత అనే పదమే భారంగా కనిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్న ఘోరాలు, నేరాలు చూస్తుంటే సేఫ్టీకి చోటుందా అనే సందేహం కలుగకమానదు. మన భారతీయ సంస్కృతి స్త్రీని యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని కీర్తిస్తూ సముచిత స్థానాన్ని ఇచ్చింది.
మన వేదాలు, పురాణాలు కూడా స్త్రీకి పెద్దపీట వేసి మరీ గౌరవించాయి. అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే హృదయ ద్రవించిపోతోంది. గొప్ప నాగరికులం, ఏఐ టెక్నాలజీతో పరుగులు పెట్టే కాలంలో ఉన్నామంటూ భుజాలు ఎగరేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ మన సమాజంలో చిన్నారులు, మహిళలు ఎంతటి అభ్రతా పరిస్థితుత్లో జీవిస్తున్నారో చూస్తే ఇదేనా అభివృద్ధి అనే భావం కలుగుతుంది.
ప్రతి ఏడాది జాతీయ భద్రతా దినోత్సవం పేరుతో వారోత్సవాలు నిర్వహించుకుంటూ చేతులు దులిపేస్తుకుంటున్నాం. అసలు మన చుట్టుపక్కల ఉన్న బాలికలు, అభంశుభం తెలియని పసి పిల్లలు హింసకు, లైగింక వేధిపులకు గురవ్వుత్ను ఘటనలు మీడియాలోనూ, పేపర్లో వస్తున్నా..ఆ..! ఇది కామన్ అన్నట్లు తేలిగ్గా తీసుకుంటున్నాం. మన పిల్లలు సేఫ్‌గా ఉన్నారు కదా అన్న ధీమా కొందరిది. నిజానికి ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023/24లో 177 దేశాల సరసన భారత్ 128కి పడిపోయింది. అంటే మన దేశంలో మహిళలకు భద్రత అనే మాటకు ఆస్కారం లేదనే కదా అర్థం.
మహిళలు, చిన్నారులపై జరిగిన ఘటనలు చూస్తే..
ప్రేమోన్మాదుల చేతిలో బలైన అమ్మాయిలు..
ముఖ్యంగా అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న ప్రేమోన్మాదులు ఎంతకైనా తెగిస్తున్నారు. పెళ్లికి ఒప్పుకోవడం లేదన్న కోపంతో నిరుడు హైదరాబాద్లోని గోపన్నపల్లిలో యువతి ప్రాణం తీశాడొక దుర్మార్గుడు.
ఏపీలోని బద్వేలులోనూ గతేడాది ఒక ఇంటర్ విద్యార్థిని అలాగే బలైపోయింది. ప్రేమను నిరాకరించిందని బాపట్ల జిల్లాలో ఒక ప్రబుద్ధుడు ఇటీవల బాలికతో పాటు ఆమె కుటుంబంపై కత్తితో దాడిచేశాడు. అదే కారణంతో తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒక సైకో మరీ పైశాచికంగా ప్రవర్తించాడు. యువతి నోట్లో యాసిడ్ పోసి, కత్తితో పొడిచి ఉసురు తీసేందుకు యత్నించాడు. ఇలా ప్రేమోన్మాదుల చేతుల్లో రోజూ ఎందరో అమాయక చిట్టి తల్లులు బలైపోతున్నారు.
కరడుగట్టిన పితృస్వామ్య భావజాలమే దేశీయంగా మహిళా సాధికారతకు ప్రధాన ప్రతిబంధకమవుతోందనేది కొందరి నిపుణుల వాదన. సర్కారీ లెక్కల ప్రకారం 2014లో ఇండియాలో మహిళలపై నేరాలకు సంబంధించి 3.37 లక్షల కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్లలో అవి 31శాతం మేర ఎగబాకాయి.
నిపుణులు చెబుతున్న కారణాలు..
ఇంటర్‌నెట్, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అశ్లీల చిత్రాలు, వీడియోలకు తోడు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, మాదకద్రవ్యాల వినియోగంతో మనుషుల్లో పశుప్రవృత్తి కోరలు చాస్తోందంటున్నారు నిపుణులు. ఆడ పిల్లల్ని వేధించడాన్ని, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడాన్ని హీరోయిజంగా చూపిస్తున్న సినిమాలు, వెబ్‌సీరిస్ యువతను దారితప్పిస్తున్నాయని చెబుతున్నారు.
స్త్రీలను ఆటబొమ్మలుగా చిత్రీకరించే పెడపోకడలు పెరిగిపోతుండటంతో పనిప్రదేశాలూ బహిరంగ స్థలాలు.. ఇలా అన్నిచోట్లా మహిళల భద్రత ప్రశ్నార్థకమవుతోందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ అమ్మాయిలపై రోత వ్యాఖ్యల వెల్లువెత్తుతూనే ఉంటున్నాయని చెబుతున్నారు. అలాగే నవతరం నైతిక విద్యకు దూరమవుతున్న కొద్దీ దేశ భవిష్యత్తుపై చీకట్లు ముసురుతాయని హెచ్చరిస్తున్నారు. పాఠశాల దశ నుంచి పసి మనసులు కలుషిత కాకుండా కేర్ తీసుకోవాలని చెబుతున్నారు.
తెలిసో తెలియకో లేదా పురుషాధిక్య ఆలోచనలతోనో ఇళ్లలో అబ్బాయిలను అతిగా ముద్దు చేసే ధోరణులు లింగ వివక్షను పెంచి పోషిస్తున్నాయి. మహిళల పురోగతికి అవే గొడ్డలిపెట్టు అవుతున్నాయి. తల్లిదండ్రుల మద్దతుతో ఎందరో అమ్మాయిలు నేడు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలనూ వెన్నుతట్టి ముందుకు నడిపించే అలాంటి వాతావరణం ప్రతి కుటుంబంలోనూ నెలకొనాలని అంటున్నారు నిపుణులు.
భద్రతకు భరోసా ఇచ్చేలా జీవిద్దాం..
ప్రతి తల్లి కూడా తమ కొడుకు అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే కప్పి పుచ్చే యత్నం చేయకుండా దండించడమో లేదా శిక్షించడమో చేసి మార్పు తెవాలే గాని మగాడని వెనకేసుకొచ్చే యత్నం చేయకూడదు. అలాగే పోలీసులు మహిళలపై జరిగే అమానుష ఘటనలపై సత్వరమే స్పందించి వారికి తగిన న్యాయం జరిగేలా మద్దతిస్తే..బాలికలు, మహిళల భద్రతకు ఢోకా ఉండదని చెబుతున్నారు సామాజిక నిపుణులు.
సేఫ్టీ దినోత్సవం పేరుతో ఐక్యతతో ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొందాం అంటూ మాటలు కాదు..అలాంటి ఘోరాలు జరిగినప్పుడూ గొంతెత్తి నినదిద్దాం. ఆ తప్పు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు పూనుకునేలా చేద్దాం. మహిళల, బాలికలకు భద్రత అనే మాటకు అసలైన అర్థం ఇచ్చేలా భరోసా కల్పిద్దాం.
(చదవండి: వయసుతో ముసిరే సమస్యలు..)
Comments
Please login to add a commentAdd a comment