
సినిమాల్లో ‘శుభం’ కార్డు పడే సమయంలో ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అంటూ ఇన్‌స్పెక్టర్ పరుగెత్తుకు వచ్చి నేరస్థుడికి అలవోకగా సంకెళ్లు వేస్తాడు. అయితే నిజజీవితంలో అలా కాదు. నేరస్థుడిని పట్టుకోవడానికి లక్ష సవాళ్లు ఎదురవుతాయి. అలా అని నేరస్థుడిని పట్టుకోవడంలో ఆలస్యం జరగకూడదు. ‘నేరస్థుడిని త్వరగా పట్టుకోవాలి’ అనే తొందరపాటు కూడా ఉండకూడదు. ‘99 మంది దోషులు చట్టం నుంచి తప్పించుకున్నా... ఒక్క అమాయకుడు శిక్షకు గురి కాకూడదు’ అనే మాట ఉండనే ఉంది! క్రైమ్ సీన్ సవాలు విసురుతుంది. ఎవరైతే ఆ సవాలును స్వీకరించి, తమ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలకు పదును పెట్టి, ఏ పుట్టలో ఏ పాము ఉందో కనిపెట్టి నిందితుడిని కటకటాల వెనక్కి తీసుకువెళతారో... వారే క్రైమ్‌సీన్ ఆఫీసర్‌లు. క్లూస్‌టీమ్‌లో భాగంగా పనిచేసే క్రైమ్‌సీన్ ఆఫీసర్లు (సీఎస్‌ఓ) నేరం జరిగిన వెంటనే ఘటనాస్థలికి వెళ్లి అణువణువూ అధ్యయనం చేసి, దర్యాప్తు అధికారులుగా ఉండే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి అవసరమైన ఆధారాలు అందిస్తారు. హైదరాబాద్ క్లూస్‌టీమ్‌లో మొత్తం 43 మంది సీఎస్‌ఓలు ఉండగా వీరిలో ఆరుగురే మహిళలు. పోలీసులు మనకు కనిపించే మూడు సింహాలైతే... ఈ ‘సీఎస్‌ఓ’లు కంటికి కనిపించని నాలుగో సింహం. ‘క్లూ’లు అందించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుడిబోయిన ఇందిర, దానం ఎలిజబెత్‌లు ఎన్నో ముఖ్యమైన కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు...
హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ (Neredmet) ప్రాంతానికి చెందిన గుడిబోయిన ఇందిర 2015 నుంచి హైదరాబాద్ (Hyderabad) క్లూస్ టీమ్‌లో సీఎస్‌ఓగా పని చేస్తోంది. తన పదేళ్ల సర్వీసులో ఎన్నో నేరస్థలాలకు వెళ్లి కీలక ఆధారాలు సేకరించి కేసు చిక్కు ముడి వీడడంలో కీలక పాత్ర పోషించింది. ఆ కేసులలో కొన్ని...
నిందితుడు... ఇదిగో... ఈ ఇంట్లోనే!
హైదరాబాద్‌లోని మెట్టుగూడ (Mettuguda) నల్లపోచమ్మ ఆలయం దగ్గర నివసించే రేణుక పెద్ద కుమారుడు యశ్వంత్ మౌలాలీలోని రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పని చేసి మానేశాడు. ఫిబ్రవరి ఆరోతేదీన కొంతమంది దుండగులు తమ ఇంట్లోకి చొరబడ్డారని, తల్లితోపాటు తనపై కత్తితో దాడి చేశారని యశ్వంత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఈ హత్యాయత్నం కేసు సంచలనం సృష్టించింది.
విధి నిర్వహణలో భాగంగా సీఎస్‌ఓ ఇందిర యశ్వంత్ ఇంటికి వెళ్లింది. ఘటనాస్థలిలో ఉన్న పరిస్థితులతోపాటు ఆ ఇంటి పరిసరాలను అధ్యయనం చేసింది. రేణుక ఒంటిపై ఉన్న కత్తిపోట్లు ఎదుటివాళ్లే పొడిచినట్లు ఉన్నప్పటికీ యశ్వంత్ గాయాలపై అనుమానం వచ్చింది. దీనికితోడు వారి ఇంటికి బయటనుంచి గడియపెట్టి ఉందనే విషయం తెలుసుకున్న ఇందిర మరింత లోతుగా ఆరా తీసింది. ఈ నేరంలో మూడో వారి ప్రమేయం లేదంటూ పోలీసులకు నివేదించింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా యశ్వంతే నిందితుడని తేలింది. కుటుంబ కలహాలు, పెళ్లి కావట్లేదనే బాధతో డిప్రెషన్ కు గురైన యశ్వంత్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లికి కత్తిపోట్లు పడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన యశ్వంత్ తనపై కేసు కాకుండా ఉండటానికి ‘ఎవరో మాపై హత్యాయత్నం చేశారు’ అంటూ నాటకం ఆడాడు. కుమారుడిని జైలుకు పంపడం ఇష్టంలేక పోలీసులను తప్పుదోవ పట్టించింది రేణుక. చివరకు ఇందిర చొరవతో కేసు కొలిక్కివచ్చి యశ్వంత్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది.
స్క్రూ డ్రైవర్ ముక్కే... పక్కాగా పట్టించింది!
నాలుగేళ్ల క్రితం బేగంపేటలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. నేరస్థలిని సందర్శించిన ఇందిర అక్కడ విరిగిన స్క్రూడ్రైవర్ ముక్కను గుర్తించింది. బాధితులు పక్కింటివారిపై అనుమానం వ్యక్తం చేయడంతో వారింట్లో సోదాలు చేశారు. అక్కడ మిగిలిన స్క్రూ డ్రైవర్ దొరకడంతో వారే నిందితులుగా తేలి కేసు కొలిక్కివచ్చింది.
సూసైడ్ నోట్ కనిపెట్టి... అతడి ఆట కట్టించింది
కుటుంబ కలహాల నేపథ్యంలో గత వారం వారాసిగూడ ప్రాంతంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె భర్త కూడా ఇంట్లోనే ఉండటంతో ఇది హత్యగా అనుమానించారు. ఘటనాస్థలికి వెళ్లిన ఇందిర మృతురాలి శరీరంతోపాటు ఆమె వస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సూసైడ్ నోట్ వెలికి తీసింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపుల కేసు భర్తపై నమోదైంది.
తట్టిఅన్నారంలోని జీవీఆర్ కాలనీకి చెందిన దానం ఎలిజబెత్ 2015 నుంచి హైదరాబాద్ క్లూస్ టీమ్‌లో సీఎస్‌ఓగా పని చేస్తోంది. ఇప్పటి వరకు అనేక కేసుల దర్యాప్తులో కీలకంగా మారిన ఆధారాలను సేకరించి అందించింది. గత ఏడాది చివరలో హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ‘గుండెపోటు మరణం’ ఎలిజెబెత్ అందించిన ఆధారాలతోనే హత్యగా తేలింది.
డస్ట్‌బిన్‌లో దాగిన రహస్యం
కురుమబస్తీకి చెందిన రేణుక ఇంటి అరుగుపై ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుండెపోటు వచ్చి ఉంటుందని, తమ అరుగుపై పడుకుని ప్రాణాలు విడిచి ఉంటాడని రేణుక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న హబీబ్‌నగర్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మృతుడు ఏ బ్యాట్రీలేన్‌కు చెందిన ఖాలేద్‌గా గుర్తించారు. రేణుక ఇంట్లోనూ సోదాలు చేయాలని పోలీసులు క్లూస్ టీమ్‌ను కోరారు.
ఎలిజబెత్ అక్కడకు వెళ్లి రేణుక ఇంటిలో అణువణువూ పరిశీలించింది. రేణుక మంచం పైన కనిపించిన కొన్ని వెంట్రుకలు ఖాలేద్ వెంట్రుకలతో సరిపోలాయి. రేణుక వంటగదిలో ఉన్న డస్ట్‌బిన్‌లో ఓ కొత్త కాటన్ టవల్ పడి ఉండటం ఎలిజబెత్ దృష్టిలో పడింది. కొత్త టవల్ డస్ట్‌బిన్‌లో ఉండటం, అదీ కిచెన్‌లోది కావడంతో అనుమానించింది. ఆ టవల్ తడిగా ఉండటంతోపాటు కొన్ని రకాలైన మరకలు ఉన్నట్లు కనిపెట్టింది.
వీటి ఆధారంగా రేణుక హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించింది ఎలిజబెత్. దీంతో అధికారులు రేణుకను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనుకోకుండా హత్య చేశానని, తన సోదరుడు వెంకటేష్ సాయంతో మృతదేహాన్ని ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చి అరుగుపై పడుకోబెట్టానని రేణుక ఒప్పుకుంది.
చదవండి: 'ఇ-నాలుక' రుచిని కోల్పోయిన వాళ్లకు వరం..!
రేణుక–ఖాలేద్‌ల మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆరోజు రేణుక ఇంటికి వెళ్లిన ఖాలేద్ తన కోరిక తీర్చమని కోరగా ఆమె అంగీకరించలేదు. ఆ సమయంలో జరిగిన గొడవలో బెడ్‌పై పడిన ఖాలేద్ నోరు, ముక్కు టవల్‌తో మూసేసి హత్య చేసింది. రేణుకతోపాటు ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.