
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ‘మీ జుట్టు బాగుంది. అందంగా, దృఢంగా ఉంది. నేనేమీ జోక్ చేయడం లేదు. ఇది నిజం’ అని సునీతా విలియమ్స్ (Sunita Williams) జుట్టు గురించి ప్రశంసలతో ముంచెత్తాడు. జుట్టు అందం గురించి ప్రశంసలు వినడం సాధారణ విషయమే అయినా... అంతరిక్షంలో జుట్టును అందంగా, శుభ్రంగా కాపాడుకోవడం ఆషామాషీ విషయం కాదు! భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల తల స్నానం (Head Bath) చేయడం అనేది మనకసలు సమస్య కాదు. తలకు కాస్తంత షాంపు రుద్దుకొని షవర్ కింద నిలబడితే సరిపోతుంది.
కాని అంతరిక్షంలో అలా కాదు. జుట్టు శుభ్రం చేసుకోవడం వ్యోమగాములకు కష్టమైన పని, దీనికి కారణం స్పేస్‌స్టేషన్‌లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం.నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ కరెన్ నైబర్గ్ అంతరిక్షంలో జుట్టు ఎలా శుభ్రం చేసుకుంటారో ఒక వీడియోలో చూపించింది. ఈ జీరో గ్రావిటీ హెయిర్ వాషింగ్ ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంది. ‘హెయిర్ వాష్ (Hair Wash) చేసుకోవడానికి నేను వీటిని ఉపయోగిస్తాను’ అంటూ గోరు వెచ్చని నీటి పాకెట్, షాంపూ బాటిల్, దువ్వెన, అద్దం, వైట్ టవల్ చూపించింది.
మొదట నీళ్లను తలపై స్ప్రే చేసుకుంది. దువ్వెనతో తల వెంట్రుకలను పైకి దువ్వడం మొదలుపెట్టింది. వెంట్రుకలు కుదురుగా ఉండకుండా వివిధ దిశలలో ఎగురుతూనే ఉన్నాయి. ఆ తరువాత షాంపూ రాసుకుంది. మళ్లీ తల వెంట్రుకలను పైకి దువ్వింది. తరువాత టవల్‌తో తల క్లీన్ చేసుకుంది. మళ్లీ తలపై వాటర్ స్ప్రే చేసి దువ్వెనతో పైకి దువ్వింది, టవల్‌తో తుడుచుకుంది. ‘శుభ్రం చేసుకునేటప్పుడు జుట్టును సరిగ్గా పట్టుకోవడం కష్టమవుతుంది’ అంటుంది నైబర్గ్.
నైబర్గ్ తన జుట్టును స్థిరమైన స్థితిలో ఉంచడానికి పడుతున్న కష్టం మనకు వీడియోలో కనిపిస్తుంది. దువ్వుతున్నప్పుడు ఆమె జుట్టు వివిధ దిశలలో ఎగురుతుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్) లోపల ఎయిర్ ఫ్లో తలపై తేమను ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లో డ్రైయర్‌ల అవసరం ఉండదు. చాలాసార్లు వ్యోమగాములు హెల్మెట్ (Helmet) లేదా హెడ్‌గేర్‌లను ధరిస్తారు. ఇది నెత్తిమీద గాలి ప్రసరణ (ఎయిర్ సర్క్యులేషన్)ను బ్లాక్ చేస్తుంది. జుట్టును ఫ్రీగా వదిలేయడం వల్ల చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది.
చదవండి: సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
నిరంతరం బ్రష్ చేయడం వల్ల కూడా జుట్టును ముడి వేయాల్సిన అవసరం ఉండదు. భూమిమీద తల వెంట్రుకలు బుద్ధిగా మన మాట వింటాయి. అంతరిక్షంలో మాత్రం ‘నా ఇష్టం’ అన్నట్లుగా ఉంటాయి. అయితే వాటి ఇష్టం వ్యోమగాములకు కష్టం కాదు. చాలామంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును ఫ్రీగా వదిలేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. భూమిపై మాదిరిగా తల వెంట్రుకలు (Hair) ముఖంపై పడవు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యమూ ఉండదు.