
భావోద్వేగం నడుమ సునీత వీడ్కోలు
నలుగురు వ్యోమగాములను ఆప్యాయంగా సాగనంపిన సహచరులు
ఫొటోలు, సెల్పిలతో సందడి
సునీత తదితరులు వ్యోమనౌకలోకి చేరుకున్నాక దాని ద్వారం మూసివేత
రెండు గంటలపాటు పూర్తిస్థాయి పరీక్షల అనంతరం అంతా సరిగ్గానే ఉందని నిర్ధారణ
ఆ తర్వాత భూమికేసి తిరుగు పయనమైన ‘స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్’
సునీత తిరుగు ప్రయాణం నేపథ్యంలో స్పందించిన ప్రధాని మోదీ
మీ విజయాలపట్ల భారతీయులు గరి్వస్తున్నారని ‘ఎక్స్’లో పోస్ట్
త్వరలో భారత్ రావాలంటూ సునీతకు లేఖ
సునీత క్షేమంగా భూమికి తిరిగి రావాలంటూ గుజరాత్‌లోని ఆమె పూరీ్వకుల గ్రామంలో ప్రజల ప్రార్థనలు
కేప్ కెనవెరాల్: తొమ్మిది నెలలకు పైచిలుకు అంతరిక్షవాసానికి తెర పడింది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో పాటు నాసాకు చెందిన మరో వ్యోమగామి బచ్ విల్మోర్ మంగళవారం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి భూమికి బయల్దేరారు. గత సెప్టెంబర్లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు నిక్ హ్యూస్, అలెగ్జాండర్ గోర్బనోవ్ కూడా వారితో పాటు తిరిగొస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.30 తర్వాత వ్యోమనౌక ఐఎస్‌ఎస్ నుంచి విడివడింది. కాసేపటికి భూమివైపు 17 గంటల ప్రయాణం ప్రారంభించింది.
వాతావరణం అనుకూలిస్తే బుధవారం తెల్లవారుజామున 2.41కి అది భూ కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆ క్రమంలో వాతావరణంతో రాపిడి వల్ల పుట్టుకొచ్చే విపరీతమైన వేడికి క్యాప్సూల్ మండిపోకుండా అందులోని హీట్‌షీల్డ్ రక్షణ కవచంగా నిలుస్తుంది. కాసేపటికి వ్యోమనౌకలోని నాలుగు ప్యారాచూట్లు తెరుచుకుని దాని వేగాన్ని బాగా తగ్గిస్తాయి. చివరికి క్యాప్సూల్ గంటకు కేవలం 5 కి.మీ. వేగంతో తెల్లవారుజాము 3.27 గంటలకు అమెరికాలో ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్రంలో దిగుతుంది. ఆ వెంటనే నలుగురు వ్యోమగాములను ఒక్కొక్కరుగా అందులోంచి బయటికి తీసుకొస్తారు. అనంతరం తదుపరి పరీక్షల నిమిత్తం నేరుగా నాసా కేంద్రానికి తీసుకెళ్తారు.
సునీత బృందం తిరుగు ప్రయాణం సందర్భంగా ఐఎస్‌ఎస్‌లో భావోద్వేగపూరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ఎదురయ్యే విపరీతమైన పీడనం, ఒత్తిళ్లను తట్టుకునేందుకు అనువైన స్పేస్ సూట్, హెల్మట్, బూట్లు తదితరాలు ధరించి వారంతా చివరిసారిగా ఐఎస్‌ఎస్‌లో కలియదిరిగారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో ఆదివారం ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న వ్యోమగాములతో ఫొటోలు, సెల్పిలు దిగుతూ సందడి చేశారు. వారిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
అనంతరం సునీత బృందానికి వారు వీడ్కోలు పలికారు. ‘‘మిమ్మల్ని ఎంతగానో మిస్సవుతాం. మీ ప్రయాణం అద్భుతంగా సాగాలి’’ అని నాసా ఆస్ట్రోనాట్ అన్నే మెక్‌క్లెయిన్ ఆకాంక్షించారు. సునీత తదితరులు తమ వస్తువులతో వ్యోమనౌకలోకి చేరుకోగానే దాని ద్వారాన్ని మూసేశారు. రెండు గంటలపాటు పూర్తిస్థాయి పరీక్షలు చేసి అంతా సరిగానే ఉందని నిర్ధారించారు. అనంతరం డ్రాగన్ భూమికేసి బయల్దేరింది. 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ తొలి మానవసహిత ప్రయోగంలో భాగంగా సునీత, విల్మోర్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వీలుపడలేదు.
మా హృదయాల్లో ఉన్నారు: మోదీ భారత్ రావాలంటూ సునీతకు లేఖ
సునీతా విలియమ్స్ సాధించిన విజయాల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయులు ఎంతగానో గర్విస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా సునీతను, ఆమె తండ్రి దివంగత దీపక్ పాండ్యాను కలిశానని గుర్తు చేసుకున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌లతో భేటీ అయినప్పుడు కూడా ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు.
‘‘మీరు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా మా అందరి హృదయాలకు ఎప్పుడూ అత్యంత సన్నిహితంగానే ఉంటారు. అతి త్వరలో మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఆత్రుతగా ఉన్నాం. తిరిగి రాగానే భారత్‌కు రండి. అది్వతీయ విజయాలు సాధించిన మీవంటి ఆత్మియ పుత్రికకు ఆతిథ్యమిచ్చేందుకు దేశం ఎదురు చూస్తోంది’’ అంటూ సునీతకు లేఖ రాశారు. దీనిపై ఆమె సంతోషం వెలిబుచ్చారు. మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
పూర్వీకుల గ్రామంలో ప్రార్థనలు
మెహసానా: సునీత క్షేమంగా భూమికి తిరిగి రావాలంటూ గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఉన్న ఆమె గ్రామం ఝులాసన్‌లో అంతా ప్రార్థనలు చేశారు. పలువురు గ్రామస్తులు ఒక రోజు ముందునుంచి అఖండ జ్యోతులు వెలిగించారు. బుధవారం సునీత క్షేమంగా దిగేదాకా అవి వెలుగుతూనే ఉంటాయని ఆమెకు సోదరుని వరసయ్యే నవీన్ పాండ్యా వివరించారు. ‘‘ఆ తర్వాత భారీ ఎత్తున వేడుకలకు కూడా సర్వం సిద్ధమైంది.
సునీత ఫొటోలు పట్టుకుని స్కూలు నుంచి ఆలయం దాకా ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. స్థానిక స్కూలు విద్యార్థులైతే 15 రోజులుగా ప్రార్థనలు చేస్తున్నారని ప్రిన్సిపల్ చెప్పారు. సునీత తండ్రి దీపక్ పాండ్యా 1957లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. 2006, 2013ల్లో సునీత ఝులాసన్ వచి్చవెళ్లినట్టు ఆమె బంధువులు గుర్తు చేసుకున్నారు. తనను మరోసారి ఆహా్వనిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment