
వినోదం కోసం నిర్మించే ‘బిగ్‌బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్‌కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.
పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్‌గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.
1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.
భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి.
సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్‌పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.
ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్‌స్టేషన్‌లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్‌లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.
సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్‌గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి
Comments
Please login to add a commentAdd a comment