
కోర్టు చలాన్ డబ్బులు చెల్లిస్తుండగా ఘటన
కంటోన్మెంట్(హైదరాబాద్): కోర్టు చలాన్ డబ్బులు జమ చేసే నిమిత్తం బ్యాంకుకు వచ్చిన ఓ న్యాయవాది బ్యాంకులోనే కుప్పకూలి మరణించిన ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలో ఉంటున్న న్యాయవాది వెంకటరమణ (58) సికింద్రాబాద్ కోర్టులో కేసులు వాదిస్తుంటారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మారేడుపల్లి కొండారెడ్డి స్ట్రీట్‌లో ఉన్న ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకుకు ఆయన వెళ్లారు.
బ్యాంకు చలాన్ రిసీట్ తీసుకుంటూనే ఫ్లోర్‌పై కుప్పకూలడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు వెంకటరమణకు సీపీఆర్ చేసేందుకు యతి్నంచినా ఫలితం లేకపోయింది. వెంకటరమణ మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద కుమార్తె అమెరికాలో ఉండగా, చిన్న కుమార్తె తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఇటీవలే చిన్న కూతురు పెళ్లి నిశ్చయమైనట్లు సమాచారం. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే బ్యాంకుకు చేరుకున్న వెంకటరమణ కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కదిలించింది. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment