
సిటీలోనూ పెరుగుతున్న స్లీప్ డివోర్స్
బంధాల బలోపేతమే లక్ష్యంగా.. సోలో స్లీప్
పరస్పర అంగీకారంతో తాత్కాలిక సర్దుబాటు
మంచి నిద్రకు ఉపయుక్తం అంటున్న వైద్యులు
సిటీ సహా దేశంలో 78శాతం జంటల్లో స్లీప్ డివోర్స్
రెస్‌మెడ్.. అధ్యయనంలో వెల్లడి
అంటూ అటూ ఇటూ కదులుతుండటంతో పక్కనే ఉన్న నాకు కూడా నిద్ర పట్టలేదు’ పొద్దున్నే ఆఫీస్‌లో తాను పడుతున్న కునికిపాట్ల కారణాన్ని కొలీగ్‌తో పంచుకున్నాడు నగరవాసి తరుణ్.. ‘మా భర్త నైట్ అంతా గురకపెడతారు.. దాంతో నాకు నిద్రే ఉండటం లేదు’ అంటూ ఫ్రెండ్ దగ్గర తన గోడు వెళ్లబోసుకుంది ఓ వివాహిత. ఇలాంటి సమస్యలతో నిద్రలేమికి గురవుతున్న కొందరు నగరవాసులు దీనికో పరిష్కారాన్ని ఎంచుకున్నారు. దాని పేరే స్లీప్ డివోర్స్.. పరస్పర అంగీకారంతో దూరదూరంగా నిద్రించడమే నిద్ర విడాకులు..
నాణ్యమైన రాత్రి నిద్ర కోసం దేశంలో 78% జంటలు ‘నిద్ర విడాకులు’ను ఎంచుకుంటున్నాయి. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం పురస్కరించుకుని నిద్రలేమి సమస్యకు పరిష్కారాలను అందించే రెస్‌మెడ్.. నగరంతో పాటు అంతర్జాతీయంగా నిర్వహించిన స్లీప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి జంటలు వేర్వేరు బెడ్‌లు/ బెడ్‌రూమ్‌లలో నిద్రించే ఈ పద్ధతి ఒకప్పుడు నిషిద్ధంగా లేదా వైవాహిక అసమ్మతికి సంకేతంగా పరిగణించేవి. అయితే ఇప్పుడు ఈ ధోరణి మెరుగైన ఆరోగ్యం, సంబంధాల సామరస్యానికి దోహదపడేదిగా గుర్తింపు పొందుతోంది. మంచి నిద్రతోనే.. మెరుగైన జీవనం.. ‘మనం ఏది సాధించాలన్నా తగినంత నిద్ర ఉండాలి.
అది జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది’ అని హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ సతీష్ సి రెడ్డి అంటున్నారు. ‘ఒక వైద్యుడిగా, రోగుల ఆరోగ్యం, ఉత్పాదకత మాత్రమే కాదు సంబంధాలపై కూడా నిద్రలేమి చూపించే దు్రష్పభావాలను నగరంలో పలువురిలో చూస్తున్నాను. చాలా మంది ప్రతిరాత్రి దాదాపు 7 గంటల పాటు నిద్రపోతున్నా, వారు వారానికి నాలుగు రాత్రులు మాత్రమే అధిక–నాణ్యత కలిగిన నిద్రను పొందుతున్నారు. నిద్ర ప్రాముఖ్యతను గుర్తించినా 22% మంది తమ నిద్ర సమస్యలకు సహాయం తీసుకోవాలని అనుకోరు’అని ఆయన చెప్పారు.
నిద్ర విడాకులకు కారణాలు
జంటల్లో ఇద్దరికీ ఉండే భిన్నమైన అలవాట్లు, స్క్రీన్ టైమ్, విభిన్న అవసరాలు, నిద్ర విధానాలు, గురక, గదిలోని ఉష్ణోగ్రత ప్రాధాన్యతలు, అతిగా కదిలే చంచలత్వం, నిద్ర రుగ్మతలు.. శారీరక సౌలభ్యం వంటి వివిధ కారణాలతో జంటలు ఈ విడాకులు తీసుకుంటున్నాయి. అలాగే మానసిక ఆరోగ్య సంబంధిత కారకాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ఒక భాగస్వామి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నట్లయితే లేదా దీర్ఘకాలిక నొప్పితో ఉన్నట్లయితే, విడివిడిగా నిద్రపోవడం వల్ల మరొకరి విశ్రాంతికి అంతరాయం కలగకుండా సహకరించినట్లు అవుతుందనే ఆలోచన.
బలపడుతున్న బంధం..
ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్, డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్, (పల్మోనాలజీ–గోల్డ్ మెడల్) మాట్లాడుతూ జంటలు వ్యక్తిగత స్థలం, వ్యక్తిగత నిద్ర అవసరాలు సంబంధాల మధ్య సమతుల్యం చేయడానికి నిద్ర విడాకులను ఎంచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
నిద్ర నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం వాస్తవానికి, చాలా మంది జంటలకు, తమ సాన్నిహిత్యాన్ని మెరుగుపరచే ఒక మంచి మార్గంగా పయోగపడుతుందనీ ఇద్దరూ తమకు అవసరమైన విశ్రాంతిని పొందేలా సహకరిస్తుంది’ అని ఆయన చెప్పారు. గతంలో భావించినట్లు నిద్ర విడాకులు ఆప్యాయత లేదా ప్రేమ లేకపోవడాన్ని సూచించడానికి బదులు, ఇది ఒకరి వ్యక్తిగత విశ్రాంతికి మరొకరు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడిస్తుందన్నారు.
ప్రయోజనాలూ.. ప్రతికూలతలూ..
మెరుగైన నిద్ర నాణ్యత, తగ్గిన నిద్ర అంతరాయాలు, మెరుగైన సాన్నిహిత్యం, ఎక్కువ వ్యక్తిగత స్థలం, బలమైన రోగనిరోధక వ్యవస్థ, మెరుగైన మానసిక స్థితి, మెరుగైన పనితీరు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడం వంటివి నిద్ర విడాకుల ద్వారా పొందే ప్రయోజనాలు. కాగా.. కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ‘చాలా మంది జంటలు నిద్ర విడాకుల నుంచి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ఇది కొన్నిసార్లు మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. అలాగే దూరంగా నిద్రపోవడాన్ని ఇప్పటికీ సంబంధాల సమస్యకు సంకేతంగా చూస్తారు. కాబట్టి సామాజిక ఆక్షేపణలకు దారితీస్తుంది. ‘ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో నిద్రలేమి కారణంగా రకరకాల సమస్యలకు గురవడం కన్నా.. నిద్ర విడాకులు, ఆరోగ్యకరమైన, ఆచరణాత్మక ఎంపిక’ అని డాక్టర్ బాలసుబ్రమణియన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment