యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్‌ భట్‌.. | Vikram Bhatt opened Up Battling Axial Spondyloarthritis Condition | Sakshi
Sakshi News home page

యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్‌ భట్‌..

Published Mon, Mar 24 2025 6:14 PM | Last Updated on Mon, Mar 24 2025 6:41 PM

Vikram Bhatt opened Up Battling Axial Spondyloarthritis Condition

బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత, నటుడు అయిన విక్రమ్‌ భట్‌ ఎన్నో బ్లాక్‌బస్టర్‌ మూవీలు అందించారు. అంతేగాదు ఆయనకు ఫిల్మ్‌ఫేర్‌, ఉత్తమ దర్శకుడు వంటి అవార్డులు కూడా వరించాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన దిగ్గజ దర్శకుడు విక్రమ్‌ భట్‌ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్నప్పడూ తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. ఆ వ్యాధి కారణంగా తానెంతలా డిప్రెషన్‌కి గురయ్యానో కూడా వివరించారు. తన వ్యాధి నటి సమంత ఎదుర్కొంటున్న వ్యాధి దగ్గర దగ్గరగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అసలు విక్రమ్‌ భట్‌ ఈ వ్యాధిబారిన ఎలా పడ్డారు..? ఏంటా వ్యాధి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

బాలీవుడ్‌లో మంచి పేరుగాంచిన రాజ్‌ మూవీ సీరిస్‌ దర్శకుడు విక్రమ్‌ భట్‌ తాను టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత రూత్‌ ప్రభు ఎదుర్కొంటున్న మైయోసిటిస్‌ లాంటి వ్యాధితోనే బాధపడుతునట్లు వెల్లడించారు. దీని కారణంగా చాలా డిప్రెషన్‌కి గురైనట్లు చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే తన లైఫ్‌లో భార్య శ్వేత కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నారట. అయితే తన భార్య అది నీ ఛాయిస్‌ కాదని తన నోరు మూయించేసిందన్నారు. ఆ కష్టకాలంలో తనతో ఉండి భరోసా ఇచ్చిందన్నారు. 

నిజానికి వ్యాధి కంటే దాని కాణంగా వచ్చే డిపప్రెషన్‌, ఆందోళనలే అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్యం డిప్రెషన్‌ అని అన్నారు. దీనిపై సమంత, దీపికా పదుకునే లాంటి వాళ్లు మాట్లాడి యూత్‌ని చైతన్యపరుస్తున్నారని అభినందిచారు. దానివల్ల చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు తగ్గుతాయన్నారు. ఇక అలాగే తాను ఎదుర్కొంటున్న వ్యాధి గురించి కూడా వివరించారు.

ఆ వ్యాధి ఏంటంటే..
విక్రమ్‌ ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. దీని కారణంగా ఎముకలు కలిసిపోతున్నట్లుగా ఉండే ఒక విధమైన ఆర్థరైటిస్ సమస్య అని తెలిపారు. ఫలితంగా చాలా నొప్పిని అనుభవిస్తానని 56 ఏళ్ల భట్‌ అన్నారు. 

ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ (AxSpA) అంటే..
ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది ప్రధానంగా వెన్నెముక, సాక్రోలియాక్ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి కారణంగా దీర్ఘకాలికి వెన్నునొప్పిని ఎదుర్కొంటారు. అది భరించలేనదిగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. 

ఎందుకు వస్తుందంటే..
రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కీళ్లపై దాడి చేసినప్పుడు ఇది సంభవిస్తుందట. ఫలితంగా వాపుతో కూడిన భరించలేని నొప్పి ఎదురవ్వుతుందని అన్నారు. దీనికి కుటుంబ డీఎన్‌ఏ కీలకపాత్ర పోషిస్తుందట. ఎందుకంటే కుటుంబంలో ఎవరికైన ఆర్థరైటిస్ ఉన్న చరిత్ర ఉంటే..ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. 

ఇక ఈ పరిస్థితితో ఉన్నవారు ఉదయం లేచిన వెంటనే హాయిగా నడలేరట. ఎక్కడకక్కడ ఎముకలు బలంగా బిగిసుకుపోయి అలసటతో కూడిన నొప్పి వంటి లక్షణాలు ఉంటాయట. కాలక్రమేణ వెన్నెముక కదలికలు కష్టమై తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే కదలికలే ఉండవు. 

చికిత్స:
అది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి వేరుగా ఉంటుందట. చికిత్సలో ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు), ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులతో నయం అయ్యేలా చెస్తారు వైద్యులు. రోగ నిర్థారణ ఎంత తొందరగా జరిగిందన్న దానిబట్టే త్వరగా కోలుకోవడం అనేది ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి శాశ్వత చికిత్స లేదట. కేవలం మందులతో ఈ రోగాన్ని అదుపులో ఉంచడమే మార్గమని అన్నారు వైద్యులు. 

మైయోసిటిస్‌కి పూర్తి భిన్నం..
ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్‌ కీళ్ల ధృడత్వాన్ని బలహీనపరుస్తుంది. అదే మైయోసిటిస్ అనేది కండరాల వాపుకి సంబంధించినది. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు చేయడం కష్టతరమవుతుంది. అదే ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్‌ అయితే వెన్నెముక, కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక నొప్పి, కదలకుండా ధృఢంగా అయిపోతాయి ఎముకలు. చెప్పాలంటే కదలికలనేవి ఉండవు అని చెబుతున్నారు నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరింత సమాచారం కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం

(చదవండి: 'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement