Orthopedic
-
రూపాయికే కార్పొరేట్ వైద్యం.. డాక్టర్ హర్షవర్ధన్ గొప్ప మనసు
ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే భావనతో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్ ఖమ్మంలో పూర్తి చేశారు. కొంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయన తరువాత ఇల్లెందులో సొంత క్లినిక్ పెట్టారు. ఈలోగా ఇల్లెందు వైద్యశాలను వైద్య విధాన పరిషత్‌లోకి మార్చుతూ అప్‌గ్రేడ్ చేశారు. హర్షవర్ధన్‌కు ఆ ఆస్పత్రిలో సర్జన్‌గా ఉద్యోగం వచ్చింది. ఆయన సతీమణి తేజస్వి కూడా ఆ ఆస్పత్రిలో ఈఎన్టీ విభాగంలో డాక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం... ఖాళీ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రి. సంపాదన బాగానే ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే అంతర్మథనం మొదలైంది. పుచ్చలపల్లి సోదరుడే స్ఫూర్తి.. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ పేరిట రూ.10 ఫీజుతో వైద్యం అందించేవారు. నెల్లూరుకే చెందిన హర్షవర్ధన్... రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకున్నారు. ఇల్లెందు ఆంబజార్‌లో పెట్టిన సొంత క్లినిక్‌లో రూపాయి ఫీజుకే వైద్యం అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు పూర్తయ్యాక, సాయంత్రం క్లినిక్‌లో సేవలందిస్తున్నారు. ఆపరేషన్లు తప్పనిసరి అనుకున్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఖమ్మంలో శస్త్రచికిత్స కూడా చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 35 మందికి ఆపరేషన్లు చేశారు. ఇందులో మోకాలు, తుంటి, కీళ్ల మార్పిడి వంటి ఆపరేషన్లు.. మోకాళ్లు, అరికాళ్ల నొప్పులు, నడుము, మెడనొప్పి, కాళ్ల తిమ్మిర్లు వంటి అనేక సమస్యలకు అత్యాధునిక పద్ధతిలో వైద్యమందించారు. మోకాలు చిప్ప మార్పిడి చేశారు.. నడవడం ఇబ్బందిగా ఉండడంతో ఓ డాక్టర్ వద్ద పరీక్ష చేయించుకున్నా. మోకాలు చిప్ప అరిగిపోయిందని, మార్చాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఇల్లెందులో ప్రజా వైద్యం అందిస్తున్న హర్షవర్ధన్‌ను సంప్రదించాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాలి మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నా. – వి.బాయమ్మ, మామిడిగూడెం, ఇల్లెందు మండలం పేదలను ఆదుకోవాలని..డాక్టర్ జి.హర్షవర్ధన్, ఆర్థోపెడిక్ సర్జన్ ప్రస్తుత వైద్యం అత్యంత ఖరీదైంది. సామాన్యులను అందకుండాపోతోంది. అందుకే వారిని ఆదుకునేందుకు రూపాయి ఫీజుతో వైద్యం చేస్తున్నా. ప్రభుత్వ వైద్యులుగా నాకు, నా భార్యకు వచ్చే వేతనం మా కుటుంబానికి సరిపోతుంది. అందుకే క్లినిక్‌లో నామమాత్ర ఫీజుతో వైద్యం చేస్తున్నా. -
ప్రపంచంలో 20 కోట్ల మందికి ఆ వ్యాధి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పే
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు శరీరంలో రహస్యంగా పొంచి ఉండి ఊహించని రీతిలో అకస్మాత్తుగా బయటపడతాయి. ఆ కోవకు చెందినదే ఈ ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి). ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచంలో యాభై ఏళ్లు పైబడిన ముగ్గురు మహిళల్లో ఒకరు, ఐదుగురు పురుషుల్లో ఒకరికి తమ జీవితకాలంలో ఆస్టియోపోరోసిస్ వ్యాధి వల్ల ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుందని ప్రముఖ ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథరామారెడ్డి అంటున్నారు. గురువారం (అక్టోబర్ 20) ప్రపంచ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఆస్టియోపోరోసిస్ అంటే? ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి ఎముకలు వాటి ఖనిజ సాంద్రతను కోల్పోయి, పెళుసుబారిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ వ్యాధి ఎముకలను బలహీనపరిచి అవి విరిగిపోయేలా చేస్తుంది. తుంటి ఎముకలు, పక్క టెముకలు, మణికట్టు ఇంకా వెన్నెముక వంటి ఎముకలు విరిగే (ఫ్రాక్చర్) అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ వ్యాధిని కారణాలను బట్టి వర్గీకరించవచ్చు. ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అనేది సహజమైన వయస్సు సంబంధిత మార్పుల వల్ల ఎముకల సాంద్రత తగ్గి వస్తుంది. సెకండరీ ఆస్టియోపోరోసిస్ కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులవల్ల లేదా మందుల వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలేంటంటే... సాధారణంగా ప్రారంభ దశల్లో ఈ వ్యాధి వస్తే ప్రత్యేకంగా లక్షణాలేవీ కనిపించవు. వ్యాధి క్రమంగా తీవ్రమై ఎముకలు విరిగినప్పుడు మాత్రమే గుర్తించగలం. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే... వీపు కింది భాగంలో నొప్పి వస్తుంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు ఎత్తు తగ్గిపోవడం, వెన్నెముక విరగడం వల్ల శరీరం ముందుకు వంగిపోవడం, శరీర భంగిమల్లో మార్పు, శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. పరిస్థితి చాలా తీవ్రంగా మారినప్పుడు బలమైన తుమ్ము లేదా దగ్గు వల్ల కూడా ఎముకలు విరుగుతాయి. వ్యాధి నిర్ధారణ ఎలా చేయగలమంటే? డీఎక్స్ఏ అనే రేడియేషన్ ఎక్స్–రే స్కాన్ ద్వారా తుంటి, ఇంకా వెన్నెముక ఎముకల సాంద్రతను, ఎముకలలోని ఖనిజాల సాంద్రతను కొలవడానికి వీలవుతుంది. ఈ పరీక్షతో వ్యాధిని నిర్ధారించడానికి, ఫ్రాక్చర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యంత కచ్చితమైన మార్గం. ఇతర వ్యాధులు కూడా ఉన్నట్లయితే రక్తం, మూత్ర పరీక్షలు కూడా అవసరం కావచ్చు. ప్రమాద కారకాలేంటి? ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఆడా, మగా ఎవరికైనా రావచ్చు. అయితే ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ వారిని ‘బోన్ లాస్’నుండి కాపాడుతుంది. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో (లేదా ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో) ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే ప్రమాదం పురుషుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం, విటమిన్ డీ ఇంకా ఇతర విటమిన్లు, ఖనిజాల కొరతతో కూడిన ఆహారం తీసుకోవడం, సరైన శారీరక బరువును సరిగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జీవనశైలిలో మార్పులు అవసరం కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయడం, క్యాల్షియం, విటమిన్ డి వంటి విటమిన్లతో కూడిన ఆహరం ద్వారా లేక మందుల ద్వారా తీసుకోవడం వంటివి చేయాలి. అవసరమైతే కొన్నిసార్లు ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి రావచ్చు. పురుషుల్లో టెస్టోస్టెరాన్ థెరపీ ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడవచ్చు. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇవ్వడం ద్వారా ఎముకల సాంద్రత తగ్గడం వల్ల కలిగే నష్టాన్ని ఆపొచ్చు. కేవలం ఆర్థోపెడిక్ సర్జన్ సూచించినట్లయితేనే హార్మోన్ థెరపీ తీసుకోవాలి. -
DOCTOR G : మగ గైనకాలజిస్ట్ తిప్పలు
ఇష్టం లేని పోస్టింగులు ఉద్యోగులకు ఉన్నట్టే ఇష్టం లేని డిపార్ట్మెంట్లు డాక్టర్లకు ఉంటాయి. కొందరు న్యూరో వద్దనుకుంటారు. కొందరు పిడియాట్రిషియన్ కావడాన్ని బోర్ ఫీలవుతారు. కొందరికి చర్మవ్యాధుల డాక్టర్ అవాలని అస్సలు ఉండదు. కాని వద్దనుకున్న సీటే వస్తే? ఆయుష్మాన్ ఖురానాకి గైనకాలజీలో సీటు వస్తుంది. కాని అతను చేయాలనుకున్నది ఆర్థోపెడిక్స్. గైనకాలజీ అంటే స్త్రీల ప్రపంచం. పేషంట్లకు ఇబ్బంది. ఈ డాక్టరుకు బెరుకు. ఈ సమస్యను స్క్రీన్ మీద నవ్వులు పూయించడానికి అదే సమయంలో డాక్టర్ల గొప్పతనం చాటడానికి త్వరలో వస్తోంది ‘డాక్టర్ జి’. దీనికి అనురాగ్ కశ్యప్ చెల్లెలు అనుభూతి కశ్యప్ దర్శకురాలు కావడం మరో విశేషం. ‘పేషెంట్లు మహిళా గైనకాలజిస్టునే ప్రిఫర్ చేస్తారు’ అంటాడు గైనకాలజీలో పి.జి. చేస్తున్న ఆయుష్మాన్. ‘ఈ ఆడ, మగ తేడా ఏంటి? డాక్టర్ డాక్టరే ఎవరైనా’ అంటుంది సీనియర్ మహిళా గైనకాలజిస్ట్ షేఫాలి షా. ‘పేషెంట్లు అలా అనుకోరు కదా’ అంటాడు. ‘ముందు నువ్వు అనుకో. నీ ఆలోచన మార్చుకో. నువ్వో గైనకాలజిస్టువి. నీలోని మేల్ టచ్‌ను వదులుకో’ అంటుందామె కోపంగా. గైనకాలజీ విభాగంలో మహిళా పేషెంట్లకు చికిత్స చేయాలంటే మగవాడైన తను ‘మగ స్పర్శ’ను ఎలా వదులుకోవాలి అనే తిప్పలు వచ్చి పడతాయి ఆయుష్మాన్‌కి. అతను హీరోగా నటిస్తున్న ‘డాక్టర్ జి’ ట్రైలర్‌లోని సంభాషణ ఇది. ఈ సినిమా రెండు వారాల్లో విడుదల కానుంది. డాక్టర్ల మీద చాలా సినిమాలు వచ్చాయి గతంలో. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.’ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా రోజుల క్రితమే రాజేష్ ఖన్నా ‘ఆనంద్’లో అమితాబ్ పోషించిన డాక్టర్ పాత్ర చాలా ముఖ్యం. ఇంకా ‘డాక్టర్ కోట్నిస్ కీ అమర్ కహానీ’, ‘దిల్ ఏక్ మందిర్’, ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’... ఇవన్నీ డాక్టర్ ప్రొఫెషన్‌ను గొప్పగా చూపించాయి. ఇప్పుడు విడుదల కానున్న ‘డాక్టర్ జి’ కూడా ఈ రంగంలోని సాధకబాధకాలను చర్చించనుంది. అయితే కొంత సరదాగా. అది కూడా మగ గైనకాలజిస్ట్ సమస్యను తీసుకుంది. గైనకాలజీ అనగానే గర్భానికి సంబంధించిన విషయాలు, కాన్పులు, గర్భాశయ చికిత్సలు ఉంటాయి. పేషెంట్లు అనివార్యంగా స్త్రీలు కనుక డాక్టర్లు కూడా స్త్రీలే అయితే పరీక్షించడంలో ఇబ్బందులు ఉండవు. గుండె డాక్టరు, ఊపిరితిత్తుల డాక్టరు, ఈఎన్టి డాక్టరు మగవాడైనా పర్వాలేదు కాని మహిళా పేషెంట్లకు మగ గైనకాలజిస్టు అయితే ఇబ్బంది పడతారు. వారి కంటే ఎక్కువ ఇబ్బంది ఈ సినిమాలో ఆయుష్మాన్ పడనున్నాడు. కాని శరీరం ఎప్పుడైతే ‘రోగగ్రస్తం’ అవుతుందో ‘చికిత్స కు అవసరమైన స్థితికి’ చేరుకుంటుందో అప్పుడు ఆ శరీరం ‘స్త్రీదా’, ‘పురుషుడిదా’ అనే తేడా లేకుండా పోతుంది. పేషెంట్ కూడా ఆ సమయంలో తన ప్రాణం దక్కితే చాలు– వైద్యం ఎవరు చేసినా పర్వాలేదు అనే స్థితికి వెళుతుంది/వెళతాడు. ఇక్కడ కూడా ఒక అత్యవసర కాన్పు సమయంలో పేషెంట్ డాక్టర్ ఎవరనేది చూడదు. కాన్పు జరిగితే చాలనే అనుకుంటుంది. కాని ఆయుష్మాన్ ఖురానా తనలోని ఆ ఇబ్బందిని పోగొట్టుకుని శరీరాన్ని శరీరంలా చూసే స్థితికి చేరుకోవడమే ఈ కథ. ‘త్రీ ఇడియెట్స్’లో ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందు కనిపించని సన్నివేశం ఉంటుంది. అది క్లయిమాక్స్‌లో కొంతమంది ఐఐటి విద్యార్థులు కలిసి కాన్పు కష్టమైన తమ డీన్ కుమార్తెకు పురుడు పోయడం. ఈ సన్నివేశం తీయడం కత్తి సాము మీద నడవడం లాంటిది. ఆ సమయంలో అక్కడ ఉన్నది స్త్రీ కాదు... ఆ కుర్రవాళ్లు పురుషులు కాదు. ఆమె పేషెంట్... వాళ్లు ఆమెకు సాయం చేస్తున్న మనుషులు... అలా చూపించగలగడంలో దర్శకుడు పెద్ద సక్సెస్ సాధిస్తాడు. అందుకే ఆమిర్ ఖాన్ కాన్పు కావాల్సిన స్త్రీ నుంచి బిడ్డ తల బయటకు వచ్చిందో లేదో లోపల తొంగి చూసి చెక్ చేయడం అసభ్యంగా ఉండదు. ఆ సందర్భంలో ప్రేక్షకులతో సహా అందరూ తాము స్త్రీలో పురుషులో అనే సంగతి మరచి మానవులుగా మారతారు. వైద్యంలో వైద్యులు ఇదే సాధన చేస్తారు. ‘డాక్టర్ జి’లో సీనియర్ గైనకాలజిస్ట్‌గా పని చేసిన షెఫాలీ షా పాత్ర ముఖ్యం. ఈ పాత్రే పి.జి. చేస్తున్న ఆయుష్మాన్ ఖురానాకు వైద్యం నేర్పిస్తుంది. స్త్రీ దేహ సమస్యలను మనిషిగా అర్థం చేసుకోవడంలో సాయం చేస్తుంది. హీరోయిన్గా రకుల్ ప్రీత్ కనిపిస్తుంది. కథలో ఆమె కూడా మెడిసిన్‌లో పి.జి. చేసే స్టూడెంటే. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. మేనేజ్మెంట్ రంగంలో 8 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన అనుభూతి కశ్యప్ చివరకు తాను పని చేయాల్సింది సినిమాల్లోనే అని గ్రహించి మంచి ఉద్యోగాన్ని వదిలేసి అనురాగ్ కశ్యప్ తీస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ తీసింది. ‘డాక్టర్ జి’ ఆమె తొలి పెద్ద సినిమా అని చెప్పవచ్చు. మగ డాక్టర్ దగ్గర చూపించుకోవడం నామోషీ అని భావించే మహిళా పేషెంట్లు, మహిళా పేషెంట్ల విషయంలో కంఫర్ట్ ఫీలవని మగ డాక్టర్లు ఈ సినిమాను ఎలా వ్యాఖ్యానిస్తారో చూడాలి. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. -
నారాయణ హృదయాలయ విస్తరణ
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సేవల కంపెనీ నారాయణ హృదయాలయ బెంగళూరులోని ఆర్థోపెడిక్ ఆసుపత్రిని కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. వ్యాపార బదిలీకి వీలుగా శివ అండ్ శివ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తద్వారా స్లంప్ సేల్ పద్ధతిలో ఆర్థోపెడిక్ ట్రౌమా ఆసుపత్రిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఆసుపత్రికి సంబంధించిన అన్నిరకాల ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, లైసెన్సులు, కాంట్రాక్టులు బదిలీకానున్నట్లు వివరించింది. స్పార్‡్ష గ్రూప్ హాస్పిటల్స్‌కు చెందిన సంస్థ 100 పడకల సామర్థ్యంతో దశాబ్దకాలానికిపైగా ఆర్థోపెడిక్ సర్వీసులను అందిస్తోంది. గతేడాది ఈ యూనిట్ రూ. 49 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ వార్తల నేపథ్యంలో నారాయణ హృదయాలయ షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 707 వద్ద ముగిసింది. -
ఆర్థోపెడిక్ అంతా ఆరోగ్యశ్రీలో
సాక్షి, హైదరాబాద్: అన్నిరకాల ఆర్థోపెడిక్ చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయని వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రైవేట్‌కు పోటీ గా ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్ వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆరోగ్యశ్రీ కింద నిధులను విడుదల చేశామని, ఈ నిధులను స్థానిక సూపరింటెండెంట్లు వాడుకొని ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థోపెడిక్ వైద్యులతో మంత్రి ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో అందిస్తున్న ఆర్థోపెడిక్ సేవలపై సమీక్షించారు. ఈ విభాగంలో ప్రజలకు మెరు గైన వైద్య సేవలందించేందుకు అవసరమైన వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని ఆస్పత్రులకు తగినంత బడ్జెట్ ఇచ్చామని, పేద ప్రజలకు మరింత మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో చేయలేనివే హైదరాబాద్‌కు రిఫర్ చేయాలి ‘మోకాలి చిప్ప మార్పిడి సర్జరీకి అన్ని వసతులను ప్రభుత్వాస్పత్రుల్లో సమకూర్చాం. రాష్ట్రవ్యాప్తంగా 56 సీఆర్మ్ మెషీన్లు ఏర్పాటు చేశాం. మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా చూడాలి. దీనివల్ల పేదలకు ఆర్థిక భారం తప్పుతుంది’అని మంత్రి అన్నారు. సూపరింటెండెంట్లు ఆర్థోపెడిక్ వైద్యులకు సహకారం అందించాలని కోరారు. ‘జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేశాం. అధునాతన వైద్య పరికరాలు సమకూర్చాం. జిల్లాల్లో అందించలేని చికిత్సలనే హైదరాబాద్‌కు రిఫర్ చేయాలి’అని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. బడ్జెట్లో వైద్య పరికరాలకు రూ. 500 కోట్లు, సర్జికల్‌కు రూ. 200 కోట్లు, వైద్య పరీక్షలకు రూ. 300 కోట్లు, మందులకు రూ. 500 కోట్లు, ఆస్పత్రుల అభివృద్ధికి రూ. 1,250 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ వైద్య సేవలు అందించే వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు, ఇతర సిబ్బందికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. అందరూ మరింత కష్టపడి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రణాళికతో ముందుకెళ్తే మరింత ప్రయోజనం: గురువారెడ్డి తమ ఆస్పత్రుల్లో ప్రణాళికాబద్ధమైన విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి చికిత్స అందించగలుగుతున్నామని, ఇదే పద్ధతిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాటిస్తే ఎక్కువ మందికి ప్రయోజనం జరుగుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు గురువారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ఏ సమయంలోనైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైద్యులు అంకితభావంతో పేషెంట్ల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే మరింత మందికి సేవలు అందించడం సాధ్యమవుతుందని మరో ఆర్థోపెడిక్ వైద్యుడు అఖిల్ దాడి అన్నారు. కొత్త చికిత్స విధానాలపై పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, దీని వల్ల వైద్యులకు ఆసక్తి పెరుగుతుందని డాక్టర్ నితిన్ చెప్పారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్య
-
వైద్యుల వాగ్వాదం; ఎగ్జామినర్ నేనంటే.. నేను..
సాక్షి, గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ ఆర్ధోపెడిక్ విభాగ వైద్యుల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇరువురు వైద్యులను ఇంటర్నల్ ఎగ్జామినర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ కావడంతో సోమవారం పరీక్ష కేంద్రంలోనే ఎగ్జామినర్ నేనంటే.. నేనని చెప్పడంతో వైద్యవిద్యార్థులు అవాక్కయ్యారు. రంగంలోకి దిగిన కాలేజీ అధికారులు ఆ ఇద్దరు వైద్యులను సముదాయించి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. వివరాలు... ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్–2 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఈనెల 26వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఆదేశాలు అందాయి. ఆర్ధోపెడిక్ విభాగం పరీక్షల ఇంటర్నల్ ఎగ్జామినర్‌గా ప్రొఫెసర్ ఎన్.రవీందర్‌కుమార్‌ను నియమిస్తూ ఈనెల 24వ తేదీన కేఎన్ఆర్యుహెచ్ఎస్ ఎగ్జామినేషన్ డిప్యూటీ రిజిస్టార్ డాక్టర్ రామానుజరావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ బీ.వాల్యాను ఎగ్జామినర్‌గా నియమిస్తున్నట్టు ఈనెల 26వ తేదీన మరో నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు వైద్యవిద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో ఎగ్జామినర్ నేనే అంటూ ఇద్దరు వైద్యులు వాగ్వాదానికి దిగారు. ఎవరు ఎగ్జామినరో తెలియక వైద్య విద్యార్థులు అయోమయంలో పడ్డారు. రాత్రంతా నిద్రలేకుండా పరీక్షలకు ప్రిపేర్ అయ్యామని, పరీక్ష కేంద్రంలో ఈ రాద్ధాంతం ఏమింటని పలువురు వైద్యవిద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 8 రోజులపాటు జరిగే పరీక్షల్లో నాలుగు రోజులకు ఒకరు, మిగిలిన నాలుగు రోజులు మరొకరు ఎగ్జామినర్‌గా వ్యవహరిస్తారని కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రకాశరావు వివరణ ఇచ్చారు. రెండేళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు.. గాంధీ ఆర్ధోపెడిక్ విభాగంలో వైద్యుల మధ్య రెండేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఆర్ధోపెడిక్ హెచ్ఓడీగా బీ వాల్య ఉండగా, నిబంధనల ప్రకారం మరో ప్రొఫెసర్ సత్యనారాయణ హెచ్ఓడీగా నియమితులయ్యారు. గాంధీ ఆస్పత్రి ఆర్ధోపెడిక్ విభాగంలోని హెచ్ఓడీ రూం విషయమై వైద్యుల మధ్య విభేదాలు ప్రారంభమై తారస్థాయికి చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయారు. ఇరువర్గాలు పలుమార్లు గొడవ పడ్డారు. గాంధీ ఆస్పత్రి, కాలేజీ అధికారులు కలుగజేసుకున్నా పరిష్కారం కాలేదు. దీంతో నిరుపేద రోగులతోపాటు వైద్యవిద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
కేజీహెచ్‌లో ఉచితంగా కీళ్ల మార్పిడి
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కేజీహెచ్‌లో ఉచితంగా కీళ్లమార్పిడి శస్త్ర చికి త్సలు నిర్వహిస్తున్నామని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు. మంగళవారం ఆర్థోపెడిక్ వార్డులోని సమావేశ మందిరంలో కీళ్ల మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, రాష్ట్ర ప్రభుత్వ ఇల్నెస్ ఫండ్‌ను వినియోగించి ఈ ఏడాదిలో 151 కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించామన్నారు. కీళ్ల మార్పిడి చేయించుకున్న రోగులు కేజీహెచ్‌లో ఉచితంగా ఈ శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు ప్రచారం చేయాలని కోరారు. వైద్య విద్యా సంచాలకుడు గత ఏడాది రూ.70 లక్షల నిధిని కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు కేటాయించారని చెప్పారు. ఆర్థోపెడిక్ విభాగం హెడ్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఉచిత కీళ్ల మార్పిడి చికిత్సకు రూ.2 కోట్ల నిధులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రులు రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయన్నారు. అవగాహన సదస్సులో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె.ఇందిరాదేవి, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్లు డాక్టర్ శివానంద, డాక్టర్ లోక్‌నాథ్, ఏఆర్ఎంవో డాక్టర్ సిహెచ్.సాధన, కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులు పాల్గొన్నారు. -
నొప్పి మళ్లీ తిరగబెడుతోంది.. ఎందుకు?
దాదాపు ఎనిమిది నెలల కిందట నా కాలు స్లిప్ అయ్యి, చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది? దయచేసి వివరించండి. మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మణికట్టు వంచినప్పుడల్లా క్లిక్‌మని శబ్దం! నా వయసు 33 ఏళ్లు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాన్ని కొద్దిగా పక్కకు వంచినప్పుడు క్లిక్ మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. ఈ నొప్పి కారణంగా ఏ పనీ చేయలేకపోతున్నాను. నాకు తగిన పరిష్కారం చెప్పండి. మన మణికట్టు చాలా సంక్లిష్టమైన నిర్మాణం. ఈ మణికట్టులో 15 ఎముకలతో పాటు ఎన్నో లిగమెంట్లు ఉంటాయి. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు మనకా విషయమే తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మన మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం కూడా మనకు సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లుగా సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా అయిఉండవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్–రే పరీక్షలు చేయించుకోండి. సమస్యను బట్టి చికిత్స ఇస్తారు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నొప్పి మెడ నుంచి చేతిలోకి పాకుతోంది... ఎందుకిలా? నా వయసు 29 ఏళ్లు. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌ను. చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండువారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. డాక్టర్గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. శ్రీనివాస్, హైదరాబాద్ మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ అనుసరణీయం కాని భంగిమల్లో కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొనిపనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు. ఇంత చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పా...? నా వయసు 27 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎల్. రమేశ్, అనకాపల్లి మీకు మీ రోజువారి కార్యకలాపాల కారణంగా మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి అతిగా ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. అప్పుడెప్పుడో కాలు బెణికింది... నొప్పి ఇప్పుడెందుకు వస్తోంది? ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. – స్వరూప, విజయవాడ మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
‘వెన్ను’ దన్ను ఏదీ?
ఏటా లక్ష మంది నడుం నొప్పి బాధితులు అత్యధికులు ద్విచక్ర వాహనదారులే.. దక్షిణాది మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ ట్విన్సిటీస్ ఆర్థోపెడిక్, స్పైనల్ డాక్టర్స్ అసోసియేషన్ అంచనా గంటల తరబడి కంప్యూటర్లతో కుస్తీ... బయటకు వెళ్లేందుకు వాహనాలతో దోస్తీ... గతుకుల బస్తీ... వెరసి వెన్నుపూసకు సుస్తీ. అదీ 30 ఏళ్లలోపే. ఇటీవల కాలంలో అందరికీ ’వెన్ను’లో వణుకు పుటిస్తున్న వాస్తవమిది. చిన్నవయసులోనే వందలాది మంది వెన్ను నొప్పితో బాధ పడుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. వీరిలో 65 శాతం ద్విచక్ర వాహనదారులు ఉంటే... 35 శాతం ఐటీ, అనుబంధ రంగాల నిపుణులు... వైద్యులు... వ్యాపారులు ఉంటున్నారు. ట్విన్సిటీస్ ఆర్థోపెడిక్, స్పైనల్ డాక్టర్స్ అసోసియేషన్ సర్వే ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లోని చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం, కొచ్చిన్ తదితర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువగా వెన్ను నొప్పి బాధితులు ఉన్నట్టు తేలడం...పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. కాసేపు నిలబడనీయదు...నడవనివ్వదు. కూర్చొని ప్రయాణం చేయాలన్నా కష్టమే. పగలంతా తిరిగొస్తే రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. పడుకుని లేస్తే కలుక్కుమంటుంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వెన్ను నొప్పి, నడుము నొప్పి బాధితుల ఆవేదన ఇది. ఇదేదో అరవై ఏళ్లు నిండిన వారి గురించి చెబుతున్నది కాదు... నిండా ముప్ఫై ఏళ్లు లేని యువజనుల సంగతి. నగరంలో సుమారు 41 లక్షల వాహనాలు ఉండగా... వీటిలో 30 లక్షల ద్విచక్ర వాహనాలు, 8 లక్షల కార్లు, మరో మూడు లక్షల ఆటోలు, ఇతర వాహనాలు ఉంటాయి. అదేపనిగా వాహనాలపై ప్రయాణించడం, ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు కదలకుండా కూర్చోవడం వల్ల నగరంలో ఏటా లక్ష మంది నడుం నొప్పి బారిన పడుతున్నారు. వీరిలో 65 శాతం మంది ద్విచక్ర వాహనదారులే. మరో 35 శాతం మంది ఐటీ, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారు, వైద్యులు ఉన్నారు. - సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 6 వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో ప్రధాన రహదారుల పరిధిలో 3 వేలకు పైగా గోతులు ఏర్పడుతున్నాయి. ఒక్కో ద్విచక్ర వాహనదారుడు రోజూ సగటున 15-20 కిలోమీటర్లు ఈ దారుల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. ఈ గోతులే జనాన్ని ముంచేస్తున్నాయి. మన శరీర భాగాల్లో వెన్నుపూసది కీలక పాత్ర. వెన్నుకు సంబంధించి మెడలో ఉన్న సి4-సి5, సి5-సి6 భాగాలు, నడుము చివరలో ఉన్న ఎల్4-ఎల్5, ఎల్5-ఎస్1 భాగాలు అత్యంత కీలకమైనవి. గతుకుల రోడ్లలో ఒక్కసారిగా ఎగిరి దూకడం వల్ల ఎల్5-ఎస్1 భాగాలు దెబ్బ తింటున్నాయి. దీనివల్ల నడుము నొప్పి రావడం, తర్వాత ఒక కాలు, ఒక చెయ్యి జాలుగా నొప్పి వస్తుంది. ఈ ప్రభావం మెడలో ఉన్న సి4-సి5 భాగంలోనూ పడుతోంది. పదే పదే ఆ భాగాలపై ఒత్తిడి వల్ల అవి అరుగుదలకు గురవుతున్నట్టు వైద్యులు అంచనా వేశారు. ఏటా 10 వేల సర్జరీలు నగరంలో నడుం నొప్పి బాధితులకు శస్త్రచికిత్సలు విపరీతంగా జరుగుతున్నాయి. 2002-2007 మధ్య కాలంలో జంట నగరాల్లో 5 వేల శస్త్రచికిత్సలు జరగ్గా... 2012-13లో సుమారు 10 వేల శస్త్రచికిత్సలు జరిగినట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. గంటకు 40 మంది నడుం నొప్పి బాధితులు నమోదవుతున్నట్టు తేలింది. 2005 తర్వాత సర్జరీల సంఖ్య 50 శాతం పెరిగాయి. జిల్లాలతో పోలిస్తే శస్త్రచికిత్సలు జంట నగరాల్లో 80 శాతం అధికం. ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్లే.. జంట నగరాల్లో వెన్నునొప్పి బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. క్యాన్సర్, హృద్రోగాల తర్వాత అత్యంత ఎక్కువగా న మోదవుతున్న కేసులు ఇవే. ఎటూ కదలకుండా ఆరు గంటల పాటు ఒకే పొజిషన్లో కూర్చోవడం, గతుకుల రోడ్లపై రెస్ట్ లేకుండా 15-20 కిలోమీటర్లు ప్రయాణించడంతో డిస్కులు దెబ్బతింటున్నాయి. అతిగా మద్యం తాగడం..సిగరెట్లు కాల్చడం కూడా ఎముకల అరుగుదలకు మరో కారణం. 98 శాతం మందికి మందులు, ఫిజియోథెరపి వంటి వాటితోనే నయమయ్యేలా చూస్తాం. తప్పని పరిస్థితుల్లోనే సర్జరీ చేస్తాం. - డాక్టర్ జె.నరేష్‌బాబు, స్పైన్ సర్జన్ -
రోడ్డెక్కితే నడ్డి విరిగినట్టే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘వెన్ను’కు దన్నులేకుండాపోతోంది. వెన్నుపూసకు పెద్ద ఆపదొచ్చింది. క్షణమైనా నిలబడనీయదు. కాసేపు నడవనివ్వదు. ఇక ప్రయాణమంటే గగనమే. పగలంతా తిరిగొస్తే రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. పడుకుని లేస్తే కలుక్కు.. కూర్చోవాలంటే నరకం. ఇదేదో అరవై ఏళ్లు నిండిన వారి వ్యధ కాదు.. నిండా ముప్ఫై కూడా పూర్తికాని యువత వెత. నడుము నొప్పి అని చెప్పుకోలేక.. తిరగనూ లేక ఎలాగో నెట్టుకొస్తున్న పరిస్థితి. కొనితెచ్చుకున్న జబ్బు కాదు. వెన్ను కలుక్కుమందంటే లక్షలకు లక్షలు వదుల్చుకోవాల్సిందే. జీవనశైలి, విధి నిర్వహణలోని తీరుతెన్నులు ఈ పరిస్థితికి ఒక కారణమైతే నగర రోడ్లు మరో ముఖ్య కారణం. రోడెక్కితే చాలు నడ్డి విరుగుతోందన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. నగరంలో నడుమునొప్పి బాధితులు పెరుగుతున్నారు. ఏటా దాదాపు 3 లక్షల కేసులు కొత్తగా నమోదవుతున్నాయని జంటనగరాల ఆర్థోపెడిక్ అండ్ స్పైనల్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రాథమికంగా అంచనా వేసింది. గతుకుల రోడ్లే వెన్ను విరుస్తున్నాయి.. నగరంలో దాదాపు 25 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏటా రెండున్నర లక్షలమంది వెన్ను నొప్పికి గురవుతుండగా, వారిలో ద్విచక్ర వాహన దారులే 80 శాతం మంది ఉన్నారు. మిగతా వారిలో ఐటీ, ప్రభుత్వోద్యోగులు, ప్రమాద బాధితులు, జన్యుపర లోపాలతో బాధపడుతున్న వారు ఉన్నట్టు తేలింది. ద్విచక్ర వాహనచోదకులు ప్రస్తుతం నగర రోడ్లలో రోజూ 20 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తే చాలు రెండేళ్లలో వెన్నునొప్పికి గురయ్యే ప్రమాదమున్నట్టు వైద్యులు గుర్తించారు. గతుకుల రోడ్లలో ఒక్కసారి పడితే చాలు వెన్ను తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా ఎక్కువ మంది వెన్నునొప్పికి గురవుతున్నారు. మూడువేల గోతులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 6వేల కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. ఇందులో ప్రతి వర్షాకాలంలోనూ ఇవి దెబ్బతింటున్నాయి. ఏటా ప్రధాన రహదారులపై 3 వేలకుపైగా గోతులు ఏర్పడుతున్నాయి. ఒక్కో వాహనచోదకుడు రోజూ సరాసరిన 15 కి.మీ. మేర గోతుల రోడ్లపైనే ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్లపై ప్రయాణంతో ఆటో, బస్సు డ్రైవర్లూ ఎక్కువగా వెన్నునొప్పికి గురవుతున్నట్టు తేలింది. వెన్నునొప్పికి ఎలా గురవుతున్నారంటే.. ప్రతి ఒక్కరిలో వెన్నుపూస కీలకం. వెన్నుకు సంబంధించి మెడ భాగంలోని సీ4-సీ5, సీ5-సి6 భాగాలు, నడుము చివర భాగంలో ఉన్న ఎల్4-ఎల్5, ఎల్5-ఎస్1 భాగాలు అత్యంత కీలకమైనవి. గతుకుల రోడ్లలో వాహనాలు ఒక్కసారిగా కుదుపునకు గురవటం వల్ల ముఖ్యంగా ఎల్5-ఎస్1 భాగాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల నడుమునొప్పి రావడం, తర్వాత ఒక కాలు, ఒక చెయ్యి జాలుగా నొప్పి వస్తుంది.. ఈ ప్రభావం మెడ భాగంలో ఉన్న సీ4-సీ5 భాగంలోనూ పడుతోంది. పదేపదే ఆయా భాగాలపై ఒత్తిడి కారణంగా అవి ఎక్కువ అరుగుదలకు గురవుతున్నట్టు వైద్యుల అంచనా. ఏటా 10 వేలకు పైగా సర్జరీలు నగరంలో నడుమునొప్పి శస్త్రచికిత్సలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. 2002-2007 మధ్య జంటనగరాల్లో 5 వేల శస్త్రచికిత్సలు జరగ్గా, 2011-12 మధ్య ఒకే ఏడాదిలో సుమారు 10వేల శస్త్రచికిత్సలు జరిగినట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. మరికొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే... గంటకు 40 మంది నడుమునొప్పి బాధితులు నమోదవుతున్నారు 2005 తర్వాత సర్జరీల సంఖ్య 50 శాతంపైనే పెరిగాయి బ్యాక్‌పెయిన్ శస్త్రచికిత్సలకు ఏటా కనీసం రూ.130 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు జిల్లాలతో పోలిస్తే శస్త్రచికిత్సలు జంటనగరాల్లో 80 శాతం ఎక్కువ జంటనగరాల్లో ఆర్థోపెడిక్, స్పైనల్ సర్జన్లు 200 మందిపైనే ఉన్నా 30 మంది మాత్రమే ఎక్కువగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం, కొచ్చిన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువమంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లోనే సర్జరీ జంట నగరాల్లో వెన్నునొప్పి బాధితులు పెరుగుతున్నారు. గతుకుల రోడ్లు దీనికి ప్రధాన కారణం. సాఫ్ట్వేర్ రంగం నుంచి కూడా ఈ బాధితులు ఉన్నారు. ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం, గతుకుల కారణంగా వెన్నుపై ఒత్తిడి పెరిగి ఆపై నొప్పిరావడం తొలిదశ. రెండో దశలో ఒత్తిడి ఉన్న భాగాల అరుగుదల మొదలవుతుంది. కొద్ది రోజులకు డిస్కులు జారిపోవడం జరుగుతుంది. దీంతో నడుమునొప్పితో పాటు ఒక కాలు, ఒక చేయికి నొప్పి రావడం మొదలవుతుంది. 90 శాతం మందికి మందులు, ఫిజియోథెరపీతోనే నయమయ్యేలా చూస్తాం. తప్పనిసరైతేనే సర్జరీకి వెళతాం. సర్జరీ అనంతరం జీవనశైలి మార్చుకోవాలి. గతుకుల రోడ్లలో ప్రయాణించరాదు. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండాలి. - డాక్టర్ నరేష్‌బాబు, వెన్నుపూస వైద్య నిపుణులు, మెడిసిటీ ఆస్పత్రి (జంటనగరాల ఆర్థోపెడిక్, స్పైనల్ వైద్యుల అసోసియేషన్ సభ్యులు)