ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే భావనతో..
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్ ఖమ్మంలో పూర్తి చేశారు. కొంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయన తరువాత ఇల్లెందులో సొంత క్లినిక్ పెట్టారు. ఈలోగా ఇల్లెందు వైద్యశాలను వైద్య విధాన పరిషత్‌లోకి మార్చుతూ అప్‌గ్రేడ్ చేశారు. హర్షవర్ధన్‌కు ఆ ఆస్పత్రిలో సర్జన్‌గా ఉద్యోగం వచ్చింది. ఆయన సతీమణి తేజస్వి కూడా ఆ ఆస్పత్రిలో ఈఎన్‌టీ విభాగంలో డాక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం... ఖాళీ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రి. సంపాదన బాగానే ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే అంతర్మథనం మొదలైంది.
పుచ్చలపల్లి సోదరుడే స్ఫూర్తి..
నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ పేరిట రూ.10 ఫీజుతో వైద్యం అందించేవారు. నెల్లూరుకే చెందిన హర్షవర్ధన్... రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకున్నారు. ఇల్లెందు ఆంబజార్‌లో పెట్టిన సొంత క్లినిక్‌లో రూపాయి ఫీజుకే వైద్యం అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు పూర్తయ్యాక, సాయంత్రం క్లినిక్‌లో సేవలందిస్తున్నారు.
ఆపరేషన్లు తప్పనిసరి అనుకున్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఖమ్మంలో శస్త్రచికిత్స కూడా చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 35 మందికి ఆపరేషన్లు చేశారు. ఇందులో మోకాలు, తుంటి, కీళ్ల మార్పిడి వంటి ఆపరేషన్లు.. మోకాళ్లు, అరికాళ్ల నొప్పులు, నడుము, మెడనొప్పి, కాళ్ల తిమ్మిర్లు వంటి అనేక సమస్యలకు అత్యాధునిక పద్ధతిలో వైద్యమందించారు.
మోకాలు చిప్ప మార్పిడి చేశారు..
నడవడం ఇబ్బందిగా ఉండడంతో ఓ డాక్టర్ వద్ద పరీక్ష చేయించుకున్నా. మోకాలు చిప్ప అరిగిపోయిందని, మార్చాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఇల్లెందులో ప్రజా వైద్యం అందిస్తున్న హర్షవర్ధన్‌ను సంప్రదించాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాలి మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నా.
– వి.బాయమ్మ, మామిడిగూడెం, ఇల్లెందు మండలం
పేదలను ఆదుకోవాలని..డాక్టర్ జి.హర్షవర్ధన్, ఆర్థోపెడిక్ సర్జన్
ప్రస్తుత వైద్యం అత్యంత ఖరీదైంది. సామాన్యులను అందకుండాపోతోంది. అందుకే వారిని ఆదుకునేందుకు రూపాయి ఫీజుతో వైద్యం చేస్తున్నా. ప్రభుత్వ వైద్యులుగా నాకు, నా భార్యకు వచ్చే వేతనం మా కుటుంబానికి సరిపోతుంది. అందుకే క్లినిక్‌లో నామమాత్ర ఫీజుతో వైద్యం చేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment