
‘డాక్టర్ జి’ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రకుల్‌ప్రీత్‌సింగ్
ఇష్టం లేని పోస్టింగులు ఉద్యోగులకు ఉన్నట్టే ఇష్టం లేని డిపార్ట్‌మెంట్లు డాక్టర్లకు ఉంటాయి. కొందరు న్యూరో వద్దనుకుంటారు. కొందరు పిడియాట్రిషియన్ కావడాన్ని బోర్ ఫీలవుతారు. కొందరికి చర్మవ్యాధుల డాక్టర్ అవాలని అస్సలు ఉండదు. కాని వద్దనుకున్న సీటే వస్తే? ఆయుష్మాన్ ఖురానాకి గైనకాలజీలో సీటు వస్తుంది. కాని అతను చేయాలనుకున్నది ఆర్థోపెడిక్స్. గైనకాలజీ అంటే స్త్రీల ప్రపంచం. పేషంట్లకు ఇబ్బంది. ఈ డాక్టరుకు బెరుకు. ఈ సమస్యను స్క్రీన్ మీద నవ్వులు పూయించడానికి అదే సమయంలో డాక్టర్ల గొప్పతనం చాటడానికి త్వరలో వస్తోంది ‘డాక్టర్ జి’. దీనికి అనురాగ్ కశ్యప్ చెల్లెలు అనుభూతి కశ్యప్ దర్శకురాలు కావడం మరో విశేషం.
‘పేషెంట్లు మహిళా గైనకాలజిస్టునే ప్రిఫర్ చేస్తారు’ అంటాడు గైనకాలజీలో పి.జి. చేస్తున్న ఆయుష్మాన్.
‘ఈ ఆడ, మగ తేడా ఏంటి? డాక్టర్ డాక్టరే ఎవరైనా’ అంటుంది సీనియర్ మహిళా గైనకాలజిస్ట్ షేఫాలి షా.
‘పేషెంట్లు అలా అనుకోరు కదా’ అంటాడు.
‘ముందు నువ్వు అనుకో. నీ ఆలోచన మార్చుకో. నువ్వో గైనకాలజిస్టువి. నీలోని మేల్ టచ్‌ను వదులుకో’ అంటుందామె కోపంగా.
గైనకాలజీ విభాగంలో మహిళా పేషెంట్లకు చికిత్స చేయాలంటే మగవాడైన తను ‘మగ స్పర్శ’ను ఎలా వదులుకోవాలి అనే తిప్పలు వచ్చి పడతాయి ఆయుష్మాన్‌కి.
అతను హీరోగా నటిస్తున్న ‘డాక్టర్ జి’ ట్రైలర్‌లోని సంభాషణ ఇది.
ఈ సినిమా రెండు వారాల్లో విడుదల కానుంది.
డాక్టర్ల మీద చాలా సినిమాలు వచ్చాయి గతంలో. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.’ ఒక మంచి స్టేట్‌మెంట్ ఇచ్చింది. చాలా రోజుల క్రితమే రాజేష్ ఖన్నా ‘ఆనంద్’లో అమితాబ్ పోషించిన డాక్టర్ పాత్ర చాలా ముఖ్యం. ఇంకా ‘డాక్టర్ కోట్నిస్ కీ అమర్ కహానీ’, ‘దిల్ ఏక్ మందిర్’, ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’... ఇవన్నీ డాక్టర్ ప్రొఫెషన్‌ను గొప్పగా చూపించాయి. ఇప్పుడు విడుదల కానున్న ‘డాక్టర్ జి’ కూడా ఈ రంగంలోని సాధకబాధకాలను చర్చించనుంది. అయితే కొంత సరదాగా. అది కూడా మగ గైనకాలజిస్ట్ సమస్యను తీసుకుంది. గైనకాలజీ అనగానే గర్భానికి సంబంధించిన విషయాలు, కాన్పులు, గర్భాశయ చికిత్సలు ఉంటాయి. పేషెంట్లు అనివార్యంగా స్త్రీలు కనుక డాక్టర్లు కూడా స్త్రీలే అయితే పరీక్షించడంలో ఇబ్బందులు ఉండవు.
గుండె డాక్టరు, ఊపిరితిత్తుల డాక్టరు, ఈఎన్‌టి డాక్టరు మగవాడైనా పర్వాలేదు కాని మహిళా పేషెంట్లకు మగ గైనకాలజిస్టు అయితే ఇబ్బంది పడతారు. వారి కంటే ఎక్కువ ఇబ్బంది ఈ సినిమాలో ఆయుష్మాన్ పడనున్నాడు. కాని శరీరం ఎప్పుడైతే ‘రోగగ్రస్తం’ అవుతుందో ‘చికిత్స కు అవసరమైన స్థితికి’ చేరుకుంటుందో అప్పుడు ఆ శరీరం ‘స్త్రీదా’, ‘పురుషుడిదా’ అనే తేడా లేకుండా పోతుంది. పేషెంట్ కూడా ఆ సమయంలో తన ప్రాణం దక్కితే చాలు– వైద్యం ఎవరు చేసినా పర్వాలేదు అనే స్థితికి వెళుతుంది/వెళతాడు. ఇక్కడ కూడా ఒక అత్యవసర కాన్పు సమయంలో పేషెంట్ డాక్టర్ ఎవరనేది చూడదు. కాన్పు జరిగితే చాలనే అనుకుంటుంది. కాని ఆయుష్మాన్ ఖురానా తనలోని ఆ ఇబ్బందిని పోగొట్టుకుని శరీరాన్ని శరీరంలా చూసే స్థితికి చేరుకోవడమే ఈ కథ.
‘త్రీ ఇడియెట్స్’లో ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందు కనిపించని సన్నివేశం ఉంటుంది. అది క్లయిమాక్స్‌లో కొంతమంది ఐఐటి విద్యార్థులు కలిసి కాన్పు కష్టమైన తమ డీన్ కుమార్తెకు పురుడు పోయడం. ఈ సన్నివేశం తీయడం కత్తి సాము మీద నడవడం లాంటిది. ఆ సమయంలో అక్కడ ఉన్నది స్త్రీ కాదు... ఆ కుర్రవాళ్లు పురుషులు కాదు. ఆమె పేషెంట్... వాళ్లు ఆమెకు సాయం చేస్తున్న మనుషులు... అలా చూపించగలగడంలో దర్శకుడు పెద్ద సక్సెస్ సాధిస్తాడు. అందుకే ఆమిర్ ఖాన్ కాన్పు కావాల్సిన స్త్రీ నుంచి బిడ్డ తల బయటకు వచ్చిందో లేదో లోపల తొంగి చూసి చెక్ చేయడం అసభ్యంగా ఉండదు. ఆ సందర్భంలో ప్రేక్షకులతో సహా అందరూ తాము స్త్రీలో పురుషులో అనే సంగతి మరచి మానవులుగా మారతారు. వైద్యంలో వైద్యులు ఇదే సాధన చేస్తారు.
‘డాక్టర్ జి’లో సీనియర్ గైనకాలజిస్ట్‌గా పని చేసిన షెఫాలీ షా పాత్ర ముఖ్యం. ఈ పాత్రే పి.జి. చేస్తున్న ఆయుష్మాన్ ఖురానాకు వైద్యం నేర్పిస్తుంది. స్త్రీ దేహ సమస్యలను మనిషిగా అర్థం చేసుకోవడంలో సాయం చేస్తుంది. హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ కనిపిస్తుంది. కథలో ఆమె కూడా మెడిసిన్‌లో పి.జి. చేసే స్టూడెంటే. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. మేనేజ్‌మెంట్ రంగంలో 8 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన అనుభూతి కశ్యప్ చివరకు తాను పని చేయాల్సింది సినిమాల్లోనే అని గ్రహించి మంచి ఉద్యోగాన్ని వదిలేసి అనురాగ్ కశ్యప్ తీస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ తీసింది. ‘డాక్టర్ జి’ ఆమె తొలి పెద్ద సినిమా అని చెప్పవచ్చు.
మగ డాక్టర్ దగ్గర చూపించుకోవడం నామోషీ అని భావించే మహిళా పేషెంట్లు, మహిళా పేషెంట్ల విషయంలో కంఫర్ట్ ఫీలవని మగ డాక్టర్లు ఈ సినిమాను ఎలా వ్యాఖ్యానిస్తారో చూడాలి.
మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె.
Comments
Please login to add a commentAdd a comment