దాదాపు ఎనిమిది నెలల కిందట నా కాలు స్లిప్ అయ్యి, చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది? దయచేసి వివరించండి.
మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
మణికట్టు వంచినప్పుడల్లా క్లిక్‌మని శబ్దం!
నా వయసు 33 ఏళ్లు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాన్ని కొద్దిగా పక్కకు వంచినప్పుడు క్లిక్ మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. ఈ నొప్పి కారణంగా ఏ పనీ చేయలేకపోతున్నాను. నాకు తగిన పరిష్కారం చెప్పండి.
మన మణికట్టు చాలా సంక్లిష్టమైన నిర్మాణం. ఈ మణికట్టులో 15 ఎముకలతో పాటు ఎన్నో లిగమెంట్లు ఉంటాయి. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు మనకా విషయమే తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మన మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం కూడా మనకు సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు.
అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లుగా సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా అయిఉండవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్–రే పరీక్షలు చేయించుకోండి. సమస్యను బట్టి చికిత్స ఇస్తారు.
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment